జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

– గంటి భానుమతి


‘‘ఏమో చూద్దాం. మా దగ్గర వెయింగ్‌ ‌మిషన్‌ ఉం‌ది. బరువు ఎంతుందో చూద్దాం. ఎక్కువైతే కొన్ని తీసేసి, ఎవరైనా వెళ్లే వాళ్లుంటే వాళ్లతో పంపిద్దాం’’

వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. గదిలో సుధీర, వినీల మిగిలిపోయారు. ఇద్దరి మధ్య పెద్ద పరిచయం లేదు. పైగా ఇప్పుడే ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వారి మధ్య మాటలు పెద్దగా ఏం రాలేదు. సుధీరకి వాళ్ల మాటలు అర్థం కాలేదు. అందుకే ఏదో కాలక్షేపం కోసం అడిగింది.

‘‘వినీలా పెట్టె అంటున్నావు ఎంటీ? ఆ పెట్టెలో ఏం ఉంటుందో విక్రాంత్‌కి తెలుసా? దాని గురించి ఏం అడగలేదు. పైగా తీసుకెళ్లడానికి తయారయ్యాడు’’

‘‘ఆఁ విక్రాంత్‌కి తెలుసు. అందులో చిన్నపిల్లల బట్టలుంటాయి. నేను, అక్కా మా ఆఫీసుల్లో మా కొలీగ్స్ ‌పిల్లల బట్టలు అంటే గౌన్లు, పంజాబీ డ్రెస్సులు, టీషర్టులు, లాగులు, జీన్స్‌లు వాళ్ల పిల్లలకి చిన్నవై పోయినవి మాత్రమే కలెక్ట్ ‌చేసి అమ్మకి పంపిస్తూంటాము.’’

‘‘ఆవిడకి ఎందుకు, ఆవిడ ఏం చేస్తారు?’’ అంది ఆశ్చర్యంగా.

‘‘తను అక్కడ ఉన్న గవర్నమెంటు స్కూళ్లకి వెళ్లి, ఆ టీచర్ల సాయంతో పిల్లలకి ఏవి సరిపోతాయో వాటిని వాళ్లకి ఇస్తుంది. మొన్న పిల్లలకి తువ్వాళ్లు కావాలంటే ఓ ఇరవై తువ్వాళ్లని మేము కొని పంపించాము.’’

అత్తగారు సమాజ సేవ అంటే ఏంటో అనుకుంది. ఏదో మహిళా మండలి ముగ్గుల పోటీలు, వంటల పోటీలు, సన్మానాలు అయి ఉంటాయని అనుకుంది. కాని ఆమె సమాజ సేవ ఇలాంటిదని అనుకోలేదు. ఇది మామ్మ గారి ప్రోత్సాహమే అయి ఉంటుంది.

‘‘సారీ వినీలా, ఇలా అడుగుతున్నానని ఏం అనుకోవద్దు. మేము అంటే ఎవరు కొన్నారు? అంటే ఎవరి డబ్బుతో కొన్నారు, ఆ డబ్బు ఎవరిచ్చారు?’’

అడిగాక సుధీరకి అనిపించింది, ఎక్కువ చనువు తీసుకుని వాళ్ల విషయంలో దూర్చిందా!

 ‘‘ఇందులో సారీ ఎందుకు వదినా, నువ్వు ఈ ఇంటి సభ్యురాలివే కదా. అడగడంలో తప్పేం లేదు. నీకు అంతా తెలుసుకునే హక్కుంది. ఆ తువ్వాళ్లని నేను, అక్క ఇద్దరం కొంత కొంత వేసుకుని ఇక్కడ చేనేత వస్త్ర బండార్‌లో మా డబ్బుతో కొని పంపించాము. తువ్వాళ్లు ఇవ్వడానికి అమ్మ స్కూలుకి వెళ్లినప్పుడు తెలిసిందిట, పిల్లలు వాళ్లకి ఏం కావాలో, ఏది అవసరమో అమ్మతో మెల్లిగా చెప్పారుట. అందుకని ఈసారి ఆడపిల్లలకి లోపలి దుస్తులు సరిగా లేవని కొని పంపమని అమ్మ ఫోన్లో చెప్పింది. మా ఆఫీసులో కొలీగ్స్‌కి చెప్తే వాళ్లు మనస్ఫూర్తిగా డబ్బిచ్చారు. పైగా మా పాప పుట్టిన రోజు. దాని పేరు మీద ఈసారి నేనిస్తాను అని ముందే ఒకావిడ చెప్పేసింది. ఇప్పుడు ఆ పెట్టెలో అవి అన్నీ పెట్టి అన్నయ్యకి ఇస్తున్నాం.’’

తుపాన్లొచ్చినప్పుడు, వరదలొచ్చినప్పుడు పాత బట్టలు, దుప్పట్లూ అందరి దగ్గర తీసుకుని పంపడం లాంటి సాయాలు ఎన్జీవోలు చేస్తాయని తెలుసు. ఉత్తరాఖాండ్‌లో వచ్చిన వరదలకి తమ ఆఫీసులో ఉద్యోగస్తులు అందరూ దుప్పట్లూ, స్వెటర్లూ, ఓ రోజు జీతం ఇచ్చారు. వాటిని ఓ ఆర్గనైజేషన్‌ ‌వాళ్లు వచ్చి తీసుకెళ్లారు. కాని ఇలా స్కూళ్లకి వెళ్లి పిల్లల అవసరాలు తీర్చడం కోసం ఇవ్వడం, అదికూడా తమ డబ్బుతో.. ఇది ఆమెకు కొత్త. ఇలాంటి సర్వీసెస్‌ ఉం‌టాయని తెలీదు. ఇది నిజమైన సేవ. ఆమెకి ఓ సందేహం వచ్చింది. వెంటనే వినీలని అడిగింది.

‘‘వాళ్లిచ్చిన డబ్బు సరైన వాళ్లకి చేరుతుందో లేదో అన్న అనుమానం వాళ్లకి ఎప్పుడైనా వచ్చిందా?’’

 ‘‘రాలేదు. రాదు కూడా. అటువంటి దానికి మేం అవకాశం ఇవ్వం. ఎందుకంటే మేం వాళ్లిచ్చిన దాన్ని స్కూలు పిల్లలకి ఇస్తున్నప్పటి ఫొటోలు పెడతాం. ఆ పిల్లలతో ఎవరు సాయం చేసారో వాళ్ల పేర్లు చెప్పించి థాంక్స్ ‌చెప్పిస్తాము. పైగా వాళ్లిచ్చిన బట్టలు తొడిగించాకా ఆ ఫొటోలు కూడా అమ్మ వాళ్లకి వాట్సప్‌లో పెడుతుంది. ఇది అమ్మ తృప్తి.’’

 ఒక్కసారి సుధీరకి అత్తగారు కళ్ల ముందు మెదిలారు. ఇంట్లో ఎంతో మామూలుగా కనిపించే ఆమెలో ఇంత సేవా తత్పరత ఉందా! తనున్న రోజుల్లో ఆమె ఎక్కడికీ వెళ్లలేదు, ఏరోజున కూడా ఎవరితోనూ మొబైల్‌లో మాట్లాడినట్లు లేదు.

‘‘అమ్మ స్కూళ్లకి ఎప్పుడు వెళ్తారు? నేనెప్పుడూ చూళ్లేదే, ఆవిడ బయటికి వెళ్లడం.’’

 ‘‘దుర్గ ఉంది కదా ఆమె వెళ్లి ఉంటుంది. ఆమె అన్నీ కనుక్కుంటుంది. తను అమ్మకి కుడి భుజం. అన్నింటికీ అమ్మ వెళ్లాలని లేదు. మామ్మ ఉంది కదా. ఆమెని కూడా చూసుకోవాలి కదా, అందుకని అమ్మ పనులు మూడొంతులు దుర్గే చేస్తుంది. తనకి ఓ స్కూటీ ఉంది. దాని మీద వెళ్లి వస్తూంటుంది.’’

ఎంతో అమాయకంగా కనిపించే, ఎక్కువ చదువులేని దుర్గ స్కూటీ నడుపుకుంటూ వెళ్లి అన్నీ కనుక్కుని వస్తుందా? ఆమె గురించి తను చాలా తక్కువ అంచనా వేసింది. ఆమెనే కాదు, అత్తగారిని కూడా.

‘‘ఇలా ఒక స్కూలుకేనా?’’

‘‘ఒకటి కాదు వదినా మా గ్రామం, ఆ చుట్టు పక్కల గ్రామాలలో ఉన్న మూడు స్కూళ్లు. మొత్తం నాలుగు స్కూళ్లు. ఇదంతా చేస్తున్నది మా కుటుంబం మాత్రమే. మా చాతనైనంత మేం చేస్తున్నాం. అయితే ఇది ఎవరికోసమో, ఏదో ఆశించి అమ్మ చెయ్యడం లేదు.’’

అంతలో డాక్టర్‌ ‌మాధురి, చిన్నపిల్లల డాక్టర్‌ ‌కూడా వచ్చారు.

‘‘డాక్టర్‌ ‌గారు ఎలా ఉంది పాప?’’ అని సుధీర అడిగింది.

వినీల కన్నా సుధీర చిన్నది. అయినా తను ఓ పేషెంటు కోసం వచ్చింది కాబట్టి అడగాల్సిన బాధ్యత ఉందనుకుంది. పైగా తనని నమ్మి వినోద ఇక్కడ ఉంచింది. తనకి అప్పచెప్పిన పనిని తను మనస్ఫూర్తిగా చెయ్యాలి.

 ‘‘చెప్పడానికి ఏం లేదు. బేబీ లోపల ఇన్‌ఫెక్షన్‌ ఉం‌ది. పుట్టినప్పుడు నోట్లోంచి, ముక్కులోంచి పస్‌ ‌వచ్చింది. యాంటి బయాటిక్స్ ఇవ్వాలి. మేము ఏం చెయ్యాలో అది చేస్తున్నాం. ఈ క్షణాన మనం చెయ్యగలిగింది ఏం లేదు. చూడడం తప్ప. మంచి జరుగుతుందనే ఆశ తప్ప. పాప ఎలాగైనా బతకాలి అని ప్రార్థన చేయడం తప్ప.’’

వాళ్లిద్దరూ వెళ్లిపోతూ సుధీరతో చాలా సేపు మాట్లాడారు. వాళ్లు చెప్పినది విన్నాక సుధీరకి భయం వేసింది.

‘‘పుట్టినప్పుడు పాప బరువు చాలా తక్కువగా ఉంది. బరువు పెరిగితే కాని, ఏం చెప్పలేమమ్మా. కాని ఇదేవిధంగా పాప ఉంటే మాత్రం ఆమె ఎక్కువ రోజులుండడం కష్టం. బతకడం కష్టం. బతికే ఛాన్సు చాలా తక్కువ. ఎలాంటి వార్తనైనా వినడానికి మనం ప్రిపేర్‌ అయి ఉండాలి.’’ అని అంటూంటే సుధీర భయపడింది.

మరో ప్రాణం తన కళ్లముందు ఎలా ఈ లోకం విడిచి వెళ్తుందో చూడబోతోందా! మామ్మ చూస్తూండగా అలా పోయింది. ఇప్పుడు ఈ చిన్న, రెండు రోజుల పాప. భగవాన్‌ ‌జీవితం అంటే ఏమిటో చెప్పడానికా నన్ను ఇక్కడ ఉంచావు? ఇలాంటివి చూడడానికే ఈ ఇంటికి వచ్చానా!?

చిన్నప్పటి నుంచి ఇలాంటివి ఎప్పుడూ చూళ్లేదు. జీవితానికి మరో కోణం ఇది. ఇన్నాళ్లూ ఆ వైపునుంచి జీవితాన్ని చూసింది. పెళ్లైన పదిహేను రోజులకే జీవితం అంటే ఏంటో తెలిసేలాంటివి చూసింది. ఈ శరీరం శాశ్వతం కాదు, ఎప్పుడో ఒకప్పుడు మట్టిలోనో, పంచభూతాల్లోనో కలిసి పోక తప్పదు. మామ్మ గారు పోవడం కళ్లముందు చూసింది. అది జరిగి ఎన్నో రోజులు కాకుండానే ఇప్పుడు ఇది. ఇంతేనా జీవితం అంటే. మామ్మగారంటే పెద్దావిడ. ఆమె మరణం ఎవరికి బాధ కలిగించలేదు, ఆ మనిషి లేని లోటు తప్ప. కాని ఆ చిన్నపాప కొన్నిరోజులే ఉంటుందా. అలాంటప్పుడు ఏ ఆశతో ఈ లోకంలోకి వచ్చింది. మూసుకున్న ఆ కళ్లల్లో ఏవైనా కలలుండి ఉంటాయా? ఒక్కసారి మనసంతా శూన్యం అయిపోయింది.

అంతలో సిస్టర్‌ ‌వచ్చి తలుపు మీద చిన్నగా తట్టి, లోపలికి వచ్చింది.

‘‘డ్యూటీ మారింది కదా, ఇప్పుడు వచ్చిన కొత్త సిస్టర్‌ ‌మిమ్మల్ని చూడాలను కుంటున్నారు. ఇప్పుడు వస్తారు.’’

 వినీల భయంగా సుధీర వైపు చూసింది. సుధీరకి ఏం చేయాలో తోచలేదు. ఆమె దగ్గరికి వెళ్లి, ఏం ఫరవాలేదన్నట్లుగా చేయి చూపించింది.

‘‘వదినా ఏం కాదు కదా. ఈ పాప మాక్కావాలి, మేము ఇద్దరం ఈ పాప మీద ఎన్నో కలలు కన్నాం. వచ్చే నెలలో కిషోర్‌ ‌వస్తే, విషయం తెలిస్తే కుప్ప కూలిపోడా?’’

 అంతకుముందు ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు లేదు. బేలగా అయిపోయింది. జీవన్మరణాల మధ్య ఊగిసలాడుతున్న కూతురి కోసం ఆరాటపడే ఓ అమ్మ మనసు అది. ఒక ఆశ్వాసన, ఒక నమ్మకం, ఒక ప్రేమ మాట, ఓ ఓదార్పు మాట పలకాలని ఉన్నా సుధీర గొంతులో ఏదో అడ్డు పడుతోంది.

‘‘ ఏం ఫరవాలేదు వినీలా, పైన దేవుడున్నాడు. అన్ని వాడే చూసుకుంటాడు. ధైర్యంగా ఉండు’’ అని అంది కానీ, సుధీరకే భయంగా ఉంది.

‘‘వినీలా ఎలా ఉన్నావు?’’ అంటూ కొత్త సిస్టర్‌ ‌వచ్చి, ఓసారి రూమ్‌ని, మంచం మీద పడుకున్న వినీలని చూసి బీపీ చూసింది. ఓ ఇంజెక్షన్‌ ఇచ్చింది. టాబ్లెట్‌ ఇచ్చి వెళ్లిపోయింది.

ఆమె వెళ్లిపోతూంటే పాప గురించి అడిగారు.

‘‘నాకంతగా తెలీదు. నాది ఆ విభాగం కాదు. నేను ఆ విభాగంలో లేను. అయినా అక్కడ ఉండే నర్సులు మామూలు వాళ్లు కారు. స్పెషల్‌ ‌ట్రైనింగ్‌ అయిన వాళ్లు. ఏం ఫరవాలేదు, పెద్ద డాక్టరు వస్తానని అన్నారు. ఆ డాక్టరు వచ్చినప్పుడు మీరిద్దరూ పాపని చూడడానికి రావాలి’’

 వినీల పడుకునే తలని ఊపింది. సుధీర కూడా అలాగే అన్నట్లు తల ఊపింది. అదే గదిలో మరో మంచం ఉంటే, దాని మీద సుధీర వాలింది. ఆమెకి అంతా ఆశ్చర్యంగా ఉంది. అనుకున్నది ఒక్కటి కూడా జరగలేదు. కలలో కూడా అనుకోనివి తన ముందు జరుగుతున్నాయి. అన్నింటికీ తను ఓ సాక్షిలా ఉండిపోతోంది.

ఇన్నాళ్లూ ఈ వినీల అంటే ఎవరో తెలీదు. మొదటిసారిగా ఈ వినీలని చూడడం ఇప్పుడే. అయినా తను ఆమె పక్కన ఉంది. ఇది తనేనా, ఓ మనిషికి ధైర్యం చెప్తోంది. పరిస్థితి ఎలాంటి వారినైనా మార్చేస్తుందా?

అసలు వీళ్లందరి మూలంగా కదా తమ అమెరికా ప్రయాణం ఆగిపోయింది. ఆగిపోవడం ఏంటీ? అసలు ప్రయాణమే లేదు. ఆ ప్రసక్తే లేదు. అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు. తన సుఖాన్ని, సంతోషాన్ని ఏమాత్రం చూడని వాళ్ల కోసం ఏమాత్రం ఇష్టం లేకపోయినా సాయం చేస్తోంది. ఓ సాటి ఆడదానిగా, మనసున్న మనిషిగా చేస్తోంది అంతే. ఇందులో ఎమోషన్‌ ‌లేదు, బంధం అన్నది లేదు. ఇక్కడ కొంచెం నార్మల్‌ అయ్యాకా, తను వెళ్లిపోతుంది. విక్రాంత్‌ ‌కోసం తను ఎదురుచూడదు. తన జీవితం తనది.

బెంగళూరుకి విమానంలో ప్రయాణం అయినా బాగా అలిసిపోయింది. బెంగళూరు చేరుకోవడం. ఇంటికి వెళ్లగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లడం, ఆ తరవాత రెండుసార్లు అటూ ఇటూ తిరగడం, బాగా అలిసిపోవడంతో ఇలా ఆలోచిస్తూండగానే తెలీకుండానే ఆమె కళ్లు మూసుకున్నాయి. ఎవరో తట్టినట్లైతే ఉలిక్కి పడి లేచింది. సుధీరకి ఒక క్షణం తానెక్కడుందో అర్థం కాలేదు. కళ్లు తెరవడానికి రాలేదు. బలవంతంగా బాగా తెరిచి చూసింది. ఎదురుగా లేత నీలం డ్రెస్‌లో సిస్టర్‌.

‘‘‌మిమ్మల్ని లేపాల్సి వచ్చింది. కాని, తప్పడం లేదు. డాక్టరు వచ్చారు. వినీలని రమ్మంటున్నారు. ఆమె భర్త ఇక్కడ లేరు కాబట్టి, మీరు కూడా రండి.’’

‘‘వినీల ఇప్పుడే నిద్రపోయింది. తరవాత వస్తే ఫరవాలేదా. అయినా ఏం జరిగింది?’’

‘‘మీ పాప పరిస్థితి ఏం బాగా లేదు. ఆ విషయం గురించి మాట్లాడాలని’’ ఆగిపోయింది.

మగతగా పడుకున్న వినీల కళ్లు తెరిచి సిస్టర్‌ని చూసింది. ‘‘ఏం జరిగింది సిస్టర్‌ ‌పాపకి’’ అంటూ గాబరాగా లేచింది.

‘‘కొంచెం బాగా లేదు. అందుకని డాక్టరు రమ్మంటున్నారు.’’

‘‘మేం చూసినప్పుడు బాగానే ఉంది కదా?’’

 ‘‘ఈ పిల్లలు అంతేనండి, ఏ క్షణాన ఎలా ఉంటారో, ఏం జరుగుతుందో ఏం చెప్పలేం. ఆ మార్పులు కూడా చాలా తొందరగా జరిగి పోతూంటాయి.’’ అంతలోనే డాక్టరు గదిలోకి వచ్చారు. చాలా చిన్నగా అనిపించాడు. అతని ముఖంలో ఏ భావం లేదు. అతన్ని చూసి వినీల లేవబోయింది. సుధీర వెంటనే లేచి నుంచుంది.

‘‘పాప’’ అని ఆగిపోయి, డాక్టరుని చూసింది.

‘‘అదే, పాప గురించే చెప్పాలనుకుంటున్నాను. డెలివరీ అప్పుడు బాగానే ఉన్నట్టనిపించింది. అప్పుడు రబ్బరు బొమ్మల్లా, గులాబీ పువ్వులా ముద్దుగా ఉంటారు. కానీ రాను రాను ప్రాబ్లమ్స్ ‌మొదలవు తాయి. మీ పాప పదిహేను వారాల తరవాత పుట్టాల్సిన పాప. కానీ చాలా ముందే వచ్చేసింది. కొన్ని ఆర్గన్స్ ‌పూర్తిగా మెచ్యూర్‌ అవలేదు. బలంగా లేవు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, ఇంకా కొన్ని భాగాలు. ఆమె కనురెప్పలు ఇంకా మూసుకునే ఉన్నాయి. మరో విషయం ఆమె బ్రెయిన్‌లో కొంచెం బ్లీడింగ్‌ అయింది.’’

‘‘అంటే ఆమె బతికే చాన్స్ ‌లేదా?’’ అని వినీల అంది.

‘‘ఏమాత్రం ఆశ లేదా?’’ సుధీర తలని బాగా వంచి డాక్టర్‌ని చూస్తూ అడిగింది.

‘‘ఆశ లేదు అని అనం. మేం డాక్టర్లం. ఆశావహులం. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. మాకు చివరి క్షణం వరకూ ఆశ ఉంటుంది. మనం అందరం అలాగే ఉందాం. మీరూ అలాగే, అదే ఆశతో ఉండండి.’’ అని అతను వెళ్లిపోయాడు. పాప జీవితంతో యుద్ధం చేస్తోంది. గెలుస్తుందా? ఓడిపోతుందా? అన్న విషయం తరవాత, ఇప్పుడు గాయాలు భౌతికంగా, మానసికంగా తగుల్తున్నాయి.

ఆశ అని డాక్టరు గారు అనేసారు. కాని దాన్ని ఎక్కడినుంచి తేవాలి? వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు. కాని ఆ ఇద్దరి మధ్యా మాటలేం లేవు. సుధీరకి ఎన్నో చెప్పాలని ఉంది. వినీలకి కూడా తన మనసులోని బాధ చెప్పుకుని బరువు దించుకోవాలని ఉంది. ఇద్దరికీ మరీ అంత దగ్గరితనం లేదు. అందుకే మౌనంగా ఉండి పోయారు.

‘‘కాస్సేపు పడుకో వినీలా. నువ్వు బాగా అలిసిపోయి ఉన్నావు. మన చేతుల్లో ఏం లేనప్పుడు మనమేం చేస్తాం. పాప యుద్ధం చేస్తోంది. అందులో విజయమో, వీరస్వర్గమో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మొదటిదే జరగాలని ఆ దేవుడిని ప్రార్థిద్దాం.’’ అని తను మంచం మీద వాలింది.

 నిద్ర పట్టలేదు. అలాగే ఇద్దరు పైకప్పుని చూస్తూన్నారు. తలుపు చప్పుడయింది. ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. తలుపు వైపు చూసారు.

 తెల్లకోటు, స్టెత్‌ ‌మెళ్లో ఉంది కాబట్టి, ఆమె ఓ డాక్టరని తెలిసింది. ఎవరైనా సిస్టర్‌, ‌డాక్టరు వచ్చారంటే ఇద్దరికీ భయం వేస్తోంది. ఓ కొత్త డాక్టరు. ఏం చెప్తుందో ఏమో, ఆమె తలుపు దగ్గరగా వేసి లోపలికి వచ్చింది. ఈమె ఏ వార్త తెస్తుందో అని ఇద్దరికీ అనిపించింది.

‘‘వినీలా ఎలా ఉన్నావు?’’ అంటూ బాగా దగ్గరికి వచ్చి, మంచం దగ్గరగా నుంచుంది.

‘‘నా పేరు మనీషా జైన్‌, ‌పీడియట్రీషియన్‌ని. స్పెషల్‌ ‌కేర్‌ ‌నర్సరీకి ఇంచార్జిని.’’

‘‘ఏం జరిగింది డాక్టర్‌, ‌మా పాప ఎలా ఉంది?’’ ఆందోళనగా వినీల చూసింది.

(ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE