అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ ‌పైచేయి సాధించినందుకు పాకిస్తాన్‌లో సంబరాలు వెల్లివిరిశాయి. భారతీయ ఉదారవాదుల సంఘీభావం ఆ సంబరాలకు తోడైనా రాని ఊపు ఈపాటికి వచ్చి ఉంటుంది. ఎందుకంటే లష్కర్‌ ఏ ‌తాయిబా, జైష్‌ ఏ ‌మహమ్మద్‌ ఉ‌గ్రవాద సంస్థల సభ్యులు విజయగర్వంతో పాకిస్తాన్‌లో అడుగుపెడుతున్నారు. కాబట్టి ఆ సంబరాలు మిన్నంటుతాయంటే అతిశయోక్తి కాదు. ఆ సంబరంలోనే వాళ్ల అంతరంగాలు బయటపడుతున్నాయి. అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌పై చేయి సాధించడం అనేది దేవ రహస్యం కాకపోయినా, ఆ పరిణామంతో పాకిస్తాన్‌కు కలిగిన ఆనందం గురించి వాళ్ల నోటి నుంచి వినడం, అందునా అధికార పార్టీ ప్రతినిధి నోటి ద్వారా వింటే మరింత అధికారికంగా ఉంటుంది. ‘పాకిస్తాన్‌ ‌సైన్యానికీ, తాలిబన్‌కీ మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. కశ్మీర్‌ను సాధించడంలో తాలిబన్‌ ‌మాకు తోడ్పడతారు.’ ఇది అధికార పార్టీ ప్రతినిధి ఒక చానల్‌లో జరిగిన చర్చ సందర్భంగా వెల్లడించిన విషయం. అందుకే ఇప్పుడు తాలిబన్‌ ఉ‌గ్రవాద సంస్థకీ, ఉగ్రవాదుల అండతో నడిచే పాకిస్తాన్‌కీ మధ్య బంధాన్ని కొత్త కోణం నుంచి చూడవలసి ఉంటుంది. కశ్మీర్‌ ‌కోసమే తాలిబన్‌తో పాకిస్తాన్‌ అం‌టకాగుతోందా? లేకపోతే బెదిరింపుల కోసం ఇలాంటి ప్రకటన చేయించారా? అలాగే ఐసిస్‌ (‌ఖొరాసన్‌) ‌పేరు తెర మీదకు రావడం కూడా కొత్త ప్రశ్నలకు తావిచ్చేదే. వీళ్లే కాబూల్‌ ‌విమానాశ్రయంలో ఆగస్ట్ 26 ‌నాటి ఘోర విస్పోటనం వీళ్ల పనే.  ప్రస్తుతం తాలిబన్‌ ఉం‌డవలసినంత కఠినంగా ఉండడంలేదని ఈ కొత్త ఉగ్రవాదులు పుట్టుకొచ్చారని తెలుస్తున్నది. తాలిబన్‌లోనే కాఠిన్యం లేదని వీళ్లు అనుకుంటున్నారంటే, వీళ్లు పెరిగితే ప్రపంచం పరిస్థితి ఏమిటి? ప్రధానంగా కాస్త దగ్గరలో ఉన్న భారత్‌ ‌పరిస్థితి ఏమిటి?

అప్ఘానిస్తాన్‌లో ఉన్న అమెరికా, నాటో సేనల మీద పోరాటం లేదా జిహాద్‌ ‌పేరుతో గత కొన్నేళ్లుగా తాలిబన్‌ ‌సాగిస్తున్న ఉగ్రవాద చర్యలలో తమ వంతు సాయం అందించిన లష్కర్‌ ఏ ‌తాయిబా, జైష్‌ ఏ ‌మహమ్మద్‌ అనే పాకిస్తాన్‌ ఉ‌గ్రవాద మూకలు విజయగర్వంతో ఆ దేశానికి చేరుకుంటు న్నాయి. అష్రాఫ్‌ ‌ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్‌ ‌కూల్చేసిన తరువాత అక్కడి కారాగారాలలో ఉన్న ఆ రెండు పాకిస్తానీ ఉగ్రవాద సంస్థల సభ్యులని విడిచి పెట్టేశారు. కొన్ని అంతర్జాతీయ నిఘా సంస్థల అంచనా ప్రకారం 1500 నుంచి 2000 వరకు లష్కర్‌ ఏ ‌తాయిబా ఉగ్రవాదులు, 2000 నుంచి 2500 జైష్‌ ఏ ‌మహమ్మద్‌ ఉ‌గ్రవాదులు వాళ్ల ఆత్మబంధువులు తాలిబన్‌తో కలసి ఇంతకాలం జిహాద్‌లో శ్రమించారు.

అఫ్ఘాన్‌ ‌కారాగారాల నుంచి విడతలు విడతలుగా ఆ రెండు ఉగ్రవాద సంస్థల సభ్యులు ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న వాళ్ల శిక్షణ సంస్థలకి చేరుకుంటున్నారు. వీళ్లే అక్కడ విజయోత్సవాలు మొదలుపెట్టారు. ఉరేగింపులు, గాల్లోకి తుపాకులు పేల్చడం వంటి పనులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇవన్నీ అబ్బాస్‌పూర్‌, ‌హాజిరా, సెన్సా వంటి ప్రాంతాలలో కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ ఊళ్లు అధీన రేఖకు దగ్గరగా ఉంటాయి. అంటే వాళ్ల సంబరాలు భారత్‌ ‌గమనించాలి.

తాలిబన్‌తో కలసి జైష్‌, ‌లష్కర్‌ ‌మూకలు ఊరికే పనిచేయలేదు. ఐఎస్‌ఐ, ‌పాకిస్తాన్‌ ‌సైన్యం ఆదేశాల మేరకే చేశాయి. అక్కడ ఆ మహత్కార్యం ముగించుకుని సొంత దేశానికి తిరిగి వస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ‌ప్రాంతానికి చెందినవారే. వీళ్లకి తర్ఫీదిచ్చి విడతలవారీగా తాలిబన్‌ ‌సేవ కోసం పంపించేవారు. అఫ్ఘాన్‌లో ఈ రెండు సంస్థలు, పాక్‌ ‌సైన్యం, తాలిబన్‌ ‌కలసి పనిచేసేవి. ఇదంతా ఐక్య రాజ్యసమితికి తెలియనది కాదు. అక్కడ చనిపోయిన ఉగ్రవాదుల శవాలను వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు కూడా పాకిస్తాన్‌ ‌చేసేది.

అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌పైచేయి సాధించడంతోనే తమ ఆశయం పూర్తయిందని పాకిస్తాన్‌ ‌భావించడం లేదు. ఇటీవలే ముఫ్తీ అబ్దుల్‌ ‌రవూఫ్‌ అజహర్‌ అనే పాక్‌ ఉ‌గ్రవాద నేత వెళ్లి తాలిబన్‌ ‌ప్రముఖులు ముల్లా బరాదర్‌, ‌ముల్లా యాకూబ్‌లను కాందహార్‌లో కలుసుకున్నాడు. మేం చేసిన సాయానికి మీరు కూడా ప్రత్యుపకారం చేసే సమయం వచ్చేసిందని గుర్తు చేయడానికే రవూఫ్‌ అజహర్‌ ‌వెళ్లాడు. ఇతడు జైష్‌ ‌వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ అజహర్‌ ‌చిన్న తమ్ముడే. ఆ ఇద్దరు తాలిబన్‌ ‌ప్రముఖులలో ముల్లా యాకూబ్‌ ఎవరో కాదు. తాలిబన్‌ ‌వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ ‌కొడుకు. చూడబోతే అక్కడ ఉగ్రవాదం కుటీర పరిశ్రమలా ఉందేమిటి అన్న అనుమానం కలిగితే అది అసహజమేమీ కాదు. తాలిబన్‌లో సైనిక విభాగం పనులన్నీ యాకూబ్‌ ‌చూస్తాడట. మొదటిసారి 1996 నుంచి 2001 వరకు అఫ్ఘాన్‌ను పాలించి, తరువాత తాలిబన్‌ అజ్ఞాతంలోకి వెళ్లినప్పుడు యాకూబ్‌ ‌పాకిస్తాన్‌లో ఉన్నాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇంతటివాడు ఖాళీగా ఎందుకు ఉంటాడు? ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న జైష్‌ ఉ‌గ్రవాద శిబిరంలో తర్ఫీదు పొందాడు. నిజానికి జైష్‌ ‌వ్యవస్థాపకుడు మసూద్‌ అజహర్‌, ‌యాకూబ్‌ ‌తండ్రి ముల్లా ఒమర్‌ ‌సన్నిహితులే కూడా. అఫ్ఘాన్‌లో తాలిబన్‌ ‌విజయం తరువాత ఆగస్ట్ 16‌న ముల్లా ఒమర్‌ ‘‌మంజిల్‌ ‌కి తరఫ్‌’ అని పోస్ట్ ‌పెట్టాడట. అంటే- గమ్యం వైపు. అంటే అఫ్ఘాన్‌ ఆ‌క్రమణతో లక్ష్యం పూర్తి కాలేదా? మరి లక్ష్యం ఏమిటి? ఆ ముందురోజే తాలిబన్‌ ‌చేతికి అఫ్ఘానిస్తాన్‌ ‌వచ్చింది. ఆ విజయాన్నే పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌  ‌విదేశీ సంకెళ్లు తెంచుకోవడం అంటూ వర్ణించాడు. తాలిబన్‌ ‌విజయాన్ని మొదట గుర్తించినవాడు ఇమ్రాన్‌. ఐఎస్‌ఐ ‌మాజీ అధిపతి అసద్‌ ‌దురాని చేసిన వ్యాఖ్యలో తాలిబన్‌కు అభినందనతో పాటు, అమెరికాకు పాకిస్తాన్‌ ‌చేసిన నమ్మక ద్రోహం కూడా వెల్లడైంది. మేం అమెరికా నుంచి ఆయుధాలు, డబ్బు కూడా తీసుకున్నాం. కానీ మేం ఏనాడూ తాలిబన్‌తో దెబ్బలాడలేదు. అమెరికా సేనలని వాళ్లే గెంటేశారు అన్నాడు దురానీ. అసలు తాలిబన్‌ ‌నేత బరాదర్‌తో కలసి, ఐఎస్‌ఐ ‌ప్రస్తుత అధిపతి ఫైజ్‌ ‌హమీద్‌, ‌పాక్‌ ‌విదేశాంగ మంత్రి ఖురీషీ కలసి నమాజ్‌ ‌చేస్తున్నట్టు చూపే ఒక వీడియో కూడా వైరల్‌ అయింది. బరాదర్‌ ‌కాందహార్‌ ‌వచ్చిన తరువాత ఆ ఇద్దరు రహస్యంగా వెళ్లి కాందహార్‌లో అతడికి అభినందనలు తెలిపివచ్చిన సంగతి కూడా బయటపడింది. తాలిబన్‌ ఆ‌క్రమణ తరువాత పాకిస్తాన్‌లోని చాలా మదర్సాల మీద తాలిబన్‌ ‌జెండా ఎగిరింది.

తాలిబన్‌ ‌ముట్టడి తరువాత ఒక పాక్‌ ‌టీవీ చానల్‌లో చర్చ జరిగింది. అందులో నీలమ్‌ ఇర్షాద్‌ ‌షేక్‌ అనే ఆవిడ కూడా పాల్గొన్నది. ఈమె ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ ‌నాయకురాలు. ఇమ్రాన్‌ ‌పార్టీకీ, పాకిస్తాన్‌కీ భారత్‌ ‌పట్ల ఉన్న ద్వేషం ఎంతో ఈమె ఏమాత్రం దాచుకోలేదు. కశ్మీర్‌ ‌విషయంలో మేమూ, తాలిబన్‌ ‌కలసి పనిచేస్తాం అని చెప్పింది. ‘మేం మీతో ఉంటాం. కశ్మీర్‌ ‌విషయంలో మీకు అండగా నిలుస్తాం’ అని తాలిబన్‌ ‌హామీ ఇచ్చారని ఇర్షాద్‌ ‌చెప్పారు. మీరు మాట్లాడేదేమిటో మీకు తెలుస్తున్నదా అంటూ యాంకర్‌ ఎం‌త చెప్పినా ఆమె అదే వాగ్ధోరణి కొనసాగించింది. తాలిబన్‌ని అంతా అవమానపరిచారట. కాబట్టి తప్పకుండా తమకి సాయం చేస్తారని ఆమె ఘంటాపథంగా చెప్పేశారు. కానీ కశ్మీర్‌ అం‌శం భారత్‌ అం‌తర్గత సమస్య అని తాలిబన్‌ ‌తాజాగా ప్రకటించిన మాటేమిటి? తాలిబన్‌ ఇచ్చిన మాటను ఇప్పుడు ఎవరూ విశ్వసించలేరు. ఇదీ అంతే.

నిజానికి మొదటి నుంచి ముందుటి అఫ్ఘానిస్తాన్‌ ‌ప్రభుత్వ నేతలు పాకిస్తాన్‌ ‌మీద తీవ్రస్థాయి ఆరోపణలే చేస్తున్నారు. దేశంలో అల్లకల్లోలానికి పాకిస్తాన్‌ ‌సాయ పడుతున్నదని విమర్శించారు. చిత్రం ఏమిటంటే ఈ కల్లోలాలతో విధ్వంసమైన అఫ్ఘాన్‌ ‌పునర్‌ ‌నిర్మాణానికి ప్రపంచ దేశాలు సాయం చేయాలని తాలిబన్‌ ‌పిలుపునిచ్చింది. ఈ పిలుపు భారత్‌కు కూడా ఇచ్చారు. కానీ అక్కడి అన్ని దేశాల దౌత్య కార్యాలయాలను దాదాపు మూయించారు. భారత్‌ ‌దౌత్య కార్యాలయంలోకి ప్రవేశించి తనిఖీలు జరిపారు. కాబూల్‌లో  ఒక పర్యాటక ఏజెన్సీ కార్యాలయంలో ఈ మధ్య ముగ్గురు దుండగులు ప్రవేశించి మూడు భారత వీసాల మీద ముద్రలు వేసి తీసుకుపోయారు. భారత దౌత్యకార్యాలయం సాయంతో నడిచే పర్యాటక సంస్థ అది. ఈ మధ్య ఇక్కడే చాలా పాస్‌పోర్టులు కనిపించకుండా పోయాయి.

ఇక స్త్రీల సంగతి చెప్పక్కరలేదు. తాలిబన్‌ ఏలుబడిలో స్త్రీలు ఇంటి నుంచి పనిచేయడమే వారికి క్షేమమని ఆ సంస్థ అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ‌నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఉద్యోగమంటూ మహిళలు బయటకు వెళ్లపోతేనే వాళ్లకి మంచిదని అతడు చెప్పాడు. ఇప్పుడు వచ్చిన తాలిబన్‌ ‌గతంలో వచ్చిన వాళ్ల కంటే చాలామంచివాళ్లని అతడు విలేకరులకి చెప్పాడు. గతంలో విధుల నిర్వహణకు కార్యాలయాలకు బయలుదేరిన ఒక మహిళా బృందాన్ని తాలిబన్‌ ‌మధ్యలో నిలువరించి, మళ్లీ ఇంటికి తీసుకువెళ్లి ఒళ్లంతా కప్పి ఉండే ముసుగులు వేయించి పంపించిన అనుభవం ఉంది. తాజా తాలిబన్‌ ‌హయాం గతంలో ఉన్నంత కఠినంగా ఉండదని, అలా అని మహిళలకు ఇంతకు ముందు వరకు ఉన్న స్వేచ్ఛ మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని కొన్ని తాలిబన్‌ ‌వర్గాలు చెబుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిత్రం ఏమిటంటే తాలిబన్‌ ఇం‌కా కఠినంగా ఉండాలని ఐసిస్‌ (‌ఖొరసాన్‌) ‌కోరుతోంది.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE