జపాన్‌ ‌రాజధాని టోక్యో వేదికగా ముగిసిన 2020 పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల బృందం అత్యుత్తమంగా రాణించింది. గత ఐదుదశాబ్దాల కాలంలో ఎన్నడూ లేనంతగా 19 పతకాలు సాధించడం ద్వారా రికార్డు సృష్టించి పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలిచింది. 162 దేశాలకు చెందిన అథ్లెట్లు తలపడిన ఈ క్రీడల్లో 54 మంది సభ్యుల బృందంతో 9 రకాల క్రీడల్లో పోటీకి దిగిన భారత్‌ అం‌చనాలకు మించి రాణించింది.

కరోనా మహమ్మారి భూఖండంపై గత రెండేళ్లుగా అంచెలంచెలుగా దాడులు చేస్తూ అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేసినా విశ్వ క్రీడా సంరంభం 2020 టోక్యో ఒలింపిక్స్, ‌పారా ఒలింపిక్స్‌ను అంతర్జాతీయ ఒలింపిక్స్ ‌సమాఖ్య, జపాన్‌ ఒలింపిక్స్ ‌సంఘం విజయవంతంగా నిర్వహించాయి. తొలిదశలో జరిగిన వేసవి ఒలింపిక్స్, ఆ ‌తరువాత కొద్దిరోజుల విరామంలో జరిగిన పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అసాధారణంగా రాణించారు. ప్రధాన ఒలింపిక్స్‌లో 204 దేశాలు పాల్గొంటే.. పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచిన భారత్‌.. 162 ‌దేశాలు తలపడిన పారా ఒలింపిక్స్ ‌పతకాల పట్టికలో 24వ స్థానంలో నిలవడం విశేషం.

ప్రపంచ క్రీడల పండగ ఒలింపిక్స్‌లో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న అథ్లెట్లు రాణించడం మామూలు విషయమే. అయితే, పుట్టుకతోనే అంగవైకల్యం లేదా బాల్యంలో ప్రమాదాల బారినపడి అంగవైకల్యం పొందిన క్రీడాకారుల కోసం అంతర్జాతీయ ఒలింపిక్స్ ‌సమాఖ్య గత కొన్ని దశాబ్దాలుగా పారా ఒలింపిక్స్ ‌గేమ్స్‌ను నిర్వహిస్తూ వస్తోంది. ప్రధాన ఒలింపిక్స్‌కు అనుబంధంగా జరిగే పారా ఒలింపిక్స్‌లో బధిర, అంగవైకల్యం పొందిన అథ్లెట్లు మాత్రమే తలపడుతూ వస్తున్నారు. ప్రత్యేక క్రీడాపరికరాలు, శిక్షణ సదుపాయాలు, తోడ్పాటుతో వివిధ దేశాలకు చెందిన పారా ఒలింపియన్లు సైతం ప్రపంచ రికార్డులు అధిగమిస్తూ తమకుతామే సాటిగా నిలుస్తున్నారు.

వేసవి ఒలింపిక్స్‌లో గత శతాబ్దకాలంగా పాల్గొంటూ వస్తున్న భారత్‌.. ‌పారా ఒలింపిక్స్‌లో మాత్రం 1968 మెక్సికో గేమ్స్ ‌నుంచి పాల్గొంటూ వస్తోంది. 2016 రియో పారా ఒలింపిక్స్‌లో 12 పతకాలతో అత్యుత్తమంగా రాణించిన భారత అథ్లెట్లు.. 2020 టోక్యో గేమ్స్‌లో 19 పతకాలతో సరికొత్త రికార్డు నెలకొల్పారు.

పంచ స్వర్ణాలు

టోక్యో గేమ్స్‌లో భారత్‌ ‌సాధించిన మొత్తం 19 పతకాలలో ఐదు స్వర్ణ, ఎనిమిది రజత, ఆరు కాంస్య పతకాలున్నాయి. అత్యధికంగా ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో 8 పతకాలు, షూటింగ్‌లో 5 పతకాలు, తొలిసారిగా ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్లో 4 పతకాలు, విలువిద్య, టేబుల్‌ ‌టెన్నిస్‌ అం‌శాలలో ఒక్కో పతకం సాధించారు. విలువిద్య, టేబుల్‌ ‌టెన్నిస్‌ అం‌శాలలో భారత అథ్లెట్లు పతకాలు సాధించడం ఇదే మొదటిసారి.

అవని అరుదైన రికార్డు

బాల్యంలోనే కారు ప్రమాదంలో అంగవైకల్యం పొందిన అవని లేఖరా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో షూటింగ్‌ ‌క్రీడను ఎంచుకొని.. కఠోర సాధనతో ఒలింపిక్స్ ‌స్వర్ణవిజేతగా అవతరించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ ‌రైఫిల్‌ ‌షూటింగ్‌ ‌విభాగం ఫైనల్లో ప్రపంచ రికార్డును సమం చేస్తూ 249.6 పాయింట్లతో అవని అగ్రస్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నాలుగో భారత పారా ఒలింపియన్‌గా రికార్డుల్లో చేరింది. గతంలో 1972లో స్విమ్మర్‌ ‌మురళీకాంత్‌; 2004, 2016‌లలో జావెలిన్‌ ‌త్రోయర్‌ ‌దేవేంద్ర ఝాఝారియా, 2016లో హైజంపర్‌ ‌తంగవేలు మరియప్పన్‌ ‌బంగారు పతకాలు సాధించారు.

పారా ఒలింపిక్స్ ‌చరిత్రలోనే బంగారు పతకం సాధించిన భారత తొలి మహిళగా 19 సంవత్సరాల అవని సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు, 50 మీటర్ల రైఫిల్‌ 3 ‌పొజిషన్‌ ‌విభాగంలో కాంస్య పతకం నెగ్గడం ద్వారా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత తొలి పారా అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది.

మనీశ్‌ ‌నర్వాల్‌ ‌బంగారు గురి

షూటింగ్‌ ‌పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ ‌విభాగం ఎస్‌హెచ్‌-1 ‌ఫైనల్లో 19 సంవత్సరాల భారత షూటర్‌ ‌మనీశ్‌ 218.2 ‌పాయింట్లు సాధించి సరికొత్త రికార్డుతో బంగారు పతకం అందుకున్నాడు. ఈ స్కోర్‌ ‌పారాలింపిక్స్‌లో రికార్డుగా నిలిచింది. అంతేకాదు, ప్రపంచ రికార్డు కూడా మనీశ్‌ ‌ఖాతాలోనే చేరింది.

సుమిత్‌ అం‌టిల్‌కు స్వర్ణం

పురుషుల జావెలిన్‌ ‌త్రో ఎఫ్‌-64 ‌విభాగంలో పోటీకి దిగిన భారత అథ్లెట్‌ ‌సుమిత్‌ అం‌టిల్‌ ‌బంగారు పతకం సాధించాడు. తొలి ప్రయత్నంలోనే 66.95 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్‌, ‌రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. మూడో ప్రయత్నంలో 65.27 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 66.71 మీటర్లు విసిరిన సుమిత్‌.. ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్లు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

బ్యాడ్మింటన్‌లో జంట స్వర్ణాలు

టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారిగా ప్రవేశపెట్టిన బ్యాడ్మింటన్‌ ‌పురుషుల వేర్వేరు విభాగాలలో భారత్‌ ‌జంట స్వర్ణాలు సాధించింది. ప్రమోద్‌ ‌భగత్‌, ‌కృష్ణనగార్‌ ‌బంగారు పతకాలు అందుకొన్నారు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్‌- 3 ‌విభాగంలో ప్రమోద్‌ ‌భగత్‌ ‌స్వర్ణవిజేతగా నిలిచాడు. బంగారు పతకం పోరులో గ్రేట్‌ ‌బ్రిటన్‌కు చెందిన డేనియల్‌ ‌బెతెల్‌ను 21-14, 21-17 తేడాతో ప్రమోద్‌ ‌చిత్తు చేశాడు. పురుషుల సింగిల్స్ ఎస్‌హెచ్‌-6 ‌ఫైనల్లో కృష్ణనాగర్‌ 21-17, 16-21, 21-17‌తో హాంకాంగ్‌ ‌ప్లేయర్‌ ‌కైమన్‌ ‌చూను అధిగమించాడు. ప్రస్తుత గేమ్స్ ‌బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన భారత రెండో ప్లేయర్‌గా కృష్ణనగార్‌ ‌రికార్డుల్లో చోటు సంపాదించాడు.

వెండికొండలు

బంగారు పతకం పోరులో తలపడి రజత పతకాలతో సరిపెట్టుకొన్న భారత అథ్లెట్లలో భవీనాబెన్‌ ‌పటేల్‌ (‌టేబుల్‌ ‌టెన్నిస్‌), ‌సింఘ్‌రాజ్‌ (‌షూటింగ్‌), ‌యోగేశ్‌ ‌కథూనియా (డిస్కస్‌ ‌త్రో), నిషాద్‌ ‌కుమార్‌ (‌హైజంప్‌), ‌మరియప్పన్‌ ‌తంగవేలు (హైజంప్‌), ‌ప్రవీణ్‌కుమార్‌ (‌హైజంప్‌), ‌దేవేంద్ర ఝఝారియా (జావెలిన్‌ ‌త్రో), సుహాస్‌ ‌యతిరాజ్‌ (‌బ్యాడ్మింటన్‌) ఉన్నారు.

కాంస్య పతకాలు సాధించిన వారిలో అవని లెఖారా (షూటింగ్‌), ‌హర్విందర్‌ ‌సింగ్‌ (‌విలువిద్య), శరద్‌కుమార్‌ (‌హైజంప్‌), ‌సుంద్‌సింగ్‌ ‌గుర్జార్‌ (‌జావెలిన్‌ ‌త్రో), మనోజ్‌ ‌సర్కార్‌ (‌బ్యాడ్మింటన్‌), ‌సింఘ్‌రాజ్‌ (‌షూటింగ్‌) ఉన్నారు.

1896 ప్రారంభ ఒలింపిక్స్ ‌నుంచి ప్రస్తుత 2020 టోక్యో ఒలింపిక్స్ ‌వరకూ భారత అథ్లెట్లు అత్యుత్తమంగా, అసాధారణంగా రాణించిన క్రీడలుగా ఇవి మిగిలిపోతాయి. మొత్తం 54 మంది భారత క్రీడాకారులలో 18 మంది ఏదో ఒక పతకం సాధించడం విశేషం. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వ నజరానాతో పాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల రూపాయల మేర నగదు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించాయి. తమ విజయాలతో దేశంలోని కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచిన భారత పారా అథ్లెట్లను ఎంతగా ప్రోత్సహించినా తక్కువే అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

రికార్డులే రికార్డులు

టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు పతకాలు సాధించడంతోనే ఆగిపోలేదు. గేమ్స్ ‌రికార్డులతో పాటు ప్రపంచ రికార్డులు సైతం నెలకొల్పారు. పురుషుల జావలిన్‌ ‌త్రో, మహిళల ఎయిర్‌ ‌రైఫిల్‌, ‌పురుషుల పిస్టల్‌ ‌షూటింగ్‌ అం‌శాలతో పాటు పురుషుల హైజంప్‌ ‌విభాగంలో సైతం రికార్డులు నమోదయ్యాయి.

  1. సుమిత్‌ అం‌టిల్‌- ఎఫ్‌ 64 ‌మెన్స్ ‌జావెలిన్‌లో ప్రపంచ రికార్డు (బంగారు పతకం)
  2. అవని లేఖరా- ఆర్‌ 2 ‌మహిళల 10 మీటర్ల ఎయిర్‌ ‌రైఫిల్‌ ‌స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1‌లో ప్రపంచ రికార్డు సమం. కొత్త పారాలింపిక్‌ ‌రికార్డు (స్వర్ణం)
  3. మనీష్‌ ‌నర్వాల్‌- ‌పీ4 మిక్స్‌డ్‌ 50 ‌మీటర్ల పిస్టల్‌ ఎస్‌హెచ్‌1 ‌పారాలింపిక్‌ ‌రికార్డు (స్వర్ణం)
  4. నిషాద్‌ ‌కుమార్‌- ‌పురుషుల టీ47 హైజంప్‌లో ఆసియా రికార్డు (రజతం)
  5. ప్రవీణ్‌ ‌కుమార్‌- ‌పురుషుల హైజంప్‌ ‌టీ64లో ఆసియా రికార్డు (రజతం)

ఖేలో ఇండియా ఫలాలు!

టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్, ‌పారా ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలు సాధించడం, అత్యుత్తమంగా రాణించడం వెనుక ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పాత్ర ఎంతో ఉంది. కొద్దివారాల క్రితమే ముగిసిన 2020 వేసవి ఒలింపిక్స్‌లో 120 మంది అథ్లెట్ల బృందంతో పాల్గొన్న భారత్‌ ‌మొత్తం 7 పతకాలతో 48వ స్థానంలో నిలిచింది. ఇందులో ఓ స్వర్ణ, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలున్నాయి. గత శతాబ్దకాలంగా ఒలింపిక్స్‌లో భారత్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం.

ఇక.. బధిరులు, అంగవికలాంగుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తున్న పారా ఒలింపిక్స్‌లో సైతం మన అథ్లెట్లు పతకాల పంట పండించడంతో పాటు, సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారు. రికార్డు స్థాయిలో 19 పతకాలు సాధించడం ద్వారా చరిత్ర సృష్టించారు.

భారత అథ్లెట్ల ఈ ప్రదర్శన వెనుక ప్రధాని మోదీ దార్శనికత, ప్రత్యేక శ్రద్ధ, ప్రోత్సాహం ఎంతగానో ఉన్నాయి. ప్రతిభావంతులైన అథ్లెట్లను ముందుగానే గుర్తించి ఆర్థికసాయంతో పాటు అత్యాధునిక శిక్షణ సదుపాయాలు, విదేశీ పర్యటనలకు పంపే ఏర్పాట్లు చేయడంతో పాటు, పోటీల్లో పాల్గొనటానికి ముందు, విజేతలుగా నిలిచిన తరువాత ప్రధాని మోదీ స్వయంగా అథ్లెట్లను అభినందించిన తీరును ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మోదీ కలల రూపం ఖేలో ఇండియా పథకం ఫలాలే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ ‌సాధించిన పతకాల పంట అనడంలో సందేహంలేదు.

 – క్రష్ణారావు చొప్పరపు, 84668 64969

About Author

By editor

Twitter
YOUTUBE