కర్ణుడి చావుకు వేయి కారణాలంటారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి దాకా ఈశాన్య భారతంలో నెలకొని ఉన్న పరిస్థితికి కూడా అన్ని కారణాలు ఉన్నాయనే చెప్పాలి. బ్రిటిష్‌ ఇం‌డియాలో జరిగిన అహేతుక సరిహద్దుల నిర్ణయం, సరిహద్దు దేశం బంగ్లాదేశ్‌ ‌నుంచి అదుపు లేకుండా సాగుతున్న వలసలు, ముస్లిం మతోన్మాదం, క్రైస్తవ మిషనరీల వేర్పాటువాదం వంటి కారణాలు కనిపిస్తాయి. సుదీర్ఘకాలం ఈశాన్య భారత్‌ను పట్టించుకో వలసి నంతగా పట్టించుకోకపోవడం మరొక ముఖ్య కారణం. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని ప్రాంతాలలోను ఇలాంటి పరిస్థితే ఉంది. ఎప్పటికీ ఉంటుంది. సెవెన్‌ ‌సిస్టర్స్‌గా చెప్పే ఈశాన్య భారత రాష్ట్రాలలో ఒకదానితో ఒకదానికి సరిహద్దు తగాదాలు ఉన్నాయి. అలాగే అస్సాంకు, మిజోరం రాష్ట్రానికి కూడా ఉన్నాయి. ఈ సరిహద్దు సమస్య వయసు దాదాపు 150 ఏళ్లు.

కానీ ఈ రెండేళ్ల నుంచి అక్కడ సరిహద్దు సమస్య మాటున హింస చెలరేగుతోంది. నిజానికి ఆ రెండు రాష్ట్రాల ప్రజలకి కూడా సరిహద్దులు, వాటి సమస్యలు, నిబంధనల గురించి ఏమీ తెలియదని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. కాబట్టి కొత్త ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. ఆ ఘర్షణలు నిజంగానే పాత సరిహద్దు సమస్యకు కొనసాగింపేనా? లేకుంటే వాటి చాటున జరుగుతున్న రాజకీయాలా? ఎందుకంటే ఈశాన్యంలో అటు బంగ్లాదేశ్‌ ‌చొరబాటు దారుల సమస్య, ఇటు చైనా కుయుక్తులు జమిలిగా పని చేస్తూ ఉంటాయి. అలాగే ఇలాంటి విధ్వంసకర శక్తుల న్నింటినీ కూర్చి, ఉసిగొల్పడానికి ఉద్దేశించిన టూల్‌కిట్ల వ్యూహం కూడా ఉండవచ్చు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. మిజోరంలో లాల్‌డేంగా వారసత్వంగా వచ్చిన మిజో నేషనల్‌ ‌ఫ్రంట్‌ అధికారంలో ఉంది.

అక్కడి సరిహద్దు సమస్య మీద ఇంతకు ముందు చాలా రగడే జరిగినప్పటికీ ఇకపై శాంతిని నెలకొల్పు తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ, మిజోరం ముఖ్యమంత్రి జోరాంతంగ ఈ ఆగస్ట్ 5‌న కేంద్రానికి హామీ ఇచ్చారు. నిజానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం సమస్య శాశ్వత పరిష్కారానికి 2020 నుంచి ప్రయత్నాలు ప్రారంభించింది కూడా. ప్రస్తుతానికైనా వేడి చల్లారుతోందని అనుకుంటున్న సమయంలో అక్కడి సరిహద్దులలో మళ్లీ ఆగస్ట్ 7‌న హఠాత్తుగా ఎందుకు విధ్వంసం జరిగింది? అక్కడ శాంతి నెలకొనడం, తద్వారా సమస్యకు పరిష్కారం లభించడం ఇష్టం లేని శక్తులు పని చేస్తున్నాయా? అస్సాంలోని కరీంగంజ్‌ ‌నుంచి గుడ్లతో వెళుతున్న నాలుగు ట్రక్కులు ఆరోజు కచార్‌ ‌జిల్లాలోని భాగాబజార్‌కు రాగానే కొందరు ఆపి, మిజోరం వెళుతున్న సంగతి తెలుసుకుని లోపల ఉన్న గుడ్లన్నీ విసిరివేశారు. నిజానికి తాజా ఘర్షణకు ఆరంభం జూన్‌ 26‌న జరిగింది. ఆ రోజు అస్సాం-మిజోరం సరిహద్దు వివాదంలో ఆరుగురు పోలీసులు చనిపోయారనీ, యాభయ్‌ ‌మంది వరకు గాయపడ్డారనీ వార్తలు వచ్చాయి. ఇదే దేశవ్యాప్తంగా కలవరం కలిగించింది.

 అస్సాం-మిజోరంల మధ్య 165 కిలోమీటర్ల పొడవున సరిహద్దు ప్రాంతం ఉంది. కచార్‌, ‌హైలాకండి, కరీంగంజ్‌ (అస్సాం జిల్లాలు), కోలాసిబ్‌, ‌మామిత్‌, ఐజ్వాల్‌ (‌మిజోరం జిల్లాలు) సరిహద్దులను పంచుకుంటున్నాయి. సరిహద్దు వివాదం 150 ఏళ్ల నాటిది. మిజోరం అస్సాంలో లూషై హిల్స్ ‌పేరుతో ఒక జిల్లాగా ఉన్నప్పుడు సరిహద్దు నిర్ణయం దగ్గర మొదలయిన సమస్య. ఆ సరిహద్దును రెండుసార్లు నిర్ణయించడమే ఈ రగడకు అసలు కారణం. 1875లో 1933లో రెండుసార్లు సరిహద్దులు నిర్ణయించారు. రెండోసారి ఏర్పరిచిన సరిహద్దు ఇప్పటి రగడకు మూలం. 1875 నాటి సరిహద్దు నిర్ణయానికి 1873లో తీసుకువచ్చిన బంగ్లా ఈస్ట్రన్‌ ‌ఫ్రాంటియర్‌ ‌రెగ్యులేషన్‌ ‌చట్టం మేరకు చేసినది. ఈ చట్టం లూషై హిల్స్ (‌నేటి మిజోరం)ను కచార్‌ (అస్సాం) జిల్లా మైదాన ప్రాంతం నుంచి వేరు చేసి చూపుతున్నది. 1933లో మళ్లీ సరిహద్దులు నిర్ణయించారు. ఇది లూషై హిల్స్‌ను మణిపూర్‌ ‌నుంచి వేరు చేసి చూపుతున్నది. ఈ నిర్ణయం మిజో చీఫ్‌లకు తెలియ కుండా జరిగిందని మిజోవాసుల ఆరోపణ. కాబట్టి ఆమోదయోగ్యం కాదని చెబుతున్నారు. మళ్లీ 1875 నాటి ప్రకటన బట్టి సరిహద్దు నిర్ణయం జరగాలన్నది వారి వాదన. 1972లో మిజోరం కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటి నుంచి, 1980లో రాష్ట్రంగా అవతరించిన తరువాత కూడా ఈ వివాదం ఉంది. అస్సాం తన సరిహద్దులను మిజోరం కబ్జా చేసిందన్న అభిప్రాయంతో ఉంది. అలాగే అస్సాం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మిజో చెబుతున్నది.

