– (కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృతోత్సవ్‌ పిలుపు మేరకు ప్రచురిస్తున్న 6వ వ్యాసం.)

ఆగస్ట్‌ 15, 1947 తరువాత అప్పటి వరకు సర్వస్వం జాతీయోద్యమం కోసం వెచ్చించిన వారు ఏం చేశారు? కొందరు చట్టసభలకు వెళ్లారు. కొందరు మంత్రులయ్యారు. పాలకులయ్యారు. కానీ చాలా మంది స్వరాజ్య సమరయోధుల జీవితాలు స్వతంత్ర భారతంలో ఎలా గడిచాయో ఎవరూ పట్టించుకోలేదు. ఈ కింద పరిచయమవుతున్న రెండు జీవితాలు చాలా ఆసక్తి కలిగించేవే. 1947కు ముందు వారికి గొప్ప ఉద్యమ జీవితం ఉంది. తరువాత కూడా రెండు దశాబ్దాల వరకు జీవించారు. రకరకాలుగా దేశానికి సేవ చేశారు. వారు-దర్శి చెంచయ్య, అన్నాప్రగడ కామేశ్వరరావు. చరిత్రకారులు, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వారిని పట్టించుకోవలసినంతగా పట్టించుకోకపోయినా, వారిని స్మరించుకునే బాధ్యతను ఏ తరమూ విస్మరించ కూడదు. ఎవరి త్యాగాన్ని గాలికి వదిలేయకూడదు.

బ్రిటిష్‌ ఇండియా దక్షిణ భారతంలో తొలి రాజకీయ డిటెన్యూ ఎవరు? ఎవరో ఒకరు ఉంటారు. ఉన్నారు కూడా. కానీ ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. ఆయన పేరు దర్శి చెంచయ్య. మరొక విశేషం కూడా వారి జీవితంలో ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గదర్‌ పార్టీలో పని చేసిన సాహసి చెంచయ్య (డిసెంబర్‌ 28, 1890 – డిసెంబర్‌ 30, 1964). ఎక్కువకాలం కారాగారంలో ఉండిపోవడం, విడుదలైన తరువాత, అంటే స్వతంత్ర భారతదేశంలో ఆయన వాంఛించిన సంస్కరణలు మన సమాజంలో తీసుకురావడానికి శ్రమించడంతో, లేదా వ్యవసాయాభివృద్ధే ధ్యేయంగా తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి పరిమితం కావడం వల్ల ఆయన పేరు చరిత్ర పుటలలో తగిన స్థానం సంపాదించు కోలేకపోయిందేమో ఆలోచించాలి. ఆ కారణాలతోనే ఆయన ఈ తరానికి పరిచయం కాకుండా ఉండి పోయారంటే అలాంటి సంప్రదాయం మంచిది కాదని కూడా గుర్తించాలి.

చెంచయ్య ప్రస్తుత ప్రకాశం జిల్లా కనిగిరిలో పుట్టారు. ఒంగోలులో మెట్రిక్యులేషన్‌ చేశారు. చెన్నైలో బీ.ఏ. చేశారు. వ్యవసాయ శాస్త్రం మీద అభిరుచితో పై చదువుల కోసం 1912లో అమెరికా వెళ్లి, లోగస్‌ కళాశాలలో బీఎస్‌సీ చదివారు. తన ప్రాంతంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలన్న గొప్ప ఆకాంక్షతో ఆయన అక్కడి వరకు వెళ్లారు. ఆ గడ్డ మీదనే గదర్‌ పార్టీతో పరిచయం ఏర్పడిరది. కందుకూరి వీరేశలింగం పంతులు ప్రభావంతో మొదట సంఘ సంస్కర్తగా సామాజిక జీవనంలో ప్రవేశించారు దర్శి చెంచయ్య. ఈ విషయంతోనే చెంచయ్య ఎంత స్వతంత్రంగా ఆలోచించగలరో అర్ధమవుతుంది. నిజానికి 20 శతాబ్దం ఆరంభం నాటి చాలామంది భారత జాతీయ కాంగ్రెస్‌ వాదుల మాదిరిగానే రావుబహదూర్‌ కందుకూరి వీరేశలింగం కూడా బ్రిటిష్‌ పాలన పట్ల విశ్వాసంతో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే భారత స్వాతంత్య్రోద్యమాన్ని నిరసించారు. బెంగాల్‌ విభజన వ్యతిరేకోద్యమం నేపథ్యంలో 1907లో బిపిన్‌ చంద్రపాల్‌ రాజమహేంద్రవరం రావడం కందుకూరికి నచ్చలేదు. పాల్‌ సందేశం పట్ల, వందేమాతరం నినాదం పట్ల నాటి యువతరం ఆకర్షితులు కావడం కూడా ఆయనకి నచ్చలేదన్న సంగతి వారి ఆత్మకథలో స్పష్టంగానే కనిపిస్తుంది. సంస్కర్త వీరేశలింగం బాటలోనే చెంచయ్య తుదికంటా నడిచినా, దేశానికి స్వాతంత్య్రం విషయంలో మాత్రం రాజీపడలేదు. పైగా ఆయన జాతీయ కాంగ్రెస్‌ పంథాలో సాగలేదు.

అమెరికాలో వ్యవసాయ శాస్త్రం చదువుతున్నప్పుడే 25 ఏళ్ల వయసులో చెంచయ్య తీవ్ర జాతీయవాదిగా మారారు. గదర్‌ పార్టీ తరఫున అమెరికా నుంచి ఆయుధాలతో కెనడా ప్రయాణమయ్యారు. మార్గమధ్యలోనే బ్రిటిష్‌ వారికి చిక్కి చిత్రహింసలకు గురయ్యారు. డిటెన్యూ హోదాలో ఢల్లీి, కోల్‌కతా, లాహోర్‌, కన్ననూర్‌, అలీఘడ్‌, కోయంబత్తూరు జైళ్లలో ఆయనను విచారించారు. కానీ సాక్ష్యాలు దొరకలేదు. అయినప్పటికి ఆయనను 1949లో విడుదల చేశారు. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సంఘ సంస్కరణ కోసం శ్రమించారు. వేశ్యావృత్తి నిర్మూలన, స్త్రీవిద్యలకు కృషి చేసి వితంతు శరణాలయాలు నిర్వహించారు. కార్మికోద్యమంలో కూడా పనిచేశారు. చెంచయ్య సతీమణి సుభద్రమ్మ కూడా విదుషీమణి. భర్త నిర్వహిస్తున్న ఉద్యమాలకు చేయూతనిచ్చారు.

రోమాంచితం గావించే ఘట్టాలతో నిండిన తన జీవితానికి చెంచయ్య అక్షరరూపం ఇచ్చారు. దాని పేరే ‘నేనూ`నా దేశం’. అందులో ఆమెరికా నుంచి కెనడాకు ఆయన చేసిన సాహసయాత్ర కనిపిస్తుంది. తెలుగు భాషలో వచ్చిన అత్యుత్తమ స్వీయ చరిత్రలలో ఒకటిగా ‘నేనూ`నా దేశం’ పేర్గాంచింది. ఇందులో ఆయన గాడిచర్ల హరిసర్వోత్తమరావు వెల్లూరు జైలులో పడిన కష్టాలను కళ్లకు కట్టారు. ఇలాంటి ఔదార్యం జాతీయోద్యమనేతలు వెలువరించిన జీవిత చరిత్రలు, లేదా ఆత్మకథలలో అరుదుగానే కనిపిస్తుంది. కాబట్టి స్వరాజ్య సమరంలో తమదైన పంథాలో పాల్గొని ఎన్నో త్యాగాలు చేసినప్పటికి స్వరాజ్యంలో చిన్న పదవి కూడా ఆశించకుండా శేషజీవితం నిస్వార్ధంగా, సమాజ సేవలో గడిపిన మహోన్నతులలో చెంచయ్య ఒకరని చరిత్ర గుర్తుంచుకోవాలి.

అహింసతో స్వాతంత్య్ర సాధన సాధ్యంకాదని నమ్మిన అలనాటి తరం యువకులలో తెలుగు ప్రాంతం నుంచి కనిపించే వ్యక్తి అన్నాప్రగడ కామేశ్వరరావు (అక్టోబర్‌ 21, 1902`జనవరి 30, 1987). గుంటూరు పన్నుల సహాయ నిరాకరణోద్యమంలోను, ఉప్పు సత్యాగ్రహంలోను, క్విట్‌ ఇండియా ఉద్యమంలోను పాల్గొని పలుమార్లు కారాగారానికి వెళ్లారు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు తెనాలి నుంచి ఎన్నికయ్యారు.
గుంటూరు జిల్లా ప్రస్తుత నాదెండ్ల మండలం కనుపర్రులో జన్మించారాయన. తండ్రి రోశయ్య, తల్లి లక్ష్మీదేవి. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో చేరారు. వయసు తక్కువ చేసి చెప్పడం వల్ల ఇది సాధ్యమైంది.తక్కువ వయసు ఉండి, గెడ్డాలూ మీసాలూ లేకున్నా సైన్యంలో చేర్చుకున్నారా? ఇందుకు సమాధానం ఔననే! మొదటి ప్రపంచ యుద్ధం ప్రకటించిన తరువాత (1914) ఆంగ్లేయులు పిలుపునిచ్చారు. ఇబ్బడి ముబ్బడిగా సైన్యంలో చేర్చుకున్నారు. దీని మీద ప్రపంచ ప్రఖ్యాత వ్యంగ్యచిత్ర పత్రిక అసాధారణమైన కార్టూన్‌ వేసింది. నిక్కరేసుకుని, గెడ్డాలూ మీసాలూ లేని ఒక కుర్రాడు సైన్యంలో చేరతానని వస్తాడు. ఇవాళ నీకు ఇంకా పదిహేడేళ్లు రాలేదు. రేపటికి వస్తాయి. చేర్చు కుంటాం. అని పరీక్షకుడు చెబుతూ ఉంటాడు. అదే వాస్తవం. ఎందరో బాలలను సైన్యంలో చేర్చుకుని బ్రిటిష్‌వారు సామ్రాజ్య దాహంతో వారి ప్రాణాలు తీశారు.

అలా బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో చేరిన కామేశ్వరరావు 1917లో బాస్రా వెళ్లారు. ఒక తిరుగుబాటును అణచడానికి వెళ్లిన సైనిక దళాలలో ఆయన కూడా ఉన్నారు. ఇంత జాతీయతా స్ఫూర్తి ఉన్న వ్యక్తి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో ఎందుకు చేరారు? రాణి తరఫున సాటి వలసదేశాల అమాయక నిరాయుధుల పైన కూడా తుపాకీ ఎత్తడానికి ఎందుకు సిద్ధమయ్యారు? దాని వెనుక ఒక చారిత్రక దృష్టి ఉంది. ఏ విదేశీయుడి దాడిలో అయినా భారతీయులు ఓడిపోవడానికి కారణం – మన సైనిక నిర్మాణంలో ఉన్న బలహీనత. పురుషోత్తముడి దగ్గర నుంచి రాణా సంగ్రామ్‌, రాణా ప్రతాప్‌ దాకా, కంపెనీ పాలనా కాలంలో 1857 నాటి ఘటనలో ఓటమి వరకు, బ్రిటిష్‌ ఇండియాలో భారతీయులు చేసిన ప్రతిఘటనల వైఫల్యం అంతా సైనికపరమైన లోపాలతోనే. దానిని అధిగమించాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టు తెలుస్తుంది. గోపరాజు నాగేశ్వరరావు రాసిన ‘ఏ బ్యాటిల్‌ స్కార్డ్‌ యోగి’ పుస్తకంలో ఇందుకు సంబంధించిన భావాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది కామేశ్వరరావు పోరాట జీవితం ఆధారంగా రాసిన పుస్తకం. భారతీయులను అణచి ఉంచడానికి భారతీయులకు భారత దేశపు సొమ్ము చెల్లిస్తున్నారన్న స్పృహ ఆయనకు ఉంది. తరువాత సైన్యంలో ఉంటూనే తిరుగుబాటు చేశారు. 1920 బాలగంగాధర తిలక్‌ మరణించినప్పుడు ‘బస్రా టైమ్స్‌’ పత్రిక ప్రచురించిన వ్యాసం కామేశ్వరరావును బాధించింది. తిలక్‌ అంతటి త్యాగమూర్తిని, జాతీయతా స్ఫూర్తి కేంద్రాన్ని దేశద్రోహిగా పేర్కొనడం ఆవేశానికి లోనుచేసింది. ఆ వ్యాసాన్ని ఖండిస్తూ మరొక వ్యాసం రాసి పంపారు. అది వెలువడిన తరువాత సైనిక న్యాయస్థానంలో నిలబడ్డారు. తరువాత చాలా పరిణామాలు జరిగినా సైన్యాన్ని విడిచిపెట్టారు.

1922 జనవరిలో నరసరావులో పేటలో ఆయనను అరెస్టు చేశారు. ఏడాది కారాగార శిక్ష విధించారు. రాజమండ్రి జైలుకు తరలించారు. అక్కడే గదర్‌ పార్టీ నాయకులు పండిత్‌ జగంరామ్‌, గణేశ్‌ రఘురామ్‌, వైశంపాయన్‌లతో పరిచయం ఏర్పడిరది. తాము అహింసాయుత ఉద్యమాన్ని, జాతీయ కాంగ్రెస్‌ పంథాను వ్యతిరేకిస్తున్నప్పటికి ఆ సంస్థ వార్షిక సమావేశాలకు హాజరై సంఫీుభావం ప్రకటించే ఒక రాజకీయ సంస్కృతి ఆనాడు ఉండేదని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కామేశ్వరరావు జీవితంలో అలాంటి ఘటన ఉంది. జైలు నుంచి విడుదలైన తరువాత గౌహతి కాంగ్రెస్‌ సమావేశాలకు వెళ్లారు. కానీ ఆ సమావేశాలు ఆయనను తీవ్ర జాతీయవాద పంథా నుంచి మరల్చలేదు. గాంధీజీని పూర్తిగా వ్యతిరేకించిన వారిని కూడా కలుసుకున్నారు. 1924లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌, వీవీఎస్‌ అయ్యర్‌ల సలహాతో కరాచీ వెళ్లారు. అప్పుడు అక్కడ కోటంరాజు బ్రదర్స్‌ పేరు ప్రఖ్యాతులైన పత్రికా రచయితలలో ఒకరు కోటంరాజు పున్నయ్య ఉన్నారు. ఆయన సహకారంతో బెలూచిస్తాన్‌ వెళ్లి ఉద్యమం నిర్వహించారు. అక్కడి నుంచి బరోడా వచ్చారు. అక్కడే ప్రొఫెసర్‌ మాణిక్యరావు వ్యాయామకళాశాలలో శిక్షణ పొందారు. ఈ క్రమంలోనే భగత్‌సింగ్‌, చంద్రశేఖర ఆజాద్‌, భటుకేశ్వరదత్తు, రాజగురులతో స్నేహం ఏర్పడిరది. బరోడాలో ఉండగానే గుజరాతీ మహిళ సరళాదేవిని వర్ణాంతర వివాహం చేసు కున్నారు. లాహోర్‌ కుట్రకేసులో పోలీసులు అరెస్టు చేయాలని చూడగా, బరోడా సంస్థానాధీశుడు శాయాజీరావ్‌ గైక్వాడ్‌ సాయంతో తప్పించుకున్నారు. కామేశ్వరరావు తన సొంత నేలలో ఆనాడే స్వతంత్ర ప్రభుత్వం నడిపేందుకు సాహసించడం చరిత్రలో చేరవలసిన అంశమనిపిస్తుంది.1931లో కామేశ్వర రావు రహస్యంగా రష్యా చేరుకున్నారు. 1936లో కొత్తపట్నంలో రాజకీయ పాఠశాల నడిపారు. ఈ పాఠశాల ద్వారా యువకులకు విప్లవ భావాలు అందిస్తున్నారన్న ఆరోపణతో జస్టిస్‌ పార్టీ ప్రభుత్వం మూసివేయించింది. జీవితంలో 18 ఏళ్లు అజ్ఞాతం లోనే ఉండిపోయారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ టీజీ రూధర్‌ఫర్డ్‌కు సమస్యగా మారారు. కామేశ్వరరావు నాదెండ్ల ప్రాంతంలో సమాంతర ప్రభుత్వం నడిపారు. తపాలా కార్యాలయం, సొంత కరెన్సీ, స్వతంత్ర పాలన కూడా ఆరంభించారు. 1922లో నాటి గుంటూరు పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు ఆయనను పోలీసులు అరెస్టు చేసినప్పుడు జరిగిన సంఘటన కూడా స్మరించుకోదగినది. ఆ అరెస్టు సమయంలోనే ఆయన తల్లి లక్ష్మీదేవి గొప్ప ఉపన్యాసం ఇచ్చారని ప్రసిద్ధి. నా బిడ్డతో పాటు నేనూ పోరాటం చేస్తాను. నా బిడ్డకు అండగా నిలుస్తాను అని ఆమె ప్రతిజ్ఞ చేశారు.

గుంటూరు జిల్లాలోనే మాచర్ల దగ్గర గల ఎత్తిపోతల వద్ద అన్నాప్రగడ కొద్దికాలం రహస్య జీవితం గడిపారు. భగత్‌సింగ్‌ను తప్పించాలని చూశారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీలో పనిచేసే బీమా ఏజెంటు ఏకే రావు పేరుతో ఒక పాస్‌పోర్టు సంపాదించారు. దానితో భగత్‌సింగ్‌ను విదేశాలకు పంపాలని ఆయన కోరిక. కానీ భగత్‌సింగ్‌ ఇందుకు ఒప్పుకోలేదు. అదే పాస్‌పోర్టుతో అన్నాప్రగడ 1931 సెప్టెంబర్‌ 22న భార్యాపిల్లలతో దక్షిణాఫ్రికా వెళ్లారు. వారిని అక్కడ బంధువుల ఇంట వదిలి వివిధ దేశాలలో జరుగుతున్న గెరిల్లా పోరాట రీతులు అభ్యసించడానికి వెళ్లిపోయారు. 1935-36 ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటికీ త్వరలోనే వారితో విభేదించారు. 1942 క్విట్‌ ఇండియా ఉద్యమంలో చేరారు. స్వాతంత్య్రం వచ్చిన కొద్దికాలానికే దేశంలో ఒక కృత్రిమ రాజకీయ వాతావరణం ఏర్పడిరది. అవి చాలామంది స్వరాజ్య సమరయోధులను ఖిన్నులను చేశాయి. వారికి మౌనం తప్ప గత్యంతరం లేకపోయింది. అలాంటి కలుషిత రాజకీయాల కారణంగా 1956లోనే కామేశ్వరరావు పూనా వెళ్లిపోయారు. అక్కడ కూడా ఆయన చేదు అనుభవాలనే చూడవలసి వచ్చింది. కానీ స్వాతంత్య్రం సమరయోధులకు పింఛన్‌ ఇచ్చే కార్యక్రమంలో కామేశ్వరరావుది కీలకపాత్ర. ఇందిరాగాంధీ ఆదేశాల మేరకు అఖిల భారత స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేశారు. స్వాతంత్య్ర సమరయోధులకు పింఛన్లు ఇప్పించడంలో కృషి చేశారు.

-గోపరాజు

About Author

By editor

Twitter
YOUTUBE