– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

ఇండియాను కొల్లగొట్టాలన్న దురుద్దేశమే లేకపోతే జపాన్‌ ‌మనకు మద్దతు ఎందుకిస్తుంది? మనకు స్వాతంత్య్రం వస్తే దానికి ఏమిటి లాభం? తనను చుట్టిముట్టిన సవాలక్ష సమస్యలను పక్కనపెట్టి వేల మైళ్ళ దూరంలోని ఇండియాకు స్వతంత్రం కోసం అది ఎందుకు ప్రయాసపడుతుంది? మనల్ని నమ్మకంగా వంచించి, తెల్లవాళ్ళను జయించాక మన నెత్తిన జపాన్‌ ‌తానే తిష్ట వేస్తానంటే మన పరిస్థితి ఏమిటి?

ఈ అనుమానాలు బయటి వారికే కాదు. నేతాజీ వెంట నడిచి రక్తం ధారవోసిన సైన్యాధికారుల్లోనూ మొదట్లో ఉండేవి. లోలోన మధన పడకుండా నేరుగా ప్రియతమ నాయకుడినే ఓసారి అడిగేశారు. ఆ ముచ్చటను మేజర్‌ ‌జనరల్‌ ‌షా నవాజ్‌ఖాన్‌ ‌చెబుతాడు వినండి:

జపాన్‌తో మనకు సాపత్యం ఏమిటి? మనతో వారికి అవసరమేమిటి? మనకు సహాయం చేస్తే వారికి ఒరిగేదేమిటి? ఎంతవరకూ వాళ్ళను నమ్మవచ్చు- అని ఓరోజు తీరుబడిగా కబుర్లాడుతున్న వేళ కొంతమంది ఆఫీసర్లు నేతాజీని అడిగారు. దానికి ఆయన ఇచ్చిన జవాబు ఇది:

ఇండియా బ్రిటిష్‌ ఆధిపత్యంలో ఉన్నంత కాలమూ జపాన్‌ను అణచేందుకు సేనలను, ఆయుధ సామాగ్రిని, సైనిక సరఫరాలనూ తరలించటానికి ఇండియాను అడ్డాగా బ్రిటన్‌ ‌వాడుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఇండియాలో బ్రిటిష్‌ ‌పాలన ఉన్నంతకాలమూ జపాన్‌కు క్షేమం ఉండదు. కాబట్టి ఇండియా నుంచి బ్రిటిషువారిని గెంటెయ్యటం జపాన్‌కే అవసరం. ఎందుకంటే వారిని వీరు గెంటి వేయకపోతే వారే వీరిని తూర్పు ఆసియా నుంచి గెంటి వేస్తారు. మనకు సహాయం చేసి జపాన్‌ ‌మనకేమీ ఉపకారం చేయటం లేదు. వారు మనకు సహాయం చేస్తున్నట్టే మన వల్ల వారూ సహాయం పొందుతున్నారు. మనం మన స్వాతంత్య్రం కోసమూ, వారు తమ భద్రత కోసమూ తెల్లవారితో కలిసి పోరాడుతున్నాం.

అంతేకాదు. నేను బ్రిటిషు వాళ్ళను నమ్మనట్టే జపాన్‌ ‌వాళ్ళనూ నమ్మను. అసలు దేశ స్వాతంత్య్రం విషయంలో ఎవరూ ఎవరినీ నమ్మకూడదు. మనం బలహీనులమైనంతకాలమూ అందరూ మనల్ని వాడుకోవాలనే చూస్తారు. జపాన్‌ ‌మనకు ద్రోహం చేయకుండా ఉండాలంటే మనం బలిష్ఠంగా ఉండటం ఒకటే ఉపాయం. నేను జపాన్‌ ‌నుంచి హామీలూ రక్షణలూ ఏమీ కోరను. మన బలమే మనకు రక్ష. ఇండియాకు వెళ్ళిన తరవాత తెల్లవాళ్ళ స్థానం తాము ఆక్రమించాలని జపానీయులు చూశారో వారి భరతం మనం పట్టాల్సిందే- అన్నాడు నేతాజీ.

ఈ మాట జనాంతికంగా సైన్యాధికారులతో అనడమే కాదు. పబ్లిగ్గా బహిరంగ సభల్లోనే నేతాజీ పలుమార్లు చెప్పేవాడు. ఐఎన్‌ఎలో చేరే ప్రతి సైనికుడూ మొదట ఇంగ్లిషువాళ్ళతో, తరవాత అవసరమైతే జపాన్‌తో కూడా పోరాడటానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఉద్బోధించేవాడు.

[INA & ITS NETAJI, Maj. Gen. Shah Nawaj Khan, p. iii ]

విచిత్రమేమిటంటే? జపాన్‌ ‌స్వప్రయోజనాల గురించి సుభాస్‌ ‌చంద్రబోస్‌కు ఉన్నపాటి తెలివిడి కూడా జపాన్‌ ‌పాలకులకు లేదు. తమకు ఏది క్షేమమో, దానిని ఎలా సాధించాలో వారికే తెలియదు.

భారత సరిహద్దు మీదికి సైనిక బలగాలను జపాన్‌ ఎం‌త వేగిరం ఉరికిస్తుందా అని అందరూ వెయ్యికళ్ళతో ఎదురు చూస్తుండగా 1943 ఆగస్టు 26న టోక్యో మిలిటరీ హై కమాండ్‌ ‌నుంచి ఇద్దరు దూతలు సుభాస్‌ ‌చంద్రబోస్‌ను కలిశారు. ఒకడు మేజర్‌ ‌జనరల్‌. ‌రెండోవాడు మేజర్‌. ‌భారత సరిహద్దు దగ్గర మణిపూర్‌లోని ఇంఫాల్‌ ‌ప్రాంతంలో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌సహకారంతో మిలిటరీ ఆపరేషన్‌ ‌మొదలుపెట్టాలని ఇంపీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయమైందన్నది వారు తెచ్చిన శుభవార్త. ఆపరేషన్‌ ‌వివరాలుగాని, దానికి సంబంధించి తీసుకోనున్న సన్నాహక చర్యల గురించి గాని దూతలకు తెలియదు.

జపాన్‌ను ఏలుతున్నవారికి బుర్ర, బుద్ధి ఏ మాత్రం ఉన్నా ఆ నిర్ణయాన్ని సంవత్సరం కిందటే తీసుకోవలసింది. ఇండియాపైకి వారు దండెత్తేది సుభాస్‌ ‌బోస్‌ ‌కళ్ళనీళ్ళు తుడవటానికి కాదు. భారత స్వాతంత్య్ర పోరాటానికి సాయపడాలన్న ఔదార్యంతోనూ కాదు. భారత్‌పై బ్రిటన్‌ ‌పెత్తనాన్ని అంతమొందించటం జపాన్‌కే అత్యవసరం.

అంతర్జాతీయ రాజకీయాలలో పేరు, ప్రతిష్ఠ గడించి ఆసియాలో బలిష్ఠ శక్తిగా ఎదగటానికి అదృష్ట దేవత జపాన్‌కు కావలసిన అన్ని అవకాశాలనూ ఇచ్చింది. దాని ఇరుగుపొరుగు దేశాలు చాలావరకు పాశ్చాత్య రాజ్యాల ఆక్రమణలో ఉన్నవి. వాటి అధికార కేంద్రాలు ఎక్కడో వేలమైళ్ళ దూరంలో ఉండేవి. ఆయా దేశాలతో జపాన్‌కు వర్ణ సాపత్యం ఉన్నందున ఆ జాతి బాంధవ్యాన్ని పురస్కరించుకుని, పొరుగు దేశాల నిస్సహాయ స్థితి పట్ల సానుభూతి, సంఘీభావం కనపరచి, వాటి సుహృద్భావం చూరగొని ఉంటే తూర్పు ఆసియాలో జపాన్‌ ‌నాయకత్వాన్ని ఏ పాశ్చాత్య శక్తీ సవాలు చేయగలిగేది కాదు. సైనిక శక్తిలో, పోరాట పటిమలో జపాన్‌కు ప్రపంచంలో పెద్దపేరు. కాని తమ అల్పబుద్ధితో, అత్యాశతో, దురహంకారంతో, మిడిసిపాటుతో టోక్యో పాలకులు అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ తప్పటడుగులతో, వరసగా తప్పుడు నిర్ణయాలతో చేజేతులా జారవిడుచుకున్నారు.

జపాన్‌ ‌ప్రధాన ప్రత్యర్థి చైనా. ఇరు దేశాల మధ్య చిరకాల వైరం. రెండో ప్రపంచ యుద్ధానికి చాలా ఏళ్ల కిందటే జపాన్‌ ‌దుందుడుకుగా చైనా మీద పడి విశాల రాష్ట్రాలను, ఎన్నో రేవులను దౌర్జన్యంగా ఆక్రమించింది. నాన్‌ ‌కింగ్‌ ‌నుంచి జాతీయ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. షాంఘై లాంటి ముఖ్య కేంద్రాలను వశపరచుకుంది. జపాన్‌ ‌ధాటికి నిలవలేక చుంగ్‌ ‌కింగ్‌కి పలాయనమైన చాంగ్‌ ‌కై షేక్‌ ‌జాతీయ వాదులు, కమ్యూనిష్టుల మద్దతుతో హోరాహోరీగా పోరాడుతున్నాడు. అతడి ప్రభుత్వానికి అంతర్జాతీయంగా బ్రిటన్‌, అమెరికాలు పెద్ద అండ. మిత్ర రాజ్యాల నుంచి సైనిక బలగాలు, ఆయుధాలు, ఇతర సరఫరాలు ఇండియా నుంచి బర్మా మీదుగా చైనా చేరతాయి. చైనా మీద జపాన్‌ ‌గెలవాలంటే ఆ సరఫరాలను అడ్డగించి తీరాలి. వాటిని ఆడ్డుకోవాలంటే బర్మా పూర్తిగా జపాన్‌ అధీనంలో ఉండాలి. దానికంటే ముఖ్యంగా ఇండియా మీద బ్రిటిష్‌ ఆధిపత్యం పోవాలి. అప్పుడుగానీ ఇండియా స్థావరంగా అమెరికన్‌, ‌బ్రిటిష్‌ ‌సైనిక బలగాల, ఆయుధాల సమీకరణ బెడద జపాన్‌కు తొలగదు. 1937 నుంచీ మొదలైన చైనా జపాన్‌ ‌ద్వితీయ సంగ్రామంలో మొదట్లో ఎదురులేకుండా సాగిన జపాన్‌ ‌దూకుడుకు తీవ్ర ప్రతిఘటన మొదలైంది. జపాన్‌ ‌వరసగా పరాజయాల పాలవుతున్నది. ఈ స్థితిలో మిత్రరాజ్యాలనుంచి, ముఖ్యంగా బ్రిటిష్‌ ఇం‌డియా నుంచి తనకు ముప్పులేకుండా చూసుకోవటం జపాన్‌కు జీవన్మరణ సమస్య. ఆ ముప్పును నిలువరించే తాహతు దానికి లేదు. భారత స్వాతంత్య్ర సాయుధ యుద్ధానికి శాయశక్తులా తోడ్పడి తద్వారా బ్రిటన్‌ ‌పీడను వదిలించటం మినహా జపాన్‌కు సర్వనాశనం నుంచి తప్పించుకోవటానికి వేరే దారిలేదు.

రెండో ప్రపంచ యుద్ధంలో పర్ల్ ‌హార్బర్‌ ‌విజయోత్సాహంలో జపాన్‌ ‌మెరుపులా కదిలి ఇండో చైనా, మలయా, సింగపూర్‌, ‌బర్మాలను వరసగా వశపరచుకుంది. జాతిపరమైన సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని, ఆయా దేశాల ప్రజలతో సౌమ్యంగా, స్నేహంగా వ్యవహరించి ఉంటే పాశ్చాత్య సామ్రాజ్యపు పీడనుంచి తమను విముక్తి చేసిన ఉపకారులన్న కృతజ్ఞతకు జపాన్‌ ‌పాలకులు పాత్రులయ్యేవారు. కాని బ్రిటిషువారికంటే క్రూరంగా వారు మలయా, సింగపూర్‌, ‌బర్మాలను పరిపా లించారు. బర్మీయులను శతవిధాల సతాయించి, పీడించి, వారిని శాశ్వతంగా దూరం చేసుకున్న మీదట తమ స్వార్థం కోసం బర్మా స్వాతంత్య్ర సేనకు సైనిక శిక్షణ ఇచ్చి, ఆధునిక ఆయుధాలను అందించారు. సమయం వచ్చినప్పుడు వాటిని జపాన్‌ ‌మీదే ఎక్కుపెట్టటానికి బర్మీయులు కాచుకుని కూర్చున్నారు.

బ్రిటిషు సేనలు ఆదమరచి ఉన్నప్పుడు బ్రిటిషు కాలనీలను జపాన్‌ ఆ‌క్రమించడంతో కథ అయిపోదు. శక్తులు కూడదీసుకుని శత్రువు విరుచుకు పడి ఆ కాలనీలను మళ్ళీ స్వాధీనపరచుకోక మానడు. శత్రువు శక్తి కేంద్రాన్ని నిర్వీర్యం చేయనంతవరకు శత్రువు బెడద తొలగదు. ఆసియాలో బ్రిటిషు సామ్రాజ్యానికి శక్తి కేంద్రం ఇండియా. ఇండియా నుంచి బ్రిటిషు వారిని వెళ్ళగొట్టే వరకు ఎత్తిన కత్తిని దించరాదన్న పూనిక లేకుండా, దానికి నిర్దిష్ట వ్యూహం లేకుండా మలయా, సింగపూర్‌ల మీదికి అసలు జపాన్‌ ‌దండు వెళ్లనే కూడదు. ఇండియాకు ముఖద్వారం వంటి బర్మాను వశపరచుకున్నాక ఆలస్యం చేయకుండా ఇండియాపైకి దండయాత్ర చేసి ఉండవలసింది.

మామూలుగా అయితే అది జపాన్‌ ‌తరం కాదు. ఆ దుస్సాహసాన్ని భారతీయులు సహించరు. విదేశీ దాడిని ఎదుర్కోవటంలో బ్రిటిషు ప్రభుత్వానికి బాసటగా నిలవక మానరు. కానీ అదే దాడి భారత స్వాతంత్య్రం కోసం జరిగితే పరిస్థితి వేరు. దైవికంగా జపాన్‌కు పరిస్థితులు కలిసివచ్చాయి. 50 వేల మంది భారతీయ సైనికులు యుద్ధఖైదీలుగా జపాన్‌కు పట్టుబడ్డారు. వారిలో చాలామంది ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ (ఐఎన్‌ఎ)‌లో చేరి భారత స్వాతంత్య్రం కోసం జపాన్‌తో చేతులు కలిపారు. వారి కోరిక మీద ఆఘమేఘాల మీద వచ్చి స్వాతంత్య్ర సంగ్రామాన్ని నడిపించటానికి బెర్లిన్‌లో సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌సిద్ధంగా ఉన్నాడు. ముందు అనుకున్న ప్రకారం బోస్‌ను హుటాహుటిన రప్పించి ఆయన నేతృత్వంలో ఐఎన్‌ఎ ‌సేనలు బ్రిటిషు ఇండియా మీదికి దండెత్తటానికి జపాన్‌ ‌సహకరించి ఉంటే దేశంలోని జాతీయశక్తుల సుహృద్భావంతో 1942లో బహుశా సునాయాసంగా బ్రిటిష్‌ ‌సర్కారు పీచమణచ గలిగేది. ఆ సమయాన తన సైనిక బలగాలన్నీ చాలా వరకూ విదేశాలలో మొహరింపబడి, జర్మనీ, ఇటలీల ధాటికి దిమ్మతిరిగి ఇండియాలో బ్రిటిష్‌ ‌దొరతనం అత్యంత బలహీనస్థితిలో ఉన్నది. జపాన్‌ ‌దూకుడుకు కళ్ళు బైర్లుగమ్మిన అమెరికా అప్పట్లో బ్రిటన్‌ను ఆదుకునే ఆశ లేదు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదనీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఎన్ని విధాల నచ్చచెప్పినా టోక్యో మూర్ఖాగ్రేసరుల తలకెక్కలేదు. చిట్టగాంగ్‌ను పట్టుకుని, అస్సాం, మణిపూర్‌లను ఆక్రమించడం ద్వారా ఇండియా మీద దాడికి ‘ఆపరేషన్‌ 21’ ‌పేరుతో రహస్య తంత్రం రచించి కూడా జపాన్‌ ఏలికలు ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు. యూరప్‌లో జర్మనీ చెలరేగి, రష్యాను కబళించనున్నదనీ, దాంతో ఆసియాలో తమ రొట్టె విరిగి నేతిలో పడుతుందనీ మూర్ఖాగ్రేసరుడు టోజో ఆశ పెట్టుకున్నాడు. మహా దుర్బలంగా ఉన్న తరుణంలో బ్రిటిషు సామ్రాజ్యం మీద వేటు వేయకుండా రెండేళ్ళ విలువైన కాలం వృథా చేశాడు. సుభాస్‌ ‌బోస్‌ను తూర్పుకు రప్పించాలని ఉన్నతస్థాయిలో నిర్ణయమై సంవత్సరం తిరిగాక గాని టోజో మహానుభావుడు బోస్‌ ‌మొగం చూడలేదు. ఆలోగా పుణ్యకాలం దాటిపోయింది. జపాన్‌కు చేటు కాలం దాపురించింది.

బర్మా దాకా వెళ్లి అర్ధాంతరంగా పోరాటం నిలిపివేయటంతో మిత్రరాజ్యాలు మెల్లిగా తెప్పరిల్లి కాలూ చెయ్యీ కూడతీసుకున్నాయి. బ్రిటన్‌కు దన్నుగా అమెరికన్‌ ‌బలగాలు ఇండియాలో మకాం వేశాయి. బర్మాను తిరిగి స్వాధీనపరచుకోవటానికి, చైనాకు సైనిక దళాలను, ఆయుధాలను దండిగా చేరవేసి జపాన్‌ ‌తిక్క కుదర్చటానికి, మెరుపువేగంతో జపాన్‌ ‌గుంజుకున్న తమ వలస రాజ్యాలను మళ్ళీ ఆక్రమించి జపాన్‌ను భస్మీపటలం చేయటానికి మిత్రరాజ్యాలు సర్వశక్తులూ సమీకరించి శరవేగంతో దూసుకు రానున్నాయి. చిన్‌ ‌కొండలకు ఆవల బ్రిటిషువారు ఆరు డివిజన్లను మొహరించి బర్మాను తిరిగి కైవసం చేసుకోవటానికి సర్వసన్నద్ధం అవుతున్నారు. అమెరికన్‌ ‌జనరల్‌ ‌జోసెఫ్‌ ‌స్టిల్‌ ‌వెల్‌ 14 ‌చైనీస్‌ ‌డివిజన్లకు తర్ఫీదు ఇచ్చి ఉత్తరం వైపునుంచి బర్మా మీద పడి, అటునుంచి చుంగ్‌ ‌కింగ్‌కు కదిలి జపాన్‌ ‌దుంప తెంచటానికి సన్నాహాలు చేస్తున్నాడు. మిత్ర రాజ్యాల ఉమ్మడి దాడి నుంచి బర్మాను కాపాడు కోవటానికే పది డివిజన్ల సైన్యాన్ని జపాన్‌ ‌సమీకరించు కోవలసి వచ్చింది. మెడ చుట్టూ ఉచ్చు బిగియనున్నదని గ్రహించాక ఆత్మరక్షణ కోసం ఎదురుదాడికి టోక్యో మిలిటరీ ఆయత్తమైంది. చిట్టగాంగ్‌ ‌సెక్టార్‌లో గాని, ఈశాన్య భారతంలో గాని సైనిక దాడి చేసి, సరిహద్దుల్లో శత్రువు స్థావరాలను ధ్వంసం చేయాలని జపాన్‌ ఇం‌పీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌నిర్ణయించింది. అదిగో ఆ రహస్య వర్తమానాన్నే 1943 ఆగస్టులో సుభాస్‌ ‌చంద్రబోస్‌కు టోక్యో దూతలు చెవిన వేసింది.

 పుణ్యకాలమంతా వ్యర్థపరచి, తాత్సారం చేసి చేసి ఎట్టకేలకు భారత్‌పై దండెత్తటానికి ఆయత్తమైన తరవాతైనా జపాన్‌ ‌చురుకుగా కదిలిందా? లేదు. ఎన్ని రోజులు గడిచినా టోక్యోనుంచి మళ్ళీ చప్పుడు లేదు. రోజురోజుకీ యుద్ధపరిస్థితి విషమించసాగింది. ఇటలీ చేతులెత్తేసి సరండర్‌ అయింది. పసిఫిక్‌ ‌మహాసముద్రంలోని సోలమన్‌ ‌దీవుల్లో అమెరికా సేనల దూకుడుకు జపాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఇరుక్కున్న చోటల్లా దెబ్బ మీద దెబ్బతో మాడు పగులుతుండటంతో కొత్తగా ఇంకో చోట యుద్ధానికి సిద్ధపడే ధైర్యం జపాన్‌కి క్రమేణా సన్నగిల్లుతున్నది. అది పూర్తిగా బేజారు అయితే ఇండియా ఆపరేషను అటకెక్కుతుంది. బోస్‌ ‌జీవితాశయం భగ్నమవుతుంది. సాయుధ స్వాతంత్య్ర సంగ్రామం ఆగిపోతుంది. అది నేతాజీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. తన పరువును పణం పెట్టయినా జపాన్‌ను రెక్కపుచ్చుకుని పోరాటంలోకి దింపదలిచాడు. అనుకున్నది సాధించటం కోసం తాను నవ్వులపాలవటానికి కూడా సిద్ధపడ్డాడు.

అది 1943 సెప్టెంబరు. నేతాజీ సింగపూర్లో అడుగు పెట్టి మూడు నెలలే అయింది. ఐ.ఎన్‌.ఎ. ‌సిపాయిలు బర్మా రంగానికి అప్పుడప్పుడే కదులుతున్నారు, బోస్‌ ‌సింగపూర్‌లో ఒక మాస్‌ ‌రాలీలో ప్రసంగించటానికి కారులో వెళుతున్నాడు. ఉన్నట్టుండి ‘‘ఈ సంవత్సరం ముగిసే లోగా మన సేనలు భారత్‌ ‌గడ్డ మీద కాలు మోపబోతున్నట్టు ఈ సభలో ప్రకటించబోతున్నాను’’ అని పక్కనే ఉన్న ఎస్‌.ఎ. అయ్యర్‌తో అన్నాడు. అయ్యర్‌ ‌తుళ్ళి పడ్డాడు. సంవత్సరం ముగియటానికి నిండా నాలుగు నెలలు కూడా పట్టదు. ఇంకా పోరాటం మొదలే కాలేదు. జపాన్‌ ‌రంగంలోకి దిగనే లేదు. మరి ఇంతలోనే సరిహద్దు దాటి భారతదేశం చేరటం ఎలా సాధ్యం? చెప్పింది చేయలేకపోతే ఎంత అప్రతిష్ట?

అదే మాట అయ్యర్‌ అన్నాడు. అది అవుతుందని మీకు నమ్మకం ఉందా? దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా? అని ఆత్రంగా అడిగాడు. అతడి కంగారు చూసి బోస్‌ ‌చిన్నగా నవ్వాడు. ‘అంతా సరిగానే అవుతుందిలే భయపడకు’ అన్నాడు. ఆయన అంత ధీమాగా ఉన్నాడంటే పైస్థాయిలో ఏదో పెద్ద మంత్రాంగమే నడుస్తూండి ఉండాలి; ఆ రహస్యం తనకు చెప్పటం నాయకుడికి ఇష్టం లేదేమో? అనుకున్నాడు అయ్యర్‌. అయినా? పబ్లిగ్గా ప్రకటన చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి? అని సభాస్థలికి చేరేదాకా అంటూనే ఉన్నాడు. నేతాజీ ఆలకించలేదు. సంవత్సరం తిరిగేలోగా స్వాతంత్య్ర సేనలు ఇండియాలో అడుగు పెట్టబోతున్నాయని 50 వేలమంది పాల్గొన్న సింగపూర్‌ ‌సభలో సంచలనాత్మక ప్రకటన చేశాడు. జనం ఆనందంతో పరవశులయ్యారు. దిక్కులు దద్దరిల్లేలా చాలాసేపు చప్పట్లు కొడుతూనే ఉన్నారు.

