నిన్నటి దాకా కరోనా భయపెడితే ఇప్పుడు నిఫా ఆందోళనకు గురి చేస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న కేరళలో ఇప్పుడు నిఫా కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒక బాలుడు ఈ వైరస్ లక్షణాలతో మరణించాడు. నిఫా వైరస్‌కు ఇప్పటి వరకూ ఎలాంటి ఔషధం లేదు. అటు కరోనా అయినా, ఇటు నిఫా అయినా సకాలంలో గుర్తించి అడ్డుకోవడంలో కేరళ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టంగా తెలిసిపోతోంది.
భారతదేశంలో రెండోదశ కరోనా దాదాపుగా అదుపులోకి వచ్చింది. అయినా రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య ఇంకా వేలల్లోనే నమోదవుతోంది. వీటి సంఖ్యను గమనించినట్లయితే మూడోవంతు కేసులు కేరళ రాష్ట్రం నుంచే కనిపిస్తాయి. సెప్టెంబర్ 13 నాటి సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో 27,254 కొత్త పాజిటివ్ కేసులు నమోదైతే; ఒక్క కేరళలోనే 20,240 వెలుగు చూశాయి. ఇతర రాష్ట్రాల్లో మాత్రం వేయి, వందలోపు కనిపిస్తున్నాయి. నెలరోజుల క్రితం వరకూ పరిస్థితులు భయంకరంగా కనిపించిన మహారాష్ట్రలో తాజా కేసులు 3,623, తమిళనాడులో 1,608, కర్ణాటకలో 803, ఆంధప్రదేశ్‌లో 1,990, తెలంగాణలో 249, ఉత్తరప్రదేశ్‌లో 21, ఢిల్లీలో 22, హర్యానాలో అయితే 5 కేసులు మాత్రమే నమోదయ్యాయి. (సెప్టెంబర్ 13 నాటి గణాంకాలు) ఈ సమాచారం ఆధారంగా కేరళ ఎంత ప్రమాదం అంచున ఉందో తెలుస్తోంది.
కరోనా కట్టడిలో యావద్దేశానికే కాదు, ప్రపంచానికే తాము ఆదర్శమని కేరళ వామపక్ష ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న కేకే శైలజ కరోనా నియంత్రణలో చాలా అద్భుతంగా పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. అయితే రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం ఆమెను పక్కన పెట్టి వీణా జార్జికి ఆరోగ్యశాఖ కట్టబెట్టడం విమర్శలకు దారి తీసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా నియంత్రణలో కేరళ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా రంజాన్ సమయంలో విజయన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉన్నా లెక్కచేయడంగా సంతుష్టీకరణకే పెద్దపీట వేసి ఆంక్షలను సడలించింది. దీంతో అక్కడి పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి. కేరళ నుంచి పొంచి ఉన్న ముప్పును గుర్తించిన కర్ణాటక ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సరిహద్దులను మూసేసింది. ఆ రాష్ట్రం నుంచి వచ్చేవారికి కఠిన క్వారంటైన్ నిబంధనలు అమలవుతున్నాయి. పరిస్థితి ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ పాజిటివిటీ రేటు తక్కువగా ఉందనే సాకుతో గతవారం కేరళ సర్కారు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసింది. ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచున ఉన్నా పినరయి ప్రభుత్వానికి పట్టింపు లేదని అర్థమవుతోంది.
నిఫాతో ఉక్కిరిబిక్కిరి
సెప్టెంబర్ 8వ తేదీన కోజికోడ్‌లో 12 ఏళ్ల బాలుని మరణంతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అప్పటికే ఆ బాలునికి ప్రమాదకరమైన నిఫా వైరస్ సోకినట్లు గుర్తించారు. మరో ఇద్దరు ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో నిఫా లక్షణాలు గుర్తించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ముందుజాగ్రత్త చర్యగా బాలుడు నివాసమున్న ప్రాంతంలో మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశించారు. అసలే కరోనా తీవ్రతతో అష్టకష్టాలు పడుతున్న కేరళను ఇప్పుడు నిఫా నిలువునా వణికిస్తోంది. పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లైంది. ఏకకాలంలో రెండు వైరస్‌లతో పోరాడాల్సి వస్తోంది. ఇప్పటికే కేరళలో 20 దాకా నిఫా వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించ డంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది. వాస్తవానికి నిఫా వైరస్ కేరళకు కొత్త కాదు.
కేరళలో 2018 జూన్‌లో తొలిసారి నిఫా వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్పట్లో మొత్తం 18 కేసులు నిర్ధారణ కాగా 17 మంది చనిపోయారు. అదే నెలలో వైరస్ కట్టడి చేసినట్లు ప్రకటించారు. కానీ, 2019లో మళ్లీ నిఫా వైరస్ కేసు ఒకటి బయపడింది. అయితే ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. తాజాగా మరోసారి బయటపడగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు దేశంలో ఐదోసారి నిఫా వెలుగు చూడగా.. కేరళలోనే మూడుసార్లు బయటపడింది.
కొవిడ్‌తో పోలిస్తే నిఫా వైరస్ అత్యంత ప్రమాదకరమైనది. కాకపోతే ఇది వేగంగా వ్యాపించకపోవడం ఒక్కటే ఊరటనిచ్చే అంశం. గ్లోబల్ వైరస్ నెట్‌వర్క్ ప్రకారం నిఫా వైరస్ ఆర్ నాట్ 0.43. అంటే 100 మంది నిఫా వైరస్ బాధితుల నుంచి కేవలం మరో 43 మందికే వ్యాధి వ్యాపిస్తుందన్నమాట. కాని వ్యాధిసోకిన వారిలో 45శాతం నుంచి 70శాతం మంది మరణిస్తున్నారు. నిఫా వైరస్ జంతువుల నుంచి నేరుగా మనుషులకు సోకుతుందని తేలింది. దీనిని జునోటిక్ వ్యాధి అంటారు. కరోనా మాదిరిగానే ఇది కూడా గబ్బిలాల నుంచి వ్యాపించిందేనని వైద్యులు గుర్తించారు. అయితే వీటి లక్షణాలు, రోగి ఆరోగ్య సమస్యలు భిన్నంగా ఉంటాయి.
నిఫా వైరస్‌ను ఇప్పటికే పలు దేశాల్లో కనుగొన్నారు. మలేసియా, సింగపూర్, బంగ్లాదేశ్‌ల్లో ఇది మనుషులకు సోకింది. అదే సమయంలో కాంబోడియా, ఇండోనేసియా, మడగాస్కర్, థాయ్‌లాండ్, తిమోర్ వంటి దేశాల్లోని గబ్బిలాల్లో ఈ వైరస్ జాడ బయటపడింది. నిఫా వైరస్‌ను తొలిసారిగా 1999లో మలేసియాలో గుర్తించారు. అక్కడి సున్‌గాయ్ నిఫా గ్రామం పేరును దీనికి పెట్టారు. నిఫా వైరస్ సోకే జంతువుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్స్‌లో ఇవి సహజంగానే ఉంటాయి. వాటిపై ఎటువంటి ప్రభావం చూపించ లేవు.
కరోనా వైరస్‌కు అతి కొద్ది సమయంలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 1999లో వెలుగులోకి వచ్చిన నిఫా వైరస్‌కు ఇప్పటి వరకు ఎటువంటి అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకా తయారీ ప్రాధ్యాన్యాల బ్లూప్రింట్‌లో నిఫా వైరస్ కూడా ఉంది. నిఫా వ్యాప్తి కేవలం స్థానికంగా పరిమితం కావడంతో దీని టీకాలపై పెద్దగా దృష్టిపెట్టలేదు. ల్యాబ్‌లో నిఫా వైరస్‌పై రిబావిరిన్ డ్రగ్ కొంతమేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు.
నిఫా సోకిన రోగిని వేరుగా ఉంచుతున్నారు. తగినంత నీరు అందిస్తారు. దీంతోపాటు రోగి లక్షణాలకు మాత్రమే చికిత్స చేస్తున్నారు. మోనోక్లోనల్ యాంటీ బాడీస్ చికిత్స విధానం వినియోగించడంపై పరిశీలిస్తున్నారు. నిఫాపై వాడేందుకు పలు యాంటీవైరల్ డ్రగ్స్‌ను సీఈపీఐ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. కానీ, అవి జంతువుల్లో మాత్రమే మంచి ఫలితాలను చూపించాయి.
నిఫా వైరస్‌లో రోగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరిలో లక్షణాలు కూడా కనిపించవు. మరికొందరిలో మాత్రం తీవ్ర శ్వాస ఇబ్బందులు, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. తొలుత జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత రోగి పరధ్యానంగా ఉండటం, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెదడు దెబ్బతినడం, న్యుమోనియా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలా రోగి 24 గంటల నుంచి 48 గంటల్లో కోమాలోకి చేరుకుంటాడు. మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు. రోగి నుంచి వెలువడే స్రావాల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుంచి వచ్చే స్రావాల్లో వైరస్ ఉంటుంది.
వ్యాధి నిర్ధారణ, అడ్డుకోవడం ఎలా?
నిఫా వైరస్‌ను గుర్తించడానికి ఆర్టీపీసీఆర్ పరీక్షను నిర్వహిస్తారు. దీంతోపాటు పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పరీక్షలో కూడా కచ్చితమైన సమాచారం తెలుస్తుంది. ఈ పరీక్షలో అత్యంత సున్నితమైన మార్పులను గుర్తించే అవకాశం ఉంది. పీసీఆర్ పరీక్షకు ప్రాధాన్యమిస్తారు. నిఫా వైరస్ విషయంలో కూడా కరోనా వలె కాంటాక్ట్ ట్రేసింగ్, క్వారంటైన్, ఐసోలేషన్ వంటి చర్యలు తీసుకొంటారు.
నిఫాకు ఇప్పటివరకూ ఎలాంటి వైద్యం లేనందున ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడం మాత్రమే పరిష్కారం. చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. ఈ వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి. నిఫా వల్ల మరణించిన వారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది.
– క్రాంతి, సీనియర్ జర్నలిస్ట్