కొవిడ్ టీకాల పంపిణీలో ప్రధాని నరేంద్ర మోదీ మహాద్భుతమే సాధించారు. మొత్తం టీకాలు తీసుకున్న వారి సంఖ్య 70 కోట్లకు పైనే (సెప్టెంబర్ 7 నాటికి). ఇప్పుడు గుడ్డి వ్యతిరేకులందరి నోళ్లూ మూతపడ్డాయి. ఎంత సంక్షోభం వచ్చినా తొట్రుపడని ధీరత్వం, సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించే నేర్పు మోదీ సొంతమని తేలిపోయింది. దేశీయమైన దృష్టి, నిస్వార్థ చింతన మోదీని సమున్నత స్థానంలో నిలుపుతున్నాయి. ఆయనకు ప్రపంచ స్థాయిలో ఇటు అభిమానులు, అటు శత్రువులు ఏకకాలంలో పెరుగుతున్నారు. కానీ ఆయన మీద ద్వేషం ఎంత అనౌచిత్యమో అంతా గమనిస్తున్నారు. చైనా భక్తులు, మిషనరీల బంట్లు, ముస్లిం మతోన్మాద సమర్థకులే మోదీ మీద బురద చల్లే యత్నం చేస్తున్నారు. విమర్శలు చేసే కొద్దీ మోదీ బలపడుతున్నారు.
అంతర్జాతీయ కుట్రలు.. దేశంలో విపక్షాల కుతంత్రాలు.. ఒక వర్గం మీడియా అబద్ధాలు ఎన్ని ఉన్నా ఈ విశాల విశ్వంలో నేడు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడి స్థానం మన ప్రియతమ ప్రధానికే దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడిగా ఆయనకే అగ్ర తాంబూలం దక్కింది. వయోజనులలో మోదీకి 70 శాతం ప్రజామోదం లభించింది. రెండో స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్ నిలిచారు. ఈయనకు ప్రజామోదం 64 శాతం. తరువాత ఇటలీ ప్రధాని మేరియో ద్రాఘి (63 శాతం), జర్మన్ చాన్సలర్ మెర్కెల్ (52 శాతం) ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిష్ట 48 శాతం వద్దనే ఉండిపోయింది. అఫ్ఘానిస్తాన్ సంక్షోభం ఫలితంతోనే ఆ దారుణ పతనం.
ఇంతటి సంక్లిష్ట ప్రపంచ వాతావరణంలో మోదీ అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నిలవడం చరిత్రాత్మకం. ప్రముఖ అమెరికా సర్వే సంస్థ మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది. ఎవరు ఎన్ని విధాలుగా ప్రపంచాన్నీ, దేశ ప్రజలనీ మభ్య పెట్టాలని చూసినా మోదీ కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అసాధారణ విజయం సాధించారు. ఇప్పుడు ప్రపంచ రాజకీయ చిత్రపటంలో మోదీ సర్వోన్నతుడు. ఆ మహానేతకు 71వ జన్మదిన శుభాకాంక్షలు.
నరేంద్రమోదీ 2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి శాసన సభ్యుడు కూడా కారు. అప్పటివరకు ఆయన పూర్తిగా పార్టీ సంస్థాగత వ్యవహారాలకే పరిమితమయ్యేవారు. పార్టీని బలోపేతం చేసేందుకే తన శక్తియుక్తులను సంపూర్ణంగా వెచ్చించేవారు. అటువంటి నాయకుడికి అనూహ్యంగా ముఖ్యమంత్రి అయ్యే అరుదైన అవకాశం లభించింది. ఎలాంటి పూర్వానుభవం లేని వ్యక్తి ప్రభుత్వాన్ని, పార్టీని ఎలా నడపగలరు? అన్న సందేహాలు అప్పట్లో ఇంటాబయటా వినిపించాయి. కానీ తన పని తీరుతో నరేంద్ర మోదీ అందరి అనుమానాలను పటాపంచలు చేశారు. అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. పార్టీకి బలమైన పునాదులు వేశారు. గుజరాత్‌ను ప్రగతి పథంలో నడిపించారు. పారిశ్రామికంగా, వ్యవసాయ కంగా దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారు. ఎలాంటి హడావిడి, ఆర్భాటాలు లేకుండానే ప్రణాళికా బద్ధ పనితీరుతో సమర్థుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
మొట్టమొదటి సారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే సమయంలోనూ వివిధ వర్గాల నుంచి ఇలాంటి సందేహాలే వ్యక్తమయ్యాయి. వాస్తవానికి అప్పటివరకు మోదీ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు దూరంగా ఉండేవారు. అతి ముఖ్యమైన అధికారిక పనుల నిమిత్తం తప్ప కొందరు ముఖ్యమంత్రుల్లాగా తరచూ ఢిల్లీ సందర్శించేవారు కారు. అవినీతిని అరికట్టి, మౌలిక వసతులు కల్పించి, పారదర్శకంగా వ్యవహరిస్తే పెట్టుబడులు వాటంతట అవే వస్తాయన్నది మోదీ నమ్మకం. చివరకు ఆ నమ్మకమే నిజమైంది. గుజరాత్‌కు పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని పదవిని మోదీ ఎలా నిభాయించుకురాగలరు? అన్న సందేహాలు అప్పట్లో రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. తనకు ముందు పనిచేసిన పీవీ, వాజపేయి, మన్మోహన్ వంటి దిగ్గజాలకు దీటుగా ఎలా పని చేయగలరన్న ఆసక్తి ఏర్పడింది.
2014, మే 26న తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనతి కాలంలోనే తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించి సమర్థతను చాటుకున్నారు. ముందుగా తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘సార్క్’ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి) దేశాల అధినేతలను ఆహ్వా నించడం ద్వారా విదేశీ వ్యవహారా లపై తనకు గల ఆసక్తి, అవగాహనను చాటుకున్నారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి దేశ నాయకత్వ పగ్గాలు చేపట్టారు. మే 30న తన ప్రమాణ స్వీకార కార్యక్రమా నికి బిమ్స్ టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కో ఆపరేషన్) దేశాల అధినేతలను ఆహ్వానించారు. తద్వారా ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకు పెద్ద పీట వేస్తున్న సందేశాన్ని వారికి పంపారు.
తొలి దఫా పాలనలో సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌కు విదేశాంగ బాధ్యతలు అప్పగించిన మోదీ రెండో దఫా పాలనలో మాజీ ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీసెస్) అధికారి జైశంకర్ సుబ్రమణ్యంను ఎంచుకోవడం ద్వారా ముందుచూపు ప్రదర్శించారు. తన ఏడేళ్ల పదవీకాలంలో అనేక దేశాలను సందర్శించి ఆయా దేశాలతో భారత్ మైత్రిని మరింత బలోపేతం చేశారు. 2014లో మొట్టమొదట భూటాన్ ద్వారా తన విదేశీ పర్యటనను ప్రారంభించి అనంతరం అనేక దేశాలను చుట్టివచ్చారు. ఆగ్నేయా సియా దేశాలతో బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్న ఉద్దేశంతో 1991లో నాటి ప్రధాని పీవీ ‘లుక్ ఈస్ట్’ విధానాన్ని తీసుకువచ్చారు. దానిని మోదీ మరింత ముందుకు తీసుకెళ్లారు. లుక్ ఈస్ట్ విధానాన్ని ‘యాక్ట్ ఈస్ట్’ గా మార్చిన మోదీ ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగా ‘ఆసియాన్’ (అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఆసియా నేషన్స్) దేశాల్లో పర్యటించారు. మారిన అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చిరకాల మిత్రదేశమైన రష్యా (ఒకప్పటి సోవియట్ యూనియన్)తో స్నేహాన్ని కొనసాగిస్తూనే అగ్రరాజ్యం అమెరికాతోనూ బంధాన్ని బలోపేతం చేసుకునే విధంగా అడుగులేశారు. ప్రపంచంలోనే అత్యంత సున్నిత ప్రాంతమైన ఇజ్రాయెల్‌ను పశ్చిమాసియాలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా గతంలో భారత ప్రధానులు దూరం పెట్టేవారు. ఇజ్రాయెల్‌కు చేరువైతే దానిని పరమ శత్రువుగా పరిగణించే అరబ్ దేశాలు ఎక్కడ నొచ్చుకుంటాయోనన్న అనుమానం, స్వదేశంలో మైనార్టీ ఓటుబ్యాంకు చేజారిపోతుందన్న భయంతో ఈ యూదు దేశాన్ని న్యూఢిల్లీ విధాన నిర్ణేతలు పక్కన పెట్టేవారు. ఈ విధానం వల్ల అంతర్జాతీయంగా భారత్‌కు కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువని భావించిన మోదీ 2017 జూలైలో తొలిసారి ఇజ్రాయెల్‌ను సందర్శించారు. ఇది కచ్చితంగా సాహాసోపేత నిర్ణయమే. తద్వారా ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా రికార్డుల కెక్కారు. ఒకరికి దగ్గరైనంత మాత్రాన మరొకరికి దూరమయ్యామని భావించడం పొరపాటన్నది మోదీ భావన. అందుకే ఇజ్రాయెల్‌తో సంబంధాలకే ఓటేశారు. కాలక్రమంలో అరబ్ దేశాలు భారత్ వాదనలోని సహేతుకతను అర్థం చేసుకున్నాయి.
దాయాది దేశమైన పాకిస్తాన్‌కు గత వైరాన్ని మరిచి స్నేహహస్తాన్ని అందించారు. 2015 అక్టోబర్‌లో అఫ్ఘాన్ పర్యటన నుంచి తిరిగి వస్తూ అనూహ్యంగా ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా లాహోర్‌లో దిగి నాటి ప్రధాని నవాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యారు. అదే సమయంలో మన మంచితనాన్ని అలుసుగా తీసుకున్నప్పుడు పాక్‌కు తగిన బుద్ధి చెప్పారు. 2019 ఫిబ్రవరిలో జమ్ము -కశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని జైష్- ఇ- మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీనికి ప్రతిగా భారత వాయుసేన విమానాలు ఫిబ్రవరిలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ)ను దాటి పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో బాంబుదాడులు చేసి ప్రతీకారం తీర్చుకున్నాయి. 2016 జనవరిలో పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి సందర్భంగా భారత్ దీటుగా వ్యవహరించి వాటిని తిప్పికొట్టింది. త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, వాయుసేనల మధ్య మరింత మెరుగైన సమన్వయం కోసం సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్) పదవిని మోదీ కొత్తగా తెరపైకి తీసుకువచ్చారు. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రస్తుతం ఈ పదవిలో ఉన్నారు. సీడీఎస్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని అనంతర పరిణామాలు రుజువు చేశాయి. ఇరుగు పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, మియన్మార్, భూటాన్, మాల్దీవులతో మంచి సంబంధాలకు మోదీ ప్రాధాన్యమిచ్చారు. చిన్న దేశాలని వాటిని విస్మరించలేదు.
యావత్ ప్రపంచం కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న తరుణంలో నేనున్నానంటూ ఇరుగు పొరుగు దేశాలకు భారత్ తనవంతు సాయం చేసింది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఎన్నో దేశాలకు 5.94 కోట్ల టీకాలను సరఫరా చేసి మానవత్వాన్ని చాటుకుంది. ఇందులో పాకిస్తాన్ కూడా ఉండటం విశేషం. విదే శాల్లో రాజకీయ సంక్షో భాలు తలెత్తి నప్పుడు వాటిని తనకు అనుకూలంగా మలచుకుని రాజకీయంగా లబ్ధి పొందే విధానానికి మోదీ మొదటి నుంచీ దూరంగా ఉన్నారు. గతేడాది నేపాల్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడు అక్కడి వామపక్ష పార్టీల మధ్య సయోధ్య చేసేందుకు చైనా ప్రయత్నించి విఫలమైంది. కానీ భారత్ మాత్రం తటస్థంగా వ్యవహరించి తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అనుచిత సంప్రదాయానికి దూరంగా నిలిచింది.
అంతర్జాతీయ శక్తిగా పొరుగున ఉన్న చైనా ప్రాధాన్యాన్ని గుర్తిస్తూనే, దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడకుండా ముందుకు సాగుతున్నారు నరేంద్ర మోదీ. బీజింగ్ ఎంత ఒత్తిడి చేసినప్పటికీ బీఆర్‌ఐ (బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్)లో భాగస్వామిగా చేరేందుకు భారత్ నిరాకరించింది. ఆసియా-ఆఫ్రికా ఖండాలను అనుసంధానించే ఈ మార్గం వల్ల తనకు కలిగే మేలేమీలేదన్న ఉద్దేశంతో భారత్ దూరంగా ఉంది. అదే సమయంలో బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాప్రికా) కూటమి ఆధ్వర్యంలో చైనాలోని షాంఘై నగరంలో ఫ్రారంభమైన ‘న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు’లో భారత్ సభ్యురాలుగా చేరింది. గత ఏడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాదళాలు దూకుడుగా ముందుకు వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్పింది. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అదే సమయంలో బీజింగ్ చెప్పనప్పటికీ వారి వైపున దాదాపు 40 మంది సైనికులు నేలకొరిగినట్లు అంతర్జాతీయ మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. హద్దులు మీరితే తాము ఎలా స్పందిస్తామో అన్నది బీజింగ్‌కు స్పష్టంగా తెలియజేసింది. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌తో కలసి ‘క్వాడ్’ కూటమిలో భాగస్వామిగా చేరింది. ఆయా దేశాలతో సంయుక్త నౌకా విన్యాసాలు చేపట్టింది. తద్వారా చైనాకు పరోక్షంగా సందేశం పంపింది. యావత్ దక్షిణ చైనా సముద్రం తనదే నంటూ దూకుడు ప్రదర్శిస్తున్న చైనాకు దీటుగా సింగపూర్‌తో కలసి ఈ నెల 2, 3, 4 తేదీల్లో సంయుక్తంగా నౌకా విన్యాసాలు ప్రదర్శించింది. ‘సింబెక్స్’ పేరిట జరిగిన ఈ విన్యాసాల ద్వారా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంలో ఇరుదేశాలకూ సమాన ఆసక్తి ఉందని చైనాకు చాటిచెప్పాయి. దక్షిణ చైనా సముద్రంలో సింగపూర్ తదితర తీర దేశాలకు ఎలాంటి హక్కు లేదని చైనా మొండిగా వాదిస్తున్న నేపథ్యంలో ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ రణ్ విజయ్, జలాంతర్గాములను గుర్తించి, నిలువరించే ఐఎన్‌ఎస్ కిల్తాన్, ఐఎన్‌ఎస్ కోరా, సముద్ర గస్తీ విమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ఇక మధ్య ఆసియా దేశమైన అఫ్ఘానిస్తాన్‌లో గత నెలరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. సంయమనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వేచిచూసే ధోరణి అవలంబించా లన్న ప్రధాని మోదీ వైఖరికి యావత్ జాతి మద్దతిస్తోంది. అఫ్ఘాన్‌లో జరగనున్న పరిణామాలను ముందుగా అంచనా వేసిన ప్రధాని మోదీ రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధావల్‌తో నిత్యం సమీక్షించారు. అఫ్ఘాన్‌లో ఉన్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి రప్పించే పక్రియను తక్షణమే ప్రారంభించి పూర్తి చేశారు. అఫ్ఘాన్‌కు గత రెండు దశాబ్దాలుగా భారత్ చేసిన సాయం అక్కడి దేశ ప్రజలతో పాటు అంతర్జాతీయ సమజానికి కూడా తెలియని విషయం కాదు. ఆ దేశంలో రహదారులు, విద్యుత్, సాగు, తాగునీటి వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించింది. భారత్ సాయంతో నిర్మించిన పార్లమెంటు భవనాన్ని స్వయంగా మోదీ ప్రారంభించారు. సల్మా సాగునీటి ప్రాజెక్టునూ ఆయనే ప్రారంభించారు. చివరకు తాలిబన్లు సైతం ఈ సాయాన్ని గుర్తించి భారత్‌తో సత్సంబంధాలకు ఆసక్తిగా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే 370, 35-ఏ అధికరణలను రద్దు చేయడం, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడం ద్వారా మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ద్వారా కశ్మీర్ పూర్తిగా భారత్‌లో అంతర్భాగమని పాకిస్తాన్ వంటి దాయాది దేశానికి మరోసారి స్పష్టంగా తెలియజేశారు. అంతేకాక ఎప్పటినుంచో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాన్ని నెరవేర్చారు. గతంలో ఏ ప్రధానమంత్రీ (అటల్ బిహారీ వాజపేయి మినహా) కనీసం ఇలాంటి ఆలోచన చేసే సాహసం కూడా చేయలేకపోయారు.
వివిధ ప్రభుత్వ పథకాల రాయితీలను నేరుగా లబ్ధిదారులను అందించేందుకు వీలుగా డీబీటీ (డైరెక్టు బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. తయారీ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించేం దుకు వీలుగా ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ పథకం కింద అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. నిరుపేదలకు వంటగ్యాస్ సరఫరా చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన పథకాన్ని ప్రారంభిం చారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా సంభాషించి పరస్పరం అభిప్రాయాలను తెలుసుకునేందుకు, పంచుకునేందుకు అవకాశం ఏర్పడింది. బేటీ బచావో- బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికా సంరక్షణకు చర్యలు తీసుకన్నారు. ‘జన్ ధన్’ ఖాతాల ప్రారంభం ద్వారా సామాన్యులకు బ్యాంకింగ్‌తో అనుసంధానత కలిగించారు.
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్