– ఎం.వి.ఆర్. శాస్త్రి
ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. శిక్షణ, అత్యవసర సామగ్రి సేకరణ అయ్యాక ‘సుభాస్ బ్రిగేడ్’లో మొదటి బృందం 1943 నవంబర్ 9న తైపింగ్ నుంచి రైల్లో రంగూన్‌కు బయలుదేరింది. చివరి బాచి 24న రైలెక్కింది. సింగపూర్ రైల్వే స్టేషనుకు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి వీర సైనికులకు ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. దారిలో కౌలాలంపూర్, పెనాంగ్ వగైరా స్టేషన్లలోనూ స్వాతంత్య్ర యోధులకు మంచి రిసెప్షన్ లభించింది.
యుద్ధ రంగంలోకి తొలుదొలుత అడుగుపెట్టే భాగ్యం తమకు పట్టబోతున్నదని సంబరపడుతున్న సైనికులలో కొందరు సరిగ్గా ప్రయాణానికి ముందు జబ్బుపడ్డారు. దేహస్థితి సవ్యంగా లేని కారణాన డాక్టర్లు ఇంకా కొందరినీ ఆపేశారు. ఆఖరి జట్టు వెళ్ళిపోతున్న సమయాన వారంతా ఓపిక లేకపోయినా రైలు స్టేషనుకు వెళ్లి, తమను కూడా తీసుకుపొండని అధికారులను బతిమిలాడారు. వారు కుదరదనేసరికి ‘దేశంకోసం ప్రాణాలిస్తామని మేము నేతాజీకి మాట ఇచ్చాము. ఆ భాగ్యం మాకు దక్కకుండా మమ్మల్ని ఎలా వదిలేస్తారు’ అని ఆక్రోశిస్తూ రైలు పట్టాలకు అడ్డంగా పడుకుని విలపించారు. ఆరోగ్యం కుదుట పడగానే మిమ్మల్ని తప్పక పంపగలమని వారిని ఆఫీసర్లు ఎంతో సముదాయించాక గానీ వారు రైలుబండిని కదలనివ్వలేదు.
తైపింగ్‌కీ రంగూన్ (ఇప్పటి యాంగాన్)కీ మధ్య దూరం 2 వేల కిలోమీటర్లు. ఇక్కడ రైలెక్కి అక్కడ దిగటం కాదు. పెనాంగ్ మీదుగా థాయిలాండ్‌లోని చుమ్ పోన్ దాకా రైలు. అక్కడ పడవల్లో నది దాటాక ఏ ప్రయాణ సాధనమూ దొరకని ఎగుడుదిగుడు ఇరుకు దారుల్లో కనీసం 600 కిలోమీటర్లు సామాన్లు మోసుకుంటూ నడచి మళ్ళీ రైలెక్కి రంగూన్ చేరాలి. రైల్లో కూడా భద్రత గ్యారంటీ లేదు. బ్రిటిషు యుద్ధ విమానాలు గద్దల్లా చక్కర్లు కొడుతూంటాయి. వాటి భయానికి ప్రమాదభరిత ప్రాంతాలలో పగటి వేళ రైళ్ళు సాధారణంగా తిరగవు. ఎంత జాగ్రత్త పడ్డా దాడులు జరుగుతూనే ఉంటాయి. సుభాస్ బ్రిగేడ్ మొదటి జట్టు ప్రయాణిస్తున్న రైలు మీదా స్వల్పంగా విమాన దాడి అయింది. జిత్ సింగ్ అనే సిపాయి మరణించాడు. అమరవీరుల జాబితాలో మొదటి పేరు అతడిది.
సామాన్యంగా జపనీస్ సైనికులకు ఐదు రోజులు పట్టేంత దూరాన్ని మన సిపాయిలు ఎంత వేగిరం గమ్యం చేరతామా అన్న తహతహలో మూడు రోజుల్లోనే నడిచేశారు. ఒక్కొక్కరూ 80 పౌండ్ల (36 కిలోల) బరువు మోస్తూ రోజుకు సగటున 40 కిలోమీటర్లు (కొందరైతే ఏకంగా 60 కిలోమీటర్లు) నడిచారు. అంచెలంచెలుగా నానా అవస్థలూ పడి బయలుదేరిన ఐదు వారాలకు అందరూ రంగూన్ చేరారు. అంతటితో కష్టాలు తీరలేదు. అసలు సమస్యలు అప్పుడే మొదలయ్యాయి.
బాహ్య ప్రపంచానికి కడుదూరంగా కోసురాళ్ళ కొండల్లో కారడవుల్లో ఎముకలు కొరికే చలిలో యుద్ధానికి వెళ్లేవారికి ఆయుధాలు, వాటికి విడిభాగాలు, మందుగుండు సామగ్రి, రేషన్లు, జబ్బుపడితే, గాయపడితే తక్షణ చికిత్సకు కావలసిన మందులు, పరికరాలు, చలిని తట్టుకోగల దుస్తులు సరిపడా ఉండాలి. వాటిని మోసుకువెళ్ళటానికి రవాణా సాధనాలు కావాలి. మనవారి మీద ఎల్లవేళలా జపాన్ వాళ్ళు చూపింది సవతితల్లి ప్రేమ. వాళ్ళ దృష్టిలో ఐఎన్‌ఎ అనేది భరించక తప్పని న్యూసెన్సు. బ్రిటిష్ ఇండియా మీద పోరులో ప్రాపగాండాకూ, భారతీయుల మచ్చికకూ పనికొస్తారని ఐఎన్‌ఎను చేరదీశారంతే. దానిని శిఖండిలా అడ్డం పెట్టుకొని బ్రిటిషు సామ్రాజ్యాన్ని హతం చేయాలనే తప్ప యుద్ధంలో తమతో సమాన స్థాయిలో భారతీయులను పోరాడనిచ్చే ఉద్దేశం జపాన్ సేనాపతులకు ఎంతమాత్రమూ లేదు. యుద్ధ రంగంలో అపురూపమైన ఆహారపదార్థాలను, అమ్యూనిషనును, సైనిక పరికరాలను, మందు మాకులను, వాహనాలను భారత సైనికులతో పంచుకునే ఔదార్యం వారికి అసలే లేదు. అయినదానికీ కానిదానికీ ఐఎన్‌ఎను సతాయించటమే వారి పని. ఆ సంగతి రంగూన్‌లో ప్రవేశించిన కొన్నాళ్ళకే మనవారికి అర్థమయింది.
మొత్తం రెజిమెంటుకు రవాణా నిమిత్తం కేటాయించినవి ఐదే ఐదు లారీలు. మూడు వేల మందికి అవి ఎందుకూ చాలవని మొత్తుకున్నా ఆలకించిన వాడు లేడు. బరువులు మోసే పశువులూ దొరకలేదు. దాంతో ఎక్కడికి వెళ్ళాలన్నా మెషిన్ గన్లు, అమ్యూనిషన్లు, సామాన్లు ఎవరివి వారు మోసుకుంటూ వెళ్ళవలసిందే. చిన్ హిల్స్, కలాదన్ లోయ వంటి దుర్భర శీతల ప్రాంతాల్లో పోరాడ వలసిన సైనికులకు దిట్టమైన ఉన్నిదుస్తులు లేకపోతే చలికి కొయ్యబారిపోతారు. దోమతెరలు లేకపోతే మలేరియా బారిన పడకుండా తప్పించుకోలేరు. మన సైనికులకు తలా ఒక నూలు దుప్పటి, ఒక ఉన్ని చొక్కాకు మించి ఇవ్వలేమని జపాన్ వారు చెప్పారు. దోమతెరలు సప్లయే లేదన్నారు. మందులు, సర్జికల్ సాధనాలకు పెద్ద కొరత. బర్మా చేరిన మన సైనికులకు ఆయుధాలూ సమస్యే. శతఘ్నులు, మోర్టార్లు అసలు లేనే లేవు. వారి దగ్గర ఉన్నవి మధ్యతరహా మెషిన్ గన్లు. వాటికి బెల్టులు, స్పేర్ పార్టులు సరిపడా లేవు. గెరిల్ల దళాలకు అత్యవసర మైన వైర్లెస్ కమ్యూనికేషన్లకు, టెలిఫోన్లకు కూడా తీవ్రమైన కటకట. ఏది అడిగినా ఇప్పుడు సప్లయిలు లేవు; కదనరంగానికి చేరుకున్నాక కావలసినవన్నీ సమకూరుస్తాము; అప్పటిదాకా వేచిఉండండి-అని జపాన్ అధికారులు చెప్పేవారు. (అదీ ఉత్తదే. తీరా రంగంలోకి దిగాకా అన్నిటికీ మొండి చెయ్యే చూపారు.)
అప్పుడున్న ఊపులో ఎంత తొందరగా రంగం లోకి దూకి వీర విహారం చేస్తామా అన్న ఆరాటమే తప్ప ఇలాంటి ఇబ్బందులను, కొరతలను పట్టించుకునే స్థితిలో మన వీర జవాన్లు లేరు. ‘‘మా సౌకర్యాల గురించి మరీ ఆందోళన పడకండి. రంగంలో మాకు ఎలాగూ ‘చర్చిల్ సప్లైలు’ దొరుకు తాయిగా’’- అని వారు అధికారులను ఊరడించే వారు. చర్చిల్ ప్రభుత్వం బ్రిటిషు సైనికులకు సమృద్ధిగా సమకూర్చే సప్లయిలు వారిని అవలీలగా గెలిచాక ఎలాగూ తమకు వశమవుతాయి కదా! కావలసినవన్నీ ఇప్పటినుంచే వందల మైళ్ళు మోసుకుపోవటం ఎందుకు? బరువు చేటు – అని వారి ధీమా!!
సైనికులకు బెంగ లేకపోయినా.. యుద్ధంలో పోరాడే భారత సేనలకు అవసరమైనవన్నీ సమకూర్చ గలమన్న హామీని జపాన్ నిలబెట్టుకోకపోయినా నేతాజీ తన బాధ్యత మరవలేదు. తన సేనలు చేరిన వెనువెంటనే 1944 జనవరి 4న ఆయన విమానంలో రంగూన్ వెళ్ళాడు. 7వ తేదీ కల్లా ఆజాద్ హింద్ ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్‌ను, ఐఎన్‌ఎ సుప్రీం కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌ను రంగూన్‌కు తరలించాడు. సైనికుల బాగోగులు కన్నతండ్రిలా కనిపెట్టి, ఉన్న కొద్ది వ్యవధిలో సమస్యలు, కొరతలు తీర్చటానికి ఆయన రేయింబవళ్ళూ కష్టపడి మానవ సాధ్యమైన అన్ని ప్రయత్నాలూ చేశాడు. మనం సొంతంగా సంపా దించుకోగలిగిన వాటికోసం జపాన్ వారిని దేబిరించకూడదని మొదటి నుంచీ నేతాజీ పాలిసీ. చేతిలోని నిధులతో కావలసిన వస్తువులు, పరికరాలు వగైరా అన్నీ దొరికిన మేరకు తన ప్రభుత్వ సరఫరాల శాఖ చేత మార్కెట్లో అక్షరాలా యుద్ధ ప్రాతిపదికన కొనిపించాడు. రంగూన్లో ఆజాద్ హింద్ సుప్రీం హెడ్ క్వార్టర్స్‌లో పెద్ద ఆర్డినెన్స్ బేస్ డిపోను ఏర్పరిచి సైన్యానికి కావలసిన అన్ని రకాల ఎక్విప్‌మెంటునూ అక్కడికి చేర్పించి సైనికులకు బట్వాడా చేయించాడు. కొనుగోళ్లకు తక్కువపడిన సొమ్మును విరాళాల రూపంలో స్థానిక భారతీయులనుంచి సేకరించాడు.
తూర్పు ఆసియాలో ప్రతి చోటా లాగే సుభాస్ బోస్ బర్మాలోనూ స్థానిక ప్రజల అవ్యాజాదరణ చూరగొన్నాడు. పాల్గొన్న ప్రతి సభలోనూ అడిగినదే తడవుగా విరాళాల జల్లు కురిసింది. ఉదాహరణకు హబీబ్ సాహెబ్ అనే భారత జాతీయుడు కోటి రూపాయలు విలువ చేసే తన యావదాస్తినీ నేతాజీకి భక్తితో సమర్పించాడు. ఐఎన్‌ఎ, ఝాన్సీరాణి రెజిమెంట్లలోకి వాలంటీర్లుగా బర్మాలో చాలామంది చేరారు. సప్లయిల బోర్డు విశ్వప్రయత్నం చేసినా అంత తక్కువ సమయంలో బరువైన ఆయుధాలు, శీతాకాలం దుస్తులు, మందులు, రవాణా వాహనాలు వగైరా అవసరానికి తగ్గట్టు సేకరించటం కష్టమైంది. కొన్ని మందులు, సర్జికల్ సాధనాలు, వైర్లెస్ కమ్యూనికేషన్లు అసలే దొరకలేదు. దాంతో ఇష్టం లేకపోయినా జపాన్ వనరుల మీద ఆధార పడక తప్పలేదు.
జపాన్ పద్ధతిలో భీకరంగా పోరాడటం భారతీ యుల తరం కాదు కనుక ఐఎన్‌ఎ పోరాడనక్కరలేదు. అలంకార ప్రాయంగా గమ్మునుంటే చాలు. జపాన్ వీరులే యుద్ధాన్ని జయించి స్వాతంత్య్ర ఫలాన్ని మీ చేతులో పెడతారు అని అంతకు కొన్నినెలల కింద అన్న జనరల్ తెరౌచీతో కొట్లాడి, భారతీయుల సత్తా చాటేందుకు ప్రయోగాత్మకంగా ముందు ఒక భారత రెజిమెంటును రంగంలోకి దింపేందుకు నేతాజీ ఒప్పించాడు కదా! ఆ ప్రకారం రంగూన్ తరలి వచ్చిన ఫస్ట్ రెజిమెంట్‌కు ఏ బాధ్యతలు అప్పగించ నున్నారు అన్నది బోస్ మొట్టమొదట తేల్చుకో దలిచాడు. సహచరులు ముచ్చటపడి సుభాస్ బ్రిగేడ్ అని పేరు పెట్టినా సుభాస్ చంద్రబోస్ పట్టుబట్టి దానిని ఫస్ట్ రెజిమెంట్ అనే వ్యవహరింపజేశాడు. గాంధీ, నెహ్రూ, ఆజాద్‌ల పేర్లను మాత్రం ఐఎన్‌ఎ డివిజన్లకు కొనసాగించాడు. నేతాజీ నిరాడంబరతకు ఇదో ఉదాహరణ.
బర్మాలోని జపాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కవాబే నేతాజీకి రంగూన్ చేరగానే ప్రోటోకాల్ ప్రకారం ఘన స్వాగతం ఇచ్చాడు. దానికి బదులుగా జనవరి 7న జనరల్ కవాబేని కలిసినప్పుడు నేతాజీ జరూరు విషయాలు తేల్చివేశాడు. సరిగ్గా అదే రోజున జపాన్ ప్రధాని టోజో ఇంఫాల్, ఈశాన్య భారత ప్రాంతాల ముట్టడించమని తన సైన్యానికి ఉత్తర్వునిచ్చాడు.
నేతాజీ మొదటి ప్రశ్న- రేపు జరగబోయే యుద్ధంలో మా పాత్ర ఏమిటి? మా తొలి రెజి మెంటుకు ఏ రంగం అప్పగించబోతున్నారు – అని.
మీ వాళ్ళ దగ్గర శతఘ్నులు లేవు. భారీ ఆయుధాలూ లేవు. కాబట్టి ప్రత్యేకంగా ఒక రంగాన్ని వారికి కేటాయించటం కుదరదు. ఆ రెజిమెంటును చిన్న చిన్న గ్రూపులకింద విడగొట్టి మా ఆర్మీ యూనిటు ఒక్కోదానికీ జతచేస్తాం. ఇంటెలిజెన్సు సేకరణ, ప్రాపగాండా రెక్కీ లాంటి పనులకు వాడుకుంటాం అన్నాడు జనరల్ కవాబే.
అందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. తమ స్వార్థానికి భారతీయులను తేరగా వాడుకునే విషయంలో జపాన్ పాలిసీ మొదటినుంచీ అదే. జపాన్ వారు 1942లో ఐఎన్‌ఎను మొదట కూడగట్టినప్పుడే దాని మొత్తం బలగాన్ని 2500కు మించనీయకూడదని అనుకున్నారు. కేవలం ప్రాపగాండాకు, పంచమాంగ దళంగానూ దాన్ని వాడుకోవాలనుకున్నారు. సుభాస్ చంద్రబోస్ రావటానికి పూర్వమే ఐఎన్‌ఎ వారిని 200 మంది చొప్పున ‘బహాదుర్’ గ్రూపులుగా ఏర్పరచి జపాన్ సైనిక దళాలకు తలా ఒకటి చొప్పున కేటాయించారు. కేవలం వేగులవారిలా వారిని ఉపయోగించు కుంటున్నారు. ఇప్పుడు ఈ కొత్త రెజిమెంటునూ అలాగే చేయాలని కవాబే ప్రతిపాదన.
కాని అతడి ఎదుట ఉన్నది సుభాస్ చంద్రబోస్. మహా మహా జపాన్ ప్రధానమంత్రిని, కొమ్ములు తిరిగిన సైన్యాధిపతులనే తన విశిష్ట వ్యక్తిత్వంతో ఒప్పించి తన దారికి తెచ్చుకోగలిగిన ధీశాలి అతడు.
మీరు చెబుతున్నది సుతరామూ వీల్లేదు. మా సేనను ముక్కలు చేసి మీ కమాండర్ల కింద పనిచేయమనటం మా ఆత్మగౌరవానికి భంగం. మా అస్తిత్వాన్ని మేము వదులుకోము. ఒక బెటాలియన్ కంటే తక్కువ స్థాయికి మా రెజిమెంటును విభజించ రాదు. ఉమ్మడి ఆపరేషనులో మీ ఓవరాల్ సైనిక కమాండు కింద పనిచేయటానికి మాకు అభ్యంతరం లేదు. కాని మా బెటాలియన్లు ఇండియన్ కమాండర్ల కిందే పని చేయాలి- అని సౌమ్యంగా, స్పుటంగా చెప్పాడు నేతాజీ.
Netaji said that he looked upon the impending offensive as primarily a battle for Indiaµs liberation and as such Indiaµs honour demanded that Indians themselves should exert their utmost and make supreme sacrifices. He told the Japanese C-in-C that the Indian National Army should form the spearhead of the advance into India, and that the first drop of blood to be shed on Indian soil should be that of a member of the INA .
[My Memories of INA &Its Netaji, Maj. Gen. Shah Nawaj Khan, p.75]
జరగబోయే సంఘర్షణ ప్రధానంగా భారతదేశ విమోచన కోసం అయినప్పుడు అందులో భారతీయులు శాయశక్తులా శ్రమించి, మహోన్నత త్యాగాలు చేయటమే భారతదేశానికి గౌరవం. భారత్‌లోకి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నంలో భారతీయులు మాత్రమే ముందు వరసన ఉండాలి. భారతగడ్డపై చిందే మొదటి నెత్తురు బొట్టు ఐఎన్‌ఎ సైనికుడిదే అయితీరాలి – అని నేతాజీ కమాండర్ ఇన్ చీఫ్‌కు స్పష్టం చేసినట్టు ఆ సమయాన అక్కడే ఉన్న మేజర్ జనరల్ షా నవాజ్‌ఖాన్ అనంతరకాలంలో వెల్లడించాడు.
జనరల్ కవాబే మారుమాట్లాడలేకపోయాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఎన్‌ఎ యుద్ధంలో ముందు ఉండరాదని ఇంపీరియల్ జనరల్ హెడ్ క్వార్టర్స్ (×+•) నుంచి అతడికి స్పష్టమైన ఆదేశాలున్నాయి. దేవుడి దయవల్ల ఇంఫాల్ తమకు వశమైతే తమ చక్రవర్తికి రాబోయే జన్మదినాన కానుకగా సమర్పించా లని జపాన్ వారి ఆలోచన. భారతీయులను పక్కన పెట్టుకుని పోరాడి గెలుచుకున్న ప్రాంతాలను వారి చేతులో పెట్టే ఉద్దేశం వారికి ఎంతమాత్రమూ లేదు. ఆ సంగతి కవాబేకు తెలిసినా బోస్‌కు చెప్పలేడు. ‘‘మీరు చెప్పేది కరక్టే. కాని నా చేతుల్లో ఏమీ లేదు. స్వతంత్రంగా నిర్ణయం చేయగల అధికారం నాకు లేదు. నేను చేయగలిగినంతా తప్పక చేస్తాను. అర్థం చేసుకోండి.’’ అని నమ్మకంగా చెప్పాడు. (ఆ సందర్భంలో ఒక రహస్య పత్రాన్ని కూడా నేతాజీకి చూపించాడని ఒక జపాన్ చరిత్రకారుడు తెలిపాడు.) ‘బెటాలియన్ కంటే తక్కువ స్థాయికి మీ రెజిమెంటును విడగొట్టనవసరం లేదు. మీ బెటాలియనును మీ వారే కమాండు చేయవచ్చు. మీకంటూ ఒక యుద్ధ రంగం తప్పక కేటాయిస్తాం. ఇంతవరకూ నేను చేయగలను’’ అని జనరల్ కవాబే నేతాజీకి హామీ ఇచ్చాడు.
‘‘సరే. భారతభూమిలో ప్రవేశించాక ఎక్కడైనా మా త్రివర్ణ పతాకమే ఎగరాలి. శత్రువునుంచి పట్టుబడిన ఆయుధాలు, సామాగ్రి ఏదైనా మాకే చెందాలి. విముక్తమైన ప్రాంతాలలో పరిపాలన మేమే చేయాలి. మా దేశంలో ప్రవేశించాక జపాన్ సైన్యాధికారులు మా నియంత్రణలో పనిచేయాలి. స్త్రీలపై అఘాయిత్యాలు, లూటీల వంటి నేరాలకు మీ సైనికులు ఎవరైనా పాల్పడితే అక్కడికక్కడే కాల్చివేయమని మా వాళ్లకు ఆదేశాలిచ్చాను. మీరూ అలాగే చేస్తే మంచిది’’ అని సుభాస్ చంద్రబోస్ గంభీరంగా చెప్పాడు. పరిస్థితి అక్కడిదాకా వచ్చిన ప్ప్పుడు ఏమి చేయాలో ఆలోచించుకోవచ్చు; ఇప్పుడే కుదరదని చెప్పి ఇతడిని దూరం చేసుకోవటం ఎందుకు అని తలచాడేమో కవాబే ఆ షరతులన్నిటికీ ఒప్పేసు కున్నాడు. మీ సైనిక దళాల్లో ఇరికించుకున్న మా ‘బహాదుర్’ గ్రూపులను ఐఎన్‌ఎకు తిరిగి అప్పగించాలి. ఇప్పుడు వారు చేస్తున్న పనులకు మా మనుషులు అవసరమైతే మా కమాండర్లను అడిగి తీసుకోవాలి అన్నది నేతాజీ పెట్టిన మరో ముఖ్యమైన డిమాండు. అది మాత్రం కుదరదు. వారిని వదిలేస్తే మాకు చాలా కష్టం-అన్నాడు కవాబే. దానిపై బోస్ పట్టుబట్టలేదు.
చివరగా నేతాజీ లేవనెత్తిన అతి ముఖ్య అంశం ఐఎన్‌ఎ స్వతంత్ర చట్ట ప్రతిపత్తికి సంబంధించి! మీ జనరల్ కమాండుకు లోబడి పనిచేయటానికి అభ్యంతరం లేదు. కాని మీ ఆర్మీ యాక్టును మాకూ వర్తిస్తామంటే అంగీకరించము అని ఆయన నిష్కర్షగా చెప్పాడు. ఎందుకంటే జపాన్ సైనిక చట్టానికి లోబడితే జపాన్ మిలిటరీ ఐఎన్‌ఎలో ఏ ఆఫీసరు నైనా, సిపాయినైనా అరెస్టు చేయవచ్చు. క్రూరత్వానికీ, అధికార దుర్వినియోగానికీ జపాన్ మిలిటరీ పోలీసులు పెట్టింది పేరు.
‘‘మీరడిగింది సాధ్యపడదు. తూర్పు ఆసియాలో నాన్ కింగ్ ఆర్మీ అయినా, మంచూరియన్ ఆర్మీ అయినా, థాయి సైన్యమైనా, బర్మా ఆర్మీ అయినా మా మిలిటరీ శాసనానికి లోబడే పనిచేసు కుంటున్నాయి. మీకూ అదే విధాయకం’’ అంటూ కవాబే మొరాయించాడు. మాకంటూ ఒక స్వతంత్ర ప్రభుత్వం, ఒక మిలిటరీ చట్టం ఉన్నప్పుడు మా వారిపై మీ ఆధిపత్యాన్ని అంగీకరించే ప్రసక్తి లేదు- అని నేతాజీ తెగేసి చెప్పాడు. దీనిపై నిర్ణయం నా పరిధిలో లేదు. మీ షరతు టోక్యోకు నివేదిస్తాను. కాని వారు ఒప్పుకుంటారని అనుకోను అన్నాడు జపాన్ జనరల్. ఏమైనా చేసుకోండి. కాని మా ఆత్మగౌరవం విషయంలో అంగుళం బెసిగేది లేదు అని ఖండితంగా చెప్పాడు బోస్. చివరికి ఆయన పంతమే నెగ్గింది. టోక్యోయే అతడి దారికొచ్చింది.
జనవరి 24న బర్మాలోని జపాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నేతాజీ దగ్గరికి వచ్చి జపాన్ అనుసరించ బోయే యుద్ధ వ్యూహాన్ని, అందులో ఐఎన్‌ఎ నిర్వహించవలసిన పాత్రను అతి రహస్యంగా వివరించాడు. బోస్ కోరిన ప్రకారం ఐఎన్‌ఎకు స్వతంత్రంగా ఒక సెక్టార్‌ను కేటాయించటానికి వారి ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ సమ్మతించిందట. హాకా, ఫాలం ఏరియా దక్షిణ ప్రాంతాన్ని ఐఎన్‌ఎ ఫస్ట్ రెజిమెంట్‌కు అప్పగిస్తారట. అటునుంచి జపాన్ 15వ సైన్యాన్ని ఎడమవైపు కాపు కాసే భారమూ ఆ రెజిమెంట్‌దేనట.
తమ ముట్టడి ఆరకాన్ నుంచి అయితే బాగుంటుందని నేతాజీ ప్రతిపాదన. కానీ వ్యూహాత్మక ప్రతిబంధకాల వల్ల అది వీలుపడదని జపాన్ సైన్యాధికారులు అంతకు ముందే ఆయనకు నచ్చచెప్పి ఉన్నారు. ఇప్పుడు తన ముందుకు వచ్చిన తుది ప్లానును తిరస్కరించవలసిన కారణం ఏదీ కనపడ నందున నేతాజీ ‘సరే’ అన్నాడు. ఆయన ఆమోద ముద్రతో ప్లాను ఖరారైపోయింది. ఫస్ట్ రెజిమెంట్‌లోని మూడు బెటాలియన్లూ జపాన్ ఆర్మీ ఆపరేషనల్ కమాండ్ కిందికి వచ్చాయి. ఇక బలగాలు కదనరంగా నికి చేరుకోవటమే ఆలస్యం.
నిజానికి దక్షిణం వైపు నుంచి ముట్టడికి జపాన్ సైన్యం ఐఎన్‌ఎని నియోగించటం వెనుక పైకి కానరాని కుత్సితం ఉన్నది. అందులోని మోసం రంగంలోకి దిగాక గానీ మనవారికి తెలిసి రాలేదు.