అక్రమంగా తరలిస్తున్న గోవులను రక్షించే పని ఎలా ఉంటుంది?
ఆవుని రక్షిస్తున్నామన్న పేరుతో అవతలి మతం వారిని చంపేస్తారా? అంటూ గొంతు చించుకునే వారు, ఆవుల రక్షించే పనిలో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నవారూ కూడా ఉన్నారని తెలుసుకోవాలి. గోరక్షణలో జరిగిన ఘర్షణలో చనిపోయినవారి కంటే, పోలీసులు, మతోన్మాదుల చేతులలో మరణించిన గోరక్షకులే ఎక్కువ కూడా.
ఘట్‌కేసర్, చౌటుప్పల్, శంషాబాద్, మేడ్చల్, శ్రీశైలం రోడ్ల నుంచి హైదరాబాద్ నగరంలోని కసాయి కేంద్రాలకి గోసంతతితో వాహనాలు వస్తాయి. ఇదంతా ఎక్కువగా రాత్రివేళల్లోనే జరుగుతుంది. ఇలాంటి వాహనాల సమాచారం తెలిసినప్పుడు గోరక్షాదళ్ కదులుతుంది. గోవులు తరలిస్తున్న ఆ పెద్ద వాహనానికి ముందూ, వెనకా కార్లు ఉంటాయి. అందులో మారణాయుధాలతో కాపలా కోసం మనుషులు ఉంటారు. గోరక్షకులు చెట్లచాటున, పుట్ల చాటున దాగి పోలీసులకు సమాచారం అందిస్తారు. ఆపై బయటపడి వాహనాన్ని ఆపుతారు. ఇదంతా ప్రాణాలకు తెగించి చేసేపని. ఎందుకంటే, గోసంతతి అక్రమ రవాణా అంతా మాఫియా స్థాయిలో జరుగుతున్నదని అంటారు గోరక్షాదళ్ తెలంగాణ వ్యవస్థాపకుడు కోటి శ్రీధర్. ఆయన ప్రస్తుతం నాలుగు కేసులు ఎదుర్కొంటున్నారు. పహాడీ షరీఫ్ పోలీసులు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకుండా నిషేధం విధించారు. గోరక్షాదళ్ ప్రస్తుత అధ్యక్షులు కాలూసింగ్. మరొక క్రియాశీలక కార్యకర్త దీపక్‌సింగ్. కాలూసింగ్ మీద 23 కేసులు ఉన్నాయి. పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అత్తాపూర్‌లో మరొక ప్రముఖ గోరక్షకులు పంకజ్ అగర్వాల్, అంతరం నరేష్. ఇదంతా ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నది.
చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణా దారులకే పరోక్షంగా మద్దతు ఇస్తూ, తిరిగి మాపైనే కేసులు పెడుతున్నదని అంటున్నారు శ్రీధర్. గోవులను తరలిస్తున్న వాహనాలతో పాటు, ఈ వాహనాలకు సాయంగా వస్తున్న చిన్న వాహనాలను తనిఖీ చేస్తే అసలు కుట్ర తెలుస్తుందని గోరక్షకుల వాదన. అందులో ఆయుధాలు ఉంటాయి. కానీ తరలిపోతున్న గోవులను ఆపినందుకు ఒక్కొక్కసారి దారి దోపిడీగా కూడా పోలీసులు, మతోన్మాదులు చిత్రించిన సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ గోరక్షకుల కేసులో ఒవైసీ కలగచేసుకుంటే మరీ ఉచ్చు బిగిస్తుంటారని చాలామంది గోరక్షకులు అభిప్రాపడుతున్నారు. ఇంకా చిత్రం ఒవైసీ చొరబడితే ఏమీ చేయలేమని పోలీసులే చెప్పేస్తారు.బక్రీద్ సమయంలో అసలు ఏ పోలీసు అధికారి విధులు నిర్వహించకుండా కట్టడి చేస్తారు. మాట వినకుంటే బదలీయే. గోరక్షకులకు గోజ్ఞాన్ ఫౌండేషన్ మద్దతు కూడా ఉంది. వీరందరికి సంబంధించిన కేసులను ఆ సంస్థ చూసుకుంటుంది. ఇందులో మేనకా గాంధీ సభ్యురాలు. హైదరాబాద్ లేదా తెలంగాణలోనే కాదు, గోరక్షణ కోసం ఆంధప్రదేశ్‌లో పనిచేస్తున్నవారికి కూడా పోలీసు వేధింపులు తప్పడం లేదు. ఇందుకు ఉదాహరణ శ్రీకాకుళం జిల్లా బారువకు చెందిన ఆదిలక్ష్మి. ఆమె అక్కడ చిలుకూరు బాలాజీ గోశాలను నిర్వహిస్తున్నారు. రాత్రివేళ పోలీసులు వస్తే, ఆమె మరుగుదొడ్డిలో దాగి కలెక్టర్‌కు ఫోన్ చేసి మొత్తుకుంటూ ఉంటారు.
అక్రమ రవాణా సమాచారం తెలిసిన తరువాత గోరక్షాదళ్ సభ్యులు100 నెంబర్‌కు సమాచారం ఇస్తారు. ఒక్కొక్క వాహనంలో 30 నుంచి 40 వరకు ఆవులూ, ఎద్దులూ ఉంటాయి. కంటైనర్‌లలో అయితే 60 నుంచి 70 వరకు ఉంటాయి. ప్రతి చిన్నదానికి ఎన్‌కౌంటర్లు చేసే పోలీసులు ఇంత పెద్ద ఎత్తున చట్ట విరుద్ధంగా గోసంతతిని అక్రమంగా రవాణా చేసే వారిని, గోవుల పట్ల కర్కశంగా ఉండేవారిని ఎందుకు ఎన్‌కౌంటర్ చేయరని శ్రీధర్ ఆవేశంగానే అడుగుతున్నారు. ఆఖరికి గోరక్షకులను పోలీసులు థర్డ్ డిగ్రీకి గురిచేసిన సందర్భాలు కూడా ఎక్కువే ఉన్నాయి. కాలూ సింగ్‌పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. గోజ్ఞాన్ ఫౌండేషన్‌తో పాటు బజ్రంగ్‌దళ్ కార్యకర్తలు కూడా గోరక్షణలో తమవంతుగా సహకరిస్తారు.
ఒక్కప్పుడు గోరక్షణకు కార్యకర్తలు బాగానే వచ్చేవారు. నాయకులు కూడా అలా గోరక్షణకు ముందుకు వచ్చిన యువకుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారి అనుమతితోనే తీసుకువెళతారు. కానీ ఒకసారి అరెస్టయినవారు మళ్లీ రావడానికి వెనకాడుతున్నారు. కేసు పెడితే ఇక చేసేదేం లేదు. ఒకరకంగా గోరక్షణ పనిలో ఉన్నవారు దారుణమైన అణచివేతకు గురౌతున్నారు. కానీ ఇవేమీ పత్రికలలో వెలువడవు.
గోరక్షాదళ్ అఖిల భారత సంస్థ. 36 ఏళ్ల క్రితం స్థాపించారు. తెలంగాణతో పాటు, ఆంధ్ర, ఒడిశాలలో కూడా చురుకుగా పనిచేస్తున్నది. ఇంతవరకు రెండు లక్షల ఆవులను కసాయి కేంద్రాలకు పోకుండా దళ్ కార్యకర్తలు రక్షించారు. ఈ కాలంలోనే ఈ సంస్థ దాదాపు 200 మంది కార్యకర్తలను పోగొట్టుకున్నది. దీనికి కేంద్ర నాయకుడు సతీశశర్మ. పంజాబ్‌కు చెందినవారు. ఈయనను మూడేళ్ల పాటు ఎలాంటి విచారణ లేకుండా జైలులో ఉంచారు. కర్ణాటక, తమిళనాడులలో కూడా ఈ సంస్థ కార్యకర్తలను పోగొట్టుకున్నదని శ్రీధర్ చెబుతున్నారు. అయితే గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నవారి మీద గోరక్షకులు చేసిన దాడులే వార్తాపత్రికలలో వస్తాయి గానీ, గోరక్షాదళ్ కార్యకర్తల మరణాల గురించి రావని శ్రీధర్ చెప్పారు.
ఒకసారి పటిష్ట సమాచారం మేరకు ఒక కంటైనర్‌ను పట్టుకున్నారు. అందులో 74 గోవులు ఉన్నాయి. గోరక్షకులు ఆపే సమయానికి అందులో 13 చనిపోయాయి. వాటిని చూస్తే దు:ఖం వచ్చిందని చెప్పారు శ్రీధర్. గోవుల తరలింపు పద్ధతిలో దయాదాక్షిణ్యాలు ఉండవు. నిజంగానే ఆవుకు ఉన్న గ్రహణ శక్తి అమోఘమని అంటారాయన. తమ రక్షణ కోసం దగ్గరలోనే ఎవరో ఉన్నారన్నట్టే అవి ప్రవర్తిస్తాయనీ, వాహనం అపి, బయటకు దింపుతుంటే, తమ భవిష్యత్తు ఎలాంటి ఆపద నుంచి సురక్షితంగా బయటపడిందోనన్నట్టే దూకి వస్తాయని చెప్పారు.
చాలామంది పీఠాధిపతులు, నాయకులు టీవీ చానళ్లలో చర్చలకీ, వార్తాపత్రికలలో ప్రకటనలకీ పరిమితం కావడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదని శ్రీధర్ అంటున్నారు. అలాగే గోవుకు పూజ చేసి మేం ధర్మానికి చాలా చేశామని అనుకున్నా గోరక్షణ పని పూర్తయినట్టు కాదని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వ సాయం లేదు. అలాగే దాతలు కూడా ప్రఖ్యాతి ఉన్న గోశాలలకు, పీఠాలకు మాత్రమే మళ్లీ మళ్లీ విరాళాలు ఇస్తున్నారని, ఇది సరికాదని శ్రీధర్ అభిప్రాయం. విరాళాలు తీసుకున్న చాలా పెద్ద పెద్ద సంస్థలు ఆ డబ్బును డిపాజిట్ చేసి చాయ్ పైసలే ఖర్చు చేస్తున్నారని ఆయన చెబుతున్నారు. ఆవుల రద్దీ ఎక్కువయినప్పుడు వాటిని తీసుకోమని కోరినా ఆయా పీఠాలు ముందుకు రాకపోవడం విచారకరమని కూడా శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మిగిలిన రాష్ట్రాలలో వలే కనీస సాయం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదు. అక్కడ గోశాలలకు ఒక పశు వైద్యుడిని ఆవుల కోసం నియమించే పద్ధతి ఉంది. గోరక్షణ గోశాలలకే పరిమితమని భావించవద్దని శ్రీధర్ కోరుతున్నారు. నిత్యమూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ గోశాలలు నడుస్తున్నాయి. కరోనా సమయంలో, వాహనాలు లేకపోవడంతో, గ్రాసం తీసుకురావడానికి గోశాలల వారు పడిన ఇక్కట్లు అసాధారణమైనవని చెప్పారు. ఇప్పటికీ గడ్డి సేకరణ సమస్యగానే ఉందని ఆయన అన్నారు. అత్తాపూర్ గోశాల వ్యయం నెలకు దాదాపు రూ. 8,00,000. పాలు అమ్మగా రూ. 2,00,000 వస్తాయి. మిగిలినదంతా విరాళాల రూపంలోనే రావాలి. విశాఖ శారదాపీఠం అండ కూడా ఉంటుందని ఆయన చెప్పారు.
నవంబర్ 7న గోరక్షాదళ్, భారతీయ గోక్రాంతిమంచ్ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ధర్ణా తలపెట్టింది. నవంబర్ 7వ తేదీనే ఎందుకంటే, 1966లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గోరక్షణ కోసం ఆందోళన చేస్తున్న సాధువుల మీద కాల్పులు జరిపించారు. ఇలాంటి ధర్ణా దేశ చరిత్రలోనే మొదటిసారి జరుగుతున్నది. కోటిన్నరమంది వస్తారని అంచనా. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, రక్షణ కల్పించాలని ఈ మహా సమ్మేళనంలో జనం కోరబోతున్నారు. ఈ దేశంలో ధర్మరక్షణ పెద్ద సమస్యగా మారిపోయింది. తమిళనాడు వంటి చోట మరింత ప్రమాదకరంగా పరిణమించింది. అయినా ప్రాణాలకు తెగించి పోరాడే శక్తి ఇప్పటికీ ఉన్నదంటే అందుకు శ్రీకృష్ణభగవానుడి కృపే కారణమని శ్రీధర్ అంటారు.