– గంటి భానుమతి
జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన
మామ్మగారు అన్నది గుర్తొచ్చింది. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు మాత్రమే కాదు, అత్తగారూ, మామగారూ, ఆడపడుచులు, మరుదులు.. అందరూ వస్తారు. మన దేశ గొప్పతనం అంతా మన ఈ కుటుంబ వ్యవస్థలో ఉంది. ఇది మన సమాజానికి, దేశానికి మూల స్తంభం. కానీ అందరూ దీన్ని అర్థం చేసుకోవడం లేదు. అందరూ ఉన్నా ఎవరూ లేనట్లుగానే ఉంటున్నారు. పైకి అంతా బాగున్నట్టే ఉన్నా లోపల్నించి కుళ్లుకుంటూ వస్తోంది కుటుంబ వ్యవస్థ. కొన్ని రోజులకి ఈ వ్యవస్థ చివరకు చరిత్ర శకలంగా మాత్రమే మిగిలిపోతుందేమో. మీలాంటి చదువుకున్నవాళ్లంతా ఈ వ్యవస్థని కాపాడాలి… ఈ మాటలు గుర్తొచ్చాయి.
ఈ ఇంటికి వచ్చి వారంరోజులు మాత్రమే అయింది. కానీ ఎన్నో రోజులైనట్లుంది. ఏంటో, లేచావా, తిన్నావా, పడుకున్నావా అన్న కాన్సెప్ట్‌తో రోజులు గడుస్తున్నాయి. సుధీరకి ఈ జీవితం నచ్చలేదు. పెద్ద ఇల్లు. చుట్టాలు, పాతకాలం వాసనలు అన్నీ కలిపి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మనసు విలవిల లాడిపోతోంది. ఇలా నలిగిపోవాల్సిందేనా! మొన్నటి వరకూ తనకో అస్తిత్వం ఉండేది. ఇండివిడ్యుయాలిటీ ఉండేది. ఇప్పుడు తనేంటో తనకే తెలీడం లేదు. ఎవరేం చెప్తే అదే చేస్తోంది. ఇది తనకే ఆశ్చర్యంగా ఉంది.
ఇలా ఎన్నిరోజులిక్కడ ఉండాలి. విక్రాంత్ వెళ్లే మాట ఎత్తనే ఎత్తడం లేదు. ఇవాళ విక్రాంత్‌ని అడగాలి.
ఒంటరిగా ఎప్పుడు కనపడతాడు? రాత్రి మాత్రమే. రాత్రి కూడా మైల అని ఇద్దరూ విడిగా చెరో మంచం మీద పడుకుంటున్నారు. అలసిపోయిన అతడిని ఆ సమయంలో అడిగి నిద్ర పాడు చెయ్యదల్చుకోలేదు. పగలు భోజనం చేసేటప్పుడు కనిపిస్తాడు కానీ అక్కడ అత్తగారూ, మామగారూ కాక చాలా మంది బంధువులు కూడా ఉంటున్నారు. ఈ బంధువులందరూ ఎప్పుడు వెళ్తారు. ఎన్ని రోజులు ఉంటారు. ఇంటినిండా ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీలవుతోంది. అక్కడ ఉన్నా తనని పట్టించుకోడు.
ఓ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక సుధీర తనకిచ్చిన మంచం మీద పడుకుని ఉండగా విక్రాంత్ బట్టలు మార్చుకోవడానికి వచ్చాడు. ఇదే సమయం తన మనసులోది అడగడానికి..
‘‘మనం ఎప్పుడు వెళ్తున్నాం? నేను ఏదో ఓవారం రోజులనుకున్నాను. సరే ఈ లోపల మామ్మ పోవడం.. అన్నీ జరిగాయి. వచ్చిన వాళ్లంతా వెళ్లిపోయారు. మనం ఉన్నాం. మనం కూడా వెళ్లాలి కదా…’’
‘‘నిజమే వెళ్లాలి. కానీ నేను ఇప్పుడప్పుడే వెళ్లడం లేదు. అసలు వెళ్లాలా వద్దా అని కూడా ఆలోచిస్తున్నాను.’’
ఆ మాటలు విన్న సుధీర స్థాణువైపోయింది.
వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాడా! అంటే ఇక్కడే ఉండిపోతాడా! తను కూడా ఇక్కడే ఉండాలా! తనేం ఇక్కడ ఉండదు. ఢిల్లీ వెళ్లిపోతుంది. కానీ అక్కడ అందరూ అడిగితే ఏం చెప్పాలి, ఎన్నో ప్రశ్నలు వేస్తారు. వాటికి తను సమాధానం తయారు చేసుకోవాలి. ఏం చెప్తే బావుంటుంది. దానికి అమ్మా నాన్నగార్ల సాయం తీసుకోవాలా! సాయం చేస్తారా, అసలు తనని సమర్థిస్తారా! వాళ్లు తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఏం చెయ్యాలి. అస్సలు సమర్థించరు. సొసైటీలో అందరితో గర్వంగా తన అదృష్టాన్ని, అమెరికా గురించి, విక్రాంత్ గురించి.. అందరికీ అసూయ కలిగేలా చెప్పారు. అలాంటిది ఇప్పుడు!
‘‘సూర్యరశ్మి, గాలి లేకుండా చెట్లు పెరగడం చూసావా?’’
వింతగా చూసాడు. ‘‘అలా ఉందా, నీకు ఇక్కడ. అందుకని వెళ్లాలనుకుంటున్నావా. నేను నీకు అడ్డు చెప్పను. నీ ఇష్టం. వెళ్లాలనుకుంటే వెళ్లచ్చు.’’
‘‘అదేంటీ. నువ్వు రావా. నేనొక్కదాన్నే వెళ్లాలా.’’
‘‘నీకు నా పొజిషన్ అర్థం కావడం లేదా? మామ్మ పోయి పదిరోజులైంది. అమ్మ ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈ సంగతి నీకు తెలీదు, నాన్న గారేమో ఇవాళ రేవు నుంచి వస్తూ జారి కింద పడిపోయారు. ఇంటికి రాకుండా అక్కడి నుంచి అలాగే ఆస్పత్రికి తీసుకెళ్లాం. ఎక్స్‌రేలు తీసారు. ఎముక విరిగిందేమోనని అనుమానం. హైద్రాబాద్ తీసుకెళ్లాలన్నారు, అక్కడికి వెళ్తున్నాం. ఒకవేళ ఎముక విరిగిందంటే గనక ఆపరేషన్ చెయ్యాలి. దాని గురించి డాక్టరు గారి దగ్గరికి వెళ్తున్నాను. ఆపరేషన్ అయి ఇంటికొచ్చాక ఫిజియోథెరపీ, వాకర్ సాయం. కొన్నింటికి నా సాయం. ఇవన్నీ నేనే చేయాలా అని నువ్వనుకోవచ్చు. కానీ నేనే చెయ్యాలి. నేనే చేస్తాను.’’
‘‘ఓ మనిషిని పెట్టుకుంటే సరి. మా తాత గారికి అలాగే ఓ మనిషిని పెట్టారు.’’
ఒక్క నిమిషం ఆమెనే చూస్తూండిపోయాడు.
‘‘కానీ నా సంగతి వేరు. నేను ప్రస్తుతం ఉన్న సమాజం వేరు. ఇక్కడ అన్ని తెలిసిన నేను, ఈ సమయంలో ఎక్కడిదక్కడ అలా వదిలేసి వెళ్లిపోడానికి ఇష్టపడను. కానీ నువ్వు వెళితే నాకు చాలా బాధ కలుగుతుంది. అందరూ ఏం అనుకుంటారు? నాకెవరి సంగతి అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను అని నువ్వు అంటే నీ ఇష్టం అంటాను. అన్నీ తెలిసిన దానివి, ఇది ఇలా కొనసాగితే ఎక్కడికి దారి తీస్తుందో’’ అని ఆగిపోయాడు.
‘‘ఏం నీకు భయంగా ఉందా. నన్ను పోగొట్టు కుంటావేమోనని!’’
‘‘కాదు, నిన్ను పోగొట్టుకుంటున్నానన్న భయం నాలో లేదు. కానీ నిన్ను నువ్వే పోగొట్టుకుంటావేమో అది చూసుకో.’’ అన్నాడు.
సుధీర ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దం. మౌన పోరాటం. అది పేరు లేని యుద్ధం కావచ్చు.
మా ఇద్దరి ఆలోచనలు వేరు, దృష్టి వేరు. ఇద్దరం భిన్న ప్రపంచాల్లో పుట్టి పెరిగిన వాళ్లం. ఇదే పెళ్లికి ముందు చూసుకోవాల్సింది. దీని గురించే మాట్లాడుకోవాలి. కానీ అప్పుడు దీనికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు జరిగిన యుద్ధంలో మాటలు లేవు. పదాలు నిశ్శబ్దంగా, రహస్యంగా దొర్లిపోయాయి.. అని మనసులో అనుకుంది సుధీర.
‘‘మనిషి హృదయంలోకి తొంగి చూడడానికి ప్రయత్నించకూడదూ. అదే కనక చేస్తే నీకు నా తప్పు కనిపించదు! జరుగుతున్న దానికి నేను బాధ్యుడిని కాను. నేనేం చెయ్యలేను. నువ్వు అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. చదువుకున్న దానివి’’
అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు. తను చదువు కున్నదని, ఉద్యోగం చేస్తున్నదని. అంటే ఈ ఊళ్లో ఉంటే ఇలాగే అన్ని మర్చిపోతానా! విక్రాంత్ అన్నట్లు నన్ను నేనే పోగొట్టుకుంటానా! ఇది కొత్త. నాకు తెలీని ప్రపంచం. ఈ కొత్త దారి, నేను ఎంచుకున్న దారి. వెళ్లాల్సిందేనా. ఇన్నాళ్లు తనున్న ఆ పాత ప్రపంచం ఓ జ్ఞాపకంగానే ఉండిపోతుందా! దీనికి కారణం ఎవరూ? ఎవరిని బ్లేం చెయ్యాలి. నిందించడానికి ఎవరూ లేకపోవడం కూడా దురదృష్టమే.
ఇప్పుడు తనేం చెయ్యాలి? తన భవిష్యత్తు ఏమిటి? గతంలో ఇప్పటి జీవితం కోసం ఎన్నో ఊహలు ఉండేవి. ఎన్నో కలలు కనింది, అది గతం. ఇప్పుడు భవిష్యత్తు కోసం ఒక్క ఊహ కూడా మిగలకపోతే గత జ్ఞాపకమే ఓదార్పుగా ఉంటుందా!
ఇంకా ఎన్ని రోజులుండాలో తెలీదు. ఓ నాలుగు రోజులు చూసి తను వెళ్లిపోవాలి. విక్రాంత్ వచ్చినా రాకపోయినా వెళ్లాలి.
సుధీరకి నిద్ర రావడంలేదు. ఎంతో ప్రయత్నిం చింది. కానీ ఆలోచనలు నిద్రని మింగేస్తున్నాయి. మెల్లిగా పెరట్లోకి వచ్చింది. అంతా నిశ్శబ్దం. అందులో ప్రశాంతత ఉంది. అందుకే అక్కడే ఉందామని అనిపించినా, ఎక్కడ కూచోవాలో తెలీక ఇంకొంచెం ముందుకి నడిచింది. అక్కడ ఓ తలుపు తీసుకుని వెళ్లింది. ఓ పెద్ద పెరడు. మధ్యలో నేల.. అటూ ఇటూ పొడుగాటి పెంకులు దింపిన సావిళ్లు. ఓ సావిట్లో వడ్లు దంచుతున్నారు. సుధీరని చూడగానే ఓ కుర్చీ చూపించి కూచోమన్నారు. పాట పాడుతూ లయబద్ధంగా దంపుతున్న ఆడవాళ్లని చూస్తూంటే ఆశ్చర్యమనిపించింది. అక్కడ ఓ యువతి కళ్లు తుడుచుకుంటూ కనిపించింది. ఆ పక్కన ఓ చిన్నపిల్ల ఓ బొమ్మతో ఆడుకుంటోంది.
‘‘వాడు రోజూ నన్ను చంపేస్తున్నాడు, నేనింక వాడితో ఉండలేను. ఇంత అనుమానం, కోపం ఉన్న మనిషితో ఎలా బతికేది?’’ అంటూ మళ్లీ కళ్లు తుడుచుకుంది. అంతలోనే కామాక్షి అక్కడికి వచ్చింది.
‘‘నాకు విషయం అంతా తెలిసింది. శీను రానీ, నేను మాట్లాడుతానుగా..’’
సుధీర నిశ్శబ్దంగా చూస్తోంది. మెల్లిగా ఆమెకు అంతా అర్థం అయింది. భర్తని వద్దనుకుంటోంది. వెళ్లిపోతానంటోంది. విడిగా ఉంటానంటోంది. వీళ్లు వద్దంటున్నారు. ఈమెలాగే తను కూడా వెళ్లి పోదామనుకుంటోంది, విడిగా ఉందామను కుంటోంది. అయితే తన కారణాలు వేరు. ఈమె కారణాలు వేరు.
‘‘ఇక్కడే ఉండు. శీనుకి నచ్చ చెప్తాం. ఇక్కడి నుంచి వెళ్లి ఎక్కడికి వెళ్తావ్. మీ పుట్టింటికి వెళ్లనంటున్నావు. ఇంక ఎవరున్నారు? ఒంటిగా ఎలా బతుకుతావు? కుటుంబాన్ని, బంధాల్ని తెంచుకోకు. బయటికి వెళ్లి జీవితాన్ని పాడుచేసుకోకు. నీకో కూతురుంది. దాని జీవితం గురించి ఆలోచించావా! బయటి ప్రపంచం ఎలా ఉంటుందో నీకేం తెలీదు.’’
‘‘నాకీ పిల్ల వద్దు, ఆ మొగుడూ వద్దు. నేనిక్కడ ఉండను.’’
‘‘సరే మొగుడు వద్దు, మరి మీ అత్తగారు, ఆడపడుచులు, తోడికోడళ్లు.. వాళ్లు కూడానా?’’
‘‘నాకెవరూ అక్కర్లేదు. నేనొక్కదాన్ని ఉంటాను. అంతగా ఉండలేకపోతే నదిలో పడి చావనైనా చస్తాను కాని వాడితో ఉండను.’’
కుటుంబ పరిధిని పెంచుకోవాలి కానీ, గిరి గీసుకుని ఉంటే ఎలా? రోజులు మనం అనుకున్నట్లుగా సజావుగా నడుస్తున్నప్పుడు ఎవరూ అక్కర్లేదు. అందరూ భారమనిపిస్తారు. కానీ అన్ని రోజులు మనవి కావు, అవసరమైనప్పుడు వాళ్లే మనకి అండగా ఉంటారు. అందుకని కుటుంబాన్ని కూల తోయకు… మామ్మ గారి మాటలు గుర్తొచ్చాయి.
ఒకవేళ తనకే ఆ పరిస్థితి వస్తే ఈమెలాగా మాట్లా డగలదా! ఆమెలో ఉన్న తెగువ, తనలో ఉందా! ఎక్కడున్నా ఈ మొగవాళ్లు ఇంతే. తమకి కావలసినట్లుగా భార్యల్ని చేసుకుంటారు.
‘‘దీని తప్పేమీ ఉండి ఉండదు. ఈ మొగవాళ్లు ఎక్కడైనా మొగవాళ్లే.’’
ఆమె కూతురు కింద కూచుంది. చేతిలోని ఓ ప్లాస్టిక్ బొమ్మని నోట్లో పెట్టుకుంటూ అందరినీ చూస్తున్న ఆ చిన్నిపాప మీదకి సుధీర దృష్టి మరల్చింది. తల్లికి జరుగుతున్న అన్యాయం తెలీని ఆ పాప శైశవ కేరింతలు కొడ్తోంది. ఆ బుగ్గల్లో నిగారింపు, అయాచితంగా కురిపిస్తున్న నవ్వులు ఎన్ని రోజులుంటాయి?
నాగమణి ఏ ఆశతో ఇక్కడినుంచి వెళ్లి పోదామనుకుంటోంది? ఆ ఆశ అకస్మాత్తుగా భంగమైపోతే, దీపంలా కొద్ది కొద్దిగా కొడికట్టిపోతే, ఏ వెలుతురు కోసం వెంపర్లాడుతోందో, అది మసకబారిపోతే, ఇప్పుడున్న ధైర్యం నీరుగారిపోతే!
‘‘అసలు ఏం జరిగింది. చెప్పు! ఏం అన్నాడు?’’
‘‘ఏం అన్నాడో, ఏం చేసాడో తెలీదు కానీ, వచ్చినప్పటినుంచి ఇలాగే కళ్ల నీళ్లు పెట్టుకుంటూ కూచుంది. ఆ పిల్లని కూడా పట్టించుకోవడం లేదు.’’ అని ఆ పక్కనున్న ఆమె అంది.
సుధీరకి ఆమె మీద అంతులేని జాలి కలుగుతోంది. పాపం అన్నం తిందో లేదో. తిని ఉండక పోవచ్చు… సాటి ఆడదానిగా అనిపించింది.
‘‘అన్నం తింటావా.’’ మొదటిసారిగా అందరి ముందు గొంతు విప్పింది సుధీర.
‘‘నాకేం వద్దు, ఆ మనిషి అన్ని మాటలు అన్నాక అన్నం తినడానికి మనసెలా వస్తుంది..?’’
అంతలోనే సీతమ్మ ఓ అరిటాకులో అన్నం తీసుకొచ్చింది. ఓ రెండు చిన్న గిన్నెల్లో పులుసూ, మజ్జిగ తెచ్చి తిను అన్నట్టు చేత్తో సైగ చేసింది. నాగమణి కదల్లేదు. అటువైపు చూళ్లేదు. కామాక్షీ కలగచేసుకుంది.. ‘‘నాగమణి అన్నం తిను. అలా అభోజనం ఉండకు. నెలల పిల్ల. నీ పాలు కూడా తాగుతోంది. నువ్వు మాడితే దాని సంగతి ఏంటీ. దానికేం ఇస్తావు?’’
‘‘చస్తుంది. అంతేకదా. చావనీయండి. చస్తే మళ్లీ నాలాంటి బతుకు దానికుండదు. నా బతుకు నేను బతగ్గలను. బయటి ప్రపంచం మీరంటున్న భయంకరమైనది కాదు. నేను అమాయకురాలిని కాను. నా పిల్లని తీసుకుని నేను బతగ్గలను.’’
సుధీర ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయింది.
‘‘ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధంలో తేడాలుంటే సర్దుకోవాలి, నాగమణి. ఎవరెంత గొప్పవారైనా చివరికి కుటుంబమే గొప్ప. అదే ముఖ్యం. అది కాపాడుకో’’ అని కామాక్షి అంది.
‘‘అన్నీ నాకే చెప్తున్నారు. ఆయనకి కూడా చెప్పండి. నేనే ఎందుకు ఎప్పుడూ సర్దుకోవాలి. తనని కూడా సర్దుకోమని చెప్పండి.’’
ఈ నాగమణి స్త్రీవాది కాదు, ఫెమినిస్ట్ కాదు. బాధితురాలు. పీడితురాలు, విక్టిమ్. అందుకే అంత ఆవేదన.
తనకు లేని ధైర్యం ఆమెకుంది. ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? భర్త మూలంగా రాజుకున్న సంఘర్షణలోంచి వచ్చిందా? సంఘర్షణ ఉంటేనే చైతన్యం వస్తుందా? ఆ చైతన్యం లోంచే ధైర్యం వస్తుందా?
తనకి ధైర్యం లేదు. అంటే తనలో ఇంకా చైతన్యం రాలేదా! చైతన్యం వచ్చేంత సంఘర్షణ ఉందా! అంత బాధలని అనుభవిస్తోందా! నిజానికి ఇంట్లో అందరూ తనని గౌరవిస్తున్నారు. ఒక ఆడపిల్ల ఏం కోరు కుంటుందో అలాంటి జీవితమే తనది.
‘‘ఏడవకు. ఇది ఏడ్చే టైమా? ముందు అన్నం తిను. ఆ తర్వాత అన్నీ కనుక్కుంటాను.’’
‘‘ఏడవడానికి ఓ టైమంటూ ఉంటుందా అండీ. ఏడుపొస్తే ఎంతసేపు ఏడుపుని దాచుకుంటానమ్మా.’’ అంటూ పిల్లని తీసుకుని, ఒళ్లో పెట్టుకుంది. పిల్ల పడుకున్నాక నాగమణి భోంచేసింది.
ఈ నాగమణి ఎవరై ఉంటారు? ఇంతకుముందు చూళ్లేదు. ఈరోజే ఆమెని చూస్తోంది. దుర్గని అడగాలి. ఆమెకి అన్ని తెలుసు. సుధీర అక్కడినుంచి వచ్చేసింది. నాగమణి, దాని కూతురు గురించి ఆలోచిస్తూ మేడ మీదకి వెళ్లింది. అక్కడ విక్రాంత్ కనిపించాడు. మామగారిని హైద్రాబాద్ ఆసుపత్రిలో చేర్పించి ఆ రోజునే వచ్చాడు. ఇంక సుధీర, అత్తగారు ఆ రోజు అందరూ హైద్రాబాద్ వెళ్లాలి. ఇది కూడా మంచిదే. హైద్రాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లడం సులువు.
ఇక్కడ నన్ను బంధించేసావు, నీకేం హాయిగా ఉన్నావ్ అని నాగమణిలాగా కోపం తెచ్చు కోవాలనుకుంది. కానీ అడగలేకపోయింది. కోపం తెచ్చుకోలేకపోయింది. కోపం తెచ్చుకునేంత ఆవేశం రాలేదు. అన్నీ తెలిసి అడగడం బాగుండదని అనిపించింది..
నాకు ఇక్కడ బాగా లేదు. పెళ్లికి ముందు మాకు ఓ మాట ఇచ్చారు, అని కూడా అనలేకపోయింది.
తను ఓ కల కంది. అది బజార్లో దొరికే ప్లాస్టిక్ కల కాదు. ఆ కల కనడానికి కారణం విక్రాంత్. సిలికాన్ కల అది.. ఓ అందమైన కల. అది ఎక్కడికి పోయింది. ఇప్పుడు విక్రాంత్ దాని గురించి ఏం మాట్లాడడం లేదు. ఎప్పుడో తన కనురెప్పల మీద నుంచి కళ్లల్లోకి వచ్చి, పునర్జన్మనిస్తుంది. అంత వరకూ కొత్త కలలు కనకూడదు. హైద్రాబాద్ వచ్చిన రెండు రోజులకే స్నేహితురాలి పెళ్లి. రమ్మని ఫోన్ చేసి మరీమరీ చెప్పింది. ఇదే సమయం. ఇక్కడి నుంచి వెళ్లిపోడానికి. విక్రాంత్‌కి చెప్పింది. తాను వెళ్లి పోతున్నానని, మళ్లీ రావాలో వద్దో ఆలోచిస్తానని అంది. అంతే ప్రయాణానికి సిద్ధం అయింది.
(ఇంకా ఉంది)