హిందూ సమాజాన్ని హిందువులే కాపాడుకోవాలని, సేవ ద్వారా సామాజిక పరివర్తన తీసుకురావాలని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ అఖిల భారతీయ సేవా ప్రముఖ్‌ ‌పరాగ్‌ అభ్యంకర్‌ ‌పిలుపునిచ్చారు. జనవరి 12, 2020 అర్ధరాత్రి ఆదిలాబాద్‌ ‌జిల్లా, భైంసా పట్టణంలో జరిగిన మత కల్లోలో ధ్వంసమైన గృహాలను పునర్‌ ‌నిర్మించి, బాధితులకు అప్పగించడానికి సెప్టెంబర్‌ 1‌న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సామూహిక హోమం కార్యక్రమాల తరువాత వారికి ఇళ్లు అప్పగించారు. సేవాభారతి తెలంగాణ, కేశవ సేవా సమితి-భాగ్యనగర్‌ ‌సంయుక్త ఆధ్వర్యంలో ఆ గృహాలను నిర్మించారు. ఈ సందర్భంగా పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ అభ్యంకర్‌ ఆనాటి ఘటనను గుర్తు చేశారు. సేవాభారతి ద్వారా సమాజంలో స్వాభిమానం నిర్మాణం చేయాలని, సామాజిక పరివర్తన తీసుకురావాలని, అఖిల భారత స్థాయిలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద వర్గాలలో మార్పు తీసుకువస్తున్నారని ఆయన వివరించారు.

 ఇళ్లు, బైకులు, ఆటోలు దగ్ధం కావడంతో కట్టుబట్టలతో మిగిలిన భైంసా హిందువులకు సేవాభారతి అండగా నిలిచింది. సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారెడ్డి, రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ ‌దేవేంద్ర సంవత్సరం క్రితం నిర్మాణం పనులను లాంఛనంగా ప్రారంభించారు. కాలిన ఇళ్ల స్థానంలోనే కొత్తవి నిర్మించారు. కరోనా, లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ, రెండోసారి మతోన్మాదులు దాడులు చేసినప్పటికీ సకాలంలో పూర్తి చేశారు. ఆదిలాబాద్‌ ‌పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావు మాట్లాడుతూ భైంసాలో తరచూ జరుగుతున్న దాడుల గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని, తగిన చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. హిందూ సమాజం మీద ఇలా దాడులు జరగడం చాలా బాధాకరమైన విషయమని, హిందువులు సంఘటితంగా స్వాభిమానంతో ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్వాభిమానంతో జీవించే గుణం రావాలని, హిందువులందరూ సంఘటితంగా ఉంటేనే దేశం వేగంగా ముందుకు వెళుతుందని, దాని కోసమే హిందూ వాహిని పనిచేస్తున్నదని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు హరిశ్చంద్ర అన్నారు. హిందూ సమాజం ఎప్పటివరకు స్వాభిమానం అలవరుచుకోదో అప్పటివరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌తెలంగాణ ప్రాంత సంఘచాలక్‌ ‌దక్షిణామూర్తి అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ‌దామోదర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ సేవాభారతి ద్వారా ఈ గృహాలను నిర్మించి హిందూ సమాజంలో ధైర్యాన్ని కూడా నిర్మించారని అన్నారు. సేవాభారతి ప్రాంత సహ కార్యదర్శి కె.స్వామి నివేదికను సమర్పించారు.

కార్యక్రమంలో దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్‌ ఎక్కా చంద్రశేఖర్‌, ‌తెలంగాణ ప్రాంత ప్రచారక్‌ ‌దేవేంద్ర, ప్రాంత సహ సేవా ప్రముఖ్‌ ‌వేంపల్లి ప్రతాప్‌, ఇం‌దూర్‌ ‌విభాగ్‌ ‌సంఘచాలక్‌, ‌జనగం నరేంద్ర, విభాగ్‌ ‌ప్రచారక్‌ ‌నరేష్‌, ‌నిర్మల్‌ ‌జిల్లా కార్యవాహ ముత్యం, భైంసా నగర్‌ ‌సంఘచాలక్‌  ‌కృష్ణదాస్‌ ‌తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ సమితి అధ్యక్షులు కుమార్‌ ‌వందన సమర్పణ చేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE