రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు తన వంతు నిధులు సమకూర్చకపోవడంతో ప్రధాన ప్రాజెక్టులు, కొత్త లైన్ల నిర్మాణం ప్రశ్నార్ధకంగా మారింది. రవాణా సౌకర్యాలు కల్పిస్తేనే మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే ప్రాజెక్టులను, కొత్త రైల్వే లైన్లను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేశాఖ ఆంధప్రదేశ్‌లో పది ప్రాజెక్టులు నిర్మించ డానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 958 కీ.మీ. పొడవున, రూ.13,399 కోట్ల అంచనాతో 5 కొత్త లైన్లు; 811 కీ.మీ. పొడువున, రూ.8,935 కోట్ల అంచనాతో అయిదు డబ్లింగ్‌ ‌లైన్లు ఉన్నాయి. కొత్త లైన్లకు భూ సేకరణ, మొత్తం ప్రాజెక్టులో 25 శాతం నుంచి 50 శాతం వరకు తన వంతు వాటాగా ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిధులు సమకూర్చాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రూ.3,263 కోట్లు బకాయి ఉంది. ఈ కారణంగా కొత్త రైల్వే ప్రాజెక్టులు ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనవి ఆంధప్రదేశ్‌లో నడికుడి-శ్రీకాళహస్తి, కోటిపల్లి- నరసాపురం మధ్య కొత్త లైన్లు. ఇవి చెన్నై, విశాఖ, చెన్నై-హైదరాబాద్‌కు ప్రత్యామ్నాయ లైన్లు. ప్రాధాన్యత రీత్యా వీటి ఏర్పాటు కూడా అత్యవసరం.

కోనసీమ వాసులకు ఉపయోగపడే కోటిపల్లి- నర్సాపురం రైల్వేలైన్‌ ‌ప్రాజెక్టు కూడా రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా మూలనపడే పరిస్థితికి చేరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రాష్ట్రం తన వంతు వాటా చెల్లించకపోవడమే జాప్యానికి కారణం. కోటిపల్లి నుంచి అమలాపురం, రాజోలు మీదుగా నర్సాపురానికి 57 కి.మీ. కొత్త రైల్వేమార్గం నిర్మించాలి. కోటిపల్లి నుంచి అమలాపురానికి 12.7 కి.మీ., అమలాపురం నుంచి చించినాడ వరకు 33.8 కి.మీ., చించినాడ నుంచి నర్సాపురానికి 10 కి.మీ.లుగా మూడు భాగాలుగా ఈ ప్రాజెక్టును నిర్మించాలి. 21 ఏళ్ల క్రితం ఈ ప్రాజెక్టు మంజూరైనా కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చేవరకు దీనికి కేటాయింపులే జరగలేదు. మోదీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక బీజేపీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించిన ఈ ప్రాంతానికి చెందిన వారణాసి రాంమాధవ్‌ ‌దీనిని ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేశారు. 2015 నాటికి ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1760 కోట్లకు చేరింది. రాంమాధవ్‌ ‌కృషి ఫలితంగా అయిదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరుచేసింది. 2020 నాటికి రూ.798 కోట్లు విడుదల చేసింది. 2021లో ఈ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో రూ.187 కోట్లు కేటాయించింది. ఇదిలా ఉంటే కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 25 శాతం వాటా నిధులు రాష్ట్రం ఇవ్వాలి. అవరోధాల కారణంగా దీని నిర్మాణ వ్యయం రూ.2,120 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వ తమ వాటాగా సుమారు రూ.525 కోట్లు చెల్లించాలి. ఆ నిధులను చెల్లించడానికి గత టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ముందుకు రావడంలేదు. నిధులు కేటాయించాలని రైల్వే శాఖ ముఖ్యమంత్రికి లేఖ కూడా రాసింది. అయినా స్పందించలేదు. అంతేకాదు, ప్రాజెక్టు కోసం 911 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా 400 ఎకరాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది.

నడికుడి- శ్రీకాళహస్తి పూర్తయ్యేనా?

నడికుడి -శ్రీకాళహస్తి రైల్వేలైన్‌ ఏర్పాటుచేస్తే హైదరాబాద్‌ ‌నుంచి తిరుపతి, చెన్నై మార్గాలకు ప్రత్నామ్యాయ మార్గం ఏర్పాటవుతుంది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాలకు ప్రజారవాణా; సున్నపురాయి, గ్రానైట్‌, ‌సిమెంటు, పింగాణీ వస్తువులు, పత్తి, మిర్చి, పుగాకు, మామిడి, నిమ్మ, అరటి వంటి ఆహారపదార్ధాల రవాణా అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల రైల్వేకు మంచి ఆదాయం కూడా లభిస్తుంది. 309 కి.మీ. పొడవైన ఈ ప్రాజెక్ట్‌ను 2011-12 బడ్జెట్‌లో చేర్చారు.

మూడంచెలుగా దీనిని నిర్మిస్తున్నారు. 1). న్యూ పిడుగురాళ్ల-శావల్యపురం (45.55 కి.మీ.) లైను మార్చి 2020 నాటికి పూర్తయింది. 2). గుండ్లకమ్మ-కనిగిరి (80 కి.మీ) లైనులో మట్టి తరలింపు, బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు వేశారు. 70 శాతం పనులు పూర్తయ్యాయి. పెన్నా, బెగ్గేరు నదులపై బ్రిడ్జిల నిర్మాణం పదిశాతం మాత్రమే పూర్తయింది. 3). కనిగిరి-వెంకటగిరి (180 కి.మీ.) లైను మధ్య భూ సేకరణ పనులు జరుగుతున్నాయి. నడికుడి నుంచి వయా పిడుగురాళ్ల, దాచేపల్లి, నగిరికల్లు, బ్రాహ్మణపల్లి, సంతగుడిపాడు, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ, ఐనవోలు, కురిచేడు, ముండ్లమూరు, దరిశి, పొదిలి, కొనకమిట్ట, కనిగిరి, పామూరు, వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, బాలాయపల్లి, వెంకటగిరి, శ్రీకాళహస్తి వరకు నడుస్తుంది. గతంలో 33 రైల్వేస్టేషన్లను గుర్తించి, నిర్మించాలని ప్రతిపాదన. మరో నాలుగు కొత్త స్టేషన్లకు నోటిఫికేషన్‌ ఇస్తూ రైల్వేశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో పిడుగురాళ్ల న్యూ, నెమలిపురి, కుంకలగుంట, వేల్పూరు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. దీంతో మొత్తం 37 రైల్వేస్టేషన్లు ఏర్పాటవుతాయి. ప్రాజెక్ట్ ‌ఖర్చు రూ.2643 కోట్లు. ఏపీ ప్రభుత్వం భూమిని ఉచితంగా ఇవ్వాలి. ప్రాజెక్ట్ ‌నిర్మాణవ్యయంలో 50% భరించాలి. పనుల జాప్యం కారణంగా మొత్తం ప్రాజెక్ట్ అం‌చనా వ్యయం రూ.5,000 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు తన వంతుగా రూ. 1400 కోట్లు ఖర్చుచేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి మరో రూ.1144 కోట్లు కేటాయించింది. ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ ప్రాజెక్టులో తన వాటాగా రూ.1351.50 కోట్లను డిపాజిట్‌ ‌చేయాలి. కానీ రూ.6 కోట్లను మాత్రమే డిపాజిట్‌ ‌చేసింది. 2,220 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా 1269 హెక్టార్లు మాత్రమే ఇచ్చింది. అందువల్ల ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాను భూమి ఖర్చును మాత్రమే భరిస్తానని, ప్రాజెక్ట్ ‌నిర్మాణ వ్యయాన్ని భరించలేమని నవంబర్‌ 3, 2020‌న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఈ ప్రాజెక్ట్ ‌కోసం ఇప్పటికే అంగీకరించిన వ్యయ భాగస్వామ్య ఏర్పాటును కొనసాగించడానికి ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం నిరాకరించడం వల్ల పనులు ఆగిపోయాయి.

గుంటూరు-గుంతకల్‌ ‌మధ్య 401 కి.మీ.డబ్లింగ్‌, ‌విద్యుద్దీకరణ లైన్‌ ‌పనులకు 2017-18లో రూ. 3,631 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు రూ.1276 కోట్లు ఖర్చయింది. 2021-22లో రూ.364 కోట్లు బడ్జెట్‌ ‌కేటాయించారు. ఈ ప్రాజెక్టుకు 197 హెక్టార్ల ప్రైవేటు భూమి, ఏడెకరాల ప్రభుత్వ భూమి, 31 ఎకరాల అటవీభూమి అవసరం. అయితే 14 ఎకరాల ప్రైవేటు భూమినే సేకరించారు. మిగతా భూసేకరణ వేగంగా చేయాలి. 80 కి.మీ. డబ్లింగ్‌ ‌పూర్తయింది. అందుబాటులో ఉన్న భూమిలో మిగతా పనులు జరుగుతున్నాయి.

అప్పులపై ప్రజల్లో ఆందోళన

పెరుగుతున్న అప్పులు, ఉద్యోగులకు జీతాల చెల్లింపులో జాప్యంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంక్షేమం పేరుతో ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను విచ్చలవిడిగా పంచుతోంది. ఓట్ల కొనుగోలు కోసమే ఈ నగదు పంపిణీ చేస్తున్నట్లు విపక్షాలు, పన్ను చెల్లింపుదారులు ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం బాగా పనిచేస్తే మరల ప్రజలే గెలిపిస్తారు. బాగా పనిచేయడం అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడం, జీవన పరిస్థితులు మెరుగుపరచడం, ఆదాయ మార్గాలను పెంచడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పారిశ్రామిక ప్రగతి సాధించడం. ఇవి చేస్తే ప్రజల్లో కొనుగోలుశక్తి పెరిగి వారు చేసే ఖర్చు, చెల్లించే పన్నులతో సంపద పెరుగుతుంది. ప్రభుత్వం ఆర్థికంగా స్థిరపడి బలోపేతమవుతుంది. ఇవన్నీ బాధ్యత కలిగిన శ్రేయోరాజ్యం చేయాల్సిన పనులు. కానీ జగన్‌ ‌ప్రభుత్వం దీనికి భిన్నమైన రీతిలో పార్టీ ఆస్తులు కూడబెట్టుకునే అజెండాతో ముందుకు వెళ్తోంది. ప్రజలను కుల, మత ప్రాతిపదికన విభజించి పాలిస్తోంది. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, కొత్త సమస్యలు సృష్టిస్తోంది. వ్యతిరేకించిన వారిని అణగదొక్కేస్తూ బ్రిటిష్‌, ఔరంగజేబు పాలనను గుర్తు చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలను వమ్ముచేశారు. వారిని డబ్బుతో లొంగదీసుకునేందుకు సంక్షేమం పేరుతో అప్పులుచేసి విచ్చలవిడిగా పంచేస్తున్నారు. ఈ నెల అప్పులు దొరికితే చాలని ప్రభుత్వం అనుకుంటుంటే, జీతాలు ఇస్తే చాలని ఉద్యోగులు ప్రార్థిస్తున్నారు. రాష్ట్ర విభజన నాటికి రూ.97 వేల కోట్ల అప్పులున్నాయి. తర్వాత వచ్చిన తెదేపా ప్రభుత్వం కూడా సంక్షేమ జపం చేసి అయిదేళ్లలో రూ.1.65 లక్షల కోట్ల అప్పులుచేసింది. దీంతో 2019 నాటికి వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి ఈ అప్పులు 2.53 లక్షల కోట్లకు చేరాయి. వైకాపా ప్రభుత్వం ఈ రెండేళ్లలో 1.41 లక్షల కోట్ల అప్పులుచేసింది. తెదేపా ప్రభుత్వం నెలకు రూ.2,700 కోట్లు అప్పులుచేస్తే, వైకాపా ప్రభుత్వం రూ.7,500 కోట్ల అప్పులుచేస్తోంది. ఇలా సంక్షేమాల పేరుతో చేసే అప్పులతో రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ లోపించి దివాళాతీసే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆర్థికవేత్తలు, నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలతో ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. కేందప్రభుత్వం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దకుండా ఉపేక్షిస్తే మరో వెనుజులాగా మారిపోక తప్పదు. ఖాళీ ఖజనా, అప్పులకుప్పలతో భయకింపితులను చేస్తున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా డిమాండ్‌ ‌చేస్తోంది.

మహిళలపై ఎన్నాళ్లీ అరాచకం!

ప్రభుత్వానికి మహిళల పట్ల తన బాధ్యతను గుర్తుచేయాల్సి రావడం శోచనీయం. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా దళితులపై దారుణాలు పెరిగిపోయాయి. అన్యాయం జరిగిన తర్వాత పరిహారం ఇస్తున్నామని చెబుతూ ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. నిర్భయ చట్టాన్ని అమలుపరచకుండా ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇస్తూ మోసం చేస్తోంది. వస్తుందో, రాదో తెలియని దిశ చట్టంతో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలను కట్టుదిట్టంగా అమలుచేయడంలో పాలకులు వైఫల్యం చెందారు. రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు, ప్రత్యేక కోర్టులు పనిచేయడం లేదు. ముద్దాయిలు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇప్పటికైనా వాటిని ప్రారంభించి దోషులను వెంటనే శిక్షించాలని న్యాయవాదులు కోరుతున్నారు. గుంటూరులో పట్టపగలు దళిత విద్యార్ధిని రమ్యను హత్య చేస్తుండగా అందరూ చూశారే తప్ప ఏ ఒక్కరూ కాపాడే ప్రయత్నం చేయలేదు. దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రజాప్రతినిధులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారే తప్ప, బాధితులకు న్యాయం చేకూర్చడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రేమోన్మాదుల చేతిలో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం జరగాలి.

అత్యాచారాలు, హత్యలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలి. ఇదిలా ఉంటే గుంటూరులోని పరమాయకుంటలో ఈ నెల 15న జరిగిన దళిత విద్యార్థిని రమ్య హత్యపై భాజపా ఎస్సీ మోర్చా, మహిళా మోర్చా ఫిర్యాదు మేరకు ఎస్సీ కమిషన్‌ ‌బృందం నిజనిర్ధారణ కోసం గుంటూరులో పర్యటించింది. కమిషన్‌ ‌వైస్‌ ‌చైర్మన్‌ అరుణ్‌హల్దేర్‌ ‌నేతృత్వంలోని సుభాష్‌ ‌పార్థి, అంజు బాల, డైరెక్టర్‌ ‌సునీల్‌కుమార్‌తో కూడిన బృందం రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. రమ్య హత్యకు సంబంధించి ప్రభుత్వం, పోలీసుల తీరుపై విమర్శలు తలెత్తడంతో ఎస్సీ కమిషన్‌ ‌పర్యటనలో తమ వైఫల్యాలు బయటకు రాకుండా ఉండేలా పోలీసులు, అధికారులు జాగ్రత్తపడ్డారు. రమ్య ఇంటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి అటుగా ఎవర్నీ రానివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భాజపా నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కమిషన్‌ ‌వెంట కాన్వాయ్‌లలోనూ, పర్యటనలో వైకాపా నాయకులే హడావిడి చేశారు. రమ్య కుటుంబంతో కమిషన్‌ ‌బృందం మాట్లాడుతున్న సమయంలో ఇతర పార్టీలు, దళిత సంఘాల నేతలను, మీడియాను అనుమతించలేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలన్నా, విపక్షాలన్నా ఎందుకింత భయం. తాము తప్పుచేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది?

– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE