‘జాతీయ వంటనూనెల మిషన్ -పామాయిల్’- ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆగస్టు 15న జాతిని ఉద్దేశించి ఎర్రకోట మీద నుంచి చేసిన ప్రసంగంలో ప్రస్తావనకు వచ్చిన పథకాలలో ఇదీ ఒకటి. ఇదొక బృహత్తర పథకం. రూ.11,040 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నారు. రాబోయే 5-6 సంవత్సరాలలో పామాయిల్ సాగును విస్తరించాలన్న ధ్యేయం దీని వెనుక ఉన్నది. పామాయిల్ సాగుకు అనువుగా ఉండే ఈశాన్య రాష్ట్రాల్లోను, అండమాన్ నికోబార్‌లలో దీనిని ప్రోత్సహించి రైతుకు తోడ్పాటునందించాలని ప్రధాని ఆకాంక్షిస్తున్నారు. అంతకు మించి రూ. 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల వరకు వంటనూనెల దిగుమతికి వెచ్చిస్తున్న విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా ఈ పథకం అసలు ఉద్దేశం.
ఆరోగ్యవంతమైన జీవనానికి అత్యంత ఆవశ్యకం శ్రేష్టమైన వంటనూనెల వినియోగం.స్వాతంత్య్రం తెచ్చుకున్న తొలి దశాబ్దంతో పోల్చి చూస్తే (1950-51) వంటనూనెల వినియోగం సగటున సంవత్సరానికి 3 కిలోల నుండి 18 కిలోల (2015-16) వరకు పెరిగింది. అయినా ప్రపంచ తలసరి వినియోగంతో (25.9 కిలోలు) చూస్తే మాత్రం మన వినియోగం తక్కువే. ఆహార అలవాట్లు, ఆర్థిక వెసులుబాటు ప్రాతిపదికగా వంటనూనెల వినియోగం ఏటా 6 శాతం మేర పెరుగుతున్నది. కానీ వాటి ఉత్పిత్తిలో మాత్రం ఏటా 2 శాతం మేరకే వృద్ధి కనిపిస్తున్నది. ఈ డిమాండ్, ఉత్పత్తుల మధ్య తేడాను తగ్గించేందుకు దేశీయంగా చమురు గింజల ఉత్పాదకత, ఉత్పత్తులను గణణీయంగా పెంచటం, అవసరం మేరకు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడం అవసరం. ప్రస్తుతం కలవరపాటుకు గురిచేస్తున్న వంటనూనెల దిగుమతులు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలి. 1992-93 సంవత్సరంలో 3 శాతమున్న నూనెల దిగుమతులు, 2012-13 ఆర్థిక సంవత్సరానికి 55% మేరకు పెరిగాయి. ప్రసుతం రూ.60 వేల కోట్ల పైనే విదేశీ మారకద్రవ్యాన్ని వంటనూనెల దిగుమతులకు వ్యయం చేయవలసి వస్తున్నది. ఇదే దేశ ఆర్థిక ప్రగతికి అవరోధంగా ఉంది.
నిజానికి నూనెగింజల సాగులో మనం వెనుకబడిలేం. దేశంలో 2677 మిలియన్ హెక్టార్ల విసీర్ణంలో వాటి సాగు జరుగుతోంది. అంటే ప్రపంచంలోనే అగ్రస్ధానంలో (13-14%) ఉన్నాం. అయినప్పటికీ గింజల దిగుబడి మాత్రం 30.01.మి. టన్నులు (6.7 శాతం). ఉత్పాదకత (1159 కెజి/హె) కూడా తక్కువ. సాగు విస్తీర్ణానికి తగిన స్థాయిలో దిగుబడి సాధ్యం కావడం లేదని అర్ధమవుతుంది. ప్రపంచ దేశాల నూనెగింజల సగటు దిగుబడితో పోల్చితే ఇక్కడ నూనె గింజల సగటు ఉత్పాదన సుమారు హెక్టారుకు ఒక టన్ను వరకు తక్కువ (అంటే సుమారు 50శాతం తక్కువ). వంటనూనెల ఉత్పత్తికి ప్రస్తుతం వేరుశనగ, ఆవాలు, సోయా చిక్కుడు, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, కుసుమలు, పిచ్చి నువ్వులు పంటలు సాగు చేస్తున్నారు. ఈ పంట ఉత్పాదకత, ఉత్పత్తులను గణనీయంగా పెంచడానికి పరిశోధనలు చేపట్టాలి. అలాగే అనువైన పరిస్థితుల్లో సాగు విస్తీర్ణం బాగా పెంచుకోవలసి ఉంది. ఇందుకు దోహదం చేసేవి ఆరోగ్యవంతమైన, శాస్త్రీయమైన వ్యవసాయ పద్ధతులే. నూనెగింజల పంటలో అధికోత్పత్తి, దిగు బదులిచ్చే వంగడాలను, చీడపీడలకు, నీటి ఎద్దడికి తట్టుకొనే విధంగా రూపొందించి, విత్తనోత్పత్తిని పెంచాలి. అధిక విస్తీర్ణంలో సాగుచేసి, ఉత్పాదకతను ఇతోధికంగా పెంచి తద్వారా ఉత్పత్తిని పెంచాలి. తగిన ప్రాసెసింగ్ పక్రియల ద్వారా విలువ ఆధారిత ఉత్పత్తులను వినియోగదారులకు అందచేసి, ఆరోగ్యకర ఆహారోత్పత్తులకు దోహదం చేయాలి.
ఇదే సమయంలో కొన్ని వాస్తవాలను పరిగణన లోనికి తీసుకోవాలి. ప్రస్తుత సాగులోని విస్తీర్ణంలో ఎంతగా దిగుబడులను పెంచినప్పటికి విదేశీ దిగుమతులను వెంటనే పూర్తిగా తగ్గించలేం. అలా కాకుండా వంట నూనెలలో స్వయం సమృద్ధి స్థాయికి చేరాలంటే, దిగుమతులను తగ్గించి, విదేశీ మారకద్రవ్యాన్ని (ప్రస్తుతమున్న 60,000-70,000 కోట్ల) తగ్గించుకోవాలంటే మరింత దృఢ నిశ్చయం అవసరం. సాంకేతికంగా ఉత్పాదకాలను పెంచటంతో పాటు, చమురు గింజల పంటల సాగు విస్తీర్ణాన్ని విశేషంగా పెంచాలి.
నూనెగింజల సాగు, పామాయిల్ పంట సాగు విస్తీర్ణాలను గణనీయంగా పెంచేందుకే జాతీయ పథకాల ద్వారా భారత ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ కృషి ఫలితంగా నూనెల ఉత్పత్తులు చాలా వరకు పెరిగాయి కూడా. అయినా విదేశాల నుండి ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న నూనెల పరిమాణాన్ని (13-15 మెట్రిక్ టన్నులు) ఇంకా తగ్గించవలసి ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం (మారిన ఆహార అవసరాలు, ప్రజల ఆర్థిక వెసులుబాటు వల్ల), వంటనూనెల వినియోగం ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. దిగుమతులు 2030 సంవత్సరానికి 20 మెట్రిక్ టన్నులు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. అంటే విదేశీమారకం ప్రస్తుతమున్న రూ.60000-70000 కోట్ల నుండి ఇంకా పెరిగే సూచనలున్నాయి.
విదేశాల నుండి దిగుమతి చేసుకునే వంట నూనెలలో అధికభాగం (56-60శాతం) పామాయిల్. పామాయిల్ దిగుమతులను తగ్గించుకో వాలన్నా సాగు విస్తీర్ణాన్ని పెంచడమే మార్గం. అదృష్టం ఏమిటంటే ప్రస్తుతం సాగులో ఉన్న వంట నూనెల పంటలలో పామాయిల్ పంట దిగుబడి హెక్టారునకు 4-5 టన్నులు. ఇది మిగిలిన చమురు గింజల పంటలకంటే ఎక్కువే. ఈ పంటతో రైతుకు వచ్చే ఆదాయం కూడా హెచ్చుగానే ఉంది. ఇది పామాయిల్ పంట సాగు చేస్తున్న రైతుల అభిప్రాయమే. ప్రభుత్వ ఆర్ధిక సహాయం ప్రోత్సాహ కాలతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో (12-13 రాష్ట్రాల్లో) పామాయిల్ సాగు జరుగుతున్నది. ఆంధప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, గుజరాత్, బిహార్, చత్తిస్‌గఢ్, ఒరిస్సా, మిజోరం, నాగాలాండ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో ఔత్సాహిక రైతులు పామాయిల్ సాగు చేస్తూ, మంచి దిగుబడు లతో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు కూడా. ఆంధప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ సాగుతో రైతులు లాభపడుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు ఆదర్శంగా నిలిచారు.
ఈ నేపథ్యంలోనే ప్రధాని ‘జాతీయ వంటనూనెల మిషన్ -పామాయిల్’ పథకాన్ని రూ.11040 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. పామాయిల్ సాగుకు దేశంలో, అనువైన నేలలూ, ప్రాంతాల విస్తీర్ణం 28,00,000 హెక్టార్ల వరకు ఉంటుందని అంచనా. ఈశాన్య రాష్ట్రాలు,అండమాన్ నికోబార్‌లలో 9,00,000 హెక్టార్ల మేరకు ఉంటుందని గుర్తించారు. ఈ పథకం ద్వారా పామాయిల్ సాగును ప్రస్తుతమున్న 3,50,000 హెక్టార్ల నుంచి 11 లక్షల హెక్టార్ల వరకు- 2025- 26 సంవత్సరానికల్లా-పెంచాలని ప్రణాళికలు రచిస్తున్నారు. తద్వారా 1.12 మెట్రి టన్నుల ముడి పామాయిల్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్ధారించారు. అదేవిధంగా 2021-30 సంవత్సరా నికి సాగు విస్తీర్ణం 17-18 మిలియన్ హెక్టారుకు చేరాలని, తద్వారా 2.8 మిలియన్ టన్నుల ముడి పామాయిల్ ఉత్పిత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అటు విదేశాల నుండి పామాయిల్ దిగుమతుల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించి ఇటు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయటం ఈ పథకం పరమార్ధం. అలాగే ఈశాన్య భారత్, అండమాన్ నికోబర్ ప్రాంతాల్లో ఈ సాగును చిత్తశుద్ధితో అమలు చేసి, ఆ ప్రాంత వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందింపచేసి, ఆర్థిక సుస్థిరతకు దోహదం చేయాలని కేంద్రం భావిస్తున్నది.
ఈ పథకం అమలుకు రూ. 11,000 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు. ఇందులో భాగంగా పామాయిల్ సాగుకు హెక్టార్‌కు 21 వేలు మొక్కల కొనుగోలుకు, ఇతర ఖర్చులకు సాయం అందిస్తూ రైతులన ప్రొత్సహిస్త్తారు. దీనితోపాటు పామాయిల్ ఫలసాయం చేతికందడానికి పట్టే ఆ 4 సంవత్సారా వ్యవధిలో ఇతర పంటల సాగుకయ్యే ఖర్చు విషయంలో సాయపడేందుకు కూడా ఈ పథకం ఉపయోగపడుతుంది. ఫలసాయం అందిన తర్వాత మంచి మార్కెట్ ధర లభ్యమయ్యే విధంగా కనీస మద్దతు ధరను అమలుచేస్తారు. మార్కెట్ ఒడిదుడు కులను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్ ధరల్లో తేడా వస్తే, ఆ వ్యత్యాసం మేరకు డబ్బును రైతులకు నేరుగా అందజేసి వారికి, ఆర్థిక వెసులుబాటును కల్పించాలన్న యోజనను కూడా ఈ పథకంలో జోడించారు. పామాయిల్ సాగుచేసే ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుచేసి, రైతులకూ పరిశ్రమలకూ ముడిసరుకు సరఫరాలో దోహదం చేయడానికి కూడా ఈ పథకం వీలు కల్పిస్తుంది.
మరో అంశం- ఈ పథకం అమలుకు అయ్యే ఖర్చులో/ప్రోత్సాహకాల్లో ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది. మిగిలిన 10 శాతం బడ్జెట్‌ను రాష్ట్రాలు భరించాలి. ఇతర ప్రాంతాల్లో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరిస్తాయి.
ఈ పథకం ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ రైతులకు మేలు చేకూర్చేదే. పామాయిల్‌లో దిగుమతులు తగ్గించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసి ప్రభుత్వం దేశ ఆర్థికప్రగతికి, రైతు సంక్షేమానికి ఇతోధికంగా దోహదపడగలదని రైతుల ఆకాంక్ష. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ ప్రగతి పథంలో సాగుతుందని, ఇటువంటి పథకాలతో దేశం సుసంపన్నం కాగలదని ఆశించవచ్చు.
స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి మనకు ఆహార ధాన్యాలు ముఖ్యంగా గోధుమ, వరి చాలక విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి ఉండేది. ఆ పరిస్థితి నుండి నేడు మనం స్వయంసమృద్ధి సాధించటమేగాక చక్కెర ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ప్రభుత్వ విధానాలు, రైతులు, శాస్త్రవేత్తలు, అధికార యంత్రాంగం అకుంఠిత దీక్షతో సాధించిన విజయమిది. అదే స్ఫూర్తితో నూనెగింజల విషయంలో జాతీయ వంటనూనెల పథకంతో సమష్టి కృషితో స్వయంసమృద్ధి దిశగా ముందంజ వేయాలి. ఇందులో భాగంగానే బియ్యం తవుడు నుండి నూనె తీసే పక్రియను ముమ్మరం చేసి, వంటనూనెల ఉత్పత్తికి దోహదం చేయాలి.
– ప్రొ।। పి. రాఘవరెడ్డి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి