పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం, నాచుగుంట గ్రామంలో గోపాలకృష్ణ గోశాలను నిర్వహిస్తున్నారు. గౌతమీ సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ గోశాలను ఇటీవలి వరకు భూపతిరాజు రామకృష్ణంరాజు (భూసుపోషణ ఉద్యమం ఏపీ ఇన్‌చార్జ్) నిర్వహించారు. తరువాత ఎస్. పర్వతరావు, పి. వెంకటరాఘవయ్య నిర్వహిస్తున్నారు. వీరు సేంద్రియ వ్యవసాయ క్షేత్రం కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల భూసుపోషణ బాధ్యతలు చేపట్టడడంతో రామకృష్ణరాజు ఆ గోశాల బాధ్యత నుంచి తప్పుకున్నారు. గోశాల నిర్వహణ, సవాళ్లు అనే అంశం మీద తన అనుభవాలను రామకృష్ణంరాజు జాగృతితో పంచుకున్నారు.
గోశాల ఉద్దేశం ఏమిటి? కేవలం వాటి రక్షణేనా?
నిజమే, ఇప్పుడు గోరక్షణ కీలకంగా మారింది. దీనితో పాటు గో ఆధారిత వ్యవసాయానికి సాయపడడం కూడా వీటి ఉద్దేశం. గోవు ద్వారా ప్రజానీకానికి ఆరోగ్యం ఇవ్వడం మరొకటి. గోవు ద్వారా ధార్మిక జాగరణ చేయడం కూడా.
ఇది ఎప్పుడు ప్రారంభించారు? ఎలా మొదలయింది?
2007లో ప్రారంభించారు. 4 ఆవులతో మొదల యింది. ప్రస్తుతం 65 ఆవులు ఇక్కడ ఉన్నాయి. గిర్, కాంగ్రేజ్, దేశవాళీ ఆవులు- 3 జాతులు ఉన్నాయి. ఒంగోలు ఆంబోతులు కూడా ఉన్నాయి.
పాల ఉత్పత్తి, విక్రయం ఇవి ఎలా ఉన్నాయి?
పాల ఉత్పాదన తక్కువగానే ఉంటుంది. కొన్ని పాలు లీటరు రూ.40/-ల చొప్పున విక్రయిస్తారు. కొన్ని పాలు కాచి వెన్న తీసి నెయ్యి తయారు చేస్తారు. కిలో నెయ్యి రూ.2,500గా అమ్ముతారు. పాలకోవా తయారీకి కొన్ని పాలు ఉపయోగిస్తారు. దీనికి మంచి గిరాకీ ఉంది. వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేసి మజ్జిగ ఇస్తారు.గోశాలలో పనిచేసే వారికి రోజూ అర లీటర్ పాలు ఉచితంగా ఇచ్చే పద్ధతి ఉంది.
ఆవులు ఈ గోశాలకు ఎలా వస్తాయి? ఎవరైనా దానమిస్తారా?
సాధారణంగా వట్టిపోయిన ఆవులు, చూడుకట్టని ఆవులు గోశాలకు ఇస్తారు. ఏ వయసులోని ఆవు అయినా నిరుపయోగం కానేకాదు. వాటిని గో-ఆధారిత వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఇస్తారు. అక్కడ వీటి సేవలు గణనీయంగా ఉపయోగ పడతాయి.
వట్టిపోయిన ఆవులను ఏం చేయడమన్న ప్రశ్నే లేదు. వాటిని కూడా బ్రతికించుకోవాలి. వాటి మూత్రం, పేడ ద్వారా ఘనజీవామృతం, పురుగుల మందు కషాయాలు తయారుచేసి వ్యవసాయంలో ఉయోగించి విషరహిత పంట పండించుకోవచ్చు.
గోశాల నిర్వహణ పద్ధతులు ఎలా ఉంటాయి? ఎలాంటి దాణా ఇస్తారు?
ఆవులకు ఉలవలు, జొన్నలు, వరి తవుడు, నువ్వుల పిండి మొదలయినవి దాణాగా ఉపయోగి స్తారు. వీటితో పాటు పశుగ్రాసం సరేసరి. ఆవులకు కో-5 అనే రకం గడ్డి, పచ్చిజొన్న వేస్తారు. ఈ గడ్డిని ఐదు ఎకరాలలో పెంచుతారు.
గోమూత్రం, గోమయం విలువను ఇప్పుడు సమాజం గుర్తిస్తున్నది. ఇక్కడ వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు?
అర్క్, దంత మంజన్, చర్మరక్ష, తలనూనె, మజిల్ ఆయిల్ తయారీలో గోమూత్రం ఉపయోగపడుతుంది. గోమయంతో ప్రధానంగా పిడకలు తయారు చేస్తారు. పినాయిలు, దూప్ కడ్డీలు తయారీకి కూడా ఇది ఉపయోగిస్తారు.
గోవు ప్రత్యేకత కలిగిన జీవి. వాటితో నిండి ఉండే గోశాల నిర్వాహణ నిజంగా సవాలే. దీనిని ఎలా అధిగమిస్తున్నారు?
గోశాల నిర్వహణ కొంతవరకు సవాలుగానే చెప్పాలి. ఇలాంటి చోట పనివారితో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. దాణా, ఎండు వరిగడ్డ, పచ్చగడ్డి సేకరణ సమస్యగానే ఉంటున్నది. గోసంతతి ఉత్పత్తులతో చేసే వస్తువుల తయారీ, విక్రయాల మధ్య సమతౌల్యం చూసుకోవాలి. సమస్యను నాన్చడం వల్ల అది విస్తృతరూపం దాలుస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. గోపాలకులకు శిక్షణ ఇస్తూ ఈ సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నాం. ఔషధాలు, ఎరువులు, కషాయాల తయారీలో వాళ్లకి కూడా శిక్షణ ఇస్తారు. చూడి ఆవులతోనే కాదు, లేగదూడల యాజమాన్యం కూడా క్లిష్టమైనదే. చూడావులను వేరుగా ఉంచి ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టారు. లేగలను నిత్యం పరీక్షించాలి. అవసరమయిన చర్యలు తీసుకుంటూ ఉండాలి.
గోశాల పరిశుభ్రత, గోవుల ఆరోగ్యం గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఆవులను ఉదయం 8 గంటలకు బయటికి వదులుతారు. బయట తిరిగివస్తే వాటి ఆరోగ్యం, శక్తి పెరుగుతాయి. అవి బయటకు వెళ్లిన సమయంలో గోశాలను నీటితో కడిగి శుభ్రపరుస్తారు. ఇక ఆరోగ్య సమస్యల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. సీజనల్‌గా వచ్చే రోగాల నివారణకు పశు సంవర్ధక శాఖ ద్వారా టీకాలు వేయిస్తారు. చిన్న చిన్న రుగ్మతలకు వ్యవసాయ కుటుంబాలు సాధారణంగా పాటించే వైద్య పద్ధతులనే అమలు చేస్తారు.అంటే దేశవాళీ, మూలికా వైద్యం చేస్తారు.
ఆర్థిక సమస్యలు ఉన్నాయా?
రాబడి, వ్యయం- వీటిని చూసుకుంటే గోశాల నిర్వహణ అసాధ్యం. గోశాలతో వచ్చే ఆదాయం, నిర్వహణకు చాదు. దానికి కారణం, వట్టిపోయిన, చూడు కట్టని ఆవులను కూడా పోషించాలి. సమాజంలో గోసంరక్షణ పట్ల గౌరవం ఉన్నవారిని, గో ప్రేమికులను కలిసి నిధి సేకరణ చేస్తారు. ఒక గోమాత సంరక్షణకు సంవత్సరానికి అయ్యే ఖర్చు రూ.12 వేలు. గోశాల ఒకరోజు నిర్వాహణ వ్యయం రూ.5 వేలు. పశుగ్రాసం, దాణాలకు శక్తిని సహకారం అందిస్తారు దాతలు.
గోశాల, గోవులు, గోసంతతి, వాటి వృద్ధి సమాజం ఎలా చూడాలంటారు?
గోసంతతి అభివృద్ధి అత్యవసరం. భారతీయతకే కాదు, విజ్ఞానశాస్త్రం ప్రకారం కూడా గోవును సంరక్షించుకోవాలి. అంటే గో-వంశం అభివృద్ధి చెందాలి. ఇందులో భాగంగానే ఆవుతో వ్యవసాయా నికి ఎన్ని లాభాలు ఉంటాయో తెలియచేయాలి. ఒక ఆవును పోషించడం ద్వారా 5 ఎకరాలకు ఎరువులు, పురుగు మందులు తయారు చేసుకోవచ్చు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి వాడితే మన ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలకు చురుకుదనం, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. ఆవు నెయ్యితో ఇంట్లోనూ, పొలంలోనూ ధూపం వేయటం వలన ప్రాణ వాయువు మెరుగుపడుతుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కనక ఆవును పోషించుకోవాలి.
గోమాతను పోషిద్దాం – భూమాతను రక్షిద్దాం.
ఇంటర్వ్యూ: దండు కృష్ణవర్మ
సీనియర్ జర్నలిస్ట్, 9652561849
————-
రెండు రాష్ట్రాలలో గోశాలలు
భారతీయ సంస్కృతీ పరిరక్షణ ప్రతి భారతీయుడి విధి. ఇందుకు గోరక్షణ ప్రతీకగా నిలుస్తున్నది. గోశాలలు అందుకు కేంద్రాలు. తెలంగాణ ప్రాంతంలో 200పైగా గోశాలలు (రిజిస్టర్ అయినవి, కానివి కలిపి) ఉన్నాయి. వాటిలో 5000 పైన సంఖ్యతో నడిచే అతిపెద్ద గోశాలలు హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. దక్షిణ భారత్‌లోనే పెద్దవిగా ఖ్యాతి గాంచాయి.
ప్రముఖ స్వామీజీలు నిర్వహిస్తున్నవి: చిన జీయర్ స్వామీజీ-ముచ్చింతల, మాతా నిర్మలానంద భారతీ-గండిపేట, శ్రీ బోధానందగిరి స్వామి-యాదాద్రి, జగన్నాథ మందిరం, వ్రతధార శ్రీరామానుజ జియర్ స్వామి, సీతారాం బాగ్, దత్తాత్రేయ ఆశ్రమ గోశాల, శ్రీశంకరానందగిరి స్వామి-మంకాల్ వంటివి కనిపిస్తాయి.
ధార్మిక కేంద్రాలుగా: మౌంటీ శంబళ, దేశముఖ్, బాటసింగారం గోశాల, రాజేంద్రనగర్ గోశాల, విశ్వక్సేన గోశాల- వనపర్తి, శ్రీ సాయికృష్ణ గోశాల- చింతపల్లి, లలితాంబికా తపోవనం గోశాల, జడ్చర్ల, వెంకటేశ్వర గోశాల, ఖమ్మం.
వైద్య శిక్షణ కేంద్రాలుగా: కామధేను గోవర్ధన్ గోవిజ్ఞాన కేంద్రం-కొంగర కలాన్, శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి గోశాల-బీరంగూడ, శ్రీ మహర్షి గోశాల- చింతగొట్టు క్యాంప్, హనుమకొండ-క్యాన్సర్ ట్రీట్‌మెంట్ ప్రత్యేకం.
ఉత్పత్తుల శిక్షణ-తయారీ కేంద్రాలుగా గోశాలలు/గో ఊర్జా కేంద్రాలు: వాత్సల్య గోశాల-నేరెళ్ల-సిరిసిల్ల జల్లా, విశ్వమంగళ గోశాల-మేడ్చల్, సురభి గోశాల-తాటిపల్లి, జగిత్యాల, స్వర్గ గంగ గోమాత-ఈశ్వరీపురి కాలనీ-కాప్రా.
గో ఆధారిత వ్యవసాయం ప్రోత్సహించే గోశాలలు: శ్రీలక్ష్మీ గోశాల, చిన్న దర్పల్లి, పాలమూరు, ఏకలవ్య ఫౌండేషన్, జింగుర్తి, తాండూరు, శ్రీ గాయత్రి గోశాల-నిర్మల్, మానవతా విశ్వవిద్యాలయం- నాటువెల్లి, కొత్తకోట.
పాడి-పాలు, నెయ్యి అందించే కేంద్రాలు: ఓంకార్ గోశాల, ముచ్చింతల, గోమాత విశ్వమాత సురభీ గోమాయి గోశాల-ధర్మారం, కోరుట్ల, కామధేను గోశాల-సోమారం, మేడ్చల్, నాగారం-ఎన్.ఎన్.రావు గోశాల, ఇసిఐఎల్, రంగనాథస్వామి గుడి, పహడీషరీఫ్-వడ్డ కిరణ్-గోశాల.
ప్రధాన దేవాలయాల గోశాలలు: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి-గోశాల, వేములవాడ-శ్రీ రాజరాజేశ్వర స్వామి-గోశాల, శ్రీ భద్రకాళి దేవాలయం-గోశాల, వరంగల్, వైకుంఠపురం-శ్రీ గోకులం గోశాల-సంగారెడ్డి, శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహాస్వామి-వేదాద్రి, పట్టుపల్లి.
రాష్ట్ర మంత్రివర్యులు నిర్వహించే గోశాలలు: నిరంజన్‌రెడ్డి- పానగల్లు- వనపర్తి, జగదీశ్వర్ రెడ్డి-మద్దూరు-షాబాద్.
గోరక్షణ ప్రధానంగా గోశాలలు: వందల, వేల సంఖ్యలో గోమాతల రక్షణను గోశాలలు నిర్వహిస్తున్నవి ఎన్నో ఉన్నాయి. అనేక దేవాలయాలలోనూ, స్వామీజీల ఆశ్రమాలలోనూ వ్యక్తిగతంగా గోశాలలు నిర్వహిస్తున్నారు.
ఆంధప్రదేశ్‌లోను ఎన్నో గోశాలలు ఉన్నాయి. మంత్రాలయ గోశాల, సురభి గోశాల, నందిని గోశాల- రాజమండ్రి, సింహాచలం దేవస్థానం గోశాల, పశుపతినాథ్ గోశాల- విశాఖపట్నం, కనకాలమ్మవారి గోశాల-కన్నెమడుగు, మాధవ గోశాల-నెల్లూరు, చాగంటి కోటేశ్వరరావు గోశాల-కాకినాడ, శ్రీవేంకటేశ్వర గోరక్షణ శాల- తిరుపతి, ఎస్‌వి గోశాల-తిరుమల,వాసుదేవ గోశాల-మచిలీపట్నం, శివకృష్ణ గోశాల-ఉత్తర పాలగిరి, గోశాల-బలభద్రపురం, ఈరన్న గోశాల-కర్నూలు, గోపాలకృష్ణ గోశాల-చికిలి ఉన్నాయి. ఇవి కాకుండా వ్యక్తులు నిర్వహిస్తున్న గోశాలలు కూడా ఉన్నాయి.