గడచిన అక్టోబర్‌లో కూడా రెండు రాష్ట్రాల ప్రజలు రెండు పర్యాయాలు ఘర్షణలకు దిగారు. అప్పుడు కనీసం ఎనిమిదిమంది గాయపడగా, కొన్ని గుడిసెలు, దుకాణాలు దగ్ధమయ్యాయి. నిజానికి అస్సాంకు, చుట్టూ ఉన్న రాష్ట్రాలకు సరిహద్దు వివాదాలు ఇప్పటివి కావు. అస్సాంలోని కచార్‌ ‌జిల్లా లైలాపూర్‌ ‌వాసులు, మిజోరంలోని కొలాసిబ్‌ ‌జిల్లా వైరెంగ్టె ప్రాంతానికి చెందిన వారితో గొడవ పడ్డారు. అక్టోబర్‌ 9‌న ఇలాంటి ఘర్షణే రెండు రాష్ట్రాల సరిహద్దులు కరీంగంజ్‌ (అస్సాం), మామిత్‌ (‌మిజోరం) దగ్గర కూడా జరిగింది. ఇద్దరు మిజోరం రాష్ట్ర వాసులకు చెందిన పోకచెక్కల తోటను దుండగులు తగులబెట్టారు. అదేరోజున లైలాపూర్‌ ‌వాసులు కొందరు మిజోరం పోలీసుల మీద రాళ్లు రువ్వారు. మిజోరం వాసులు కూడా తరువాత రాళ్లు రువ్వారు. కొన్నేళ్ల క్రితం రెండు రాష్ట్రాలకు జరిగిన ఒప్పందం ప్రకారం సరిహద్దులో నిర్దేశించిన ఎవరూ ప్రవేశించకూడదని స్థలాన్ని యథాతథంగా ఉంచాలి. అంటే ఎవరూ హద్దులు దాటరాదు. అయితే లైలాపూర్‌ ‌ప్రజలే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు ఉన్నాయి. లైలాపూర్‌ ‌వాసులు సరిహద్దులు దాటివచ్చి కొన్ని గుడిసెలు నిర్మించగా వాటిని మిజోరం వైపు ప్రజలు వచ్చి తగులబెట్టారు.

ప్రస్తుతం మిజోరం పట్టు నిలుపుకోవాలను కుంటున్న ప్రాంతం అస్సాంకే చెందుతుందని కచార్‌ ‌పోలీసు డిప్యూటీ కమిషనర్‌ ‌చెబుతున్నారు. తమ రాష్ట్రాలకే చెందుతుందంటూ ప్రస్తుతం అస్సాం వాదిస్తున్నప్పటికీ అక్కడ చిరకాలంగా మిజోరం వాసులే సేద్యం చేస్తున్నారని ఈ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. చిరకాలంగా మిజోవాసులు ఆ భూమిలో సేద్యం చేసుకుంటున్న మాట నిజమే అయినా, రికార్డుల ప్రకారం అది సింగ్లా అటవీ ప్రాంతంలోకి వస్తుంది. ఆ అటవీ ప్రాంతం అస్సాంలోనిదే. మిజోరం, అస్సాం రెండూ బంగ్లాతో సరిహద్దులు కలిగి ఉన్నాయి. ఇక్కడ గమనించవలసిన అంశం- స్థానిక అస్సామీయులు ఈ దుందుడుకు చర్యలకు కారణమని మిజోరం ప్రజలు, ప్రజా సంస్థలు చెప్పడం లేదు. ఇది బంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమంగా చొరబడి అస్సాంలో తిష్ట వేసినవారి పనేనని వారంతా చెబుతున్నారు. తాజా అల్లర్లకు ప్రధాన కారణం అస్సాం ప్రాంతంలోని లైలాపూర్‌లో తిష్టవేసిన బంగ్లా అక్రమ చోరబాటుదారులేనని రాళ్లు విసిరినది కూడా వాళ్లేనని మిజోరం ప్రజా పౌర సమాజాలు ఆరోపిస్తున్నాయి. మిజోరం రిజర్వు బెటాలియన్‌ ‌లక్ష్యంగా ఆ రాళ్ల దాడి జరిగింది. అస్సాంలోని బరాక్‌ ‌లోయ బంగ్లాకు సరిహద్దు.

నిజానికి ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు గొడవలు ఉన్నాయి. కానీ అస్సాం-మిజోరం మధ్య ఘర్షణలు చెలరేగిన సందర్భాలు అరుదు. అందుకే ఆగస్ట్ ఆరంభం నాటి ఆ హింసాత్మక ఘటన దేశాన్ని కలవర పరిచింది.

1980లో రాష్ట్రంగా అవతరించిన నాటి నుంచి సరిహద్దు తగాదా ఉంది. అస్సాం 1933 నాటి సరిహద్దు నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటుంది. 1994, 2006, 2018లలో కూడా గొడవలు జరిగాయి. 1994లో వైరెంగ్ట్టె వద్ద రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఘర్షణ పడ్డారు. ఇది విస్తుగొలిపే విషయమే. అప్పుడు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కలగచేసుకోవడంతో సద్దుమణిగింది. 2018లో మిజో విద్యార్థుల విశ్రాంతి మందిర నిర్మాణ గొడవ జరిగింది. గడచిన అక్టోబర్‌ 9‌న చిన్నపాటి ఘర్షణలతో మొదలైన సరిహద్దు ప్రాంతం 17 నాటికి తీవ్ర రూపం దాల్చింది. 20 దుకాణాలు తగుల బెట్టారు. ఘర్షణలలో 50మంది గాయపడ్డారు. నిజానికి ఈ సరిహద్దుల నిర్ణయం గురించి ఈ రెండు రాష్ట్రాల సాధారణ ప్రజలకు తెలియదు. అందుకే ఇష్టానుసారం సరిహద్దులలో వ్యవహరిస్తూ ఉంటారు. ఇదే విద్రోహక శక్తుల జోక్యానికి దోహదం చేసే అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అస్సాం మీద మండిపడుతున్న మిజోరం ప్రజలు కూడా ఆ రాష్ట్రం మీద నింద వేయడానికి సిద్ధంగా లేరు. ఇది శుభ పరిణామమే.

ఈ వివాద పరిష్కారానికి 1971లో ఒక కమి షన్‌ను నియమించారు. 1985లో శాస్త్రి కమిషన్‌ను నియమించారు. ఈ సంఘాలు రెండు విఫల మయ్యాయి. అస్సాం సుప్రీంకోర్టును ఆశ్రయించింది కూడా. 1987లో మిజోరం పూర్తి స్థాయి రాష్ట్ర హోదా పొందింది. 1986లో మిజో నేషనల్‌ ‌ఫ్రంట్‌తో కుదిరిన ఒప్పందంతో సాయుధ తిరుగు బాటును ఆపేశారు. ఇది ఎంతో స్వాగతించ దగిన పరిణామమే అయినా, ఆ ఉగ్రవాద సమస్యకు పరిష్కారం లభించింది కానీ, అది సరిహద్దు సమస్యకు జవాబు చెప్పలేకపోవడం ఎందుకో అర్ధం కాదు. నిజానికి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి నిరుడు అక్టోబర్‌ ‌మధ్యలోనే ప్రయత్నాలు ఆరంభించింది. అంటే రగడ తీవ్ర దాల్చుతున్న సమయంలోనే ప్రయత్నం మొదలుపెట్టారు. రెండు రాష్ట్రాలతోను కేంద్రం ఉన్నత స్థాయి చర్చలు ఆరంభించింది. అప్పటికి మూడు వారాలుగా సాగుతున్న ఘర్షణల వల్ల అస్సాం వాస్తవంగా దిగ్బంధనంలో ఉండి పోయింది. నిరుడు నవంబర్‌ 8‌న రెండురాష్ట్రాల కార్యదర్శులు, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో సమావేశమై రాష్ట్ర పోలీసులను ఉపసంహరించి సరిహద్దు భద్రతాదళా లను నియమించడానికి ఒప్పుకున్నారు. మిజోరం రాష్ట్రానికి జీవనాడి వంటి 306 జాతీయ రహదారి మీద అస్సాం అమలు చేసిన ఆర్థిక దిగ్బంధనం నిలిపివేయడానికి అస్సాం అంగీకరించింది.

హిమంత బిశ్వశర్మ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనకు చొరబాటుదారుల మీద, ఆ విధానం మీద స్పష్టమైన విధానం, ఆలోచన ఉన్నాయి. ఇటీవల ఆయన ఇద్దరు పిల్లల సూత్రాన్ని అమలు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇది కొందరికి ఏమాత్రం నచ్చడం లేదు. అస్సాం సమస్యతో మరొకసారి మోదీనీ, బీజేపీనీ ఇరుకున పెట్టాలన్న ఆలోచన కూడా దీని వెనుక ఉందని చెప్పినా కొట్టి పారేయడానికి అవకాశాలు తక్కువ. ఒకనాటి మిజో నేషనల్‌ ‌ఫ్రంట్‌కు ఇప్పుడు అధ్యక్షుడుగా ఉన్న జోరాంతంగ ముఖ్యమంత్రి. మొత్తం 40 స్థానాలకు గాను 26 గెలుచుకున్నాడు (2018). 1987లో కేంద్రంతో జరిగిన శాంతి చర్చలలో ఇతడు కీలకంగా ఉన్నాడు. ఎంఎన్‌ఎఫ్‌ ‌కార్యదర్శిగా పని చేశాడు. మార్చి 1,1966లో మిజోరం ప్రాంతానికి స్వాతంత్య్రం ప్రకటించిన లాల్‌ ‌డేంగా వారసుడు జోరాంతంగ.

 తాజా ఉదంతంలో వినిపిస్తున్న కొన్ని మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో ఒకటి సరిహద్దుల నుంచి రాష్ట్రాలు బలగాలు ఉపసంహ రించుకుంటున్నాయి అన్నమాట. ఈశాన్య భారత రాష్ట్రాలు సరిహద్దుల విషయంలో ఒకదానితో ఒకటి అంత వైరం పెంచుకున్నాయా? దేశ సరిహద్దుల విషయంలో వినవలసిన మాట కదా అది! ఏమైనా సరిహద్దు రాష్ట్రాల మధ్య ఇలాంటి సమస్య తలెత్తడమే అవాంఛనీయమైతే, అది ఏడున్నర దశాబ్దాలు కొన సాగడం మరింత అవాంఛనీయం. చైనాతో వివాదం ఏ క్షణంలో ఏ మలుపు తిరుగుతుందో తెలియని ప్రస్తుత పరిస్థితిలో ఇలాంటి సరిహద్దు వివాదాలు ఈశాన్య భారతంలో నెలకొని ఉండడం దేశ క్షేమానికీ, ఫెడరల్‌ ‌వ్యవస్థకీ ఏమాత్రం మంచిది కాదు.

ఇటు అస్సాం, మిజోరం సమస్య నలుగుతున్న సమయంలోనే , అటు మిజోరం, త్రిపుర మధ్య కూడా సరిహద్దు తగాదా రాజుకోవడం ఆరంభమైంది. ఆ రెండు రాష్ట్రాలకు ఫల్‌డంగేసి అనే గ్రామం గురించి వివాదం ఉంది. ఈ సమస్యను కేంద్ర హోంశాఖ సాయంతో మిజోరం వెంటనే పరిష్కరించుకోవాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేబ్‌ ‌హెచ్చరించారు. అస్సాం, మిజోరం ముఖ్యమంత్రులు శాంతి పునరుద్ధ రణకు కేంద్రానికి హామీ ఇచ్చిన రోజునే, అంటే ఆగస్ట్ 5‌వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌ ‌కుమార్‌దేబ• మీద హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు దేశంలో, అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను బట్టి వీటన్నిటిని వేర్వేరుగా చూడడం సాధ్యం కాదనే చెప్పాలి.

About Author

By editor

Twitter
YOUTUBE