తెలంగాణ ధనిక రాష్ట్రమని చెబుతున్న ప్రభుత్వానికి కష్టాలు మొదలయ్యాయి. ప్రధానంగా సర్కారు ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు కోసం నిధులు సరిపోవడం లేదు.  నిజంగానే ఆవిర్భావ సమయానికి తెలంగాణ ధనిక రాష్ట్రం. మిగులు బడ్జెట్‌ అధికంగా ఉన్న రాష్ట్రం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వం దాదాపు చేతులెత్తేయాల్సిన దుస్థితి దాపురించింది. ఒకప్పుడు దాదాపుగా రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని జిల్లాలను పోషిం చిన హైదరాబాద్‌ ఆదాయం తెలంగాణకు వరమనుకున్నారు. కానీ, ఏడేళ్లకే రాష్ట్ర ఖజానా ఖాళీ అయి.. బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

రాజకీయ అవసరాల కోసం, ఇబ్బడిముబ్బడిగా ప్రవేశపెడుతున్న పథకాల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఆదాయ మార్గాల కోసం కూడా పెద్దగానే కసరత్తులు చేస్తోంది. ముందు హుజురాబాద్‌ ఉపఎన్నిక పొంచి ఉన్న నేపథ్యంలో ఎక్కడా వ్యతిరేకత ఎదురుకాకుండా ఏం చేస్తే ఆదాయం అధికంగా సమకూరుతుందో అన్న అంశాలపై విశ్లేషిస్తోంది. అందులో భాగంగానే మరోసారి ఛార్జీలు పెంచడం, లేదంటే భూముల అమ్మకాలు సాగించడం వంటివి ఎంచుకుంది. ఛార్జీలు పెంచితే ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. అయితే, ఇందులోనూ ఓ ట్విస్ట్‌తో జనాన్ని బురిడీ కొట్టించింది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. ప్రత్యక్ష పన్నులతో ముప్పు తప్పదనే ముందుచూపుతో నొప్పి తెలియకుండా స్టాంపు డ్యూటీ ధరలు, రిజిస్ట్రేషన్‌ ‌టారిఫ్‌ను పెంచింది. హుటాహుటిన నిర్ణయం తీసుకొని వెంటనే ఆదేశాలు జారీచేసింది. కొన్ని వర్గాలకే దీని ప్రభావం పడుతున్నా.. మరీ నేరుగా ప్రభావం చూపే అవకాశం లేదు. దీంతో, చాపకింద నీరులా ఈ పని కానిచ్చేసింది.

ఇక.. భూముల అమ్మకాల విషయానికి వస్తే.. ఇప్పటికిప్పుడైతే ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదన్నది స్పష్టం. అందుకే భూముల అమ్మకాలకు సై అంది ప్రభుత్వం. ఈనెల చివరి వారంలో రెండో విడత భూముల వేలం పక్రియ చేపట్టబోతోంది. అయితే, వీటికి ముందు వేరే నిర్ణయాలు తీసుకోవడంలో కేసీఆర్‌ ‌తర్జనభర్జనలు పడుతున్నారు. ఇప్పటికే ఛార్జీల పెంపుగురించి కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే త్వరలో విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీల పెంపునకు కసరత్తులు ముమ్మరం చేసింది. అయితే, ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజల నుండి వ్యతిరేకత ఎదురవుతుందని భావించింది. కొన్నాళ్లు ఆ ప్రతిపాదనను రిజర్వ్‌లో పెట్టింది. చివరకు భూముల అమ్మకాల వైపే దృష్టి పెట్టింది. అయితే ఈ నిర్ణయాల ప్రభావం భవిష్యత్తులో ప్రజలపై పెద్దఎత్తున పడుతుంది.

రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ.. దాదాపు ముప్పైవేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌ ‌కలిగి ఉంది. 30వేల కోట్ల రూపాయలంటే.. మామూలు విషయమేమీ కాదు. కానీ, ఏడేళ్లు తిరక్కముందే అంత మిగులు బడ్జెట్‌ను భారీ అప్పుల బడ్జెట్‌గా మార్చేసింది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ అన్న మాదిరిగా పథకాలు ప్రకటించడం, నిధులు ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడుతోంది. ఫలితంగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది.

ప్రధానంగా సంక్షేమ పథకాల పేరుతో ఖజానా మొత్తం ఖాళీ అవుతోంది. ప్రభుత్వం అనే బాధ్యత మరిచి.. రాజకీయ పార్టీ అన్న ఆలోచనలు నింపుకొని తమ పార్టీకే గుర్తింపు దక్కాలన్న ఆలోచనతో, ఎన్నికలు వస్తే.. తమ పార్టీ వాళ్లే కచ్చితంగా గెలవాలన్న లక్ష్యంతో ఇబ్బడిముబ్బడిగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తోంది టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం. ఒకరకంగా ప్రజలు సోమరిపోతుల మాదిరిగా తయారయ్యే ప్రమాదాన్ని ప్రభుత్వమే సృష్టిస్తోంది. అవసరం ఉన్నా, లేకపోయినా.. డిమాండ్‌ ‌వచ్చినా, రాకపోయినా, ప్రతిపాదన చేసినా, చేయకపోయినా.. పథకాలను మాత్రం ప్రవేశపెడుతోంది. వందలు, వేల కోట్ల రూపాయలు ఒక్క ఆర్డర్‌తో విడుదల చేసేస్తోంది. ఫలితంగా నిండుగా కళకళలాడాల్సిన ప్రభుత్వ ఖజానా వెలవెలబోతోంది.

ముఖ్యంగా ఆసరా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబా రక్‌, ‌రుణమాఫీ, రైతుబంధు వంటి సంక్షేమ పథకాల కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. ఇటీవలే దళిత బంధు పథకం కూడా ఆ జాబితాలో చేరింది. దీంతో, ఇప్పటిదాకా కేటాయిస్తున్న నిధుల మొత్తం భారీగా పెరిగిపోయింది. అవసరం లేక పోయినా, డిమాండ్‌ అసలే లేకున్నా తానే పథకాలను రూపొందించి మరీ ప్రకటిస్తున్న కేసీఆర్‌ ‌ప్రభుత్వం.. ఇప్పటికే డిమాండ్లు, ప్రతిపాదనలు ఉన్న పథకాలు గానీ, సంక్షేమ కార్యక్రమాలు గానీ అటకెక్కిస్తోంది. ఒకరకంగా తన మస్తిష్కంలో మెదిలినదీ, తాను మాత్రమే తయారుచేసిన పథకాలు జనంలోకి తీసుకు వెళ్లాలన్న పట్టుదల, పంతమే టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఈ క్రమంలో అవసరమైనవి, ఆవశ్యకమైన వాటిని కూడా విస్మరిస్తోంది.

కాళేశ్వరం వంటి ప్రాజెక్టు కోసం భారీగా నిధులను ఖర్చు చేసి అప్పుల పాలైంది. దీంతో కొత్తగా రూపొందిస్తున్న పథకాలకు నిధులు ఎక్కడినుంచి తేవాలో తెలియక తలలు పట్టుకుంటోంది. ఈ క్రమంలోనే సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుకోసం ఇప్పటికే దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు చేసింది ప్రభుత్వం. సాధారణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు ఆదాయం సరిపోనపుడు అప్పులు చేస్తారు. అయితే, ఇష్టం వచ్చినట్లు అప్పులు చేసి సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండేలా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం హెచ్చరిస్తుంది. దీని నిబంధనల ప్రకారం రాష్ట్రాలు తమ స్థూల ఆదాయానికి మించి అప్పులు చేయరాదు. ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే అప్పులు చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. వాస్తవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది.

ఒకవైపు.. ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో లేదని బహిరంగంగా చెబుతూనే.. కరోనా వల్ల ఖజానాకు డెబ్భై వేల కోట్ల నష్టం వచ్చిందని అంటోంది. కరోనా సాకు అటు ఉంచితే.. ఉద్యోగు లకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దానికి తోడు రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఖజానాకు సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం హామీలు గుప్పిస్తోంది. ఇదే ఇప్పుడు సర్కార్‌కు తలనొప్పిగా మారింది. ఫలితంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది. పన్నులు విధిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో పన్నేతర ఆదాయంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం భూములను అమ్మడం, అప్పులు చేయడం, కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలకు గ్రాంట్ల రూపంలో నిధులు సమకూర్చుకోవడంపై దృష్టి పెట్టింది.

ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పులే ఆదుకుంటున్నాయి. అప్పులు తీసుకోకపోతే రాష్ట్రానికి గడ్డు పరిస్థితే ఉండేది. ప్రస్తుతానికి, స్వీయ పన్నుల రాబడి ఆశాజనకంగానే ఉన్నా.. మున్ముందు కూడా కొత్త అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, పన్నుల్లో వాటాలు, మూలధన రాబడులన్నింటినీ లెక్కేస్తే.. ఆదాయం కొంత నిరాశాజనకంగా ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు, ప్రభుత్వం కొత్తగా పెడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలకు నిధులను సర్దుబాటు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు, దళితబంధు పథకానికి ఇటీవల 2వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేశారు. ఈ పథకాన్ని మరో 4 నియోజకవర్గాల్లోనూ అమలు చేయాలని ఇటీవలే నిర్ణయించారు. ఎంత లేదన్నా అక్కడ ఈ పథకం అమలుకు మరో 8వేల కోట్ల రూపాయల వరకూ నిధులు అవసరమవుతాయి. ఇక, పీఆర్సీని అమలు చేయడంతో జూలై నుంచి ఉద్యోగుల పద్దు కింద ప్రతి నెలా మరో వెయ్యి కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. రుణమాఫీని పూర్తి చేయడంతోపాటు నిరుద్యోగ భృతి వంటి పెండింగు పథకాలు ఇంకా ఉండనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖర్చులు కూడా భారీగా పెరిగే అవకాశా లున్నాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.2 లక్షల 30వేల 825.96 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో జీఎస్టీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, సేల్స్ ‌ట్యాక్స్, ఎక్సైజ్‌ ‌సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటాలు వంటి రాబడుల కింద ఒక లక్షా 6వేల 9వందల పదమూడు కోట్ల రూపాయలు, పన్నేతర రాబడుల కింద రూ.30,557.35 కోట్లు, కేంద్ర గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌, ‌కాంట్రిబ్యూషన్ల కింద రూ.38,669.46 కోట్లు, అప్పులు వంటి మూలధన రాబ డుల కింద రూ. 45,509.60 కోట్లు.. వెరసి రూ.2,21, 686.54 కోట్ల రాబడిని అంచనా వేసింది. కానీ.. ఆగస్ట్ ‌వరకు రూ.66,324 కోట్లు మాత్రమే సమకూరాయి. ఇందులో రూ.20,404 కోట్లమేర అప్పులే ఉన్నాయి. రాష్ట్ర స్వీయ పన్నుల కింద రూ.33,061 కోట్లు వసూలు కాగా, పన్నేతర రాబడి కింద మరో రూ.2,006 కోట్లు సమ కూరింది. కేంద్ర పన్నులు, పథకాల్లో వాటాలు, కేంద్ర ఆర్థిక సంఘం, జీఎస్టీ పరి హారం వంటి వాటి కింద రూ.8,698 కోట్లు వచ్చాయి. అంటే.. ఈ ఏడాది రెవెన్యూ, మూలధన రాబడుల కింద అంచనా వేసిన మొత్తం రూ.2,21,686.54 కోట్లలో ఆగస్ట్ ‌వరకు 29.91 శాతం ఆదాయం మాత్రమే సమకూరినట్లయింది.

నిజానికి, కరోనా, లాక్‌డౌన్‌ ‌కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, ‌మే నెలల్లో రాబడికి గడ్డు పరిస్థితే ఎదురైంది. జూన్‌లో కాస్త మెరుగుపడినా.. జూలై నుంచి ఆదాయం పుంజుకుంది. అయినా, ఐదు నెలల్లో వచ్చిన ఆదాయం అంచనా వేసిన దానిలో మూడో వంతు కూడా లేదు. దాంతో, రాష్ట్ర పథకాలు, కార్యక్రమాలు, వేతనాలు, వడ్డీలకు కూడా అప్పుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే ఖర్చు చేయాల్సి వచ్చింది. లేకపోతే.. ఈ ఐదు నెలల్లో సమకూరిన పన్నులు, పన్నేతర రాబడి, కేంద్ర వాటాల మొత్తం 43వేల 764 రూపాయలతో రాష్ట్రాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉండేదని నిపుణులు వ్యాఖ్యానిస్తు న్నారు. ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఏడు నెలల కాలంలో రాబడులు పెరిగితే తప్ప.. అప్పులు తగ్గించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే ఐదు నెలల్లో నెలకు సగటున 4 వేల కోట్ల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మరిన్ని అప్పులు చేయక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE