– గంటి భానుమతి
జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన
ఓ భర్తగా ఆమె దృష్టిలో బాధ్యతని నిర్వర్తించ లేకపోవచ్చు. కానీ ఓ కొడుకుగా ఈ సమయాన ఉండాలి, తను చేయాల్సినది చేస్తున్నాడు. తండ్రి ఆసుపత్రిలో ఉన్నారు. ఆపరేషన్ అయింది. ఇంటికి వచ్చారు. పేషెంట్ కోసం మంచం సెపరేటుది కొన్నారు. ఓ పనివాడిని పెట్టారు. వాడు కాస్త ఒళ్లు తుడిచి బట్టలు మారుస్తాడు. ఏదైనా తాగించాలన్నా, తినిపించాలన్నా అమ్మ, తను చేస్తున్నారు. ఇది తన డ్యూటీ. ఓ కొడుకుగా తన బాధ్యత. ఇది నెరవేర్చాలి. ఎంతవరకని పనివాళ్ల మీద ఆధారపడతారు. కొన్ని తను చెయ్యాలి. తప్పదు.
అంతలో వినోద వచ్చింది.
వాళ్లిద్దరూ మామూలుగా అయిపోయారు.
‘‘హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, బేబీని చూడడానికి డాక్టరు పర్మిషన్ వినీల తీసుకుందని. మనం కూడా వెళ్దాం. పాపని ఓసారి చూద్దాం.’’ అంటూ గదిలోకి వచ్చింది.
వాళ్లిద్దరూ ఒకళ్ల మొహాలు మరొకళ్లు చూసుకున్నారు. అలాగే అన్నట్లు విక్రాంత్ తల ఊపాడు. సుధీర ఏం అనలేదు.
అప్పటికి సాయంత్రం అవుతోంది. వీళ్లు ముగ్గురూ వెళ్లేసరికి వినీల మంచం దగ్గర ఇద్దరు ఆయాలున్నారు. ఓ సిస్టర్ కూడా ఉంది. వినీల సిస్టర్‌తో మాట్లాడుతోంది.
‘‘మా వాళ్లు వచ్చారు, వెళ్దాం.’’ అంది వినీల వీళ్లని చూసి.
తన పాప ఎలా ఉందో చూసుకోవాలన్న కోరిక, ఆతృత ఆమెలో ఎక్కువగా ఉంది.
ఆ ఇద్దరూ మంచాన్ని లాగుతూంటే మిగిలిన వాళ్లు ఆ వెనకే వెళ్లారు. గది నుంచి ఓ నాలుగు కారిడార్లు దాటి, మెయిన్ బిల్డింగ్‌కి కాస్త దూరంగా సెపరేట్‌గా ఉన్న గాజు తలుపులున్న ఇంటెన్సివ్ కేర్ నర్సరీకి వెళ్లి ఆగారు.
గాజు తలుపులు తోసుకుని లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లే ఎంట్రెన్స్‌కి ఓ పక్కన ఉన్న తెల్లటి గోడ మీద పిల్లల ఫొటోలున్నాయి. అవి అన్ని కూడా నెలల పిల్లలవి, రోజుల పిల్లలవి. ఒకటి రెండు సంవత్సరం పిల్లలవి, ప్రతీ ఫొటో కింద పాప పేరు, పుట్టినతేది, ఎన్నిరోజులో, ఎన్ని వారాలో అన్నీ రాసి ఉన్నాయి.
‘‘ఇవన్నీ మా సక్సెస్ కథలు. ఇవి ఈ యూనిట్‌లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో, ఇప్పుడు ఎలా ఉన్నారో ఆ ఫొటోలు.’’
ఒక ఫొటో కింద రాసి ఉంది- ఇరవై ఐదు వారాలు. మరో రెండేళ్లు తరవాత అదే బేబి ఫొటో. నలుగురూ ఎంతో ఆసక్తిగా ఆ రెండు ఫొటోలని చూసారు. పాప చాలా బాగుంది. పెద్ద పెద్ద కళ్లు కుంకుడు గింజల్లాంటి నల్లటి గుడ్లు.
‘‘మా పాప కూడా ఇలాగే అవుతుంది, కదా!’’ అంటూ అందరినీ చూసింది వినీల.
‘‘ఈ పాపాయి లాగే నా పాప కూడా ఇరవై ఐదు వారాలకే పుట్టింది. సరిగ్గా అన్ని నెలలే కడుపులో ఉంది. ఆ పాప లాగే మన పాప కూడా అందంగా అవుతుంది.’’
‘‘తప్పకుండా అలాగే అవుతుంది.’’ అంది వినోద.
సుధీరకి ఆశ్చర్యంగా ఉంది. పిల్లలు ఇంత చిన్నగా సరిగ్గా అరచెయ్యంత సైజులో పుడతారా!? పుట్టారు కదా తన ఎదురుగా ఉన్న ఆ ఫొటోలు సాక్ష్యం.
సుధీర ఆ ఇరవై ఐదు వారాల పాప ఫొటోని చూసింది. ఎలా పుట్టిందో పుట్టినప్పటినుంచి ఓ గాజుపెట్టెలో ఉంచారు. కడుపులో ఎలా ఉంటారో అలాంటి కండిషన్స్ చేసి పాపని ఉంచారు. అంత చిన్న పిల్లలని బతికించడానికి ఎంతటి శ్రమ తీసుకుంటున్నారు. ఆ గాజు పెట్టెలో ఉన్న పాప ఎలా బతికింది? ఒళ్లంతా వైర్లతో, ట్యూబులతో, ప్లాస్టర్లతో, బాండేజులతో ఉంది. ఆ పాప ఓ పక్కకి తిరిగి ఉంది. డాక్టర్లకి, ఆ స్టాఫ్‌కి మనసులోనే జోహార్లర్పించింది.
‘‘సరే, ఇంక బేబీని చూడడానికి లోపలికి వెళ్దాం.’’ అంటూ మంచాన్ని జరిపారు. తలుపులు తోసారు. ఒక్కసారి వేడిగా అనిపించింది. ఏదో గ్రీన్ హౌస్‌లోకి వెళ్లినట్లుగా అనిపించింది.
ఇంత వేడా, అంతా హ్యూమిడ్‌గా ఉంది. ఈ వేడిని పిల్లలెలా భరిస్తారు!? అని అంతా అనుకున్నారు.
‘‘వేడిగా ఉంది.’’ అని తనలో అనుకున్నట్టుగా పైకి అంది సుధీర.
అది నిజమే ఉక్కిపోతున్నట్టుగా అనిపిస్తోంది, అని మిగతా వాళ్లు కూడా అన్నారు.
విక్రాంత్ ఏమీ అనలేదు. మనసంతా బరువుగా ఉంది. తను నాన్న గారి దగ్గర కెళ్లి ఉండాలి. వినీల దగ్గర సుధీర ఉండదు. ఆమె కూడా ఉంటే వినోద కొంచెం రిలీఫ్. ఒకళ్లకొకళ్లు తోడుగా ఉంటారని అనుకున్నాడు. ఇల్లు వినోద చూసుకుంటూంటే వినీలని చూడ్డానికి వంతుల వారీగా ఇద్దరూ వెళ్తూంటారు, వస్తూంటారు. కానీ ఇప్పుడు సుధీర వెళ్లిపోతా నంటోంది. ఇంటికెళ్లాక వినోదకి ఏం చెప్పాలి? సుధీర ఉంటుందని అనుకున్నాను. కానీ వెళ్లిపోతా నంటోంది. ఈ విషయం ఆమెకి ఎలా చెప్పాలో తెలీడం లేదు. వెళ్లగానే దుర్గని పంపిస్తాను, అని అనొచ్చు. కాని అది చెప్పడానికి కూడా కారణాలు వెతకాలి.
‘‘థాంక్స్ అన్నయ్యా. కొత్తగా పెళ్లయిన మీకు ఏ విధమైన సరదాలు తీరడం లేదు. అది చాలదన్నట్లు, ఇప్పుడు నా కోసం కూడా తీసుకొచ్చావు. అమ్మ రావడానికి లేదు. దుర్గ రావడానికి ఓ నాలుగు రోజులు పడుతుందిట.’’ అంది వినోద.
సుధీర ఆ మాటలు విననట్లు తనని కానట్టు అటూ ఇటూ చూసింది. అంతలో ఓ నర్స్ వాళ్ల దగ్గరికి వచ్చింది.
‘‘ఎంత వేడి, ఒక్క ఐదు నిమిషాలు కూడా మేమే ఉండలేకపోతున్నాం. పాపం ఈ పసిపిల్లలెలా ఉంటారు?’’ నర్స్‌ని అడిగింది సుధీర.
అందరూ ఆమె ఏం చెప్తుందా? అని చూసారు.
‘‘అవును, ఇది వేడిగా ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలి. ఎందుకంటే, నెలలు పూర్తిగా నిండకుండానే పుట్టిన పిల్లలు, రోజుల పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవాళ్లు, బాగా బరువు తక్కువున్న పిల్లలు ఇందులో ఉంటారు. వీళ్లకి టెంపరేచర్ కంట్రోల్ ఉండదు. వెచ్చదనం ఇవ్వడం కోసం ఇలా చేస్తారు.’’ అని సిస్టర్ చెప్పి ఆగింది. ఆమె మాటల్ని నిశ్శబ్దంగా వింటున్న వాళ్లు మాటలు ఆగిపోవడంతో అంతవరకు ఒక్కసారిగా మానిటర్లు, చిన్న చిన్న మిషన్లు చేసే శబ్దాలు వినిపించాయి.
‘‘నా పాపని నేను ఒక్కసారి ముట్టుకోవచ్చా?’’
ఆ సిస్టర్ తలూపింది. వాళ్లని చేతులు శుభ్రం చేసుకుని దగ్గరికి వెళ్లమంది.
వాళ్లు లోపలికి వస్తూనే సింక్‌కి దగ్గరగానే నుంచున్నారు. అక్కడే ఉన్న యాంటి సెప్టిక్ లోషన్‌తో శుభ్రం చేసుకున్నారు.
వినీల ఎడమ చేతికి డ్రిప్ ఉండడం వల్ల ఆమె కుడి చేతిని ఎంత వీలైతే అంత శుభ్రం చేసారు.
‘‘ఇప్పుడు రండి, మీ పాపని మీకు పరిచయం చేస్తాను.’’ వినీల మంచాన్ని ఇంక్యుబేటర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఓ పలచటి తెర పాపని చూసేవాళ్లని వేరు చేస్తోంది. సుధీర కూడా చూసింది.
సుధీర ఒక్కసారి కళ్లు పెద్దగా చేసింది. నోరు తెరిచేసింది. పుట్టిన పిల్లలు చిన్నగా ఉంటారని తెలుసు, ఇందులోకి వచ్చేముందు గోడకి ఉన్న ఫొటోలో ఇలా రెండు రోజుల పాపని చూసింది. ఇప్పుడు ఎదురుగా చూస్తూంటే మరోసారి అనుకుంది. ఎంత చిన్నగా ఉందో.
పరీక్షగా చూసింది. కాళ్లూ, చేతులూ ముక్కూ, కళ్లూ అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఓ రబ్బరు బొమ్మ కున్నట్లుగా ఉన్నాయి. పాప చెయ్యి, మధ్య వేలంత ఉంది. పూర్తి అరచెయ్యంత ఉంది పాప.
గులాబీ రంగులో, అందరి లాగే అప్పుడే పుట్టిన పాపల్లాగే ఉంది. వెంటిలేటర్ ట్యూబు మూలంగా ఆ చిన్న ఛాతి పైకీ కిందకీ కదుల్తోంది. అది ఆక్సిజన్‌ని ఆమె ఊపిరితిత్తుల్లోకి సరఫరా చేస్తోంది. మధ్య మధ్య కదుల్తోంది. ఆ చిన్న కాళ్లూ, చేతులూ తన్నుకుంటు న్నాయి.
‘‘చాలా చిన్నగా ఉంది కదా?’’ అంది వినీల అందరినీ చూస్తూ.
అందరూ ఆ గులాబీ రంగు బొమ్మని ఓ అద్భతాన్ని చూస్తున్నట్లు చూస్తూండి పోయారు. చాలా చిన్నగా ఉంది. అన్ని అవయవాలు ఎక్కడికక్కడ పొందికగా తీర్చిదిద్ది నట్లున్నాయి. అలా ఎలా పుడతారో? ఈ సృష్టి నిజంగా అద్భుతం. ఈ క్రెడిట్ దేవుడికి. అలాగే ఆశ్చర్యపోతూ చూస్తోంది సుధీర.
ప్రాణం ఉంది, దాన్ని నిలబెట్టడానికి ముక్కులో ఉన్న ట్యూబు; ఛాతికి, మణికట్టుకి, పాదాలకి అమర్చిన వైర్లూ, ప్లాస్టర్లూ అన్నీ తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నాయి. ఆమె జీవించడం కోసం పోరాడుతోంది. ఈ పోరాటం ఆమెకి ఏం మిగులుస్తుంది! ఏ ఆశలతో ఈ భూమ్మీదకి వచ్చిందో! ఆ మూసుకున్న కళ్లల్లో కలల సంగతి ఏంటి? అవి ఏం అవుతాయి?
‘‘మీరు కావాలంటే పాపని ముట్టుకోవచ్చు.’’ అంటూ మంచాన్ని బాగా దగ్గరగా జరిపింది. ఇంక్యుబేటర్‌ని కాస్త కిందికి తెచ్చింది.
అందరూ వినీలనే చూస్తున్నారు. ఆమె ఊపిరి బిగపట్టి, పెదవులు బిగించి ఓ చిన్న గుండ్రటి కిటికీలా ఉన్న దాన్లోంచి తన రెండు వేళ్లని బాగా చాపి పాపాయి చేతిని పట్టుకుంది. ఓ వేలితో ఆ చిన్న చేతిని మెల్లిగా తట్టింది. బుగ్గ మీద మెల్లిగా తన చూపుడు వేలుతో నాజూకుగా రాసింది. ఏం కదలిక లేదు. అలాగే ఆ వేలుని చిన్న అరచేతిలో ఉంచింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగా ఆ పాప ఆ వేలుని పట్టుకుంది. గట్టిగా పట్టుకుంది. వినీల ఆనందంగా అందరి మొహాలు చూసింది. పాప పట్టుని, వింతగా గమనిస్తున్నారు.
వినీల గట్టిగా కళ్లు మూసుకుంది. అది సంతోషం. ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘ఈ పాప నాక్కావాలి. అక్కా, చూడు నా వేలిని ఎంత గట్టిగా పట్టుకుందో, దానికి నేను ఎవరో తెలిసింది. నేను అమ్మనని దానికి అర్థం అయి పోయింది. తల్లి స్పర్శ దానికి తెలిసిపోయింది. అది ఇన్‌స్టింక్ట్, నాకూ అంతే.’’ అంటూ సంబరంగా అందరిని చూసింది. అందరూ కూడా ఆనందంగా ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూస్తున్నారు.
‘‘నువ్వు బతకాలి, నువ్వు బతకాలి, నువ్వు మాక్కావాలి’’ అని కళ్ల నీళ్లు పెట్టుకుంది.
సుధీర తనకి తెలీకుండానే వినీల భుజాల చుట్టూ చేయి వేసింది. వినీల కొంచెం తల ఎత్తి సుధీరని చూస్తూ తన వేలు తీసుకోవడానికి ప్రయత్నించింది. వినీల వేలుని ఆ చిన్ని అరచేయి వదలడం లేదు. గట్టిగా కళ్లు మూసుకుంది.
‘‘నేను ఇలాగే ఇక్కడే ఉండిపోవడానికి అనుమతినిస్తే ఈ పక్కనే ఓ మంచం వేసుకుని ఉంటాను. ఆ ఆలోచనే ఎంత బాగుందో. కాని అది జరగని పని. ఈ ప్రపంచంలోని శక్తులన్నీ నా పాపని బతికించాలి.’’
మరోసారి హెచ్చరించడంతో అందరూ బయటికి వచ్చారు. వినీలని గదిలోకి తీసుకొచ్చారు. అంతలో వినోదకి ఫోన్ వచ్చింది. ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారని ఆమె అత్తగారు ఫోన్ చేసారు. మాట్లాడాక సెల్ లోపల పెట్టేస్తూ సుధీర వైపు తిరిగింది, వినోద. ఓ చేయి భుజం మీద వేసి, మరో చేత్తో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది.
‘‘ఏం అనుకోకు సుధీరా, ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారుట. మా అత్తగారు ఫోన్ చేసారు. ఎవరిదో పెళ్లి ఉందని చుట్టాలు బెంగళూరు వచ్చారుట. పెళ్లి అయిపోయిందిట. ఇంకో రెండు రోజులుండి ఊరు చూసి వెళ్తారుట. పైగా మా అత్తగారికి దూరపు చుట్టాలట. అందుకని ఇల్లు వెతుక్కుని మా ఇంటికి వచ్చారు. మాకు చుట్టాలంటే బెంగళూరు, మైసూరు చూడడానికి వచ్చే టూరిస్టులే. అయినా మాకు ఇది అలవాటే. సౌత్ టూర్ అంటూ వస్తారు. వాళ్లకి ఊరు చూపించాలి. అయినా బెంగళూరులో పెద్దగా చూసేందుకు ఏం లేవు. అందుకని మైసూరు, బేలూరు, హళిబేడు తీసుకెళ్లాలి. సాధారణంగా నేనే తీసుకెళ్తాను. ఇప్పుడు కష్టం. నేను కాకపోయినా టూరిజం వాళ్లకి చెప్పి ఏదో అరేంజ్ చేస్తాను.’’ అని ఆపి సుధీరని చూసింది.
‘‘సుధీరా, విక్రాంత్ వెళ్లిపోతానంటున్నాడు. నువ్వు విక్రాంత్‌తో వెళ్లకుండా ఈ సమయంలో మాకు సాయంగా ఉంటావా? చనువు తీసుకుని ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకు. కొత్తగా పెళ్లైన దానివి. ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు విక్కీతో ఆనందంగా గడపడానికి అవకాశమే లేకపోయింది. మమ్మల్నందరినీ క్షమించు. నువ్వు మా కుటుంబం లోకి వచ్చిన కొత్త సభ్యురాలివి. నిన్ను ఉండిపో అని అడగడం భావ్యం కాదు, అయినా అడుగుతున్నాను. నీకు ఇబ్బంది అనిపిస్తే నువ్వు కూడా విక్కీతో వెళ్లిపో. మీరు వెళ్లి దుర్గని పంపించండి.’’
సుధీర ఏం అంటుందోనని విక్రాంత్ ఆమెను చూసాడు.
ఆమె మాటలకి సుధీరలోని సహజమైన స్త్రీతత్వం బయటికి వచ్చింది. ఇప్పుడు హైద్రాబాదు వెళ్లి చేసేదేం లేదు.
సుధీర భర్తని చూడలేదు. వినోద చేతిలో చేయి వేసి, ఆమె భుజం నొక్కింది.
‘‘అలాగే నేనుండిపోతాను. విక్కీ ఒక్కడే వెళ్తాడు. ఇక్కడ నేనుంటాను. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్లు’’ వెంటనే అంది.
విక్రాంత్ ఆశ్చర్యంగా ఆమెని చూసాడు. ఆమె అదేం పట్టించుకోలేదు.
వెళ్లేముందు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిం చాడు కానీ ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. అయినా ఆమెకి దగ్గరగా వెళ్లి చెవిలో ‘‘థాంక్యూ సుధీరా, థాంక్యూ’’ అని గుసగుసలాడాడు. ఆమె చేయి నొక్కాడు. ఆమెలో వెంటనే విద్యుత్ సరఫరా అయింది. మొహం ఒక్కసారి ఎర్రబారింది. తల పక్కకి తిప్పుకుంది.
‘‘నేను వెళ్లి దుర్గని పంపుతాను.’’ అంటూ సుధీరని చూసాడు.
‘‘ఏమో దానికి పిల్లలున్నారు. పరీక్షల రోజులైతే దానికి కుదురుతుందో లేదో?’’ అంది వినోద.
‘‘ఫరవాలేదు వినోదా, దుర్గని ఇబ్బంది పెట్టడం ఎందుకు? మీకు సాయంగా ఇక్కడే ఉంటాను.’’ అంది సుధీర. ఆ మాటకి వినోద ఒక్కసారి సుధీరని గట్టిగా వాటేసుకుని, ఏడ్చేసింది.
‘‘ఇందుకే కుటుంబాల పరిధిని పెంచుకోవాలని మామ్మ అంటూండేది. నువ్వు మమ్మల్ని నీ వాళ్లనుకున్నావు. మాకదే చాలు. ఎలాంటి అమ్మాయి కోడలుగా వస్తుందో, ఆ వచ్చిన అమ్మాయి మాతో కలుస్తుందో లేదో అని అనుకున్నాం. మా విక్కీ ఎంపిక ఎప్పుడు తప్పు కాదు. మంచి అమ్మాయిని ఎంచుకున్నాడు.’’
విక్రాంత్ ఉలిక్కి పడ్డాడు. వెంటనే సుధీరని చూసాడు. జరుగుతున్న మాటలతో తనకేం సంబంధం లేనట్లుగా ఆమె ఎటో చూస్తోంది.
‘‘అక్కా’’ అంటూ వినోదని వినీల పిలిచింది.
ముందుకెళ్లిన వినోద వెనక్కి తిరిగింది. వినీల దగ్గరికి వెళ్లింది.
‘‘వచ్చేటప్పుడు ఏదైనా కావాలా, ఏదైనా తేవాలా?’’
‘‘నాకు ఏం అక్కర్లేదు, నేను మా ఇంటి నుంచి తెచ్చిన సూట్‌కేసు అన్నయ్యకివ్వడం మర్చిపోకు. అమ్మ ఆ మధ్య ఫోన్‌లో మరీ మరీ చెప్పింది, అది బాత్రూం పక్కన ఉన్న డ్రెసింగ్ స్పేస్‌లో పెట్టాను.’’
‘‘ఓ అదా, బాగా గుర్తు చేసావు. అది ఇస్తాను. నా దగ్గర కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ఆ పెట్టెలోనే పెట్టిస్తాను. తను ఓ బ్యాగుతోనే కదా వచ్చాడు. దీన్ని చెకిన్‌లో వెయ్యచ్చు.’’
‘‘డొమెస్టిక్‌లో ఓ పదిహేడు కిలోలే అలౌడ్ కదా, మరి ఇది అంత ఉంటుందా?’’ అని అన్నాడు విక్రాంత్.
(ఇంకా ఉంది)