– తురగా నాగభూషణం
రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై భారతీయ జనతా పార్టీ పోరు ప్రారంభించింది. అవినీతిని ప్రశ్నిస్తానన్నవారిని ప్రభుత్వం అణచివేస్తోంటే ప్రతిపక్షం రాష్ట్రం నుంచి పారిపోయింది. ఈ దశలో భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షం పాత్రను పోషిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిలదీస్తోంది. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యలు, హామీలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా భాజపా వెలుగులోకి తెచ్చింది. వాటిపై నాలుగురోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసింది. పోర్టు నిర్మాణం చేపట్టాలని మచిలీపట్నంలో; మత్స్యకారుల ఉపాధిని దూరంచేసే జీఓ నెంబరు 217 రద్దుచేయాలని; కరెంటు ఛార్జీలు తగ్గించాలని, రహదారులు వేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసింది.
పోలవరంలా.. మచిలీపట్నం పోర్టు నిర్మాణం ఈ ప్రాంతవాసుల కల. ఎన్నికల్లో పోర్టు నిర్మాణం అనేది ఒక హామీగా మారిపోయింది. నాలుగు దశాబ్దాల కాలంగా పోర్టు నిర్మించడంలో పార్టీలన్నీ వైఫల్యం చెందాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలన్నీ మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై హామీలిచ్చి ప్రజల్ని వంచించాయి. అయిదుగురు ముఖ్యమంత్రులు అయిదుసార్లు పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా నేటికి దానికి ఇటుక కూడా వేయకపోవడం ఈ ప్రాంతాన్ని చులకన చేయడమే. ఇలా మచిలీపట్నం పూర్తిగా నిరాదరణకు గురైంది. అభివృద్ధికి నోచుకో లేదు. పోర్టు నిర్మాణంపై 40 ఏళ్ల నుంచి చర్చ జరుగుతూనే ఉంది. పోర్టు నిర్మిస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేది. మచిలీపట్నంలో పోర్టు కృష్ణా జిల్లా అభివృద్ధితో, పాటు రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని కోసం కొన్ని దశాబ్దా లుగా జిల్లా వాసులు ఉద్యమాలు చేశారు. 2001 నుంచి బందరు పోర్టు ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. దీంతో 2008 ఏప్రిల్ 23న అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కరగ్రహారం వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులను మేటాస్ సంస్థతో కలిసి నవయుగ దక్కించుకుంది. మేటాస్ సంస్థ ఆ తర్వాత ఆర్థిక చిక్కుల్లో పడటంతో నవయుగ సంస్థకు పోర్టు పనులు అప్పగించారు. భూసేకరణ పనులు కొలిక్కి రాక పనులు ముందుకు సాగలేదు. దీంతో 2011లో 505 రోజులపాటు పోర్టు నిర్మాణం చేపట్టాలంటూ అన్ని వర్గాలు, పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమం నడిచింది. దీంతో 2012 మేలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి 5320 ఎకరాలను కేటాయిస్తూ జీవో నెం.11 జారీ చేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం 2015 ఆగస్టులో పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం 14 వేల ఎకరాలను కేటాయించాలని నిర్ణయించి భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. రైతులు ముందుకు రాక పోవడంతో 2016 ఆగస్టులో భూసమీకరణ జరిపింది. పోర్టు అభివృద్ధి కోసం 2016లో ఏర్పాటైన మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ (ముడా) ఆధ్వర్యంలో భూసేకరణ, సమీకరణకు ప్రభుత్వం రూ.200 కోట్లను విడుదల చేసింది. భూసమీకరణ వేగం పుంజుకుంది. 2019 ఫిబ్రవరి 7న అప్పటి సీఎం చంద్రబాబు తపసిపూడి వద్ద పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పోర్టు నిర్మాణంలో పురోగతి లేదంటూ.. 2019 ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పించింది.
పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపడు తుందని మంత్రులు ప్రకటించారు. కానీ ఇంత వరకు ఒక్క ఇటుక వేయలేదు. బందరు పోర్టును సుమారు రూ.12,000 కోట్లతో ఆరుదశల్లో నిర్మించాలి. తొలి దశలో ఓడరేవు నిర్మాణానికి రూ.3650 కోట్లతో ప్రతిపాదనలను తయారు చేశారు. ఐదు జెట్టీల నిర్మాణంతోపాటు డ్రెడ్జింగ్, బేక్‌వాటర్, స్టాక్ యార్డు డెవలప్‌మెంట్, కార్గో హ్యాండ్లింగ్, విద్యుత్తు, అంతర్గత రహదారులు, రైలు పట్టాల ఏర్పాటు వంటి పనులు చేపట్టాలి. మచిలీపట్నం పోర్టు నిర్మిస్తే కార్గోరవాణా వల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ సమస్యను భాజపా భుజాలకెత్తుకుంది. పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసిసంహారావు బందరులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పోర్టును నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతం నుంచి భాజపా అభ్యర్ధిని ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపితే తక్షణం పోర్టును నిర్మిస్తామని ప్రజలకు హామీఇచ్చారు.
మత్స్యకార సమస్యలపై ఉద్యమం
రాష్ట్రంలోని మత్స్యకారులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త చిక్కులు సృష్టిస్తోంది. రాష్ట్రంలో జెట్టీలు లేక మత్స్యకారులు గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలకు ఉపాధికోసం వలస పోతున్నారు. సముద్రాల్లో రోజుల తరబడి ఉంటూ పలు సమస్య లకు గురవుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దులు తెలీక పాకిస్తాన్ పోలీసుల చేతికి చిక్కుకుపోతున్నారు. వీరిని విడిపించి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వానికి కష్టతరంగా మారుతోంది. రాష్ట్రంలోనే పెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్‌లో మత్స్యసంపద తరగిపోవడం, కబ్జాలకు గురికావడం జరిగింది. తమిళనాడుకు చెందిన డీఎంకే మత్స్యకార మాఫియా రాష్ట్ర సముద్ర సరిహద్దుల్లో ఏపీకి చెందిన మత్స్యకారులపై దాడులకు దిగుతోంది. ఖరీదైన వలలను తెంపేస్తు న్నారు. ఈ సమస్యలను రాష్ట్రం పరిష్కరించడం లేదు. ఇది చాలదన్నట్లు మత్స్యకారుల ఉపాధిని హరించేలా రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబరు 217 జారీచేసింది. దీంతో మత్స్యకారులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ, జీఓ నెంబరు 217ను వ్యతిరేకిస్తూ భాజపా నెల్లూరులో ఉద్యమం చేపట్టి పెద్ద బహిరంగసభను నిర్వహించింది. పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర మత్య్సశాఖ సహాయ మంత్రి మురుగన్‌ను కూడా ఆహ్వానించి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, జీఒ నెంబరు 217 వల్ల కోల్పోయే ఉపాధి అవకాశాల గురించి సభా ముఖంగా వివరించారు. మత్స్య సంపదను పెంచే చెరువులను ఓపెన్ ఆక్షన్ ద్వారా కేటాయించేందుకు ఉద్దేశించిందే జీఓ 217. ఇప్పటి వరకు పంచాయతీలు, తీరప్రాంతాల్లో ఉన్న చేపల చెరువులను మత్స్యసహకార సంఘాలు నిర్వహిస్తు న్నాయి. ఇప్పుడు ఓపెన్ ఆక్షన్ పద్ధతిలో వాటిని కేటాయిస్తామనడంతో పెద్ద కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు పోటీపడి దక్కించుకుంటారు. సహజ సిద్ధంగా లభించే మత్స్యసంపదను రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతో వారి పార్టీ నాయకులు, తాబేదార్లకు కట్టబెట్టేందుకు జీఓ నెంబరు 217 జారీచేసిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ జీఓను పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు జిల్లాలో అమలుచేయడానికి నిర్ణయించడంతో భాజపా నెల్లూరులోనే ఉద్యమం చేపట్టింది.
పులికాట్ సరస్సు సమస్య
పులికాట్ సరస్సులో ఏర్పడిన పూడిక వల్ల మత్య్స సంపద క్షీణించి చేపలవేటపై ఆధారపడిన 20 వేల మంది మత్య్సకార కుటుంబాలు ఉపాధి కోల్పోతు న్నాయి. నెల్లూరు నుంచి తమిళనాడు వరకు 620 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పులికాట్ సరస్సు విస్తరించి ఉంది. తమిళనాడులో దీని విస్తీర్ణం 120 కిలోమీటర్లు. ఏపీలో మాత్రం అంతకు నాలుగింతలు విస్తరించి ఉంది. ఈ సరస్సు చుట్టూ ఉన్న 30 గ్రామాల్లోని 20,000 మంది మత్స్యకారులు చేపలవేటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి సముద్రం నుంచి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి అంటే సముద్రంలోని చేపలు ఈ సరస్సులోకి ప్రవేశించడానికి నాలుగు ద్వారాలున్నాయన్న మాట. కొండూరు, కొండూరు పాలెం, రాయదరువు ముఖ ద్వారాలతో పాటు తమిళనాడులోని పాల్వారు కాడులో మరో ముఖద్వారం ఉంది. సముద్రపు నీరు సరస్సులోకి చేరినప్పుడు వాటితో పాటే చేపలు కూడా వచ్చి పులికాట్ సరస్సులో గుడ్లు పెట్టేవి. దాంతో ఆ గుడ్లు చేపలుగా ఎదిగి మత్స్యకారులకు చేపలు సమృద్ధిగా లభించేవి. ఆటుపోట్లు, రాకాసి అలలు కారణంగా ఇసుక మేటలు వేయడంతో సముద్రపు ద్వారాలు మూసుకుపోయాయి. రాయదరువు ముఖద్వారం నుంచి మాత్రమే ఇప్పుడు నీరు వస్తుంది. రెండు ముఖద్వారాలు ఇసుకతో మూసుకుపోవడంతో చేపలు గుడ్లు పెట్టేందుకు రావడం లేదు. దాంతో మత్స్యసంపద తరిగిపోయింది. మత్స్యకారులకు చేపలు దొరక్క ఉపాధికి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం సరస్సులో నీరు లేక ఎడారిని తలపిస్తుంది. దీన్ని ఆసరాగా తీసుకుని కొందరు అనువైన చోట్ల సరస్సును పంట పొలాలుగా, రొయ్యల చెరువులుగా మార్చేస్తు న్నారు. ఈ సమస్యలను పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పూడిక తీయిస్తామని కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి మురుగన్ హామీ ఇచ్చారు. జీఓ నెంబరు 217 వల్ల ఏర్పడిన సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర అధికారులను ఢిల్లీకి రప్పించి చర్చిస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. మత్య్సకారుల మధ్య ఏర్పడిన అంతరాష్ట్ర వివాదాల సమస్యను పరిష్కరిస్తానన్నారు.
ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం
రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెచడాన్ని నిరసిస్తూ భాజపా ఉద్యమం చేసింది. రెండు నెలల నుంచి ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది వినియోగదారుల పాలిట తీవ్ర భారంగా మారింది. 2014 సంవత్సరం నుండి 2019 వరకు వాడుకున్న కరెంటుకు అందరూ బిల్లులు చెల్లించారు. కానీ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పుడు లెక్క చూసుకుని వారికి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైందని తేల్చారు. దాన్ని ట్రూ అప్ ఛార్జీల పేరిట వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రూ.3,699 కోట్ల భారం వేసింది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు తమ పాలనలో ప్రయివేటు సంస్థల దోపిడీ అరికట్టామని, పంపిణీ నష్టాలు తగ్గించామని గొప్పలు చెప్పినా ఇప్పుడు ట్రూ అప్ పేరుతో అదనపు భారం వేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో కనపడకుండా కస్టమర్ ఛార్జీలు, స్లాబుల మార్పిడి, సర్దుబాటు ఛార్జీల ఇతర రూపాలలో విద్యుత్ భారాలు మోపింది. ఇది తాజా భారం. ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌పై ప్రతి యూనిట్‌కు రూ.1.23 పైసలు (శ్రీకాకుళం నుండి పశ్చిమ గోదావరి జిల్లాల వరకు యూనిట్‌కు 45 పైసల చొప్పున) అదనంగా కలిపి బిల్లులు ఇస్తున్నారు. ఎనిమిది నెలలపాటు, అంటే మార్చి నెల వరకు ప్రతి నెల చెల్లించాల్సిందే. వ్యాపార సంస్థలు, పరిశ్రమలు చెల్లించే అదనపు విద్యుత్ ఛార్జీలను వినియోగదారుల నుండి పరోక్షంగా ఆ సంస్థలు వసూలు చేస్తాయి. మున్సిపాలిటీలు, పంచాయతీల కరెంటు బిల్లులను మళ్లీ జనం పైనే రుద్దుతారు. ప్రస్తుతం మంచినీరు, డ్రైనేజీ ఛార్జీలు నిర్వహణకు అయ్యే ఖర్చును లెక్కించి ప్రతి సంవత్సరం ప్రజల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీల భారం వలన మున్సిపాలిటీలలో మంచినీరు, డ్రైనేజి ఛార్జీలు పెరుగుతాయి. రాష్ట్రంలో సుమారు ఒక కోటి 50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి కుటుంబం మీద 8 నెలల్లో సగటున రూ.2 వేలకు పైగా భారం పడుతుంది. ఇదే కాకుండా 2019-20 సంవత్సరం జమా, ఖర్చులను లెక్క చూసి మళ్లీ ఈ సర్దుబాటు ఛార్జీలు రూ.2542 కోట్లు చెల్లించాలని నియంత్రణ మండలి ముందు విచారణ జరుగుతోంది. ఏప్రిల్ నుండి ఆ భారం జనం నెత్తిన పడుతుంది. త్వరలో ప్రతి 3 నెలలకు ఈ సర్దుబాటు ఛార్జీల భారం పడుతుంది. ఈ భారాలు శాశ్వతంగా ఉంటాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ట్రూ అప్ ఛార్జీల విధానం వల్ల విద్యుత్ వినియోగదారులపై జీవితకాల భారం తప్పేలా లేదు. దీనిని వ్యతిరేకిస్తూ భాజపా ఉద్యమం చేపట్టింది. దీంతో పార్టీలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతో సమస్యను పక్కదోవ పట్టించేలా ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల వసూలు ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా ఆంధప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ (ఏపీఈఆర్‌సీ) ప్రకటించింది. కాని ఛార్జీలను మాత్రం తగ్గించలేదు. గత నెల 19వ తేదీన ప్రజాభి ప్రాయ సేకరణను తూతూ మంత్రంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేసి.. తర్వాత ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అధికఛార్జీల విధింపు మాత్రం కొనసాగిస్తారు. కేవలం కోర్టును సంతృప్తి పరచడానికి రూల్స్ అమలు చేస్తున్నామని చెప్పడానికే ఈ తంటాలు అనేది అర్ధం అవుతుంది. ఏపీఈఆర్‌సీ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను నిర్ధారించే రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఛార్జీలు వడ్డించే నిర్ణయం తీసుకునేముందు ముందుగా పేపర్లలో ప్రకటనలు ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. ఆ తర్వాతనే అనుమతి ఇవ్వాలి. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ పక్రియ చేపట్టకుండానే ట్రూ అప్ ఛార్జీలు వడ్డించారు. దీనికి తోడు 40 శాతం విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయిందని భవిష్యత్ విద్యుత్ కొరత రావచ్చని ముఖ్యమంత్రే ప్రధానమంత్రికి లేఖ రాశారు. రాబోయే రోజుల్లో యూనిట్ కొనుగోలు రేటు రూ.20కు పెరగవచ్చని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తే ఆ సదుపాయాన్ని తెదేపా, వైకాపా రెండు ప్రభుత్వాలు సంరక్షించుకోక విద్యుత్ భారాలు ప్రజలపై వేసి వారితో తిట్లు తిట్టించుకుని, చివరికి కరెంటు కోతల దశకు చేర్చారు.
రహదారుల నిర్మాణం చేపట్టాలి
ఒక పక్క దేశంలో రహదారులు, రైల్వేలైన్లు, డ్రైనేజీలు, వంతెనలు, ఇళ్లు, పోర్టులు, విమానాశ్రయాలు వేగంగా కడుతుంటే ఏపీలో మాత్రం ఒక్క పని జరగడం లేదు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన జాతీయ రహదారులు, పై వంతెనలు, బ్రిడ్జిలు, పోలవరం, ఎయిమ్స్, ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్.. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణపనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి. కాని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల్లో జాప్యం జరగడం మాట అటుంచితే, అసలు ఒక్క పనీ ముందుకు సాగడం లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఒక కారణమైతే, కాంట్రాక్టర్లకు ఉద్దేశపూర్వకంగా బిల్లులు చెల్లించకపోవడం ప్రధాన కారణం. రాష్ట్రంలో మౌలికసదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. టిట్కో ఇళ్లకు బకాయిలు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదు. గత ప్రభుత్వం అమలుచేసిన పలురకాల పథకాలకు సంబంధించిన పనుల కోసం చేపట్టిన భవనాలు, ఇతర నిర్మాణాల పనులకు ఉన్న బకాయిలు ఇంత వరకు చెల్లించలేదు. ఈ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కూడా బిల్లులు ఇవ్వలేదు. సుమారు రూ.85 వేల కోట్లు బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లే చెబుతున్నారు. బిల్లులు రాక•పోవడంతో వీరంతా ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. ఎంతో మంది అప్పుల పాలైపోయారు. కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో చిన్న కాంట్రాక్టర్లు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు ప్రారంభించారు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలని, టిట్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, వంతెనలు, బ్రిడ్జిలు పూర్తిచేయాలని భాజపా ఆయా జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించింది.