– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

“Look, you have a great privilege of being a Military Secretary to the greatest man of our times. You should never, never let anything happen to him because he is valuable not only to you but also to the whole of Asia, including Japan’’

(చూడు- మనకాలంలో ఉన్నవాళ్లందరికంటే గొప్పవ్యక్తికి మిలిటరీ సెక్రెటరీగా పనిచేసే గొప్ప అవకాశం నీకు దక్కింది. ఆయనకి ఎప్పుడూ, ఎప్పుడూ ఎలాంటి హాని నువ్వు జరగనివ్వకూడదు. ఎందుకంటే ఆయన మీకే కాదు- జపాన్‌ ‌సహా మొత్తం ఆసియాకీ విలువైన మనిషి.)

ఆ కాలాన జపాన్‌ ‌మిలిటరీలో అత్యంత ప్రాధాన్యం కలిగిన ముగ్గురు జనరల్స్‌లో ఒకడైన ఫీల్డ్ ‌మార్షల్‌ ‌కౌంట్‌ ‌తెరౌచీ నేతాజీ సైనిక కార్యదర్శి ప్రేమ్‌ ‌కుమార్‌ ‌సెహగల్‌తో అన్నమాట ఇది.

[Quoted in Netaji : From Kabul To Battle Of Imphal, H.N.Pandit, p. 297]
“To be with him and witness a superhuman heroic figure giving directions to his officers and men of the INA, I felt as though I was in the presence of Acara (sic) the mythological warlord standing with a flaming fire behind his shoulders.”

(ఐఎన్‌ఎ ‌సేనలకూ ఆఫీసర్లకూ ఆదేశాలిస్తుండగా పక్కన ఉండి ఆ సూపర్‌ ‌మాన్‌ ‌వీరుడిని చూస్తూంటే, భుజాల వెనుక జ్వాలలతో ప్రకాశిస్తాడని పురాణాల్లో చెప్పే దివ్య సేనాని సమక్షంలో ఉన్నానా! అని నాకు అనిపించింది.)

ఐఎన్‌ఎకూ జపాన్‌ ‌మిలిటరీకీ నడుమ సంధానానికి ఏర్పడిన హికారీ కికాన్‌కి ఆధిపత్యం వహించిన జనరల్‌ ఐసోడా అనంతరకాలంలో సేనాధిపతిగా బోస్‌ ‌ప్రతిభని మెచ్చుకుంటూ అన్న మాట ఇది. (అదే గ్రంథం. పే. 296)

తాము అంతలా పొగిడిన సుభాస్‌ ‌చంద్రబోస్‌కు తమ దేశ మనుగడపై నిర్ణాయక ప్రభావం చూపగల ఇంఫాల్‌ ‌యుద్ధంలో సేనానాయకత్వాన్ని లేదా జపనీస్‌, ఇం‌డియన్‌ ‌సేనల జాయింటు కమాండులో సహబాధ్యతను జపానీ ‘సమురాయిలు’ అప్పగించి ఉంటే వారి దేశానికి ఆటంబాంబుల విలయం బహుశా తప్పేది. కమాండు కూడా అక్కర్లేదు; కనీసం వ్యూహ రచనలో, యుద్ధ సమయంలో అతడి హితవును ఆలకించినా ఘోర పరాజయం నుంచి తప్పించుకునే వారు.

మనం మాట్లాడుతున్నది రెండో ప్రపంచయుద్ధం మొత్తంలో అతి ముఖ్య సంగ్రామంగా రష్యన్‌ ‌బాటిల్‌ ‌తరవాత ఎన్నదగ్గ ఇంఫాల్‌ ‌సమరం గురించి. అటూ ఇటూ లక్షల సంఖ్యలో సైనికులు తలపడ్డ ఆ భీషణ యుద్ధంలో అన్నీ కలిసి వచ్చి, మొదట్లో పైచేయి అయి, శత్రువును దాదాపుగా లొంగిపోయే స్థితికి తెచ్చికూడా జపాన్‌ ‌చిత్తుగా ఓడిపోయింది. దానికి కారణం శత్రువు పరాక్రమం కాదు. జపాన్‌ ‌చేతకానితనం.

ఆ కాలాన జపాన్‌ ‌కర్మకొద్దీ దాపురించిన పాలకులు అసమర్ధులు! సేనానులు మూర్ఖులు! వారి నడుమ సమన్వయం సున్న. సమయస్ఫూర్తి ఎవరికీ లేదు. అహంకారం జాస్తి. ఆలోచన నాస్తి. సాధారణంగా ఎవరైనా నింపాదిగా అలోచించి, సరైన ప్రణాళిక వేసుకుని, సమర్థ వ్యూహం రూపొందించు కుని, కావలసిన బలగాలను సమీకరించుకున్నాక యుద్ధానికి ఉపక్రమిస్తారు. జపాన్‌ ‌విషయంలో అన్నీ విపరీతమే.

దేశానికి ప్రధానమంత్రి టోజో. అతడు మిలిటరీ వాడే. కాని సొంతంగా ఒక డివిజన్‌ను అయినా కమాండ్‌ ‌చేయగలడా అన్నది సందేహమే. కాలం కలిసి వచ్చి ప్రధాని అయ్యాక తనను తాను జనరల్‌గా ప్రమోట్‌ ‌చేసుకున్న ఘనుడు. అక్షకూటమిలోని సాటి దేశాధినేతలు అయిన హిట్లర్‌, ‌ముస్సోలినీలను కనీసం ఒక్కసారి అయినా కలిసి ఎరుగడు. పేరుకు ప్రధాని అయినా తన మిలిటరీనే కట్టడి చేయలేడు. తనకు మట్టి అంటకుండా చూసుకోవాలనే యావ తప్ప దేశం బాగు అతడికి పట్టదు. ఇంట్లో స్నానాలగదిలో ఉండి కిటికీలో నుంచి ఇంఫాల్‌ ఆపరేషన్‌కు కంగారు పడుతూ అంగీకారం తెలిపిన కార్యదక్షుడతడు!

ఇక సేనలను నడిపించవలసిన సేనాపతుల నడుమ శ్రుతి ఎప్పుడూ కలవదు. ఒకరి మాట ఒకరు వినరు. ఎవరి మాట చెల్లుబాటు అవుతుందో, నిర్ణయాధికారం ఎవరిదో ఎవరికీ తెలియదు. సామాన్యంగా ఎక్కడైనా సేనలను సిద్ధం చేసుకున్నాక యుద్ధం తలపెడతారు. 1944 జనవరి 7న ఇంపీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‘ఆపరేషన్‌ •’ ‌కు ఉత్తర్వు ఇచ్చాక దానికి అవసరమయ్యే అదనపు సేనలను ఎక్కడెక్కడినుంచి సమీకరించాలని ఆలోచించటం మొదలెట్టారు. బర్మాలో ఉన్న ప్రధాన సైన్యానికి తోడుగా పసిఫిక్‌లోని సోలమన్‌ ‌దీవుల నుంచి ఒక డివిజను; చైనాలో చుంగ్‌ ‌కింగ్‌ ‌నుంచి ఒక డివిజను; సింగపూర్‌ ‌నుంచి ఒక డివిజను ఇంఫాల్‌కు రప్పించాలని ప్లాను అయితే వేశారు. నాన్‌ ‌కింగ్‌ ‌నుంచి బయలుదేరిన సైన్యం థాయిలాండ్‌ ‌చేరటానికే చాలా రోజులు పట్టింది. అప్పుడైనా దానిని అర్జెంటుగా ఇంఫాల్‌ ‌రంగానికి పంపించకుండా లోకల్‌ ‌కమాండు వాళ్ళు దానిని రోడ్డు వేసే డ్యూటీలో పెట్టి అక్కడే నిలిపివేశారు. రైల్వే లైన్ల మీద, రోడ్డు రవాణా మీద విమానాల నుంచి దాడులు ముమ్మరంగా జరుగుతున్న కాలంలో పసిఫిక్‌ ‌నుంచి వెళ్లిన సైన్యం చచ్చీ చెడీ బాంగ్‌కాక్‌ ‌చేరుకోవటమే కష్టమయింది. అక్కడ ఏ రవాణా సదుపాయమూ దొరకక 20 వేల మంది సైనికులు బాంగ్‌కాక్‌ ‌నుంచి రంగూన్‌ ‌వరకూ 1200 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళారు. అక్కడి నుంచి దారిలేని కొండలూ, కాలు పెట్టలేని అడవులూ, పోటెత్తే నదులూ దాటి రంగం చేరేసరికి సత్తువ నశించి ఈడిగల పడ్డారు. జనవరిలో మొదలెట్టి నెలరోజుల్లో మొత్తం ఆపరేషనును పూర్తి చేసేద్దామని సేనాపతి ముతాగుచి చిటికెలు బాగానే వేశాడు. కానీ మార్చి నెల మధ్యలో గాని మొదలే పెట్టలేక పోయాడు. ఆ ఆలస్యానికి ముఖ్య కారణం రంగానికి సేనల తరలింపు విషయంలో మిలిటరీ పెద్దల మధ్య స్పష్టత, సమన్వయం లేకపోవటం.

ఒక రాజ్యం మీద దండయాత్ర చేయబోయే ముందు అక్కడి భౌగోళిక పరిస్థితులు ఏమిటి, శత్రువు బలాలు, బలహీనతలు ఏమిటి, అతడి ఆయువుపట్లు ఏమిటి, వాటిని ఎలా దెబ్బతీయాలి, రాగల సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, దొరికే అవకాశాలు ఎలా వాడుకోవాలి? అన్నది ముందుగా అధ్యయనం చేయాలి. వాటికి తగ్గట్టు పటిష్టమైన రణతంత్రం రూపొందించాలి. నమ్మశక్యం కాని నిజం ఏమిటంటే ఇంత పెద్ద దండయాత్రకు పూనుకునే ముందు దానికి అనుసరించ వలసిన వ్యూహం గురించి అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు, మేధోమథనం జరగలేదు. వార్‌ ‌మినిస్టర్‌ ‌కూడా అయిన ప్రధాని మొదలుకుని బర్మా ఏరియా ఆర్మీ కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌వరకూ ఎవరికివారు బాధ్యతను కిందివారి మీదికి నెట్టి, తమకు నింద రాకుండా చేతులు దులిపేసుకున్నారు. ఆపరేషన్‌ ‌కి బాధ్యత వహించిన 15వ ఆర్మీకి సేనాధిపతి అయిన జనరల్‌ ‌ముతాగుచి రణరంగానికి దూరంగా హెడ్‌ ‌క్వార్టర్స్ ‌పెట్టుకుని తన లోకంలో తాను ప్రజ్ఞలు, ప్రగల్భాలతో, ఆలోచన లేని ఆవేశంతో పొద్దుపుచ్చాడు.

4000 నుంచి 7000 అడుగుల ఎత్తయిన కొండల బారులకు, వాటి చుట్టూ నడిచే దారి కనపడని కీకారణ్యాలకు అవతల, మరీ ఇరుకైన చోటే 400 మీటర్ల వెడల్పున ప్రవహించే చింద్విన్‌ ‌నదికి ఆవలి వైపు చుట్టూ దుర్భేద్యమైన కొండల సహజ రక్షణలో ఉండే ఇంఫాల్‌ ‌మీద దాడికి దిగటమే మహాసాహసం. 1,20,000 మంది సైనికులను దానికి నియోగించ దలచినప్పుడు మునుముందు ముఖ్యంగా చూసుకోవలసింది అంతమందికీ ఆహార సరఫరా విషయం. వందల మైళ్ళ దూరంలోని సప్లై సెంటర్ల నుంచి అన్ని అడ్డంకులు దాటుకుని అందరికీ ఆహారం చేరవేయటం అసాధ్యం. సైనికులే సరుకుల మూటలు మోసుకుని పోవటమూ కుదరదు. తీరా వెళ్ళిన చోట తిండి దొరకకపోతే ఆకలిచావులు తప్పవు. చివరికి జరిగింది అదే.

‘‘నా మూడు డివిజన్లు నెల రోజుల్లో ఇంఫాల్‌ను పట్టుకుంటాయి. త్వరగా కదలటానికి వీలుగా మూడు వారాల రేషన్లను మాత్రమే సైనికులు తీసుకు పోతారు. వాళ్లకు కావలసినవన్నీ తరవాత బ్రిటిష్‌ ‌సప్లయిలూ డంపులనుంచి ఎలాగూ సమకూరుతాయి. అబ్బాయిలూ! ఏప్రిల్‌ 29‌న మా చక్రవర్తి జన్మదినోత్సవ వేడుకల్లో మళ్లీ ఇంఫాల్‌లో కలుద్దాం’’ అని జనరల్‌ ‌ముతాగుచి సెంట్రల్‌ ‌బర్మాలోని మేమ్యోలో పత్రికల వార్‌ ‌కరెస్పాండెంట్ల ముందు ఉత్తరకుమారుడి లెవెల్లో ప్రకటించాడు. కాని ఆ బ్రిటిష్‌ ‌డంపులను పట్టుకోవటమే అతడి వల్ల కాలేదు.

‘‘చర్చిల్‌ ‌సప్లై’’ల కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవలసిన పనిలేదు. ఇంఫాల్‌లోని మొత్తం మిత్రరాజ్యాల సైన్యాలకు ఒక సంవత్సరానికి సరిపడా ఆహార పదార్థాలను అక్కడికి దగ్గరలోనే ఉన్న దిమాపూర్‌లోని గిడ్డంగుల్లో నిల్వ చేసిపెట్టారు. వాటిని వశపరచు కుంటే జపాన్‌ ‌సైన్యానికి ఆహార సమస్యే ఉండదు. వశ పరచుకోవటం పెద్ద కష్టం కూడా కాదు. ఎందుకంటే దిమాపూర్‌ ‌రక్షణ సంగతి కొమ్ములు తిరిగిన బ్రిటిష్‌ ‌కమాండర్లు బొత్తిగా పట్టించుకోలేదు.

ఇదే విచిత్రం అనుకుంటున్నారా? దీనికి మించిన విడ్డూరం ఇంకొకటి ఉంది. దిమాపూర్‌లో ఆహార పదార్థాల నిల్వలు ఉన్నాయని గాని, అక్కడ రక్షణ వ్యవస్థ అధ్వానంగా ఉన్నదనిగాని తెల్లవారికంటే ఎక్కువగా కొమ్ములు తిరిగిన జపాన్‌ ‌సేనానులకు ఇంఫాల్‌ను జయప్రదంగా ముట్టడించాక కూడా తెలియదు!

బర్మా (ఇప్పుడు మయాన్మార్‌) ‌సరిహద్దున సముద్రమట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉండే పీఠభూమి ఇంఫాల్‌. ‌తూర్పున ఆరకన్‌ ‌పర్వత శ్రేణి, పశ్చిమాన చిన్‌ ‌పర్వతశ్రేణి 2000 నుంచి నాలుగువేల అడుగుల ఎత్తున ఆవరించి ఉన్నందున దానిని లోయ కూడా అనవచ్చు. ప్రపంచంలోకెల్లా దట్టమైనవని చెప్పదగిన కారడవులు, 35 మైళ్ళ మేర పర్వతశ్రేణులను ఆవరించి ఉండటం వల్ల వాటిగుండా బర్మా వైపు నుంచి చొరబడటం ఎవరితరమూ కాదని ది గ్రేట్‌ ‌బ్రిటన్‌ 14‌వ ఆర్మీ ఫీల్డ్ ‌మార్షల్‌ ‌జనరల్‌ ‌విలియం స్లిమ్‌ ‌నమ్మకం. జపాన్‌ 31‌వ డివిజన్‌ ‌బర్మా అంచున చింద్విన్‌ ‌నది దాటవచ్చని అతడికి ముందే వేగు అందింది. దుస్తరమైన కొండలను, అడవులను దాటి రావటం ఎన్నివారాలు కష్టపడ్డా శత్రువుకు సాధ్యం కాదు; మహా అయితే చాలా రోజులకు ఒక రెజిమెంటుకు మించి రాలేదు, వస్తే గిస్తే అప్పుడు చూసుకోవచ్చు; ఈ లోగా దిమాపూర్‌ ‌భద్రత గురించి బెంగ అక్కర్లేదు; అవసరమైతే అక్కడికి ఇంఫాల్‌ ‌నుంచి మెటల్‌ ‌రోడ్‌ ‌మీద మన సేనలను పంపొచ్చు – అని అతడు నిశ్చింతగా ఉన్నాడు. ఆ కాలపు జపాన్‌ ‌మిలిటరీ బాసులు చవటలైనా సైనికులు మెరికలు. జంగిల్‌ ‌యుద్ధాల్లో వారిని ప్రపంచంలో ఎవరూ కొట్టలేరు. కొండలు వారికి పేలపిండి. బ్రిటిష్‌ ‌కమాండర్లు కలనైనా ఊహించని విధంగా మూడు డివిజన్ల జపాన్‌ ‌సైనికులు, ఐఎన్‌ఎ ‌బహాదూర్‌ ‌గ్రూపుల గెరిల్లాలు ఎల్లలు దాటి ఏప్రిల్‌ 4 ‌కల్లా కొహిమాను ఆక్రమించారు. దిమాపూర్‌కు వెళ్ళే రోడ్డు వారి గుప్పిట్లో చిక్కింది.

మాయలఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు మణిపూర్లో బ్రిటిష్‌ ‌సేన ప్రాణం దిమాపూర్‌లో సగం, పలేల్‌లో సగం! కొహిమా, ఇంఫాల్‌లలోని సైన్యాలకు కావలసిన సరఫరాలన్నీ దగ్గరలోని దిమాపూర్‌కు రైలు మార్గాన చేరతాయి. ఆ పట్టణమంతటా ఉన్న గిడ్డంగుల్లో నిల్వ అవుతాయి. ముతాగుచి తన సైన్యంలో 31వ డివిజనును కొహిమా చేరుకున్న వెంటనే దిమాపూర్‌కు పంపించి ఉంటే సైనిక రక్షణలేని ఆ పట్టణాన్ని సునాయాసంగా స్వాధీనపరచుకునే వాడు. అక్కడి గిడ్డంగులు, సరకుల షెడ్లు అతడి చేతికి చిక్కి ఉంటే జపాన్‌ ‌ముట్టడి కొనసాగినన్ని నెలలూ బ్రిటిష్‌ ‌సైన్యానికి అక్కడినుంచి విమానాల ద్వారా ఆహారం అందకుండా ఉండేది. జపాన్‌, ‌భారతీయ సేనలకు ఆహార సమస్యా సుష్టుగా తీరేది. ఆకలికి తాళలేక బ్రిటిష్‌ ‌సైన్యం సరెండర్‌ అయ్యేది.

మరి ఇంతటి లక్కీ చాన్స్ ఎం‌దుకు జారవిడుచుకున్నావయ్యా అంటే ముతాగుచి చెప్పింది ఇది. దిమాపూర్‌ ‌మీదికి వెంటనే వెళ్ళమని అతడు ఏప్రిల్‌ 6‌న 31వ డివిజన్‌కు ఆర్డర్‌ ఇచ్చాడట. కాని అతడి పైన ఉండే బర్మా ఏరియా ఆర్మీ కమాండర్‌ ‌జనరల్‌ ‌కవాబే ఆ ఉత్తర్వును రద్దు చేశాడట. అదీ ఏ కారణంతో? పట్టుకోవలసినవి అంటూ ఇంపీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ఆర్డరులో పేర్కొన్నవాటిలో ఇంఫాల్‌, ‌కొహిమాలే తప్ప దిమాపూర్‌ ‌పేరు లేదట! పైనుంచి స్పష్టమైన ఆదేశం లేకుండా దానిమీదికి దండెత్త కూడదట. భలే! ఇక టోక్యో హెడ్‌క్వార్టర్స్ ఆనతిలో దిమాపూర్‌ ‌పేరు ఎందుకు లేదంటే- దాని వ్యూహాత్మక ప్రాధాన్యం టోక్యోకే తెలియదు కనుక! జపాన్‌ ‌మిలిటరీ వ్యూహకర్తల తెలివి, వారి అధ్యయనం, హోంవర్కు అంత లక్షణంగా ఏడ్చాయి కాబట్టి!

ఇక ఇంఫాల్‌ ‌రక్షణ ప్రాణంలో రెండో సగం సంగతి. యుద్ధంలో జపాన్‌ ‌దారుణంగా ఓడటానికి ఒక ప్రధాన కారణం దాని చేతుల్లో యుద్ధవిమానాలు కనీసమాత్రమైనా లేకపోవటం. బ్రిటిష్‌, అమెరికన్‌ ‌యుద్ధవిమానాలు ఆకాశం మీద ఆదిపత్యంతో జపాన్‌ ‌సేనలను వెంటపడి వేటాడి, మిత్ర రాజ్యాల సేనలకు అమోఘమైన గరుడాస్త్రంలా ఉపయోగపడింది. జపాన్‌ ‌ముట్టడి సమయంలో 22 వేల టన్నుల సప్లయిలను చిక్కుపడిన సేనలకు చేరవేయటం, ఏకంగా ఒక డివిజన్‌ ‌పరిమాణంలో 20 వేల మంది సైనికుల అదనపు బలగాలను చేరవేయటం ఇంఫాల్‌ ‌దగ్గరలోని పలేల్‌ ‌విమానాశ్రయం బ్రిటన్‌ అధీనంలో ఉండటం వల్లే సాధ్యపడింది. దిమాపూర్‌ ‌వలెనే పలేల్‌ ‌భద్రత విషయంలోనూ బ్రిటిష్‌ ‌సేనాపతి నిర్లక్ష్యం చూపాడు. ఇంఫాల్‌ ‌రక్షణ వ్యవస్థ ఆనుపానులను ముందుగా అధ్యయనం చేసి ఉంటే జనరల్‌ ‌ముతాగుచి ఇంఫాల్‌ను చుట్టుముట్టిన వెనువెంటనే పలేల్‌ ‌విమానాశ్రయం మీద అటాక్‌ ‌చేయించవలసింది. ఏప్రిల్‌ ‌నెల చివరిలో గాని అతడికి ఆ ఆలోచన రాలేదు. వచ్చాక మాత్రం ఏమైంది?

నేతాజీ పట్టుదల మీద రంగానికి అనుమతించి, ముందు జాగ్రత్తగా జపాన్‌ ‌వాళ్ళు పెద్ద ఆయుధాలు లాగేసుకుని పంపించిన గాంధీ బ్రిగేడ్‌ ‌గుర్తున్నది కదా? ఏప్రిల్‌ 28‌న అది ఖాంజోల్‌ ‌చేరుకుంది. మరునాడు ఐఎన్‌ఎకి పాతమిత్రుడైన మేజర్‌ ‌ఫుజివార ఐఎన్‌ఎ ‌డివిజనల్‌ ‌కమాండర్‌ ‌మొహమ్మద్‌ ‌కియానీ దగ్గరికి వచ్చాడు. తరవాత జరిగింది షానవాజ్‌ ‌ఖాన్‌ ‌మాటల్లో-

‘‘పలేల్‌ ఎయిర్‌ ‌ఫీల్డ్ ‌మీద జపాన్‌ ‌సేనలు దాడిచేసి దాన్ని ఖాయంగా పట్టుకోబోతున్నాయి. ఇందులో ఐఎన్‌ఎ ‌వాళ్ళ పాత్ర కూడా ఉంటే బావుంటుందని నేను మా వాళ్లకు చెప్పి ఒప్పించాను. మీరు, మేము కలిసి ఏకకాలంలో దాడి చేద్దాం’’ అని మేజర్‌ ‌ఫుజివార చెప్పాడు. కియానీ సంతోషంగా అంగీకరించాడు. దాడికి తేదీ, సమయం కూడా ఖరారు చేశారు. ఆ ఆపరేషన్‌ ‌బాధ్యత గాంధీ బ్రిగేడ్‌కు కియానీ అప్పగించాడు. బ్రిగేడ్‌ ‌హెడ్‌క్వార్టర్స్ ఉన్న ఖాంజోల్‌ ‌నుంచి పలేల్‌ ‌విమానాశ్రయం 40 మైళ్ళు. 300 మందిని జాయింటు అటాక్‌ ‌కోసం కేటాయించారు.

లైట్‌ ఆటోమేటిక్‌లు, రైఫిళ్లు, ఒకరోజు రేషన్లు తీసుకుని మేజర్‌ ‌ప్రీతమ్‌ ‌సింగ్‌ ‌నాయకత్వంలో వారు ఏప్రిల్‌ 30‌న కాలినడకన బయలుదేరారు. ఎత్తైన కొండల గుండా శత్రువుల నిఘాను తప్పించుకుంటూ 40 మైళ్ళు నడిచి పలేల్‌ ‌దగ్గరకు చేరుకున్నారు. దాడి చేయాలనుకున్నది అర్ధరాత్రి. చీకటి పడేదాకా కొండల సందుల్లో పొదలమాటున దాక్కుని రాత్రి ఏరోడ్రోమ్‌కి బయలుదేరారు. శత్రువులు చొరబడకుండా ఎయిర్‌ ‌ఫీల్డ్ ‌చుట్టూ ఉన్న గుట్టల మీద మిలిటరీ పికెట్లున్నాయి. ముందు వాటిని అటాక్‌ ‌చేయాలి. ప్రీతమ్‌ ‌సింగ్‌ ‌తన మనుషులను రెండు గ్రూపులుగా విడగొట్టాడు. ఒక పార్టీ ఒక పికెట్‌ను చుట్టుముట్టి లొంగదీసుకోవాలి. రెండో పార్టీ ఏరోడ్రోమ్‌లోకి చొరబడి దాడిచేయాలి.

బ్రిటిష్‌ ‌పికెట్‌లో హెవీ మెషిన్‌ ‌గన్లున్నాయి. బందోబస్తు దిట్టంగా ఉంది. కెప్టెన్‌ ‌సాధూ సింగ్‌ ‌జట్టు దగ్గర రైఫిళ్లు మాత్రమే ఉన్నాయి. అయినా జంకక అలికిడి కాకుండా వెళ్లి చీకట్లో ఔట్‌ ‌పోస్టుమీద మెరపు దాడి చేశాడు. లోపలివారు బిత్తరపోయి చేతులెత్తి ‘‘సాథీ, హమ్‌ ‌కో మత్‌ ‌మారో’’ అని అరిచారు. భారతీయ సైనికుల మీద తప్పనిసరి అయితే తప్ప కాల్పులు జరపరాదని ఐఎన్‌ఎ ‌నియమం. లోపల ఉన్నది మనవారే! లొంగిపోతామంటున్నారు – అనుకుని సాధూసింగ్‌ ‌కాల్పులు ఆపించాడు. ఇద్దరిని తీసుకుని పికెట్‌ ‌లోపలికి వెళ్ళాడు. అక్కడ గూర్ఖా సోల్జర్లు, ఇద్దరు బ్రిటిష్‌ ఆఫీసర్లు ఉన్నారు. మీకేమి కావాలి అని గూర్ఖాలు అడిగారు. ‘‘అదిగో ఆ మూల నక్కిన ఇద్దరు ఇంగ్లిషువాళ్ళ ప్రాణాలు కావాలి’’ అంటూనే లెఫ్టినెంట్‌ ‌లాల్‌ ‌సింగ్‌ ఇద్దరు బ్రిటిష్‌ ఆఫీసర్లను బరిసెతో పొడిచి చంపాడు. అంతలో గూర్ఖాలు వారిమీద కాల్పులు జరిపి ఇద్దరిని చంపారు. కెప్టెన్‌ ‌సాధూ సింగ్‌ ‌తీవ్ర గాయాలతో తప్పించుకున్నాడు. ప్రీతమ్‌ ‌సింగ్‌ ‌మనుషులు పికెట్‌ ‌మీద కాల్పులు జరిపారు. పోరాటం చాలా సేపు సాగింది.

ఈ లోగా రెండో గ్రూపు సైనికులు వాచ్‌ ‌పోస్టుల మధ్య ఖాళీ గుండా ఎయిర్‌ ‌ఫీల్డ్ ‌లోపలికి చొరబడ్డారు. అక్కడ రక్షణ దళాలు ఏవీ లేవు. విమానాశ్రయం ఐఎన్‌ఎకి తేలికగానే స్వాధీన మయింది. కాని ఆశ్చర్యం! ముందుగా అనుకున్న ప్రకారం అప్పటికే జపాన్‌ ‌సేనలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఉండాలి. ఆ ప్రకారం అవి దయచేసి ఉంటే పలేల్‌ ‌విమానాశ్రయం జపాన్‌ ‌చేతికి చిక్కేది. దాన్ని దక్కించుకోగలిగితే ఇంఫాల్‌లో చిక్కుకుపోయిన బ్రిటిష్‌ ‌దళాలకు వైమానిక సహాయం అందకుండా పోయి, విజయం జపాన్‌ను వరించేది. ఏం లాభం? వస్తామన్న జపాన్‌ ‌బలగాలు జాడ లేవు. ఉన్న కొద్దిపాటి బలగంతో విమానాశ్రయాన్ని ఎక్కువసేపు తమ చేతుల్లో నిలుపుకోలేమని మనవారికి అర్థమయింది. ఆ కాస్త సమయంలోనే వారు గ్రౌండ్‌ ‌మీద ఉన్న 12 బ్రిటిష్‌ ‌విమానాలను ధ్వంసం చేయగలిగారు. వారు ఆశగా ఎదురు చూసిన జపాన్‌ ‌సోదరులయితే రాలేదు గాని తెల్లవారగానే బ్రిటిష్‌ ‌యుద్ధ విమానాలు గద్దల్లా వచ్చాయి. పలేల్‌లోని శత్రువుల శతఘ్ని దళాలూ వచ్చిపడ్డాయి. బాంబింగులు, కాల్పులు తెరపిలేకుండా జరిగాయి. గాంధీ బ్రిగేడ్‌ 250 ‌మంది సైనికులను నష్టపోయింది. ఇది మొత్తం క్యాంపెయిన్‌లో ఐఎన్‌ఎకు ఒకే చోట వాటిల్లిన అతి పెద్ద ప్రాణనష్టం. బ్రిగేడ్‌ ‌కమాండర్‌ ఇనాయత్‌ ‌కియానీ మరికొంత మందిని తీసుకుని తెల్లవారేసరికి పలేల్‌ ‌చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఐఎన్‌ఎ ఆపరేషన్‌ ‌విఫలమయింది.

[My Memories of INA And Its Netaji, Maj. Gen. Shahnawaj Khan, pp.114-116]

వస్తామన్న జపాన్‌ ‌వాళ్ళు ఎందుకు చెయ్యిచ్చారు అన్నదానికి తరవాత కాలంలో ఫుజివార చెప్పింది ఇది: జపాన్‌ ‌దుబాసీల పొరపాటు వల్ల దాడిచేయాల్సింది అసలు తేదీకి తరవాతి రోజున అని పైవాళ్ళు పొరబడ్డారట. పాపం, మరు రోజున బలగాలు బయలుదేరాయట గాని మధ్యలో శత్రువుల దాడి మూలంగా వెనక్కి తిరగాల్సి వచ్చిందట. ఆ విధంగా దిమాపూర్‌ ‌రైల్‌ ‌స్టేషను లాగే పలేల్‌ ఏరోడ్రోమ్‌ను పట్టుకోవటంలోనూ జపాన్‌ ‌వీరులు జయప్రదంగా విఫలమయ్యారు. దాంతో ఎన్ని నెలల పాటయినా ముట్టడిని తట్టుకోగలిగేలా బ్రిటిషు సైనికులకు కనీస సరఫరాలు నిరాఘాటంగా అందాయి. ముట్టడించిన వారికేమో తిండి లేక బలం క్షీణించి ఘోర పరాజయం అనివార్యమయింది.

ఆరకన్‌ ‌సెక్టారులో మీరు బ్రిటిష్‌ ‌సైన్యాన్ని అడ్డగించి మాకు తోవ ఇవ్వండి. మొత్తం 30 వేల ఐఎన్‌ఎ ‌సైనికులు ఒకేసారి చిట్టగాంగ్‌ ‌గుండా బెంగాల్‌లోకీ అస్సాంలోకీ వ్యాపించి స్వాతంత్య్ర సమరం సాగిస్తారు – అన్న నేతాజీ ఉపాయాన్ని జపాన్‌ ‌వాళ్లు స్వీకరించి ఉంటే బ్రిటిష్‌ ‌సర్కారు ఉక్కిరి బిక్కిరి అయి తెల్లతోలు వాళ్ల ప్రాణరక్షణకు వెంపర్లాడేది. ఇంఫాల్‌ ‌మీద జపాన్‌ ‌పట్టు బిగిసేది. చుట్టుముట్టి దిగ్బంధం చేయకుండా, ఇంఫాల్‌లో చిక్కుబడ్డ బ్రిటిష్‌ ‌సేనలకు పారిపోయేందుకు ఒక దారి వదలండి; ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వాన్ని అక్కడ కాలూననివ్వండి- అన్న నేతాజీ సలహా పాటించినా జపాన్‌కు శృంగభంగం కొంత మేరకు తప్పేది. పెద్దచేపను పట్టుకోబోతున్నాను చూస్తూ ఉండండని విరగబడ్డ జపాన్‌ ‌వీరుడు ముతాగుచికి తాను వలవేసింది పెద్ద మొసలికి అని – అది వల తాళ్లు తెంచుకుని బయటపడేదాకా తెలియదు.

ఇంఫాల్‌ను చుట్టిన జపాన్‌ ‌వలయాన్ని ఛేదించి బ్రిటిష్‌ ఆర్మీ మొదటి కారవాన్‌ (‌చిక్కుబడిన సైనికులకు సంతోష సూచకంగా తలా ఒక బీర్‌ ‌బాటిల్‌ని కూడా మోసుకుని) జూన్‌ 22‌న లోపలికి ప్రవేశించింది. ముట్టడి కథ ముగిసిందని మందబుద్ధులకు కూడా అర్థమయింది. సేనల బలంలో, ఆయుధాల విషయంలో, వైమానిక పాటవంలో శత్రువు ముందు తాము ఎందుకూ చాలమని అర్థమయ్యాకైనా జపానీసులు ప్రాప్తకాలజ్ఞతతో సేనలను సత్వరం వెనక్కి పిలిపించవలసింది. అలా చేస్తే తమకు నగుబాటు అని తలచి సేనానులు ఎవరికి వారు ఊరుకున్నారు. వాస్తవ పరిస్థితి పైవాళ్ళకు తెలపకుండా మాయమాటలతో మభ్యపెట్టారు. వారిమీద అనుమానం వచ్చి నమ్మకమైన మనుషులను రంగానికి పంపించి స్వయంగా వాకబు చేస్తే గాని ప్రధాని టోజోకు, నేతాజీకి పరిస్థితి చెయ్యిదాటి పోయిందని అర్థం కాలేదు. జూలై 8న గానీ సైన్యం ఉపసంహరణ ఉత్తర్వు వెలువడలేదు. ఆ లోగా పరిస్థితి విషమించింది, ఇంఫాల్‌ ‌క్యాంపెయిన్‌ ‌మొదలుపెట్టినప్పుడు జపాన్‌ ‌పక్షాన ఉన్న 2,20,000 మంది సైనికుల్లో 90,000 మంది మరణించారు. జపాన్‌, ఐఎన్‌ఎ ‌సైనికుల్లో ఎక్కువమంది చనిపోయింది చివరి పక్షం రోజుల్లోనే. యుద్ధంచేస్తూ కాదు. ఆకలి బాధతో, మలేరియా పీడతో, వర్షాల కష్టాలతో!!

 మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE