‘గోవును జాతీయ జంతువుగా ప్రకటించవలసిందే’, ఈ సెప్టెంబర్ 1వ తేదీన అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో గుండెకాయ వంటి అంశమిది. గోవును రక్షించుకునే కార్యక్రమాన్ని హిందువుల ప్రాథమిక హక్కుగా గుర్తించమని కూడా ఆ న్యాయస్థానం ప్రభుత్వాలను ఆదేశించింది. ఆవును తల్లిగా భావించే సాంస్కృతిక వారసత్వం ఈ దేశంలో నలుమూలలా ఉందన్న సంగతీ, గోమాత ఈ దేశ సంస్కృతికి ప్రతీక అన్న వాస్తవాన్నీ మరచిపోరాదని కూడా గుర్తు చేసింది. కోర్టు తీర్పును ప్రభుత్వాలు ఎప్పుడు, ఎంతవరకు అమలులో పెడతాయో అప్పుడే తెలియదు. అయినా ఈ తీర్పు భారతీయులకు, ప్రధానంగా ధార్మిక సంస్థలకు గొప్ప స్థయిర్యాన్నీ, ఉత్సాహాన్నీ ఇస్తుంది. తీర్పు సందర్భంగా కోర్టు ఇచ్చిన సందేశం అద్భుతమే. నిజానికి అవి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడానికి పెద్ద కారణాలు కూడా కనిపించవు. ఒక్క బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే ప్రభుత్వాలను ఇంతకాలం ఆ అంశం జోలికి వెళ్లకుండా చేశాయి. రాష్ట్రాలు గోవధ నిషేధ చట్టం తెచ్చి ఇప్పటికి 70 ఏళ్లు పూర్తయింది. కానీ దేశంలో ఇప్పుడున్న పరిస్థితి గోసంతతి పాలిట దినదిన గండం నూరేళ్లాయుష్షు విధంగానే ఉంది. ప్రస్తుత వాతావరణం గోవుల పాలిట ప్రాణాంతకంగా మారిపోతున్నది. ఈ నేపథ్యంలోనే గోసంతతి రక్షణను హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా భావించక, ఉద్యమించక తప్పని వాతావరణం ఏర్పడింది. ఫలితమే, గోవధను జాతీయ విధానంగా రూపొందించాలన్న ఆశయం ఉద్యమరూపం సంతరించుకుంటున్నది.
1950లో భారత్‌లో కాంగ్రెస్ పార్టీయే దాదాపు ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలింది. కాబట్టి చాలా రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రభుత్వాలే గోవధను నిషేధించాయి. ఈ మాట ఇవాళ్టి కాంగ్రెస్ నేతలు వింటే ఆశ్చర్యపోయినా ఇది నిజం. గాంధీజీ 1920 నుంచి అనేక సందర్భాలలో గోవధ నిషేధం గురించి స్పష్టంగా మాట్లాడారు. మదన్ మోహన్ మాలవీయ అంతకు ముందే గోరక్షణ గురించి చెప్పారు. రాజకీయాలలో బుజ్జగింపు ధోరణి బలపడడం మొదలైన తరువాత గోవధ నిషేధం అమలు బలహీనపడడం మొదలయింది. కొందరు ముస్లిం పాలకులు కూడా గోవధను నిషేధించిన చరిత్ర ఉంది. క్రమంగా గోవధకు పాల్పడడమంటే ముస్లిం ఆధిపత్యానికీ, ఉనికిని చాటుకోవడానికీ ఒక ఆయుధంగా మతోన్మాదులు ఉపయోగించుకునే అవాంఛనీయ పరిస్థితులు బలపడినాయి. వర్తమాన భారతదేశం చూస్తున్నది సరిగ్గా ఇదే.
ఈ నేల మీద సనాతన ధర్మం ఎంత పురాతన మైనదో, గోవును పవిత్రంగా చూసే సంప్రదాయం, దృష్టి కూడా అంతే పురాతనమైనవి. వేదాలే కాదు, కౌటిల్యుడి అర్ధశాస్త్రం, ఎన్నో ధర్మశాస్త్రాలు భరత ఖండంలో ఆవు ఔన్నత్యాన్నీ, ఆ అద్భుత ప్రాణి రక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించీ, తల్లి వంటి ఆ జీవికి ఇవ్వవలసిన మర్యాద గురించి నిష్కర్షగా ప్రబోధించాయి. ‘గోవు నడిచే వైద్యశాల, బంగారు గని’ అని పుష్కర మహర్షి అన్నాడని ఐతిహ్యం. ‘గోవు సర్వసంపదలకు మూలం’ అని చెప్పింది అధర్వణం. గోసంపదకు సంబంధించి ఆధ్యాత్మిక, ఆర్థికకోణాలూ అంతే పురాతనమైనవి. వర్తమాన ప్రపంచంలో పర్యావరణానికి దోహదం చేసే జీవిగా గోవుకే అగ్రతాంబూలం దక్కుతోంది. సేంద్రీయ సేద్యానికీ, దేశవాళీ సేద్యానికీ వనరు ఆవు ఇవ్వవలసిందే. దురాక్రమణదారులు భారతీయుల మనోధైర్యాన్నే కాదు, ఆర్థిక స్థోమతను పతనం చేయడమనే కీలకవ్యూహాలకు ఎంచుకున్న మార్గం గోవులను చంపడం. అంతిమంగా భారతీయ దృక్పథాన్ని నాశనం చేయడం కూడా. కాబట్టే హిందూ ధర్మరక్షణకు తొలిమెట్టుగా గోరక్షణను హిందువులు స్వీకరించవలసి వచ్చింది. హిందువుల మనోభావాలను గాయపరచాలంటే గోవును వధించడమే మార్గంగా ముస్లింలు ఎంచుకున్న సంగతి కూడా చరిత్ర చెబుతుంది. 1714లో గుజరాత్‌లో ఒక హిందువు హూలికా (రాక్షసి) దహనం నిర్వహించాడు. ఇందుకు పొరుగున ఉన్న ముస్లింలు అభ్యంతరం చెప్పారు. గొడవ జరిగింది. ఒక దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు ప్రతీకారంగా ముస్లింలు చేసిన పని, అతడి ఇంటి ఎదురుగా గోవును చంపడం. ఈ మత ఉద్రిక్తత కొన్ని నెలల పాటు కొనసాగింది. 1870 దశకంలో పంజాబ్‌లో మొదలైన కుకా ఉద్యమం అచ్చంగా గోరక్షణకు సంబంధించినదే. నామ్‌ధారీ ఉద్యమం ఇదే. అంటే గోరక్షణను ఒక ఉద్యమంగా ఈ దేశంలో తొలిసారిగా స్వీకరించినవారు సిక్కులే.1871లో అమృత్‌సర్‌లో ఒక కసాయి కేంద్రం మీద నామ్‌ధారీలు దాడిచేసి 100 ఆవులను విడిపించారు. ఆ సందర్భంగా జరిగిన హింసలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. హిందువులు కొందరికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. 1880 తరువాత ఆర్య సమాజ్ కూడా ఈ ఉద్యమంలో భాగమైంది. కాబట్టి గోరక్షణ భావన భారతీయులలో స్వాతంత్య్రోద్యమానికి ఒక కోణం నుంచి అంకురార్పణ చేసినదిగా చెప్పుకోవాలి.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత గోవుకు రక్షణ దొరుకుతుందని హిందువులు ఎదురుచూశారు. పైపై చట్టాలు వచ్చాయి తప్ప, సంపూర్ణ రక్షణ కరవైంది. రాష్ట్రాలలో నామమాత్రంగా ఉన్న గోవధ నిషేధానికి బలం చేకూరాలంటే జాతీయ స్థాయిలో చట్టం ఉండాలి.1952లో గోవింద దాస్ సంపూర్ణ గోవధ నిషేధానికి లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిని ఆమోదిస్తే రాజీనామా చేస్తాననే వరకు నాటి ప్రధాని నెహ్రూ వెళ్లారు. 1952లోనే ఆర్‌ఎస్‌ఎస్ గోవధ నిషేధం కోరుతూ రెండుకోట్ల సంతకాలతో రాష్ట్రపతి రాజేందప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చింది. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగినా 1966లో జరిగిన ప్రయత్నం చరిత్రాత్మకం. గోరక్షణ చట్టం కోసం విజ్ఞాపనల కాలం అయిపోయింది, త్యాగాల సమయం వచ్చిందన్న నినాదంతో ప్రయాగలో సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సెప్టెంబర్‌లోనే అప్పటి కేంద్ర హోంమంత్రి గుల్జారీలాల్ నందా ముందు సాధుసంతులు తమ విన్నపం ఉంచారు. నందా కూడా గాంధేయవాది, గోరక్షణకు అనుకూలుడే. నవంబర్ 7న పార్లమెంట్ నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అదే కనీవినీ ఎరుగనంత పెద్ద గోరక్షా కార్యక్రమంగా చరిత్రకెక్కింది. పది లక్షల మంది హిందువులు దేశ అత్యున్నత చట్టసభ ఎదుట గోవధ నిషేధం కావాలని ముక్తకంఠంతో నినదించారు. ఆ ఉద్యమం ఏ పార్టీదీ కాదు. ఏ పార్టీకి వ్యతిరేకం కూడా కాదు. అయినా ఇందిర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తరువాత కాల్పులు జరిగాయి. ప్రముఖులైన సాధువులు గాయపడ్డారు. పదకొండు మంది కాల్పులలో చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. కర్ఫ్యూ కూడా విధించారు. ఆనాటి మృతుల సంఖ్య వందలలోనే ఉంటుందని కార్యక్రమానికి నాయకత్వం వహించిన కర్పత్రిజీ స్వామి చెప్పారు. ఈయనను అరెస్టు చేసి తిహార్ జైలుకు పంపారు. ఒక సందర్భంలో గాంధేయవాది వినోబా కూడా జాతీయ స్థాయిలో గోరక్షణ చట్టం తేవాలని ఆమరణ నిరాహార దీక్ష చేశారు.
1947 నాటికి ప్రతి 1000 మందికి 700 గోవుల వంతున ఉండేవి. ఇటీవల కాలంలో వాటి సంఖ్య 400కు తగ్గింది. 1956లో 21 రాష్ట్రాలలో 1,020 గోశాలలు ఉన్నాయి. 2014లో జరిగిన పశుగణన ప్రకారం దేశంలో 122 మిలియన్‌ల గోవులు ఉన్నాయి. 2014లో పార్లమెంట్‌కు చెప్పిన వివరాల ప్రకారం దేశంలో 3,030 గోశాలలు లేదా గోరక్షణ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 1,325 రకరకాల పశుసంవర్థక శాఖలు నిర్వహిస్తున్నాయి. వీటిలో ఎక్కువ గోశాలలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నవేనని కూడా అప్పుడే కేంద్రమంత్రి మేనకా గాంధీ పార్లమెంటులో వెల్లడించారు. ఇప్పటికీ గోశాలలు అవే కష్టాలు పడుతున్నాయి. రాష్ట్రాలలోనే కావచ్చు, గోవధ నిషేధం ఉంది. అది కూడా చిత్తశుద్ధితో అమలు చేయడం లేదు. దాని కోసం పోరాడుతున్నవాళ్లని దొంగలుగా, హిందూ మతోన్మాదులుగా చిత్రిస్తున్నారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్ నగరంలోనే దాదాపు 40 గోశాలలు ఉన్నాయి. అందులో నలభయ్ నుంచి యాభయ్ వేల గోవులు ఆశ్రయం పొందుతున్నాయి. గోరక్షణ కోసం ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకుంటేనే మనదైన జాతీయ జంతువుకు రక్షణ ఉంటుందని గోశాలల నిర్వాహకులు గట్టిగా చెబుతున్నారు. మళ్లీ దేశంలోని గోరక్షణ ఉద్యమకారులు వచ్చే నవంబర్ 7న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. గోరక్షణకు జాతీయ స్థాయిలో చట్టం తెచ్చేవరకు పోరాటం ఆగదని అంటున్నారు.
‘ఎక్కడ ఏ గోమాత హింసకు గురౌతున్నా ఆశ్రమానికి రావాలి!’
ప్రభుదత్త మహరాజ్, జియాగూడ గోశాల నిర్వాహకులు
వేకువనే ఏ హిందూ దేవాలయం తలుపులు తెరిచినా మొదట దైవానికి వత్సంతో కూడిన గోవును కనిపించేటట్టు చేసే అద్భుత సంప్రదాయం మనదని గుర్తు చేస్తున్నారు ప్రభుదత్త. గోరక్షణకు ఆయన అందిస్తున్న సేవ ఊహకు అందదు. దాదాపు జీవితం అందుకోసమే వినియోగిస్తున్నారనిపిస్తుంది. గోవు ప్రస్తావన వస్తే, ఆయన నోటి నుంచి ‘అమ్మవారు’, లేదా ‘అమ్మ’ అన్న మాటలే వస్తాయి. జియాగూడలోని ఆ సువిశాలమైన గోశాలను సంరక్షించుకుంటూ అక్కడే ఉంటున్నారు. ఇదంతా గొప్ప గురు పరంపరకు చెందిన తమ పెద్దలు అప్పగించిన ఓ గురుతర బాధ్యతను తాను వారసత్వంగా స్వీకరించానని మాత్రమే వారు భావించడంలేదనిపిస్తుంది. వారి మాట వింటే భారత సంస్కృతికీ, గోమాతకూ ఉన్న పవిత్ర బంధం గురించి రేపటితరానికి గొప్పగా చెప్పగలిగిన అద్భుత ప్రబోధకులనిపిస్తుంది. సాంస్కృతికంగానే కాదు, విజ్ఞానశాస్త్ర పరిధిలో ఆవుకీ, ప్రకృతికీ ఉన్న బంధం గురించి ఆయన దగ్గర గొప్ప కల్పన ఉంది. భారతీయతకూ, అందులో కీలకమైన గోరక్షణకూ ప్రతికూలత ఉన్నా, తనలోని సానుకూల దృక్పథంతోనే ప్రభుదత్త ఈ సేవాధర్మాన్ని అకుంఠిత దీక్షతో నిర్వహిస్తున్నారు. గోమాత విషయంలో భారతీయ సమాజం మారుతుందనే ఆయన ప్రగాఢంగా నమ్ముతున్నారు. అదే నిజం కావాలని అంతా కోరుకోవాలి. ఈ మహోన్నత సామాజిక సేవ గురించి ‘జాగృతి’ ప్రస్తావించినప్పుడు ఆయన వ్యక్తం చేసిన కొన్ని అభిప్రాయాల మాలిక:
+ హైందవ సంస్కృతి ఆశయం, ఆచరణ విస్తృత మైనవి. అందులో గోసేవ ఘనమైనది. గోవుతోనే ధార్మిక వ్యవస్థ పరిపూర్ణమవు తుందంటాడు కృష్ణభగవానుడు. దేవుళ్లంతా గోవులో ఉన్నారు. విజయనగరంలో స్వర్ణయగం అన్నారు విద్యారణ్యుల వారు. అంటే గోవుకు మంచిరోజులు అనే. కానీ ఇవాళ పరిస్థితి ఏమిటి? ఆవుతో కలిగే లాభాల గురించి అంతా చెబుతున్నారు తప్ప, ఆ సంతతికి జరుగుతున్న అపారనష్టం గురించీ, చేటు గురించీ చెప్పడం లేదు. గోవును చంపరాదని చట్టం ఉంది. ఆ చట్టాన్ని కాపాడుతున్న వాళ్లని థర్డ్ డిగ్రీ హింసకు గురి చేస్తున్నారు.
+ మన గతంలో పరిస్థితులు మారుతూ రావడం గమనిస్తాం. పన్నెండు, పదమూడు వందల ఏళ్లుగా దాడులూ, వాటి ఫలితాలూ చూశాం. ఘోరీ, ఘజనీ, చంఘిజ్‌ఖాన్, అహ్మద్షా అబ్దాలీ వంటి వాళ్లు దాడులు చేశారు. చిరకాలం వాళ్ల పాలనలో ఉండిపోయాం. ఆ ప్రభావం నుంచి మళ్లీ బయటపడడానికి కొంతకాలం పడుతుంది. ఆరోగ్యకరమైన ఆలోచన అవసరం. తామస ఆహారానికి దూరంగా ఉండాలి. ఎలాంటిది భుజిస్తే అలాంటి బుద్ధులు వస్తాయి. తాగినవాడిని తాగినవాడు అని చెప్పగలం. ఆహార దోషమూ అంతే. ఆలోచనలో ఆరోగ్యం ఉంటే విచక్షణ ఉంటుంది. విచక్షణతో కుటుంబ బాంధవ్యం, సమాజం, ఊరూ వాడా నిర్మాణాత్మకంగా ఉంటాయి. కానీ జనం తామస ఆహారం వైపు వెళుతున్నారు. ఇవాళ 98 శాతం అలాంటి ఆహారమే కోరుకుంటున్నారు. చరిత్రలో అంటాం గానీ ఈనాడూ నరమేధం కనిపిస్తున్నది. తాలిబన్ చేసేది అదే కదా!
+ ఎక్కడ ఏ ఆవు హింసకు గురైనా ఆ మాత ఈ ఆశ్రమానికి రావాలి. ఈ ఆశ్రమ నిర్వహణ ఒక పద్ధతి ప్రకారం, వైజ్ఞానిక మార్గంలో జరుగుతోంది. గోవుకు రక్షణ కల్పించాలి. ఈ మహదాశయాన్ని ఆచరణలో పెట్టడమంటే చాలా భారమే. ఈ విషయం గురించి బయటకు చెప్పాలన్నా కూడా నాకు భయమే. ఆ అమ్మ ఏమీ అడగదు. నా బాధ్యత నేను తెలుసుకోవాలి.
+ క్షేత్రాలు, యాగాలు, క్రతువులు అన్నీ ఉన్నాయి మనకు. వింత ఏమిటీ అంటే, ఆయా ప్రదేశాలలో ఏది మొదట ఉండాలో అది లేదు. స్వామివారికి మొదట వత్సంతో సహా గోవును దర్శింపచేయాలి. తరువాతే భక్తులు. నందికి గుడులు ఉన్నాయి ఈ దేశంలో. కానీ ఒకవైపు గుడులు కడతాం. మరొక వైపు వాటి పట్ల విపరీత ప్రవర్తన కనపరుస్తాం. మన పేర్లు చూడండి గోవర్ధన్, కృష్ణకుమార్, గోపాల్…ఇలా. ఇందులో మార్పు రావాలి. ప్రభుత్వంలో, పోలీసులలో, విద్యావ్యవస్థలో మార్పు రావాలి. గోమయం యాంటీ రేడియంట్, ఇంకా చాలా. గోమయం, గోమూత్రం ఆయుర్వేదంలో భాగం. ఇప్పుడు యువతలో ఒక మార్పు కనిపిస్తున్నది. గోమయం తీసుకువెళతారు. తాను పూజచేసుకునే చోట దానితో అలుకుతున్న వారు ఉన్నారు. దానికి ఇంట్లో వాళ్లు ఆటపట్టించినా పట్టించుకోవడం లేదు. అవగాహన పెరిగింది. గోరక్షణ కోసం న్యాయవాదులు కూడా ముందుకు వస్తున్నారు. తోడ్పడుతున్నారు.
+ గోమాన్యాలను ప్రభుత్వాలు వాటికి చెందేలా చేయాలి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా ఆ పని చేయాలి. కానీ అవగాహన లేక వీళ్లంతా చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఎవరూ చెడ్డవాళ్లు కాదు. కానీ మంచివాళ్లమే అని నిరూపించుకునేందుకు ఏదో ఒకటి చేయాలి. మార్పు వస్తోంది. ఎవరికి ఎవరూ ఏం చెప్పడంలేదు. తల్లి ఎప్పుడూ ఏమీ కోరదు. ఇది తల్లి లక్షణం. ఒకవేళ చంపడానికి వస్తుంటే, ఆ కత్తి సరిగ్గా పట్టుకో లేకుంటే, నీకే తెగుతుంది అని చెబుతుంది. భగవంతుడు ఎవరినీ శపించడు. మన భయంతోనే మనం కునారిల్లుతాం. ప్రభుత్వం వైపు నుంచి కూడా మార్పు ఉంది. ప్రభుత్వాలు విద్యార్థి వేతనాలు ఇస్తాయి. ఇలాంటి విద్యార్థి వేతనం పంచగవ్యాల గురించి పరిశోధన చేస్తున్న విద్యార్థికి నరేంద్ర మోదీ కేటాయించారు. ఇక్కడే గోశాలలో ప్రాథమిక చికిత్స చేయడం గురించి శిక్షణ ఇచ్చారు. దీనికి 30 మంది బాలికలు వచ్చారు.
+ గోవుల పట్ల ఇంత పట్టింపు దేనికి అని ఇటలీలో అడిగారు. గోమాత- తల్లి వంటిది. ప్రాణం పోస్తుంది. ఆ తల్లికి ఏదైనా అయితే? సృష్టి మనుగడకే ప్రమాదం. మనకు దొరుకుతున్నదంటే చులకన. లేనిదాని కోసం తపన. అన్ని గోవులూ ఒక్కటే. పవిత్రమైనవే. మనదైన జాతిని కాపాడుకోవాలి. కపిల గోవు పవిత్రమైనదంటారు. కపిల అంటే నల్లనిది. అంతే. గోవు అంటే ధరిత్రి. తల్లి కదా! అంతా ఆవిడతోనే ఉద్భవిస్తుంది. ఆవిడలోనే లీనమవుతుంది. ఆవులు రకరకాలు. 37 జాతులు ఉన్నాయి. వా•న్నింటినీ మనమే కాపాడుకోవాలి. ఇక్కడ పాల ఉత్పత్తి గురించి పట్టించుకోవద్దు. గంగిగోవు పాలు గరిటడైన చాలు అని ఆనాడే చెప్పారు. గోశాలలు అంటే పితృకార్యాల వేళ పిండాలు పెట్టడానికే అని కూడా అనుకోవద్దు.
+ ప్రకృతి వ్యవసాయంతో కాలుష్యం నివారిస్తాం. పంటలకు కృత్రిమమైన ఏ ఎరువు వేసినా కాలుష్యమే. అదే గోవుకు సంబంధించినవి నేలకు అందిస్తే ఆరోగ్యం. ఈ క్రమానికి నష్టం చేస్తే అసలు అస్తిత్వానికే ముప్పు. ఇది ఎవరి భాషలో వాళ్లకి చెప్పాలి. ఇక్కడికి వచ్చిన ఎద్దులని ప్రకృతి వ్యవసాయం చేసుకునే రైతులకు ఉచితంగా ఇస్తాం.
+ ఇప్పుడు విజ్ఞానం ఎంతో పెరిగింది. దానిని ఉపయోగించుకోవాలి. అంతా డిజిటల్. దీనిని నిర్మాణాత్మకంగా ఉపయోగించాలి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ అని ఉంది. 2 శాతం ఆదాయం ఆ రంగం వారు సేవకు అందించాలి. ఇదీ తెలుసుకోవాలి. ఉపయోగించుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలలో అమెరికాలో చారిటీ డ్రైవ్ నిర్వహిస్తారు. ఇందుకోసం ప్రతివారికి ముందస్తు సమాచారం వస్తుంది. ఇలా మనం అమెరికాలో ఉన్న మనవారిని అడగడం లేదు. మనవాళ్లు యుఎస్‌లో ఎంతమంది ఉన్నారు? అందులో ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న యాభయ్ వేలమందిలో ఐదువేల మంది ఇచ్చినా సేవా సంస్థల బలోపేతానికి ఉపయోగ పడుతుంది. కానీ మనం వెళ్లం. వాళ్లకి చెప్పం. అలాగే ఇంట్లో అన్ని ధార్మిక కార్యక్రమాలు చేస్తాం. సమాజంలోకి వచ్చినప్పుడు వాటికీ మనకీ ఉన్న బంధం గురించి, మన భక్తి గురించి చెప్పం. సామాజికంగా కూడా మనదైన ఉనికిని మనం వ్యక్తం చేయలేం. ఇదీ మారాలి.
+ గోసేవలో మతమన్న మాట మరచిపొండి. గోవులు మానవాళికే గొప్ప సంపద. ఇది ఒక ధర్మానికి పరిమితమైనది కాదు. ఉదయమే ఇక్కడికి కొందరు ముస్లింలు వస్తారు. ఆవులకు రొట్టె పెడతారు. ఎందుకంటే, అలా చేస్తే వ్యాపారం బాగుంటుందంటారు. క్రైస్తవులూ వస్తారు. పచ్చగడ్డి తెస్తారు. ఇక్కడి గోవులకు మందులు కావాలంటే చెప్పండి, తెస్తాం అంటారు. ఈ జ్ఞానం గురించి చెప్పాలి. ఇంకా చాలా చేయాలి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్.
- ప్రభుదత్త మహరాజ్, 9296358630