సెప్టెంబర్‌ 21 ‌గురజాడ జయంతి

ఒక నాటకంగా కంటే ఒక కాలపు సమాజానికి అద్దం పట్టిన రచనగా చూస్తే ‘కన్యాశుల్కం’ విలువ తెలుస్తుంది. మహా రచయిత గురజాడ వేంకట అప్పారావు రాశారు. 1897లో మొదటి కూర్పు, రెండవ కూర్పు 1909లో వచ్చాయి. ‘కన్యాశుల్కం’తో పాటు ‘కొండుభట్టీయం’, ‘బిల్హణీయం’ అనే నాటికలు కూడా రాశారు. ఇవి పరిపూర్ణ రచనలు కావు. ‘దిద్దుబాటు’ ‘మీ పేరేమిటి?’, ‘పెద్ద మసీదు’, ‘మెటిల్డా’, ‘సంస్కర్త హృదయం’ (ఇంగ్లిష్‌) ‌వంటి కథలు రాశారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌, ‌దేశమంటే మనుషులోయ్‌’ ‌వంటి పద్యాలు రాసి కవిగానూ తన ప్రత్యేకమైన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అయితే గురజాడ అంటే చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది ‘కన్యాశుల్కం’ నాటకమే. ఈ నాటకం ఎంతో గొప్పది అని చెప్పడానికి, ఆ రచనకు ముందో వెనకో వచ్చిన రచనలను తూర్పార పట్టే సంస్కృతి రావడానికి చాలాముందే దాని గొప్పతనాన్ని నాటి పత్రికలు గుర్తించాయి. 1897లో ఈ నాటకాన్ని విజయనగరంలోనే జగన్నాథ విలాసినీ సభ (నాటక సమాజం) ప్రదర్శించినప్పుడు ‘అముద్రిత గ్రంథ చింతామణి’, ‘తెలుగు హార్ప్’, ‘‌పీపుల్స్ ‌ఫ్రెండ్‌’ ‌వంటి పత్రికలు శ్లాఘించాయి. నిజానికి కన్యాశుల్కం గొప్పదనాన్ని చెప్పడానికి మిగిలిన నాటకాలను, వాటి రచయితలను తక్కువ చేసి చూపించవలసిన అవసరం కనిపించదు. లేదా ఒక నాటకాన్ని కాస్త గౌరవిస్తూ అది మాత్రం కన్యాశుల్కానికి దీటుగా నిలబడడవచ్చునని చెప్పడమూ వింతే. ఇలాంటి వాదనలేమీ అవసరం లేకుండానే కన్యాశుల్కాన్ని ‘నాటకేషు శాకుంతలం’ అన్న రీతిలో తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు చెప్పడానికి ఎవరికీ అభ్యంతరం ఉండదు.

చాలావరకు వాడుక భాషను తీసుకుని రాయడం వల్ల ‘కన్యాశుల్కం’ తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పిన రచనగా ఖ్యాతి తెచ్చుకుంది. గురజాడ వారి మీద గిడుగు రామమూర్తి ప్రభావం ఉంది. ఒక మహా నాగరికతకు చెందుతామని అనుకుంటూనే, ఆలోచనలను కుంచింప చేసుకున్న సమాజ దుస్థితిని గురజాడ ఈ రచనలో ఆవిష్కరించారు. ఇందులో గురజాడ చేసిన మొదటిదాడి కన్యాశుల్కం అనే దారుణమైన దురాచారం మీదనే. కన్యాశుల్కం తీసుకుని తమ చిన్నారులను వృద్ధులకు కూడా ఇచ్చి పెళ్లిళ్లు చేసిన సమాజాన్ని గురజాడ కటువుగానే నిరసించారు. విజయనగరం సంస్థానంలో జరిగిన బాల్య వివాహాల మీద జరిగిన సర్వే తరువాతనే మహా రచయిత కనుక, రచయితలో ఉండాల్సిన దూరదృష్టి ఉన్నవారు కాబట్టి గురజాడ అదే ఇతివృత్తంగా నాటకం రాశారు. నాటకంలో తరువాత ఆయన చర్చకు తెచ్చిన అంశం- విధవా పునర్‌ ‌వివాహం/ వారి దుస్థితి. మూడవది వేశ్యా సమస్య. ఇవి కాకుండా మూఢ నమ్మకాలను చాలా తీవ్రస్థాయిలో వెక్కిరించారాయన. ఈ మూడూ నాడు ప్రధానంగా బలహీన పరుస్తున్నది హిందూ సమాజాన్నే. ఇవి కాకుండా ఇంగ్లిష్‌ ‌చదువు పేరుతో సమాజంలో ప్రవేశిస్తున్న అత్యంత హేయమైన కృతక వాతావరణం గురించి కూడా గురజాడ చిత్రించారు. ఇందుకు ఆయన సృష్టించిన పాత్రే గిరీశం. ఇప్పటికీ ఈ పాత్ర చేత రచయిత చెప్పించిన సంభాషణలను ఉల్లేఖించడాన్ని బట్టే కన్యాశుల్కం కాలపరీక్షకు నిలిచిన రచన అని రుజువవుతున్నది.

ఏ రచననైనా అంచనా వేసేటప్పుడు స్థల కాలాలను చూస్తారు. భారతీయ సమాజం తనదైన విలువలను తెలిసి కొంత, తెలియక కొంత విస్మరించడానికి సిద్ధమైన కాలంలో వచ్చిన రచన కన్యాశుల్కం. ఎవరు ఇంగ్లిష్‌ ‌మాట్లాడినా ‘డంగైపోతూ’, అతడొక జ్ఞానిగా నెత్తిన పెట్టుకోవడానికి సమాజం పోటీ పడుతున్న కామే ఈ రచనకు నేపథ్యం. నాటకారంభమే దీనితో చేశారు గురజాడ. ‘సాయంకాలమైంది’ అంటూ గిరీశం ప్రవేశించడంతో నాటకం మొదలవుతుంది. సంభాషణలో ఇంగ్లిష్‌ ‌వాక్యాలు పోహళిస్తూ ఎదుటివారిని మోసం చేయడం ఇతని కళ. బతుకు తెరువు కూడా. ఇక వరసగా వెంకటేశం, బంట్రోతు (పొటాగిరాపు పంతులుకు), పూటకూళ్లమ్మ, మధురవాణి, రామప్పపంతులు, అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ, బుచ్చమ్మ, కరటకశాస్త్రి, మహేశం, సుబ్బమ్మ, లుబ్ధావధానులు, మీనాక్షి, చివరిగా సౌజన్యారావు పంతులు వంటి ప్రధాన పాత్రలు వస్తాయి. జీవితంలో, నాటి జీవన విధానంతో భంగపడినవి కొన్ని. భంగపడబోయి బయటపడినవి ఇంకొన్ని. బుచ్చమ్మ, మీనాక్షి, పూటకూళ్లమ్మ బాల్య వివాహాలతో జీవితం కోల్పోయినవారు. మధురవాణిది మరొక సామాజిక సమస్య. ఒకసారి కరటకశాస్త్రి అంటాడు, ‘మధురవాణి వంటి మణి లేకపోతే ఈ కళింగానికి ఎంత వెలితి వచ్చేదో అంటాడు. ఆరుద్ర అసలు మధురవాణి అనే పాత్ర లేకుంటే కన్యాశుల్కానికి ఎంత వెలితి ఉండేదో అని! వేశ్యగా జన్మించినా ఆమెలోని నిజాయితీనీ, ఎదుటివారి కష్టాలను, మరీ ముఖ్యంగా స్త్రీల పట్ల సానుభూతి కలిగి ఉండడం ఈ పాత్రలో కనిపించే అద్భుత లక్షణం. విధవరాలిగా పొట్ట పోసుకోవడానికి పూటకూళ్లు పెడుతున్న మహిళను కూడా మోసం చేసిన గిరీశం మధురవాణి ఇం• దాక్కుంటాడు. అక్కడికే వస్తుందామె. నాకేం తెలుసు అంటూనే, మంచం కింద చూపుతుంది మధురవాణి. అలాగే సుబ్బమ్మ అనే బాలికకు, వృద్ధుడైన లుబ్ధావధానులతో పెళ్లి జరగకుండా ‘చక్రం అడ్డువేసేది’ కూడా మధురవాణే. అలా ఒక వృద్ధుడితో పెళ్లికాకుండా ఆగింది. కానీ ఈ పరిస్థితిని గిరీశం ఉపయోగించు కోవడమే అసలైన నాటకీయత. అసలు ఆధునికత అంతా ఔదల దాల్చవలసినదేనా? పురాతనమైన దంతా నిరాకరించదగినదేనా? అన్న చరిత్రాత్మక సందిగ్ధత కూడా నాటకమంతా ప్రతిబింబిస్తూ ఉంటుంది. గిరీశం పాత్రను చూసిన తరువాత కూడా ఇదే ప్రశ్న వస్తుంది. అలాగే, పుట్టుక ఏదైనా మనిషిలో ఉండవలసినదీ, ఎదుటి వారు గౌరవించవలసినదీ మానవత్వం, నిజాయితీలే కదా అని మధురవాణి పాత్రను చూశాక అనిపిస్తుంది. ‘వేశ్యలంటే అంత చులకనా పంతులు గారూ!’ అంటూ ఆమె రామప్ప పంతులును ఉద్దేశించి వేసే ప్రశ్న నిజానికి మొత్తం సమాజానికి వేసిన ప్రశ్న. వేశ్యలను దూరం నుంచి చూడడానికి కూడా ఇష్టపడని న్యాయవాది సౌజన్యారావు పంతులు మధురవాణి విశాల చింతనకు మురిసిపోయి భగవద్గీతను కానుక ఇస్తాడు. ఆమె ఔన్నత్యాన్ని చాటడానికి రచయిత ఎంచుకున్న మార్గమిది. అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులు- వేదాధ్యయనం కలిగినవారే. కానీ ఆ అధ్యయనం ఇచ్చే మానసిక పరిపక్వతను అందుకోలేకపోయిన వారు. ఆలోచనలకు ఆధ్యాత్మికతను అద్దడంలో విఫలమైనవారు.

శిల్పపరంగా నాటకం సమున్నతంగా ఉంటుంది. నాటకీయతకు అసలు లోటే ఉండదు. లుబ్ధావధానులు వృద్ధాప్యంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇతడిని ఇలాంటి ఆలోచనకు తీసుకువచ్చినవాడు రామప్పపంతులు. సిద్ధాంతిని పంపించి, మాయమాటలతో ఒప్పిస్తాడు. ఈ పెళ్లి నాటకాన్ని వమ్ము చేసి, సుబ్బమ్మ బతుకును కాపాడినవారు మధురవాణి, కరటకశాస్త్రి. కరకటశాస్త్రి తన శిష్యుడు మహేశానికి బాలిక వేషం వేసి, లుబ్ధుడికి పెళ్లి చేస్తాడు. పెళ్లయ్యాక మహేశం విగ్గు, దుస్తులు గోడదగ్గర పడేసి ఉడాయిస్తాడు. కొత్త పెళ్లికూతురు బావిలో పడి చనిపోయిందంటూ దీనిని హత్యగా ప్రచారం చేస్తాడు రామప్పపంతులు. పూజారి గురవయ్య వచ్చి, లేని పెళ్లికూతురు దెయ్యమై వచ్చిందని భయపెడతాడు. లేని దెయ్యాన్ని సీపాలో బంధిస్తాడు. చివరికి సౌజన్యారావు పంతులు ఈ నాటకానికి తెర వేస్తాడు.

గిరీశం పాత్ర ద్వారా రచయిత చెప్పించిన కొన్ని సంభాషణలు నేటికీ వినపడుతున్నాయి. ‘అప్పుడప్పుడు ఒపీనియన్స్ ‌చేంజ్‌ ‌చేసుకుంటేనే గానీ పొలిటీషియన్‌ ‌కానేరడోయ్‌!’ అం‌టాడు అతడు. ఈ మాట ఇవాళ్టి చాలామంది రాజకీయవేత్తలకు వర్తించేదే. చుట్ట కాల్చడం మేధో ప్రకటని ఒక మార్గంగా భావిస్తాడు గిరీశం. దొరలు హవానా అని పిలిచే చుట్ట మూలంగానే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలంతా పెద్ద పెద్ద ఆవిష్కరణలు చేశారని శిష్యుడు వెంకటేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తుంటాడు. పైగా పొగతాగడం అనే లక్షణానికి మన పురాతన సాహిత్యంలో ఆధారాలు పుట్టిస్తాడు.

భారతీయ సమాజంలో సంస్కరణలు అవసరమైన ఒక కాలం ఉంది. అలాంటి పరిస్థితికి చాలా చారిత్రక పరిస్థితులు దోహదం చేసినా, ఒక ఊబిలో చిక్కుకున్న భారతీయ సమాజాన్ని సంస్కరించుకోవలసిన అవసరం కనపడింది. ఇది ధార్మిక కోణానికే కాదు, సాంస్కృతిక కోణానికి సంబంధించి రావలసిన మార్పు కూడా. గొప్ప సామాజిక అవసరం కూడా. ఆ పరిస్థితులలో వచ్చినదే ‘కన్యాశుల్కం’. బాల్య వివాహాల మీద, వేశ్యా సమస్య మీద, వితంతువుల దుస్థితి మీద గళం ఎత్తిన రచయితగా గురజాడను స్మరించుకోవడం ఎప్పటికీ అవసరమే. దొంగస్వాముల మీద కూడా గురజాడ రచన దాడి చేస్తుంది. కల్లుపాకలో ఆయన ఆవిష్కరించిన ‘దేవరహస్యాలు’ తమకున్న చాలా భ్రమల గురించి ఒక వర్గాన్ని ఆలోచింప చేస్తాయి. పోలీసుల ప్రవర్తన మీద విసిరిన వ్యంగ్యాస్త్రాలు ఇప్పటికీ తాజాగానే అనిపిస్తాయి. గిరీశం ఒక సందర్భంలో అన్న మాట చాలా విలువైనది. ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ ‌గురించి బండివాడికి రెండు గంటలు ‘లెక్చరు’ ఇచ్చాడట. అంతా అయ్యాక ఆ బండివాడు అడిగిన మాట ఒక్కటే, ‘మా ఊరు కనిస్టీబుని కాంగ్రెస్‌వారు ఎప్పుడు బదలీ చేస్తార?’ని. బ్రిటిష్‌ ఇం‌డియాలో పోలీసుల జులుంకు ఇది నిదర్శనం.

గురజాడ విజయనగరం మీద ఉదయించిన నవ సాహితీ సూర్యుడు.

About Author

By editor

Twitter
YOUTUBE