సత్యం సత్యం పునస్సత్యం వేదశాస్త్రార్ధ నిర్ణయః ।
పూజనీయా పరాశక్తిః నిర్గుణాసగుణాధవా ।।
ఏదీ ఏమైననూ, సగుణమైననూ, నిర్గుణమైననూ పరాశక్తి ఒక్కటియే పూజింపదగినదనియు, వేదశాస్త్రములలో ఈ అంశమే తెలుపబడినదనియు కాళికాపురాణోక్తి. ఆ పరాశక్తియే జగత్తుకు మూలాధారమైన తల్లి శ్రీ లలితాపరాభట్టారికా. ఆ తల్లి చేతనే ఎల్ల లోకములు పరిపాలింపబడుతూ పోషింపబడుతున్నవి. ఆమె స్తనద్వయమున నిండిన సుధాబిందువులే లోకాన బిడ్డల జీవికకు ఆశ్రయములౌతున్నవి. అందువల్లనే లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా । స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా ।। అని పలు విధములుగా స్తోత్రకారులు జగజ్జననిని ప్రస్తుతించినారు. ఆ జగజ్జనని ప్రతిరూపమే తల్లి. సృష్టిలో పుట్టబడిన ప్రతి ప్రాణికి ఆదిగురువు తల్లియే. వేదములకు ప్రణవ స్వరూపమైన ఓం కారము ఏ ప్రకారంగా ఆది యందు నిలచి శోభిల్లునో అదే రీతిన తెలుగు వర్ణక్రమము అమ్మ అను పదముతో మనోహరముగా శోభిల్లుచున్నది.
తల్లికి గౌరవాన్ని, పప్రథమస్థానాన్ని ఇచ్చి మాతృదేవోభవ అని పూజించి మాతృవైశిష్ట్యాన్ని నలుదిశలా చాటినది మన భారతీయ సంస్కృతి. అందువల్లనే మన పూర్వీకులు యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని మాతృమూర్తి వైభవాన్ని వేనోళ్ల ప్రశంసించారు. సృష్టిలోని ప్రతి జీవిలోనూ మాతృత్వం దాగి ఉన్నదనే విషయము అక్షరసత్యము మరియు నిర్వివాదాంశము. దానికి తార్కాణములే
యా దేవీ సర్వభూతేషు
మాతృరూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై
నమస్తస్యై నమో నమః ।।
అని చెప్పినవి మన స్తోత్రాది సమస్త వాఙ్మయములు.
మానవుడు తీసుకొనే ఆహారాన్ని బట్టి అతనికి సాత్విక, రాజస లేదా తామస ప్రవృత్తులు ఏర్పడుతున్నవి. కానీ బాల్యావస్థలో తల్లి వద్ద సేవించిన క్షీరము ఎన్నడూ తామసిక, రాజసిక ప్రవృత్తులను కలిగించదు. కాళిదాసభాసాది మహాకవులు సైతము తాము బాల్యమున త్రాగిన తల్లిపాలు మరియు సరస్వతీ స్తనద్వయ సేవనములే తమ పాండిత్యమునకు కారణమని తలంచి మాతృస్తన్య విశిష్టతను తమ రచనలలో కీర్తించి జీవన సార్థకతను, కీర్తిని పొందినారు. అటువంటి తల్లి వద్ద పాలు త్రాగుటవల్ల బిడ్డకు సరైన పోషకాలు అంది శారీరిక మానసిక ఎదుగుదల ఏర్పడుతున్నదని నేడు విదేశీయులు పరిశోధించి చెబితే విని ఆశ్చర్యపోయే స్థాయికి చేరినారు మన భారతీయులు. శరీరంలోని రోగ నిరోధక శక్తి తగ్గిననాడు బాల్యంలో తల్లి వద్ద తీసుకొన్న క్షీరమే రోగ నిరోధక శక్తిని వృద్ధి చేస్తున్నదని పరిశోధకుల సత్యదూరము కాని అభిప్రాయము.
బాలుడు అంటే ఎవరు ? శిశువు అంటే ఎవరు అనే ప్రశ్నకి మన పూర్వీకులు తల్లిపాలు తీసుకొనే వానిని శిశువుగా, ఆ స్తన్యపానపు స్థాయిని దాటి ఎదిగినవానిని బాలునిగా చెప్పినారు. జన్మనిచ్చినది మొదలు నడక నేర్చేదాకా తన ఒడిలో లాలించి పాలించేది తల్లి మాత్రమే. ఆ కారణం చేతనే జగద్గురు శంకరభగవత్పాదులు వారి రచనలలో ఒకటైన మాతృపంచకంలో
ఆస్తాం తావదియం ప్రసూతిసమయే
దుర్వార శూలవ్యథా ।
నైరుచ్యం తనుశోషణం మలమయూ
శయ్యా చ సాంవత్సరీ ।।
ఏకస్వాపి న గర్భభారభరణ
క్లేశస్య యస్య క్షమో।
దాతుం నిష్కృతిమున్నతో -పి
తనయ తస్యై జనన్యై నమః।।
అంటూ సంవత్సర కాలపర్యంతం బిడ్డ మలమూత్రాల మధ్య నిద్రిస్తూ, ఆ బిడ్డకు తాను ఇచ్చే పాలలో ఆనందాన్ని వెతుక్కునే మాతృహృదయాన్ని, తల్లి యొక్క ప్రేమను స్పష్టపరిచారు.
ఆధునికసమాజంలో వింతపోకడలకు లోనై శిశువులను తల్లిపాల నుండి దూరం పెట్టడము సర్వత్ర అధికముగా గమనిస్తున్నాము. డబ్బాపాలనే గొప్పవిగా భావించి, వాటిని శిశువులకు ఇచ్చే ఈ దుశ్చర్య అవశ్యం ఖండనీయము, నిర్హేతుకము మరియు అయుక్తము. ఇతఃపరమైనను మన భారతీయ స్త్రీలు అందునా మాతృమూర్తులు తమకు ఆ పరమేశ్వరి అనుగ్రహంతో లభ్యమైన అమృతతుల్యమైన క్షీరమును సంతతికి ఇచ్చి వారికి ఆయురారోగ్యములు కలిగించుదురని, మాతృస్థానమునకు వన్నె తెచ్చుదురని ఆకాంక్షిస్తూ శ్రీ శారదాచంద్రమౌళీ శ్వర స్మరణపూర్వకముగా ఎల్లఱకు అస్మదాశీసులు అందిస్తున్నాము.
– శ్రీమభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీస్వామి శ్రీచరణులు
జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానాధీశులు