– వి. రాజారామ మోహనరావు

స్వామి, నేను కలిసి చదువుకున్నాం. నాకు గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చి హైదరాబాద్‌ ‌వచ్చేశాను. కొన్నాళ్లకు ఉద్యోగం వెతుకులాట మీద స్వామి నా దగ్గరికి వచ్చాడు. ఇద్దరం కలిసి ఓ గదిలో కాపురం.

మా స్వామికి చిన్నతనం నుంచీ తిక్క. సినిమా భాషలో చెప్పాలంటే దానికో లెక్క లేదు. వాడికి ఎప్పుడు, ఏ విషయంలో ఎంత తిక్క వస్తుందో చెప్పలేం. పైగా వాడికున్న అలవాట్లు తక్కువేం కాదు. రోజూ ఒక ప్యాకెట్‌ ‌సిగరెట్లు కాలుస్తాడు. విపరీతంగా టీలు తాగుతాడు. సినిమాలు కూడా ఎక్కువే చూస్తాడు.

నాది బ్రహ్మచారి బతుకు. దానికి తోడు ఇంటికి ప్రతినెలా డబ్బు పంపందే గడవదన్న ఇబ్బందేం లేదు. అందువల్ల స్వామిని, వాడి ఖర్చును భరించగలిగాను. వాడు ఉండటానికి, తినటానికి కాదు కానీ, రోజూ వాడి సరదా ఖర్చుకి, పై అవసరాలకి డబ్బు ఇవ్వటమే కొంచెం ఇబ్బందిగా ఉండేది. పదిచ్చినా, పాతికిచ్చినా ఒక్క రోజులోనే అవజేసేవాడు. అలా అయితే ఎలారా? కొంచెం చూసుకుని ఖర్చు పెట్టరా అంటే, ‘సరే’ అనేవాడు కానీ మార్పేం ఉండేది కాదు.

నా అదృష్టం బావుండి, రెండు నెలలకి మా స్వామికి ఓ పత్రికలో ఉద్యోగం వచ్చింది. వాడికి నెలజీతం రావటం మొదలైన దగ్గర్నించీ నాకు కొంత భారం తగ్గింది.

వాడి జీతం తక్కువవటం వల్ల ఇంటి ఖర్చంతా నేనే భరించేవాడిని. మా స్వామి మరో సుగుణం ఇంతవరకూ ప్రస్తావించలేదు. ప్రపంచ బద్ధకస్తుల జాబితా తీస్తే, మా స్వామి మొదటి వరసలో ఉంటాడు. రెండు రోజులకు ఒకసారి స్నానం, నాలుగు రోజులకీ కానీ బట్టలు మార్చుకోడు. నలిగిన బట్టలు, మాసిన గడ్డం, చేతిలో కాలుతున్న సిగరెట్టు ఇవి మా వాడి ఆభరణాలు. మా వాడితో వ్యవహారం కష్టమని తెలుసు. అయినా వాడంటే ఇష్టమే. అంతటి స్నేహం. పుస్తకాలు విపరీతంగా చదివి ఆకళింపు చేసుకునే గొప్ప ప్రజ్ఞ వాడి సొంతం.

రోజులు ఏదో గడుస్తున్నాయి. ఫరవాలేదు అనుకున్న సమయంలో ఓ గొడవ జరిగింది. ఆరోజు వాడికి ఆఫీసు లేదు. వీక్లీ ఆఫ్‌. ‌ముందురోజు రాత్రి చాలా ఆలస్యంగా వచ్చాడు. నేను ఆఫీసుకి బయలుదేరే టైముకి స్వామి నిద్దరలేవలేదు. నేను ఆఫీసు నుంచి తిరిగి వచ్చేటప్పటికి నానా గోలగా ఉంది. మా ఇంటి ఓనరు, స్వామి ఘర్షణ పడుతున్నారు. మా రూమ్‌ ‌గుమ్మం ముందంతా నీళ్లు పోసినట్టు బాగా తడితడిగా ఉంది.

నెమ్మదిగా తెలిసిన విషయం ఏమిటంటే, మా స్వామి పుస్తకం చదువుకుంటూ, సిగరెట్టు కాలుస్తూ మాకున్న ఒక పరుపు మీద శయనించాడు. ఎప్పుడు పట్టిందో, వాడికి నిద్దర పట్టేసింది. కాలుతున్న సిగరెట్టు పరుపుకి, అందులోని దూదికి అంటుకుని తగలటం మొదలెట్టింది. చిత్రమేమిటంటే పరుపు ఓ పక్కన తగలడుతూ ఉంటే, మరోవైపు స్వామి ఒళ్లు తెలియకుండా గాఢంగా నిద్రపోవటం.

ఏదో కాలుస్తున్న పొగ వాసనొస్తుంటే, మా ఇంటి ఓనర్‌ ‌వాళ్ల పోర్షన్‌ అం‌తా వెతికి, వెతికి చివరకి మా రూమ్‌ ‌దగ్గరకి వచ్చి చూస్తే రూమ్‌లోంచి దట్టంగా పొగ వస్తోంది. అదృష్టం ఏమిటంటే, మా స్వామికి తలుపులు వేసుకునే అలవాటు లేదు. ఎంత పిలిచినా స్వామి లేవలేదట. మా ఇంటి యజమానే కంగారుగా నాలుగు బకెట్లు నీళ్లు తెచ్చి పోసి పరుపు మంటలు ఆర్పాడు. గుమ్మం ముందు నీళ్ల తడి అదే.

జరిగిందేదో జరిగిపోయింది పెద్ద ప్రమాదం జరక్కుండా తప్పిపోయింది. అయినా, మా ఇంటి యజమాని, స్వామి ఘర్షణ విచిత్రంగా తయారైంది.

‘ఓ పక్కన పడుకున్న పరుపు అంతగా తగలడుతుంటే అతనలా ఎలా నిద్రపోగలిగాడండీ?’ అంటాడు ఇంటాయన.

‘ఎలా ఏమిటి? నిద్ర పోగలిగాను కదా!’ అంటాడు స్వామి. ‘చూడండి ఆ తిక్క సమాధానం. అదేమైనా బావుందా?’ అని ఇంటాయన.

విషయం సీరియస్సే అయినా, నాకు ఆపుకోలేనంత నవ్వు వస్తోంది. కాలిపోతున్న పరుపు మీద కూడా నిద్ర పోగలిగినవాణ్ణి.. అన్న ఫోజులో ఉన్నాడు స్వామి. జరిగిన దానికి కనీస పశ్చాత్తాపమైనా లేదేమిటి మీ వాడిలో? అని కుతకుతలాడుతున్నాడు ఇంటాయన.

‘‘అసలు, అసలు సంధ్యవేళ ఆ నిద్దరేమిటి? దరిద్రం. అందులో అంత మొద్దు నిద్రా?’’ అన్నాడాయన ఉక్రోషంగా.

‘‘అసలు సంధ్యవేళ నిద్ర దరిద్రమని, ఎక్కడ రాసుంది చెప్పండి. ఫ్రూఫ్‌ ‌లేకుండా మాట్లాడటం ఫూలిష్‌నేచర్‌’’ అన్నాడు స్వామి కోడిపుంజులా లేస్తూ.

‘‘ఇంటి యాజమానినన్న మర్యాద లేకుండా ఫూల్‌ అని అంటావా? అవమానిస్తావా?’’ అని ఆయనా ఇంతెత్తున లేచాడు.

‘‘ఫూల్‌కి ఫూలిష్‌నెస్‌కి తేడా ఉంది. అయినా నేనేం అవమానించాను? మీరే నన్ను దారుణంగా అవమానించారు’’ అన్నాడు స్వామి.

‘‘నేను నిన్ను అవమానించానా? ఎప్పుడు?’’

‘‘సుఖంగా నిద్రపోతున్న నా మీద నీళ్లు పొయ్యటం కన్నా అవమానం ఇంకేం కావాలి? పైగా మొద్దునిద్ర అంటావా? నిద్ర పడుతుంది. అది కొంచమో, మొద్దునిద్రో, గాఢనిద్రో ముందుగా చెప్పిరాదు. నిష్కల్మషంగా ఉన్నవాడే నాలా నిద్రపోగలడు’’ అన్నాడు స్వామి తిక్కగా.

‘‘ఆఁ నిద్రపోతావు కొంచం ఉంటే కొంపంతా తగలడేది.’’

‘‘‘మళ్లీ తప్పు మాట్లాడుతున్నారు. ముందు నేను తగలడ్డాకే కదా ఇల్లు తగలడేది. మీరన్నట్టు అంత కొంపేం మునగదు’’ అన్నాడు స్వామి, పైగా నవ్వుతున్నాడు.

ఆయనకి కారం పూసినట్టైంది. ‘‘నా కొంప తగలడటం అంటే నీకు నవ్వులాటగా ఉందా?’’ అన్నాడు రుసరుసలాడుతూ.

‘‘మీకు మాటలు అర్థం చేసుకోవటం రానప్పుడు నవ్వే వస్తుంది మరి. పైగా మీవన్నీ రాంగ్‌ ఆలోచనలు. లాజిక్‌తో మాట్లాడండి. మీరు చూడకపోయినా, అలా అన్ని నీళ్లు పొయ్యకపోయినా ఏం కొంప మునిగేది కాదు. మరి కాసేపటికి నాకెలాగో మెలకువ వచ్చేది. మంట వేడి కదా! నేనే ఆర్పేసి ఉండేవాడిని. మీకెంత వెర్రంటే ఈ మాత్రం కూడా అర్ధంకావటం లేదు. అందుకే నువ్వు నాకు……..’’ అంటూ పగలబడి నవ్వుతున్నాడు స్వామి. వాడిది మొండితనమని తెలుస్తూనే ఉంది. మొండిగానే తన పట్టు నెగ్గించుకునే తత్వం.

మా ఇంటి యజమాని బిక్కటిల్లుపోయి, స్వామి ధోరణికి కుదేలై, మా అందరివైపు పిచ్చిచూపులు చూడటం మొదలుపెట్టాడు. ఓ పక్కన నాకూ నవ్వొచ్చేస్తోంది.

మొత్తానికి ఆ గొడవ అలా ముగిసిపోలేదు. మా ఇంటాయన అర్జెంటుగా రూమ్‌ ‌ఖాళీ చేసేయ్యమన్నాడు. స్వామి ముఖం తనింట్లో కనపడటానికి వీల్లేదన్నాడు.

కొత్త రూమ్‌ ‌వెదికి, స్వామితో మకాం మార్చేటప్పటికి నా తల ప్రాణం తోకలోకి వచ్చింది. అయినా స్వామికి చీమ కుట్టినట్టైనా లేదు. అసలేం జరగనట్టు వాడి ధోరణి వాడిదే.

అలా స్వామితో రెండేళ్లు కలిసే ఉన్నాను. రెండేళ్లల్లో ఇలాంటివి ఎన్నెన్నో! ఎందుకు అలా భరించానా అంటే, వాడితో ఆ స్నేహం అలాంటిది. వాడికెంత తిక్కో అంతటి తెలివితేటలు, విజ్ఞానం ఉన్నాయి.

ఆ తర్వాత వాడు పెళ్లయి మా ఊరు వెళ్లి మకాం పెట్టాడు. అక్కడా ఇక్కడా కుదరదని సొంతంగా కోచింగ్‌ ‌సెంటర్‌ ‌పెట్టాడు. గ్రూప్‌ ‌వన్‌ ‌లాంటి వాటికి తయారవటానికి, వాడి పేరు మీద పెట్టిన ‘స్వామి కోచింగ్‌ ‌సెంటర్‌’‌కి విపరీతమైన పేరొచ్చింది. వాడి శిష్యులు ఎందరో ఇప్పుడు గ్రూప్‌ ‌వన్‌ ఆఫీసర్లు. వాడి కోచింగ్‌ ‌విధానం వేరుగానే ఉండేది. స్వామిని అందరూ ఇప్పటికీ తిక్క మాష్టారనే అంటారు. వాళ్లల్లో ఎవరైనా సరే, తిక్క కోచింగ్‌ ‌సెంటర్‌లో చదువుకున్నామనే చెబుతారు. వాడి తిక్క వెనకాల, గొప్ప లాజిక్‌, ‌విజ్ఞానం ఉన్నాయి, మరి. వాడి ఎప్రోచ్‌లో కొత్తదనం, పట్టుదలలో ఫలిత సాధన ఉన్నాయి. వాడి దగ్గర కోచింగ్‌ ‌తీసుకోవటాన్ని గర్వంగానే ఇప్పటికీ చెప్పుకుంటారు, వాడి శిష్యులు.

About Author

By editor

Twitter
YOUTUBE