ఆ కబురు తెలియగానే స్థానిక జపాన్‌ ‌సైన్యాధి కారులు కంగారు పడ్డారు. జపాన్‌ ‌పత్రికల్లో, రేడియోలో నేతాజీ సంచలన ప్రకటన వెల్లడికాకుండా హుటాహుటిన సెన్సార్‌ ‌చేశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌రేడియో ప్రసారంలో కూడా ఆ సంగతి తొక్కిపెట్టమని ఐఎన్‌ఎలో పౌరసంబంధాల విభాగం చూసే వారి వెంట పడ్డారు. ఏమి చెయ్యమంటారని ఆ విభాగం వాళ్ళు బోస్‌ను అడిగారు. ఆయన తెలివితేటల్లో జపాన్‌ ‌వాళ్ళను తలదన్నిన వాడు. సభ నుంచి ఎకాఎకి రేడియో స్టేషనుకు వెళ్లి ఇంకో నాలుగు నెలల్లో భారత్‌ ‌చేరతామన్న సంగతి స్వయంగా తానే లోకానికి చాటాడు. అంతర్జాతీయంగా అదో పెద్ద ప్రకంపనం.

జపాన్‌ ‌మిలిటరీ వాళ్లకు అనుమానాలు జాస్తి. భారతీయులను తమ ప్రాపగాండాకు వాడుకోవాలనే తప్ప భారత స్వాతంత్య్రానికి సాయపడాలన్న చిత్తశుద్ధి వారికి ఏ కోశానా లేదు. ఇండియన్ల చేతికి ఆయుధాలిచ్చి సంఘటితం కానిస్తే వాటిని తమ మీదే ఎక్కడ ఎక్కుపెడతారోనని వారికి భయం. కాలం కలిసి వచ్చి ఇండియా తమకు వశమైతే దానిని తమ చక్రవర్తి సామ్రాజ్యంలో తేరగా కలుపుకోవచ్చనీ వారికి లోలోన ఒక దురాశ. ఆ కుత్సితం తోటే మోహన్‌సింగ్‌ ‌నాయకుడుగా ఉన్నంత కాలమూ ఐఎన్‌ఎను ఎదగనీయకుండా అడ్డుకున్నారు. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌వచ్చాక ఆ పప్పులు ఉడకలేదు. ప్రవాస ప్రభుత్వం ఏర్పరిచాక 1943 నవంబరులో టోక్యో వెళ్ళినప్పుడు నేతాజీ ప్రధానమంత్రి టోజోతో లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నాడు. 30 వేల మంది సైనికులతో ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌కు 3 డివిజన్లు ఏర్పరచుకోవటానికీ, 20 వేలమందితో వాలంటీర్ల దళాలు నడపటానికీ జపాన్‌ ‌ప్రభుత్వ సమ్మతిని పొందాడు. అహోరాత్రులూ నిర్విరామంగా పరిశ్రమించి అన్నివేల మందినీ సమీకరించి, ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ను అతి తక్కువ వ్యవధిలో సమారానికి ఆయత్తం చేశాడు. సైనిక వ్యవస్థీకరణ అంతా అయ్యాక చేయబోయే యుద్ధంలో తన సైనిక బలగాలకు నిర్దేశించిన బాధ్యతలు, వాటికి కేటాయించిన యుద్ధ రంగాలు ఏమిటో కనుక్కోవటానికి దక్షిణాది సైన్యానికి సుప్రీం కమాండర్‌ ‌కౌంట్‌ ‌తెరౌచిని నేతాజీ కలిశాడు.

మూర్ఖుల మంద అయిన ఆ కాలపు జపాన్‌ ‌మిలిటరీ కమాండ్‌లో ఒక పెద్ద మూర్ఖుడు ఈ తెరౌచీ. అతగాడు ఏమన్నాడో తెలుసా? ఐఎన్‌ఎ ‌నేరుగా యుద్ధరంగంలోకి వెళ్ళవలసిన అవసరం లేదట. జపాన్‌ ‌సైనికులు వీరవిహారం చేసి యుద్ధం గెలిచాక విజయగర్వంతో ఇండియాలో ప్రవేశించే సమయానికి ఆ బలగాలు బుట్టబొమ్మల్లా ముందు నడిస్తే చాలట. అది విన్న బోస్‌కు మతిపోయింది. అదేమిటయ్యా? ఎందుకలా? మా వాళ్ళు యుద్ధానికి ఎందుకొద్దు? అని అడిగాడు. దానికి అవతలివాడి జవాబు ఏమిటంటే? ఐఎన్‌ఎలో ఉన్నది బ్రిటిషు కొలువు చేసిన కిరాయి సైనికులట. జపాన్‌ ‌సైనికులకుండే దమ్ము, దన్ను వారికి ఉండవట. ఏడాదికి పైగా చేతులు ముడుచుకుని సోమరిగా ఉండటంతో వారి పోరాట పటిమ కూడా తక్కువ రకమట. వాళ్ళు చవటలు కాబట్టే యుద్ధంలో ఓడి డీలా పడ్డారట. అందువల్ల వారిని యుద్ధానికి దూరంగా ఉంచి జపాన్‌ ‌వీర సైనికుల చేత పోరాటం చేయిస్తారట. భారతీయుల నిమిత్తం బ్రిటిషు వారిని జయించే కార్యమూ జపనీయులే సాధించి పెడతారట.

ఇది తెరౌచీ అనేవాడి సొంత పైత్యం కాదు. ఇంపీరియల్‌ ‌జనరల్‌ ‌హెడ్‌ ‌క్వార్టర్స్ ‌నుంచి వచ్చిన ఆదేశాలనే అతగాడు పలికాడు. విన్న నేతాజీకి ఒళ్ళు మండింది. తమ ప్రతాపంతో యుద్ధం గెలిచాక భారతీయులను వెంటబెట్టుకుని వెళ్లి స్వాతంత్య్రం ఇప్పిస్తామని జపాన్‌ ‌వాళ్ళు చెప్పటం మోసం. భారత సైనికుల శక్తిని చులకన చేయటం తెంపరితనం. సహించి ఊరుకోవటానికి బోస్‌ ‌జపాన్‌ ‌బొమ్మ కాదు. ‘చూడు నాయనా. యుద్ధం జరగబోయేది మా దేశ స్వాతంత్య్రం కోసం! దానిలో మేమే ముందుండి పోరాడాలి. ప్రాథమిక బాధ్యత మేమే తీసుకోవాలి. మా రక్తమే చిందించాలి. మా వల్ల కానప్పుడు మీ సహాయం అడుగుతాం. పోరాట శక్తిలో మేము ఎవరికీ తీసిపోము. మా ప్రమేయం లేకుండా జపనీస్‌ ‌సైనికులు మాకు సాధించి పెట్టే స్వాతంత్య్రం మా దృష్టిలో బానిసత్వం కంటే హీనం. మొట్టమొదట మేమే ఇండియాలో ప్రవేశించాలి. భారత గడ్డపై మొదటి రక్తపు బొట్టును భారతీయుడే చిందించాలి’ అని కరాఖండిగా చెప్పాడు.

బోస్‌ ‌ముందు తమ పన్నాగాలు పారవని తెరౌచీకి అర్థమయింది. దెబ్బకు దారికొచ్చాడు. అలాగే కానిద్దాం. ముందుగా మీ రెజిమెంటు ఒకదానికి యుద్ధరంగంలో బాధ్యతా ఇస్తాం. రంగంలో వారి సామర్ధ్యాన్ని చూశాక మిగతా బలగాలకూ అవకాశం ఇస్తాం అని బేరం పెట్టాడు. నేతాజీ సరే అన్నాడు.

వెనక్కి వెళ్ళాక బోస్‌ ‌తన సైన్యాధికారులకు జరిగింది చెప్పి ‘మీరేమంటారు? తెరౌచీ సవాలును స్వీకరిద్దామా?’ అని అడిగాడు. వారు ముక్తకంఠంతో ఔనన్నారు. అప్పటికే జాతీయ నాయకులు గాంధీ, నెహ్రూ, ఆజాద్‌ల పేరిట మూడు బ్రిగేడ్‌లు ఏర్పడ్డాయి. వాటిలోనుంచి మెరికల్లాంటి వారిని ఎంపిక చేసి కొత్తగా ఇంకో బ్రిగేడ్‌ ‌రూపొందించి, ముందుగా దానిని యుద్ధరంగానికి తరలించాలని  నిర్ణయమయింది. దానికి సుభాస్‌ ‌బ్రిగేడ్‌ అని పేరు పెట్టారు. మేజర్‌ ‌జనరల్‌ ‌షా నవాజ్‌ ‌ఖాన్‌ను దానికి కమాండర్‌గా నియమించారు. యుద్ధప్రాతిపదికన కావలసిన ఏర్పాట్లు, కొనుగోళ్ళు జరిగాయి.

సుభాస్‌ ‌బ్రిగేడ్‌ ‌రెడీ. ముందుకు కదలమని ఆర్డర్లు రావటమే తరువాయి.

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE