ఆమె జీవితకాలం 95 సంవత్సరాలు. చేపట్టింది బోధక వృత్తి. తొలి నుంచీ అనంత ఆసక్తి చూపింది తెలుగు, సంస్కృత భాషల్లో. తన పూర్తి పేరులో రెండు బంగారాలు (కాంచనం, కనకం) ఉన్నట్లే – ఆ రెండు భాషల్నీ స్వర్గసమంగా చూశారనిపిస్తుంది. కాంచనపల్లి కనకమ్మ అనగానే ఉభయ భాషాభిమానులు ఎవరికైనా మొట్టమొదటి ‘కాశీయాత్రా చరిత్ర’ గుర్తుకొస్తుంది. కాదా మరి? ఆ కావ్యరచన చేసే నాటికి ఆమెకి కనీసం 20 ఏళ్లయినా లేవు. వయసుకు మించిన ధారణశక్తి, ఆ ఈడువారిలో మరెవ్వరికీ లేనంత భాషా వైదుష్యం తనకు తానుగా సొంతం చేసుకున్నారు. ఇదే పేరుతో గ్రంథాన్ని అంతకుముందు దశాబ్దాల క్రితమే సుప్రసిద్ధులు రచించారు. మరో కోణంలో, ఇంకెంతో విస్తృత స్థాయిలో తాను సాగించిన కథాక్రమ వర్ణన పలువురి మదిని తాకింది. అటు తర్వాత (1912 అనంతరం ఏడేళ్లకే) 1919లో జీవయాత్ర పేరిట వేరొక పుస్తకం. చారిత్రక దృక్పథంతో విరచించిన ‘గౌతమబుద్ధ’ను అవలోకిస్తే.. సమస్త భోగభాగ్యాలనీ పరిత్యజించి, అరణ్యప్రాంతంలో ధ్యానముద్ర వహించి, సకల జనావళికీ భవ్యదివ్య సందేశమందించిన మహనీయత మనందరి ముందూ సాక్షాత్కరిస్తుంది. ‘దుమ్ముతుడిచిన నిలువుటద్దమ్మునందు ప్రతిఫలించిన స్వీయరూపమ్మ పగిది / స్వచ్ఛమగు సన్మనుష్యుని స్వాంతమందు స్పష్టముగ దర్శనమ్మిచ్చు సృష్టి యెల్ల’ అన్నదీ అవగతమవుతుంది. వీటితోపాటు ఆ కవయిత్రి ఇతర కావ్యాలనీ సమీక్షించినప్పుడు సార్థక నామధేయురాలనే అంటాం.
ఇన్నిన్ని రచనలు కొనసాగించిన కనకమ్మ జీవితం మరీ అంత సునాయాసమేమీ కాదు. అనేక విధాల స్థితిగతులను దృఢచిత్తంతో ఎదుర్కొని నిలిచారు. స్వస్థలం ఆంధప్రదేశ్‌లోని గుంటూరు ప్రాంతం. చదువులో ఎప్పుడూ ముందు వరసనే ఉండేవారు. మాతృభాషకు తోడు విదేశీ భాషల అధ్యయనంపైనా మక్కువ చూపించేవారు. ఆంగ్లానికి సంబంధించి పట్టభద్రురాలయ్యాక ఉపన్యాసక ఉద్యోగాన్ని కోరుకున్నారు. ఉమ్మడి ఆంధ్రతో పాటుగా తమిళనాట కూడా బడి పిల్లలకు పాఠాలు చెబుతూ వచ్చారు. కొంతకాలం గడిచాక తెలుగు నిపుణతా సాధించి, కళాశాల స్థాయిన విద్యాబోధన చేశారామె. పనిచేసే రోజుల్లో అభ్యాసకుల ప్రశ్నించేతత్వాన్ని పెంచి పోషించారు. ఎవరు ఏ భాష నేర్చుకోవాలనుకున్నా ప్రాథమిక అంశాలపైన చూపు సారించాలనేవారు. ‘శ్రవణం, మననం ఎంతైనా మేలు చేస్తాయి. వ్యక్తీకరణ శక్తి సంపాదిస్తే వ్యక్తిగత – వృత్తిపర ఉన్నతి సులభ సాధ్యమవుతుంద’ని తన దృఢ అభిప్రాయం. బోధనకు జోడీగా రచనల మీదా గట్టి పట్టు సంపాదించా రనేందుకు ఆమె కావ్యాలే నిదర్శనాలు. పద్య ముక్తావళిలో లలిత సుందర పదసంపదను పొందుపరిచారు. ‘యెకింతయున్ దోసములేని శబ్దములతో, నటనంబొనరించు పాదవిన్యాసముతో, సమంచిత గుణంబులతో, సహజమ్ములౌ యతి ప్రాసలతో, మనోజ్ఞమగు పాకముతో’….. రచనా విష్కరణ నిర్వర్తించారు. అందులోని శబ్ద ప్రౌఢిమ నాడు ఎందరెందరినో అలరించిందంటే, మూలం అదే!
ఎడతెగని బోధన, సాధన
అభిజ్ఞాన శాకుంతలం అనడంతోనే తళుక్కుమనే కాళిదాసు ఆ మహారచయిత్రికి ఆరాధ్యులు. అక్షర తరంగాలు పొంగులెత్తే కవీంద్రులెవరన్నా తనకు అత్యంత ప్రీతిపాత్రులే. ఆ కళావీధి తాను చరించే రాచబాట, అంతటి స్నేహార్ద్ర భావవైభవ గీతి తన పాలిట నవరసాభిషేకం. అంతేనా – ‘భారతీదేవి మృదులాంక భద్రపీఠి ముద్దులొలికెడి రతనాల గద్దె నాకు, తెనుగు తోటల సంస్కృత వన లతాళి అంటుతొక్కెడు ఆంధ్ర విద్యార్థినిని నేను’ అని పలికిన కవి స్వరసారాంశమూ కనకమ్మ కవయిత్రికి వర్తిస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటంలోని ఉత్తమత్వాన్ని తాను పుణికి పుచ్చుకున్నారు. నేర్చుకుని నేర్పించడమనే బోధకతత్వాన్ని కలమంతా నింపుకొని ఆదర్శప్రాయ అయ్యారు. సంస్కృత నాటకాన్ని తెలుగీకరించడంలో ఎక్కడికక్కడ విద్వత్తు కనబరచి స్ఫూర్తిదాయక పాత్ర పోషణతో కృతకృత్యులయ్యారు. కాళిదాస మహాకవిని మించిన వారెవరు? సంస్కృత భాషలో విఖ్యాతి సంతరించుకున్న ఐదు కావ్యాల్లో సగానికి పైగా ఆయనవే కదా! ప్రతి పదాన్నీ సందర్భసుందరంగా ప్రయోగించి మాన్యులై వెలుగులీనిన సారస్వత సామ్రాట్టు. అందుకే సమర్చన చేసిన ఈ కవయిత్రీలలామ శాకుంతలాన్ని రమరమ్యంగా రూపుదిద్దారు.
ఒక్క పద్యం అనేమిటి – కథ చెప్పినా, నవల రాసినా, నాటకం రూపొందించినా, చారిత్రకత రంగరించినా ఆమెదొక ప్రత్యేక పంథా. కవితా విశారద బిరుదు పొందినా, సువర్ణ కంకణం బహూకృతిగా స్వీకరించినా కారణం అదే.
గౌరవాదరాల మేళవింపు
రామాయణ సంగ్రహం, రంగశతకం, పాండవ ఉదంతం – ఇలా పద్య గద్యాలన్నింటా తనదైన ముద్ర వేశారు ఈ కవిశిరోమణి. పత్రికల్లో రచనలు, విద్యాసంస్థల్లో ఉపన్యాసాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో సర్వత్రా విలక్షణత నిలబెట్టుకున్నారు. జీవనయానాన్ని ఒక కావ్యఖండికలో విపులీకరిస్తూ అన్నారిలా.. ‘బాల్యంబుననె యాంధ్ర భాషా కవిత్వంబు నరపెమున్ గురు రామానుజుండు/ఆంగ్ల విద్యా రహస్యంబు నాకెరిగించె లీలమై పిదపడ్తె స్డేలు సాధ్వి/సాంస్కృత సాహిత్య సంప్రదాయము నృసింహాచార్య పండితుండవల దెల్పె/విజ్ఞాన సంఘముల్ వివిధ పరీక్షల బంగారు పతకాల ప్రతిభ గూర్చె’ అంటూ తనకు బోధించిన, తనను ప్రోత్సహించిన మహనీయులెందరినో గుర్తుచేసుకున్నారు. అదే క్రమంలోనే ‘ఏనుగు పైనెక్కి యూరేగి సత్కవులకు బెట్టు గూర్చినవాడు వేంకట కవి/ముగురు వ్రాసిన వేదమున భారతము నొంటి గృతి జేయు సుకృతి శ్రీ కృష్ణసుకవి/కృతి విమర్శకులకగ్రేసరుండును ఖ్యాతిగొన్నట్టి దిట్ట యా కుప్పసామి/సర్వకళా విచక్షణుడు సత్కవియన్న కీర్తిగాంచిన కాశికృష్ణ బుధుడు’ అని పేరు పేరునా తలచి కవితాభివందనాలు అందించారామె. నన్ను నా జీవయాత్ర మన్ననలు సలిపి / కవి తిలకమంచు నన్నెంతో గౌరవమున / బిలుచుటెల్లను నీ కృపకలిమికాదె / తను విభూషిత భర్గ యో కనక దుర్గ’ అంటూ కైమోడ్పులందజేసిన వినమ్రశీలి. చెన్నైలోని రచనా వ్యాసంగ కృషి, ఉన్నత విద్యాసంస్థల్లో బోధనవృత్తి మిళితమై అనుపమాన కావ్యాలనేకం ఆవిష్కృతమయ్యాయి. కవితామృత ఆనందసారాన్ని రంగరించి కనకమ్మ సృజించినవన్నీ అశేష అభిమానుల విశేష ఆదరణకి పాత్రమవడం వందనీయం, స్మరణీయం.
జన కవయిత్రిగా ఖ్యాతి
విభిన్న పక్రియలన్నింటా సమాన ప్రతిభా సామర్థ్యాలు కనబరచిన కాంచనపల్లి – తెలుగు భాషాభ్యుదయానికి అన్ని విధాలా సహాయ సహకారాలందించారు. వ్యక్తులు, శాఖలు, విభాగాలు, సంఘాలు, సంస్థల మధ్య సమన్వయ విధులు నెరవేర్చి కనక కవయిత్రిగా జనమన్నలందుకున్నారు. విఖ్యాత మద్రాసు విశ్వవిద్యాలయంలో కీలకబాధ్యతలు పరిపోషించారు. తెలుగు పుస్తకాలను నిర్ణయించే సంఘ ప్రతినిధుల్లో ఒకరిగా ఎంత సేవ చేయాలో అంతా చేసిన కనకమ్మ మనందరి బంగారం!
- జంధ్యాల శరత్‌బాబు , సీనియర్ జర్నలిస్ట్