అక్టోబర్ 2 గాంధీ జయంతి
బ్రిటిష్ ఇండియాలో చట్టసభలను బహిష్కరించాలంటూ తాను ఇచ్చిన పిలుపు పట్ల గాంధీజీ పట్టుదలతో పనిచేశారు. గౌరవనీయులు వెళ్లడం వల్ల వాటి ప్రతిష్ట పెరుగుతుందని చెప్పారు. చట్టసభకు వెళ్లిన మదన్‌మోహన్ మాలవీయ అందించిన సేవ కంటే, ఆ సభలకు వెళ్లని బాలగంగాధర తిలక్ అందించిన సేవ ఎంతో గొప్పదంటారాయన. ఇదే విషయాన్ని ఆగస్ట్ 31,1920న విజయవాడ వచ్చినప్పుడు ఆంధ్రపత్రిక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
మహాత్మాజీ శాసనసభల బహిష్కారం కంటే బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడం ఎక్కువ ప్రయోజనకారి కాదా?
బ్రిటిష్ వర్తకులకు నష్టం కలిగిస్తే ప్రభుత్వం వారు మనం చెప్పినట్లు నడచుకొంటారని మీ అభిప్రాయము. అది నిజమే కావచ్చు. కాని బ్రిటిష్ వస్తువులను వెంటనే నిరాకరించడం సాధ్యం కాని పని. అదీకాక బ్రిటిష్ వస్తువులను దిగుమతి చేసే కోటీశ్వరులను ఇందుకు ఒప్పించడం వారిని మరొక విధంగా సంతృప్తి పరచవలసి ఉంటుంది. వారు బ్రిటిష్ వస్తువులను దిగుమతి చేయకుండా ఉండడానికి ఒప్పకోకపోతే మనం వారిని భయపెట్టవలసి ఉంటుంది. వారి గిడ్డంగులను తగలబెట్ట వలసి ఉంటుంది. కోటీశ్వరుల తలలు పగలగొడతామని బెదిరించవలసి ఉంటుంది. మనమంత దౌర్జన్యానికి దిగితే గాని కోటీశ్వరులు దిగుమతి వ్యాపారం మానరు. అప్పుడు గాని బ్రిటిష్ వ్యాపారానికి తగినంత నష్టం వాటిల్లదు. కాబట్టి బ్రిటిష్ వస్తు బహిష్కారం దౌర్జన్యానికి దారి తీసి తీరుతుంది. వంగదేశపు విభజన సందర్భంలో విదేశ వస్తు బహిష్కారం జయం పొందలేదు. రౌలట్ చట్టాన్ని మూడునెలల్లో రద్దు చేయకపోతే తాము బ్రిటిష్ దిగుమతులను ఆపివేస్తామని దేశపాండ్య, బాప్టిస్టాగార్లు దొరతనం వారికి చివరి సందేశం పంపినారు. మూడునెలలు గతించినాయి. ప్రభుత్వంవారు ఆ చట్టం రద్దు చేయలేదు. బాప్టిస్టా, దేశపాండ్య గార్లు బహిష్కారం అమలు
జరపడానికి సర్వవిధాలా ప్రయత్నించి పూర్తిగా విఫలులైనారు. ఆ విషయం వారు అంగీకరిస్తున్నారు కూడా. దౌర్జన్యంలో విశ్వాసం కలవారు బ్రిటిష్ సరుకుల దిగుమతిని బహిష్కరించడానికి పూనుకోవచ్చు కాని నేను మాత్రం ఆ దరికి పోలేను.
శాసన సభలకు పోకూడదని మీరు బోధిస్తున్నారు. దానికంటే శాసనసభలకు పోయి ప్రభుత్వం వారి చర్యలను ఆటంక పరచడం ఎక్కువ ప్రయోజనకారి కాదా?
కాదు, ముమ్మాటికీ కాదు. ఆత్మగౌరవం కలవారు శాసనసభలకు పోయినట్లయితే వాటికి గౌరవం వస్తుంది. అది లేనివారు పోయినా శాసనసభలకు ఏమీ గౌరవము ఉండదు. ప్రస్తుతం శాసనసభలు కల్లు దుకాణాలవంటివి. ప్రస్తుతం నేను వాటిలోకి పోయినట్లయితే వాటికి గౌరవం వస్తుంది. ప్రజలకు వాటిపట్ల గౌరవం పెరుగుతుంది కూడా. కాబట్టి మనమే ఉద్దేశంతో శాసనసభలకు పోయినా వాటి గౌరవం పెరిగే మాట వాస్తవం. ప్రస్తుతం పరిపాలకులు అక్రమ మార్గాలను అవలంబిస్తూండడం చేత వారు ఏర్పరచిన శాసనసభలకు పోక మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవలే. పండిత మాలవ్యాజి పట్ల నాకు ఎంతో పూజ్యభావమున్నది. కాని నేనెవ్వరిని అంధప్రాయంగా పూజించను. వారు రౌలట్ చట్టం సందర్భంలో శాసన సభ్యత్వాన్ని ఒకసారి వదిలివేసి తిరిగి శాసనసభ్యులయినారు. అందువల్ల వారికి కలిగిన ఫలితమేమిటి?
పంజాబ్ విషయమై శాసనసభలో ఒక మహోపన్యాసం చేసి థాంసన్‌గారి దూషణలకు గురి అయినారు. వారే శాసనసభకు పోక బయటనుంచే వారా ఉపన్యాసం చేసి పంజాబ్ అత్యాచారాలను వెల్లడించి ఉండి నట్లయితే థాంసన్ గారి దూషణలకు వారు గురై ఉండేవారు కాదు. మాలవ్యాగారు ఆ సభలో మహోపకారం చేసినట్లు మనం వారిని శ్లాఘిస్తున్నాము. అది వట్టి పొరపాటు. వారు బయటనే ఎక్కువ ఉపకారం చేయగలిగి ఉండేవారు. లోకమాన్యతిలక్ గారు శాసనసభలకు పోకుండా చేసిన మహోపకారాలతో శాసనసభ్యులు చేసిన సేవ ఎన్నో వంతు? నీవు శాసనసభకు పోతావా లేక కల్లు అంగడికి పోతావా అని నన్నెవరైనా అడిగితే, నేను కల్లు అంగడికి పోవడానికే ఇష్టపడతానని చెబుతాను. ఆత్మగౌరవం లేనివారు శాసనసభలకు పోతే పోనీయండి. ప్రతి గ్రామంలోను ఓటర్లు సభచేసి ఆ సభ్యులు తమ ప్రతినిధులు కారాని తీర్మానించి ప్రకటిస్తారు. అప్పుడు ఏ మొఖం పెట్టుకొని వారు ప్రజా ప్రతినిధులమని అంటారో చూడవలసి ఉంది. అప్పుడు శాసనసభలకు ఏమి గౌరవ ముంటుంది! పంజాబ్ విషయంలో ‘ఖిలాపత్’ సందర్భంలో మీ హృదయాలు నిజంగా పరితపిస్తున్న ట్లయితే మీ దేశభక్తి యథార్థమైనట్లయితే, మీకు ఆత్మగౌరవమున్నట్లయితే మీకు శాసనసభలను బహిష్కరించి తీరవలె. జాతీయవాదుల్లోను, మితవాదు ల్లోను మంచివారు, చెడ్డవారు కూడా ఉన్నారు. స్వార్ధ ప్రేరితులైనవారు స్వప్రయోజనాలు పొందనీయండి. సదుద్దేశం ఉన్న మితవాదులు మొదట శాసనసభలకు పోయినప్పటికీ కొంత కాలంకైనా తాము మోసపోతిమని తెలుసుకొని పశ్చాత్తాప పడతారు.
ఓటర్లకు మీరు చెప్పినంత విచక్షణ ఉంటుందా?
ఓటర్లు తెలివితక్కువవారు కారు. వారిపైన నాకు చాలా విశ్వాసమున్నది. విద్యాధికులకంటే కూడా వారెక్కువ వివేకం కలవారు. గ్రామాలకు పోయి మనం సరిగా బోధిస్తే వారు ఎన్నికలకు పోరు. ఏ స్వల్ప సంఖ్యాకుల కోసమో ఎన్నుకొనబడినవారు తమ ప్రతినిదులు కారని పెద్ద సభలు చేసి తీర్మానించి వారా సభ్యత్వం వదులుకొనేటట్లు చేయగలరు. ఈ పని చేయడానికి ఒక మాసం చాలు. మీరందుకై కృషి చేయవలె.
పరిపాలకులు అక్రమమార్గం అవలంబిస్తున్నా రని మీరిప్పుడైనా తెలుసుకొన్నారు. మొదటినుంచీ వారు మనకు అన్యాయం చేయడం లేదా?
మనకు అన్యాయం జరుగుతూన్న మాట నిజమే. అందుకై మన అసమ్మతిని తెలుపుతూనే ఉన్నాం. కాని మన నాయకులు పంజాబ్‌లో అగౌరవింప బడినప్పుడు సోదర దేశీయులు పొట్టలపై పాకింపబడి నప్పుడు మహమ్మదీయుల మత విశ్వాసానికే భంగం వాటిల్లినప్పుడు నా సహనము మేర దాటింది. ఆత్మగౌరవానికి భంగం కలిగినప్పుడు సహనానికి తావులేదు. ఈ అధర్మాన్ని నిగ్రహించడానికి ప్రయత్నించేటప్పుడు మనకు అపూర్వమైన బలం కలుగుతుంది. ఆ బలంతో తక్కిన కష్టాలను కూడా నివారించుకోగలగుతాం.
మీరు దక్షిణ దేశమంతా తిరిగి వచ్చినారు. మీ ఉద్యమానికి ఎటువంటి ప్రోత్సాహం వచ్చింది?
నాకు నిరుత్సాహం కలుగలేదు. బిరుదులను, గౌరవ పదవులను విడిచి పెట్టడానికి కొందరు తయారుగా ఉన్నారు. కొందరు న్యాయవాదులు కూడా తమ వృత్తిని వదలివేయడానికి సంకల్పించుకున్నారు. త్వరలో వారిపేర్లు ప్రకటించగలము.
రేపు కలకత్తా కాంగ్రెస్ మీ ఉద్యమం అంగీక రించనట్లయితే మీరు ఏమి చేయదలుచుకున్నారు? కాంగ్రెస్ తీర్మానానికి మీరు లోబడరా?
నా అంతర్వాణికి తప్ప నేను దేనికి లోబడను; కాంగ్రెస్ ఉద్దేశం ప్రజా బాహుళ్యం ఉద్దేశం ఏటేటా వ్యక్తీకరించడమే కాని దేశీయుల భావ స్వాతంత్య్రాన్ని నిరోధించడం కాదు. ఈ యేటి కాంగ్రెస్ నా ఉద్యమాన్ని అంగీకరించనట్లయితే ప్రజలలో దానినింకా వ్యాపింపజేసి ప్రతిపక్షాలను నా వైపుకు తిప్పుకునే టందుకు ప్రయత్నిస్తాను. పై సంవత్సరమైనా నా కార్యక్రమం కాంగ్రెస్‌చే అంగీకరించేటట్లు చేయగలను. కాంగ్రెస్ తీర్మానం అంటే ఆ ఏడు సమావేశమైన ప్రతినిధులలో ఎక్కువమంది అభిప్రాయమని కాని భిన్నాభిప్రాయాలు ఉన్న వారు కాంగ్రెస్‌లో ఉండకూడదని కాదు.
నేను కాంగ్రెస్ అభిమానిని అయినా నా వాదం నాదే. నా వాదం కాంగ్రెస్ అంగీకరించేటట్లు చేయడమే నా కర్తవ్యము. లోకమాన్యుని అభిప్రాయా లను మొదట కాంగ్రెస్ అంగీకరించలేదు. తర్వాత అవి సర్వజనాంగీ కారాలైనాయి. అట్లాగే నా పక్షం రేపు కాంగ్రెస్‌లో గెలవకపోయినా భయంలేదు. పై సంవత్సరమైనా నా పక్షం గెలిచి తీరుతుందని నా నమ్మకం. కాంగ్రెస్‌లో అధిక సంఖ్యాకులు అంగీకరించిన తీర్మానానికి విరుద్ధంగా కాంగ్రెస్ అభిమానులెవ్వరూ ప్రవర్తించకూడదనే వాదంకంటే వెర్రివాదం ఇంకొకటి లేదు. నిమ్నజాతులను ఉద్ధరించవలెననే తీర్మానం కాంగ్రెస్ రెండు సంవత్సరాల కిందటనే ఆమోదించింది. అంతకు పూర్వం ఎవ్వరూ ఆ ఉద్యమంలో పాల్గొనకూడదని ఎవరయినా చెప్పడానికి సాహసించినారా? కాంగ్రెస్ ఉద్దేశమెప్పుడూ ఆత్మ స్వాతంత్య్రానికి ప్రతికూల మయింది కాదు.
శాసనసభ్యత్వం మాదిరి బోర్డులు, మున్సిపాలిటి సభ్యత్వం కూడా వదిలివేయవలెనని మీ అభిప్రాయమా?
నేను కేవలం ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను వాదించేవాణ్ణి కాను. ఆదర్శము ఎంతవరకు ఆచరణయోగ్యమో ఆలోచించే ఈ కార్య విధానాన్ని నిశ్చయించినాను. బోర్డులు, మున్సిపాలిటిలోని సభ్యత్వాలను వదిలి వేయకూడదు. అందువల్ల మన గ్రామాల, పట్టణాల ఆరోగ్యరక్షణకు భంగం కలుగుతుంది. ఆ సంఘాలకు ప్రజలు ఎన్నుకొన్నవారు కాక ప్రభుత్వం నియమించినవారు మాత్రమే సభ్యత్వం వదలివేయవలె.
ఈ కార్యవిధానం నిశ్చయించడంలో మీ ప్రధాన లక్ష్యమేమిటి?
భారతదేశానికి ప్రత్యేక జాతీయ దృష్టి ఉందని నా అభిప్రాయం. మనం చేసే ప్రతి పని దానికను గుణంగా ఉండవలె. నా కార్యక్రమం వల్ల ఆత్మశక్తి బాహుబలం కంటే బలవత్తరమయినదని రుజువు కాగలదు. దేశియులలో నిద్రాణమయి ఉన్న సంకల్పశక్తి వజ్రకాఠిన్యం పొందగలదు. కోర్టులను బహిష్కరించడం వల్ల పంచాయితీ వ్యవస్థలు వృద్ధి పొందగలవు. ప్రభుత్వ పాఠశాలలను విడనాడడం వల్ల జాతీయ విశ్వవిద్యాలయాలు పెంపొందగలవు. జనంలో ఆత్మగౌరవం వర్ధిల్లగలదు. హిందూ మహమ్మదీయ సఖ్యత విలసిల్లగలదు; వేయ్యేల స్వరాజ్యలక్ష్మికి అధికారులం కాగలం.
మహాత్మాజీ! మీకీ కార్యవిధానం తప్ప ఏ ఇతర పథకం కనపబలేదా?
కనపడకపోవటమే కాదు. కనుక్కోవడానికి ప్రయత్నించాను కూడ. కాని నాకు గోచరం కాలేదు.
‘ఆంధప్రదేశ్‌లో గాంధీజీ’ : (తెలుగు అకాడమీ ప్రచురణ) నుంచి