రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పోకడ నడుస్తోంది. రాజీనామాలు, ఉపఎన్నికలు ప్రజల్లో ఓ రకమైన జోష్‌ను పెంచుతున్నాయి. విస్తృతంగా చర్చ జరిగేందుకు కారణమవుతున్నాయి. ఎవరు రాజీనామా చేస్తారా? ఎక్కడ ఉపఎన్నిక వస్తుందా? అన్న ఆత్రుత రాజకీయ నాయకుల్లో కన్నా ప్రజల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. హుజురాబాద్‌లో ఉపఎన్నిక జరగనున్న సందర్భంలో ఆ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు, టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి దీనికి కారణమవుతోంది. జరుగుతున్నది ఒకే నియోజకవర్గమైనా రాష్ట్రమంతటా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న స్థాయిలో హామీలు, పథకాలు, పనులు, నియామకాలు కొనసాగుతున్నాయి. అందుకే ఇప్పుడు రాజీనామాలు, ఉపఎన్నికలు వంటి ఊసు వినిపిస్తే చాలు అందరి దృష్టీ అటువైపే కేంద్రీకృతమవుతోంది.

ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు, రాజీనామా డిమాండ్లు, తొడగొట్టే సవాళ్లు ట్రెండింగ్‌గా మారాయి. మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, తిట్లు-దూషణలు జనంలో రాజకీయ నాయకులపై ఓ రకమైన ప్రతికూల భావనకు కారణమవుతున్నాయి. అయితే, వాళ్లు తిట్టుకున్న దానికంటే సవాళ్లకు అనుగుణంగా రాజీనామాలు చేస్తారా? ఉపఎన్నికలు వస్తాయా? అన్న చర్చే ప్రధానంగా సాగుతోంది.

విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ పరిణామాల నేపథ్యంలోనే.. బీజేపీ నాయకు రాలు విజయశాంతి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ‘పీసీసీ అధ్యక్షులు, టీఆర్‌ఎస్‌ ‌మంత్రికి మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్‌ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత అప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే.. ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ముఖ్యమంత్రి ఏవో వరాలు ఇవ్వచ్చేమో అనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది’ అన్నారు. ‘ఎన్నికల అవసరం లేకుంటే కేసీఆర్‌ ‌ప్రజల ముఖం కూడా చూడరన్న బలమైన నమ్మకం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉండటమే ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణలో ప్రజాప్రతినిధులను రాజీనామాలకై అనేక నియోజకవర్గాలలో ప్రజలు డిమాండ్‌ ‌చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజీనామాల కోసం, ఉపఎన్నికల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్లిన ఈ అప్పుల, ఆస్తుల అమ్మకాల సీఎం భవిష్యత్తులో తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో అన్న ఆందోళన అందరిలోనూ ఏర్పడుతున్నది’ అని విజయశాంతి పేర్కొన్నారు.

‘రాజీ’ డ్రామా

రేవంత్‌ ‌రెడ్డి, మల్లారెడ్డి సవాళ్లు జనాన్ని తప్పుదారి పట్టించేందుకేనా? అన్న విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పాదయాత్ర నేపథ్యంలో ప్రజల దృష్టిని తమ వైపు మరల్చు కునేందుకే ఎవరికి వారు తమ ప్రాబల్యాన్ని మాత్రమే ప్రాచుర్యంలో ఉంచుకోవాలన్న లక్ష్యంతో ఈ రాజీడ్రామాకు తెరతీశారని కూడా చెప్పుకుంటున్నారు.

త్రిముఖ పోరు

కొన్నాళ్లుగా తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో త్రిముఖపోరు నడుస్తోంది. తెలంగాణ వచ్చినప్పటినుంచీ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే గుత్తాధిపత్యం మాదిరిగా వ్యవహరించింది. కనీసం ప్రతిపక్షం కూడా ఉండొ ద్దన్నది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌నైజం. అందుకే అవసరం ఉన్నా, లేకున్నా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంటారు. కానీ, భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌నియామకమైనప్పటి నుంచీ పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరిగింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు.. టీఆర్‌ఎస్‌ను నేరుగా టార్గెట్‌ ‌చేసే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, దుబ్బాక ఉపఎన్నిక, హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ కాషాయ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇక, ఇటీవలే కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియ మించడంతో రేవంత్‌ ‌కూడా దూకుడు కొన సాగిస్తున్నారు. ఫలితంగా అధికార టీఆర్‌ఎస్‌పై ఒత్తిడి పెరిగింది.

ఓవైపు బండి సంజయ్‌, ‌మరోవైపు రేవంత్‌ ‌వ్యూహాలు, విమర్శలు, ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ సాగిస్తున్న విమర్శల దాడులను టీఆర్‌ఎస్‌ ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలో పడిందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలోనే బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను రూపొందించుకున్నారు. ఈ యాత్ర పేరిట టీఆర్‌ఎస్‌ ‌ప్రతికూలతలు, బల హీనతలు, వ్యతిరేకతలే లక్ష్యంగా పాదయాత్రకు రూపకల్పన చేశారు. ఆగస్ట్ 28‌వ తేదీన పాదయాత్ర ప్రారంభించారు కూడా. అటు, రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున టీఆర్‌ఎస్‌ ‌వ్యతిరేక సభలు నిర్వహించడం మొదలెట్టారు.

– సుజాత గోపగోని, 6302164068,  సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE