సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన దినోత్సవం 

1911 నుంచి 1948 హైదరాబాద్‌ (‌బేరార్‌తో కలిపి) పాలించిన ఆఖరి నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ‌సిద్దికీ లేదా ఏడో అసఫ్‌ ‌జా. ప్రపంచ కుబేరుడు అనే శీర్షికతో ప్రఖ్యాత టైమ్‌ ‌మ్యాగజీన్‌ ఆస్తుల మీద కథనం ప్రచురించింది. 1940 నాటి లెక్క ప్రకారం ఆయన ఆస్తుల విలువ రెండు బిలియన్‌ ‌డాలర్లు  (ప్రస్తుత విలువ ప్రకారం 34.9 బిలియన్‌ ‌డాలర్లు). సెలిబ్రిటి నెట్‌వర్త్ అనే వెబ్‌సైట్‌ ఇచ్చిన వివరాల ప్రకారం కుబేరులుగా ఎప్పటికీ చెలామణి అయ్యే 25 మందిలో నిజాం ఆరో స్థానంలో ఉన్నారు. ఆ ఆస్తుల విలువ 230 బిలియన్‌ ‌డాలర్లు. నిజాం వ్యక్తిగత బంగారం విలువే 100 మిలియన్‌ ‌డాలర్లు. మరో 400  మిలియన్‌ ‌డాలర్ల విలువ చేసే ఆభరణాలు కూడా ఉండేవి. ఆయన వ్యక్తిగత ఆస్తులలోనే తలమానికమైనది జాకబ్‌ ‌వజ్రం. దీని విలువ 95 మిలియన్‌ ‌డాలర్లు. దీనిని నిజాం పేపర్‌ ‌వెయిట్‌గా ఉపయోగించేవాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి రోల్స్ ‌రోయిస్‌. ఈ ‌కార్లు ఆయన దగ్గర 50 ఉండేవి. ఈ అపార సంపద ఆయన ఎక్కడి నుంచో తెచ్చి హైదరాబాద్‌లో కుమ్మరించలేదు. అటు ప్రజలను పస్తులు పెట్టి, ఇటు ఖజానాను నింపితే వచ్చిన సంపద. ఎడా పెడా విధించిన పన్నులతో పీడిస్తే కూడిన సంపద అదంతా. ఈ ఆస్తుల మీద చర్చ ఇప్పటిది కాదు. తాజాగా మళ్లీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తాజాగా చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఆరంభంలోనే ఈ అంశాన్ని ప్రజల దృష్టికి తెచ్చారు. ఒకటి వాస్తవం. బీజేపీ నేత ఆశయం గొప్పదే. కానీ నిజాం ఆస్తులు చాలావరకు కరిగిపోయాయి. వాటికి కాళ్లొచ్చాయి. అయినా చాప చిరిగినా చదరంత కదా! మిగిలిన ఆస్తుల గురించైనా ప్రభుత్వాలు పట్టించుకోక తప్పదు. వాటిని ప్రజా సంక్షేమం కోసం వినియోగపడేటట్టు చూసే బాధ్యత స్వీకరించక తప్పదు.

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం లోకి వస్తే, నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటుందనీ, అలా స్వాధీనం చేసుకున్న ఆస్తులను, ఆ ఆస్తుల నిజమైన వారసులు హిందువులకు అప్పగించి ప్రజా శ్రేయస్సుకు వినియోగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించారు. నిజానికి ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో జరగవలసింది, జమిందారీలను రద్దు చేసి, జమిందారీ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలోనే నిజాం నవాబుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకో వలసింది. కానీ, అలా జరగలేదు.

నిజానికి నిజాం ఆస్తులు, నిజాం పాలకులు చెమటోడ్చి సంపాదించినవి కాదు. ముస్లిం దురాక్రమణదారులు, కొల్లగొట్టిన హిందూ రాజుల ఆస్తులే, నిజాం ఆస్తులు. ముస్లిం దురాక్రమణ దారులు కొల్లగొట్టిన హిందూ రాజుల సంపదలో కొంత భాగంతో ముస్లిం సైనికులకు, ముస్లిం మత విశ్వాస కుల కోసం కేటాయించారు. వక్ఫ్ ‌నిధిని ఏర్పాటు చేశారు. ముస్లిం పాలకుల భోగాలు, యుద్ధాలు, విదేశాలకు ధారాదత్తం చేసిన ధనరాశుల గురించి సమీక్షించుకుంటే బాధనిపిస్తుంది. ఇక్కడి ప్రజలు నిత్య దారిద్య్రంలో గడుపుతూ ఉంటే పాలకులు మాత్రం సమస్త భోగాలు అనుభవించారు. ఇప్పటికైనా ఆ ప్రజాధనం మళ్లీ ప్రజల దగ్గరికి చేరాలి. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలి. ఇక్కడే ఇంకొక విషయం గుర్తించాలి. ఇదంతా రాజ్యాధికారం హస్తగతం చేసుకున్న నిజాం ప్రభువు దక్కించుకున్న ఆస్తి మాత్రమే. ఇక సామంతులు, సైనికాధికారులు, కింది స్థాయి ఉద్యోగులు కూడబెట్టినది ఎంతో!

అందుకే, జమీందారీలు, జమిందారీ ఆస్తులు ఏ విధంగా అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో, అదే విధంగా నిజాం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ సంపదను నిజమైన హక్కుదారులకు, ప్రజలకు పంపిణీ చేయడం తప్పుకాదు.ముస్లిం దురాక్రమణదారులు కొల్లగొట్టిన తమ పూర్వికుల ఆస్తులను వారి వారసులకు తిరిగి అప్పగించినప్పుడే హిందూ సమాజానికి న్యాయం జరుగుతుంది. ఆ ఆస్తులను దేవాలయాలకు ఇచ్చి, వాటిపై వచ్చిన ఆదాయాన్ని, అందరికీ విద్యా, వైద్య అవసరాలు తీర్చేందుకు ఉపయోగించినప్పుడే, న్యాయం జరుగుతుంది. బండి సంజయ్‌ ‌చెప్పింది కూడా అదే.

పూర్వ హైదరాబాద్‌ ‌సంస్థానాన్ని 600 ఏళ్లకు పైగా పాలించిన కుతుబ్‌’‌షాహీ, అసఫ్‌ ‌జా ముస్లిం పాలకులు తమ పాలనలో హిందువులను దుర్భరమైన పేదరికంలోకి నెట్టివేశారు. స్థానిక భాషల అభివృద్ధిని అడ్డుకున్నారు. ముస్లిం జనాభా 10 శాతం కంటే తక్కువ. అయినా, ప్రభుత్వ ఉద్యోగాలలో 90 శాతం ముస్లింలకే అవకాశాలు కల్పించారు. స్థానిక హిందువులను కాదని, ఎక్కడెక్కడినుంచో ముస్లింలను దిగుమతి చేసుకున్నారు. పదవులు కట్టబెట్టారు. ముస్లిం పాలకుల పాలనలో హిందూ దేవాలయాల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. సంస్కృత అభ్యాసం, ఉపకార వేతనాలను ముస్లిం పాలకులు చులకన చేశారు. పర్షియన్‌, ఉర్దూ భాషలు వరసగా ప్రథమ, ద్వితీయ అధికార, కోర్టు భాషలుగా చెలామణి అయ్యాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం లోగో, పరదేశీ భాషలో ఉంది. నిజాం పాలనలో చదువుకున్నవారికి, నిజాం రాజ్యం వెలుపల ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసేందుకు, నిజాం పాలనలో ప్రభుత్వ విద్యాబోధన పూర్తిగా, క్రింది నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు ఉర్దూ మాధ్యమంలోనే సాగించింది. విశ్వవిద్యాలయంలో, ఇస్లామిక్‌ అధ్యయన విభాగం (డిపార్టుమెంటు ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌స్టడీస్‌) ఉం‌ది కానీ, భారతీయ అధ్యయన విభాగం (డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఇం‌డియన్‌ ‌స్టడీస్‌ ) అప్పుడే కాదు ఇప్పటికీ లేదు. భారత దేశం అంతటా, ‘వందేమాతరం’ భారతీయ ఆత్మ నినాదంగా మారుమోగుతున్న సమయంలో ఇక్కడి ముస్లిం పాలకులు, ఆ నినాదం మీద నిషేధం విధించారు. వందేమాతరం నినాదం చేసిన వారిని పాలకులు జైలుపాలు చేశారు. ముస్లిం పాలకులు, దళితులను ప్రలోభాలకు గురిచేసి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చేందుకు దీన్దార్‌, ‌మజ్లిస్‌ ఇత్తేహద్‌-ఉల్‌-‌ముస్లమీన్‌ ఏర్పాటు చేశారు. నిజాం పాలకులు ఉత్తర భారతదేశం నుంచి, ముస్లింలను రప్పించి వారికి ప్రభుత్వ పదవులు, ఆస్తులు కట్టబెట్టారు. ఆ విధంగా నిజాం దిగుమతి చేసుకున్న ముస్లిం అబిసినియాన్స్ (‌హబ్సిస్‌) ‌హబ్సిగూడలో స్థిరపడ్డారు. అలాగే, యెమెన్‌ ‌నుంచి రప్పించిన అరబ్బులను, బరాక్‌ (‌బార్కాస్‌)‌లో ఉంచారు. నిజాం హిందువులపై తమ గడీల (కోట) నుంచి ఆధిపత్యం చెలాయించేందుకు, హిందువుల నుంచే వెట్టిచాకిరీ కొల్లగొట్టేందుకు స్థానికులలో ప్రత్యేక వర్గాన్ని తమలో కలుపుకున్నారు. ముస్లిం పాలనలో హిందువులు పేదరికంలో బక్క చిక్కిపోతే, పాలక వర్గానికి చెందిన ముస్లింలు ఆర్ధికంగా బలిసిపోయారు. ఖాసిం రజ్వి నాయకత్వంలో గుండాగిరి సాగించిన రజాకార్లను నిజాం ప్రోత్సహించారు. ముస్లిం ఆధిపత్య, దోపిడీ, పరాన్న దుష్ట పాలనకు, 1948 సెప్టెంబర్‌ 17 ‌న విముక్తి లభించింది. నిజాం పాలనలోని భూభాగం, విముక్తమై భారత భూభాగంలో విలీనమైంది. అలా, ‘దొరతనం’, దోపిడీ, అధికారం కోల్పోయిన, గత పాలకుల గౌరవ వారసులు, అభివృద్ధిచెందిన ‘ఆధునికులు’, ధనికులకు, ఇప్పుడు రిజర్వేషన్లు, సంక్షేమ ఫలాలు, ‘షాదీ ముబారక్‌’, ‌మైనారిటీ బంధు ప్రయోజనాలు అందుతున్నాయి. అందవలసిందే.

అప్పుడే, బండి సంజయ్‌ ‌సంగ్రామ యాత్ర హిందువులకు మేలుకొలుపు అవుతుంది. లౌకికవాదం ముసుగులో హిందూ సమాజం కడుపుకొడుతున్న, సంక్షేమం పేరిట సాగుతున్న మైనారిటీ బుజ్జగింపులకు చరమగీతం పాడినట్టు కాగలదు కూడా.

– డా. త్రిపురనేని హనుమాన్‌ ‌చౌదరి, ఐటీ రంగ నిపుణులు, సలహాదారు

About Author

By editor

Twitter
YOUTUBE