సెప్టెంబర్‌,10 ‌వినాయక చవితి

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించే వాడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్ధితో దానిని అధిగమించవచ్చని నిరూపించాడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించ డంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.

గజాననుడిని ప్రణవనాద స్వరూపుడిగా, శబ్దబ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకు డిగా గణేశపురాణం, సమస్త లోకానికి ఆధారశక్తిగా గణేశగీత చెబుతున్నాయి. దేవతల నుంచి మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయతీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని వేదవాక్కు. అందుకు ఎన్నో పురాణగాథలు ఉదాహరణలుగా ఉన్నాయి.

‘కండబలముతోనే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు’ అన్నారు ఒక కవి. శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు. బలాన్ని, బలహీనతను ఎరిగి ప్రవర్తించాలన్నది ఆయన చర్య చాటిచెబుతోంది. గణాధిపత్యం కోసం అన్నదమ్ములు వినాయకుడు, కుమారస్వామి పోటీ పడినప్పుడు.. ‘ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుంది’ అని తండ్రి పరమేష్ఠి నిబంధన విధించాడు. దానికి, స్థూల కాయుడైన గణేశుడు మొదట కలత చెందాడు. శక్తిమంతుడు, వేగంగా ప్రయాణించగల తమ్ముడిని అధిగమించలేనని భావించాడు. అంతలోనే బుద్ధిబలాన్ని ప్రయోగించాడు. కన్నవారే కనిపించే దైవాలనీ, ప్రకృతి పురుషులైన తల్లిదండ్రులకు ప్రదక్షిణతో సర్వపుణ్య నదీస్నాన ఫలితం దక్కుతుందని గ్రహించి ఆచరించాడు. తమ్ముడు వెళ్లిన చోట ప్రతి నదిలో అన్న స్నానమాడుతూ కనిపించాడు. గణాధిపతిగా నియమితుడై సర్వసమర్ధుడిగా మన్ననలు అందుకున్నాడు. శ్రీరామచంద్రుడు లంకకు సేతుబంధన సమయంలో వినాయకుడు మార్గదర్శనం చేశాడని, వారధి నిర్మాణంలో ఇంజనీర్‌లా సూచనలు చేశారని చెబుతారు. కుశాగ్రబుద్ధి కలవాడు కనుకే మహాభారత రచనలో వ్యాస భగవానుడికి రాయసకారుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. తాను చెబుతున్నప్పుడు తన వేగాన్ని అందిపుచ్చుకుంటూ, తాను చెప్పేది అర్థం చేసుకున్న తర్వాతే రాయాలన్న వ్యాసుడి నిబంధనను అంగీకరించాడు.

ప్రకృతి దేవుడు

ప్రకృతిని భగవత్‌ ‌స్వరూపంగా భావించి ఆరాధించడం వినాయక వ్రత విధానంగా చెబుతారు. వినాయకుడు రూపుదాల్చింది వర్ష రుతువులోనే. ఈ కాలంలో ప్రకృతి ఆకులు, పూలతో హరితమయంగా ఉంటుంది. ముఖ్యంగా ఔషధీ గుణాలు గల 21 రకాల పత్రులతో అర్చిస్తారు. మాచీ పత్రం, బృహతీ పత్రం(ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసీ పత్రం, చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోనూ గరిక శ్రేష్టమైనది. ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. స్వామి నామావళితో దీనితో ప్రత్యేకంగా అర్చిస్తారు. నిరాడంబరతను నేర్పే వేలుపు వినాయకుడు. విలువైన నగలు, ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలను సేకరించి భక్తితో అర్చిస్తే సంతోషపడతాడు.

పార్వతీదేవి మంగళస్నానం సమయంలో ఆమె శరీర నలుగుపిండి ద్వారా వినాయకుడు రూపుదాల్చి నట్లు శివపురాణం చెబుతున్నందున ఆయన పృథ్వీ తత్త్వానికి ప్రతిబింబం. పాంచ భౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వీతత్త్వంతో మేళవిస్తారు. మూలాధార తత్త్వానికి అధినాథుడు వినాయకుడు. అందుకే మట్టి వినాయకుడిని పూజించడం వల్ల సత్వర ఫలితం చేకూరుతుందని పురాణ వచనం. కొండంత దేవుడికి కొండంత పూజాద్రవ్యాలు, కాను కలు సమర్పించలేమన్నట్లుగా ఉన్నంతలో భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా ఆరాధించేలా ఈ మృత్తికా విగ్రహం ఉంటుంది. దానిని పూజిస్తే కొండంత కష్టాన్ని గోటితో తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.

నవరాత్రుల విశిష్టత

హిందూమతంలోని వివిధ వర్గాల మధ్య సుహృద్భావం, జాతీయ భావాల పెంపునకు గణపతి నవరాత్రి ఉత్సవాలు తోడ్పడతాయన్న భావనతో వీర శివాజీ ఘనంగా, బహిరంగంగా ఈ ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆయన తరువాత వాటికి కొంత ఆటంకం కలిగినా స్వరాజ్య సమరం సమయంలో నేతలు దానిని అందిపుచ్చుకున్నారు. బాలగంగాధర తిలక్‌ ‌గణపతి నవరాత్రులను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ఈ పూజలు ఆయన ఆధ్వర్యంలో సామూహిక ఉత్సవంగా రూపుదిద్దు కుంది. అలా మైదానాలలో, కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్టించి పూజాదికాలు నిర్వహించి నిమజ్జనం చేసే ఆనవాయితీ నేటికీ కొనసాగుతోంది.

దేశవ్యాప్తంగా గణపతి ఆరాధన ఉన్నా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలో మరింత ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఇది రెండు రోజుల పండుగ కాగా, ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజులు పండుగ. కన్నడ నాట అయ వినాయకుడిని గౌరీదేవి సహితంగా పూజిస్తారు. భాద్రపద శుద్ధ చతుర్ధి గణపతికి సంబంధించినది కాగా ముందు రోజు తృతీయ తిథి గౌరీదేవిది. ప్రచారంలో ఉన్న గాథ ప్రకారం, గౌరీదేవి భర్త అనుమతి మేరకు పుట్టిల్లు హిమవంతుని పురానికి చేరుకుంటుంది. తల్లి కోసం బెంగపడిన వినాయకుడు ఆ మరునాడే తల్లిని వెదుక్కుంటూ బయలుదేరుతాడు. అందుకే తృతీయ, చతుర్థి తిథుల నాడు తల్లీ తనయు లను ఆహ్వానిస్తున్నట్లు పండుగు జరుపుకుంటారు.

అష్టలక్ష్ముల మాదిరిగానే గణపతులను అనేక రూపాలలో కొలుస్తారు. బాల, తరుణ, భక్తి, వీర, శక్తి, ధ్వజ, సిద్ధి, ఉచ్ఛిష్ట, విఘ్న, క్షిప్ర, హేరంబ, లక్ష్మీ, మహా, విజయ, నృత్య, ఊర్ధ్వ, ఏకాక్షర, వర, త్య్రక్షర, క్షిపప్రసాద, హరిద్రా, ఏకదంత, సృష్టి, ఉద్దండ, రుణమోచన, డుంఢి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, దుర్గ, సంకటహర గణపతిగా విఘ్ననాథుడు పూజలు అందుకుంటున్నాడు.

నరముఖ గణపతి

సాధారణంగా గణపతి అనగానే బొజ్జ, తొండంతో కలిగిన మూర్తి స్ఫురిస్తారు. కానీ తమిళనాడులోని తిరువారూర జిల్లా తిలాతర్పణ పురిలో ‘నరముఖ గణపతి’ దర్శనమిస్తారు. మొదట ఆవిర్భవించిన రూపంలోనే అంటే, మనిషి ముఖంతోనే పూజలు అందుకుంటారు. బొజ్జ కూడా ఉండదు. పురాణగాథ ప్రకారం పార్వతీమాత నలుగు పిండితో చేసిన సుందరరూపంతోనే ఉంటాడు.

నైవేద్య ప్రత్యేకత

రుతువులను బట్టి ఆరోగ్య అలవాట్లు ఉండాలని, వినాయక నైవేద్యంలోనూ ఆరోగ్య రహస్యం దాగి ఉందని వైద్యనిపుణులు చెబుతారు. ఈ వర్షరుతువులో ఆకలితో పాటు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక అందుకు తగిన ఆహారాన్నే తీసుకోవాలంటారు. నూనె పదార్ధాల కంటే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్లు వంటి పదార్థాలు మంచివని మోదకప్రియుడు లోకానికి అందించిన ఆరోగ్య సందేశంగా చెబుతారు. మారుతున్న కాలంలో రకరకాల పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తున్నప్పటికి పూర్వికులు నిర్దిష్టమెన వాటినే ప్రతిపాదించారు. వీటిని కేవలం చవితి పండగ నాడే కాకుండా ఈ రుతువంతా తరచూ తీసుకోవచ్చని అంటారు. అలాగే వినాయక చవితి నాడు ప్రసాదాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయి. తెలంగాణలో తుమ్మికూర, చింతకాయతో వండిన పప్పును నైవేద్యంగా పెడతారు. వినాయకుడికి తుమ్మికూరంటే ఇష్టమని విశ్వాసం.

కాటన్‌ ‌మొక్కుబడి

అపర భగీరథుడిగా పేరుపొందిన కాటన్‌దొర విఘ్నదేవుడిని అర్చించి మొక్కు చెల్లించుకున్నాడు. గోదావరిపై ఆనకట్ట నిర్మాణం ప్రారంభించిన ఆయన అంతలోనే అనారోగ్యం పాలుకావడంతో స్వదేశానికి వెళ్లవలసి వచ్చింది. తిరిగి వచ్చిన తరువాత కూడా అవరోధాలు తప్పలేదట. గణపతిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోతాయన్న హితుల సలహాపై రాజమహేంద్రవరంలోని నాళంవారి వీధిలోని సిద్ధి గణపతి ఆలయాన్ని దర్శించి, నిర్ణీత సమయంలో పనులు పూర్తయితే స్వామి వారికి గంట బహూకరి స్తాననీ మొక్కుకున్నారట. ఆశించినట్లే అక్కడి పనులతో పాటు కృష్ణానది కాలువ పనులు చురుకుగా సాగడంతో లండన్‌ ‌నుంచి పెద్ద గంటను తెప్పించి సమర్పించారు.

‘విశ్వ’దేవుడు

గణనాథుడు మన దేశం ఎల్లలు దాటి అనేక దేశాలలో పూజులు అందుకుంటున్నాడు. ఆయన కేవలం హిందూమత దైవమే కాదు. మన దేశంతో పాటు అనేక ఆసియా దేశాలలో వేల ఏళ్ల క్రితం నుంచి వినాయక ఆరాధన ఉందని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా సముద్ర వాణిజ్యం కారణంగా థాయ్‌లాండ్‌, ‌బర్మా, ఇండోనేసియా, మలేసియా, వియత్నాం, కంబోడియా, జపాన్‌ ‌మున్నగు దేశాలకు గణపతి ప్రాభవం విస్తరించింది. హిందు జనాభా గణనీయంగా గల నేపాల్‌లో, పొరుగు దేశాలు భూటాన్‌, ‌టిబెట్‌, ఇటు శ్రీలంకలో కొన్ని వందల ఏళ్ల క్రితం వినాయక ఆరాధన ఉండేదని ఆధారాలు చెబుతున్నాయి. జావాకు సమీపంలోని ఒక దీవిలో ఒకటో శతాబ్దం నాటి గణపతి విగ్రహం వెలుగు చూసింది. ఇండోనేషియాలో ఆయనను జ్ఞానప్రదాతగా అర్చిస్తే, వినాయకుడుని పూజిస్తే అదృష్టం కలసి వస్తుందని థాయ్‌లాండ్‌ ‌దేశీయులు నమ్ముతారు. ఇండోనేసియాలోని బేండుండ్‌లో దేవుడి పేరిట వీధి, ప్రంబానన్‌ ఆలయంలో తొమ్మిదో శతాబ్దం నాటి విగ్రహం ఉంటే, జపాన్‌ ‌రాజధాని టోక్యో శివారులోని అసాకుసా ప్రాంతంలో ఆలయం ఉంది.

‘ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించాలి. దాంతో చెలిమి చేయాలి, కాపాడుకోవాలి. నా రూపమైన ప్రకృతిని ప్రేమించి, ఆరాధించండి. అది సర్వదా రక్షిస్తుంది’ అనే సందేశాన్ని గ్రహించవలసి ఉంది.

‘వక్రతుండ మహాకాయ కోటి సూర్యకోటి సమప్రభ!

నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా!!

– సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE