-ఇంద్రాణి మామిడిపల్లి
ఇల్లంతా నిశ్శబ్దం. ఈక కదిలినా శబ్దం వచ్చేంత శూన్యంలా కనిపిస్తూ ఉంది. తెల్లవారుజాము అది. కోడి కూయడానికి కూడా భయపడేటంత శూన్యంలా కనిపించింది. రాహుల్‌ బెడ్‌పైన సాఫీగా పడుకుని ఉన్నాడు. ఇంట్లో అమ్మకూడా ఉంది. వేరే గదిలో తనుకూడా పడుకునిఉంది. ఇంట్లో ఇంకో మేకపిల్లను కూడా వాళ్లు పెంచు కుంటున్నారు. అది పెరటివైపు పడుకుని అక్కడే దానికి కావలసిన గడ్డి తింటూ ఉంటుంది. ఇలా అన్నీ సన్నివేశాలు రాహుల్‌ మెదడులో తిరుగుతూ ఉంటాయి. 41 ఏళ్లవయసున్న వాడు రాహుల్‌. తల్లిది అప్పుడో ఇప్పుడో పోయేలా ఉన్న కొన ఊపిరి ప్రాణం. తండ్రి కూడా లేడు.

పూర్తిగా తెల్లవారింది. రాహుల్‌కి మెళుకువ వచ్చింది. బెడ్‌పక్కనే ఉన్న కిటికీని తెరచి సూర్యుని వంక కోపంగా చూసాడు. ‘‘పనీ పాటా ఏం లేదా నీకు? పొద్దు పొద్దున్నే వస్తావ్‌’’ అన్నట్టుగా..’’ మంచి నిద్రలో ఉన్న, నిద్రలో నా పని చేసుకుంటున్న నన్ను మరీ ఇంత డిస్టబ్‌ చేస్తావెందుకు ‘‘అని. రోజూ చివాట్లు తప్పవు సూర్యుడుకి రాహుల్‌ చేతిలో. రాహుల్‌కి సూర్యుడు అంటే చాలాకోపం. అందర్నీ మేలుకొలుపుతాడు కదా… అందుకే. తల్లికి మాత్రం దిగులు, కొడుకుకి ఇంకా పెళ్లి కాలేదు, పైగా ఏ జాబూ కూడా చేయట్లేదు అని. తన ఆరోగ్యం గురించి తనకు దిగులు లేదు. ఉన్నదంతా ఒక్కగానొక్క తన కొడుకు ఏమైపోతాడో అన్న భయం తప్ప. రాహుల్‌ కోసం, తన తోడుగా ఉన్న భర్త ప్రాణాలు కూడ లెక్కచేయని తల్లి. కొడుకంటే అంత ప్రేమ. రాహుల్‌కి తన ఫోన్‌ అంటే మరీ పిచ్చి. దానితో ఉంటే తనకేం గుర్తు కూడా ఉండదు. తల్లి మనసులో చాలా బెంగ ఉంది. రాహుల్‌ ఎప్పుడూ తన తల్లిని బాగా గమనిస్తూ ఉంటాడు, తన తల్లికి ఎందుకు అంత బెంగ తనపై అని. కానీ ఎప్పుడూ రాహుల్‌కి అది అంతుపట్టని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి సమాధానం వెతికే ప్రయత్నం ఎప్పుడూ తాను చేయలేదు కూడా. అమ్మను ఎలాగైనా సంతోష పెట్టాలని ఆలోచనలు బాగా మెదడులో వ్యాపిం చాయి. ఫోన్‌ చేతిలోకి తీసుకుని ఏదో వెతకడం మొదలు పెట్టాడు. ఫోన్‌ చేతిలోకి రాగానే నిద్రలోకి జారుకున్నాడు. మళ్లీ తలలోకి ఏవో ఆలోచనలుౌౌ ఏదో చేసేయాలన్నంత ఆశ గుండె వేగాన్ని పెంచింది. అలాగే పడుకున్నాడు…….

కొంచెం సేపటికి లేచి, చుట్టూ అంతా చూసాడు. టేబుల్‌పైన గ్లాసు ఉంది. ఆ గ్లాసుపై స్టీలు గిన్నె బోర్లించి ఉంది. గిన్నెపై ఒక టాబ్లెట్‌ ఉంది. గ్లాస్‌ పక్కనే తన వాచ్‌ ఉంది, తీసి చేతికి తగిలించి ముఖం మీద నీళ్లు చల్లి అద్దంలో కాస్త తన చామన ఛాయరంగు ఉన్న ముఖాన్ని చూసి చిరునవ్వు నవ్వి, నెత్తిమీద నెరిసిపోతున్న జుట్టును చూసి చిన్న నిట్టూర్పుతో వెనక్కితిరిగి బయటకు బయలుదేరాడు. ఇల్లు దాటడానికి ముందు ఒకసారి తల్లిగదిలోకి తొంగిచూసి, నిద్రిస్తున్న తల్లిని చూసి, బజారులోకి బయలుదేరాడు. చుట్టూ వెతికాడు చేయడానికి ఏమీ కనిపించడంలేదు. చుట్టూ మళ్లీ చూసాడు పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి కూడా కనిపించలేదు. నిరాశ పెదాల పైకి వచ్చి పెదవి విరుచుకుని వెనక్కి తిరిగాడు. పెద్దగా చదువు కూడా తనకి రాలేదు అనే నిరాశ మళ్లీ కమ్ముకుంది అతనిలో. ఛీ అంటూ సమాజాన్ని చూశాడు. ఏం పని చేయాలో అసలే అర్థం కాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి పెరటిలోకి వచ్చి చూశాడు. మేక కనిపించిది. అది తనకి ఎప్పుడూ ఏ విధంగా కూడా ఉపయోగపడిరదే లేదు అని ఆలోచిస్తూ దాన్ని తీసుకొని అమ్మడానికి పోయాడు. దాన్ని అమ్మితే 2000 రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో అమ్మకి కావాల్సిన మందులను తెచ్చాడు. అమ్మకి ఇచ్చాడు. అయిన అమ్మ కళ్లలో ఇంకా బెంగ కనిపిస్తూనే ఉంది. అమ్మకి పూర్తిగా నయం చేయించాలి అనుకున్నాడు. ఉన్న పెరటినీ అమ్ముదాం అనుకున్నాడు. కానీ ఆ పెరడు తనది కాదు, ఆ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్న ఇల్లు అని గుర్తువచ్చి ఆగిపోయాడు. ప్రతినెల తల్లికి వచ్చే పింఛన్‌ డబ్బుతో ఇంటిఅద్దె సరిపోతుంది అని గ్రహించాడు. మళ్లీ తిరిగి తన రూమ్‌కి వెళ్లి పడుకున్నాడు. ఇంకా ఆలోచించాడు. అమ్మ ఇంకా అలాగే ఉంది తన మొహంలో నవ్వులేదు. అని అలాగే పడుకున్నాడు..

మళ్లీ కాసేపయ్యాక లేచి చుట్టూ చూసాడు. అమ్మకి ఒక మంచి కోడలు కావాలని అనుకున్నాడు. కానీ తన వయసున్న వాడికి ఎవరు పిల్లని ఇస్తారు అని అనుకున్నాడు. కానీ రాత్రి చూసిన సీరియల్స్‌ గుర్తువచ్చి, ముసలాయనకి కూడా పెళ్లి జరిగింది, నాకెందుకు జరగదు అని మళ్లీ బయటకు పోయాడు. రోడ్డుపక్కన ఒకచిన్న టీకొట్టు దగ్గర ఒక అమ్మాయి అడుక్కుంటూ కనిపించిది. పక్కనే ఒక పూల వ్యాపారం కూడా జరుగుతుంది. చూడటానికి చాలా అందంగా ఉంది, అచ్చం పూలలాగానే ఇంకా పెళ్లి కూడా అయినట్టు లేదు అనుకుని కొన్ని పూలు కూడా కొన్నాడు. ఆ పూలు ఆ అమ్మాయి జడలో ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకున్నాడు. కళ్లలోకి సిగ్గు ఆవహించి ఉంది. వెంటనే తన చేయి పట్టుకొని తనతో వచ్చేయమని, తనకి భార్య కమ్మంటూ, తన తల్లికి కోడలు కమ్మంటూ….. తన ఇంటికి ఇల్లాలు కావాలంటూ ఇంటికి తీసుకొనిపోయాడు. తన తల్లికి కోడలు వచ్చిందని చెప్పి, తన భార్యను అందంగా ముస్తాబు చేసి అమ్మ దగ్గరికి తీసుకుపోయాడు. కానీ ఇంకా అమ్మ కళ్లల్లో మాత్రం బెంగపోలేదు. భార్యను గదిలోకి తీసుకుపోయి, ఇద్దరూ బెడ్‌పైన కూర్చు న్నారు… అమ్మ మొహాన్ని ఇంకా గుర్తుకి తెచ్చు కున్నాడు. భార్య ఏమి మాట్లాడలేదు. మౌనం పాటించింది. భర్త వంక చూసింది. అలసటగా ఉంది అన్న అర్థాన్ని మొహంలో చూపించి బెడ్‌పై ఒరిగింది. రాహుల్‌కి అలాగే ఉంది. కానీ ఏంచేస్తే అమ్మ మళ్లీ మామూలుగా మారుతుంది అనీ ఆలోచిస్తున్నాడు. అప్పుడు మళ్లీ ఇంకో ఆలోచన వచ్చింది. అమ్మకి ఒక మనవడో, మనమరాలో కావాలేమో అను కున్నాడు. నిద్రపోతున్న భార్యని లేపి సంగతి చెప్పాడు. సిగ్గుతో భర్తని దగ్గరకి తీసుకుంది. ఇద్దరూ సంగ మించారు. ఒకగంట దాటింది. ఇంకా నిద్రలోనే ఉన్నారు. రాహుల్‌కి ఇంతలో మెలుకువ వచ్చింది. గట్టిగా కౌగిలించుకొని పడుకున్న భార్యని చూసి లేవాలనిపించలేదు. అలాగే నిద్రపోయాడు…

తెల్లవారింది అనిపించింది రాహుల్‌కి. బెడ్‌పై చూసాడు. తన భార్య కనిపించలేదు. స్నానంకి వెళ్లిందేమో అనుకున్నాడు. తను తొందరగా లేచాడు. అమ్మ గదిలోకి వెళ్ళాడు రాహుల్‌. అమ్మ ఎప్పుడో లేచి పనులన్నీ అయిపోయి మళ్లీ పడుకుంది కూడా… రాహుల్‌ మొహంలో సిగ్గు తొణికిస లాడుతుంది. అయినా తల్లి కళ్లలో ఏదో బెంగ ఇంకా కనిపిస్తూనే ఉంది.. ఎందుకో ఇంకా అర్థంకావడం లేదు. మళ్లీ నిరాశతో తన రూంలోకి వెళ్లి బెడ్‌పై కూర్చున్నాడు. ఫోన్‌ తీసు కున్నాడు. తనకి రోజూ జరిగింది రాయడం అలవాటు. ఆరోజు జరిగింది కూడా అందులో రాశాడు. ఎప్పటికప్పుడు అలా అన్ని రాస్తూ ఉంటాడు. ఇది తన తల్లి దగ్గర నుండి నేర్చుకున్నాడు. అమ్మకి కూడా అలవాటే. రాహుల్‌కి మళ్లీ ఏమీ అర్థం కాలేదు. భార్యకోసం చూసాడు. ఎక్కడాలేదు. బజారుకి గానీ వెళ్లిందేమో అను కున్నాడు. ఫోన్‌ని చూస్తూ ఉన్నాడు నిద్ర ముంచు కొచ్చింది రాహుల్‌కి. అలాగే నిద్రలోకి జారుకున్నాడు…

చుట్టూ ఏదో అలికిడి. ఏవో కూతలు విని పిస్తున్నాయి. తొందరగా మెలుకువ వచ్చింది. కానీ చూస్తే ఏమీలేదు. భార్య కనిపించింది. ఒక్క సారిగా లేచి హత్తుకున్నాడు. ఎక్కడికి పోయావు నువ్వు అని… చిరునవ్వు నవ్వి, పొద్దున్నే మార్కెట్కి వెళ్లాను అని చెప్పింది. అమ్మని చూసు కున్నావా అని అడిగాడు. చూసుకున్నాను అన్నట్టుగా తల ఊపింది. సరేలే అమ్మ ఐతే బాగానే ఉందిగా అనుకున్నాడు. ఫోను మళ్లీ చేతిలోకి తీసుకున్నాడు వెంటనే నిద్రపోయాడు…

యధావిధిగా తెల్లవారింది. తన బెడ్‌పక్కన ఉన్న కిటికీ తెరుస్తూ సూర్యుడిని తిట్టడం స్టార్ట్‌చేసాడు రాహుల్‌.’’ నాకు భార్య వచ్చాక కూడా నీవు తొందరగానే వేస్తే ఎలా అయ్యా..’’ అని నాలుగు చివాట్లు పెట్టాడు. భార్యను పిలిచాడు. రాలేదు ఎంతకూ. పిలుస్తూనే ఉన్నాడు. అయినా రాలేదు. కోపం ముంచెత్తు కొచ్చింది. కిచెన్లోకి వెళ్లాడు అక్కడాలేదు. అమ్మతో ఉందేమో అనుకున్నాడు. అమ్మ గదిలోకి పోయాడు. అక్కడా కూడా లేదు. ఎక్కడికి వెళ్లిందో అని ఆలోచించే లోపే ఇంకో విషయం గమనించాడు. బెడ్‌పైన అమ్మ కూడా లేదూ….

ఒక్కసారిగా కళ్లు మళ్లీ అటువైపు తిప్పాడు. కనిపించలేదు. పెరటిలో వెతికాడు. అక్కడాలేదు. మళ్లీ అక్కడ కూడా ఒకవిషయం గమనించాడు. పెరటిలో కట్టేసిన మేక అక్కడే ఉంది. అమ్మి అమ్మకి మందులు తెచ్చానుగా అనుకున్నాడు. బుర్ర తిరిగిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బజారుకి కూడా వెళ్లాడు. రోడ్డుపక్కనే ఉన్న టీకొట్టు పక్కనే పూలు అమ్మే షాపు ఉంది. అక్కడ ఇంకో విషయాన్ని కూడా చూసాడు. ఆ పూలు అమ్మే షాపు పక్కనే ఒక మహిళ అడుక్కుంటూ కనిపించింది. ఆమే తనభార్య అని గ్రహించాడు. అక్కడికి వెళ్లేలోపే ఇంకొక ఆయన వచ్చి తన భుజాలపై చేయి వేసి తనకి ప్రేమగా అన్నం తినిపిస్తున్నాడు. చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడికి వెళ్లి గొడవ చేశాడు. ఆయనెవరో తనకు తెలియనే తెలియదు అంటూ మొత్తుకుంది.

కొట్టి ఇంటికి పంపారు. ఏ జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. విషయం పోలీసుల దాకా పోయింది. రాహుల్‌ గురించి అందర్నీ అడిగారు. కానీ ఒక్కరూ కూడా రాహుల్‌ ఎవరో చెప్పలేదు. అసలు రాహుల్‌ ఎప్పుడూ బయట కనిపించలేదని చెప్పారు. పిచ్చి లేచినట్లయింది రాహుల్‌కి. ముచ్చెమటలు పట్టాయి. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. అడుగులు వేస్తే తడబడుతూ ఉన్నాయి. చేతులకి స్పర్శ తెలీకుండా ఉంది. వెంటనే ఇంటికి వెళ్లి తన ఫోన్‌ని తెరిచాడు. ఫోన్‌ చూడగానే నిద్ర వచ్చినట్లయింది. అందులో తాను రాసుకున్న డైరీ ఉందని చూడపోయాడు. కానీ అది చూస్తేనే తనకి నిద్రవచ్చే జబ్బు ఉందని తెలీదు తనకు. వెంటనే అమ్మ గదిలోకి వెళ్లాడు. అమ్మ డైరీ ఓపెన్‌ చేశాడు. అమ్మడైరీ 5 నెల క్రితం ముందు రాసి ఉంది. తను ఒక్కరోజు కూడా రాయకుండా ఉండదు కదా అనుకొన్నాడు. ఆఖరి సమయంలో అమ్మడైరీలో ఇలా ఉంది’’. గొంతు పూర్తిగా ఎండిపోయింది. లేవడానికి సత్తువ కూడా లేదు. కనీసం రాయడానికైన వస్తున్నందుకు సంతోషం. నా గారాల కొడుకు రాహుల్‌. వాడికి చిన్ననాటి నుండి ఫోన్‌ చూస్తే నిద్రవచ్చే రోగం ఉందని నాకుతప్ప, చనిపోయిన నా భర్తకి కూడా తెలీదు. చిన్ననాడు వాడికి, మేం పనికి పోయేటప్పుడు చేతిలో ఫోన్‌పెట్టి పోయినప్పుడు వాడు చాలా బాగా ఆడుకోవడం చూసాం. అదే వాడికి అలవాటైంది. ఆఖరికి అది జబ్బుగా మారిందని తెలిసే సమయానికి పరిస్థితి చేతిలోలేదు. ఆ బెంగతోనే వాడి చిన్న వయసులోనే వాళ్ల నాన్నగారు మరణించారు.

ప్రతిరోజూ రాహుల్‌ దగ్గరకి వచ్చి చూసినప్పుడు మేం వాడికి ఏ మంచి చేయలేక పోతున్నాం అని బెంగ కళ్లలోఉండేది. తను ఆ ఫోన్లో చూడటం, నిద్రపోవడం, వాడు చేయాలనుకున్న పని నిద్రలోనే చేయడం వాడికి అలవాటైంది. నాకు మందులు అవసరమైనప్పుడు కూడా వాడు తెచ్చానేమో అనుకున్నాడు. కానీ వాడు తెచ్చాడనే వాడికి తెలుసు. కానీ నిజం నాకు మాత్రమే తెలుసు. ఆ మందులు వేసుకుంటే గానీ నేను బతకను. అని వాడికి కూడా తెలుసు.

వాడి దృష్టిలో వాడు నాకు మందులు తెచ్చాడు, పెళ్లిచేసుకున్నాడు, మేకనీఅమ్మాడు, తండ్రి కూడా కాబోతున్నాడు.. కానీ వాడు నిద్రలో మాత్రమే ఉన్నాడని నాకు మాత్రమే తెలుసు. ఇంతటి దౌర్భాగ్యం అనుభవించాను ఇన్నిరోజులు. ఇక ఈ బాధకి నాకు విముక్తి కలుగుతుందేమో అని అనుకుంటున్న…

బతికితే రేపు కూడా ఈ డైరీలో ఇంకో పేజి ఉంటుంది. లేదంటే ఇదే ఆఖరి పేజి అవుతుంది’’ ఆ డైరీ చదువుతున్నంత సేపు రాహుల్‌ కళ్లల్లో నీళ్లు జలపాతంలా ఉబికాయి. డైరీని పక్కన పెట్టి తన గదిలోకి వెళ్లాడు. మోహాన్ని అద్దంలో చూస్తు న్నాడు. నిరాశనిండిరది. తనపక్కన ఉన్న ఫోన్‌ను తగలబెట్టి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకొని వెళ్లిపోయాడు. ఆ మేకపిల్ల మాత్రమే తన చేతిలో ఉంది. గమ్యం తన కాళ్లకి మాత్రమే తెలుసు. తన మెదడు ఆలోచించడం మానేసింది..

About Author

By editor

Twitter
YOUTUBE