అఫ్ఘాన్‌లో ఇంకా రక్త కన్నీరే! పేలుళ్లు, కాల్పుల మోతలు సాగుతూనే ఉన్నాయి. అసలే పేద దేశం. అంతకు మించి హింసావాదుల రోజువారీ అకృత్యాలు!! అక్కడివారికి, ముఖ్యంగా వనితలకు ఏ విధమైన రక్షణా లేదు. ఇక ముందు ఉంటుందన్న నమ్మకమూ కనిపించదు.

ఆ దేశంలో ఉండే భారతీయ సంతతివారి పరిస్థితీ నరకంతో సమానం. ఎప్పుడు ఎవరి మాన ప్రాణాలు పోతాయో తెలియనంత భయంకరత్వం రాజ్యమేలుతోంది.

నిజానికి అంతర్‌, ‌బహిర్‌ ‌యుద్ధాలు అక్కడ మామూలే. అధికార పీఠం ఆక్రమించడానికి ఇన్నేళ్లూ తాలిబన్‌ ‌చేయని దుష్కృత్యాలంటూ లేవు. దురాక్రమణ పర్వం పూర్తయ్యాక, సర్వాధిపత్యం కోరుకున్న ప్రతిచోటా కొనసాగించే దుండగాలు కూడా ఇన్నీ అన్నీ కావు. భారత్‌ అనే మూడక్షరాలూ వింటేనే గంగవెర్రులెత్తే తాలిబన్‌ ‌విధ్వంసకారులకు పాకిస్తాన్‌ ఎప్పటినుంచో కొమ్ముకాస్తోందన్నది బహిరంగ రహస్యం. ఎన్నెన్నో ప్రగతి పథకాలతో అఫ్ఘానీయుల మదిని చూరగొన్న మనదేశమంటే పాక్‌కు మొదలంటా మంట. అందుకే తాలిబన్‌ ఉ‌గ్రవాద మూకలు రెచ్చిపోయి, అక్కడున్న సాధారణ పౌరులతో పాటు మనవారి మీదా దాడులకు తెగబడుతున్నాయి. మునుపటి మాదిరే ఇప్పుడూ ప్రధానంగా మహిళలను చెరబడుతున్నారు. బలవంతపు పెళ్లిళ్లకు విపరీత ఒత్తిడి చేస్తూ, కాదన్నవారిని నానారకాలుగా హింసించి క్రూర ఆనందం పొందుతున్నారు. అయినవారిని కోల్పోతున్న యువతుల, వివాహితుల, తల్లుల రక్తాశ్రువులు ఇంకా ఎంత కాలమో? కనీసం మా బిడ్డలనైనా బతకనివ్వండని వేడుకుంటున్న వారిలో అక్కడివారితో పాటు- భారత్‌ ‌నుంచి విద్య, ఉపాధి కోసం వెళ్లినవారూ ఉండటం గుండెల్ని గునపాలతో గుచ్చినంత!!! తాజాగా పంజ్‌షేర్‌ ‌ప్రాంతాన్ని పట్టుబట్టి ముట్టడించిన తరుణంలో తాలిబన్‌ ‌హింసావాదుల రక్కసి చర్యలు జనస్వామ్యప్రియుల హృదయాల్ని ముక్కచెక్కలు చేస్తున్నాయి. అక్కడా స్త్రీలపైన పగబట్టినట్లు విరుచుకు పడటం సభ్యసమాజాన్ని ఆసాంతం నిర్ఘాంత పరుస్తోంది. పడతుల ఉసురు తీయడమే వీరోచిత మనుకునే వాళ్లను మనం ఏమని పిలవాలి?

విధ్వంసకారులు ఒక్కుమ్మడిగా చొచ్చుకు రావడంతో దిక్కుతోచని వనితలు పసిబిడ్డలతో సహా పరుగులు తీసిన దృశ్యాలను మనమంతా ప్రసార-సమాచార మాధ్యమాల్లో కొన్నాళ్లుగా చూస్తూనే ఉన్నాం. అప్పటికి ఏకైక రవాణా మార్గమైన విమానా శ్రయం వెలుపల, లోపల ఎన్నెన్నో విదారక సన్నివేశాలు. ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద అత్యంత ఎత్తయిన ప్రహరీ గోడపైకి చిన్నారులను కుటుంబసభ్యులే చేరవేసిన తీరు చూశాం. సరిహద్దు కంచెల ఆవలి వైపునకు పిల్లల్ని చేర్చడం మాతృమూర్తులకు ఎంతెంత ప్రాణాంతకంగా మారిందో మన కళ్లతో మనమే గమనించాం. మరోవైపు- కొత్త ప్రభుత్వ ‘ఏర్పాటు’కు సంసిద్ధమైన దశలో సమస్త అఫ్ఘానీయులకూ తాలిబన్‌ అభయమివ్వడమే వింతల్లో వింత. ముఖ్యంగా మహిళామణుల హక్కులను గౌరవిస్తామన్న ప్రకటన మరీ మరీ విడ్డూరం. ఎందుకంటే, నిలువెల్లా సంకెళ్లు బిగించిన ‘ఘనాతిఘన’ చరిత్ర, వర్తమానం తాలిబన్‌ది. అన్ని అరాచకాలకూ మూల కేంద్రకం అక్కడే. పొడవాటి తుపాకులు చేతబట్టి, నడి వీధుల్లో ఆ మూల నుంచి ఈ మూలకు ముష్కరులు తిరిగేస్తుంటే స్త్రీలకు పరిరక్షణ ఎక్కడ? నాటి నుంచీ అనేకమంది మహిళా పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు మాత్రం సాహసించి గడప దాటి బయటికొచ్చి ప్రదర్శనగా నిరసన నాదాలు చేశారు. ‘మా స్వేచ్ఛను హరించకండి’ అంటుండగానే సాయుధులు రంగప్రవేశం చేసి దౌర్జన్యాలకు దిగడం అక్షర సత్యం. ఇన్నాళ్లూ ఇరవై ఏళ్లుగా తమకున్న హక్కులన్నీ ఇప్పుడు తాలిబన్‌ ‌పాలయ్యాయన్నదే వనితాలోకం క్షోభ. ఈ దుర్మార్గ పాలనలో తమ స్వతంత్రత మంట కలుస్తోందంటూ కాబూల్‌ ‌వేదికగా ఇటీవలనే కొంతమంది సమావేశమయ్యారు. సాధించిన అభివృద్ధి అంతా ప్రస్తుత వైపరీత్యంతో ఎందుకూ కొరగాకుండాపోయిందని అఫ్ఘాన్‌ ఎం‌పీ ఒకరు మునుపు కన్నీళ్ల పర్యంతమైంది అందుకే. భారతీయ వాయుసేన విమానంలో కాబూల్‌ ‌నుంచి గాజియాబాద్‌కు చేరుకున్న ఆయన (సిక్కు సంతతి) ‘మాదంతా సర్వనాశనమైంది’ అనడమే పరిస్థితి అన్ని విధాలుగానూ విషమించిందనడానికి ప్రత్యక్ష సూచిక.

మహిళలంటే మంట!

‘మాకు అక్కడ మిగిలింది శూన్యమే’ అంటున్న ప్పుడు అఫ్ఘానిస్తాన్‌ ‌సెనేటర్‌ అనార్కలీ గొంతు మూగపోవడాన్ని ఇప్పటికీ ఎవ్వరూ అంత సులువుగా మరవలేరు. నేడు అక్కడున్నది మూక వర్గమే తప్ప ప్రభుత్వం కానే కాదన్నది తన నిశ్చిత అభిప్రాయం (అదే నిజం). పిల్లా పాపలతో సహా మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్లదీస్తున్నారని హసిబా (అక్కడి వార్తాసంస్థ ఉద్యోగిని) ఆక్రోశం వ్యక్తపరిచారు. ఆడవాళ్ల కళ్లకు, కాళ్లకు, నోటికి, నుదుటి రాతకు సంకెళ్లు బిగించారని భావపూరితంగా చెబుతున్నప్పుడు ఆమె స్వరం వణికింది. అక్కడ ‘శిక్షలు’ ఎంతటి కర్కశంగా ఉంటాయో చెప్పనలవి కాదు. ఆడపిల్లలు చదివితే ‘తప్పు’, ఇల్లు దాటితే ‘దండన’, నోరు తెరిచి మాట్లాడా లన్నా భయం భయం, మహిళా వైద్యులమీదా ఆంక్షలు. రెండు దశాబ్దాల కిందట తాలిబన్‌ ‌బెడద ముగిశాక, ఆ దేశ అమ్మాయిలు చక్కగా చదువుకున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి, వారి శాతం నాలుగు రెట్లకు పైగా పెరిగింది. ఇప్పుడైతే స్థితిగతులు మళ్లీ మొదటికొచ్చాయని మరో బాధితు రాలు సలీమా అంటుండగానే చెమ్మగిల్లిన కళ్లు తోడయ్యాయి. ఇదీ అని బయటికి చెప్పకూడదు, పెళ్లి వంటి కీలక అంశమైనా పెదవి కదపకూడదు, సహవిద్య ఎంతమాత్రం తగదు! ఇవన్నీ అఫ్ఘాన్‌ ‌మహిళల చుట్టూ విస్తరించిన ముళ్ల కంచెలు. ఇవాళ్టి విపత్కర సమయంలో… బయటపడాలని యత్నించిన భారతీయ వనితల్లో కొంతమందిని నేర స్వభావులు చెరపట్టారు. గుర్తు తెలియని ప్రాంతాలకు అపహరించుకుపోయారు. అంతెందుకు- ఓ అఫ్ఘాన్‌ ‌పడతి సైతం లేఖ ద్వారా వాస్తవాలను హాలీవుడ్‌ ‌నటి ఏంజెలినా దృష్టికి తెచ్చింది. కలలన్నీ కల్లలుగా మారాయని, మా దేశంలోనే మేం బందీలయ్యామని దయనీయతను వెల్లడించింది.

అధికార మదోన్మత్తత

తాలిబన్‌ అనే మాటకు మంచి అర్థమే ఉంది- ‘విద్యార్థి’ అని. తాత్పర్యం మాత్రం పూర్తిగా మారిందనడానికి అఫ్ఘాన్‌ ‌పరిణామాలే ఉదాహరణలు. ఎటుచూస్తే అటు పాశవిక వైఖరి. గొప్ప హామీలిచ్చి దశాబ్దాల నాడు అధికారానికి వచ్చాకే, తీరుతెన్నులు మారాయి. బాలికలు బడులకు వెళ్లకుండా అడ్డుకున్నారు, అదేమంటే, అది తగని పని అని రెట్టించారు. వినోదం అనేదే ఉండకూడదన్నారు. ఎందుకని అడిగితే, నిషేధం నిషేధమే అంటూ హూంకరించారు. గతంలో, ప్రస్తుతంలోనూ తుపాకీ పాలనే! ఎదురుతిరిగి ప్రశ్నిస్తే, సమాధానం ఆయుధాలతోనే! ఇక్కడి (భారత్‌) ‌నుంచి అక్కడికి (అఫ్ఘానిస్తాన్‌) ‌తిరిగి వెళితే ప్రాణాలు దక్కవన్న భయాందోళన ఆ దేశీయురాలు హొమైరాలోనూ ఎక్కువైంది. అప్పట్లో తాలిబన్‌ ‌నిరంకుశ పాలనను చూసిన భయానక అనుభవం ఆమెది. తెలుగునాట విశ్వవిద్యాలయ చదువుల కోసం వచ్చి ఉన్న తాను… ఆ దేశంలో ఇక భవిష్యత్తు అనేదే అమ్మాయిలకు ఉండదంటోంది. అక్కడైతే భావ వ్యక్తీకరణ ప్రసక్తే లేదని చెబుతోంది.

అక్కడున్నది చట్టసమ్మత పరిపాలన ఎలా అవుతుంది? కళ్లు మూసినా, తెరిచినా అఫ్ఘాన్‌ ‌స్త్రీలకు పాలకులతో ముప్పే! ప్రతీకార వాంఛతో రగిలిపోవడం అలవాటుగా మారిన హింసావాదులు ఆ ఆగ్రహావేశాలనన్నింటినీ అన్నెంపున్నెం తెలియని వనితలపై చూపుతున్నారు. దాడులు, దౌర్జన్యాలు, దారుణ రీతి దండనల పేరిట దేశమంతటినీ కల్లోలపరుస్తున్నారు. సమాచార మాధ్యమాల్లో విధులు నిర్వర్తించాల్సిన మహిళలను అదిలించి బెదిరించి అటునుంచి అటే వెళ్లిపోయేలా చేస్తున్నారు. నల్లమందు సాగు, దాని నుంచి ఇతర మాదక పదార్థాల అక్రమ రవాణాకు మూలం తాలిబన్‌లోనే ఉంది. ఈ వ్యవహారానికి ఇక అధికార మదోన్మత్తతా జతగూడితే – సామాన్యులకు అందునా మహిళలకు ఇంకెక్కడి పరిరక్షణ?

– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE