– గంటి భానుమతి

జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన


సుధీర కూడా భయంగానే చూసింది. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ఆ ఇద్దరికీ అనిపించింది. కానీ వచ్చినప్పట్నించి డాక్టర్ల మాటలు వింటూంటే ఏ క్షణంలోనైనా ఏదైనా జరగచ్చు. ఏదైనా వినడానికి సుధీర సిద్ధంగా ఉంది. కాని వినీల లేదు.

‘‘మీ పాప బావుంది. ఆమె పోగ్రెస్‌ ‌చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. ఐ యామ్‌ ‌ప్లీజ్‌డ్‌ ‌విత్‌ ‌హర్‌.’’

ఈ ‌వార్త విన్నాక ఆ ఇద్దరికి కాస్త రిలీఫ్‌గా అనిపించింది.

‘‘డాక్టర్‌, ‌మరి అంతా ఆందోళనగా ఉందంటున్నారు.’’ అంది వినీల.

వెంటనే ఆ డాక్టర్‌ ‌వినీల కాళ్ల దగ్గర మంచం అంచున కూచుంది.

 ‘‘అది నిజమే. ఇప్పుడు కూడా పాప చాలా బావుందని చెప్పను. కొంచెం పరవాలేదు. ఇప్పుడు అన్ని మానిటర్లు ఆమె పోగ్రెస్‌ ‌బావుందని చెప్తున్నాయి. మేము వాటి మీదే కదా ఆధారపడతాం. అవి బాగా పనిచేస్తున్నాయంటే కాస్త పోగ్రెస్‌ అవుతున్నట్టే కదా లెక్క. మందులకి రెస్పాండ్‌ అవుతోంది. ఇన్‌ఫెక్షన్‌ అదీ కంట్రోల్‌ అవుతోంది. ఆక్సిజన్‌ ‌కూడా సరి చేసాం. ప్రస్తుతానికి ఏ విధమైన ప్రాబ్లెం కనపడడం లేదు.’’ డాక్టర్‌ ‌మంచం మీద నుంచి లేచింది.

వినీల కళ్లు మెరిసాయి. కళ్లల్లోంచి నీళ్లు చెంపల పక్కనుంచి కారిపోతున్నాయి.

‘‘నిజంగా పాప బాగా అయిపోతుందా? అదే మీరు చెప్తున్నారా!?’’

 ‘‘నేను జ్యోతిష్యం చెప్పలేను. ఏం జరుగుతుందో ఊహించి చెప్పలేను. జస్ట్ ఇప్పుడే పాపాయి ఒక పక్కకి తిరిగింది. ఇది మంచి విషయం. మాకు ఆనందాన్నిచ్చే విషయం. పోగ్రెస్‌ అవుతోందని చెప్తున్నాను. మా దగ్గరికొచ్చిన పిల్లలు మాకో ఛాలెంజ్‌. ఎలాగైనా మా శక్తిని, మా చదువుని, మా జ్ఞానాన్ని, లేటెస్ట్ ‌పరికరాలని ఉపయోగించి బతికించాలని కోరుకుంటాం. డాక్టర్ల కన్నా ముందు మేము మనుషులం. మా ప్రయత్నాలు ఫెయిలైతే, మా ముందే వాళ్లు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతూంటే మేం బాధపడతాం. మా కళ్లల్లో నీళ్లు వస్తాయి. అందుకని, ఇక్కడికి వచ్చిన పిల్లలు, వాళ్ల తల్లి దండ్రులు సంతోషంగా వాళ్ల ఇళ్లకి వెళ్లాలనే మేం కోరుకుంటాం. మీ విషయంలో కూడా అదే జరగాలి.’’ అని ఆమె వెళ్లిపోయింది.

 ఆమె వెళ్తూ వాళ్లని ఓ అందమైన ఊహాలోకంలో దింపేసి వెళ్లిపోయింది. అందులోంచి బయటికి వచ్చాక వినీల సుధీరని మెరుస్తున్న కళ్లతో చూసింది. యుద్ధానికి, యుద్ధానికి మధ్య శాంతి; అనేక గ్రీష్మాల మధ్య ఒక వర్షం.. ఈ ఆనందం అలా ఉంది.

‘‘వదినా ఇలా రా’’ సుధీర దగ్గరికెళ్లింది. ఒక్కసారి కౌగిలించుకుంది.

సుధీరకి ఒక్కసారి తన స్నేహితురాలు అంశు గుర్తొచ్చింది. ఆమె కూడా ఇంతే. సుధీ అంటూ కౌగిలించేసుకుంటుంది. తలని పక్కకి వంచి, వినీలని చూసింది. ఆమె సాంత్వనగా కళ్లు మూసుకుంది.

‘‘నాకు చాలా సంతోషంగా ఉంది వదినా. ఈ అత్యుత్సాహంలో నిన్ను గట్టిగా కౌగిలించుకున్నాను, ఏమీ అనుకోకు.’’ అంటూ దూరం జరిగింది.

‘‘పరవాలేదు వినీలా నాకు మా ఫ్రెండ్‌ ‌గుర్తొచ్చింది. ఆమె కూడా ఇంతే. సంతోషం వచ్చినప్పుడల్లా ఇలాగే చేస్తుంది. నువ్వు నాకు ఓ ఫ్రెండువి. చుట్టరికం వదిలేద్దాం. దాని సంగతి తరవాత’’

 పాప పుట్టి, మూడు రోజులైంది. ఈ మూడు రోజుల్లో ఎన్ని మార్పులో. అయితే ఇవాళది మాత్రం ఓ ఆశా కిరణాన్ని ప్రసరించింది. ఈ మూడు రోజులు సుధీర వినీలకి బాగా దగ్గరైంది. టాక్సీ మాట్లాడుకుని వినోద ఇంటికి వెళ్లడం, స్నానం చేసి, టిఫిన్‌ ‌తినేసి, ఓ ఫ్లాస్క్ ‌నిండా కాఫీ తీసుకెళ్లడం, పాపని చూడడం, వినీలతో కబుర్లు చెప్పడం అన్నీ కూడా చేస్తోంది. వాళ్లమధ్య అన్ని రకాల కబుర్లు వస్తున్నాయి.

 ‘‘వినీలా నిన్నొకటి అడుగుతాను. మీ అమ్మకి ఇలా స్కూలు పిల్లలకి సాయపడాలని ఎప్పుడనిపించింది?’’

వినీల ఆలోచనలో పడింది.

‘‘ఓ ఏడెనిమిదేళ్ల క్రితం అనుకుంటాను. ఎందుకంటే అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. బీటెక్‌ అయిపోయింది. క్యాంపస్‌ ఇం‌టర్వ్యూలో టీసీఎస్‌లో ఉద్యోగం వచ్చింది. ఇంకా చేరడానికి టైముంది. అందుకని హాస్టల్‌ ‌ఖాళీ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంట్లోనే ఉన్నాను. అప్పుడే అనుకుంటా అమ్మకి ఇలా స్కూలు పిల్లలకోసం ఏదైనా చెయ్యాలనే ఆలోచన. దానికి కారణం మా పనిమనిషి లచ్చమ్మ.

 ఆరోజు మా ఇంట్లో పనిచేసే లచ్చమ్మ తన కూతురు సరితని కూడా పనిలోకి తీసుకొచ్చింది. మేం పెద్దగా పట్టించుకోలేదు. అలా ఓ రోజు కాదు, వరసగా రోజూ తీసుకురావడం మొదలెట్టింది.

‘‘మా పాపకి కొంచెం చదువు చెప్పు నీలమ్మా’’ అంటూ ఓ రోజున నా దగ్గరికి వచ్చి అడిగింది.

‘‘స్కూలుకెళ్తోంది కదా’’ అని నేను అన్నాను. మా మాటలు అమ్మ వింది.

‘‘అదేం సరితా, స్కూల్లేదా మీ అమ్మ వెనకాలే తిరుగుతున్నావ్‌? ఏం ‌లచ్చమ్మా సరిత స్కూలు మానేసిందా ఏంటీ?’’ అని అమ్మ వెంటనే అడిగింది.

‘‘అవునమ్మా స్కులుకి పోనంటోంది. ఎందుకంటే చెప్పడం లేదు. కోపంతో బాగా కొట్టాక చెప్పింది. బాత్రూములు సరిగా లేవంట. నిన్నటి వరకూ చిన్నపిల్లనే కదా, ఇప్పుడు ఆరో క్లాసుకి వచ్చింది’’

అమ్మ, నేను ఆశ్చర్యపోయాం.

‘‘అదేంటీ బాత్రూములు లేకపోవడం ఏంటీ? దాని కోసం స్కూలు మానేయటం ఏంటీ? ఏది దాన్నిలా పిలు నేను కనుకుంటాను’’

చెట్టు కింద కూచుని గచ్చకాయలు ఆడుతున్న సరితని లచ్చమ్మ పిలిచింది.

అమ్మ పిలుస్తుంది రా అని గట్టిగా పిలిచింది. సరిత మా ముందుకొచ్చి నుంచుంది.

 ‘‘నీకు నిండా పన్నెండేళ్లు లేవు. ఇప్పటి నుంచి ఇంట్లో కూచుంటావా. స్కూలుకెళ్లకపోతే ఎలా? అమ్మ లాగా ఇళ్లల్లో పాచి పని చేసుకుంటావా, చెప్పు?’

‘‘పాయఖానాలు సరిగా లేవమ్మా’’

మాకు ఆశ్చర్యం వేసింది. బాత్రూములు లేకపోతే స్కూలు మానెస్తారా?

‘‘అదేంటీ స్కూలన్నాక బాత్రూములుండాలి కదా, మీ స్కూల్లో అస్సలు లేవా?’’

‘‘రెండున్నాయి. కాని వాటికి తలుపుల్లేవు. ముందు సగం సగం తలుపులైనా ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు. ఓ పెద్ద ఇనప రేకుని రెండింటికి కలిపి అడ్డంగా పెట్టి వెళ్తాము. ఇప్పుడు ఆ రేకు కూడా లేదు’’

‘‘టీచర్లకి చెప్పారా మీరందరూ?’’

‘‘చెప్పాం కాని ఏం కాలే.’’

‘‘నీలా నాతో రా. పద ఓసారి స్కూలు చూసొద్దాం.’’ అని అమ్మ వెంటనే లేచింది.

అమ్మా, నేను స్కూలుకెళ్లాం. అంతకుముందు పడ్డ వర్షాలకి స్కూలు ఆవరణ అంతా బురద బురదగా ఉంది. గడ్డి కూడా బాగానే పెరిగింది. నడవడం కోసం అన్నట్లుగా సరిగ్గా పాదం మాత్రమే పట్టేంత చిన్న చిన్న బండలు గేటు నుంచి స్కూలు మొదటి మెట్టు వరకూ పరిచి ఉన్నాయి.

జాగ్రత్తగా అడుగులు వేసి అమ్మ స్ట్రెయిట్‌గా హెడ్‌ ‌మాస్టర్‌ ‌గదిలోకి వెళ్లి, ‘‘ఓసారి బాత్రూములు చూడాలని వచ్చాన’’ని అంది. ఆమె కంగారు పడిపోయింది. ‘‘ఎందుకు?’’ అని భయంగా అడిగింది. అమ్మ ఊరుకోలేదు. మా పనిమనిషి కూతురు బాత్రుముల్లేవని స్కూలు మానేసింది అందుకని అవి చూద్దామని.

 ఆమె ఏదో సంజాయిషీ ఇస్తోంది. మేము అప్లికేషన్‌ ‌పెట్టాం. ‘‘ఒకసారి కాదు, రెండుసార్లు ఇచ్చాం. ఏం జరగలేదు. గవర్నమెంటులో ఏ పని వెంటనే జరగదు’’ అని

 ఆమె స్కూలు ఆవరణలోనే ఓ మూలకి తీసుకెళ్లింది. అక్కడ అంతా బాగా పెరిగిన గడ్డి. కాంపౌండు గోడ స్కూలు ముందర మాత్రమే ఉన్నట్టుంది. వెనకాల కూలిపోయిన గోడ. అక్కడే ఉన్నాయి ఈ పాయిఖానాలు. వాటి ముందు అంతా నిలిచిపోయి ఉన్న నీళ్ల గుంటలు. పాచి పట్టి ఉంది. మెల్లిగా నడవకపోతే జారిపోయే ఛాన్సులు ఎక్కువ. అక్కడ కూడా చిన్న చిన్న బండలున్నాయి. దూరంగా నుంచుని వాటిని చూసాం. పైన కప్పు లేదు, తలుపుల్లేవు. ఓ పక్కగా ఓ నీలం డ్రమ్ముంది. అందులో నీళ్లు లేవు. ఎంత గవర్నమెంటు స్కూలైతే మాత్రం ఇంత నిర్లక్ష్యమా?

‘‘ఏంటమ్మా ఈ స్కూలు హెడ్మిస్ట్రెస్‌వి. ఆడదానివి. ఈ స్కూల్లో ఇంత మంది ఆడపిల్ల లున్నారు, బాత్రూములు సరిగా లేకపోతే ఎలా? చిన్నపిల్లలు పరవాలేదు. పెద్ద పిల్లల సంగతి? వాళ్లు పీరియడ్స్‌లో ఏం చేస్తారు. ఇంత ఓపెన్‌గా ఉంటే ఎలా?’’

‘‘మా తప్పు ఏం లేదండి. మేం చెప్తూనే ఉన్నాం. అయితే చాలామంది పిల్లల ఇళ్లు ఇక్కడే చుట్టుపక్కలే ఉన్నాయి. మధ్యాహ్నం ఇంటికెళ్లినప్పుడు, ఒక్కొక్కసారి క్లాసు మధ్యలో అడిగి వెళ్తారు.’’

‘‘మరి ఇళ్లు దగ్గరగా లేని వాళ్లు ఏం చేస్తారు?’’

‘‘ఎవరూ రాకుండా ఒకళ్లు కాపలా కాస్తారు. ఆ తరవాత ఒకళ్ల తరవాత మరొకళ్లు వెళతారు.’’

‘‘ఇది వినడానికే ఏం బాగాలేదు, కానీ అది కాదు కదా ఈ సమస్యకి పరిష్కారం.’’ అని అమ్మ వెంటనే అనేసింది. ఆమె ఏదో చెప్పింది. అమ్మకి తృప్తి కలిగించలేదు. ఆ తరవాత అందరం మిషన్‌ ‌బాత్రూమ్‌ ‌కోసం పాటుపడ్డాం. నాలుగు సార్లు పైవాళ్లకి చెప్పింది, పని అవలేదు. అన్నయ్య అప్పుడే యూఎస్‌ ‌నుంచి వచ్చాడు. నేనిస్తాను డబ్బు, మనమే కట్టిద్దాం అని అన్నాడు. అమెరికా వెళ్లాక డబ్బు పంపాడు. అన్నయ్య ఫ్రెండ్స్ ‌తమ వంతుగా కూడా ఇచ్చారుట. ఆ సంగతి అమ్మ తరవాత చెప్పింది.

 నాన్నగారు దగ్గరుండి ఆ పనిని పూర్తి చేసారు. గోడలున్నాయి కాబట్టి, పైన కప్పు వేసారు. రెడీమేడ్‌ ‌సింటెక్స్ ‌తలుపులు పెట్టించారు. సున్నం వేయించారు. డ్రమ్ములో నీళ్లు నింపడానికి నల్లానుంచి ఓ పైపు బిగించారు.

ఇది తెలిసి మరో రెండు స్కూళ్ల వాళ్లు నాన్న గారిని, అమ్మని కలిసి వాళ్లకి కూడా కట్టించమన్నారు. ఇది అన్నయ్యకి చెప్పాం. అన్నయ్య తన స్నేహితుల సాయంతో డబ్బు పంపాడు. బాత్రూములు కట్టించడం అయింది. అవి ముందు ఎలా ఉన్నాయో, బాగు చేసాక ఎలా ఉన్నాయో? ఫొటోలు తీసి అన్నయ్యకి పంపారు.

ఆ తరవాత మా బంధువుల్లో కొంతమంది అమ్మ అడక్కుండానే వాలంటరీగా సాయంచేస్తే బాత్రూములకి ముందు సిమెంటు గచ్చు వేయించారు. పిల్లలకి ఓసారి చెప్పులు కొని ఇచ్చారు. పుస్తకాలు, బ్యాగులు ఇలా ఇస్తూ వచ్చారు. అయితే లోపలి బట్టలు కావాలన్న సంగతి ఈ మధ్యనే తెలిసింది.

 ఆ విషయం తెలిసాక మాకు చాలా బాధ వేసింది. పిల్లల ఇబ్బందులు పట్టవా, ప్రభుత్వానికి? సరైన సౌకర్యాలు లేక సగం మంది ఆడపిల్లలు స్కూలు మానెస్తున్నారంటే బాధ కలిగింది.

 ఇంక అప్పటి నుంచి, ఈ స్కూళ్ల పిల్లలకి ఏ అవసరం ఉన్నా, ఏది కావాలన్నా అమ్మకి చెప్తూంటారు. అమ్మ కూడా మొదట్లో ఆ స్కూలు హెడ్‌ ‌మిస్ట్రెస్‌కి చెప్పేది. ఆమె చిరాకు పడ్డా, విసుక్కున్నా తరవాత ఆమె కూడా తన వంతు బాధ్యతగా పైఅధికారులకి చాలా సార్లు చెప్పింది. బట్టలు, చెప్పులు, స్కూలు బ్యాగులు ఇవన్నీ ఎవరివి వారే కొనుక్కోవాలి అని పైఅధికారులు అన్నారుట. కాని అందరూ వాటిని కొనుక్కోలేని వాళ్లే. అమ్మ అది పెద్ద సాయంగా అనుకోడానికి లేదు. అక్క కూడా వాళ్ల పిల్లల పుట్టిన రోజులని, పరీక్షలు పాసయ్యారని దుప్పట్లూ, కంచాలూ, గ్లాసులూ ఇచ్చింది. దుర్గ రెగ్యులర్‌గా ఆ నాలుగు స్కూళ్లకి వెళ్లి అవి ఇస్తుంది. దీనికి మేమంతా కూడా సపోర్ట్ ‌చేస్తున్నాం. అన్నింటికి ప్రభుత్వం మీద ఆధార పడడం అనవసరం. మనకి ఎంత వీలైతే అంత చేద్దాం అని మేమనుకున్నాం. ఈసారి లోపలి బట్టలు పంపిస్తున్నాం. యూనిఫారాలు అవీ ప్రభుత్వం వాళ్లు ఎలాగూ ఇస్తారు.

సుధీరకి సందేహం. అదే అడిగింది.

‘‘నువ్వూ, వినోదా ఇన్ని చేస్తున్నారు. మీ డబ్బు కూడా ఇందులో పెడ్తున్నారనిపిస్తోంది. మరి మీ ఇంట్లో ఎవరూ ఏం అనరా? దీని గురించి మీ ఇంట్లో ఎప్పుడైనా గొడవలు తలెత్తాయా?’’

 సుధీరకి తమ ఇంట్లో జరిగినది గుర్తొచ్చింది. ఓసారి కాలేజీలో ఏదో చారిటీకి డొనేట్‌ ‌చెయ్యమంటే తన దగ్గర లేకపోతే ఫ్రెండ్‌ ‌దగ్గర తీసుకుంది. ఆ మర్నాడు అమ్మని అడిగితే డబ్బు ఇచ్చింది కాని బాగా తిట్టింది. మరి వీళ్లు ఇంత చేస్తూంటే ఇంట్లో ఎవరూ ఏం అనరా! అందుకే అడిగింది.

 ‘‘నువ్వన్నది నిజం. కానీ ఇక్కడే మన చదువు, వ్యక్తిత్వ వికాసం పనికొచ్చేది. ప్రతి మనిషికి ఇష్టాయిష్టాలుంటాయి. సాధ్యాసాధ్యాలుంటాయి. ఇది మాకు తెలుసు. అందుకే ఈ రెండింటి మధ్యా క్లాష్‌ ‌రాకుండా చూసుకుంటాం. అయినా మా ఇళ్లల్లో ఎవరూ అడ్డు చెప్పలేదు. అయినా మేం కూడా మాకు అక్కర్లేనివి మాత్రమే ఇస్తున్నాం. పైగా ఇది మేం వాలంటరీగా చేస్తున్నాం. మేం చేస్తున్నది చూసి మా కోలీగ్స్, ‌బంధువులు ఇస్తున్నారు. మేం ఎవర్ని అడగడం లేదు. ఎప్పుడైతే అడగడం మొదలు పెట్టామో చులకన అయిపోతాం. మేము స్వచ్ఛందంగా చేస్తున్నాం.’’

ఎన్జీవోలు చేసే పనులన్నీ వీళ్లు చేస్తున్నారు. ఒక్క కుటుంబంలో వాళ్లు చేస్తున్నారు. వాళ్ల డబ్బుతో చేస్తున్నారు. వినీల చెప్పిందంతా విన్నాక ఆ ఇంట్లో వాళ్లందరి మీద గౌరవం పెరిగింది. వీళ్ల ముందు తనేం కాదు, అసలు. ఢిల్లీలో పెరిగి చదువుకుందన్న అర్హత ఒక్కటి మాత్రమే తనకుంది. కాని వీళ్లందరికి చదువుతో పాటూ, సామాజిక సేవ కూడా ఉంది. దానికోసం మహిళా మండళ్లు పెద్దఎత్తున కార్యక్ర మాలు, ఫొటోలు, ప్రదర్శనలు లాంటి ఆర్భాటాలు లేవు. ఎంత సింపుల్‌ ‌మనుషులు!

 తన గురించి గొప్పగా చెప్పడానికి సుధీరకి ఏం లేవు. ఢిల్లీ గురించి ఏవో చెప్పింది. కాని ఆమెకి ఆ విషయాలు సంతృప్తినివ్వలేదు. వీళ్లముందు తను చాలా చిన్నది. ఆమెకి తనలోని లోపాలు మెల్లిగా ఒక్కొక్కటీ కనిపిస్తున్నాయి. తను ఓ మామూలు అమ్మాయి. తనలో ఏ ప్రత్యేకత లేదు. స్కూలు, కాలేజీ, ఆఫీసు, స్నేహితులు, సినిమాలు, పాటలు, డాన్సులు, పార్టీలు, హోటళ్లు.. ఇదే ఇన్నాళ్లు తను ఢిల్లీలో గడిపిన జీవితం.

 జీవితం అంటే చదువు, లెక్కలు, జీతమే కాదు. ఉన్న వాటిని ఎలా సద్వినియోగపరచుకోవాలో అన్న సైన్స్ ‌కూడా ఉండాలి. ఈ ఆర్ట్ ఆఫ్‌ ‌లివింగ్‌ ‌బాగా తెలిసిన వాళ్లు వీళ్లందరు. తమ ఆఫీసులో పర్సనాలిటీ డెవలప్‌మెంటు గురించి, ఎథిక్స్ ‌గురించి, మానవ సంబంధాల గురించి బయటి వాళ్లు వచ్చి ఉపన్యాసాలు ఇస్తూంటారు, విన్న రోజున బాగానే అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ నిజ జీవితంలో అప్లై చెయ్యడానికి ప్రయత్నించ లేదు. ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్లనందరిని చూస్తూంటే ఇదే కదా మానవ సంబంధాలు అంటే.

చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ కాస్సేపు పాప గురించి మర్చిపోయారు.

 రోజూ విక్రాంత్‌ ‌వినీలకి ఫోన్‌ ‌చేస్తున్నాడు. ఆమె ఫోన్‌ని సుధీరకి ఇస్తోంది. ఆమెతో మాట్లాడుతూ అన్ని విషయాలు కనుక్కుంటున్నాడు. తనకి తెలీకుండానే సుధీర ఎన్నో విషయాలు పూస గుచ్చినట్లుగా చెప్తోంది. ఈ విక్రాంత్‌ని వదిలి వెళ్లాలని అనుకున్న సంగతి కూడా మర్చిపోయింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE