సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ ఆశ్వయుజ శుద్ధ పంచమి – 11 అక్టోబర్‌ 2021, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఈ దేశంలో కళాకారుల పేరుతో, కవులూ రచయితల పేరుతో, పత్రికా రచయతల పేరిట, సామాజిక కార్యకర్తల పేరుతో, పర్యావరణ పరిరక్షకుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు వీరంగం వేయడం సాధారణమైపోయింది. డిజ్‌మ్యాంటిలింగ్‌ ‌గ్లోబల్‌ ‌హిందుత్వ సదస్సు దగ్గర నుంచి; పుష్కరాల వేళ, వినాయక నిమజ్జనాలకీ, దీపావళి రాత్రి కాల్చే బాణసంచాకీ పర్యావరణం సర్వనాశనమైపోతోందని గగ్గోలు పెట్టడం, ఆ పేరుతో హిందూ సంస్థలను వేలెత్తి చూపడమే వృత్తిగా వాళ్లు బతుకుతున్నారు. ఇందులో కొందరు దగుల్బాజీ హిందువులూ ఉన్నారు. వాస్తవంగా ఆ శిబిరంలోని ఒక ముస్లిం తన విశ్వాసాల మేరకే, సాటి మతస్థుల మనోభావాలను గౌరవిస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. అలాగే అందులో ఉండే క్రైస్తవులు. వాటి సారాంశం- తామే నాగరికులం. హిందూ మతం అనాగరికం, పితృస్వామ్య పీడిత మతం, మహిళలను, బడుగులను అణచివేసే వ్యవస్థ. కళ్లుండి, మెదడు ఉండి, వాటితో పాటు ఒంటి మీద స్పృహ ఉన్నవాళ్లు ఎవరైనా ఇది వాస్తవమని చెప్పగలరా? ప్రగతివాది, మేధావి పేరుతో చెలామణి అవుతున్న జావెద్‌ అఖ్తర్‌ అనే హిందీ సినీ గేయ, సంభాషణల రచయిత విషయంలో ఈ ప్రశ్న మరింత సహేతుకం.

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా అఖ్తర్‌ ‌మీద ముంబై పోలీసులు సెప్టెంబర్‌ 4‌న ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేశారు. ఆ నగర న్యాయవాది సంతోష్‌ ‌దూబె ఇచ్చిన ఫిర్యాదుతో పరువు నష్టం చేసినందుకు శిక్షార్హం చేసే ఐపీసీ 500వ సెక్షన్‌తో అది నమోదయిందని ములుంద్‌ ‌పోలీస్‌ అధికారులు చెప్పారు. సెప్టెంబర్‌ 3‌న ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్‌ఎస్‌ఎస్‌కూ, తాలిబన్‌కూ ఆలోచనలలో తేడా లేదని వాగి, అఖ్తర్‌ ఈ ‌కేసుతో తగోక్కున్నారు. ఇలాంటి వ్యాఖ్య చేసినందుకు క్షమాపణలు చెప్పాలని సంతోష్‌ ‌దూబె మొదట నోటీసులు పంపారు. అఖ్తర్‌ ఆ ‌పని చేయలేదు. చేయరు. ఎందుకు? హిందువులను దూషించడం, హిందూసంస్థల మీద బురద చల్లడం జన్మహక్కని వీళ్లందరి తుంటరి ఆలోచన. అది (అఫ్ఘానిస్తాన్‌లో) ముస్లిం దేశం కావాలని తాలిబన్‌ అనుకుంటున్నట్టే, కొందరు హిందూదేశం కావాలని అనుకుంటున్నారు. తాలిబన్‌ అనాగరికులు. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీ, బజ్రంగ్‌దళ్‌ ‌కూడా అంతే అని నోటికొచ్చినట్టు వదరాడాయన.

ఒక ప్రత్యేక సంస్కృతికి అలవాటు పడి, సదా తూగుతూ ఉండే వాళ్లని చర్చలకి పిలిచేటప్పుడు చానళ్లూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిని పిలవాలో మీరే చెబుతారా అన్న ప్రశ్న నోటి చివర ఉంటుంది కాబట్టి ఈ మాట. లేకపోతే దేశంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా ఆ నాలుకలకి హిందుత్వను కించ పరచడం తప్ప వేరేమీ తెలియదు. అఖ్తర్‌ ‌చేసిందీ అదే. బహుశా ఆ స్థితిలో ఉండగానే మాట్లాడి ఉండొచ్చు. చానలే మాట్లాడించిందన్నా నమ్మవచ్చు. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ‌గతంలో ఏం చేసిందో, ఇప్పుడు ఏం చేస్తున్నదో అఖ్తర్‌కు తెలియదంటే ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో, అంటే శరీరంలో పోటెత్తుతున్న ఓ ద్రవం కారణంగా ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఈ మాటలు అన్నారనే అనుకోవాలి.

బాలికలకు చదువు వద్దని చెప్పింది ఎవరు? మహిళ బయటకు వస్తే ఒక పురుషునితోనే రావాలని రేఖ గీసినదెవరు? ముస్లిం మహిళలు సరే, విదేశీయుల కూ బుర్ఖా తప్పనిసరి చేసిన ఉన్మాదులు ఎవరు? శిక్ష పేరిట యువతులను నడిరోడ్డు మీదే కొరడాలతో చావగొడుతున్నదెవరు? ఇంకా పెద్ద తప్పు అంటూ రాళ్లతో కొట్టి చంపిస్తున్నదెవరు? ప్రత్యర్థుల శవాలను క్రేన్‌లకు కట్టి వాళ్ల జెండాయే అన్నట్టు నింగిలోకి పంపుతున్నది ఎవరు? మహిళా యాంకర్లు, నటీమణులే కాదు, మహిళా న్యాయమూర్తులు సైతం ప్రాణాలరచేత పట్టుకుని విదేశాలకు పారిపోయేటట్టు చేసిన దేశం ఎవరిది? ఇవన్నీ వీళ్లకి తెలియవా? చెవులు వినిపించడం లేదా? కళ్లు కనిపించడం లేదా? లేదంటే ఆ ప్రత్యేక పరిస్థితిలో నాలుకకీ, మెదడుకీ బంధం తూలిందా?

అఖ్తర్‌ ‌సతీమణి షబానా ఆజ్మీ కూడా ఇలాంటి వ్యాఖ్యలకి ప్రఖ్యాతి పొందిన సంగతి గుర్తు చేసుకోవాలి. ముస్లింలం కాబట్టి తమకు అపార్ట్‌మెంట్లు దొరకడం లేదని ఆమె ఒకసారి ప్రకటించలేదా? ఈమె తండ్రి కైఫీ ఆజ్మీ. అద్వాణీ అయోధ్య రథయాత్ర గురించి తన పత్రికలో కక్కిన విషం విషయం దేశం మరచిపోయిందంటే పొరపాటు. ఈ ముగ్గురు ఈ దేశ పురోగామివాదులలో అగ్రగణ్యులు. వీళ్లు ఎప్పుడైనా ముస్లింల పేదరికం గురించి మాట్లాడతారా? రైతుల, చేనేత కార్మికుల బలవన్మరణాల గురించి నోరెత్తుతారా? ఆఖరికి వీళ్లకి ఇంత ఖ్యాతి, జీవితం ఇచ్చిన సినిమా రంగంలో మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాల గురించైనా పెదవి విప్పుతారా? లేదే! అవార్డ్ ‌వాపసీ ఉద్యమం- వీళ్లే ముందుంటారు. అయోధ్యకు వ్యతిరేకంగా మాటలు- వీళ్ల నోళ్లే తెరుచుకుంటాయి. షాహీన్‌బాగ్‌కు మద్దతు- వీళ్ల నుంచే. బీజేపీ, మోదీలకు వ్యతిరేకంగా ఎవరు తలాతోకా లేని విమర్శలు చేసినా- సంఘీభావం వీళ్ల నుంచే.

ఈ ఎఫ్‌ఐఆర్‌తోనే అఖ్తర్‌ ‌జైలులో మగ్గిపోతాడని అనుకోనక్కరలేదు. ఇది ఇస్లామిక్‌ ‌న్యాయం అమలయ్యే దేశం కాదు కాబట్టి కొరడా దెబ్బలూ, రాళ్లతో కొట్టి చంపడాలూ ఉండవు. కానీ ఆ నాలుకకు దురుసుతనం ఉందనీ, పక్షపాతం ఉందనీ, ఆ కళ్లకు పొరలు కమ్మాయనీ, ఆ మెదడు ఏనాడో కుళ్లిందనీ చట్టం ప్రాథమిక దశలో అయినా నమ్ముతోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏమిటో, ఆ సంస్థ ప్రేరణతో నడిచే బీజేపీ ఏమిటో, వారి సంస్కారం, సభ్యత ఏమిటో ఈ దేశానికే కాదు, ప్రపంచవ్యాపంగా తెలుసు. కొన్ని చవకబారు ఆరోపణలు, పోలికలు ఆ సత్యాలను కప్పెట్టలేవు. ఈ విషయాలను అనాగరికుడు కాకపోతే అఖ్తర్‌ అనే ఆ రచయిత, మేధో బిరుదాంకితుడు గుర్తిస్తే చాలు- కనీసం స్పృహలోకి వచ్చిన తరువాతైనా!

About Author

By editor

Twitter
YOUTUBE