– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‌మారుతున్న కాలమాన పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ వ్యవహారాలు అత్యంత వేగంగా కుదుపులకు లోనవుతు న్నాయి. ఇవి ఒక్కోసారి విపరిణామాలకు దారి తీస్తాయి. అందువల్ల ఒక దేశ వ్యవహారాలను మరో దేశం చక్కబెట్టాలను కోవడం సాహసం అవుతుంది. ఇతర దేశాల్లో ప్రత్యక్ష సైనిక జోక్యం, కీలుబొమ్మ సర్కార్ల ఏర్పాటు ద్వారా అక్కడి పరిస్థితులపై పట్టు సాధించాలని మరొక దేశం అను కుంటే కచ్చితంగా అది భ్రమే అవుతుంది. దీనివల్ల ఆచరణలో అనుకున్న ఫలితాలు సాధించలేక పోగా చేదు అనుభవాలను చవిచూడాల్సి వస్తుంది. ఇందుకు మరింతగా చరిత్ర లోతుల్లోకి వెళ్లక్కర్లేదు. గత నాలుగైదు దశాబ్దాల ఉదాహరణలు చాలు. మధ్య ఆసియా దేశమైన అఫ్ఘానిస్తాన్‌లో గతంలో సోవియట్‌ ‌యూనియన్‌, ‌తరవాత అగ్రరాజ్యమైన అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నాయి. ఎనిమిదో దశకం చివర్లో నాటి రాజీవ్‌ ‌గాంధీ ప్రభుత్వం శ్రీలంక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని వైఫల్యాన్ని మూటగట్టుకుంది.

తాజా పరిస్థితులకు వస్తే అఫ్ఘానిస్తాన్‌లో జోక్యం చేసుకోవడం ద్వారా అమెరికా సాధించింది ఏమిటి? ఆ దేశానికి సైనికులను పంపడం ద్వారా అనుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయి, విజయం సాధించిందా? లేక వైఫల్యాలను మూటగట్టుకుందా? అన్న విషయాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశం. ఎవరి కోణంలో వారు తమకు అనుకూలంగా విశ్లేషించుకోవడం సహజం. కానీ నిష్పక్షపాతంగా పరిశీలిస్తే అఫ్ఘాన్‌ ‌వ్యవహారంలో అమెరికా చేదు అనుభవాలను చవిచూసిందని చెప్పకతప్పదు. వినడానికి కాస్త కఠినంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం. తమ లక్ష్యమైన అంతర్జాతీయ ఉగ్రవాది, అమెరికాపై దాడులకు సూత్రధారి అయిన ఒసామా బిన్‌ ‌లాడెన్‌ ‌చంపామని, అఫ్ఘాన్‌ ‌జాతి పునర్నిర్మాణం తమ బాధ్యత కాదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ‌తన వాదనను వినిపిస్తున్నారు. అంతేతప్ప అఫ్ఘాన్‌లో విజయం సాధించామన్న మాట ఆయన నోటి నుంచి రావడం లేదు. ఇది కచ్చితంగా పలాయన వాదమే. అఫ్ఘాన్‌లో జోక్యం వల్ల సాధించింది శూన్యమన్న అభిప్రాయం అమెరికాలో, అధికార డెమొక్రటిక్‌ ‌పార్టీ అంతర్గత వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. రెండు దశాబ్దాల పోరాటం ద్వారా సాధించిన దాని కన్నా కోల్పోయిందే ఎక్కువన్న వాదన వివిధ వర్గాల నుంచి వినపడుతోంది. ఉగ్రవాదం పీచమణచాలన్న విషయంలో ఇటు అంతర్జాతీయ సమాజంలో, అటు అమెరికాలో భిన్నాభిప్రాయం లేదు. కానీ అందుకు అనుసరించిన వ్యూహంలోనే లోపం ఉందన్నది ఎక్కువ మంది అభిప్రాయం.

2001 సెప్టెంబర్‌ 11 ‌దాడులు ఒక్క అమెరికానే కాకుండా యావత్‌ అం‌తర్జాతీయ సమాజాన్ని వణికించాయి. నాడు నాలుగు విమానాలను హైజాక్‌ ‌చేసిన అల్‌ ‌కాయిదా ఉగ్రవాద సంస్థ రెండింటితో వరల్డ్ ‌ట్రేడ్‌ ‌సెంటర్‌ ‌జంట భవనాలను ఢీకొట్టింది. మరో విమానం అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌పై దాడి చేసింది. మరొక విమానం అధ్యక్ష భవనం శ్వేత సౌధం లక్ష్యంగా చేసుకున్నప్పటికి హైజాకర్లపై ప్రయాణికులు తిరగబడటంతో అది పెన్సిల్వేనియాలో కుప్పకూలింది. నాటి ఘటనలో 2,977 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో అగ్రరాజ్యం తోకతొక్కిన తాచులా బుసలు కొట్టింది. అప్పటి అధ్యక్షుడు బుష్‌ ఆ‌గ్రహోదగ్రుడయ్యారు. అల్‌ ‌కాయిదా సంస్థ అంతు చూస్తానని ప్రతిన బూనాడు. సెప్టెంబర్‌ 11‌న దాడులు జరగ్గా, వాటికి ప్రతీకారం తీర్చుకోవాలని సెప్టెంబర్‌ 18‌న పార్లమెంటు తీర్మానించింది. నెలలోపూ అంటే అక్టోబరు 7న యుద్ధ ప్రకటన చేశారు. పోరాటం కోసం తక్షణం 1300 మంది సైనికులను అఫ్ఘాన్‌ ‌తరలించారు. అమెరికా బలగాలకు ‘నాటో’ (నార్త్ అట్లాంటిక్‌ ‌ట్రీటీ ఆర్గనైజేషన్‌) ‌దళాలు తోడయ్యాయి. బరాక్‌ ఒబామా హయాంలో బలగాల సంఖ్య 1.40 లక్షలకు చేరింది. ఇందులో అమెరికా బలగాలు లక్ష కాగా, నాటో దళాలు 40 వేలు. దాడుల సూత్రధారి, అల్‌ ‌కాయిదా అధినేత ఒసామా బిన్‌ ‌లాడెన్‌ను మట్టుబెట్డడానికి పదేళ్లు పట్టింది. 2011 మే 2న పాకిస్తాన్‌లో దాక్కున్న లాడెన్‌ను అమెరికా దళాలు హతమార్చాయి. ఆ తరవాత నుంచి భద్రతా దళాలు అఫ్ఘాన్‌లో సాధించింది శూన్యం. రోజువారీ దాడులు తప్ప ఉగ్రవాద పీచమణచడంలో నిర్దిష్టంగా పైచేయి సాధించలేకపోయాయి.

 ఇక అఫ్ఘాన్‌లో పోరాటానికి అమెరికా వెచ్చించిన ఖర్చు, సైనికుల త్యాగాలు చూస్తే అమెరికన్ల హృదయం బరువెక్కక తప్పదు. అఫ్ఘాన్‌లో రెండు దశబ్దాల పోరాటానికి అగ్రరాజ్యం చేసిన వ్యయం అక్షరాలా 2.23 లక్షల కోట్ల డాలర్లని హార్వర్డ్, ‌బ్రౌన్‌ ‌యూనివర్సిటీ కాస్టస్ ఆఫ్‌ ‌వార్‌ ‌ప్రాజెక్టు అంచనా వేసింది. రక్షణ బడ్జెట్‌ ‌నుంచి 93,300 కోట్ల డాలర్లు కేటాయిస్తే అదనంగా 44,300 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. యుద్ధం కోసం విపరీతంగా అప్పులుచేసి వందల కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో చెల్లించింది. 2050 నాటికి వడ్డీతో సహా చెల్లించాల్సిన సొమ్ము 474. 30 లక్షల కోట్లు (సుమారు 6.5 ట్రిలియన్‌ ‌డాలర్లు) కానుంది. భవిష్యత్‌ ‌తరాలపై ఈ యుద్ధ భారం పడనుంది. వియత్నాం యుద్ధ వ్యయంపై సెనెట్‌ ‌రక్షణ కేటాయింపుల ఉపసంఘం 42 సార్లు ప్రస్తావించింది. అఫ్ఘాన్‌, ఇరాక్‌ ‌యుద్ధ వ్యయంపై కేవలం అయిదు సార్లే ప్రస్తావించడం గమనార్హం. సెనెట్‌ ఆర్థిక కమిటీ అయితే ఒకే ఒక్కసారి మాత్రమే చర్చించింది. అంటే వియత్నాం యుద్ధ ఖర్చులపై ఆచితూచి వ్యవహ రించిన అగ్రరాజ్యం అఫ్ఘాన్‌, ఇరాక్‌ ‌విషయంలో ఎంతమాత్రం ఆలోచించలేదు. యుద్ధాన్ని కొనసా గించడం కోసం అమెరికా అధ్యక్షులు అనివార్యంగా ప్రజలపై పన్నుల భారం మోపారు. కొరియా యుద్ధం కోసం నాటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌ 92 ‌శాతం, వియత్నాం యుద్ధం కోసం అప్పటి అమెరికా అధినేత లిండన్‌ ‌జాన్సన్‌ 77 ‌శాతం మేరకు పన్నులు పెంచారు. అఫ్ఘాన్‌ ‌తరవాత పశ్చిమాసియా దేశమైన ఇరాక్‌ ‌వ్యవహారాల్లోనూ అమెరికా తలదూర్చింది. ఉగ్రవాదం అంతం పేరుతో అక్కడికి సైన్యాన్ని పంపింది. ఇంకా కొంతమంది సైనికులు ఇరాక్‌లో ఉన్నారు.

కాస్ట్ ఆఫ్‌ ‌వార్‌ ‌ప్రాజెక్టు వివరాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ ‌నాటికి 66 వేలమంది అఫ్ఘాన్‌ ‌సైనికులు, పోలీసులు మరణించారు. దాదాపు 51,191 మంది తాలిబన్‌, ఇతర ఫైటర్లు ప్రాణాలు వదిలారు. 47,245 మంది అఫ్ఘాన్‌ ‌పౌరులు చనిపోయారు. 3846 మంది అమెరికా కాంట్రాక్టర్లు హతులయ్యారు. అమెరికా సైనికులు 2,461 మంది, నాటో మిత్ర దేశాల సైనికులు 1,144 మంది బలయ్యారు. యుద్ధ వార్తల కవరేజి కోసం వెళ్లిన 72 మంది పాత్రికేయులు ప్రాణాలు వదిలారు. అనధికార మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. లక్షల కోట్ల డాలర్ల వ్యయం, వేలమంది బలిదానాలు, రెండు దశాబ్దాల పోరాటం వల్ల అమెరికా సాధించింది ఏమిటని ప్రశ్నిచుకుంటే సరైన సమాధానం లభించడం కష్టమే. 2001లో అమెరికా దళాలు వచ్చే నాటికి అఫ్ఘాన్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఇప్పుడూ దాదాపు అలాంటి వాతావరణమే ఉంది. అప్పుడు తాలిబన్‌ ‌చక్రం తిప్పుతుండగా ఇప్పుడూ వారే అధికారంలో ఉన్నారు. నాడు ఏ తాలిబన్‌తో అయితే పోరాడారో ఇప్పుడు అదే తాలిబన్‌తో చర్చలు జరపడం నిజంగా వైచిత్రి. అప్పటికీ ఇప్పటికీ తాలిబన్‌ ‌వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అయినప్పటికీ వారితో సుదీర్ఘ కాలం కతార్‌ ‌రాజధాని దోహా నగరంలో పలుమార్లు చర్చలు జరపడం అమెరికా వైఫల్యానికి నిదర్శమని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, దౌత్యవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఒక ప్రజాస్వామ్య దేశం ఉగ్రవాద సంస్థ నేతలతో చర్చలు ఎలా జరుపుతుందన్న ప్రశ్నకు సమాధానం లభించదు. ఇది మున్ముందు దుస్సంప్రదాయానికి దారి తీస్తుంది. మొత్తానికి అఫ్ఘాన్‌లో జోక్యం ద్వారా అమెరికా చేతులు కాల్చుకుంది. అంతర్జాతీయంగా చెడ్డపేరు తెచ్చుకుంది. అభాసుపాలైంది. అఫ్ఘాన్‌లో రెండు దశాబ్దాలు పోరాడినప్పటికి లక్ష్యం సాధించలేక పోయింది. ఉగ్రవాదుల పీచమణచలేకపోగా వారితో చర్చలు జరపాల్సిన దయనీయ పరిస్థితిని కొని తెచ్చుకుంది. చైనా, రష్యాల దృష్టిలో విఫల దేశంగా ముద్రపడింది. వాస్తవానికి అఫ్ఘాన్‌ ‌నుంచి బలగాల ఉపసంహరణ అన్నది బైడెన్‌ ‌నిర్ణయం కాదు. ట్రంప్‌ ‌హయాంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమది. అధ్యక్ష ఎన్నికల సమయంలో అటు ట్రంప్‌, ఇటు బైడెన్‌ ఈ ‌విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. కానీ ఉపసంహరణ తీరు మాత్రం విమర్శలకు గురైంది. వివాదాస్పదమైంది.

 అఫ్ఘానిస్తాన్‌ ‌విషయంలో గతంలో మరో అగ్రరాజ్యమైన సోవియట్‌ ‌యూనియన్‌ (‌ప్రస్తుత రష్యా) సైతం చేతులు కాల్చుకుంది. ఏడు ఎనిమిది దశకాల్లో అఫ్ఘాన్‌లో పరిస్థితులను చక్కదిద్దే పేరుతో అడుగు పెట్టిన సోవియట్‌ ‌సేనలు చివరికి చేదు అనుభవాలతో తిరుగుముఖం పట్టాయి. అప్పటి సోవియట్‌ ‌యూనియన్‌కు అఫ్ఘాన్‌ ‌పొరుగు దేశం. అందువల్ల ఆ దేశ పరిస్థితులపై సోవియట్‌ ‌సైనికులకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ సాధించింది శూన్యం. అలాంటిది వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా ఏదో చేద్దామనుకుంటే అంతకన్నా అమాయకత్వం మరొకటి ఉండదు. సోవియట్‌ ‌యూనియన్‌ ‌చేదు అనుభవాల నేపథ్యంలో అయినా అఫ్ఘాన్‌లో జోక్యం, అనంతర పరిణామాలపై అమెరికా ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. అలా కాకుండా తన శక్తిని ఎక్కువగా ఊహించుకుని ఏకపక్షంగా ముందుకు వెళ్లడం వల్ల చావుదెబ్బ తిన్నది. భారత్‌కు కూడా గతంలో ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎనిమిదో దశకం చివర్లో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీలంకలో తమిళ టైగర్లను అంతమొందించే పేరుతో సైన్యాన్ని ఆ ద్వీప దేశానికి పంపారు. ఐపీకేఎఫ్‌ (ఇం‌డియన్‌ ‌పీస్‌ ‌కీపింగ్‌ ‌ఫోర్స్- ‌భారత శాంతిపరిరక్షక దళం) పేరుతో లంకలో అడుగు పెట్టిన సైన్యం అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. బలిదానాలు చేసింది. అయినప్పటికీ ఎల్‌టీటీఈ (లిబరేషన్‌ ‌టైగర్స్ ఆఫ్‌ ‌తమిళ ఈలం) పై పైచేయి సాధించలేక వట్టి చేతులతో వెనక్కి వచ్చింది. ఈ ఘటన చివరికి 1991లో రాజీవ్‌ ‌హత్యకు దారితీసింది. ఇదంతా సమకాలీన చరిత్ర. ఈ అనుభవాల నేపథ్యంలో ఎంత పెద్ద దేశమైనా స్థానిక పరిస్థితులను అధ్యయనం చేయకుండా, అక్కడి ప్రజల మనోభావాలను గుర్తించకుండా ఏకపక్షంగా ముందుకు వెళితే ఇబ్బందులు అనివార్యం. ఈ వాస్తవాన్ని అంతర్జాతీయ సమాజం ముఖ్యంగా పెద్ద దేశాలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అఫ్ఘాన్‌లో నాటి సోవియట్‌ ‌యూనియన్‌, ‌నేటి అమెరికా అనుభవాలు ఓ రకంగా పాకిస్తాన్‌, ‌చైనాలకు హెచ్చరిక లాంటివి. కాబూల్‌ ‌వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈ రెండు దేశాలు భావిస్తున్నాయి. బీజింగ్‌ ఆర్థికంగా అండగా ఉండాలని భావిస్తుండగా, ఇస్లామాబాద్‌ ‌తన కనుసన్నల్లో పాలన ఉండాలని తలపోస్తోంది. తాత్కాలికంగా బాగున్నప్పటికీ మున్ముందు ఈ రెండు దేశాలకు తలబొప్పి కట్టక తప్పదు. ఇది చరిత్ర చెబుతున్న చేదు నిజం. గతానుభవాల నేపథ్యంలో రష్యా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. సంయమనం ప్రదర్శిస్తోంది. నిజానికి మాస్కోకు తాలిబన్‌ అం‌టే మక్కువే. అయినప్పటికీ చైనా, పాకిస్తాన్‌ ‌మాదిరిగా అది మరీ రాసుకు పూసుకు తిరగాలని ఏమాత్రం అనుకోవడం లేదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE