హుజురాబాద్‌.. ‌తెలంగాణలోని ఓ సాధారణ అసెంబ్లీ నియోజకవర్గం. కానీ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న అసెంబ్లీ నియోజకవర్గం అది. దేశ ఎన్నికల చరిత్రలోనే కేవలం ఒకే ఒక ఉపఎన్నిక కోసం ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో ఖర్చు చేయలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే.. హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసమే పథకాలు ప్రారంభిస్తున్నామని, తమ పార్టీకి ఓట్లు సంపాదించుకోవడం కోసమే జనాకర్షక పథకాలను ప్రవేశపెడుతున్నామని స్వయంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమయింది. హుజురాబాద్‌లో ముంచుకొచ్చిన ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్‌ అవసరమైతే రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఆ ఎన్నిక కోసమే ఖర్చుచేసినా పర్వాలేదన్న భావనలో ఉన్నారు. ఉపఎన్నికే టార్గెట్‌గా లక్ష కోట్ల రూపాయలు వివిధ పథకాల కోసం ఖర్చు చేసేందుకూ వెనుకాడబోమంటున్నారు.

ఉపఎన్నికలో బీజేపీని నిలువరించేందుకు టీఆర్‌ఎస్‌ ‌పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో మోహరించింది. అక్కడ అధికంగా ఉన్న దళిత సామాజిక వర్గాన్ని దళితబంధు ద్వారా ఆకర్షిస్తూనే వారిని ఆకట్టుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌ను రంగంలోకి దించింది. అలాగే గిరిజనుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం మంత్రి సత్యవతి రాథోడ్‌ను, కల్లు గీత కార్మికుల ఓట్ల కోసం మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ను బరిలోకి దింపింది. ఇక బలమైన సామాజిక వర్గమైన రెడ్డి, కమ్మ సామాజిక వర్గం మెప్పుకోసం ధర్మారెడ్డి, పెద్దిరెడ్డి లాంటి వారిని హుజురాబాద్‌లో మకాం వేయాల్సిందిగా టీఆర్‌ఎస్‌ అధిష్టానం సూచించింది. మరో బలమైన సామాజిక వర్గమైన యాదవులను ఆకర్షించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను రంగంలోకి దింపింది. ఇలా అన్ని సామాజిక వర్గాలను ఆకట్టకునేందుకు సీఎం కేసీఆర్‌ ‌ప్లాన్లు రూపొందించుకున్నారు. అందులో భాగంగానే.. ఈటల రాజీనామా చేసిన నాటి నుండే ఆ నియోజక వర్గంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను మోహ రించారు. నియోజకవర్గం నుంచి గెలిచిన సర్పంచ్‌ ‌నుండి జెడ్‌పీటీసీ వరకు అందరినీ ఈటలకు దూరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఉపఎన్నిక మానస పుత్రిక ‘దళితబంధు’

ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ ఇచ్చిన హామీలను ఒకసారి గమనిస్తే ఒకటీ అరా మినహాయిస్తే ఊరించి ఊరించి ఉసూరుమనిపించడం మినహా కడదాకా కొనసాగిన ఆనవాళ్లు లేవు. కొంతకాలంగా దళిత జపం చేస్తున్న కేసీఆర్‌.. ‌గతంలో తాను హామీఇచ్చిన దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి బాస గోదాట్లో కలిసిపోయింది. ఇక దళిత సామాజిక వర్గానికి చెందినవారిని తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశారు. ఇప్పుడు హుజురాబాద్‌లో ఓట్ల కోసం దళితబంధు పేరిట కొత్త పథకానికి రూపకల్పన చేశారు. ఇది కూడా అలాంటి హామీనే అని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు.

ఎన్నికల స్టంట్‌

‌మొదట్లో హుజురాబాద్‌ ‌నుంచే దళితబంధు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు కేసీఆర్‌. ‌కానీ, ఆ తర్వాత తన దత్తత గ్రామం వాసాలమర్రిలో తొలుతగా దళితబంధుకు శ్రీకారం చుట్టారు. హుజురాబాద్‌కు మాత్రమే దళితబంధు పరిమితమవు తుందని, ఎన్నికల తర్వాత.. జీహెచ్‌ఎం‌సీ వరద సాయం వలె ఈ పథకం కూడా దిక్కూ మొక్కూ లేకుండా పోతుందని విపక్షాలు, అన్ని సామాజిక వర్గాల సంస్థలు విమర్శించడంతో వాసాలమర్రి నుంచి ఆ పథకాన్ని ప్రారంభించారు. ఆ గ్రామంలో 76 దళిత కుటుంబాలకు 7 కోట్ల 60 లక్షల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. అయితే, ఇందులోనూ ఓ నిగూఢార్థం దాగి ఉంది. హుజురాబాద్‌లో ఏ క్షణమైనా ఉపఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ ‌సిద్ధంగా ఉందన్న సంకేతాలు వచ్చాయి. ఈ సమయంలో నేరుగా హుజురాబాద్‌లోనే దళితబంధు పథకం ప్రారంభిస్తే.. ఎన్నికల స్టంట్‌గా పరిగణిస్తారని, వాసాలమర్రిలో ముందుగానే కొన్ని నిధులు విడుదల చేయడం ద్వారా.. హుజురాబాద్‌ ఉపఎన్నిక షెడ్యూల్‌ ‌విడుదలైనా దళితబంధు పథకాన్ని సాఫీగా పంపిణీ చేసుకోవచ్చన్న ఆలోచన తోనే కేసీఆర్‌ ‌వాసాలమర్రిపై అప్పటికప్పుడు ప్రేమను ఒలకబోశారని విశ్లేషకులు చెబుతున్నారు.

ఆ తర్వాత నాలుగు రోజులకే హుజురా బాద్‌లోనూ దళిత బంధు పథకం అమలుకోసం 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ మరో జీవో జారీచేసింది. దీంతో, ఇక పంచడమే తరువాయి అన్నట్లు మారింది పరిస్థితి. పైలట్‌ ‌ప్రాజెక్ట్‌గా హుజురాబాద్‌లో ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అంచనాల ప్రకారమే హుజురాబాద్‌ ‌నియోజక వర్గంలోని హుజూరాబాద్‌ ‌మండలంలో 5,323 దళిత కుటుంబాలు, కమలాపూర్‌ ‌మండలంలోని 4,346 కుటుంబాలు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలు, ఇల్లందకుంటలో 2,586 కుటుంబాలు.. ఇలా హుజురాబాద్‌ ‌నియోజక వర్గంలోని మొత్తం 20,929 దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని అధికారులు ప్రకటించారు. నిబంధనల మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని వర్తింపజేస్తామని, ఎంపికైన ఒక్కో కుటుం బానికి పది లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని టీఆర్‌ఎస్‌ ‌వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాలు చూసుకుంటేనే దళితబంధు అమలు చేయడానికి ఒక్క హుజురాబాద్‌ ‌నియోజకవర్గానికే 2వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటున్నారు విశ్లేషకులు. కానీ, తొలుత 500 కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం.

మరోవైపు.. దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ ‌చేస్తున్నాయి. ఇందుకోసం పెద్దఎత్తున ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంద్రవెల్లి సభను ఏర్పాటు చేసింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరిట భారీ బహిరంగసభ చేపట్టింది. ప్రతి దళిత, గిరిజన కుటుంబానికి కూడా పదిలక్షల రూపాయలు ఇవ్వాలని ఆ సభ ద్వారా కాంగ్రెస్‌ ‌పార్టీ డిమాండ్‌ ‌చేసింది. అయితే గతంలోనే దళిత ఎంపవర్‌మెంట్‌ ‌స్కీం కింద వేయికోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు అవే నిధులు దళితబంధు పేరిట ఖర్చు చేస్తున్నామని చెబుతోంది.

మరోవైపు కొత్తగా ప్రారంభించబోయే ప్రభుత్వ పథకాలన్నింటికీ హుజురాబాద్‌ ‌కేరాఫ్‌ అ‌డ్రస్‌గా మారిపోయింది. ఒక్క దళితబంధు పథకం మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఏ పథకం ప్రారంభించాలను కున్నా అది హుజురాబాద్‌ ‌నుండే ప్రారంభిస్తున్నారు. పాత, కొత్త పథకాలకు అక్కడినుండే ముహుర్తం ఫిక్స్ ‌చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. అటకెక్కిన గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక రేషన్‌ ‌కార్డుల పంపిణీ కూడా హుజూరాబాద్‌ ఎన్నికల నేపథ్యంలోనే ప్రారంభించా రనే విషయాన్ని కొట్టిపారేసే పరిస్థితి లేదు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసినా.. హుజూరాబాద్‌లో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డు అందజేసినట్లు చెప్పుకుంటున్నారు. పథకాలతో పాటు అభివృద్ధి పరంగా కూడా వందల కోట్ల రూపాయల నిధులను కరీంనగర్‌ ‌జిల్లా వ్యాప్తంగా విడుదల చేస్తోంది ప్రభుత్వం. కుల సంఘాల భవనాల కోసం 50 లక్షల నుండి కోటి రూపాయలను కూడా అందించడంతోపాటు స్థానికంగా అడిగిన ఏ సమస్యలు ఉన్నా వెంటవెంటనే తీర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆటో గ్యారేజి కోసం మూడు ఎకరాల స్థలం పత్రాలు కూడా మంత్రి గంగుల కమలాకర్‌ అం‌దించారు.

పదవుల పండుగ

ఈటల రాజేందర్‌ ‌మళ్లీ గెలవకుండా.. ఓట్లు ఎక్కువగా పడకుండా చూసేందుకు కేసీఆర్‌ ‌కనుసన్నల్లో టీఆర్‌ఎస్‌ ‌మంత్రుల నుంచి మొదలుకొని.. గల్లీ లీడర్‌ ‌దాకా తొలిరోజు నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ అనుచరులుగా చెప్పుకుంటున్న పలువురికి ఆగమేఘాలమీద పదవులు ఆఫర్‌ ‌చేశారు. ఈటల ప్రధాన అనుచరుడిగా చెప్పుకునే బండ శ్రీనివాస్‌ను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ‌చైర్మన్‌గా నియమించారు. ఇక, కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డి కలలో కూడా ఊహించని అదృష్టాన్ని సొంతం చేసుకున్నాడు. టీఆర్‌ఎస్‌ ‌కండువా కప్పుకోవడమే తరువాయి.. నామినేటెడ్‌ ఎమ్మెల్సీగా కేసీఆర్‌ అరుదైన అవకాశం కల్పించారు. ఈ పరిణామం మాత్రం టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలకు దారితీసింది. బయటకు నేతలెవరూ చెప్పకున్నా ఆది నుంచీ ఉద్యమంలో అన్నీ వదులుకొని కష్టపడ్డవాళ్లు.. మొదటినుంచీ టీఆర్‌ఎస్‌ ‌పార్టీనే నమ్ముకొని కష్టపడి పనిచేస్తున్నవాళ్లు ఎంతోమంది ఉన్నా మొన్న గులాబీ కండువా కప్పుకున్న కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధానంగా మేధావి వర్గంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బాహాటమవుతోంది.

మొత్తం మీద హుజూరాబాద్‌ ఉపఎన్నిక హాట్‌టాపిక్‌గా మారింది. అయిదు వందల కోట్లను ప్రతి దళిత కుటుంబానికి అందజేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో దళితులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ కొనసాగుతోంది.

వాస్తవానికి హుజురాబాద్‌ ఒక్క సీటు గెలిచినా, గెలవక పోయినా తెలంగాణ రాష్ట్ర సమితికి పోయేదేమీ లేదు. విజయం సాధించినా వచ్చే లాభమేదీ లేదు. ఇప్పట్లో సార్వత్రిక ఎన్నికలుగానీ, ఇతరత్రా ఎన్నికలు గానీ కనుచూపు మేరలో లేవు. అంటే.. వాటిమీద ఈ ఫలితం ప్రభావం చూపుతుందన్న పరిస్థితి కూడా లేదు. కానీ, కేసీఆర్‌ ఒక్క హుజురాబాద్‌ ‌కోసం అనేక వ్యూహాలు పన్నుతున్నారు. ఒక రకంగా కుప్పిగంతులు వేస్తున్నారు. విపక్షాలే కాదు.. సొంత పక్షం నుంచి కూడా పెదవి విరుపులను చవిచూస్తున్నారు. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. హుజురాబాద్‌ ‌కోసం దేనికైనా తెగిస్తానని చెబుతున్నారు, చేస్తున్నారు.

– సుజాత గోపగోని, 63021 64068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE