– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

అబద్ధాలను మనం ‘చరిత్ర’ అంటాం.

అబద్ధాలు అల్లేవారిని ‘చరిత్రకారులు’ అంటాం.

ఇండియాను ఆక్రమించే ఉద్దేశంతో జపాన్‌ 1944‌లో దండయాత్ర చేసింది; సుభాస్‌ ‌చంద్రబోస్‌ అనే ద్రోహి సైన్యాన్ని వెంటేసుకుని తన దేశంమీద దాడిలో శత్రువుకు సాయంగా వచ్చాడు- అనేది బ్రిటిష్‌ ‘‌చరిత్రకారులు’ అల్లిన లెక్కలేని అబద్ధాలలో ఒకటి.

భారత్‌ ‌మీద జపాన్‌కు దురుద్దేశాలు లేవని కాదు. ఆ కాలాన దానికి ఉన్నవే అవి. కాని మిత్రరాజ్యాల చేతిలో వరస పరాభావాలతో, రెండో ప్రపంచ యుద్ధంలో సర్వనాశనానికి చేరువ అవుతున్న స్థితిలో బ్రిటిష్‌ ఇం‌డియాను జయించాలని తలిచే తాహతు జపానుకు లేదు. ఇంఫాల్‌ ‌దాటి భారతదేశం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు దాని సైన్యానికి ఆదేశాలు లేవు. ఏడాదికి పైగా తాత్సారం చేసి చేసి తమ కొంపలు మునగ వచ్చిన సమయాన ఇంఫాల్‌ ‌మీద దాడికి దిగింది కూడా తాము ఆక్రమించిన బర్మామీద పట్టు నిలుపుకోవటానికి. అటు మీదుగా తమ మనుగడకు ముప్పు రాకుండా చూసుకోవటానికి. జపాన్‌ ఆత్మరక్షణకు గత్యంతరం లేకే ఇంఫాల్‌ ‌మీద దాడి. ఒకవేళ తమ జోలికి రాకుండా మిన్నకున్నా జపాన్‌ను దాని మానాన వదిలెయ్యటానికి మిత్రరాజ్యాలు సిద్ధంగా లేవు. అది ఆక్రమించిన బర్మాను తిరిగి లాక్కుని, చైనాలో పొగబెట్టి, తమ పూర్వపు వలసలను మళ్ళీ గుంజుకుని జపాన్‌ ‌పీచమణచటానికి అమెరికా, బ్రిటన్‌ ‌ముమ్మరంగా కమ్ముకొస్తున్నాయి. మెడ చుట్టూ మెల్లిగా బిగుసుకుంటున్న ఉచ్చునుంచి ఎలాగైనా బయటపడాలన్న తంటాలలో భాగమే ఆరకన్‌, ఇం‌ఫాల్‌లలో జపాన్‌ ఏడాది లేటుగా చేసిన ఎదురుదాడి.

ఆ మెరపు దాడి శత్రువుల వెన్నులో విపరీతమైన వొణుకు పుట్టించింది. దానికి కారణం జపాన్‌ ‌కాదు. దానికి అండగా నిలిచిన సుభాస్‌ ‌చంద్రబోస్‌. ‌పసిఫిక్‌ ‌యుద్ధరంగంలో అప్పటికే జపాన్‌ను చితకకొట్టి పచ్చడి చేస్తూ బర్మాలో దాని పుటం ఆర్పటానికి సిద్ధమైన మిత్రరాజ్యాలకు జపాన్‌ అం‌టే భయం లేదు. వాటి కంగారల్లా బోస్‌ను చూసి. సైన్యపరంగా అతడి బలం నామమాత్రం. కాని భారతదేశంలో అతడికున్న పలుకుబడి అమోఘం. జపాన్‌ ‌వాళ్ళు ఒకవేళ సుభాస్‌ ‌బోస్‌ను పారాచూట్‌లో కోలకతా మైదానం మీద దింపితే నగరవాసుల్లో నూటికి 90 మంది అతడి వెంట నిలుస్తారని అప్పట్లో ‘ది స్టేట్స్ ‌మన్‌’ ‌దినపత్రిక సంపాదకుడైన ఇయాన్‌ ‌స్టీఫెన్స్ అనే విదేశీయుడు తన పత్రికలో చేసిన వ్యాఖ్య బోస్‌కున్న ప్రజాబలానికి చిన్న ఉదాహరణ. అలాగే భారతీయ సైనికుల్లో అతడికున్న ఆకర్షణ బలీయం. ఐఎన్‌ఎ ‌సేన ఎదుటపడితే దాని ప్రభావం వల్ల బ్రిటిష్‌ ఆర్మీలోని భారతీయులు తమకు ఎదురుతిరిగి అటువైపు ఎక్కడ దుముకుతారోనని తెల్లవారికి బెంబేలు. ఆ రకంగా ఇండియా సరిహద్దున యుద్ధంలో జపాన్‌కున్న బ్రహ్మాస్త్రం సుభాస్‌ ‌బోస్‌ ‌సైన్యం. ఆ అస్త్రాన్ని సవ్యంగా, సమర్థంగా వాడుకోవటం మీదే యుద్ధంలో జపాన్‌ ‌గెలుపు ఆధారపడి ఉంటుంది.

ఇంఫాల్‌ను పట్టుకోగలిగితే జపాన్‌ ‌ధ్యేయం నెరవేరుతుంది. వెళ్లినపని పూర్తవుతుంది. కాని బోస్‌ ‌పని అప్పుడే మొదలవుతుంది. మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌లో కాస్త కాలూన గలిగితే అక్కడినుంచి ప్రజా విప్లవం ఎలా నడపాలి, జాతీయ సైన్యాన్నీ, జాతీయ శక్తులనూ సమీకరించి బ్రిటిష్‌ ‌పీడ నుంచి మాతృభూమిని ఎలా విముక్తి చేయాలి అన్నది నేతాజీ చూసుకోగలడు. దానికి జపాన్‌ ‌సహాయం అతడికి ఎంతమాత్రం అక్కరలేదు.

భారతదేశాన్ని జయించే శక్తి, తాహతు జపాన్‌కు ఎలాగూ లేవు. కాబట్టి తనకు కావలసిన ఇంఫాల్‌ ‌గెలుపుతో తృప్తి పడి, గెలిచిన భారతభూభాగంపై ఆధిపత్యాన్ని ఒప్పందం ప్రకారం ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికి అప్పగించి, భారతదేశ విమోచనలో ఆ ప్రభుత్వానికి తన వంతు సహకారం అందించటం జపాన్‌ ‌ధర్మం. దాని స్వప్రయోజనాల దృష్టితో చూసినా అదే శ్రేయస్కరం. ఎందుకంటే బోస్‌ ‌కృషి ఫలించి, సాయుధ విప్లవం విజయవంతమై, భారత ఉపఖండం మీద బ్రిటన్‌ ‌పెత్తనం అంతమైతే జపాన్‌ ‌మనుగడకు పొంచి ఉన్న పెద్ద ముప్పు తొలగు తుంది. స్వతంత్రభారత ప్రభుత్వ సుహృద్భావం, సహకారం ఆర్థికంగా, సైనిక పరంగా జపాన్‌కు గొప్ప మేలు చేస్తాయి.

ఇందులో రహస్యం ఏమీ లేదు. మట్టిబుర్రలకు కూడా అర్థమయ్యేలా నేతాజీ మొదటినుంచీ బహిరంగంగా చెబుతున్నది అదే. జపాన్‌ ‌పాలక ప్రముఖులూ దాన్ని అర్థం చేసుకుని, సమర్ధిస్తున్నట్టే మాట్లాడేవారు. భారత స్వాతంత్య్ర సాధనకు శాయశక్తులా సహాయపడతామని , విముక్త ప్రాంతాల పరిపాలన ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగిస్తామని జపాన్‌ ‌ప్రధాని టోజో పార్లమెంటులో ఆధికారికంగా ప్రకటించాడు. ఇంఫాల్‌ ఆపరేషన్‌ ‌తలపెట్టిందే భారత దేశ స్వాతంత్య్రం కోసమని తన కమాండర్లకు (ప్రపంచానికి తెలియటం కోసం) చెప్పాడు. అదే పాట జపనీస్‌ ‌కమాండర్లూ నేతాజీ ముందు కోరస్‌గా పాడారు.

అన్నమాటకు కట్టుబడి ఉంటే జపానూ బాగుపడేది. స్వాతంత్య్ర సమరమూ సఫలమయ్యేది. దానికి సహాయ పడ్డారన్న మంచిపేరు జపానీయులకూ దక్కేది. కాని నేతాజీకున్న నిజాయతీ వారికి లేదు. ఐఎన్‌ఎను బ్రిటిష్‌ ‌వ్యతిరేక పోరాటంలో శిఖండిలా వాడుకోవాలన్నదే మొదటినుంచీ జపాన్‌ ‌పాలిసీ. నేతాజీ రంగంలోకి వచ్చిన తరవాత పైకి ఇచ్చకాలు ఎన్ని పలికినా వారి లోపలి కుత్సితం పోలేదు. బెర్లిన్‌లో ఉన్నప్పటి నుంచీ వారి తరహా గమనిస్తున్నాడు కనుక నేతాజీకీ వారిమీద భ్రమలు లేవు. అందుకే మొదటి నుంచీ వారిని ఎంతలో ఉంచాలో అంతలో ఉంచాడు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండమని మొదటి నుంచీ తన సేనలను హెచ్చరించాడు. ‘మన నేస్తులనుకునే జపానీయులతో సహా ఎవరినీ నమ్మవద్దు. ఎవరి దగానైనా తట్టుకోగల గాలంటే మనం మన బలం మీదే ఆధారపడాలి. మన దేశంలోకి వెళ్లేసరికి మన బలాన్ని పెంచుకుంటూ పోవాలి. అక్కడికి వెళ్ళాక మనదేశం మీద ఏ రకమైన కంట్రోలు కోసం జపానీయులు ప్రయత్నించినా బ్రిటిషువారితో పోరాడినట్టే ఏ మాత్రం సందేహించ కుండా వారితోనూ పోరాడండి.’ అని నేతాజీ పలుమార్లు పబ్లిగ్గానే తన సైనికులకు ఉద్బోధించాడు.

వేరే దురుద్దేశాలేవీ లేకపోతే అందులో జపాన్‌ ‌వారు గింజుకోవలసింది ఏమీ లేదు. కాని ఐఎన్‌ఎని కరివేపాకులా వాడుకుని వదిలెయ్యాలని, భారత భూభాగాన్ని ఎంత చిక్కితే అంత తమ సామ్రాజ్యంలో కలుపుకుని, వీలయితే బర్మాలాగే ఇండియానూ కబ్జా చెయ్యాలని వారి దురాలోచన. కాబట్టి ఐఎన్‌ఎకు నేతాజీ ఉద్బోధ వారికి కంపరం కలిగించింది. తమకు ఎదురుతిరిగే ఆస్కారం లేకుండా ఐఎన్‌ఎ ‌తోక ఎక్కడి కక్కడ కత్తిరించాలి; ప్రాపగాండాకు వాడుకోవాలే తప్ప యుద్ధరంగంలో దానికి ఎలాంటి ప్రాధాన్యం అందనివ్వకూడదు; అసలైన రణరంగానికి సాధ్యమైనంత దూరంగా ఉంచాలి; మభ్యపెట్టి పనికిమాలిన డ్యూటీలు వేయాలి; తప్పనిసరయి కీలక రంగంలోకి రానిచ్చినా ఐఎన్‌ఎ ‌బలగాలను సాధ్యమైనంత విడదీసి ఎక్కడా కేంద్రీకృతం కాకుండా చూడాలి; భారీ రకం ఆయుధాలూ వారికి అందనివ్వకూడదు- అని జపానీ మాయావులు డిసైడ్‌ అయ్యారు. పైకి ఎన్ని సూక్తులు పలికినా ప్రధాన మంత్రి నుంచి ఫీల్డ్ ‌కమాండర్‌ ‌వరకూ కూడబలుక్కు న్నట్టు ఇదే విధానాన్ని అనుసరించారు. దీనికి రుజువులు కావలసినన్ని.

సుభాస్‌ ‌చంద్రబోస్‌కి తాను ఆప్తమిత్రుడినని, భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టటం కోసమే జపాన్‌ ‌వేలమంది సైనికులను యుద్ధంలో బలి ఇచ్చిందని అనంతరకాలంలో గొప్పగా చెప్పుకున్న నాటి బర్మా ఏరియా ఆర్మీ కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌జనరల్‌ ‌కవాబే 1944 జనవరి 10న తన డైరీలో రాసుకున్నది:

‘‘యుద్ధ రంగంలో ఐఎన్‌ఎ ‌మనుషుల ఉనికి కేవలం ప్రాపగాండా కోసమే మనకు అవసరం. ఇండియాలో మొట్టమొదట వారినే ప్రవేశించ నివ్వాలన్న బోస్‌ ‌డిమాండును గట్టిగా వ్యతిరేకించాలి. అయితే అతడు మరీ చికాకు పడకుండా జాగ్రత్త పడుతూ ఈ పని కానివ్వాలి’’

(Quoted in Jungle Alliance, Dr. Joyce Lebra, p. 170)

ఇంఫాల్‌ ‌రంగంలో ముందు నిలిచి పోరాడే అవకాశం ఐఎన్‌ఎ ‌సైనికులకు ఎందుకు ఇవ్వలేదు అని గ్రంథకర్త డాక్టర్‌ ‌జాయిస్‌ ‌లెబ్రా అడిగితే అప్పట్లో జపాన్‌ ఇం‌పీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌లో ఉన్నతాధికారి అయిన లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌మసాజి ఒజెకి 1967లో ఉన్నమాట ఇలా బయట పెట్టాడు:

‘‘ఇండియాలోకి వెళ్ళాక ఐఎన్‌ఎ ‌మరీ శక్తివంతమై జపాన్‌కి ఎదురు తిరుగుతుందని బర్మా ఏరియా ఆర్మీ, ఇంపీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌చాలా అందోళన పడ్డాయి. అందుకే వారిని దూరంగా పెట్టింది.’’

[అదే గ్రంథం, పే. 178]

యుద్ధకాలపు రహస్య పత్రాలను, జపాన్‌ ‌చరిత్రకారులు వెలికి తీసిన వాస్తవాలను కూలంకషంగా అధ్యయనం చేసిన హెచ్‌.ఎన్‌. ‌పండిట్‌ ‌కూడా ‘The policy which the Japanese Imperial General Headquaters actually followed during the Imphal operation was to allow very few INA men in the operation zone near Imphal, and Netaji himself, never’ (ఇంఫాల్‌ ‌సమీపాన ఆపరేషన్‌ ‌జోన్‌ ‌సమీపానికి బహుకొద్ది ఐఎన్‌ఎ ‌వారిని మాత్రమే అనుమతించాలి; నేతాజీనైతే అసలే అనుమతించకూడదు- అన్నది ఇంఫాల్‌ ఆపరేషన్‌లో జపాన్‌ ఇం‌పీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌వాస్తవంగా అనుసరించిన విధానం) అని తన Netaji Subhas Chandra Bose: From Kabul To Battle of Imphal, గ్రంథం 236వ పేజీలో వెల్లడించాడు.

‘‘మీకెందుకు శ్రమ? మీరు, మీ సైన్యం దర్జాగా సింగపూర్‌లో కూచోండి. మీ తృప్తికోసం ఏదో కొద్దిమందిని మాత్రం సరిహద్దులో యుద్ధానికి పంపండి. మీ తరఫున మేమే కష్టపడి బ్రిటిషువారితో పోరాడి, మీకు స్వాతంత్య్రం సంపాదించి పెట్టి, మీ రాజ్యాన్ని పువ్వుల్లో పెట్టి మీకు అప్పగిస్తాం. అంతా అయ్యాక విజయోత్సవ సమయానికి కొత్త బట్టలేసుకుని మీరు, మీ సైన్యం వస్తే సరిపోతుంది’’ అని జపాన్‌ ‌దక్షిణాది సైన్యం కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌జనరల్‌ ‌తెరౌచీ 1943లో నేతాజీకి ఇచ్చిన చచ్చు సలహా ఆ అప్రకటిత విధానంలో భాగమే.

భారతదేశ విమోచనకు మేము చేయగలిగిన సహాయమంతా చేస్తాము. విముక్త ప్రాంతాల పరిపాలనను ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వానికి అప్పగిస్తాము- అని జపాన్‌ ‌ప్రధాని టోజో పార్ల మెంటులో గంభీరంగా ప్రకటిస్తేనేమి, అన్నమాటకు కట్టుబడే నిజాయతీ జపాన్‌ ‌పాలకులకు లేదు. మొత్తం భారతదేశాన్ని జయించే తాహతు తమకు లేదని వారికి బాగా తెలుసు. కాలం కలసివచ్చి తమకు వశమయ్యే భారత భూభాగాన్ని మాత్రం ఎంచక్కా తమ సామ్రాజ్యంలో కలిపేసు కోవాలనే వారి ఆలోచన. ఒక దశలో జపనీస్‌, ఐఎన్‌ఎ ‌సైన్యాల ముట్టడికి బ్రిటిష్‌ ‌సేనలు చేతులెత్తి లొంగిపోయే సూచనలు కనిపించగానే జపాన్‌ ‌నీతిమంతులు ఏమి చేశారో తెలుసా? ఏప్రిల్‌ 29‌న హిరోహిటో చక్రవర్తికి పుట్టినరోజు కానుకగా జపాన్‌ ‌సైన్యం ఇంఫాల్‌ను సమర్పించబోతున్నట్టు ప్రకటిస్తూ రేడియో ప్రసంగం సిద్ధం చేసుకోండి. ఆ బహూకరణ వేడుకలో మీరు కూడా పాల్గొనాలి- అని బర్మా నామమాత్ర ప్రధాని డాక్టర్‌ ‌బా మాకు బర్మాలోని జపాన్‌ ‌సైన్యం లైజాన్‌ అధికారి కల్నల్‌ ‌హిరావొక ఆదేశం లాంటి వర్తమానం పంపాడు. ఇది తరవాత కాలంలో స్వయంగా బా మా యే చెప్పిన మాట. (Breakthrough in Burma, Dr. Ba Maw, p. 354)

ఇంఫాల్‌ ‌మీద పట్టు దొరకటం జపాన్‌ ‌మనుగడకే అత్యవసరమైతే ఆ పట్టును దొరికించు కోవటానికి అందుబాటులో ఉన్న బలగాలాన్నిటినీ సమీకరించటం జపాన్‌ ‌బాధ్యత. 30 వేల మంది సుశిక్షితులైన సైనికులు, 20 వేలమంది శిక్షణ పొంతున్న వాలంటీర్లు నేతాజీ చేతిలో ఉన్నప్పుడు జపాన్‌ ‌వారే వెంటపడి మొత్తం ఐఎన్‌ఎను రంగం లోకి దింపి ఉంటే యుద్ధంలో జపాన్‌కే లాభించేది. నేతాజీయే ఒత్తిడి చేయగా చేయగా ఐఎన్‌ఎ ‌సత్తా నిరూపించుకునేందుకు ప్రయోగాత్మ కంగా ఒక రెజిమెంటుకు మాత్రం అవకాశం ఇవ్వటానికి జపాన్‌ అధికారులు అతికష్టం మీద అంగీకరించారు. కనీసం ఆ రెజిమెంటునైనా సవ్యంగా పనిచేయనిచ్చారా? లేదు. సామర్థ్యం ప్రదర్శించే అవకాశం దానికి ఎంత మాత్రం దక్కకుండా సకల జాగ్రత్తలు తీసుకున్నారు. మణిపూర్‌కు ఉత్తరాన ఇంఫాల్‌, ‌కొహిమాలలో అసలు యుద్ధం జరుగుతూంటే దక్షిణం వైపు కొసన ఉన్న కలాదన్‌, ‌హకా, ఫాలం లకు దాని మూడు బెటాలియన్లను మళ్ళించారు. వెయ్యిమంది గల ఒక బెటాలియన్‌ను ఆరకన్‌ ‌ప్రాంతంలో మిత్రరాజ్యాల పశ్చిమ ఆఫ్రికా డివిజన్‌ ‌దూకుడును నిలువరించేం దుకు వినియోగించి మిగతా రెండు బెటాలియన్లను భారత సరిహద్దుకు సాధ్యమైనంత దూరంగా, పెద్దగా పోరాటమే ఉండని ప్రాంతంలో జపాన్‌ ‌కమ్యూనికేషన్‌ ‌లైన్లను కాపలా కాసే పనికిమాలిన డ్యూటీ వేశారు. పైగా అదేదో జపాన్‌ ఆర్మీకి లెఫ్ట్ ‌వింగ్‌ అయినట్టూ, నేతాజీ కోరిన ప్రకారం ఒక సెక్టార్‌ను ఐఎన్‌ఎ ‌శక్తి నిరూపణకు ప్రత్యేకంగా కేటాయించినట్టూ, అక్కడి నుంచి చిట్టగాంగ్‌ ‌మీదుగా నేరుగా ఇండియాలోకి ప్రవేశించవచ్చు నంటూ నేతాజీకి పెద్ద బిల్డప్‌ ఇచ్చారు.

అంతా ఒట్టిదే. ఆ దిక్కుమాలిన హకా- ఫాలం ప్రాంతంలో అసలు జపాన్‌ ‌సైన్యమే లేదు. అటునుంచి ఇండియాలో చొరబడే ఉద్దేశం దానికి ఎంతమాత్రమూ లేదు. అంతకు పూర్వం కేవలం 800 మంది జపాన్‌ ‌సైనికులు హకా, ఫాలం ప్రాంతాన్ని కాపు కాసేవారు. ఐఎన్‌ఎకు పనిష్మెంటు డ్యూటీ వేశాక వారినీ ఎత్తేశారు. కొత్తగా నియమించిన ఐఎన్‌ఎ ‌బెటాలియన్లకు అంతకుమునుపు ఉన్న సదుపాయాలు కూడా దక్కకుండా చేసి అష్టకష్టాలు పెట్టారు. ఆ వివరాలను రెజిమెంట్‌ ‌కమాండర్‌ ‌షా నవాజ్‌ ‌ఖాన్‌ ‌మాటల్లో అవధరించండి:

‘‘హకా, ఫాలంలకు రేషన్ల సప్లయి లేదు; మీ ఏర్పాట్లు మీరే చేసుకోవాలని వెళ్ళగానే మాకు చెప్పారు. రెజిమెంటల్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ‌దగ్గర జపాన్‌ ‌లారీలు వచ్చి సరుకులు దింపి వెళతాయి. అక్కడినుంచి హకా 50 మైళ్ళు. ఫాలం 85 మైళ్ళు. అంతదూరం కొండ దారిన మా సరకులు మేమే మోసుకోవాలి. జపాన్‌ ‌సైనికులకైతే రేషన్లు చేరవేయటానికి కూలీలు ఉన్నారు. పశువులూ ఉన్నాయి. ఐఎన్‌ఎ ‌రేషన్లకు మాత్రం అలాంటి ఏర్పాట్లు కుదరవు అని చెప్పారు. ఇక చేసేదిలేక ఎనిమిదేసి మైళ్ళకు ఒకటి చొప్పున ఆరు సప్లై పోస్టులు ఏర్పరుచుకుని ఒక దాని నుంచి ఇంకోదానికి రిలే పద్ధతిలో సరుకుల మూటలు చేరవేసుకునే వాళ్ళం.

మేము పనిచేసే ప్రాంతం పూర్తిగా కొండల మయం. హకా 7000 అడుగుల ఎత్తున, ఫాలం 6000 అడుగుల ఎత్తున ఉంటాయి. ఒక్కొక్కరూ 40 కిలోల బరువు మూటలు మోసుకుంటూ సప్లై కేంద్రాల నుంచి 16 మైళ్ళు నడిచి అన్నివేల అడుగులూ కిందికీ పైకీ ఎక్కిదిగవలసి వచ్చేది. మాకు ఇచ్చిన రేషన్ల నాణ్యత మహా నాసి. బియ్యం, ఉప్పు మాత్రం ఉండేవి. ఒక్కో రోజు అవికూడా దొరికేవి కావు. పాలు, చక్కర, టీ, మాంసం లాంటివి లగ్జరీలు. చాలా అరుదుగా అవి దొరికిన రోజు మాకు పండుగ.

జపాన్‌ ‌వాళ్ళు తలచుకుంటే మాకు కడుపు నిండా తిండికి, సరకు రవాణాకు ఏర్పాటు చేయగలరు. కాని బుద్ధిపూర్వకంగానే చేయలేదు. మమ్మల్ని కడుపు మాడ్చి, హింసించి మెల్లిగా చంపటానికే అలా చేస్తున్నారని మాకు అనిపించేది. మా సైనికుల పదును, బిగువు చూశాక మా దగ్గర వారి ఆటలు సాగవని జపాన్‌ ‌వారికి అర్థమయింది. ఐఎన్‌ఎకి పెద్ద ఫార్మేషన్ల అవసరమే లేదని సింగపూర్‌లో ఫీల్డ్ ‌మార్షల్‌ ‌తెరౌచీ నేతాజీకి చెప్పాడు. తాము వద్దన్నా మేము వచ్చే సరికి అడుగడుగునా అడ్డంకులు పెట్టి సతాయించి మా ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని జపాన్‌ ‌వాళ్ళు దెబ్బతీయ దలిచారు. స్థైర్యం కోల్పోయి డీలా పడ్డాక, ఇదుగో చూశారా మీ వాళ్ళు కష్టాలు తట్టుకోలేరు, యుద్ధానికి పనికిరారు అని నేతాజీకి చెప్పదలిచారు. ఆ సంగతి నేతాజీ ముందే ఊహించి, బయలుదేరడానికి పూర్వమే సైనికులను హెచ్చరిం చాడు. ఎన్ని కష్టాలైనా పడతాం; అనుకున్నది చేస్తాం; లేదా చస్తాం-అని సైనికులు తమ సుప్రీం కమాం డర్‌కు మాట ఇచ్చారు. దానికి కడదాకా కట్టుబడి భయానక బాధలను పళ్ళబిగువున భరించారు.

హెవీ మెషిన్‌ ‌గన్లు, లైట్‌ ఆటోమేటిక్‌లు, అమ్యూనిషన్లు, దుస్తులు, బెడ్డింగులు, 20 రోజుల రేషన్లు – మొత్తం 40 కిలోలపైన బరువును మూపున వేసుకుని ఆరేడు వేల అడుగుల ఎత్తుకు కొండలు ఎక్కి చేరుకునే సరికే సైనికులకు, ఆఫీసర్లకు తలప్రాణం తోకకొచ్చింది. ఎముకలు కోరికే చలి: ఒక ఉన్ని చొక్కా, నూలు బ్లాంకేటుతో చలిపులిని తట్టుకోవటం మహా కష్టంగా ఉండేది. డ్యూటీ చేస్తూ చలికి కొయ్యబారి కొందరు చనిపోయారు. కోసు రాళ్ళ మీద నడిచి నడిచి బూట్లు అరిగి పాడయ్యేవి. కొందరికి అసలు బూట్లే లేవు. తెగ వాడకం వల్ల దుస్తులు చిరిగి పోయేవి. కొత్తవి దొరికే ఆశ లేదు. పైగా మలేరియా దోమలు జాస్తి. దోమతెరలు లేవు. జబ్బుపడితే కావలసిన మందులకూ కటకట. వైద్య వసతి లేనే లేదు. తిండి సరిగా లేక, ఆరోగ్యం దెబ్బతిని, ఒణికించే చలిలో ఎన్ని అవస్థలు పడ్డా ఐఎన్‌ఎ ‌సైనికుల ధైర్యం, స్థైర్యం సడలలేదు. విధినిర్వహణలో వారు ఎన్నడూ విఫలమవలేదు.’’

[My Memories Of INA And Its Netaji, Maj.Gen. Shahnawaj Khan, pp.89-90]

అది నిజం. 1944 యుద్ధంలో తమ పరాక్రమాన్ని చూపటానికి వచ్చిన ఏ అవకాశాన్నీ ఏ రంగంలోనూ ఐఎన్‌ఎ ‌సైనికులు వదులుకోలేదు. శత్రువు తమ ఎదుటపడేదాకా ఆగకుండా వారే శత్రువును వెతుక్కుంటూ వెళ్ళారు. అటువైపు ఎన్ని ఆయుధాలు, ఎందరు మనుషులు ఉన్నా వెరవకుండా మాటువేసి పులిలా వేటు వేసేవారు. ఆఖరికి కేవలం డిఫెన్స్ ‌డ్యూటీ పడ్డ హకా- ఫాలం రంగంలోనూ ఆకలినీ, చలినీ, అనారోగ్యాన్నీ లెక్కచేయక, ఎదురుదాడులు చేసి శత్రువులను వేటాడారు. పెద్ద ఆయుధాలుగాని, జపాన్‌ ‌వీరుల లెవెల్లో పోరాడే దమ్ముగానీ లేని ఐఎన్‌ఎ ఎం‌దుకూ కొరగాదు; అది తమకు బరువు చేటు; దానికి పెట్టే తిండి దండుగ – అని చులకన చేసిన జపాన్‌ ‌వాళ్ళు క్లాంగ్‌ ‌క్లాంగ్‌ ‌కొండల వంటి దుర్గమ స్థలాల్లో మనవారు చేసిన సాహసాలకు, చూపిన పరాక్రమానికి నిర్ఘాంత పోయారు.

శక్తి నిరూపణ పరీక్షలో తొలి రెజిమెంటు ప్రతిభ నిర్ద్వంద్వంగా నిరూపితమయ్యాక మిగతా రెజిమెంట్లనూ, మిగిలిన డివిజన్లనూ యుద్ధానికి పంపాలని నేతాజీ గట్టిగా ఒత్తిడి చేశాడు. కాదనటానికి సాకు ఏదీ దొరకక జపాన్‌ ‌సేనానులు సరే అన్నారు. ఏప్రిల్‌ ‌నెల ముగియవస్తుండగా ఐఎన్‌ఎ ‌మొదటి డివిజన్‌కు రంగూన్‌ ‌నుంచి కదలటానికి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చి ఇంకో పెద్ద మోసానికి తెరలేపారు. అదేమిటో చరిత్రకారుడు పండిట్‌ ‌చెబుతాడు వినండి:

డివిజనూ మొత్తం ఒకే సారి కాదు – మొదట గాంధీ బ్రిగేడ్‌ను ఇంఫాల్‌ ‌రంగానికి ఉరికిస్తామన్నారు. కమాండర్‌ ఇనాయత్‌ ‌కియానీ తన బలగాలను తీసుకుని పరుగెత్తి జపనీస్‌ ‌డివిజనల్‌ ‌హెడ్‌క్వార్టర్స్‌లో కమాండర్‌ ‌యమామోతోకు రిపోర్ట్ ‌చేసాడు. ‘‘అయ్యో! ఆలస్యంగా వచ్చారే! ఈ పాటికే ఇంఫాల్‌ ‌మనకు వశమై ఉండాలి. లేదా ఇంకో గంట, రెండుగంటల్లో స్వాధీనమవుతుంది. ఇప్పుడు మీరు చేయవలసింది బ్రహ్మపుత్ర వైపుగా ఇండియాలోకి చొచ్చుకు పోవటమే. దానికి వేగం ప్రధానం. ఒక పని చేయండి. మీ దగ్గరున్న మెషిన్‌ ‌గన్లు, హెవీ ఎక్విప్‌మెంట్లూ గట్రా ఇక్కడ వదిలేయండి. తలా ఒక రైఫిలు, ఒక దుప్పటి, 50 రౌండ్ల అమ్యూనిషను మాత్రం దగ్గర ఉంచుకుంటే చాలు. మీరు ఇంఫాల్‌ ‌చేరగానే మీ ఆయుధాలు, ఇంకా మీకు కావలసినవి అన్నీ అందజేస్తాం’’ అని అతగాడు నమ్మకంగా చెప్పి పంపించాడు. ఆ రకంగా ఇంఫాల్‌ ‌వెళ్లకముందే వారిని దాదాపుగా నిరాయుధులను చేసి, తమ మీద తిరగబడకుండా జాగ్రత్తపడ్డారు. ప్రతి అవసరానికీ తమ మీద ఆధారపడేట్టు చేసుకున్నారు. నిజానికి అప్పుటికి ఇంఫాల్‌ ‌బ్రిటిషువాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆ తరవాత కూడా అది జపానీయులకు వశం కాలేదు. వాస్తవం తెలిసీ జపాన్‌ ‌వాడు అబద్ధమాడాడు.

…. ….. ఇలా ఎందుకు చేశారంటే భారతీయులకు అవకాశం చిక్కితే తమ దుంప తెంచుతారని జపాన్‌ ‌మిలిటరీ పెద్దల మనసుల్లో అకారణభయం. వారికే శృంగభంగమై వెనక్కి మరలేంతవరకూ కాంపైన్‌ ‌మొత్తంలో ఈ విపరీత ధోరణే అనేకవిధాలుగా చూపించారు. అర్థంలేని ఆ మానసిక వికారమే లేకపోతే జపాన్‌ ఇం‌ఫాల్‌ ‌యుద్ధాన్ని గెలిచేది. ఆసియాలో రెండో ప్రపంచ యుద్ధం పర్యవసానం వేరే విధంగా ఉండేది.

It was Japan, not Britan, who frustrated Netajis plan to start a revolutionary war in India. (భారత్‌లో విప్లవయుద్ధం చేయాలన్న నేతాజీ ప్రణాళికను భగ్నం చేసింది బ్రిటన్‌ ‌కాదు.. జపాన్‌!)

[Netaji : From Kabul To Battle of Imphal, H.N.Pandit, p.272, 249]

‌మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE