(ఈ ఆగస్ట్ 7 నుంచి 10వ తేదీ వరకు జరుగబోయే 25వ సింధు దర్శన్ యాత్రను ‘ప్రథమ సింధు మహాకుంభ్’ పేరిట నిర్వహించనున్నారు. ఆ సందర్భంగా ప్రచురిస్తున్న ప్రత్యేక వ్యాసం)
మానవీయ సంస్కారాల, ఆచారాల వికాసం నదులతీరాల్లోనే జరిగింది. ఇందుకు చరిత్రే సాక్షి. నదీమతల్లుల వల్లే భారతీయ సంస్కృతి పరిఢవిల్లింది. మనదేశంలో ఎన్నో నదులు ప్రవహిస్తున్నాయి. మన ప్రాచీన నదులలో అతి ప్రాచీనమైనది సింధు నది. ప్రపంచంలోని అతి ప్రాచీన సంస్కృతి కలిగిన దేశంగా భారతావనికి ఖ్యాతి దక్కేలా చేసింది కూడా సింధు నదే.
సమస్త విశ్వానికి సామాజిక వ్యవస్థ అంతరార్థాన్ని విడమరచి చెప్పిన హరప్పా-మొహెంజదారో సంస్కృతి వికసించినది సింధు తీరంలోనే. సింధు లోయ ప్రజల వికాసం ఎలా జరిగిందో, వారు ఎలాంటి ఆవిష్కరణలు చేశారో, వాస్తు, శిల్ప కళారంగాలలో ఎలాంటి అద్భుతాలు సృష్టించారో చూసి నేటితరం సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నది.
క్రమేణా సంస్కృతి, ఆచార వ్యవహారాలు వికసించాయి. జనసంఖ్య పెరిగింది. యుగ పరివర్తనం సాధ్యమైంది. ఇదే క్రమంలో భారత్ బలమైన, శక్తిమంతమైన దేశంగా రూపాంతరిస్తూ వచ్చింది. భారత్‌ను బంగారు పిచ్చుక అని పిలవటం మొదలెట్టారు. దురాక్రమణదారుల చూపు పడింది. వింతేమిటంటే ఆరంభంలో వచ్చిన దురాక్రమణ దారులంతా సింధునదిని దాటి వచ్చినవారే. వీళ్లని అడ్డుకునేందుకు సింధునది మహత్వపూర్ణ పాత్రని పోషించింది. కానీ భారత్ నుదుటిపై విధి ‘పరాధీనత’ అనే పదాన్ని లిఖించింది. భారత్‌కు స్వాతంత్య్రం లభించినప్పుడు జరిగిన విభజనలో భౌగోళికంగా దేశమే కాదు, సింధు నది కూడా కొంత మేరకే దక్కింది. భారత్‌లోని లద్దాఖ్ నుండి వెలువడి పాకిస్తాన్ గుండా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్న సింధు కొన్ని కిలోమీటర్ల వరకే భారత్‌కు పరిమితమయింది. ఈ కారణంగానే భారత ప్రజలు ఆ నదిని మరచిపోతున్నారు. అందుకే స్వాతంత్య్ర ప్రాప్తి తర్వాత ప్రజలకు భారతీయ సంస్కృతిని గుర్తు చేసేందుకు పలు ప్రయత్నాలు జరిగాయి. గత పాతికేళ్ల నుంచి సాగుతున్న ‘సింధు దర్శన్ యాత్ర’ అందులో భాగమే.
భారత్‌కు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను అందిస్తున్న నది పట్ల మన భక్తిని వ్యక్తం చేసే ఉద్దేశంతో 1997లో ‘సింధు దర్శన్ యాత్ర’కు శ్రీకారం చుట్టారు. ఒక మహోన్నత భావనతో ఆరంభించిన ఈ యాత్రను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దృష్టికోణంతో చూసింది. ఆర్ధిక సహాయాన్ని నిలిపివేసింది. 2004లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలో కేందప్రభుత్వం ఏర్పాటయ్యాక సింధు దర్శన్ యాత్రకు మళ్లీ సంజీవని దొరికింది. అదే సమయంలో నిర్వాహకులు ఇక ముందు కేవలం ప్రభుత్వ ఆర్ధిక సహాయంపై కాకుండా జన యాత్రలా ఉత్సవాన్ని మలచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం సఫలమయింది. ప్రస్తుతం ప్రజలు తమ సొంత ఖర్చుతో సింధు దర్శన్ యాత్ర చేస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్ర కేవలం సింధు దర్శన్ యాత్రకు మాత్రమే పరిమితం కాకుండా అయిదు రోజుల సింధుదర్శన మహోత్సవంగా రూపాంతరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పాల్గొంటున్నారు. కేవలం సాంస్కృతిక పరంగానే కాకుండా ఏకాత్మతా భావనను కూడా పెంపొందిస్తున్నది. ఇంతే కాదు, లద్దాఖ్ సాగు వృద్ధికి ఈ యాత్ర చేయూత నిస్తున్నది.
నిజానికి 1983-84లోనే సింధు దర్శన్ యాత్రకు బీజాలు పడ్డాయి. అదే సమయంలో జ్యేష్ఠ ప్రచారక్ ఇంద్రేశ్ కుమార్‌జీని జమ్ముకశ్మీర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా నియమించారు. 1984లో లేహ్ యాత్ర సందర్భంగా సింధునదీ దర్శనం చేసుకున్న ఇంద్రేశ్‌జీ భావుకతకు లోనయి, జీవితం ధన్యమైనట్టు పులకించిపోయారు. కానీ, ఆయన ముందు ఎన్నెన్నో ప్రశ్నలు. భారతీయులంతా మూలాలను ఎందువల్ల మరచిపోయారు? మన మూలాలను మనం ఎలా నిర్లక్ష్యం చేయగలం? ఇలాంటి ప్రశ్నలు మనసును కల్లోలం చేశాయి. మనముందు ఎలాంటి విషమ పరిస్థితులున్నాయంటే ఒకవైపు రాబోవు తరాల వారికి మన మూలాల్ని, సింధు నాగరికత, సంస్కారాల గూర్చి గర్వంగా చె•బుతున్నాం. మరోవైపు చూస్తే ఇక్కడి ప్రాంతం, ప్రజలు పూర్తి నిర్లక్ష్యానికి గురవుతున్నారన్నది నిజం. కొన్ని మాసాలు గడిచాక ఇంద్రేశ్‌జీకి మరో విషయం స్పష్టమయింది. ఒకప్పుడు వైదిక మూలాల వల్ల గుర్తింపు పొందిన ఈ ప్రాంతం మెలమెల్లగా బౌద్ధం వైపు, ఆ తర్వాత ఇస్లాం వైపు మొగ్గు చూపింది. కనుక మనం మన సంస్కృతినీ, జాతీయభావననీ, సోదరభావాన్నీ, మైత్రీభావాప్నీ మరింత విస్తృతం చేసి భారతీయత మన జీవనాడి అంటూ భారతీయ సంస్కృతి వైపు చూసే యత్నం చేయాలన్న సంకల్పం ఇంద్రేశ్‌జీలో అంకురించింది. 1989లో ఆర్‌ఎస్‌ఎస్ సంస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్జీ శతజయంతి సందర్భంగా ఆయన తన ఆలోచనలకు కార్యరూపాన్నిచ్చారు. ఆ సందర్బంగా సింధునదీ జలం సహా దేశంలో అన్ని నదుల జలాలను నాగ్‌పూర్‌కు తెచ్చారు. ఈ క్రమంలోనే సింధునది పవిత్రతని, గొప్పతనాన్ని పునరుద్ధరించే విషయమై చర్చ జరిగింది.
లాల్‌కృష్ణ అడ్వాణీ 1996లో ఎన్నికల ప్రచారంలో భాగంగా లేహ్‌కు వచ్చారు. లేహ్ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి స్పెల్జేష్ అంగమో ఆయనను కలిశారు. తరుణ్ విజయ్‌తో కలిసి అడ్వాణీ సింధు నదీ తీరాన ఉన్న విద్యుత్ శాఖ రెస్ట్ హౌస్ చొంగల్మసర్‌లో ఉన్నారు. లేహ్ కార్యకర్తలు అడ్వాణీకి ‘సింధ్ ఖ్వాబ్’ (సింధు జన్మస్థలం) గురించి చెప్పారు. వెంటనే తరుణ్ విజయ్, తాషి సైమ్పల్, తాంగే థారిక్, సెరిగ్ తాషిలతో కలిసి ఆయన సింధు తీరానికి వెళ్లారు. ఆ జలంతో ఆచమనం చేసి తాదాత్మ్యతతో కూడిన అనుభూతికి లోనయ్యారు. ‘నా జీవితంలో ఇవి అత్యంత దివ్యమైన క్షణాలు.. మా అమ్మ నాపై ఆశీర్వాదాలు కురిపిస్తోందన్నట్టుగా పులకరించిపోతున్నాను’ అనే మాటలు అడ్వాణీ నోటి వెంట భావుకతతో వెలువడ్డాయి. తరువాత ఇంద్రేశ్‌జీ, తరుణ్ విజయ్‌తో కలిసి ఢిల్లీలో కేంద్ర హోమ్‌మంత్రి అడ్వాణీతో భేటీ అయ్యారు. ‘సింధు దర్శన్ యాత్ర’ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆయన అంగీకారం తెలిపారు. ఈ యాత్రలో బౌద్ధులను భాగస్వాములుగా చేస్తూ కార్యక్రమ రూపకల్పన జరిగింది. అయితే దీనిని కొందరు అపార్ధం చేసుకున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు బౌద్ధులను మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారేమో నన్న సందేహం కలిగింది. అయితే ఆ సందేహాలు నివృత్తి అయినాయి. మొదట్లో ఈ తీర్థయాత్ర పేరు ‘సింధు దర్శన్ అభియాన్’. తర్వాత ‘సింధు స్నాన్ పర్వ’ అని మారింది.
ఇప్పటివరకు ఉన్న పేరుతో స్పష్టమవుతున్నదేమిటంటే వైదిక సంస్కృతితో పల్లవితమౌతున్న పవిత్ర నది సింధు. ఈ నదే మన దేశానికి పేరు ఇచ్చింది. మనకు, మన సంస్కృతికి గుర్తింపునిచ్చింది. 1997లో జరిగిన తొలి యాత్రలో 65 మంది, 1997లో జరిగిన మలి యాత్రలో 500 మంది భక్తులు పాల్గొన్నారు. మెల్లగా యాత్రికుల సంఖ్య వేలకు చేరింది. దేశంలో దాదాపుగా 12 రాష్ట్రాలకు చెందిన ప్రజలు సింధు దర్శన్ యాత్రలో పాల్గొంటున్నారు. 2000 సంవత్సరంలో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి సింధు దర్శన్ యాత్ర కోసం, లేహ్-లద్దాఖ్ అభివృద్ధి కోసం కొత్త మార్గాలు తెరిచారు. 2004లో ప్రభుత్వం మారటంతో ఈ యాత్రపై మళ్లీ రాజకీయ మబ్బులు ముసురుకున్నాయి. కానీ అవి త్వరలోనే వీడిపోయాయి కూడా.
‘సమన్వయం సమరసతల సమ్మేళనం’
(కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని సింధు మహా కుంభ్‌లో నిర్వాహకులు కొన్ని ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ మార్గ నిర్దేశకులు, సింధు దర్శన్ యాత్ర వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు మాననీయ ఇంద్రేశ్ కుమార్ ఈ విషయాలను ‘హిందీ వివేక్’ పత్రికకు చెప్పారు. పల్లవి అన్వేకర్ చేసిన ఆ ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు)
సింధు దర్శన్‌యాత్ర ఎలా ప్రారంభమయింది?
లద్దాఖ్‌లో ఒకప్పుడు శైవాన్ని సనాతన మతంగా పరిగణించేవారు. తరవాత బౌద్ధ మతం వచ్చింది. తరవాత మెల్లగా ఇస్లాం కూడా వచ్చింది. దీనితో మత కల్లోలాలు జరిగేవి. వాటిని ఆపడానికి 1994-95లో సింధు నది కేంద్రంగా ఒక యాత్ర ప్రారంభించాలనే ఆలోచన మొదలయింది. లద్దాఖ్‌ను జాతీయ జీవన స్రవంతిలోకి తెచ్చి అభివృద్ధి చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 1997లో ‘సింధు ఉత్సవ్’ ప్రారంభించాం. అప్పుడే అదృష్టవశాత్తు కేంద్రంలో ప్రభుత్వం మారి, అటల్ బిహారి వాజపేయి ప్రధానమంత్రి అయ్యారు. లాల్‌కృష్ణ అడ్వాణీ కేంద్ర హోమ్‌మంత్రి. అడ్వాణీ సింధీ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే సింధునది అంటే ప్రేమ. ఆ నదిని కేంద్రీకృతం చేసి ఒక కార్యక్రమం చేపట్టాలని, అందులో జాతి యావత్తుని భాగస్వామిగా చేసి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాలనే కోరిక ఆయనలో ఉండేది. ఈ క్రమంలోనే తరుణ్ విజయ్‌జీ సహా మరికొందరు సంఘ అధికారులు కలిసి అడ్వాణీతో భేటీ అయ్యాం. యాత్ర ఆలోచన ఆయన ముందు పెట్టాం. ఆయన మా ప్రస్తావనకు ఆమోదముద్ర వేస్తూ, తానూ ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.
1997 నుంచి మొదలయిన యాత్ర రెండున్నర దశాబ్దాల కాలాన్ని పూర్తి చేసుకుంది. నాటి నుండి నేటి దాకా వచ్చిన పరిణామాలు ఏమిటి?
యాత్ర మొదలెట్టడానికి ముందే అక్కడ రాజకీయులున్నారు. కాంగ్రెస్ వాళ్లున్నారు, మతోన్మాదులున్నారు. బౌద్ధులను హిందువులుగా మార్చే ఉద్దేశంతో యాత్ర మొదలు పెడుతున్నారని దుష్ప్రచారం చేస్తూ బురద చల్లడం మొదలెట్టారు. అక్కడ బౌద్ధ సమాజంలో కల్లోలం మొదలయింది. బౌద్ధుల్ని హిందువులుగా మార్చేందుకు సింధు దర్శన్ యాత్ర చేపట్టారని కాంగ్రెస్ వాళ్లు తప్పుడు ప్రచారం మొదలెట్టారు. యాత్ర పేరిట బౌద్ధులను హిందువులుగా మార్చే పక్రియని అడ్డుకుంటామని వారు ఒక తీర్మానం చేసి బౌద్ధ సమాజంలో మరింత అలజడి రేపారు. దుష్ప్రచారంతో వచ్చిన అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసేందుకు పలు దఫాలుగా సమావేశాలను ఏర్పాటుచేయాల్సి వచ్చింది. దీంతో సౌహార్ద్రపూరిత వాతావరణం ఏర్పడింది. యాత్ర కారణంగా ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, మతాల నడుమ సమన్వయం ఏర్పడుతుందని, సమాజంలో శాంతి, సహనం-సోదరభావం పెంపొందుతుందనే విషయాలు అక్కడి ప్రజలకు స్పష్టం కావడంతో అన్ని విధాలయిన మద్దతు రావడం మొదలయింది. ఇదే సమయంలో సింధు నదీతీరంలో ఉత్సవం ఎక్కడ నిర్వహించాలన్న ప్రశ్న వచ్చింది. అందుకు శేయ్ గ్రామం బాగుంటుం దని భావించారు. గ్రామస్థుల సంపూర్ణ సహకారం లభించింది. 1997లో అడ్వాణీ నాయకత్వంలో ఈ యాత్ర ఒక రూపాన్ని సంతరించుకుంది. యాత్ర కొనసాగుతున్న సమయంలోనే అకస్మాత్తుగా రాజకీయ పరమైన దాడి జరిగింది.
2004లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. కానీ పెత్తనం సోనియా గాంధీ చేతిలో ఉండేది. యాత్రని ఆమె రాజకీయ దృష్టితో చూశారు. రాజకీయ ద్వేషంతో ‘సింధు ఉత్సవ్’ పేరుని మార్చి, ‘సింఘే కె ఖబబ్’ అని పెట్టారు. సింధు నది మూలాన్ని స్థానికులు ‘సింఘే కె ఖబబ్’ అని పిలుస్తారు. ఆ లోకల్ పేరుని ఉత్సవానికి పెట్టారు సోనియా. ప్రభుత్వ సహాయసహకారాలన్నిటినీ నిలిపేశారు. స్పష్టంగా చెప్పాలంటే రద్దు చేసింది. విశాల ప్రాతిపదిక కలిగిన ఆ యాత్రను స్థానిక జాతరగా మార్చేసింది. బౌద్ధులు మాతో ఉన్నప్పటికీ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు ద్వేషభావంతో వ్యవహ రించాయి. అందుకే ప్రభుత్వ సహాయసహకారాలు తీసికోకుండానే యాత్ర కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. తొలి యాత్ర 60-70 మంది యాత్రికులతోనే మొదలయింది. 2005లో కూడా సొంత ఖర్చు పైనే 60-70 మంది యాత్రికులు యాత్ర చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య వేలకు చేరింది.
2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఎలాటి మార్పులు చోటు చేసుకున్నాయి?
కేంద్రంలో ప్రభుత్వం మారింది. రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు మారాయి. అందుకే సింధు దర్శన్ యాత్రలో ఉత్సాహం ఉరకలేసింది. పెద్దసంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. అయినా, మేము మునుపే తీసుకున్న నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని అనుకున్నాం. కేంద్ర ప్రభుత్వం యాత్రకు సహాయ సహకారాలు అందించదలచుకుంటే అందించనీ. కానీ మేము ఈ యాత్రని సంపూర్ణంగా ప్రజలపై, యాత్రీకులపై ఆధారపడే నిర్వహించదలచుకున్నాం. యాత్రికులు యాత్ర ఖర్చు వారే భరించాలి. ఈ విషయంలో మేము సంపూర్ణంగా సఫలీకృతు లయ్యాం. ఆ కారణంగా 2014లో సింధు దర్శన్ యాత్ర మహోత్సవంగా రూపాంతరించింది. లేహ్, కార్గిల్ లద్దాఖ్‌లో ఉన్న రెండు జిల్లాలు. విదేశీ పర్యాటకుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. భారతీయ పర్యాటకుల సంఖ్య 15 నుంచి 30 రెట్ల దాకా పెరిగింది. లద్దాఖ్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వస్తోంది. గ్రామీణ ప్రజలకు బాసట దొరికింది. స్థానిక వస్తువుల అమ్మకాలు పెరిగాయి. ఎక్కువ కృషి చేస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీ పెరిగింది. ఔషధాల, స్థానిక ఫలాల అమ్మకాలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం ఉత్సవం పట్ల సకారాత్మకంగా వ్యవహరించటంతో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు సింధు దర్శన్ యాత్రికుల కోసం పెక్కు సౌకర్యాలు కల్పించే విధంగా ప్రకటనలు చేయడం మొదలెట్టాయి. మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలయితే యాత్రికుల కోసం 10 నుండి 15 వేల రూపాయల దాకా ఆర్ధిక సాయాన్ని కూడా ప్రకటించాయి. లద్దాఖ్ అధికార యంత్రాంగం సహా కేంద్ర పరిధిలోని వివిధసంస్థలు, భారతీయసేన కూడా చేయూతనందిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ద్వేషభావంతో వ్యవహరించిన ఫలితంగా లద్దాఖ్ ఆర్థికాభివృద్ధికి తగిలిన దెబ్బను ప్రజలు గుర్తించారు. ఇప్పుడు లద్దాఖ్ ప్రజలు జాతి, మతం, భాషలను ప్రక్కన పెట్టి సింధు యాత్రకు బాసటగా నిలిచారు. యాత్రలో భాగస్వాములు కావాలని దేశ ప్రజలను కోరుతున్నారు.
‘మహాకుంభ్’ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగు తున్నాయి?
రైలు-రోడ్డు మార్గాల ద్వారా వచ్చే యాత్రికులకు ఈసారి ఢిల్లీ మీదుగా ప్రయాణించే వీలు కల్పిస్తున్నాం. ఢిల్లీ నుండి జమ్ము వస్తారు, జమ్ము నుంచి శ్రీనగర్, శ్రీనగర్ నుండి కార్గిల్ లేదా లేహ్ చేరుకుంటారు. ఇదే విధంగా యాత్రికుల రెండవ బ్యాచ్ ఢిల్లీ నుండి రోడ్డు మార్గంలో చండీగఢ్, కుల్లూ-మనాలి నుంచి అటల్ టన్నెల్ మీదుగా ప్రయాణిస్తుంది. జమ్ము, శ్రీనగర్, కార్గిల్, చండీగఢ్, లేహ్ ప్రాంతాలకు వైద్య బృందాలను పంపడం మొదలైంది. అక్కడ ఆక్సిజన్, బెడ్స్, ఆక్సిమీటర్, అవసరమైన మందులు అందించే వ్యవస్థని ఏర్పాటు చేశాం. అలోపతి సహా హోమియో పతి, ఆయర్వేద వైద్య చికిత్సా శిబిరాలను కూడా ఏర్పాటుచేశాం. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని శుచికరమైన-ఆరోగ్యకరమైన భోజన వ్యవస్థని కూడా ఏర్పాటు చేస్తున్నాం. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం. యాత్రీకులు తమతో పాటు మాస్కులు, శానిటైజర్లు తీసికొని రావాలని యాత్రని జయప్రదం చేయాలని కోరుతున్నాం.
యాత్ర వేళ భక్తులంతా సింధు జం తీసుకుని సంకల్పం చెప్పాలి. కరాచీ, లాహోర్ లేని హిందు స్తాన్ అసంపూర్ణం. పీవోకే, గిల్గిట్, బాల్టిస్తాన్ మనదే. పాకిస్తాన్ వీటిని వదిలి వెళ్లిపోవాలి అనేదే ఆ సంకల్పం. కైలాశ్ మానస సరోవర్ చైనాది కానే కాదు, మనదేనంటూ కూడా సంకల్పం చెప్పాలి.
1929లో రావీ జలాలను చేతుల్లోకి తీసికొని భారత స్వాతంత్య్ర సంగ్రామ వీరులు ఎలాగయితే ‘పూర్ణ స్వరాజ్-అఖండ భారత్’ సంకల్పం చేశారో అలానే యాత్రికులంతా సింధు జలాలను చేతుల్లోకి తీసికుని అఖండ భారత్, సరిహద్దుల రక్షణ, కోల్పోయిన జనాన్ని-భూమిని తిరిగి సాధించాలంటూ సంకల్పం చేయాలి. ఇదే సందర్భంలో అక్కడ 10 గ్రాముల వెండి నాణేన్ని విడుదల చేయబోతున్నాం. యాత్రికులంతా ఈ నాణేన్ని కొనుగోలు చేసి ఇళ్లల్లో పూజాగృహాల్లో ఉంచుకోవచ్చు. దీనివల్ల సింధు చరిత్ర, భారత్ చరిత్ర సదా స్మరణకు వస్తాయి.
-అనువాదం : విద్యారణ్య