వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
– సువర్ణ మారెళ్ల
ఆ విశాలవంతమైన హాలు అంతా పలురకాల మీడియా రిపోర్టర్లతో నిండి పోయింది. వైద్యరంగంలో, అందునా ఆప్తమాలజీ, న్యూరాలజీలో ఎన్నో పరిశోధనలను విజయవంతంగా నిర్వహించిన ప్రముఖ శాస్త్రవేత్త డా।। మిత్ర మళ్లీ ఇన్ని రోజుల తరువాత ప్రెస్‌మీట్‌కు పిలవడంతో అందరిలోనూ ఏమి చెప్తారో అనే కుతూ హలం నిండుకుంది. అక్కడ వారందరూ ఒకరితో ఒకరు గుసగుసగా మాట్లాడుతున్నా, అందరూ ఒకేసారి మాట్లాడటంతో అక్కడ గొడవ గొడవగా ఉంది. ఈలోపు ఆ హాలుకి ఉన్న గాజు తలుపు కిర్రుమంటూ చప్పుడు చేసుకుంటూ తెరుచుకుంది.
అందులోనుంచి ఒక సన్నగా, వెండి నురుగులా మెరిసే పొడుగయిన గెడ్డంతో, చిన్న కళ్లలో కూడా తళుకుమనే ప్రకాశంతో దాదాపుగా ఆరు పదులకు దగ్గర పడుతున్న డా।। మిత్ర మారువేషంలో ఉన్న సూర్య భగవానుడిలా వడివడిగా అడుగులు వేసు కుంటూ లోపలికి వచ్చాడు. అతని పెదాల మీద చిరునవ్వు గెడ్డంతో మూసుకుపోయినా కన్నుల ప్రక్కన పడిన ముడతలు ఆ నవ్వును బయట పెడుతున్నాయి. అంతసేపు అక్కడ నెలకొన్న గందరగోళం ఒక్కసారిగా అక్కడ ఉన్న వారి ఉఛ్వాస, నిశ్వాసల చప్పుడు వినగలిగేటంత నిశ్శబ్దంగా మారిపోయింది.
డా।। మిత్ర అందరి వైపు ఒకసారి చూసి చిరు నవ్వు నవ్వి, తనదైన శైలిలో చెప్పడం మొదలు పెట్టాడు.
‘‘ఇన్నేళ్ల నా శ్రమ కొంతవరకు ఫలించింది. కంటిచూపుకు నోచుకోని ఎందరో అభాగ్యులకు చూపు తెప్పించే దిశగా సాగిన నా ప్రయోగం ఆశాజనకంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ, అతి చిన్న సర్జరీతో కన్నులో ఉన్న లెన్స్, కార్నియా వంటి కొన్ని భాగాల పనితనాన్ని మెరుగుపరిచి వాటిని మిగిలిన భాగాలతో అనుసంధానించబడుతుంది. ఆ పక్రియ తరువాత ప్రస్తుతం వాడే కాంటాక్ట్ లెన్స్ వలె తయారు చేసిన లెన్స్ బాహ్యంగా కళ్లలో అమర్చగానే అది మనిషి మెదడుతో, నాడీ వ్యవస్థతో కళ్లను అనుసంధానం చేసి చూపు లేని వారికి కంటి చూపు తెప్పించడం ఆ పరికరం ముఖ్య ఉద్దేశం.’’ అంటూ ఆ లెన్స్‌లో ఏ సాంకేతికత వాడారో, ఎలా పనిచేస్తుందో, ప్రొజెక్టర్‌లో పీపీటీ ద్వారా సామా న్యుకు కూడా అర్థమయ్యే విధంగా వివరించి ఒక్క నిమిషం విరామం ఇచ్చారు.
పది నిమిషాల పాటు అక్కడ హాలంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఆపమన్నట్టు చెయ్యి పైకి ఎత్తి మరలా చెప్పటం మొదలు పెట్టాడు.
‘‘ఆ ఆర్టిఫిషియల్ లెన్స్ అన్ని విధాలా పని చేస్తున్నాయని తెలుసుకోవడానికి కేవలం జంతువుల మీద ప్రయోగించి చెప్పలేం. కంటిచూపు అనేది మనకు చాలా ప్రాధాన్యం. మనం ఒక అందమైన ప్రకృతి దృశ్యం చూసినపుడు మనసు ఆనందంతో పరవశిస్తుంది. అలాగే మన ముందు ఏదయినా వింత జరిగితే ఆశ్చర్యంతో నిండిపోతుంది. గాయాలతో ఎవరినయినా చూస్తే బాధతో బరువు ఎక్కుతుంది. ఇలా మనం ఒక దృశ్యం చూసిన వెంటనే ఎన్నో భావోద్వేగాలను పొందుతాం. అంతేకాకుండా చూడగలగడం అంటే వాటి రంగులు, దగ్గర, దూరం, పరిమాణం అన్నీ మన మెదడు లెక్కలు గట్టి చెప్పగలగాలి. అప్పుడే చూసిన దృశ్యం, వస్తువు, లేదా వ్యక్తులను మనం గుర్తు పట్టగలం. వాటిని మన జ్ఞాపకాలలో నిక్షిప్తం చేసుకోగలం. దానికోసం ఆ ప్రయోగం చేసే వారికి మానసిక, శారీరక దృఢత్వంతో పాటు కంటిచూపు రావాలి అనే ధృడ సంకల్పం కూడా ఉండాలి. ఒకవేళ ఆ పరికరంతో మెదడు అనుసంధానం చేసుకోవడంలో ఏదయినా తేడా వస్తే మతి భ్రమణం జరగచ్చు, కోమాలోకి వెళ్లిపోవచ్చు, అసలు ప్రాణమే పోవచ్చు. ఇందులో మరోచిక్కు ఉంది. పుట్టుకతో అంధులు అయినవారు ఈ ప్రయోగానికి సరిపోరు. కారణం వారికి దృష్టి వచ్చాక చూసే రంగులు, ఇంకా ఇతర వస్తువులు సరిగా కనిపిస్తున్నాయో, లేదో వారికి తెలిసే అవకాశం లేదు. అందువలన ప్రభుత్వం సహకారంతో స్వచ్ఛందంగా ఈ ప్రయోగానికి అంగీకరించిన వారికి కొన్ని శారీరక, మానసిక పరీక్షలు చేసి ప్రయోగానికి స్వీకరిస్తాం. రేపు అధికారికంగా ప్రకటన ఇవ్వ బోతున్నాం. మీరు కూడా ఈ ప్రయోగం కోసం మాతో సహకరించవలసినదిగా కోరుతున్నాను.’’ అంటూ ముగించారు.
ఒక అరగంట విలేకరులు అడిగిన ప్రశ్నలకు డా।। మిత్ర సమాధానాలు చెప్పి ఆ ప్రెస్‌మీట్ ముగించారు.
* * * * *
డా।। మిత్ర, ఈ ప్రయోగం కోసం ఏర్పాటు చేసుకున్న వైద్య బృందంలోని వారందరూ ఒక హాల్లో సమావేశం అయ్యారు. ఆ వైద్య నిపుణులు అందరినీ ఉద్దేశించి ‘‘మనం ముందుగా ఊహించిన విధంగానే ఈ ప్రయోగానికి స్వచ్ఛందంగా వచ్చిన వారు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. అందులో మెడికల్ పరీక్షలో చాలా వరకు విఫలం అయ్యారు. మిగిలిన వారిని మీ మీ శాఖలలో ఈ ప్రయోగానికి ఎవరు సరిపోతారో మనం ఒకసారి విశ్లేషించు కోవాలి. అందులో అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నవారిని సెలెక్ట్ చేద్దాం’’ అని చెప్పి ఇక మొదలు పెట్టండి అన్నట్లు అందరి వైపు చూసాడు.
‘‘నిజానికి మిగిలిన అందరిలో వయసులో చిన్నవాడయిన రుషి శారీరకంగా దృఢంగా ఉండటమే కాకుండా, కంటిచూపు కోల్పోయినా కూడా కళ్ల ఉపరితలంకి, రెటీనాకు మధ్య ఉన్న, కంటిచూపులో ముఖ్య భూమికను పోషించే ఒకలాంటి పారదర్శక ద్రవం ఉండే వర్టియస్ ఛాంబర్ క్లియర్‌గానే ఉంది. అలాగే ఆప్టిక్ నర్వ్‌లో కూడా మరీ అంతగా డ్యామేజ్ జరగలేదు. మనం కృత్రిమంగా పెట్టే లెన్స్ అనుసంధానం అయ్యే విధంగానే ఉంది. ఇలా మరికొన్ని ముఖ్యమైన భాగాలు ఇంకా పనిచేసే దశలోనే ఉన్నాయి. సో! ఇన్ మై ఒపీనియన్ రుషి ఈస్ కరెక్ట్ ఛాయిస్’’ అంటూ ముగిం చారు, ఆ బృందంలో ఉన్న ఆప్తమాలజిస్ట్.
‘‘ఎస్! నా ఉద్దేశంలో కూడా రుషి బెస్ట్ ఛాయిస్.. ఎందుకంటే అతని పాస్ట్ హిస్టరీ ప్రకారం అతను చక్కటి చిత్రకారుడు. రంగులు, ఇంకా ఇతర విషయాల్లో చిత్రకారుడికి ఉన్న జ్ఞానం వేరే ఎవరికి ఉండదు. కళ్లకు, మెదడుకు, నాడీవ్యవస్థకు మధ్య అనుసంధానం కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. సో..’’ అంటూ డా।। మిత్ర సైకియాట్రిస్ట్ వైపు చూసాడు.
‘‘సేమ్ హియర్!! అతనితో జరిగిన నా కౌన్సిలింగ్ ప్రకారం అనాధ ఆశ్రమంలో పెరిగిన అతనికి, అమ్మను చూడాలనే కోరిక చిన్నప్పటి నుంచి చాలా బలంగా ఉంది. ఆమె ఉనికి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఆమె ఆచూకీ కనిపెట్టాడుగాని, ఆమె చనిపోయిందని తెలిసి కుమిలి పోయాడు. స్వతహాగా చిత్రకారుడు అయిన అతను ఆమె రూపురేఖలను ఆమెను చూసిన వారి మాటల్లో తెలుసుకుని బొమ్మ వేయాలనే ఆలోచనలో ఉండగానే ఇలా యాక్సిడెంట్ జరగడం, చూపు కోల్పోవడం జరిగాయి. అతను చనిపోయినా పరవాలేదు, ఎలా అయినా అమ్మ బొమ్మ వేసి చూసుకోవాలనే దృఢసంకల్పం అతనిని కుదురుగా ఉండనివ్వట్లేదు. సహజంగా ఇలాంటి తీవ్రతను మేము మెంటల్ డిసీజ్‌గా తీసుకుంటాం. కానీ ఈ ప్రయోగానికి ఆ లక్షణమే అతనిని సంసిద్ధం అయ్యేలా చేస్తుంది.’’ అన్నాడు నవ్వుతూ..
సర్జన్, ఎనస్థీషియనిస్ట్ ఇలా ఆ బృందంలో మిగతావారంతా రుషి ఈ ప్రయోగానికి సరైన ఎంపిక అని వారి వారి వివరణలతో ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
* * * * *
రుషి ఆపరేషన్ విజయ వంతంగా పూర్తి అయ్యింది. కొన్ని రోజుల పరిశీలన అనంతరం అతనికి కంటిలో ఇంటర్నల్‌గా అమర్చిన పరికరంతో బయట వైపునుంచి లెన్స్ అమర్చే విధానం మొదలయ్యే రోజు వచ్చింది.
రుషి తనకు కేటాయించిన రూంలో డా।। మిత్ర కోసం ఎదురు చూస్తున్నాడు.
తనతో తెచ్చుకున్న కాన్వాస్, పెయింటింగ్ బ్రెష్‌లు, రంగులని ఒకసారి ప్రేమగా తడుముకుని తృప్తిగా నవ్వుకున్నాడు.
డా।। మిత్ర లోపలికి నవ్వుతూ వచ్చి రుషిని విష్ చేశాడు.
‘‘వెల్‌డన్ రుషి! ఎంతోమంది అంధులకు మీరే హోప్. ఈ ప్రయోగం అంతా మీ చేతుల్లోనే.. ఐ మీన్ మీ కళ్లలో ఉంది. ఆల్ ద బెస్ట్ యంగ్ మ్యాన్’’ అంటూ భుజం తట్టాడు.
‘‘డాక్టర్! నాకు కళ్లు రాగానే మా అమ్మ బొమ్మ గీసుకోవచ్చా?’’ ఆశగా అడిగాడు.
‘‘వై నాట్!! అసలు నిన్ను ఎంపిక చేసుకోవడంలో ముఖ్య ఉద్దేశం కూడా అదే.. ఒక చిత్రకారుడి కన్నా కళ్లను, మెదడును అనుసంధానించే వాళ్లు వేరే ఎవరు ఉంటారు?’’ అంటూ నవ్వి..
‘‘బీ రెడీ రుషి!! ఈ రోజు రాత్రే ఈ లెన్స్ మీకు అమరుస్తాము. ఎందుకంటే ఈ ప్రాసెస్‌లో ప్రతీ స్టెప్‌లో మీకు, మీ మెదడుకు విశ్రాంతి ఎంతో అవసరం.’’ అని చెప్పాడు.
* * * * *
రుషి కళ్లకు లెన్స్ అమరుస్తున్నారు డాక్టర్లు. డా।। మిత్ర కంప్యూటర్ మానిటర్ ముందు కూర్చుని ఆ లెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అతని మెదడు పని తీరును నిశితంగా పరీక్షీస్తున్నాడు.
రుషి కళ్లలో లెన్స్ అమర్చడం అంతా సజావుగా జరిగింది. కానీ ఇంకా చూడటానికి అనుమతి ఇవ్వలేదు. కళ్లకు బ్యాండేజ్ వేసి ఆరోజుకి ఆ పక్రియ ముగించారు.
మరుసటి రోజు ఉదయమే కళ్లకు ఉన్న బ్యాండేజ్ విప్పి ఎదురుగా ఉన్న వాటిని చూడమని చెప్పారు డాక్టర్లు.
రుషి మెల్లగా కళ్లు తెరిచి చూసాడు. ఎదురుగా ఎవరో ఉన్నారని తెలుస్తోంది గాని స్పష్టత లేదు. మసకమసకగా కనిపిస్తున్న కళ్లను అలవాటుగా నిలుపుకోవడానికి ప్రయత్నించిన రుషిని డాక్టర్లు వారించి, మళ్లీ కళ్లు తెరవకుండా ఉండటానికి కళ్లద్దాలు వంటి పరికరం పెట్టారు.
డా।। మిత్ర వచ్చేలోగా మెదడులో జరిగిన చర్యలను పరిశీలించి నోట్స్ తయారు చేసి ఉంచారు.
డాక్టర్ ఆ విషయాన్ని పరిశీలించి ‘‘గుడ్ ఇంప్రూవ్మెంట్. మెదడు బాగానే లెన్స్‌ను కోరిలేట్ చేసుకుంటోంది. సెలిరియా మజిల్స్ లెన్స్‌తో అను సంధానం అవడానికి కొంత సమయం పడుతుంది. దీనికి కంగారు పడక్కర్లేదు. కాసేపు అలా చీకటిలో కాకుండా కళ్లు ఓపెన్ చేసి ఉండనివ్వండి అదే సర్దుకుంటుంది.’’ అని అసిస్టెంట్స్‌కి చెప్పి రుషి వైపు చూసి ‘‘గుడ్ రుషి, ఈ రోజు అంతా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువగా మెదడును కష్టపెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. రేపటికి ఇంప్రూవ్మెంట్‌ని బట్టి మీరు బొమ్మ గీయడం మొదలు పెట్టవచ్చు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఆ రోజంతా స్పష్టత లేని చూపు, పైగా మెదడు పొందే ఒత్తిడి, కొత్తగా కళ్లలో అమర్చిన లెన్స్ ఫారిన్ బాడీని తీసుకోవడానికి ఇష్టపడక శరీరం చూపే వ్యతిరేకత ఇవన్నీ రుషిని చాలా ఇబ్బంది పెట్టాయి. పర్యవసానంగా భరించలేని తలనొప్పి, చిన్న జ్వరం. డాక్టర్స్ ఇచ్చిన మందులతో కొంత ఉపశమనం పొంది ఆ రాత్రి నిద్రపోయాడు.
ప్రొద్దున్న లేచేటప్పటికి అతని పరిస్థితి కుదుటపడింది. చూపులో కూడా స్పష్టత వచ్చింది. రుషి మనసు ఆనందంతో గెంతులేసింది.
డా।। మిత్ర వచ్చి చూసాడు.
‘‘వెరీ గుడ్!! ఇంప్రూవ్మెంట్ బాగుంది. మీరు ఇక మీ అమ్మగారి బొమ్మని ప్రయత్నించవచ్చు’’ అన్నారు నవ్వుతూ.
అన్నదే తడువుగా కాన్వాస్ తెచ్చి ముందు పెట్టుకుని, రంగులు అన్నీ అమర్చుకుని కళ్లు మూసుకున్నాడు. ఇన్నాళ్లూ తన మెదడులో నిక్షిప్తం చేసుకున్న అమ్మ రూపు గురించి వివరించిన వారి మాటలు అన్నీ ఒక్కసారిగా జ్ఞప్తికి తెచ్చుకుని పెన్సిల్‌తో చక చకా ఔట్ లైన్ గీశాడు. ఒకసారి తేరిపార చూసుకుని, రంగులు వేసే ఉద్దేశంతో రంగుల వైపు చూసాడు. అంతే. షాక్ తిన్న వాడిలా ‘‘డాక్టర్’’ అంటూ ఓ పొలికేక పెట్టాడు.
వెంటనే మానిటర్‌లో రుషి మెదడు ప్రతి స్పందనలు పరిశీలిస్తున్న మిత్ర గబగబా వచ్చి విషయం ఏమిటని అడిగాడు.
‘‘నాకు రంగులు కనిపించట్లేదు. అంతా బ్లాక్ అండ్ వైట్‌గా కనిపిస్తోంది’’ అన్నాడు ఆవేదన నిండిన గొంతుతో.
‘‘కూల్‌డౌన్ యంగ్ మ్యాన్!! ఏమి కాదు. నేను చూస్తాను. కొంతసేపు ప్రశాంతంగా ఉండు’’ అని చెప్పి చకచక పరిశీలించటం మొదలు పెట్టాడు.
మనం రంగులు చూడటానికి ఉపయోగపడే కళ్లలోని భాగాలు రాడ్స్, కాన్స్ మధ్య కోరిలేషన్ సరిగా లేదనుకుని వాటి పనితనం సరి చెయ్యటంలో పడిపోయాడు.
అంతా అయ్యాక ‘‘ఈ రోజు రాత్రి చాలా కీలకం. రంగుల్ని త్వరలోనే గుర్తు పడతాడు కానీ ఆ చూపు ఎంత సేపు ఉంటుందో చెప్పలేం. అతనిని ఓ కంట కనిపెట్టుకు ఉండండి. మెదడు ఎక్కువ పని చేస్తే ప్రాణానికే ప్రమాదం. అతనికి రంగులు కనిపిస్తు న్నాయని చెప్పిన మరుక్షణం ఒకసారి పరీక్షించి అనస్థీషియా ఇచ్చేయండి’’ అని అసిస్టెంట్ డాక్టర్స్‌తో చెప్పి కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్లి పోయాడు.
రుషికి మనసు కకావికలంగా ఉంది. మళ్లీ భరించలేని తలనొప్పి. ఈసారి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. అమ్మ బొమ్మ వేయలేకపోతానేమో అనే భయం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
ఇందాక డా।। మిత్ర అసిస్టెంట్స్‌తో అన్న మాటలు బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి.
సాయంత్రం అయ్యేటప్పటికి రంగులు ఒకటొ కటిగా కనబడటం మొదలయ్యాయి. ఓ గంట గడిచే సరికి మొత్తం ప్రపంచం రంగుల మయం అయ్యింది అతనికి. ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన వాడిలా కళ్లు మూసుకుని నిద్ర నటించాడు.
అతను ఏమీ చెప్పకపోవడంతో కంటిలో డ్రాప్స్ వేసి డాక్టర్ అక్కడి నుంచి పక్క గదిలోకి వెళ్లిపోయాడు.
అర్ధరాత్రి లేచి కాన్వాస్ వద్దకు వచ్చి అమ్మ బొమ్మ ఔట్ లైన్‌ని డెవలప్ చేసి, చక్కటి రంగులతో తీర్చి దిద్దడం మొదలుపెట్టాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ ఈ హఠాత్పరి ణామాన్ని చూసి వద్దని వారించాలని ప్రయత్నించినా అతను ఒక అలౌకిక స్థితిలో ఉండడాన్ని గ్రహించి, వెంటనే డా।। మిత్రాకు కబురు పంపించాడు.
అతని మెదడు, శరీరం వ్యతిరేకిస్తున్నా కూడా అమ్మను చూడాలనే అతని సంకల్పం అతని కుంచె కదిలేలా చేసింది.
అమ్మ తనను కన్నప్పుడు పురిటి నొప్పుల ఎలా పడిందో, అంతకు రెండింతలు అతను అమ్మ బొమ్మ వెయ్యడంలో అనుభవిస్తున్నాడు. అయినా కూడా బొమ్మ పూర్తి అయ్యేవరకూ అతని కుంచె అసం కల్పితంగా కాన్వాస్ మీద కదులుతూనే ఉంది.
పూర్తి అయిన అమ్మ బొమ్మను తృప్తిగా చూసుకున్నాడు. ఆ ఆనందం కళ్ల వెంట జలపాతంగా మారింది. అలా అతను కళ్లల్లో అమ్మరూపం ముద్ర వేసుకోగలిగాడే కానీ, అంత ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేసాడు.
అప్పటికే చేరుకున్న డా।। మిత్ర అతను ప్రమాదం అంచున ఉన్నాడని తెలిసినా వారించలేకపోయాడు. కారణం ఆ స్థితిలో అతని మెదడు ఏ వ్యతిరేకతను కూడా స్వీకరించలేదు అని అతనికి తెలుసు. అతని ప్రయత్నాన్ని ఆపి అతన్ని మరణపు అంచుకు తీసుకెళ్లే కన్నా, చివరిసారిగా అతని చిరకాల కోరిక తీర్చడం మంచిదనిపించింది. అందుకే మిన్నకుండా నిలబడి పోయాడు.
ఎన్నోరంగులు మిళితం చేసి కాన్వాస్‌పై అందం గా రూపొందించిన అమ్మ రూపం ప్రయోగానికి తొలి విజయం, భవిష్యత్తులో అంధులకు ఆశాకిరణం అని తెలుస్తున్నా, రుషిని కోల్పోయిన బాధ అతని కళ్లల్లో నీటి చుక్కలుగా మారి చెంపలపై మెరిసాయి.