సెప్టెంబర్‌ 27 ‌ప్రపంచ పర్యాటక దినోత్సవం

మానవ వికాసంలో, దేశాభివృద్ధిలో పర్యాటక రంగం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ప్రకటించి ఆ రంగాన్ని వృద్ధి చేసుకోవాలని సూచించింది. ప్రపంచంలో నగరీకరణ, పట్టణీకరణ పెరుగుతున్న కారణంగా ‘పర్యాటక రంగం’ అనే ఆలోచన వచ్చి ఉంటుందనే అపోహ చాలామందిలో కలిగి ఉంటుంది. పర్యాటకమంటే సంచారం. మనిషి  చుట్టుపక్కల ప్రదేశాలు తిరిగి అనేక విషయాలను గ్రహించాలి. భారతదేశం ప్రపంచానికే పర్యాటక స్పృహను కలిగించింది. రామాయణం, భారతం కాలాల నాటి నుండే భారతీయ జీవనశైలిలో దేశ సంచారం ప్రధానాంశంగా ఉండేది.

పర్యాటక రంగాన్ని విశ్లేషించి చూస్తే తీర్థక్షేత్రాలు, పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలు, కళాక్షేత్రాలు సందర్శనీయ ప్రదేశాలుగా విలసిల్లుతూ వచ్చాయి. అయితే ఆధునిక యుగంలో పారిశ్రామిక, సాంకేతిక ప్రాధాన్యం (Science) కలిగిన ప్రదేశాల సందర్శనను జోడించుకోవలసిన ఆవశ్యకత ఉంది. తాజాగా మెడికల్‌ ‌టూరిజం కూడా వచ్చింది. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న రంగం ఇదే. దానికి తగ్గట్టే ప్రపంచం కూడా కొత్త సౌకర్యాల కల్పనకు ఉత్సాహం చూపిస్తున్నది.ఈ పరిస్థితులలోనే ప్రపంచం తట్టుకోలేని ఉత్పాతం. అదే కరోనా.

కరోనా పర్యాటకరంగం మీద కోలుకోలేనంత దెబ్బ కొట్టింది. ఒక్క మన దేశంలోనే ఆ రంగంలోని కోటీ నలభయ్‌ ‌లక్షల మంది ఉపాధి కోల్పోయారని ఈ జూలైలోనే పార్లమెంట్‌కు మంత్రులు తెలియ చేశారు. విదేశీ మారకం కూడా విపరీతంగా పతనమైంది. పర్యాటకం తెచ్చే ఆదాయం భారత ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమే. 2019 నాటి విదేశీ మారకంతో పోల్చి చూస్తే 2020లో 76.3 శాతం తగ్గిపోయింది. పర్యాటక రంగం నష్టపోతే కనీసం మూడు నాలుగు రంగాలు చతికిల పడతాయన్న సంగతి తెలిసే ఉంటుంది. అందులో మొదటిది ఆతిథ్య రంగం. ఏటా లక్షలలో వచ్చే విదేశీ పర్యా టకులు ఇప్పుడు లేరు. లేదా భారతీయ పర్యాటకులు కూడా యాత్రలు ఆపేశారు. ఫలితం -హోటళ్లు కళ తప్పాయి.తరువాత కుదేలైన వ్యవస్థ రవాణా. అందులో మళ్లీ రోడ్డు రవాణా, రైలు, వైమానిక రంగాలు కూడా బాగా నష్టపోయాయి. ఉదాహరణకి రాజస్తాన్‌. ‌పర్యాటక రంగంతో మంచి ఆదాయం సాధించుకునే ఈ రాష్ట్రానికి కరోనా కారణంగా విదేశీ పర్యాటకులలో 60 శాతం, స్వదేశీ పర్యాటకులు 70 శాతం తగ్గిపోయారు. అన్ని ప్రధాన నగరాలలో పర్యాటకులతో హోటల్‌ ‌గదులకు వచ్చే ఆదాయం 29 శాతం నష్టం వచ్చింది. ఇంకా పర్యాటక స్థలాలలో, పుణ్యక్షేత్రాలలో రకరకాల వ్యాపారాలు చేసుకునే వారు కూడా నష్టపోయారు. ఇది భారత్‌కే పరిమితం కాలేదు. వరల్డ్ ‌ట్రావెల్‌ అం‌డ్‌ ‌టూరిజం కౌన్సిల్‌ అం‌చనా ప్రకారం 2020 మే నాటికి 185 దేశాలకు కొవిడ్‌ ‌వ్యాపించింది. ఈ పరిస్థితి పర్యాటక రంగం మీద దారుణంగానే ఉంది. ఈ దేశాలలో పర్యాటక రంగానికి సంబంధించి భారత్‌కు మూడో స్థానం ఉంది. పర్యాటక రంగం, సేవారంగం కలసి ఆర్థిక వ్యవస్థకు చేదోడువాదోడుగా నిలుస్తున్న కాలంలో కరోనా వచ్చి కుంగదీసింది.

పర్యాటకాంశం గురించి మహాభారతంలో విస్పృతంగా తెలిపారు. పులస్త్య ప్రజాపతి భీష్మునకు; నారదుడు పాండవులకు పృథ్వీ సంచారం వలన కలిగే ప్రయోజనాలను గురించి చెప్పారు. పులస్త్యుడు 350 పుణ్యక్షేత్రాలను గురించి చెప్పారు. యజ్ఞ యాగాదుల వల్ల కలిగే పుణ్యం కంటే తీర్థ పుణ్య క్షేత్రాల సందర్శనం వల్ల కలిగే పుణ్యం ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. దీనినిబట్టి భారతీయ జీవనశైలిలో పర్యాటకాంశానికి ఎంత ప్రాధాన్యం ఉందో గమనించవచ్చు.

భారతదేశం భిన్నసంస్కృతుల నిలయం. వివిధ రకాల వాతావరణ పరిస్థితులు, భాషలు, ఆచార సంప్రదాయాలు, ఆర్థిక స్థితిగతులు కలిగిన దేశం. దేశ సంచారం వలన భాషాపరిజ్ఞానం, ఏకాత్మతా భావన, సమైక్యభావంతో పాటు మానవ సంబంధాలు మెరుగుపడతాయి. దేశంలోని చారిత్రక కట్టడాలు, శిల్పకళ, చిత్రకళా విశేషాలను గమనిస్తున్నప్పుడు చరిత్ర అవగాహనతో పాటు తమ దేశ ప్రాచీన కళావైభవంపట్ల గర్వం కలుగుతుంది. స్వాభిమానం, దేశభక్తి పెంపొందుతుంది. పర్యాటకులనాదరిస్తూ జీవించే ప్రజల పట్ల సోదరభావన కలుగుతుంది.

పర్యాటక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఆధార భూతం. చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది కుటుంబాలు ఆయా ప్రదేశాల్లో జీవిస్తున్నాయి. పర్యాటకుల సందర్శనం వల్ల వారందరికీ జీవనోపాధి లభిస్తుంటుంది. డోలీ కట్టేవాడి నుండి వసతినిచ్చే వాడి వరకు అందరి జీవనోపాధి పర్యాటకుల మీద ఆధారపడే ఉంటుంది. ప్రభుత్వ రవాణాశాఖకు కూడా ఎంతో రాబడి ఉంటుంది. ఆ శాఖ ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది. ముఖ్యంగా యువత Educational Tours, Industrial Tours పేరుతో ఆయా ప్రదేశాలను సందర్శించడం వలన బహువిధ ప్రయోజనాలు చేకూరుతాయి. భారతదేశం ఆధ్యాత్మిక భూమి. చిత్తశుద్ధితో దేశ సంచారం, సందర్శన చేస్తే అసూయా ద్వేషాలకతీతులవుతారు. సమాజంలో శాంతి నెలకొంటుంది.

ప్రపంచ దేశాలు పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. వారిది కేవలం ఆర్థిక దృష్టి. మనది సమగ్రమైన దృష్టి. ధార్మిక, వైజ్ఞానిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, మానవీయ దృష్టికోణం కలిగి ఉంది. విదేశీయులను కూడా ఆకట్టుకునేలా ఆకర్షణీ యంగా రూపొందిస్తూ పర్యాటక ప్రదేశాలకు ప్రాధాన్యతనీయాలి. నేడు కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రాధాన్యత నిస్తున్నట్లే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ బాటలో నడవాలి. భారతీయులు కూడా దేశ పర్యటనను తిరిగి తమ స్వభావంగా మార్చుకోగల గాలి. అన్నిటి కంటే కరోనా పూర్తిగా తొలగివపోయి మళ్లీ పర్యాటక రంగానికి పూర్వ వైభవం రావాలని కోరుకోవాలి. అందుకు ప్రపంచ దేశాలన్నీ కలసికట్టుగా ప్రత్యేక రాయితీలు, సదుపాయాలు కల్పించాలి. మరింత వేగంగా పుంజుకునేందుకు దోహదపడాలి.

– డా।। అన్నదానం వెం.సుబ్రహ్మణ్యం

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రాంత సహకార్యవాహ, తెలంగాణ

About Author

By editor

Twitter
YOUTUBE