– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

ఆజాద్‌ ‌హింద్‌ ‌సేన పోరాట పటిమను సొంతంగా నిరూపించుకోవటం కోసం మొట్టమొదట రంగంలోకి పంపింది సుభాస్‌ ‌బ్రిగేడ్‌ను. (ఇంఫాల్‌ ‌రంగంలో తొలినాళ్ళలో పాల్గొన్నవి వివిధ జపాన్‌ ‌సేనలకు అనుబంధితమైన ఐఎన్‌ఎ ‌స్పెషల్‌ ‌గ్రూపులు.) సుభాస్‌ ‌బ్రిగేడ్‌కు అప్పగించిన విధులు ప్రధానంగా రెండు: ఒక బెటాలియన్‌ ‌కలాడన్‌ ‌లోయలో బర్మాను తిరిగి వశం చేసుకోవటానికి కమ్ముకొస్తున్న బ్రిటిష్‌ ‌వారి వెస్ట్ ఆ‌ఫ్రికా డివిజన్‌తో పోరాడాలి; మిగతా రెండు బెటాలియన్లు చిన్‌ ‌కొండలలోని కీలకమైన దారులలో శత్రువు అడుగుపెట్టకుండా రక్షించాలి. ఐఎన్‌ఎ ‌సత్తా ఏమిటో జపాన్‌ ‌సంశయాత్ములకు తెలియజెప్పాక వాటినీ, ఫస్ట్ ‌డివిజన్లోని మిగతా రెండు రెజిమెంట్లనూ కోహిమా, ఇంఫాల్‌ ‌ముట్టడిలో నియోగించాలని, ఇంఫాల్‌ ‌వశమయ్యాక రెండవ డివిజనునూ మొహరించి భారతదేశంలోకి విజయ యాత్ర సాగించాలని నేతాజీ ఆలోచన. అవసరాన్ని బట్టి ఎటువైపు అయినా కదలటానికి మూడవ డివిజనును రిజర్వులో ఉంచాలని, యుద్ధంలో లొంగిపోయి ఆజాద్‌ ‌హింద్‌ ‌శ్రేణుల్లో కలిసే బ్రిటిష్‌ ఆర్మీలోని భారతీయ సైనికులతో ఇంకో ఐదు డివిజన్‌లు ఏర్పరచి అంతిమ యుద్ధంలో ఉపయో గించాలని ఆయన ప్రణాళిక.

ఈ వ్యూహం మొత్తానికీ కీలకం మొదటి ఫైటింగ్‌ ‌ఫోర్సు అయిన మొదటి రెజిమెంట్‌ (‌సుభాస్‌ ‌బ్రిగేడ్‌) ‌యాక్షన్‌లోకి దిగాక ఎంత బాగా పనిచేస్తుంది, కష్టాలకు, నష్టాలకు తట్టుకుని జపాన్‌ ‌సైనికులకు దీటుగా ఏ మేరకు నిలబడుతుంది – అన్నది. అందుకే అందరి కళ్ళూ ఆ రెజిమెంట్‌ ‌మీద పడ్డాయి. కలాడన్‌ ‌లోయలో వెస్ట్ ఆ‌ఫ్రికన్‌ ‌డివిజన్‌తో పోరాడవలసిన బెటాలియన్‌కు కమాండర్‌ ‌మేజర్‌ ‌పి.ఎస్‌. ‌రాతూరి. ఆయన బలగం రంగూన్‌ ‌నుంచి రైల్లో ప్రోమ్‌ ‌దాకా వెళ్ళింది. అక్కడనుంచి 100 మైళ్ళు (160 కిలో మీటర్లు) నడిచి టాంగప్‌ ‌చేరింది. అక్కడ శత్రు విమానాల దాడిలో 16 మంది సిపాయిలు మరణించారు. మళ్ళీ టాంగప్‌ ‌నుంచి ఇంకో 150 మైళ్ళు (240 కిలోమీటర్లు) మార్చింగ్‌ ‌చేసి మార్చి నాటికి క్యౌక్టాలో బెటాలియన్‌ ‌బేస్‌ ఏర్పరుచుకున్నారు.

కొద్దిరోజుల తరవాత వెస్ట్ ఆ‌ఫ్రికన్‌ ‌నీగ్రోల డివిజన్‌ ‌కలాడన్‌ ‌నది తూర్పు గట్టు వెంబడి రోడ్డు వేసుకుంటూ దక్షిణానికి సాగుతున్నట్టు సమాచారం అందింది. పడమర గట్టు వెంబడి ఇంకో రోడ్డు ఇలాగే నిర్మాణమవుతున్నది. కలాడన్‌ ‌గ్రామం వద్ద రెండు రోడ్లనూ కలిపేలా వంతెన కట్టి ఆ ప్రాంతంలో ఒక బ్రిగేడ్‌ను నెలకొల్పాలని బ్రిటిషు వారి ఎత్తుగడ. పడమటి వైపు నుంచి ఆఫ్రికన్లు రాకుండా నిలువరించే బాధ్యత మేజర్‌ ‌రాతూరి మీద పడ్డది. 300 మంది ఉన్న మూడు కంపెనీలతో రాతూరి టెట్మా చేరుకునే సరికే ఆఫ్రికన్లు పెద్ద సంఖ్యలో నది దాటి కుడి గట్టుకు వెళ్లి కొండల్లో పొజిషన్లు తీసుకుని పొంచి ఉన్నారు.

మన బలగాలు దట్టమైన వెదురు అడవులగుండా తెలివిగా చుట్టుముట్టి టెట్మా ఎగువన, దిగువన ఉన్న రెండు గ్రామాలలో చొరబడిన శత్రువులను హత మార్చాయి. ఆ ఊళ్ళను వశం చేసుకున్నాక కలాడన్‌ ‌లోయ వైపు కదులుదామని అనుకుంటూండగా – దగ్గరలోని పెద్ద కొండలో బెటాలియన్‌ ‌పరిమాణంలో శత్రు సేన మోహరించినట్టు ఉప్పందింది. రాతూరి జట్టుకు మూడేసి వందలమంది చొప్పున మూడు జట్ల క్రాక్‌ ‌ట్రూప్స్‌ను తీసుకుని రాత్రి చీకటి మాటున కొండపైకి ఎగబాకాడు. క్లోజ్‌ ‌రేంజికి వచ్చాక కమాండర్‌ ‌సిగ్నల్‌ ఇవ్వగానే మూడు జట్ల వారూ ఒకేసారి శత్రువుల ట్రెంచ్‌ల మీద హఠాత్తుగా పడ్డారు. భారత్‌ ‌మాతాకీ జై, నేతాజీకీ జై అని నినదిస్తూ మన సైనికులు శత్రువుతో బాహాబాహీ భీకరంగా పోరాడి అందిన వారిని అందినట్టు చంపారు. వారి ధాటికి, ఉగ్రతకూ తాళలేక శత్రువులు ప్రాణభయంతో పరుగు లంకించుకున్నారు. పడవలు పట్టుకుని పడమర గట్టుకు వెళ్లి అక్కడ భారీ శతఘ్నులు కలిగిన తమ ప్రధాన సేనను చేరుకోవాలని ఆరాటపడ్డారు. మనవారు వాళ్ళ వెంటపడి పడవల్లో పోతున్న వారి మీద మెషిన్‌ ‌గన్లతో కాల్పులు జరిపి 16 పడవలను ముంచారు. ఆ లోగా పడమర గట్టు నుంచి శత్రువుల శతఘ్ని దళాలు మన వారిలో 14 మందిని చంపాయి. 22 మందిని తీవ్రంగా గాయపరచాయి. తూర్పుకు చొచ్చుకు వచ్చిన శత్రువులు తెల్లవారేసరికి పడమటి గట్టుకు పలాయనమయ్యారు. ఈ సంఘర్షణలో మనవారు 250 మంది శత్రు సైనికులను హతం చేసారు. ఆయుధాలను, అమ్యూ నిషనును భారీగా పట్టుకోగలిగారు. వాటికి తోడు రుచికరమైన బోలెడు ఆహారం కూడా. శత్రువును గెలిచిన ఆనందంతో చాలా రోజుల తరవాత సైనికులు సుష్టుగా భోంచేశారు.

ఆ లోగా మనవారికి సాయంగా జపాన్‌ ‌సేనా అక్కడికి చేరుకున్నది. అందరూ కలిసి నదికి రెండు వైపులా లాఘవంగా సాగి, భీషణ సంగ్రామం తరవాత ఉత్తర దిశన రెండు ముఖ్యమైన గ్రామాలను పట్టుకోగాలిగారు. కొద్ది రోజులు సేద తీరి, నష్టపోయిన బలగాలను భర్తీ చేసుకుని మళ్ళీ కదిలారు. ఆ కాస్త విరామాన్ని కూడా మన సైనికులు ఇష్టపడలేదు. ఎందుకంటే అక్కడికి పడమరగా 40 మైళ్ళ దూరంలోనే భారత సరిహద్దు. ఎప్పుడెప్పుడు వెళ్లి అక్కడ స్వాతంత్య్ర పతాకం ఎగరేద్దామా అని వీర జవాన్ల తహతహ. ‘‘భారత భూమి మీద కాలుమోపిన వెంటనే అక్కడ త్రివర్ణ పతాకం ఎగురవేయాలని మాకు మా నేతాజీ ఆర్డర్స్! ‌రెస్టు కోసం ఆగకుండా వెంటనే అక్కడికి పోదాం పదండి’’ అంటూ వారు జపాన్‌ ఆఫీసర్లను తొందరబెట్టారు.

అక్కడికి బాగా దగ్గరలోని భారత సరిహద్దు వెంబడే ఉండే మొదాక్‌లో బ్రిటిషువారి డిఫెన్స్ ‌పోస్టును సాధ్యమైనంత త్వరగా వశ పరచుకోవాలని మేజర్‌ ‌రాతూరి నిశ్చయించాడు. అనుకున్నట్టే ఆగమేఘాల మీద అక్కడికి చేరారు. అప్పటికి మే నెల మొదలయింది. మొదాక్‌ ‌మీద మన దళాలు రాత్రివేళ మెరుపు వేగంతో దాడి చేశాయి. ఊహించని ఈ ఉపద్రవానికి శత్రు సైన్యం బిత్తరపోయింది. ఆయుధాలను, అమ్యూనిషనును, మోర్టార్లను, గోధుమపిండి, చక్కర, నెయ్యి వంటి ఆహార నిల్వలను ఎక్కడివక్కడ వదిలేసి శత్రువు ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయాడు. తరవాత ఏమైందో సుభాస్‌ ‌బ్రిగేడ్‌ ‌కమాండర్‌ ‌మేజర్‌ ‌జనరల్‌ ‌షా నవాజ్‌ ‌ఖాన్‌ ‌మాటల్లో ఆలకించండి:

భారత భూమిలోకి ఐఎన్‌ఎ ‌ప్రవేశించటం హృదయాన్ని కదిలించే కమనీయ దృశ్యం. సైనికులు నేలమీద పడుకుని తాము విముక్తి చేయవచ్చిన పవిత్ర మాతృభూమి మట్టిని పరవశంగా ముద్దాడారు. భక్తితో కళ్ళకద్దుకున్నారు. మేరలేని ఆనందోత్సాహాల నడుమ త్రివర్ణ పతాక ఆవిష్కరణ జరిగింది. తరవాత జాతీయ జెండాకు సైనిక వందనం అర్పించి, ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌జాతీయ గీతం గొంతెత్తి గర్వంగా పాడారు. ఆ గీతం ఇది:

శుభ్‌ ‌సుఖ్‌ ‌చెయిన్‌ ‌కీ బరా? బర్సే భారత్‌ ‌భాగ్‌ ‌హై జాగా

పంజాబ్‌ ‌సింద్‌ ‌గుజరాత్‌ ‌మరాఠా ద్రావిడ ఉత్కళ్‌ ‌వంగా

చంచల్‌ ‌సాగర్‌ ‌వింధ్‌ ‌హిమాలా నీల్‌ ‌జమున గంగా

తేరే నీత్‌ ‌గుణ్‌ ‌గాయే తుఝ్‌ ‌సే జీవన్‌ ‌పాయే

సబ్‌ ‌తన్‌ ‌పాయే ఆశా

సూరజ్‌ ‌బన్‌ ‌కర్‌ ‌జగ్‌ ‌పర్‌ ‌చమ్‌ ‌కే భారత్‌ ‌నామ్‌ ‌సుభగా

జైహో జైహో జైహో జయజయజయహో

భారత్‌ ‌నామ్‌ ‌సుభగా

సుబహ్‌ ‌సవేరే పౌఖ్‌ ‌పఖేరు, తేరీ హీ గుణ్‌ ‌గాయే

రస్‌ ‌భరీ భర్పూర్‌ ‌హవాయే జీవన్‌ ‌మే రుత్‌ ‌లాయే

సబ్‌ ‌మిల్‌ ‌కర్‌ ‌హింద్‌ ‌పుకారే జై ఆజాద్‌ ‌హింద్‌ ‌కే నారే

ప్యారా దేశ్‌ ‌హమారా

సూరజ్‌ ‌బన్‌ ‌కర్‌ ‌జగ్‌ ‌పర్‌ ‌చమ్‌ ‌కే భారత్‌ ‌నామ్‌ ‌సుభగా

జైహో జైహో జైహో జయజయజయహో

భారత్‌ ‌నామ్‌ ‌సుభగా

………………….

మొదాక్‌ను ఆక్రమించాక దాని చుట్టుపక్కల పలు చోట్ల అవుట్‌ ‌పోస్టులు పెట్టాము. ఆ సమయానికి రేషన్ల పరిస్థితి చాలా క్లిష్టమయింది. పలేత్వాలోని సప్లై బేస్‌ ‌నుంచి రైడర్‌ ‌బోట్లలో సరకు రవాణా అయ్యేది. అక్కడ రేయింబవళ్ళూ శత్రు విమానాల బెడద తీవ్రంగా ఉండేది. అసలే తిండికి కటకట. దానికి తోడు మౌంగ్‌ ‌డా వైపు నుంచి బ్రిటిష్‌ ‌బలగాలు భారీ స్థాయిలో ఎదురుదాడికి కమ్ము కొస్తున్నాయని కబురు. పరిస్థితిని సమీక్షించాక మొదాక్‌లోని జపనీస్‌ ‌కమాండర్‌ అక్కడి నుంచి తన సేనను ఉపసంహరించదలిచాడు. మీరూ అలాగే చేయండి అని – మేజర్‌ ‌రాతూరికి చెప్పాడు. రాతూరి తన ఆఫీసర్లను పిలిచి పరిస్థితి వివరించాడు. మనకు కుడి, ఎడమన కాపు కాస్తున్న జపాన్‌ ‌బలగాలు వెనక్కి పోతామంటున్నాయి. ఏం చేద్దాం? అని అడిగాడు.

‘‘వాళ్ళను వెళతామంటే వెళ్ళనివ్వండి. దిల్లీ వెళ్ళమని కదా మనకు ఆర్డర్స్? ‌దిల్లీ ఇంకా ముందుంది. ఒకసారి భారత గడ్డ మీద జాతీయ జెండా పాతాక దాన్ని పీక్కుని ఎలా వెనక్కి పోతాం? ఇప్పటిదాకా ఎదుటపడ్డ ప్రతిసారీ శత్రువు పీచమణచిన మనం ఇప్పుడు శత్రువుకు భయపడి వెనక్కి ఎలా పోతాం? నో సర్‌! ‌టోక్యో మన వెనక వైపు ఉన్నది కనుక జపాన్‌ ‌వాళ్ళను వెనక్కి పోనియ్యండి. మన గమ్యం దిల్లీ ఎర్రకోట. అది మనకు ముందు వైపు ఉంది. కాబట్టి వెనుతిరిగే ప్రసక్తే లేదు’’ అని ఆఫీసర్లు ఒక్క గొంతుతో అన్నారు.

రేషన్ల స్టాకును, మిలిటరీ స్థితిగతులను సమీక్షించిన మీదట జెండాను కాపు కాయటానికి కెప్టెన్‌ ‌సూరజ్‌ ‌మల్‌ ‌నాయకత్వంలో ఒక కంపెనీని మొదాక్‌లో అట్టేపెట్టి మిగతా బలగాన్ని సప్లై బేస్‌ ‌దగ్గరకు తరలించాలని మేజర్‌ ‌రాతూరి నిర్ణయించాడు. శత్రు సైన్యం విరుచుకు పడనున్నదని తెలిసి కూడా కొద్ది సంఖ్యలో నిలవటం ఆత్మహత్యతో సమానమే. ఆ సంగతి ఎరిగీ ప్రాణాలున్నంత వరకూ జాతీయ జెండా గౌరవం నిలపాలని నిశ్చలంగా నిలబడ్డ భారతీయుల దేశభక్తికి, గుండె ధైర్యానికి జపాన్‌ ‌కమాండర్‌ ‌చలించిపోయాడు. చావుబతుకుల్లో ఐఎన్‌ఎకు తోడుగా తానూ ఒక ప్లాటూన్‌ను అక్కడ ఉంచి వెళ్ళాడు. అంతేకాదు, డైరెక్టుగా కెప్టెన్‌ ‌సూరజ్‌ ‌మల్‌ ‌కమాండ్‌ ‌కింద పనిచేయమని తన ప్లాటూన్‌కు ఆదేశాలిచ్చాడు. ఒక విదేశీ ఆఫీసరు కమాండు కింద తమ ట్రూప్స్‌ను పనిచేయమనటం జపాన్‌ ‌సైనిక చరిత్రలోనే అపూర్వం.

అది ఆఫ్టరాల్‌ ఓ ‌గజం గుడ్డ; ప్రాణం కంటే విలువైనది కాదు – అని కెప్టెన్‌ ‌సూరజ్‌ ‌మల్‌ అనుకోలేదు. అతడి సహచరులూ అనుకోలేదు. వారి దృష్టిలో అది భారత జాతి పరువుకూ ప్రతిష్టకూ ప్రతీక. ఒకసారి మాతృభూమిపై జాతీయపతాకం సగర్వంగా ఎగరేశాక శత్రువుకు భయపడి దాన్ని పీక్కుని పారిపోవటం కంటే ఆత్మహత్య మేలు. జాతిగౌరవం కోసం ధైర్యంగా పోరాడి చివరి నెత్తురు బొట్టును కూడా దేశం కోసం ధారపోయాలన్నదే ప్రతి స్వాతంత్య్ర సైనికుడిలో నేతాజీ నింపిన స్ఫూర్తి. అదే తెగింపుతో సూరజ్‌ ‌మల్‌ ‌దళం సింహంలా ముందుకు దూకింది. శత్రుసేన తనను వెతుక్కుంటూ వచ్చి వేటు వేసేలోపే ఎదురుదాడి చేసి ఆజాద్‌ ‌హింద్‌ ‌సైన్యం తడాఖా చవిచూపించింది. అన్నిటికంటే ఆశ్చర్యం- మహా బలశాలి అయిన శత్రువుతో మళ్ళీ మళ్ళీ భీకరంగా పోరాడి కూడా చెక్కుచెదరక అజేయంగా నిలబడింది.

కెప్టెన్‌ ‌సూరజ్‌ ‌మల్‌ ‌దళం మొదాక్‌లో 1944 మే నుంచి సెప్టెంబరు వరకూ ఉన్నది. ఆ నాలుగు నెలల కాలంలో బ్రిటిష్‌ ‌సైన్యం దాదాపుగా ప్రతి రోజూ వారి మీద దాడి చేసింది. ఒక్కసారి కూడా శత్రువుకు భయపడి అడుగు వెనక్కి వేయలేదు. మనవారు ఎంత విక్రమంతో పోరాడారో అర్థం చేసుకోవటానికి ఒక ఉదాహరణ:

ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌లబావా వద్ద చిన్న ఔట్‌ ‌పోస్టు పెట్టింది. 20 మంది అక్కడ కాపలా కాసేవారు. ఒకరోజు ఉదయం 8 గంటలకు 150 మంది శత్రుసైనికులు ఆ చౌకీ మీద దాడి చేశారు. వారి దగ్గర శతఘ్నులు, మోర్టార్లు ఉన్నాయి. మనవారికి ఉన్నవి మెషిన్‌ ‌గన్లు, రైఫిళ్ళు! వాటికి అమ్యూనిషను కూడా చాలా మితంగా ఉన్నది. అందుకని శత్రువు దగ్గరికి వచ్చేదాకా కాల్పులు చేయకుండా ఆగి, అదాటున గుండ్లవర్షం గురి చూసి కురిపించారు. అవతలి వైపు చాలామంది పిట్టల్లా రాలిపోయారు, శత్రువు బెంబేలెత్తి వచ్చినదారిన పారిపోయాడు.

మధ్యాహ్నం మళ్ళీ దాడి. శత్రు దళం ఫిరంగులను, మోర్టార్లను విరివిగా ప్రయోగించి దట్టమైన పొగతో ఔట్‌ ‌పోస్టు చుట్టూ తెరలా కప్పేసి హఠాత్తుగా విరుచుకుపడింది. మనవాళ్ళు కంగారుపడక స్థిమితంగా ఉండి దాడిని సమర్థంగా తిప్పికొట్టారు. చౌకీ చుట్టూ శత్రువుల కళేబరాలు పడిపోయాయి. ప్రాణాలతో మిగిలినవారు పరారయ్యారు. ఆవేళ ఎలాగైనా మన చౌకీని పట్టుకోవాలని శత్రువులు పంతం పట్టారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ దానిని కాపాడుకుని తీరతామని మన సైనికులూ అంతే పట్టుదలతో ఉన్నారు.

ఆ రోజు మూడవ దాడి సాయంత్రం 5 గంటలకు మొదలైంది. ముందుగా ఫైటర్‌ ‌విమానాలు గంట సేపు చక్కర్లు కొట్టి చౌకీ మీద పెద్ద పెద్ద బాంబులు వేశాయి. తరవాత మన ట్రెంచ్‌ల మీద గురిపెట్టి మెషిన్‌ ‌గన్లతో తెరపిలేకుండా కాల్పులు జరిపాయి. సాధారణంగా ట్యాంక్‌లలో, సాయుధ సైనిక శకటాలలో వాడే 20 ఎం.ఎం. బులెట్లను అక్కడ ఉపయోగించారు. అటు తరవాత శతఘ్నులు, మోర్టార్లతో గుండ్లవర్షం. మనవైపు నుంచి ఎక్కడా అలికిడి లేదు. చౌకీ మొత్తం దాని కాపలాదారులతో సహా నాశనమయిందని శత్రువులు తలచారు. ఎదురులేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా శిథిలాలను సమీపించారు. భగవంతుడు మన పక్షాన ఉన్నాడు. ఆ మొత్తం ఆపరేషన్‌లో మనం కోల్పోయింది ఒక్క సైనికుడినే. అప్పటి వరకూ మాటువేసి నిశ్శబ్దంగా ఉన్న వారల్లా శత్రువు సమీపించగానే పాయింట్‌ ‌బ్లాంక్‌ ‌రేంజిలో కాల్పులు జరిపారు. దొరికినవారిని దొరికినట్టు చంపారు. ఊహించని ఎదురుదాడికి దిమ్మ తిరిగి, చావక మిగిలినవారు ప్రాణభయంతో పరుగుతీశారు.

అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోని మెయిన్‌ ‌క్యాంపును కమాండ్‌ ‌చేస్తున్న సూరజ్‌ ‌మల్‌ ఈ ‌లోగా 50 మందిని తీసుకుని లబావా చౌకీకి సాయంగా వెళ్ళాడు. వరసగా దాడులు జరిగినా బెంబేలుపడ కుండా అక్కడి సైనికులు గొప్ప గుండె దిటవుతో కనిపించారు. బలం పుంజుకుని మళ్ళీ దాడి చేసే లోపే శత్రువు పని పట్టాలని సూరజ్‌ ‌మల్‌ ‌నిశ్చయించాడు.

తన వెంట తెచ్చిన 50 మందితో రివ్వున వెళ్ళాడు. అక్కడికి కొన్ని మైళ్ళ దూరంలోని శత్రు స్థావరం సమీపించేసరికి చీకటి పడింది. ఎవరి కంటా పడకుండా మెల్లిగా పాకుకుంటూ వెళ్లి సూరజ్‌ ‌మల్‌ ‌దళం మెరపు దాడి చేసింది. ఆదమరచి ఉన్న శత్రువులు కకావికలై గందరగోళంలో దిక్కు తోచక తలా ఓ దిక్కుకు దౌడు తీశారు. వారి దగ్గరి ఆయుధాలు, తూటాలు, ఆహారనిల్వలు సూరజ్‌ ‌మల్‌ ‌దళం వశమయ్యాయి. ఈ దెబ్బ శత్రువులను ఎంతలా హడలగొట్టిందంటే తరవాత చాలా కాలం వరకు మనపైకి దండెత్తే సాహసం చేయలేదు.

ధైర్య సాహసాల్లో, దేశం కోసం ఆత్మార్పణ చేయటంలో భారతీయులు ప్రపంచంలో ఏ జాతికీ తీసిపోరని అర్థమయ్యాక ఐఎన్‌ఎ ‌పట్ల జపాన్‌ ‌వారి వైఖరి కాస్త మారింది. బర్మాలోని జపాన్‌ ‌సేనాధిపతి నేతాజీని కలిసి ‘‘యువర్‌ ఎక్సలెన్సీ! మీ సైనికులను మేము తక్కువ అంచనా వేశాం. మేము అనుకున్నట్టు వారు కిరాయి మనుషులు కారు. నిజమైన దేశభక్తులు.’’ అని తెగ మెచ్చుకున్నాడు.

[ INA And Its Netaji, Maj, Gen. Shah Nawaj Khan, pp. 82-85]

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE