ఎటు చూసినా చెట్లు. ఒకపక్క కొండలు, మరోపక్క సముద్రం. సముద్రానికి ఆనుకుని రెండొందల గడపలున్న పల్లెటూరు కొత్తూరు. ‘‘ఓలమ్మీ అంత అన్నం ముద్ద, రేతిరి వండిన ఉప్పుసేపల కూర సత్తు కేరేజీలో ఏసి గంపలో పెట్టు’’ పకాలి అన్నం తింటున్న ఆదెమ్మ కూతురితో అంది. ‘‘నువు కంచం కాడ్నుంచి బేగి లెగు, వేనొచ్చే టైమయింది’’ ఎండు నెత్తళ్లు, చావళ్లు గంపలో సర్దుతూ అంది గంగ. ‘‘సరి సరే అయిపోవచ్చింది’’ చీర చెంగుతో చేతులు తుడుచుకుంటూ అంది ఆదెమ్మ. గంపనెత్తినెట్టుకుని గంపతోపాటు తల్లిని వ్యాను ఎక్కించి ఇంటికొచ్చింది గంగ. పలాసలో బస్సెక్కి పాతపట్నం బయలుదేరింది ఆదెమ్మ.

బస్సు పాతపట్నం చేరుకోగానే దిగి, గంప నెత్తిన పెట్టుకుని ఊరు చివరనున్న పైడమ్మ గడపలో గంప దించింది ఆదెమ్మ. సంతకి వచ్చినప్పుడల్లా ఆదెమ్మకి తన ఇంటిలో చోటిస్తుంది పైడమ్మ. అప్పా అప్పా అంటూ పైడమ్మను ప్రేమతో పలకరించేది ఆదెమ్మ. ఆదెమ్మ తనని అలా పిలిచినప్పుడల్లా పైడమ్మకు చెల్లెలు లేదన్న లోటు తీరేది.

‘‘కేరేజు తెచ్చుకోకపోతే ఈ రాత్రికి నీకింత ముద్ద పెట్టలేనా?’’ క్యారేజ్‌లోని అన్నం తింటున్న ఆదెమ్మ కేసి చూస్తూ అంది పైడమ్మ. ‘‘అది కాదప్ప ఈ ఊరిలో ఉన్న రెండు రోజులు నీ ఇంటికాడే తింటున్నాను. ఈ రేతిరంటే కేరీజు ఎలాగో ఉంది కద’’ కూరలో ఉప్పుచేప అన్నంలో నంజుకుంటూ అంది ఆదెమ్మ. ‘‘నేనున్నాను కద, నా చెల్లి అయితే ఇలాంటి పని చేస్తుందా’’ ఆదెమ్మను నిందించింది. ‘‘ఊరుకో అప్ప నేను నీ సెల్లినే కద. ఈ పాలికి తప్పు కాసేసాను’’ క్యారేజ్‌ ‌కడిగేసి అరుగు మీద పెట్టింది ఆదెమ్మ. ‘‘ఇవిగో అప్ప సంద్రపు ఇసకలో ఆరబెట్టిన ఎండు నెత్తలు మాంచి రుసిగా ఉంటాయి, కూరొండుకో’’ గంపలోంచి కొన్ని నెత్తలు తీసి పైడమ్మకి ఇచ్చింది. ‘‘నువ్వు చేపలు ఇవ్వడమే గాని ఎప్పుడూ డబ్బులు తీసుకోవు’’ పైడమ్మ అలా అనగానే ‘‘మన మద్దెన డబ్బులెందుకు అప్పా… కడుపుకింత కూడు పెడుతున్నావు మా అప్పకి ఈ మాత్రం ఇవ్వలేనా, ఎక్కడ కొత్తూరు ఎక్కడ పాతపట్నం కడుపు జరగక కుటుంబాన్ని వదిలేసి ఊళ్లు ఊళ్లు దాటి ఈ ఊరొచ్చాను. ఈ రాత్రికి ఈ మా తల్లి తల దాసుకోడానికి కాస్త నీడివ్వగా సరిపోయింది లేదంటే ఏ రామాలయం మెట్ల మీదో పడుకోవాలి. ఈ తల్లికి మనసులోనే దండమెట్టుకోవాలి’’ అదెమ్మ కళ్లు తడిసాయి. ‘‘ప్రయాణంలో అలిసి పోయుంటావు, ఉదయం సంతకెళ్లాలి, పడుకో’’ అంటూ పైడమ్మ లోపలికి వెళ్లిపోయింది. బస్సు కుదుపులకి ఒళ్లంతా కదిలిందేమో అలా పడుకోగానే ఇలా నిద్ర పట్టేసింది ఆదెమ్మకి.

ఆదివారం సంత వచ్చేపోయే జనంతో కిటకిట లాడిపోతుంది. కూరగాయలు, మిరపకాయలు, మినుములు, పెసలు, పసుపుకొమ్ములు, బట్టలు ఒకటేమిటి ఆ సంతలో దొరకని వస్తువంటూ లేదు. ఊర్లో ఎన్ని దుకాణాలున్నా సంతకొచ్చి సరుకులు కొంటేనే పల్లె జనానికి అదో తృప్తి. అన్ని షాపులు దాటి సంత చివర ఓ మూలన ఎండు చేపలు, నెత్తళ్లు, చావళ్లు అమ్ముతూ కనిపించింది ఆదెమ్మ. ఆ ఎండలో కాల్చిన కానాగర్త చేపలా ముఖమంతా మాడిపోయి ఉంది. అప్పుడొక బేరం అప్పుడొక బేరం వస్తూ మధ్యాహ్నం భోజనాల టైంకి గంపలో సగం సరుకు అమ్ముడైపోయింది. మధ్య మధ్యలో సీసాలోని నీళ్లు తాగుతూ పాలిపోయిన ముఖం చీర చెంగుతో తుడుచుకుంటోంది ఆదెమ్మ.

‘‘ఇక్కడున్నావా చెల్లీ! నీకోసం అటు ఇటు చూస్తున్నాను ఎక్కడున్నావో అని. బేరం తర్వాత ముందు అన్నం తిను. అంతగా కావాలంటే ఆ బేరం నేను చూస్తాను. నీకోసం ఎండు నెత్తలు పచ్చడి చేశాను. కడుపునిండా తిను’’. ‘‘అప్పా నాకోసం ఎండన పడి వచ్చావా? ఏ జనమ బందమో మనది, ఇలా మనల్ని కలిపింది’’ కలిపిన అన్నం ముద్దలు ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుంటూ పైడమ్మ కేసి కృతజ్ఞతగా చూసి ‘‘నీ కడుపు సల్లగుండ’’ బ్రేవ్‌ ‌మని తేల్చి కడిగిన క్యారేజ్‌ ‌పైడమ్మకిచ్చింది ఆదెమ్మ. ‘‘సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేయ్‌’’ అని అక్కడ నుండి వెళ్లిపోయింది పైడమ్మ.

‘‘వీశె నెత్తళ్లు ఎంత?’’ ఒకావిడ అడిగింది. ‘‘వంద రూపాయలు’’ చెప్పింది ఆదెమ్మ. ఆదెమ్మకి డబ్బులిచ్చి ఎండు నెత్తళ్లు కొనుక్కుంది ఆ వచ్చినావిడ. ఎండ తీవ్రంగా ఉంది. నీళ్లు ఎన్ని తాగినా దాహం తీరడం లేదు. ఆదెమ్మకి గోలీ సోడా మీదికి మనసు మళ్లింది. ఎప్పుడో చిన్నప్పుడు జాతరలో తాగిన రంగు గోలీ సోడా ఆమెకి గుర్తొచ్చింది. అక్కడ నుండి లేచి సోడా బండి దగ్గరకు వెళ్లి గోలీ సోడా అడిగింది. సోడా చేసే గ్యాస్‌ ‌చప్పుడికి సగం దాహం తీరినట్టయింది ఆదెమ్మకి. సోడా బండి అతను ఇచ్చిన సోడా గట గట తాగేసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది. ‘‘అమ్మయ్య ఇప్పటికి దాహం తీరింది’’ నుదుటి మీద పట్టిన చెమట తుడుచుకుంటూ అంది ఆదెమ్మ.

సాయంత్రానికి గంపలోని చేపలన్నీ అమ్మేసింది ఆదెమ్మ. వచ్చిన డబ్బుతో సంతలో గంపకు సరిపడేంత పసుపు కొమ్ములు కొనుక్కుంది. వచ్చినప్పుడు ఎండుచేపలు తెచ్చుకుని తిరిగి వెళ్లేటప్పుడు పసుపు కొమ్ములు కొని ఊరిలో మారు బేరానికి అమ్ముతుంది. అలా చేస్తేనే రాను పోను ఖర్చులతో పాటు తనకూ కొంత మిగులుతుంది. ఇన్నాళ్లు కొద్దో గొప్పో అలా సంపాదించబట్టే ఆదెమ్మ కుటుంబం వీధిన పడకుండా ఉంది. పసుపు గంపతో వచ్చిన ఆదెమ్మను చూసి గంప దించి అరుగు మీద పెట్టింది పైడమ్మ. ‘‘పగలంతా ఎండన పడి చెమటతో తడిసిపోయావు. పెరట్లోకి వెళ్లి స్నానం చేసి రా వేడి వేడి కూడు వడ్డిస్తాను తిందువుగాని’’ అంది పైడమ్మ. ‘‘మా పుట్టింట్లోనూ ఇలాంటి జరుగుబాటు జరగలేదు. ఏటిచ్చి నీ రుణం తీర్చుకోగలను’’ ఆదెమ్మ గొంతు గద్గదికమయింది. ‘‘నువ్వేమీ ఇవ్వద్దు, నేను ఉన్నంతవరకు ఈ అక్కను చూడ్డానికి వస్తుండు, నాకంతే చాలు’’ పైడమ్మ గొంతు పూడుకుపోయింది.

పైడమ్మకి పిల్లలు లేరు. భర్త చనిపోయి ఐదేళ్లయింది. అప్పటినుండి ఆమెది ఒంటరి బతుకే. ఆ ఒంటరి బతుకులోకి వసంతంలా వచ్చింది ఆదెమ్మ. ఆదెమ్మను సొంత మనిషిలా చూస్తుంది పైడమ్మ. మొన్న పండక్కి పైడమ్మకి చీర పెట్టి గంగకి బట్టలు కొని ఇచ్చింది. ఆదెమ్మకి కష్టమొచ్చినప్పుడల్లా ఏదో రూపంలో సాయ పడుతుంది. మనిషికి మనిషే సాయపడతారని పైడమ్మను చూస్తే తెలుస్తుంది.

గంగని తీసుకుని రమ్మని ఎన్నోసార్లు తనతో చెప్పింది పైడమ్మ. కుదరక గంగను తనే తీసుకుని వెళ్లలేదు. ముహూర్తాలు పెట్టాక పెళ్లికి సెప్పడానికి గంగని తనతో కూడా తీసుకొస్తానని చెబితే ‘‘నేను పోయాక తీసుకొస్తావా’’ అని నిష్టురాలాడేది. ‘‘అంత మాటనకు. పది కాలాలు నువ్వు సల్లగా ఉండాలి, ఈ సెల్లిని నీ కడుపులో దాసుకోవాలి’’ అని ఆదెమ్మ గతంలో జరిగిన సంఘటన గుర్తు తెచ్చుకుని కళ్లు చెమర్చింది. ‘‘అప్పా ఎళ్లొస్తాను. ఏట బాగా సాగితే వచ్చే నెల మళ్లీ సేపలు తీసుకుని సంతకొస్తాను’’ పైడమ్మ తోడురాగా పాతపట్నం బస్టాండ్‌కి బయలు దేరింది ఆదెమ్మ. ఆదెమ్మను బస్సు ఎక్కించి దిగులు మేఘంలా ఇంటికి చేరుకుంది పైడమ్మ. పైడమ్మకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఆదెమ్మ మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఇప్పటినుంచే ఎదురు చూపులు చూస్తోంది పైడమ్మ.

అమ్మ తెచ్చిన పసుపు గంపను వ్యాన్‌ ‌నుంచి దించి ఇంటికి తీసుకొచ్చింది గంగ.‘‘పైడప్ప నీ కోసం నువ్వుండలు పంపింది’’ అని గంగ చేతికి పొట్ల మిచ్చింది. ‘‘సిన్నమ్మ బాగుందా?’’ నువ్వుండ తింటూ పైడమ్మ గురించి అడిగింది గంగ. ‘‘బాగుంది, ఎప్పుడు నీ గురించే అడుగుతుంది. ఓ పాలి నిన్ను పాతపట్నం తీసుకెళ్లాలి’’ కూతుర్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుంటూ అంది ఆదెమ్మ.

ఆదెమ్మకి గంగ ఒక్కతే కూతురు. మసేను వేటకెళ్తే ఆ వేటలో వచ్చిన చేపలు ఆదెమ్మ బజార్లో అమ్ముతుంది. ఇంటి పని, వంట పని అన్నీ గంగే చూసుకుంటుంది. గంగ మగపిల్లాడైతే తనకి వేటలో సాయపడేవాడని మసేను ఎప్పుడు అంటుంటాడు. మసేనుకి పెద్దవలలో ఓ భాగం ఉంది. ఆరోజు పడిన చేపల్లో తన వాటా చేపలు ఆదెమ్మ బజార్లో అమ్మేయగా, మిగిలిన చేపలు ఉప్పులో ఊర వేసి ఆనక ఎండబెడుతుంది. అలా ఎండిన చేపలు నెలకొకసారి పాతపట్నం సంతలో అమ్ముతుంది.

ఆరోజు ఎనిమిది గంటలకు సముద్రంలో పెద్ద వల వదిలారు. వలకి రెండువైపులా కట్టిన తాళ్లతో ఉన్న రెండు పక్కలు రెండు గంటల సేపు ఒడ్డుకి లాగితే వల ఒడ్డుకు చేరుతుంది. వల మొలలోతు నీటిలో ఉన్నప్పుడే మడి చుట్టూ నీటి పిట్టలు చేరి వల మడి కన్నుల్లోంచి చేపల్ని నోటితో కరిచి బయటకు తీసి తింటున్నాయి. నీటి పిట్టలు మడిని వదలకుండా ఉన్నాయంటే ఆరోజు మడి నిండా చేపలు ఉన్నట్టే. మడి ఒడ్డుకి రాగానే వల కన్నుల్లోంచి తేరిపార చూసిన మసేను పెదవి మీద ఒక నవ్వు నవ్వి ‘‘మడి ఒడ్డుకి లాగండిరా. ఇవాళ నెత్తలతో మడి నిండింది, మన పంటపండింది.’’ అంతా కలిసి ఒక్కసారి వల మడి ఒడ్డుకు లాగారు. బొడ్డు తాడు తప్పించి మడికేసి చూసాడు మసేను. తెల్లగా మెరిసిపోతూ నెత్తళ్లు టప టప కొట్టుకుంటున్నాయి. రెండు పక్కల వేటగాళ్లు నలభై మంది కళ్లల్లో ఒకటే ఆనందం. మడిలో నెత్తలు టన్ను దాకా ఉంటాయి.

సహజంగా చేపలు గుంపులు గుంపులుగా నీటిలో వెళ్తుంటాయి. ముందు చేపలు ఎటు వెళ్తాయో వెనకాల వచ్చే చేపలు అటే వెళ్తాయి. అందుకే ఇతర చేపలేవీ లేకుండా కేవలం నెత్తలు చేపలే వలలో చిక్కుకున్నాయి. అడప దడప నెత్తలు చేపలు తినేందుకు వచ్చే పెద్ద చేపలు ఏవైనా ఉంటే వాటితో పాటు అవి వలలో చిక్కుకుంటాయి. అలా నెత్తలు చేపలతో పాటు పొడవాటి మూతులున్న కదురు చేపలు కొన్ని వలలో వచ్చి చేరాయి. గంపలతో నెత్తలు ఒడ్డుకి మోస్తున్నారు వేటగాళ్లు. ఆదెమ్మ కూర్చుని గంపలన్నీ ఒక్కొక్కటి లెక్క పెడుతూ ఉంది. గంపలన్నీ మోయడం పూర్తయిన తర్వాత పోగు పడిన నెత్తలు రాశిని చూసి మసేను గంగమ్మ తల్లికి రెండు చేతులతో దండం పెట్టాడు.

ఒక్కొక్క గంప కొలుస్తూ బేరగాళ్లకు చేపలు అమ్ముతోంది ఆదెమ్మ. బేరగాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని తలపాగా చుట్టిన తువ్వాలు గుడ్డలో వేసుకుంటున్నాడు మసేను. బేరగాళ్లకు అమ్మేయగా మిగిలిన నెత్తలు చేపలు పది పాలు వేసి తన భాగానికి వచ్చిన చేపలు ఆదెమ్మకి అప్పగించాడు. ఆ నెత్తలు చేపలు గంగ సాయంతో మోసుకెళ్లి ఇసుక దిబ్బల మీద కల్లంలో ఆరబెట్టింది ఆదెమ్మ. వల ఒడ్డున ఆరబెట్టి, కుట్టు పడవ ఒడ్డు మీద పెట్టించాడు మసేను.

మిట్ట మధ్యాహ్నం. సూరీడు నెత్తి మీద భగభగ మండుతున్నాడు. ఉదయం తిన్న పకాలి అన్నం అరిగి పోయి కడుపు నకనకలాడుతోంది మసేనుకి. మూడు క్యారేజీల్లో ఒకటి మసేనుకిచ్చి మరొకటి గంగకిచ్చి మిగిలిన కేరేజ్‌ ‌ముందు పెట్టుకుని అంతా కలిసి అన్నం తింటున్నారు.

‘‘ఎదర గంగ పెళ్లి ఉంది. దాని పెళ్లికి నాలుగు కాసులు ఎనకెయ్యాలి’’ అన్నం ముద్ద నోట్లో పెడుతూ మసేనుతో అంది ఆదెమ్మ. ‘‘ఇలాంటివి పది మడుల సేపలు వలకి తగిలాయంటే గంగ పెళ్లి గనంగా జరిగిపోద్ది.’’ గంగ కళ్లల్లో వెలుగు చూసేసరికి ఆదెమ్మ, మసేను సంబరపడిపోయారు. ‘‘దాని బతుకంతా మనతోనే గడిసిపోయింది. సదువు లేదు సంద్య లేదు. పొద్దస్తమాను మనతోపాటు కష్ట పడుతూనే ఉంది. రేపు పెళ్లయ్యాకైనా సుఖపడుతుంది’’ కూతురుకేసి జాలిగా చూస్తూ అంది ఆదెమ్మ. ‘‘నీ అల్లుడు ఆపీసరు కాదు ఏటగాడు నువ్వా సంగతి మరిసిపోతున్నావు. అత్తారింట్లోనూ దాని బతుకు ఇంతే. మన బతుకులే అంత. ఇంటిల్లిపాది కష్ట పడితేనే కడుపుకింత కూడు దొరుకుతుంది’’ తండ్రి మాటలు ఆర్ధంగా వింటోంది గంగ. ‘‘అబ్బాయి మంచోడే, గంగను బాగానే చూసుకుంటాడు’’ తల్లి పేగు కదిలిందేమో కూతురు బతుకులో ఏ కష్టం రాకూడదని గంగమ్మ తల్లికి మనసులోనే మొక్కుకుంది ఆదెమ్మ.

కల్లాల్లో నెత్తలు చేపలు ఎండకి తళ తళ మెరిసి పోతున్నాయి. కనుచూపు మేర కల్లాలన్నీ చేపలతో నిండిపోయి నేలంతా తెల్లని తివాచీ పరిచినట్టుంది. చేపలు ఎండే వరకు పగలు రాత్రి కల్లాల దగ్గర మనుషులు కాపలా ఉంటారు. అశ్రద్ధగా ఉంటే కుక్కలు, నక్కలు వచ్చి చేపల్ని తినేస్తాయి. రాత్రి అన్నం తినేసి అందరితో పాటు గంగ కూడా తన కల్లం దగ్గర కాపలా కాస్తోంది. వంతుల వారీగా కొంతమంది కల్లాల దగ్గర కాపలా కాస్తూ మరికొంత మంది నిద్ర పోతారు. మధ్య మధ్యలో వచ్చే నక్కల్ని, కుక్కల్ని అదిలిస్తూ చుట్టూ కొంతమంది గస్తీ తిరుగుతుంటారు. మూడు నాలుగు రోజులు కాపలా కాసిన తర్వాత ఎండిన చేపలు సంతల్లో, బజార్లల్లో అమ్ముతారు.

‘‘గంగ… ఈసారి నువ్వు కూడా నాతో పాటు సంతకి బయలుదేరు, ఎప్పటి నుంచో పైడప్ప నిన్ను సూడాలంటుంది. ఆ ఊరు నువ్వు సూసినట్టుంటుంది, పెళ్లి కబురు ఆవిడతో సెప్పినట్టుంటుంది’’ అంది ఆదెమ్మ.

ఎప్పుడూ పొన్నూరు మొహం చూడని గంగ ఆ మాట విని ఎగిరి గంతేసినంత పని చేసింది. ‘‘అలాగే నేను వస్తానమ్మా’’ ఎప్పుడు పట్నం చూద్దామా అని మనసులో ఉవ్విళ్లూరి పోయింది గంగ.

పాతపట్నంలో బస్సు దిగి గంపలు మోసుకుని పైడమ్మ గుమ్మం ముందు ఆగి ‘‘పైడప్పా’’ అంటూ పిలిచింది ఆదెమ్మ. ఎంతసేపటికీ తలుపు తీయక పోయేసరికి గంప అరుగు మీద పెట్టి తలుపు తట్టింది. రాంబాబు తలుపు తీసి అరుగు మీద గంపలు, ఎదురుగా ఆదెమ్మను చూసి ‘‘నీ పేరు ఆదిలక్ష్మి కదూ, నేను, పైడమ్మ తమ్ముడు రాంబాబుని. ఇంకెక్కడి పైడమ్మ.. మా అక్క చనిపోయి ఇరవై రోజులయింది. అన్ని కార్యక్రమాలు కూడా జరిగి పోయాయి.’’ అన్నాడు. ఆ మాట విని ‘‘పైడప్పా’’ అంటూ భోరున ఏడ్చింది ఆదెమ్మ. ఆ ఏడుపు విని రాంబాబు భార్య లోపల నుంచి వచ్చి వాళ్లను చూసి అక్కడే నిలబడి పోయింది. ఆదెమ్మకి దుఃఖం ఆగటం లేదు. ‘‘నా కూతురు గంగను తీసుకురమ్మని ఎప్పుడూ సెప్పే దానివి. నా కూతురు పెళ్లికి నిన్ను రమ్మని పిలవటానికి గంగను తీసుకుని వచ్చాను. సెప్పా పెట్టకుండా నువ్వు ఎల్లిపోయావా అప్పా’’ అని గొంతు పెంచి ఏడ్చింది ఆదెమ్మ. ‘‘అంతా నన్ను ఆదెమ్మ అని పిలుస్తారు, నువ్వొక్కదానివే నన్ను ఆదిలక్ష్మి అని మనసారా పిలుస్తావు. ఇకనుంచి ఎవరు నన్నలా పిలుస్తారు’’ ఆదెమ్మ ఆ అరుగుమీద కుమిలి కుమిలి ఏడ్చి చెంగుతో కన్నీళ్లు తుడుచుకుంది.

‘‘ఈ రాత్రికి ఇక్కడే ఉండండి. ఇప్పుడే కాదు ఎప్పుడొచ్చినా మా ఇంటికి రండి. మేము ఇక్కడే ఉంటాము. మా అక్క లేదని మీరు రావడం మానేయకండి. చనిపోయే ముందు అక్క మీ గురించి అంతా చెప్పింది. నేను మీ తమ్ముడులాంటి వాడిని. మీ ఇద్దరికీ భోజనాలు ఏర్పాటు చేయిస్తాను’’ రాంబాబు మాటలు విని ఆశ్చర్యపోతూ ‘‘ఈ రేతిరికి ఇద్దరికీ కేరేజీలు తెచ్చుకున్నాము’’ అంది ఆదెమ్మ. ‘‘ఈ చీర, ఈ డబ్బు అక్క మీకిమ్మంది’’ చీరతో పాటు వెయ్యి రూపాయలు ఆదెమ్మ చేతిలో పెట్టాడు రాంబాబు. ‘‘మీరెవరో నేనెవరో… పైడప్పకి నా మీద ఎందుకు అంత పేమ’’ రాంబాబు ఇచ్చిన చీర, డబ్బులు గుండెల్లో దాచుకుంది. రెప్ప వేయకుండా అక్కడ జరిగిన దృశ్యం చూస్తూ స్తంభించిపోయింది గంగ. ఆ రాత్రి ఆదెమ్మకి ఆ అరుగు మీద నిద్ర పట్టలేదు. పైడమ్మ లేని ఆ ఇల్లు తనకి వింతగా తోచింది.

ఉదయాన్నే సంతలో సందడి మొదలయింది. అమ్మేవాళ్లు, కొనేవాళ్లతో సంత కళకళలాడుతోంది. ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన సరుకులు ఆ సంతలో అమ్ముడుపోతున్నాయి. కొనుక్కునే వాళ్లకు సంత ఆహార భద్రతనిస్తుంది. రంగులరాట్నం మీద పిల్లలు గిరగిరా తిరుగుతున్నారు. ఐస్‌ ‌బండి దగ్గర పిల్లలు ఐస్‌ ‌చప్పరిస్తూ అందరి నోళ్లు ఊరిస్తున్నారు. అప్పటికే ఆదెమ్మ, గంగ సగం కన్న ఎక్కువ చేపలు అమ్మేసారు. గంగకి ఐస్‌‌ఫ్రూట్‌ ‌తినాలని ఉంది. అమ్మను అడిగి ఐస్‌‌ఫ్రూట్‌ ‌కొనుక్కుని చప్పరిస్తూ ఉంది గంగ. ఎప్పుడూ బయట ప్రపంచం చూడని గంగకి సంతలో చూసిన ప్రతి విషయం చిత్రంగా కనిపిస్తోంది. మధ్యలో అమ్మతో చెప్పి గాజులు, రిబ్బన్లు కొనుక్కుంది గంగ. ‘‘చిన్న చిన్న కోరికలు ఆడపిల్లకి అమ్మే తీర్చాలి’’ గంగ వైపు చూసి నిట్టూర్చింది ఆదెమ్మ.

భోజనాల టైంకి అంత ఎండలో వాళ్ల కోసం రాంబాబు రెండు క్యారేజీలతో భోజనాలు తేవడం చూసి ‘‘ఎందుకు బాబు నీకింత సెమ. ఈ పూటకి ఇక్కడ దొరికిందేదో తినేవాళ్లం కద’’ ఆదెమ్మ అలా అందో లేదో ‘‘ఇంకెప్పుడు అలా అనొద్దు అక్కా…. ఈ ఊర్లో నీకో తమ్ముడు ఉన్నాడన్న సంగతి మర్చిపోకు. అక్క పోయినా మా అక్కను నీలో చూస్తున్నాను’’ రాంబాబు కళ్లు చెమర్చాయి. ‘‘ఏనాటి రుణమో ఆ గంగమ్మ తల్లి మనల్ని ఇలా కలిపింది’’ ఆదెమ్మ మాట గొంతులోనే పూడుకుపోయింది. ‘‘తిన్నావా అయ్యా’’ రాంబాబుని అడిగింది. ‘‘నా భోజనం అయింది, ముందు మీరు తినండి. మీరు తిన్నంత సేపు బేరం నేను చూస్తాను’’ అలా అన్నాడో లేదో ‘‘అచ్చం అప్ప కూడా ఈ మాటే అనేది. నేను తిన్నంత సేపు ఇక్కడ బేరం చూసేది’’ అంటూ ఆదెమ్మ, గంగ క్యారేజీలు విప్పి అన్నం తిన్నారు.

‘‘బతుకు తెరువు కోసం ఈ సంతకొచ్చి సేపలు అమ్మకపోతే మీరెవరో మేమెవరో… ఈ సంతే మనల్ని కలిపింది. సేపలు అమ్ముడైపోయాక సాయంత్రం పలాస బస్సుకి ఎల్లిపోతాం తమ్ముడు’’ చెప్పింది ఆదెమ్మ. ‘‘అలాగే జాగ్రత్తగా వెళ్లి రండి’’ అని ఖాళీ క్యారేజీలు తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు రాంబాబు. సాయంత్రానికి రెండు గంపలు చేపలు అమ్మేసి ఒక గంపలో పసుపుకొమ్ములు, రెండో గంపలో సారకంద దుంపలు కొని పాతపట్నం బస్టాండ్‌కి చేరుకున్నారు ఆదెమ్మ, గంగ.

‘‘అక్కా ఆగు నేనూ సాయం పడతాను’’ వెనక నుండి వచ్చి బరువుతో ఉన్న గంపలు పలాస బస్సుకి ఎక్కించాడు రాంబాబు. ‘‘పైడప్ప కూడా నన్ను బస్సు ఎక్కించి, బస్సు కదిలేదాక ఇంటికి వెళ్లేది కాదు’’ అంది. ‘‘నీకు ఇష్టమని నువ్వుండలు తెచ్చాను తీసుకో గంగా… నీ పెళ్లికి మీ ఊరొస్తానులే’’ గంగ చేతిలో మిఠాయి పొట్లం పెట్టి చేయి ఊపాడు రాంబాబు.

రాంబాబు వైపు కృతజ్ఞతగా చూస్తూ ‘‘ఎల్లొస్తాం తమ్ముడు’’ పలాస బస్సులో కూర్చుని వాలి పోయిన పొద్దులా ఇంటికి తిరుగు ముఖం పట్టారు ఆదెమ్మ, గంగ.

చొక్కర తాతారావు

About Author

By editor

Twitter
YOUTUBE