మొత్తానికి శతాధిక సంవత్సరాల కాంగ్రెస్‌కి ఆజాదీ కా అమృత మహోత్సవ్‌ ‌గురించి నోరు పెగిలింది. దాదాపు ఇదే తొలి పలుకేమో కూడా. కానీ దీనితోనే ఆ మహదాశయాన్ని పట్టాలు తప్పించాలన్న దుర్బుద్ధే స్పష్టంగా కనిపించింది. ఆ పార్టీ నాయకుడు, ప్రఖ్యాత రచయిత, ఎంపీ శశి థరూర్‌ ఆగస్ట్ 30 ‌నాటి ఉవాచ కచ్చితంగా ఆ పార్టీ దుర్నీతిని బయటపెట్టేదే. ‘ఇది ఎలా ఉందంటే హీరో బొమ్మ లేకుండా సినిమా పోస్టర్‌ను తయారు చేసినట్టే ఉంది. అందులో నెహ్రూ బొమ్మ ఉండాల్సిందే. తయారైన ఆ పోస్టర్‌ని ముందు ఉపసంహరించండి’ అంటూ హుంకరించారా కాంగ్రెస్‌ ‌నాయకుడు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆ మహోత్సవాల కోసం ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌హిస్టారికల్‌ ‌రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్‌) ‌విడుదల చేసిన పోస్టర్‌లో నెహ్రూ బొమ్మ లేదన్న సాకుతో అసలు ఆ ఉత్సవాలనే ప్రశ్నించే తెంపరితనం ప్రదర్శిస్తున్నారు కాంగ్రెస్‌ ‌నేత. పైగా నెహ్రూను ‘తగ్గించి’ చూపించడం మోదీ ప్రభుత్వానికి కొత్తకాదని సూత్రీకరించారు. దీనికి  ఐసీహెచ్‌ఆర్‌ ‌సంచాలకుడు ఓమ్‌జీ ఉపాధ్యాయ, ‘మొత్తం ఏడు లేదా ఎనిమిది పోస్టర్లు వస్తున్నాయి, ఇదే మొదటిది. రాబోయే పోస్టర్‌లో నెహ్రూ బొమ్మ ఉండవచ్చు’నంటూ వివరణ ఇచ్చారు. తొలి పోస్టర్‌లో గాంధీజీ, డాక్టర్‌  అం‌బేడ్కర్‌, ‌సర్దార్‌ ‌పటేల్‌, ‌నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌, ‌డాక్టర్‌ ‌రాజేందప్రసాద్‌, ‌మదన్‌ ‌మోహన్‌ ‌మాలవీయ, భగత్‌సింగ్‌, ‌వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌  ‌చిత్రాలు ఉన్నాయి. అందుకే నెహ్రూ భక్తుల వీరంగం.

 పోస్టర్‌లో గోఖలే లేదా తిలక్‌ ‌ఫొటో ఎందుకు లేదన్న ప్రశ్న రాలేదు. బిర్సా ముండా ఎక్కడ అన్న ప్రశ్నా లేదు. మేడమ్‌ ‌కామా, సరోజినీ నాయుడు బొమ్మలేవి అనీ నిలదీయలేదు. ఒక్క నెహ్రూ పేరే గుర్తుంది. ఎలాగూ భారత స్వాతంత్య్ర సమరాన్ని సినిమాతో పోల్చారు కాబట్టి కొన్ని ప్రశ్నలు. నెహ్రూ హీరో అయితే మిగతా వారంతా ఎవరు? గాంధీజీ ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్టేనా?  రాజెన్‌బాబుని ఏమనుకుంటున్నారు?  పటేల్‌ అయితే కచ్చితంగా వాళ్ల దృష్టిలో ప్రతినాయకుడే! అలాగే అంబేడ్కర్‌ను చరిత్రలో ఎక్కడ పెట్టదలుచుకున్నారో కాంగ్రెస్‌ ‌జాతికి తెలియచెప్పడం అవసరం. అయినా, దాదాపు తొమ్మిది దశాబ్దాల పాటు, ఎన్నో వందల త్యాగాలతో వచ్చిన, రక్తతర్పణలతో సాధించుకున్న భారత స్వాతంత్య్రాన్ని నెహ్రూ కుటుంబానికి కట్టబెట్టే దౌర్భాగ్యం ఇంకా ఎన్నాళ్లు? ఆనాటి త్యాగనిరతికి తగిన గుర్తింపు ఇంకెప్పుడు? నెహ్రూ ఏం ఖర్మం, గాంధీజీ రాకకు ముందే స్వాతంత్య్రోద్యమం ఉందన్న వాస్తవాన్ని గుర్తించడానికి వీళ్లకొచ్చిన దొబ్బిడాయి ఏమిటి? చాలామంది దృష్టిలో నెహ్రూ గొప్పవారే కావచ్చు. ఈ వాదనని కొట్టి పారేసే ఉద్దేశం ఎవరికీ లేదు. ఆయన కంటే చారిత్రక వాస్తవం ఇంకా ఎంతో గొప్పది అన్న పరమ సత్యాన్ని మాత్రం ఎవరైనా గుర్తించవలసిందే. ఈ ఆగస్ట్ 15‌నే ఎర్రకోట మీద ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో నెహ్రూ పేరు వచ్చిన సంగతి ఇంతలోకే పరగడుపయితే ఎలా?

వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే చాలు, చరిత్ర కాషాయీకరణ అంటూ ఎంతకాలం దబాయిస్తారు వీళ్లు? కొన్ని పేర్లే, కొన్ని ఘట్టాలకే చరిత్రలో చోటుండాలన్న అవాంఛనీయ వైఖరి ఏమిటి? పైగా బ్రిటిష్‌ ‌మనస్తత్త్వంతో భారత చరిత్ర నిర్మాణం సాగిందన్న ఇంగితజ్ఞానం ఇప్పటికీ వీళ్లలో కనిపించడం లేదు.  ఇంతకీ, ఆ పోస్టర్‌లో దర్శనమిచ్చిన వారిలో ఎవరు తక్కువని కాంగ్రెస్‌ అభిప్రాయం? వీరికి స్థానం ఇచ్చారు సరే, నెహ్రూను ఎందుకు విస్మరించారని అడగడం విజ్ఞత. కానీ హీరో లేని సినిమా పోస్టరా అంటూ అహంకరించడం  ఆక్షేపణీయమే. అసలు చరిత్ర రచన గురించి కాంగ్రెస్‌కు నిష్పాక్షిక దృష్టే ఉంటే  చరిత్రలో నెహ్రూ పక్కనే పటేల్‌ ‌స్థానం ఉండేది కాదా? 1947 నాటికి సంస్థానాధీశుల చేతిలో ఉన్న 45 శాతం భూభాగాన్ని భారత్‌లో విలీనం చేసి, ఒక మహా విచ్ఛిన్నాన్ని నివారించిన పటేల్‌ ‌ఘనత చరిత్రలో ధగధగ లాడేది కాదా? నెహ్రూ మీద వీరభక్తితో ఆయన తండ్రి మోతీలాల్‌ ‌స్వరాజ్య సమరంలో, రాజ్యాంగ నిర్మాణానికి జరిగిన తొలి యత్నాలలో నిర్వహించిన పాత్రనూ వీళ్లు విస్మరిస్తున్నారు. కాంగ్రెస్‌కు తోడు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఇలాంటి విమర్శకే పాల్పడడం హాస్యాస్పదం.  బాల్‌ ‌ఠాక్రే పార్టీకీ, నాయకులకీ  నెహ్రూ ఇంత ఆరాధనీయుడు ఎప్పుడయ్యారో! ఐదేళ్లూ నిలుస్తుందో లేదో తెలియని ఓ రాష్ట్ర ప్రభుత్వం కోసం చరిత్రలోని కీలక విషయాల గురించి చిలక పలుకులు పలకడం వికృతమనిపించడం లేదెందుకో?

కాషాయీకరణ అంటూ ఇంతకాలంగా గగ్గోలు పెట్టడమే తప్ప అందుకు వారు చూపించిన దాఖలాలు ఏవి? 1921 నాటి మలబారు మత ఘర్షణలలో చనిపోయిన ముస్లింలను స్వాతంత్య్రం సమరయోధులుగా నమోదు చేస్తామంటే ఎవరూ సహించరు. కానీ ఆ మతోన్మాదులను స్వరాజ్య సమరయోధులు కాదన్నందుకూ ఐసీహెచ్‌ఆర్‌ ఒత్తిడిని ఎదుర్కొంటున్నది. కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టుల పెంపుడు చరిత్రకారులు మాత్రమే అలాంటి చరిత్రను రచించి, దేశం మీద రుద్దగలరు. నెహ్రూ పూజతో ఆయన చరిత్రకు ఈ అంధభక్తులే ఎక్కువ చేటు తెచ్చారు. కానీ  నెహ్రూ చరిత్రే భారత చరిత్ర కాదు. భారత చరిత్రలో ఆయనొక భాగం. దీనిని గుర్తిద్దాం! ఎన్నో త్యాగాలు చేసినా చరిత్రపుటలలో కొందరికి ఎందుకు చోటు దక్కలేదో కూడా ఆలోచిద్దాం! మన చరిత్రను సజావుగా నిర్మించుకునే పనిని ఆజాదీ కా అమృత మహోత్సవ్‌తో పూర్తిచేద్దాం!

About Author

By editor

Twitter
YOUTUBE