సనాతన ధర్మపరంపరలో అద్వైతానిదో విశిష్ట స్థానం. అది ప్రబోధించిన వారు జగద్గురు శ్రీశంకరాచార్యులవారు. మనకు ఇద్దరు జగద్గురువులు. ఒకరు శ్రీకృష్ణ పరమాత్యుడు. రెండవవారు ఆది శంకరాచార్యులవారు. శంకరాచార్యులది అద్వైత సిద్ధాంతకర్తగానే కాకుండా కవిగానూ ఓ విశిష్ట స్థానం. శంకరుని జీవితం అనేక మహిమలతో ముడిపడి ఉంది. ఈ భూమండలాన్ని ఆయన కరుణించిన కాలం చాలా స్వల్పమైనా, ప్రభావం మాత్రం అనల్పం. శంకరులు ప్రస్థాన త్రయానికి (ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత) భాష్యం రాశారు. భజగోవిందం, సౌందర్యలహరి, శివానందలహరి, అత్మవిలాపం, మనీషా పంచకం, వివేక చూడామణి వంటి గ్రంథాలు, అనేక స్తోత్రాలు రాశారు. భిన్నరీతుల్లో సాగే వారి సాహిత్య సృష్టికి అవసరమైన వేర్వేరు ఛందస్సులని ఎన్నుకున్నారు. భజగోవిందం… భజగోవిందం… భజగోవిందం మూఢమతే ఛందస్సు ననుసరించి శీశ్రీ మరో ప్రపంచం… మరో ప్రపంచం అనే కవిత రాశారని పరిశీలకులు తేల్చి వ్యాఖ్యానించారు.
భారతీయ తత్త్వశాస్త్రంలో శంకరుని అద్వైత సిద్ధాంతం ప్రముఖమైంది. మానవుని ఉనికి దైవాంశ సమానమని ప్రకటించింది. దేవుడికీ, జీవుడికీ మధ్యనున్న ఉక్కు తెరను ఛిన్నాభిన్నం చేసింది. అయితే ఆ సిద్ధాంత ప్రభావంతో ఏర్పడిన అహంకార పొరను తొలగించడానికి శంకరులే మరో ప్రయత్నం చెయ్యాల్సి వచ్చింది. సమున్నత దైవతత్త్వాన్ని భజించే విధంగా ప్రేరేపించేది భజగోవిందం.
శంకరుల అవతరణకు కారణభూతులు ఆర్యాంబ, శివగురులు. ఎనిమిదేళ్ల వయసులో శంకరులు నదిలో స్నానం చేస్తుండగా మొసలి పట్టుకొని ఈడ్చుకు పోతున్నది. ఒడ్డున ఉన్న తల్లి ఆర్యాంబ కొడుకుని రక్షించమని ఆర్తనాదాలు చేస్తోంది. కానీ ఎవ్వరూ ఆ సమయంలో కనపడలేదు. ఇక లాభం లేదనుకొని బ్రతికితే సన్యాసం తీసుకుంటానని నిశ్చయించుకుంటారు బాలశంకరుడు. మొసలి పట్టు వదిలింది. శంకరునిపై పట్టు వదిలింది కేవలం క్రూర జంతువైన మకరి కాదు. అంతకన్న క్రూర స్వరూపధారియైన సంసారం, బంధాలు, బంధనాలు అనే మొసళ్లు. తల్లి దగ్గర సెలవు తీసుకొని 32 యేళ్ల వయసు వరకు దేశాటన చేస్తూ ఆధ్యాత్మిక ప్రబోధం చేసి, నాస్తికవాదాన్ని, వితండవాదాన్ని తన చండ ప్రచండమైన వాగ్ధాటితో తుత్తినియలు చేశారు. అవిశ్రాంతంగా శంకరులు భారత జాతికి అందించిన అమృతతుల్యమైన ఆధ్యాత్మిక భావధారల్లో ఒకటి ‘భజగోవిందం’.
ఒకసారి కాశీ పురవీధుల్లో శంకరుడు తన శిష్యులతో వెళ్తుండగా దేవాలయం అరుగుమీద కూర్చొని ఉన్న తొంభై యేళ్ల ముసలి పండితుడు పాణిని వ్యాకరణాన్ని ‘డుకృఞ్కరణే’. అనే సూత్రాన్ని అదే పనిగా వల్లెవేస్తున్నాడు. కాని కాటికి కాళ్లు చాపుకున్న వయసులో భగవంతుని స్పృహ లేకుండా, లౌకిక వ్యాపారాలపై మనసు లగ్నం చేస్తూ వ్యాకరణ సూత్రాన్ని పఠిస్తున్న ఆ పండితుడిని చూసి చెప్పిన శ్లోకమిది.
‘భజగోవిందం భజగోవిందం
భజగోవిందం మూఢమతే
సంప్రాప్తే సన్నిహితేకాలే
నహినహి రక్షతి డుకృఞ్కరణే’.
మృత్యువు సమీపించినపుడు లౌకికమైన ఏ సూత్రాలు, సంబంధాలు, సంపదలు మనిషిని రక్షించలేవు. ఈ సత్యం ప్రపంచంలో ఎన్నో సార్లు తేటతెల్లంగా నిరూపితమైంది. అయినా ఓ మూర్ఖుడా! జడమతుడా! మానవుడా! ఎందుకు అలక్ష్యం చేస్తావు. ఎందుకు నిర్లక్ష్యం వహిస్తావు? దేవుడిని స్మరించు. ఆయన కృప కోసం, కటాక్షం కోసం తపించు! ఆయన సామీప్య, సాలోక్య సాయిజ్యాల కోసం పరితపించు. మృత్యువు ఆసన్నమౌతున్నప్పుడు, అతని అతి శీతల కరస్పర్శకు నువ్వు సమీపమౌతున్నప్పుడు నువ్వు చెయ్యాల్సింది కేవలం దైవధ్యానం మాత్రమే మూర్ఖుడా! అని అంటూ గట్టిగా మందలిస్తూ చెప్పిన శ్లోకమిది.
అయితే ఇక్కడొక సందేహం వస్తుంది. దేవుడికీ, జీవుడికీ అభేదం చెప్పిన అద్వైత సిద్ధాంతకర్త మళ్లీ గోవిందుడిని భజించమంటాడేమిటి? అని. శంకరులు చెప్పిన దైవస్మరణ కేవలం ఒక తంతుకి పరిమితమైన పక్రియకాదు. మానవ సృష్టి నుండి ఆయన సత్యం కోసం, దైవం కోసం జరుపుతున్న అన్వేషణకు సంబంధించినది. జిజ్ఞాసకు సంబంధించినది. కీ.శే రాజాజీ ఏమంటారంటే ‘‘Bhajagovindam is a hymn 31 stanzas in to which Adi Shankara has packed the substance of Vedantic wisdom, dressing it up with a popular appeal and setting the truth of the oneness of knowledge and devotion to melodious music that delights the ear.’’
ఇదే సందర్భంలో భక్తి, జ్ఞానమార్గాల మధ్యనున్న ఏకత్వాన్ని ఆయన ఇలా అంటారు.
‘‘The way of devotion is not different from the way of knowledge…, Mature intellegence, lodged securly is the heart becomes wisdom and wisdom integrated with life and issuing out in action becomes devotion. Knowledge that does not get transformed in to devotion is »useless tinsels.’’
రాజాజీ భజగోవిందాన్ని ఎలా శ్లాఘించారంటే
‘‘»»Bhajagovindam is an inimitble, eloquently expression both of the eights of delight to which true devotion could rise and of the profundities of wisdom, that lie hidden in the uttarances of illumined devotion’.
– సమకాలీన వ్యాఖ్య : డా. దీర్ఘాసి విజయభాస్కర్