– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

“There, there in the distance, beyond that river, beyond those jungles, beyond those hills lies the promised land- the soil from which we sprang- the land to which we shall now return. Hark, India is calling – India’s metropolis Delhi is calling- three hundred and eighty eight millions of our countrymen are calling. Blood is calling to blood. Get up, we have no time to lose. Take up your arms. There, in front of you is the road that our pioneers have built. We shall march along that road. We shall carve our way through the enemy’s ranks- or if God wills, we shall die a martyr’s death. The road to Delhi is the road to freedom. Chalo Delhi.”

(‘‘అదుగో అల్లదుగో, ఆ నదికి ఆవల, ఆ అరణ్యాలకు అవతల, ఆ కొండలకు వెలుపల ఉంటుంది మన గమ్య భూమి – మన జన్మభూమి – మనం ఇప్పుడు మరలి వెళ్ళనున్న భూమి. వినపడ లేదా! భారత్‌ ‌పిలుస్తున్నది. భారత మహానగరం దిల్లీ పిలుస్తున్నది. ముప్పై తొమ్మిది కోట్ల మన దేశవాసులు పిలుస్తున్నారు. రక్తం రక్తాన్ని పిలుస్తున్నది. లేవండి. మనకిక సమయం లేదు. మీరు మీ ఆయుధాలు పట్టండి. మీ ఎదుట ఉన్నది మన పూర్వులు వేసిన బాట. ఆ బాటన సాగుదాం. శత్రు శ్రేణులను చొచ్చుకుంటూ ముందుకు పోదాం. దైవేచ్ఛ అలా ఉంటే వీర మరణం పొందుదాం. దిల్లీకి దారి స్వాతంత్య్రానికి రహదారి. చలో దిల్లీ!’’)

– అంటూ నీళ్ళు నిండిన కళ్ళతో సుప్రీం కమాండర్‌ ‌నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సాగనంపగా మూడు వేలమంది ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌మొదటి రెజిమెంటు సైనికులు 1944 ఫిబ్రవరి 3న రంగూన్‌ ‌నుంచి రైళ్ళలో ఆరకన్‌ ‌రణరంగానికి ఉత్సాహంతో ఉరకలేస్తూ బయలుదేరారు.

నిజానికి సాగనంపటం కాదు. తానే సేనలను వెంటబెట్టుకుని వెళ్లి యుద్ధరంగంలో ప్రత్యక్షంగా ముందుండి పోరాడాలని నేతాజీ తహతహ. జీవితమంతా రాజకీయాలలో మునిగితేలిన వాడైనా సేనా నాయకత్వంలో ఆయన కొమ్ములు తిరిగిన జపాన్‌ ‌సేనాపతులెవరికీ తీసిపోడు. సుప్రీం కమాండర్‌ అని పేరు పెట్టుకోవటమే కాదు. మ్యాప్‌లో అతి చిన్నస్థలాల పేర్లు, అక్కడి వాతావరణ పరిస్థితులు, కీకారణ్యాలలో స్థితిగతులు, సైనిక వ్యూహాల సూక్ష్మ వివరాలు, బ్రిటిషు పక్షాన్ని జయించేందుకు జపాన్‌ అనుసరించబోయే ప్రణాళికలు, ఎత్తుగడలు నేతాజీకి క్షుణ్ణంగా తెలుసు.

‘‘ఆపరేషన్‌ ‌యు’’ అనే కోడ్‌ ‌నేమ్‌తో ఇండో బర్మా సరిహద్దులో అనుసరించబోతున్న సైనిక వ్యూహం వివరాలను, అందులో ఐఎన్‌ఎ ‌భూమికను వివరించటానికి 1944 జనవరి 24న నేతాజీ దగ్గరికి వచ్చిన జపాన్‌ ‌సైన్యం చీఫ్‌ ఆఫ్‌ ‌స్టాఫ్‌ ‌జనరల్‌ ‌కతకురా మిలిటరీ సైన్సులో బోస్‌కున్న అమోఘమైన పట్టుకు ఆశ్చర్యపోయాడు. టాప్‌ ‌సెక్రెట్‌ ‌సైనిక ఆపరేషన్లకు సంబంధించి నేతాజీ చేసిన తెలివైన సూచనలు అతడికి నచ్చాయి. వాటిలో కొన్నింటిని జపనీస్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ఆమోదించింది. బోస్‌ ‌ప్రజ్ఞా పాటవాలు ఎలాంటివో బాగా తెలుసు కనుక అతడి ఎదుట తమ ఆటలు సాగవని జపాన్‌ ‌సైనిక మల్లుల భయం. బహుశా అందుకే యుద్ధరంగంలో ప్రత్యక్షంగా నిలవాలన్న బోస్‌ ‌ప్రతిపాదనను వారు పడనివ్వలేదు.

‘‘నా మనుషులు అంతా చేసేస్తారు. నేను నా గులాబీలను చూసుకుంటాను’’ అని పూదోటలో తిరుగుతూ నిశ్చింతగా పలికిన (Hugh Toye, p..161) జపాన్‌ ‌సేన కమాండర్‌ ‌జనరల్‌ ‌రెన్య ముతగుచి లాంటి సేనాపతి కాదు సుభాస్‌ ‌చంద్రబోస్‌. ‌తన మనుషుల యోగక్షేమాలను అనుక్షణం కనిపెట్టి, సైనిక వ్యూహ సాఫల్యానికి అవసరమైన అన్ని పనులనూ దగ్గరుండి చూసుకున్న సర్వసైన్యాధిపతి ఆయన. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వాన్ని రంగూన్‌కు తరలించి యథావిధిగా పనిచేయించటం, యుద్ధ సన్నాహాలకు అవసరమైన నిధిని నయానో భయానో సేకరించటం, వాలంటీర్లను రిక్రూట్‌ ‌చేయటం, ప్రాపగాండా క్యాంపైన్‌లు నడిపించటం వంటి జరూరు పనుల్లో తలమునకలుగా ఉండి కూడా వీలైనంత ఎక్కువ సమయం కదనభూమిలో కాలు పెట్టనున్న మొదటి రెజిమెంట్‌తో గడిపి శిక్షణ, పెరేడ్‌లను స్వయంగా చూసేవాడు. ఆఫీసర్లతో ఆత్మీయంగా మాట్లాడి వారిలోని దేశభక్తిని, కర్తవ్య దీక్షను ఇనుమడింపజేసేవాడు. మాతృదేశ దాస్య విముక్తి అనే తన జీవితాశయం నెరవేరటం సైనికుల దీక్షాదక్షతల మీదే ఆధారపడుతుంది కాబట్టి తన ఉద్వేగం, తన విశ్వాసం, తన ఆత్మార్పణ తత్త్వం వారిలోనూ నింపాలని నేతాజీ తహతహలాడాడు. ఆఫీసర్లు ఒకరి తరవాత ఒకరు తన నుంచి సెలవుతీసుకుని రైలెక్కి వెళుతూంటే ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు.

తమ మీద ప్రియతమ నేతాజీ పెట్టుకున్న నమ్మకాన్ని సైనికులు ఎంతమాత్రం వమ్ము చేయలేదు. స్వాతంత్య్ర యుద్ధంలో శౌర్యపరాక్రమాలు నిరూపించుకోవటానికి మాయదారి జపాన్‌ ‌వారు మనవాళ్ళకు అందనిచ్చిన అవకాశాలు బహు తక్కువ. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో రంగంలోకి దూకటానికి సర్వ సన్నద్ధంగా ఉన్నవి 3 డివిజన్లు; 30 వేల మంది సైనికులు కాగా ఆపరేషన్లలో నేరుగా పాల్గొనే అవకాశం చిక్కింది ప్రధానంగా సుభాస్‌ ‌బ్రిగేడ్‌లోని 3,000 మందికి మాత్రమే. ఐఎన్‌ఎ ‌ఫస్ట్ ‌డివిజన్‌లోని గాంధీ, ఆజాద్‌ ‌బ్రిగేడ్‌లను సరైన అదనులో రంగంలోకి పోనీయకుండా జపాన్‌ ‌వాళ్ళు తాత్సారం చేశారు. 1944 ఫిబ్రవరి 4న ఉత్తర బర్మా సరిహద్దుల్లో ముతాగుచి సైన్యం ఎదురుదాడి మొదలెట్టగా ఆ తరవాత దాదాపు మూడు నెలలకు (ఏప్రిల్‌ 28‌న) గాని గాంధీ బ్రిగేడ్‌ను రణరంగానికి చేరనివ్వలేదు. జీవన్మరణ సమస్య లాంటి సంఘర్షణ ప్రారంభమైన రెండున్నర నెలల తరవాత గాని ఆజాద్‌ ‌బ్రిగేడ్‌కు రంగంలోకి దిగే భాగ్యం కలగలేదు. మొదటి డివిజన్‌ ‌వారికి కనీసం ఆలస్యంగా అయినా సమరంలో పాల్గొనే ప్రాప్తం దక్కింది. మిగిలిన రెండు డివిజన్లు రంగాన్ని చేరుకునే సరికే జపాన్‌ ‌సైన్యానికి కొమ్ములు విరిగి, చింద్విన్‌ ‌నదికి తూర్పు వైపు పూర్తి స్థాయిలో సైనిక తిరోగమనం జరుగుతున్నది. తమవారనుకున్న జపాన్‌ ‌వాళ్ళే వాస్తవంలో కానరాని పగవారై ఎన్ని విధాల అడ్డుపడ్డా ఆజాద్‌ ‌హింద్‌ ‌వీరసైనికులు అవకాశం చిక్కినంతలోనే చూపిన తెగువ, కనపరచిన శౌర్య పరాక్రమాలు జాతిజనులు కలకాలం సగర్వంగా స్మరించుకోదగ్గవి.

ఆరకన్‌ ‌సెక్టార్‌లో తొట్టతొలి విజయానికి ఐఎన్‌ఎ ‌ప్రతాపమే కారణం. మూడు రెగ్యులర్‌ ‌డివిజన్లు కాకుండా ఐఎన్‌ఎకి చెందిన 200- 250 మందితో కూడిన ‘బహాదుర్‌’ ‌దళాలు వివిధ జపాన్‌ ‌సేనలకు అనుబంధితమై ఉన్నాయి. శత్రుసేనల ఆనుపానులు కూపీ తీయటం, పొంచి ఉండి అదనుచూసి మీద పడి శత్రు శ్రేణులపై మెరుపు దాడి చేయటం, శత్రుసైన్యంలోని భారతీయ సైనికులకు నచ్చచెప్పి తమవైపు తిప్పుకోవటం, బ్రిటిషు వారి గుండెలదిరేలా నిరంతరం ప్రాపగాండా క్యాంపైన్‌ ‌సాగించటం ఆ బహాదుర్‌ ‌గ్రూపుల పని.

అలాంటి ఒక బహాదుర్‌ ‌గ్రూపుకు నాయకుడు మేజర్‌ ఎల్‌.ఎస్‌. ‌మిశ్రా. జపాన్‌ 55‌వ డివిజనుకు అతడి గ్రూపు జతచేయబడ్డది. ఆరకన్‌ ‌రంగంలో శత్రువుతో తలపడిన మొట్టమొదటి ఘటనలో బ్రిటిషు పక్షం మాడు పగిలింది మిశ్రా బృందం ధైర్య సాహసాల వల్లే! తమకు అప్పగించిన రెక్కీ డ్యూటీలో భాగంగా 1944 ఫిబ్రవరి 4న మేజర్‌ ‌మిశ్రా దళం బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఔట్‌ ‌పోస్టు ఒకదాని మీద మెరుపుదాడి చేసింది. అక్కడ కాపుకాస్తున్న భారతీయ సైనికులకు నేతాజీ పోరాటం గురించి తెలియజెప్పి తమ వైపుకు తిప్పుకోగలిగింది. దానిమూలంగా మిశ్రా పనిచేస్తున్న జపాన్‌ 55‌వ డివిజన్‌ ‌వేగంగా కదిలి మాయూ పర్వతశ్రేణికి తూర్పువైపున బ్రిటిష్‌ ఇం‌డియా ఆర్మీకి చెందిన 7వ డివిజన్‌ను చక్రబంధంలో ఇరికించి 5వ డివిజన్‌తో దాని సంబంధాలను తెంచి వేయగలిగింది. పర్యవసానంగా బ్రిటిష్‌ ఇం‌డియన్‌ ఆర్మీ 15వ సైనిక కోర్‌ ‌మొత్తానికీ కమ్యూనికేషన్‌ ‌లైను విచ్ఛిన్నమయింది. ఫిబ్రవరి 5 తెల్లవారుజామున ఐఎన్‌ఎ ‌దళం కీలక పాత్ర వహించిన మెరుపుదాడి జరిగే సమయానికి బ్రిటిష్‌ ‌డివిజనల్‌ ‌కమాండర్‌ ‌జనరల్‌ ‌ఫ్రాంక్‌ ‌మెస్సర్వీ నైట్‌ ‌డ్రెస్‌లో గాఢ నిద్రలో ఉన్నాడు. (అనంతర కాలంలో ఈ మెస్సర్వీ పాకిస్తాన్‌ ఆర్మీకి కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ అయ్యాడు.) శత్రువుకు ఒణుకు పుట్టించిన మిలిటరీ ఆపరేషన్‌లో చూపిన పరాక్రమానికి గుర్తింపుగా మేజర్‌ ఎల్‌.ఎస్‌. ‌మిశ్రాకు నేతాజీ ఉన్నత శౌర్య పతకం సర్దార్‌-ఎ-‌జంగ్‌ను బహూకరించాడు. అదే సెక్టార్‌లో ఏడుగురు బ్రిటిష్‌ ‌సైనికులను ఒంటి చేత్తో మట్టుపెట్టిన లెఫ్టినెంట్‌ ‌హరి సింగ్‌కు షేర్‌ -ఎ-‌హింద్‌ ‌మెడల్‌ ‌లభించింది.

 రెండో ప్రపంచ యుద్ధం రణరంగాలన్నిటిలోకీ రష్యన్‌ ‌సంగ్రామం తరవాత ఇండో-బర్మా పొలిమేర పోరాటమే పెద్దది. బర్మా – భారత్‌ ‌సరిహద్దు పొడవు సుమారు 700 మైళ్ళు (1100 కిలోమీటర్ల పైన). చైనా చేరేందుకు ఉన్న ఏకైక భూమార్గం దాని మీదుగానే. ఇండియా చేరేందుకు జపాన్‌కు ఉన్న ఏకైక భూమార్గమూ అదే! అంతటి అసాధారణ భౌగోళిక ప్రాముఖ్యం కలిగిన బర్మా సరిహద్దుల్లో భారతదేశం మీద జపాన్‌ 1944‌లో చేసిన దండ యాత్ర రెండు వేరు వేరు సెక్టార్లలో వ్యూహాత్మకంగా జరిగింది. అసలు లక్ష్యం సరిహద్దు రాష్ట్రమైన మణిపూర్‌ ‌రాజధాని ఇంఫాల్‌ను పట్టుకోవటం. కాని దానికంటే ముందు బ్రిటిషువారిని మభ్యపెట్టి, దృష్టి మరల్చటం కోసం మొదట దక్షిణాన ఆరకన్‌ ‌హిల్స్‌లో పైన మనం చెప్పుకున్న విధంగా భీకర యుద్ధం మొదలైంది. శత్రువు దాడి ఎక్కడ జరిగితే అక్కడికి రక్షణ దళాలను ఉరికించటం, సర్వశక్తులూ అటువైపు కేంద్రీకరించటం సహజం. ఇంఫాల్‌ ‌దగ్గర మోహరించిన బ్రిటిష్‌ ‌బలగాలలో వీలైనన్ని ఆరకన్‌ ‌సెక్టార్‌కు తక్షణ ప్రమాదాన్ని ఎదుర్కొనే నిమిత్తం తరలింపబడి, ఆమేరకు ఇంఫాల్‌ ‌భద్రత సాపేక్షంగా పలచన అయ్యాక ఉరుములేని పిడుగులా విరుచుకు పడి ఇంఫాల్‌ను ఒడిసిపట్టాలని జపాన్‌ ‌ప్లాను.

ఆరకాన్‌లో జపాన్‌ ‌దాడి మొదలవగానే ఘనత వహించిన ఆంగ్ల మహా సామ్రాజ్యానికి గుండెల్లో రాయి పడింది. ఇండియా మీద భూమార్గాన జపాన్‌ ‌దాడి చేస్తుందేమోనని బ్రిటిష్‌ ‌ప్రధాని చర్చిల్‌ ‌భయపడినంతా జరిగింది. అసలు బర్మా మీదే భౌతికంగా దాడి చేయటం జపాన్‌ ‌తరం కాదన్న ధీమాతో 1942 జనవరి దాకా బర్మా రక్షణ వ్యవస్థ మీద బ్రిటిషు మారాజులు దృష్టి పెట్టక నిర్లక్ష్యం చేశారు. జపాన్‌ ‌రాకాసులు రంగూన్‌ను హఠాత్తుగా చేజిక్కించుకుని, – మానవుడు అడుగుపెట్టజాలడని అందరూ అనుకునే కోసు కొండలను బల్లుల్లా పాకుతూ ఉత్తరం వైపుకు బ్రిటిష్‌ ‌సైన్యాన్ని ఐదు నెలలపాటు వెయ్యి మైళ్ళకు పైగా తరుముకుంటూ వెళ్ళటంతో వారికి దిమ్మ తిరిగింది. ఆరవ కింగ్‌ ‌జార్జి రాజుకు దగ్గరి చుట్టమైన 6 అడుగుల 4 అంగుళాల పొడుగు బాహుబలి అడ్మిరల్‌ ‌లార్డ్ ‌లూయిస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ను ఆగ్నేయాసియా కమాండ్‌కు మిత్రరాజ్యాల సుప్రీం కమాండర్‌ ‌గా చర్చిల్‌ అర్జెంటుగా నియమించాడు. జపాన్‌ ‌పేరు చెపితే ఒణికిపోతున్న అమెరికన్‌, ‌బ్రిటిష్‌, ఆ‌ఫ్రికన్‌, ‌చైనీస్‌ ‌సేనలకు దడుపు మంత్రం వేసి, దిటవు కలిగించి, బర్మా ఫ్రంట్‌లో సైనిక చర్యలను పర్యవేక్షించటం అతడి పని.

అంతటి గండరగండడు కూడా ఆరకన్‌ ‌హిల్స్‌లో జపాన్‌ ‌వాళ్ళు చెలరేగుతున్నది తమను మాయచేయ టానికేనని, అసలు గత్తర అధాటున కొహిమా, ఇంఫాల్‌ ‌మీద పడనున్నదనీ పసికట్టలేకపోయాడు. ఆరకన్‌ ‌కాంపెయిన్‌ ‌మొదలెట్టిన నెల తరవాత దానికంటే మూడింతలు పెద్దదైన ఇంఫాల్‌ ఆపరేషన్‌ ‌మొదలైంది. మూడు జపనీస్‌ ‌డివిజన్లు, రెండు ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌బెటాలియన్లు, ఐఎన్‌ఎకే చెంది గెరిల్లాపోరులో ఆరితేరిన రెండు బహాదుర్‌ ‌యూనిట్లు అందులో పాల్గొన్నాయి. బహాదుర్‌ ‌స్పెషల్‌ ‌గ్రూపుల ఐఎన్‌ఎ ‌సైనికులు, జపాన్‌ ‌సేనలు కొండలు అడవులగుండా సగటున రోజుకు 20 మైళ్ళ (32 కిలోమీటర్ల) చొప్పున రేసుగుర్రాల్లా దౌడు తీస్తూ, అడ్డువచ్చిన వారినల్లా మట్టుపెడుతూ ముందుకు దూసుకువెళ్ళారు. 5000 ఎడ్లు, పోర్టర్‌ ‌డ్యూటీ పడ్డ సిపాయిలు సామాన్లు మోసుకుంటూ వారి వెనక వెళ్ళారు. మామూలు పడవలు, ఫెర్రీలు, నాటు బల్లకట్లు ఏవి దొరికితే అవి వాడుకుని మహోగ్రమైన చింద్విన్‌ ‌నదిని దాటి ఎవరూ కలనైనా ఊహించని రీతిలో ఏకంగా మూడు సైనిక డివిజన్లు భారత సరిహద్దులోకి చొరబడ్డాయి. అదికూడా ఒక చోట కాదు. 200 మైళ్ళ వెడల్పున! అది బ్రిటిషు సామ్రాజ్యానికి జన్మలో మరచిపోలేని పెద్ద షాకు.

1944 మార్చి 18న ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌కమాండర్‌ ‌కల్నల్‌ ఎస్‌.ఎ. ‌మాలిక్‌ ‌మణిపూర్లో ఇంఫాల్‌కు దగ్గరలో మొయిరాంగ్‌ ‌కాంగ్లా వద్ద విమోచన అయిన భారత భూమిమీద త్రివర్ణ పతాకాన్ని చిరస్మరణీయంగా ఎగరేశాడు. స్వాతంత్య్ర సైనికులు మాతృభూమిలో అడుగుపెట్టామన్న పరమానందంతో ఆవురావురుమంటూ నేల మీద మోకరిల్లి మట్టిని ముద్దుపెట్టుకున్నారు. భారత్‌ ‌మాతాకీ జై అంటూ దిక్కులు మారుమోగేలా నినదించి జాతీయ గీతం ఆలపించారు.

గతంలో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మణిపూర్‌ ‌సంస్థానంలో ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెసును స్థాపించ టానికి మహాత్మా గాంధీ అంతటి వాడినే అనుమతించ లేదు. ఇప్పుడు అదే గడ్డ మీద ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ అదే బ్రిటిష్‌ ‌సర్కారుకు చలి జ్వరం పుట్టించి మువ్వన్నెల జెండాను సగర్వంగా ఎగరేసింది. సైనిక శక్తిలో ప్రపంచంలో దుర్నిరీక్ష్యమైన ఆంగ్లో అమెరికన్‌ ‌బలగాల ఉమ్మడి ప్రతిఘటనను వమ్ము చేసి మణిపూర్‌లోకి చొచ్చుకు వెళ్లి కొంతకాల మైనా నిలబడటానికి ఆజాద్‌ ‌హింద్‌ ‌సేనలు నేతాజీ కోరినట్టే నెత్తురు ధారవోశాయి. ఉదాహరణకు మేజర్‌ ‌జనరల్‌ ‌చటర్జీ ఒంటిమీద పదమూడు బులెట్‌ ‌గాయాలు అయి కూడా కొండమీద కావలసిన పొజిషన్‌ ‌కోసం శత్రు సేనలపైకి సింహంలా లంఘిచాడు. ఆ సంగ్రామంలో 600 మంది ఐఎన్‌ఎ ‌సైనికులు తమకంటే ఎంతో నాణ్యమైన ఆయుధాలున్న 3000 మంది పై హోరాహోరీగా పోరాడి గెలిచారు. వారికి లేనిదీ మనవారికి ఉన్నదీ నైతిక శక్తి; దేశభక్తి.

భారత సరిహద్దు లోపల కొన్ని ప్రాంతాలు తమ వశమైన వార్తను 1944 మార్చి 21న సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌బర్మా ప్రధాని బా మా తన గౌరవార్థం ఇచ్చిన రిసెప్షన్‌లో లోకానికి చాటాడు. “For the first time after the 1857 war, the Indian national army has gone into battle against the British enemies entrenched in India … Indian soldiers as well as civilians in the liberated areas shall welcome the liberation forces and extend to them every possible help and support” (భారతదేశంలో పాతుకుపోయిన బ్రిటిష్‌ ‌శత్రువులపై 1857 సమరం తరవాత మొదటిసారి భారత జాతీయ సైన్యం యుద్ధం చేస్తున్నది. విముక్త ప్రాంతాలలోని భారతీయ సైనికులు, పౌరులు విమోచన సేనను స్వాగతించి సాధ్యమైనంత సహాయాన్ని, మద్దతును అందించాలి’’) అని ఈ సందర్భంగా ఆయన స్పెషల్‌ ఆర్డర్‌ ‌వెలువరించాడు. INA enters India, Netaji issues a proclamation (భారత్‌లో ఐఎన్‌ఎ ‌ప్రవేశం – నేతాజీ ప్రకటన జారీ) అని పత్రికలు పతాక శీర్షికలు పెట్టాయి. విజయవార్తను బర్మాలో నేతాజీ ప్రకటించిన రోజునే టోక్యోలో ప్రధాని టోజో ‘‘భారతదేశంలోని విముక్త ప్రాంతాల పరిపాలన ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం ద్వారానే జరగలదని జపాన్‌ ‌గ్యారంటీ ఇస్తున్నది’’ అని పార్లమెంటులో హామీ ఇచ్చాడు. యుద్ధరంగానికి సమీపాన ఉండటం కోసం నేతాజీ తన హెడ్‌ ‌క్వార్టర్స్‌ను రంగూన్‌ ‌నుంచి మాండలే దగ్గరలోని హిల్‌ ‌స్టేషను మేమ్యోకు మార్చుకున్నాడు.

అసలే వరస ఓటముల దడ. దానికి తోడు – ఐఎన్‌ఎతో కలిసి కొహిమా, ఇంఫాల్‌ల మీదికి జపాన్‌ ‌సేనలు దండెత్తనున్నాయన్న కబురు! దాంతో బ్రిటిష్‌ ‌సర్కారుకు గుండెలు జారాయి. పెను ముప్పు తప్పదని ఈశాన్య సరిహద్దు ప్రాంతాల కమాండుకు హెడ్‌ ‌క్వార్టర్స్ అయిన కొమిల్లాకు హెచ్చరిక అందింది. మార్చ్ 29‌న ఇంఫాల్‌ – ‌కొహిమాల నడుమ రహదారిని జపాన్‌ ‌సేన తెంపేసి, 17వ ఆర్మీ డివిజన్‌ను చుట్టుముట్టింది. సరఫరాలను అడ్డగించి ఇంఫాల్‌లో చిక్కుబడిన సైన్యానికి తిండి దొరక్కుండా చేసింది. ఏప్రిల్‌ 4‌న జపాన్‌ 31‌వ డివిజన్‌ ‌కొహిమాలోని శత్రు స్థావరాలమీద భీకరంగా దాడి చేసింది. ఏప్రిల్‌ 29‌న హిరోహిటో చక్రవర్తి పుట్టిన రోజులోగా రాజధాని ఇంఫాల్‌ను వశపరచుకుని తీరతామని సైన్యాధిపతి ముతాగుచి లోకానికి చాటాడు.

అంతా బాగుందని పైకి ఎన్ని బింకాలు పలికినా పరిస్థితి చేయిదాటి పోతున్నదని తెల్ల దొరలకు ఒణుకు పుట్టింది. వైస్రాయ్‌ ‌వేవెల్‌ ‌తన సేనాధిపతులతో, యూరోపియన్‌ అధికారులతో అత్యవసర సమావేశం జరిపాడు. మలయా, సింగపూర్‌, ‌బర్మాలలో మునుపు చేసిన తప్పులు మళ్ళీ జరక్కుండా మణిపూర్‌ ‌నుంచి సేనలను క్రమపద్ధతిన సాఫీగా ఉపసంహరించటానికి ప్లాను తయారయింది. కోలకతా నుంచి ముంబాయి వరకు ఉన్న యూరోపియన్‌ ఆఫీసర్లను, సివిలియన్లను, తెల్లతోలు మిలిటరీ సిబ్బందిని ఉన్నచోటు నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించటానికి ముందస్తు ఏర్పాట్లు పక్కాగా జరిగాయి. అందుకు కావలసిన రైలుబండ్లను, మోటారువాహనాలను ముందే మాట్లాడి పెట్టుకున్నారు. కోల్‌కతాలోని ఫోర్ట్ ‌విలియంలో, ప్రధాన నగరాలలోని ఇతర కోటలలో, కంటోన్మెం ట్లలో కుటుంబాల వారీగా, రెజిమెంట్ల వారీగా బస ఏర్పాట్లూ జరిగాయి.

“Secret orders were issued to demolish or destroy everything of military value to the enemy from the borders of Burma to Bombay, including factories, ammunition dumps and stores . But in spite of the greatest secrecy of the ‘opertion Arrow’ (the evacuation programme), it was leaked out, making the people alarmed.” (బర్మా సరిహద్దుల నుంచి ముంబాయి వరకూ ఉన్న ఫ్యాక్టరీలు, అమ్యూనిషన్‌ ‌డంపులు, స్టోర్లు సహా, శత్రువుకు -అంటే నేతాజీ సైన్యానికి- సైనికపరంగా ఉపయోగపడగల ప్రతిదానినీ ధ్వంసం లేదా నాశనం చెయ్యాలి అని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం రహస్య ఉత్తర్వులు ఇచ్చింది. సామూహికంగా ఖాళీ చేయటానికి సంబంధించిన ఈ ‘ఆపరేషన్‌ ‌యారో’ను అతి రహస్యంగా ఉంచాలని సర్కారు ఎంత తంటాలు పడ్డా, గుట్టు రట్టు అయింది. జనం ఆందోళన చెందారు.) – అని The Lid Off గ్రంథంలో S.N.Sahni బయటపెట్టాడు.

[Quoted by V.R.Adiraju, in Netaji, The Great Revolutionary, p.326]

ముట్టడి మూలంగా రేషన్లు సగానికి కోత పడి ఇంఫాల్‌లోని మిత్రరాజ్యాల సైనికులు రెండు నెలలపాటు అర్ధాకలితో బాధపడ్డారు. మౌంట్‌ ‌బాటెన్‌ ‌హడావుడిగా దిల్లీకి పరుగెత్తి ఆర్తనాదాలు చేశాడు. ఇంఫాల్‌లో ఐఎన్‌ఎ, ‌జపాన్‌ ‌సైన్యం కలిసి మిత్ర రాజ్యాలకు చెందిన లక్షన్నర మంది సైనికులను ముట్టడించాయనీ, చైనా యుద్ధరంగం నుంచి యుద్ధ విమానాలను అర్జెంటుగా అక్కడికి తరలించాలనీ అతడు పంపిన రిపోర్టు లండన్‌, ‌వాషింగ్టన్‌లకు దిగ్భ్రాంతి కలిగించింది. (అదే గ్రంథం, అదే పేజీ) 1944 మేలో ఇంఫాల్‌ ‌సెక్టార్లో పరిస్థితి మదింపు కోసం పర్యటించిన మేజర్‌ ‌జనరల్‌ ఎ.‌సి.చటర్జీకి సైనికులను, ఆయుధాలను ఖాళీచేయించి అక్కడినుంచి తరలించటానికి పలేల్‌లోని బ్రిటిష్‌ ‌సైనిక స్థావరం వద్ద పెద్ద సంఖ్యలో ఖాళీ ట్రక్కులు కనిపించాయి. ముట్టడికి తాళ లేక ఒక దశలో బ్రిటిష్‌ ‌సేనలు లొంగిపోవటానికి సిద్ధపడ్డాయని వాస్తవాలకు శాయశక్తులా వెల్లవేసిన పాశ్చాత్య చరిత్రకారులు కూడా అంగీకరించారు.

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE