– డా. ఎస్‌విఎన్‌ఎస్‌ ‌సౌజన్య, MBBS, MD Ped, DNB

భారత్‌తో పాటు ప్రపంచ ప్రజానీకం ఎదుర్కొన్న ఈ శతాబ్దపు అత్యంత భయానక అనుభవం కరోనా. వైద్యశాస్త్రం గొప్ప మలుపులు చూసిన తరువాత ఈ ఆధునిక కాలంలో కంటికి కనిపించకుండా మానవాళి మీద వైరస్‌ ‌చేసిన దాడి అది. వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీపురుష భేదం లేకుండా ప్రళయాన్ని అనుభవానికి తెచ్చింది. ఊరూవాడలను  మరణభయంతో వణికించింది. మార్చి 11, 2020న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ‌నోవెల్‌ ‌కరోనా వైరస్‌ ‌వ్యాధిని (కొవిడ్‌ 19) ‌ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ఈ అంటువ్యాధి దావానలంలా భూగోళాన్ని చుట్టుముట్టింది.కోట్లాదిమందిని ఆసుపత్రుల పాల్జేసింది. అనూహ్య వేగంతో సాగిన కొవిడ్‌ 19 ‌వ్యాప్తి మానవ జీవితం, కార్యకలాపాలను దిగ్బంధించింది. ఆర్థిక కార్యకలాపాలు నిస్తేజమైనాయి. బాహ్య ప్రపంచం ఆంక్షల మధ్య కునారిల్లిపోయింది.ఆదాయం, జీవనోపాధి కోల్పోయి ప్రజానీకం తల్లడిల్లిపోయింది. వీటన్నిటి మధ్య మరింత మనోవేదనకు గురైనవారు – గర్భిణులు, బాలింతలు. వారి క్షోభను అర్ధం చేసుకోవలసిందే. అభం శుభం తెలియకుండా ఈ లోకంలోకి వస్తున్న ఒక కొత్తతరం భవితకు సంబంధించిన క్షోభ అది.

కొవిడ్‌ ‌నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు ఎదుర్కొన్న/ఎదుర్కొంటున్న సమస్యలకు కొన్ని పరిష్కారాలు. వ్యాక్సిన్‌ ‌విషయంలో సందేహాలు, అపోహలు..  వాటికి జవాబులు.

కొవిడ్‌ ‌మరణాల గణాంకాలను గమనిస్తే ఇది మహిళల కంటే పురుషుల మీద  ఆరోగ్యపరంగా తీవ్ర దుష్ఫలితాలను కలిగిస్తున్నదన్న రుజువులు, సూచనలు ఉన్నప్పటికీ, మహిళలను కూడా ఆ మహమ్మారి వదిలిపెట్టలేదు. సామాజిక, ఆర్ధికకోణంలో, మానసికంగాను మహిళల మీద ఆ మహమ్మారి పెనుభారం మోపుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, మహమ్మారి నియంత్రణ విధానాల ప్రభావం తల్లుల ఆరోగ్యం మీద పడుతున్న వాస్తవం ప్రపంచ వైద్యరంగాన్ని కలవరపెడుతున్నది.

గర్భధారణ తరువాత ఎదుగుతున్న పిండాన్ని రక్షించుకునే క్రమంలో తల్లి గణనీయమైన శారీరక, రోగ నిరోధక పరిణామాలకు లోనవుతుంది. ఈ మార్పులు గర్భిణులలో, గర్భస్థ శిశువులలో శ్వాసకోశ వైరస్‌ల  ప్రమాదాన్ని పెంచుతాయి. కొవిడ్‌ 19 ‌బారిన పడితే గర్భిణులలో వ్యాధి తీవ్రమై ఐసీయూ అడ్మిషన్‌, ‌వెంటిలేషన్‌ అవసరం వరకు పరిస్థితి విషమించి, మరణానికి గురయ్యే ప్రమాదం కూడా లేకపోలేదని వివిధ దేశాల నుండి వచ్చిన అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.

ముందస్తు ప్రసవం, తక్కువ జనన బరువు, సిజేరియన్‌ (‌సి-సెక్షన్‌) ‌డెలివరీ కూడా ఆ అధ్యయనం ఎక్కువగా నివేదించిన ప్రతికూల ఫలితాలని గమనించాలి. ప్రసూతి సమస్యలు, గర్భస్రావం, రక్తపోటు, పిండం పెరుగుదలలో పరిమితి, కోగ్యులోపతి, పొరల అకాల చీలికతో సహా ఇతర ప్రసూతి సమస్యలు కొవిడ్‌ ‌వల్ల తలెత్తే ప్రమాదం ఉంది.

ప్రసూతి సంరక్షణ

కొవిడ్‌ 19 ‌మహమ్మారి వల్ల ఆసుపత్రులలో ఇతర  ఓపీ (ఔట్‌ ‌పేషెంట్‌) ‌సేవలు నిలిపివేశారు. దీనితో ప్రసూతి, ప్రసవానంతర సంరక్షణ సేవలు గర్భిణులకు    అందుబాటులో లేకుండా పోయాయి. పిండం శ్రేయస్సును ప్రభావితం చేసే యాంటెనాటల్‌ ‌స్కాన్లక• లాక్‌డౌన్‌ ‌కాలంలో చాలామంది తల్లులు దూరంగా ఉండిపోయారు.

కొవిడ్‌ ‌మహమ్మారి ఫలితంగా ‘టెలీ కన్సల్టేషన్‌’ ‌వంటి వినూత్న వైద్య విధానం వెలుగులోకి వచ్చింది. చాలా మంది గర్భిణులు బయటకు వెళ్లలేని కారణంగా ఈ రకమైన సదుపాయాన్ని ఎంచుకోవలసి వచ్చింది. టెలీమెడిసిన్‌ను ఒక వరంగా భావించినప్పటికీ దానితో కొన్ని సమస్యలు లేకపోలేదు. శారీరక పరీక్షలు లేకపోవడం వంటి పరిమితుల కారణంగా వైద్యులు, రోగులు ఈ కొత్త విధానానికి అలవాటుపడడం కష్టం అయింది. కాబట్టి టెలీమెడిసిన్‌ ‌పట్ల అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పద్ధతి మరణాలను తగ్గించడానికి దోహదపడుతుంది.

నవజాత శిశువుకీ వైరస్‌ ‌వ్యాప్తి

 రక్తం, మావి ప్రసరణ ద్వారా; ప్రసవ పక్రియలో తల్లి నుంచి జరిగే స్రావాలు, మలంతో బిడ్డ కలుషితం కావడం వల్ల తల్లి నుండి బిడ్డకు కొవిడ్‌ ‌వైరస్‌ ‌వ్యాప్తి జరగవచ్చు.  కోలుకున్న 3 నెలల వరకు ఈ వైరస్‌ ‌మలం ద్వారా బయటకు వెళుతుంది.  అయినప్పటికీ, ఈ కారణాలు సిజేరియన్‌కు సూచనగా భావించకూడదు. కానీ భయం, ఊహాగానాల ఫలితంగా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి సిజేరియన్‌ ‌రేట్లు బాగా పెరిగాయి.

ప్రసవం అనంతరం కొవిడ్‌ ‌పాజిటివ్‌ అనేది తల్లులు ఎదుర్కొంటున్న ఒక ముఖ్యమైన సమస్య- సహాయకులను అనుమతించక పోవడం, ఆసుపత్రి నుంచి ముందే డిశ్చార్జ్ ‌చేయడం. దీనివల్ల తల్లికి సంతృప్తి తగ్గడం, ప్రతికూల ప్రసవ అనుభవం, పాలివ్వడం, బంధం సరిగా లేకపోవడం, ప్రసవానంతర సమస్యలను గుర్తించడం తగ్గింది. కొత్తగా ప్రసవించిన తల్లి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం; కొవిడ్‌ ‌ప్రోటోకాల్‌ను అమలు చేయడం మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

తల్లి పాలివ్వడం

తల్లి పాల ద్వారా కొవిడ్‌ 19 ‌వ్యాప్తి చెందుతుందని చెప్పడానికి ఈరోజు వరకు  ఎటువంటి ఆధారాలు నమోదు కాలేదు. వాస్తవానికి తల్లిపాలు కొవిడ్‌ 19 ‌వైరస్‌కు వ్యతిరేకంగా రక్షిత యాంటీబాడీస్‌ను అందిస్తుంది, ఇది శిశువు వ్యాధితో బాగా పోరాడటానికి సహాయ పడుతుంది. WHO, UNICEF నిరంతరాయంగా తల్లి పాలివ్వడం, ఒకే గదిలో శిశువుని ఉంచడం, స్కిన్‌ ‌టు స్కిన్‌ ‌కాంటాక్ట్ ఇవ్వడం, సంక్రమణ నియంత్రణను ఉపయోగించి కంగారూ సంరక్షణ వంటి పద్ధతులను సిఫార్సు చేశాయి. 6 అడుగుల దూరం నిబంధన పాటిస్తూ  ఐసోలేషన్‌ ‌వార్డులో తల్లీబిడ్డలను ఉంచవచ్చు. ఒక ఆరోగ్యకరమైన సహాయకులను తప్ప  ఇతర సందర్శకులను లేదా స్నేహితులను అనుమతించ కూడదు.

 పరిశుభ్రతకు సంబంధించి ఇచ్చిన కొన్ని  సిఫార్సులను తల్లి పాటించాలి:

  1. శిశువును తాకడానికీ లేదంటే తల్లి పాలను తీయడానికీ ముందు చేతులు కడుక్కోవాలి. లేదా శానిటైజర్‌ ‌రుద్దుకోవాలి.
  2. పాలు ఇచ్చే సమయంలో లేదా శిశువుతో సన్నిహితంగా ఉండే సమయంలో తల్లి సరిగ్గా సరిపోయే మెడికల్‌ ‌మాస్క్ ‌ధరించాలి.
  3. పాలిచ్చే సమయంలో తల్లి మాట్లాడటం లేదా దగ్గడం చేయకూడదు.
  4. మాస్కులు తడిగా మారినప్పుడు, ప్రతి ఫీడ్‌ ‌ముందు మార్చాలి.
  5. బహిర్గతమైన రొమ్ము లేదా ఛాతీపై తల్లి దగ్గుతుంటే, ఆమె రొమ్మును సబ్బు పెట్టి నీటితో కడగాలి.
  6. మాస్క్ ‌ముందు భాగంలో తాకకూడదు.వెనుక నుండి విప్పాలి.

కన్నతల్లి ప్రత్యక్షంగా పాలను ఇవ్వలేకపోతే, పిండిన మరొక తల్లి పాలను ఆరోగ్యకరమైన సహాయకుల ద్వారా శిశువుకు అందించవచ్చు. ఒకవేళ తల్లి ఆక్సిజన్‌, ‌బైపాప్‌ ‌లేదా వెంటిలేటర్‌పై ఉంటే, దాత తల్లి పాలు అందించడం, ఫార్ములా మొదలైన ఎంపికల గురించి కుటుంబ సభ్యులతో చర్చించాలి. తల్లులకు ఐసోలేషన్‌ ‌వ్యవధి 14 రోజులు ఉంటుంది. లక్షణాలు లేకుండా అదనంగా 3 రోజులు, సాధారణంగా 20 రోజులకు మించదు. చాలా ఆరోగ్య సంస్థలు తల్లి, నవజాత శిశువుల విభజనను ఆమోదించరు. వేరు చేయడం తల్లిదండ్రుల బోధనకు అవకాశాలను పరిమితం చేస్తుంది. తల్లి పాలిచ్చే అవకాశాన్ని దెబ్బతీస్తుంది. తల్లి, నవజాత శిశుబంధంపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది.

మానసిక ఆరోగ్యం

గర్భిణుల కంటే, కొత్తగా ప్రసవించిన తల్లులు మానసిక అనారోగ్యానికి గురవుతారు. తల్లి మానసిక ఆరోగ్యాన్ని  మహమ్మారి గణనీయంగా ప్రభావితం చేసింది. ఆందోళన, నిరాశ, వారి శిశువులకు వైరస్‌ ‌సోకుతుందన్న భయం, ప్రసూతి సంరక్షణ వనరుల పరిమిత లభ్యత, సామాజిక మద్దతు లేకపోవడం- ఈ అనుభవాలు కొవిడ్‌ ‌లేని గర్భిణి, పచ్చి బాలింతల మీద  ఒత్తిడిని సృష్టించాయి.

గర్భిణులు, పాలిచ్చే మహిళలపై ఈ మహమ్మారి ప్రతికూలతలు, వీటి ప్రభావం గురించి మాట్లాడిన తరువాత, సానుకూల ఫలితాలను మెరుగు పరచడానికి, తల్లులపై శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించే వ్యూహాలపై మనం దృష్టి పెట్టాలి.

కొవిడ్‌ ‌నిర్ధారణ భయం, ఆందోళనలకు కారణమవుతుంది. అప్పుడు మానసిక సామాజిక మద్దతు వారికి అవసరం. వారికి అవసరమైన సమాచారం అందించడమనేది ప్రత్యక్షంగా, పారదర్శకంగా, స్థిరంగా ఉండాలి. భరోసా కలిగించే సానుకూల స్వరం తప్పనిసరి.

గర్భిణులు, వారి నవజాత శిశువులు, ప్రసవానికి ముందు తరువాత, అధిక ఆరోగ్య సంరక్షణకు హక్కుదారులు. మానసిక ఆరోగ్య సంరక్షణ సహా, మనం సురక్షితమైన, సానుకూల ప్రసవ అనుభవం కలిగించాలి.

వీటిలో భాగంగా

  1. గౌరవంగా వ్యవహరించడం
  2. ప్రసవ సమయంలో సహచరుడిని అనుమతించడం
  3. ప్రసూతి సిబ్బంది ద్వారా స్పష్టమైన సమాచారం
  4. తగిన నొప్పి నివారణ వ్యూహాలు
  5. ప్రసవ సమయంలో తగినంత కదలికలను అనుమతించటం

కొవిడ్‌ ‌టీకా

గర్భిణులకూ, బాలింతలకూ టీకాలు వేయడం సర్వ సాధారణం. ఉదా, టిడాప్‌, ఇన్‌ఫ్లుయెంజా. గర్భధారణ సమయంలో లైవ్‌ ‌టీకాలు మాత్రమే వ్యాధికి కారణమవుతాయి. అందుబాటులో ఉన్న కొవిడ్‌ ‌టీకాలు ఏవీ ఈ వర్గానికి చెందినవి కావు. గర్భధారణ ప్రారంభంలో కొవిడ్‌ ‌టీకాలు వేయడం వల్ల పిండంలో వైకల్యాలు లేదా అసాధారణతలు వచ్చే ప్రమాదం ఉందో లేదో ఇంకా స్పష్టంగా నిర్ధారణ కాలేదు. అయినప్పటికీ, గర్భధారణ సమయంలో కొవిడ్‌ ‌టీకా తీసుకోవడం వల్ల వచ్చే ప్రమాదం, ప్రయోజనం గురించి మనం చూసినప్పుడు, ప్రయోజనాలే అధికమన్నది సుస్పష్టం. గర్భధారణకు ప్రణాళికలు వేస్తున్న లేదా గర్భధారణ చికిత్సలు (×, וఖీ మొదలైనవి) తీసుకునే మహిళలు టీకాను సురక్షితంగా పొందవచ్చు. చికిత్సలను ఆపవలసిన అవసరం లేదు. టీకాలు తీసుకునే ముందు కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ‌లేదా గర్భం కోసం పరీక్షించాల్సిన అవసరం లేదు. ఆరోగ్య సంరక్షణ కార్మికులు లేదా ఫ్రంట్‌లైన్‌ ‌యోధులు, ఊబకాయం ఉన్నవారు లేదా డయాబెటిస్‌ ‌వంటి ప్రమాద కారకాలు ఉన్న గర్భిణులు కొవిడ్‌ ‌టీకాను ప్రాధాన్యం ప్రాతిపదికన పొందాలి. మన దేశంలో ప్రస్తుతం 3 టీకాలు అందుబాటులో ఉన్నాయి- కోవిషీల్డ్, ‌కోవాక్సిన్‌, ‌స్పుత్నిక్‌. ‌వీటిలో ఏదైనా టీకాను లభ్యతను బట్టి తీసుకోవచ్చు. రెండవ మోతాదుకు సిఫార్సు చేసిన అంతరం కోవిషీల్డ్‌కు 12-16 వారాలు, కోవాక్సిన్‌కు 4-6 వారాలు, స్పుత్నిక్‌ ‌కి వరుసగా 21 రోజులు వ్యవధి ఉండాలి.

గతంలో కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ‌వచ్చిన వారు టీకాను 12 వారాల పాటు వాయిదా వేయాలి. రుతుస్రావం ఉన్న మహిళలు టీకా తీసుకోవచ్చు. తల్లి పాలిచ్చే మహిళలు సురక్షితంగా వ్యాక్సిన్‌ ‌తీసుకోవచ్చు.  పాలివ్వడం ఆపడం లేదా నిలిపివేయవలసిన అవసరం లేదు.

వ్యాసకర్త : Neo, Consultant Neonatologist
Fernandez Hospital Foundation

About Author

By editor

Twitter
YOUTUBE