– ఎం.‌వి.ఆర్‌. ‌శాస్త్రి

అది అప్పటిదాకా ఎవరూ కలనైనా ఊహించని సాహసం.

సైన్యంలో ప్రత్యేక మహిళా దళమనేది ప్రపంచ సైనిక చరిత్రలో అపూర్వం.

ఎనభై ఏళ్ల కింద – ఆడది ఇంటి చాకిరీ చెయ్యటానికీ, పిల్లల్ని కనటానికీ, మగవాడి అండలో అణగి మణగి ఉండటానికీ తప్ప ఎందుకూ పనికిరాదనుకునే కాలంలో… కండలు పెంచిన మగధీరులకు మాత్రమే ప్రవేశం ఉన్న సాయుధ సైన్యంలో అబలలకు పురుషులతో సమానంగా చోటు ఇవ్వాలన్న సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఆలోచనే అద్భుతం.

ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో మహిళకు ప్రత్యేక రెజిమెంటు ఉండాలన్నది బోస్‌కు తూర్పుకు చేరాక తట్టిన మెరపు ఊహ కాదు. సబ్‌మెరైన్‌లో చేసిన దీర్ఘ ప్రయాణంలోనే అబిద్‌ ‌హుస్సేన్‌కు ఆ విషయం చెప్పాడు. దాని మీద సముద్రయానంలో చాలా కసరత్తు చేశాడు. 1857 యుద్ధంలో ఝాన్సీ రాణిలా కత్తిపట్టి వీరవిహారం చేయగల మహిళలతో జాతీయసేనలో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయదలచినట్టు సింగపూర్‌ ‌చేరిన వారానికి (జూలై 9న) సింగపూర్‌ ‌బహిరంగ సభలో నేతాజీ ప్రకటించాడు. ఆ ప్రసంగాన్ని ఒక మూలకూచుని విని విశేషంగా ప్రభావితమైన వారిలో డాక్టర్‌ ‌లక్ష్మి స్వామినాథన్‌ ఒకరు. ఆమె ప్రవాస భారతీయురాలు. సింగపూర్‌ ఊరి మధ్యలో క్లినిక్‌ ‌పెట్టి గైనకాలజీ, జనరల్‌ ‌ప్రాక్టీసు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నది. తీరిక సమయాల్లో ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ‌కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేది. అందగత్తె. అప్పటికింకా పెళ్ళికాలేదు. మహిళలు తుపాకీ పట్టి దేశ విముక్తి కోసం పోరాడాలన్న బోస్‌ ‌పిలుపు ఆమెకు ఎంతో నచ్చింది. ఆ రాత్రంతా నిద్రపోకుండా దానిగురించే ఆలోచిస్తూండి పోయింది.

మహిళా దళం ఆలోచనను ముందుకు తీసుకు వెళ్ళటం కోసం రెండు రోజుల తరవాత ఇండి పెండెన్స్ ‌లీగ్‌ ఆధ్వర్యంలో మహిళాసభ జరిగింది. దానికి ముఖ్య అతిథి బోస్‌. అం‌దులో మహిళలచేతే సైనిక వందనం చేయించి నాయకుడిని సర్ప్రైజ్‌ ‌చేద్దాం, నువ్వు సహాయం చేస్తావా అని లక్ష్మిని అడిగాడు లీగ్‌ ‌స్థానిక అధ్యక్షుడు ఎల్లప్ప. ఆమె సరేనని తెగ ప్రయత్నిస్తే 20 మంది మహిళలు దొరికారు. ఐఎన్‌ఎ ‌వారిని అడిగి రైఫిళ్లు అరువు తీసుకున్నారు. ఇద్దరు హవిల్దార్లను పట్టుకుని రెండు రోజులు కష్టపడి డ్రిల్‌ ‌నేర్చుకున్నారు, యూనిఫాంల తయారీకి వ్యవధి లేదు. చీరకొంగు నడుముకు బిగించి 20 మందీ సభలో కవాతు చేసి ప్రియతమ నాయకుడికి సైనిక వందనం అర్పించారు. బోస్‌ ‌చాలా సంతోషించాడు. స్త్రీలు తలచుకుంటే ఏమైనా సాధించగలరనటానికి ఇదే దృష్టాంతమని తన ప్రసంగంలో మెచ్చుకున్నాడు.

మరునాడు ఉదయం జాన్‌ ‌థివీ డాక్టర్‌ ‌లక్ష్మి ఇంటికి వచ్చాడు. మద్రాసులో ఉండగా లక్ష్మి కుటుంబంతో అతడికి బాగా స్నేహం. మహిళా రెజిమెంటును నడిపించటానికి సరైన మనిషి కోసం నేతాజీ చూస్తున్నాడు. నేను, ఎల్లప్ప నీ పేరు సూచించాము. నీకు ఇష్టమేనా అని అతడు అడిగాడు. లక్ష్మి వెంటనే ఆనందంగా ఒప్పుకుంది. ఆ సాయంత్రమే ఆమె నేతాజీని కలవటానికి థివీ ఏర్పాటు చేశాడు.

నగరానికి తూర్పున బీచ్‌ ఎదురుగా ఉన్న బోస్‌ ‌నివాసానికి ఆ సాయంత్రం డాక్టర్‌ ‌లక్ష్మి వెళ్ళేసరికే విజిటర్లు చాలామంది నాయకుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కూడా ఇంటర్వ్యూలు సాగుతూనే ఉంటాయి. సావకాశంగా మాట్లాడటం కోసం లక్ష్మికి పెందరాళే సమయం కేటాయించారు. ఆ పూట అభిమాన నాయకుడితో తొలి కలయిక లక్ష్మి మనసులో చెరగని ముద్ర వేసింది. ఆమె జీవితాన్నే మార్చివేసింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే-

I don’t think I have ever been so impressed by another person as I was by him. He asked me whether I would be willing to take up the job he had in mind. “What I am asking of you is not a small thing” he said. I don’t think I want to have this women’s regiment simply as a showpiece. After training you people I intend to send you to Burma. You’ll have to fight in the jungles of Burma. And it won’t be easy there, because the Allied forces are gathering strength.So think it over very carefully.

(ఆయన లాగా నన్ను ప్రభావితం చేసిన వ్యక్తి వేరొకరు లేరు. తాను ఉద్దేశించిన బాధ్యత స్వీకరించ టానికి సిద్ధమేనా – అని ఆయన నన్ను అడిగాడు. ‘‘నేను చేయమంటున్నది చిన్న విషయం కాదు. మహిళా రెజిమెంటును నేను పెడుతున్నది ఒక షో పీసు లా చూపెట్టుకోవటానికి కాదు. ట్రెయినింగు తరవాత మిమ్మల్ని బర్మా పంపాలనుకుంటున్నాను. బర్మా అడవుల్లో మీరు యుద్ధం చెయ్యాలి. అది తేలిక పని కాదు. మిత్ర రాజ్యాలు బాగా బలం పుంజు కుంటున్నాయి. జాగ్రత్తగా ఆలోచించి చెప్పు.’’)

‘‘మళ్ళీ అలోచించుకోవలసిన అవసరం ఏమీ లేదండి. కేతే బిల్డింగ్‌ ‌సభలో మొదటిసారి మీ మాటలు విన్నప్పుడే మీరు ఏమి చెపితే అది చేయాలని నేను నిశ్చయించుకున్నాను. పని ఎప్పుడు మొదలు పెట్టాలి?’’ అని అడిగింది డాక్టర్‌ ‌లక్ష్మి.

‘‘రేపే’’ అన్నాడు నేతాజీ. తిరిగి వెళ్ళగానే లక్ష్మి క్లినిక్‌ ‌పని కట్టేసింది. మర్నాడు స్టాఫ్‌ ‌కారు వచ్చి చాన్సరీ లేన్‌లోని ఐఎన్‌ఎ ‌హెడ్‌ ‌క్వార్టర్స్‌లో అప్పటి కప్పుడు ఏర్పరిచిన ఆఫీసుకు ఆమెను తీసుకు వెళ్ళింది. ఆమె వెంటనే పనిలోకి దిగింది. డాక్టర్‌ ‌లక్ష్మి ఇకపై కెప్టెన్‌ ‌లక్ష్మి.

[The Forgotten Army, Peter Ward Fay, P. 218 ]

మొట్టమొదటి పని కొత్త దళంలోకి మహిళలను రిక్రూట్‌ ‌చెయ్యటం. అన్నిటికంటే అదే పెద్ద కష్టం. వంటింటికి పరిమితం అయితే చాలు అని అనుకోబడే ఆడది గడప దాటి మగవాళ్ళతో సమానంగా రాజకీయ పోరాటాలు చెయ్యటం పురుషాహంకార సమాజం దృష్టిలో సహించరాని తెంపరితనం. సుకుమారపు స్త్రీలు తుపాకులు పట్టి సైన్యంలో చేరటమనేది ఎంతటి ఉదారులైనా అనుమతించ జాలని దుస్సాహసం. ఇష్టం ఉన్న స్త్రీలలో కూడా చాలామందికి ఇల్లు వదిలి వెళ్లేందుకు కుటుంబ, ఆర్ధిక పరిస్థితులు అనుకూలించవు. ఎప్పుడో ఒక సభకు వెళ్ళటం, ఏదో ఉద్యమ కార్యక్రమంలో కాసేపో, ఒక రోజో పాలు పంచుకోవటం వేరు. చావటానికి, శత్రువుకు చిక్కితే చిత్రహింసలకు సిద్ధపడి, తిండి లేకుండా అడవుల్లో, కొండల్లో యుద్ధానికి కదలటం వేరు. అంతటి ధైర్యం, స్థైర్యం ఎవరికో తప్ప ఉండవు.

అన్నీ తెలిసీ లక్ష్మి ఉత్సాహంగా కార్యరంగంలోకి దిగింది. సైనిక వందనంలో స్వచ్ఛందంగా పాల్గొన్న 20 మంది ఎగువ మధ్య తరగతి ఇంతులను మొదట కలిసింది. వారిలో 15 మంది అక్కడికక్కడే సంతకాలు చేశారు. పసిబిడ్డలు ఉండటం వల్ల ఐదుగురు చేరలేకపోయారు. (బిడ్డ తల్లులను నిబంధనలు అనుమతించవు.) బిడ్డల బాధ్యత లేని దంపతులు నేతాజీ నింపిన దేశభక్తి స్ఫూర్తితో ముందుకొచ్చి భర్త రెగ్యులర్‌ ‌సైన్యంలో, భార్య మహిళా దళంలో చేరిన ఉదంతాలూ ఉన్నాయి. మెల్లిగా సంఖ్య పెరిగి వారం తిరిగేసరికి 50 అయింది. నేతాజీ కూడా ఆగ్నేయా సియాలో విస్తృతంగా తిరిగి సైనిక సమీకరణ చేశాడు. ఆయన ప్రేరణతో ఉత్తేజితులైన వారు ఒక్కొక్కరిదీ రసవత్తరమైన కథ.

జానకి దేవర్‌ ఉం‌డేది కౌలాలంపూర్‌లో. వయసు 17. ఆమె తండ్రి దక్షిణ భారతం నుంచి మలయాకి వలస వచ్చి పాడి వ్యాపారం చేస్తున్న సంపన్నుడు. ఝాన్సీ రాణి రెజిమెంటు సంగతి జానకి వార్తాపత్రికలో చదివింది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. కొన్నాళ్ళకు సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌కౌలాలంపూర్‌ ‌వచ్చాడు. ఫలానా సమయంలో ఆయన సభ అని జానకి పేపర్లో చదివింది. ఏమైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంది. తరవాత?

‘‘అమ్మకు తెలిస్తే వెళ్ళనివ్వదు. అందుకని నేను ఇంట్లోనే ఉన్నట్టు కవర్‌ ‌చెయ్యమని మా వంటవాడిని బతిమిలాడుకుని, ఎవరికీ చెప్పకుండా సైకిల్‌ ‌మీద వెళ్ళాను. సభాస్థలి సమీపాన సైకిల్‌ ఆపి వేదిక దగ్గరికి వెళ్లి నేతాజీ మాటలు శ్రద్ధగా విన్నాను. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడటానికి మహిళా సైనిక దళం ప్రారంభించామని ఆయన చెబుతూంటే నాకు వొళ్ళు పులకరించింది. అందులో నేను చేరి తీరాలని అక్కడే అనుకున్నాను. ఉపన్యాసం చివరలో నేతాజీ స్వాతంత్య్ర పోరాటానికి మీరు ఇవ్వగలిగిన డబ్బు, నగలు, వగైరా ఏవైనా ఇమ్మని పిలుపు ఇచ్చాడు. అందరిలాగే నేనూ వేదిక మీదికి వెళ్లాను. నా చెవుల దిద్దులు తీసి నేతాజీ చేతిలో పెట్టాను. అది అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్‌ ‌కంటపడిందని నాకు తెలియదు. ఇంటికి వెళ్ళాక భయం. ఒక దిద్దు అయితే ఎక్కడో పోయిందని బుకాయించవచ్చు. రెండూ పోయాయంటే ఎవరు నమ్ముతారు? ఆకలిగా ఉన్నా పట్టుబడతానన్న భయంతో అందరితో కలిసి భోజనం చేయకుండా పడుకున్నాను.

మర్నాడు పొద్దున మా నాన్న పేపర్‌ ‌చదువు తున్నాడు. నేను చెవిదిద్దులు నేతాజీ చేతిలో పెడుతున్న బొమ్మ మొదటి పేజీలోనే ఉంది. చూసి కూడా నాన్న ఏమీ అనకుండా పేపరు తీసి షెల్ఫులో పెట్టాడు. అంతలో మా అక్క అటు వచ్చి పేపరు చూసి ‘అమ్మా చూడు జానకి ఏమి చేసిందో’ అని అరిచింది. మా అమ్మ నన్ను కొట్టబోయింది. ‘ఏదో అయిందిలే. ఇక ఊరుకో’ అని వారించాడు నాన్న. దాంతో మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడని ధైర్యం వచ్చింది.

కొద్ది రోజులకు కెప్టెన్‌ ‌లక్ష్మి కౌలాలంపూర్‌ ‌వచ్చి ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ‌కార్యాలయంలో బస చేసింది. లీగ్‌ ‌స్థానిక అధ్యక్షుడు మా నాన్న స్నేహితుడు. ఆమెను టీకి పిలుద్దామా అని నేను అడిగితే మా నాన్న ఒప్పుకుని లక్ష్మిని మా ఇంటికి ఆహ్వానించాడు. ఆమె కార్యదీక్షకు ముగ్ధుడయ్యాడు. రెజిమెంటులో చేరాలంటే కన్నవారి అనుమతి తప్పనిసరి. నేను అప్లికేషను ఫాం సంపాదించి, నింపి, మా నాన్న ముందు పెట్టాను. ఏమీ అనకుండా సంతకం పెట్టాడు. మళ్ళీ ఎక్కడ మనసు మార్చుకుంటాడో అని పరిగెత్తుకు వెళ్లి లీగ్‌ ‌కార్యాలయంలో ఆ కాగితం ఇచ్చేశాను. మా అక్క కూడా దళంలో చేరింది.

స్థానికంగా మాది పేరున్న ఘరానా కుటుంబం కావటం వల్ల మమ్మల్ని చూసి ఇంకా చాలామంది తమ అమ్మాయిలు రెజిమెంటులో చేరటానికి ఒప్పుకున్నారు. కొందరు గొడవ పెట్టుకుని, హఠం వేసి, ఇంట్లోవాళ్ళను బలవంతాన ఒప్పించారు. అందరం కలిసి ట్రెయిన్‌లో బయలుదేరాం. సింగపూర్లో లారీలు వచ్చి మమ్మల్ని క్యాంపుకు చేర్చాయి. అప్పటికే అక్కడ చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఇంటిదగ్గర నౌకర్లు చాకర్ల సేవలకు అలవాటు పడిన దాన్ని కావటం వల్ల కంచం పట్టుకుని అన్నం కోసం లైనులో నిలబడటం, నేల మీద పడుకోవటం కష్టమనిపించి మొదట్లో ఏడ్చాను. కెప్టెన్‌ ‌లక్ష్మి ఊరడించింది. మెల్లిగా సదుపాయాలు మెరుగయ్యాయి. కొత్త జీవితానికి క్రమంగా అలవాటుపడ్డాను.’’

[అదే గ్రంథం పే. 219 – 220]

నిజానికి జానకి బృందం వెళ్ళేనాటికి పరిస్థితులు ఎంతో మెరుగు. మొదట్లో శిక్షణ ఇచ్చేవారిని అరువు తెచ్చుకుని ఇరుకు మైదానంలో 15 మందికి ఒకసారి చొప్పున డ్రిల్లింగ్‌ ‌నేర్పించవలసి వచ్చేది. వంటకు ప్రత్యేక ఏర్పాటు లేనందున ఐఎన్‌ఎ ‌క్యాంపు నుంచి భోజనాలు తెప్పించుకునేవారు. రాత్రులు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. శిక్షణ శిబిరానికి సరైన వసతి కల్పించమని లక్ష్మి ఎంత వెంట పడ్డా జపాన్‌ ‌సైన్యాధికారులు సహకరించ లేదు. మహిళా సైనిక దళం పెడతామని బోస్‌ అన్నప్పుడు జోక్‌ ‌చేస్తున్నాడని వారు మొదట్లో అనుకున్నారు. అదో ప్రాపగాండా స్టంటుగా భావించారు. కాదని అర్థమయ్యాక కూడా మగవాళ్ళ హక్కుభుక్తమైన మిలిటరీలో అర్భకపు ఆడంగులను అడుగు పెట్టనివ్వటానికి వాళ్ళ మగటిమి అంగీకరించలేదు. ఆడంగుల గాలి సోకుతే క్రమశిక్షణ దెబ్బతింటుందని తెగ గింజుకున్నారు. ట్రెయినింగుకు బిల్డింగు, డ్రిల్‌ ‌తర్ఫీదుకు సరైన గ్రౌండు సమకూర్చకుండా, దేనికీ సహకరించకుండా, ఏదీ అందనివ్వకుండా మొదట్లో సతాయించారు. వ్యవహారం నేతాజీ దాకా వెళ్లి ఆయన పైవాళ్ళతో మాట్లాడి నోరు చేసుకున్న తరవాత గానీ వాళ్ళు దారికి రాలేదు.

కేతే బిల్డింగుకు కొంచెం దూరంలో ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ఆఫీసు ఎదుట బారక్స్‌ను శిక్షణ శిబిరం కోసం జపనీయుల నుంచి నేతాజీ రాబట్టాక పరిస్థితి మెరుగుపడింది. అందులోని భవనం లోగడ ఆస్ట్రేలియా సైనికుల క్లబ్బు. తరవాత కొంతకాలం అక్కడ తాత్కాలిక ఆసుపత్రి నడిచింది. తలుపులు, కిటికీలు కూడా ఊడ బెరుక్కుని, సాధ్యమైనంత పాడు చేసి ఆ భవనాన్ని లీగ్‌కి అప్పగించారు. ఎల్లప్ప తన చెట్టియార్‌ ‌సహచరుల సాయంతో మనుషులను పెట్టి రేయింబవళ్ళూ పని చేయించి, వసతులు ఏర్పరిచి, స్నానాల గదులు, మరుగు దొడ్లు కట్టించి, బయటి ఊళ్ళనుంచి ‘రాణులు’ చేరుకునే సమయానికి క్యాంపును సిద్ధం చేయించాడు. (మహిళా రెజిమెంటులో చేరిన ప్రతివారిని ‘రాణి’ అని పిలిచేవారు.) ఒక టైలర్‌ ‌డబుల్‌ ‌డ్యూటీ చేసి వచ్చిన రాణికి నచ్చినట్టు కొలతలు తీసుకుని యూనిఫాం కుట్టి ఇచ్చేవాడు. రోజువారీ పనిలో పొడుగుచేతుల బ్లౌజు, ట్రౌజర్లు.. సైనిక కార్యకలాపాల్లో ఖాకీ దుస్తులు, ఐఎన్‌ఎ ‌కాప్‌, ‌లేసులేని బూట్లు ధరించాలని యూనిఫాం నిర్ణయింపబడింది. మామూలు 303 రైఫిలు మరీ పెద్దది, బరువు కాబట్టి మహిళా సైనికులకోసం ‘రాస్‌’ ‌పాటర్న్ ‌డచ్‌ ‌రైఫిళ్లు ప్రత్యేకంగా తెప్పిచారు. అవి తేలికగా ఉంటాయి. బరువు తక్కువ. కానీ వాటిలో చాలావాటికి బాయినెట్లు బిగించే వీలు ఉండదు. కత్తి విడిగా దగ్గర ఉంచుకోవాలి.

1943 అక్టోబర్‌ 21‌న సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌చరిత్రాత్మక ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పరిచిన రోజు. ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినం కూడా. ఆ నాడు మహిళా రేజిమెంటు శిక్షణ శిబిరం లాంఛనంగా ప్రారంభమయింది. మరునాడు సింగపూర్‌లోని వాటర్లూ స్ట్రీట్‌లో 156 మందితో మొదలైన క్యాంపును బోస్‌ ‌స్వహస్తాలతో ఆరంభించాడు. అప్పటికి రెండు నెలలుగా పార్ట్ ‌టైము సైనిక శిక్షణ పొందిన మహిళలు ఖాకీ యూనిఫాంలో రైఫిళ్లు ఎత్తిపట్టుకుని నేతాజీకి గౌరవ వందనం అర్పించారు. నాయకుడు పెరేడ్‌ ఇన్స్‌పెక్షన్‌ ‌చేస్తుంటే కెప్టెన్‌ ‌లక్ష్మి గంభీరవదనంతో వెంట నడిచిన ఛాయాచిత్రం చరిత్ర ప్రసిద్ధి చెందింది.

‘‘మనదేశంలో మహిళలు స్వాతంత్య్ర ఉద్యమంలో ఎప్పుడూ ముందే ఉన్నారు. బ్రిటిషు పోలీసుల పాశవికమైన లాఠీచార్జీల్లో ఎముకలు విరిగేలా దెబ్బలు తిని, అవమానాలు భరించి, జైళ్లకు వెళ్లి ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. రహస్య విప్లవోద్య మాలలోనూ వారు అద్భుతంగా పాలు పంచు కున్నారు. తమ సోదరులతో సమానంగా తుపాకీ పట్టి పోరాడారు. మన దేశ మహిళలకు ఉజ్వలమైన పోరాట సంప్రదాయం లేకపోతే భారత భూమిపై ఝాన్సీలక్ష్మి అనే ఒక వీరనారి ఉద్భవించేది కాదు. తుపాకీ పట్టటం స్త్రీల పని కాదు అని ఇప్పటికీ తలచేవారు గతచరిత్రను అవలోకించాలి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సమరంలో 20 ఏళ్ల ఝాన్సీ రాణి కాకలు తీరిన బ్రిటిషు కమాండర్లే నివ్వెర పోయేలా పరాక్రమం చూపింది. ఇప్పటి చిట్టచివరి స్వాతంత్య్ర సంగ్రామానికి ఒకరు కాదు- వేల మంది ఝాన్సీరాణులు కావాలి. మీరు ఎన్ని రైఫిళ్లు పట్టుకుంటారు; ఎన్ని తూటాలు ఫైర్‌ ‌చేస్తారు అన్నది ప్రధానం కాదు. మీ శౌర్యపరాక్రమాలతో మీరు కలిగించే నైతిక ప్రభావం అన్నిటికంటే ముఖ్యం’’ – అని నేతాజీ చేసిన ఉద్బోధకు అక్కడ చేరిన యావన్మందీ ఉత్తేజితులయ్యారు. కొత్తగా రిక్రూట్‌ అయిన అమ్మాయిల మొహాలైతే ఇనుమడించిన కర్తవ్య దీక్షతో దివిటీల్లా వెలిగిపోయాయి. ఝాన్సీ రాణి రెజిమెంటు శిక్షణ శిబిర ప్రారంభం ఆగ్నేయాసియాలో భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టం. తెలుగు, తమిళ, మలయాళీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ భాషలు మాట్లాడే హైందవ, సిక్కు, క్రైస్తవ, ముసల్మాన్‌ ‌మహిళలు కులమతప్రాంత భేదాలు లేకుండా ఆత్మార్పణ భావంతో స్వాతంత్య్ర పోరాట శ్రేణుల్లో చేరటం విశేషం. సింగపూర్‌ ‌తరవాత బాంగ్‌కాక్‌లోనూ, రంగూన్‌ (ఇప్పటి యాంగాన్‌)‌లోనూ మహిళా శిక్షణ శిబిరాలు మొదలయ్యాయి.

తొలినాళ్ళలో అమ్మాయిలు గ్రౌండులో డ్రిల్‌ ‌చేస్తూంటే దారిన పోయేవాళ్ళు గేలి చేసేవారు. ఆ చికాకు లేకుండా చుట్టూ ఎత్తైన కంచె వేశారు. ఆడవాళ్ళు మిలిటరీకి ఏమి పనికొస్తారు, బేరుమని పారిపోకుండా ఎన్నిరోజులు నిలబడగలరు అని మొదట్లో చిన్నచూపు చూసిన శిక్షకులకు అమ్మాయిల పట్టుదల, నిబద్ధత చూశాక వారిపట్ల వైఖరి మారింది. మిలిటరీ శిక్షణ బాలికలు అందరికీ కొత్తే. అయినా విద్యార్హతలను బట్టి భవిష్యత్తులో ఆఫీసర్లు, నాన్‌ ‌కమిషన్డ్ ఆఫీసర్లు కాగలరనుకున్నవారిని సెక్షన్ల కింద వేరు చేసి, వారికోసం ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేవారు. క్యాంపులో అత్యధికులు నిరక్షరాస్యులు. వారికి మామూలు సిపాయిల శిక్షణ ఇచ్చేవారు. ఆర్ధిక, సామాజిక కారణాల వల్ల చదువు నేర్వక పోయినా, అప్పటిదాకా బాహ్య ప్రపంచానికి దూరంగా ఇంటిపట్టునే నిస్సారంగా బతుకు వెళ్ళదీసిన గ్రామీణ పేద బాలికలు అర్థవంతమైన కొత్త జీవితానికి చాలా బాగా అలవాటు పడ్డారు. ‘మీ అందరికీ అమ్మ, నాన్న అన్నీ నేనే’ అని చెప్పి, యోగక్షేమాలు జాగ్రత్తగా కనిపెట్టి, నిలువెల్లా తరగని స్ఫూర్తి నింపిన ప్రియతమ నేతాజీపట్ల వారు ఆజన్మాంతం అచంచల విధేయత చూపారు. ఆత్మబంధువు కంటే మిన్నగా తలచి ఆయన అడుగుజాడల్లో నడిచారు. కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యావంతులు యాంత్రికమైన సంసార లంపటం కంటే నేతాజీ చూపిన ఆదర్శ మార్గంలో స్వాతంత్య్రం కోసం అంకితం కావటం మేలన్న ధృఢ నిశ్చయంతో ముందుకు కదిలారు. వారిలో దాదాపుగా ఎవరూ మాతృదేశాన్ని చూసి ఎరుగరు. అయినా తాము ప్రధానంగా భారతీయులమని గర్వించి, భారతమాత విమోచన కోసం ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డారు.

ట్రెయినింగు క్యాంపులో కఠోరమైన మిలిటరీ క్రమశిక్షణ నిక్కచ్చిగా పాటించేవారు. వంటా వార్పూ, ఊడ్పులూ, కడుగుళ్ళూ వగైరా పనులన్నీ ‘రాణు’లే వంతులవారీగా డ్యూటీలు వేసుకుని చేసేవారు. పని పంచుకుని చేసే విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. అందరూ సమానులే. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ఇన్ఫెంట్రీ రెజిమెంటు ఆఫీసర్లు రాణులకు దగ్గరుండి ఇష్టంగా శిక్షణ ఇచ్చేవారు. వాలంటీర్లలో చాలా మందికి తుపాకీ సరిగా పట్టుకోవటమే చేతయ్యేది కాదు. జన్మలో తుపాకీ చూడనివారూ ఉన్నారు. కుడికీ, ఎడమకూ తేడా కొందరికి తెలిసేది కాదు. అరవం, తెలుగు వంటి మాతృభాషలు మాత్రమే ఎరిగినవారు హిందుస్తానీలో చెపితే మొదట్లో ఒక్క ముక్కా అర్థం చేసుకోలేకపోయేవారు. కొందరు మరీ మందకొడి. మట్టిబుర్రలు. అయినా -ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన శిక్షకులు ఏమీ రాని సామాన్య స్త్రీల అజ్ఞానానికి విసుక్కునే వారు కాదు. నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌నాయకత్వంలోని విమోచన సైన్యంలో సైనికులయ్యే అరుదైన ప్రత్యేక గౌరవం తమకు దక్కిందన్న నిండుగర్వమే ఆత్మీయబంధమై నేర్పేవారు, నేర్చుకునేవారు అందరినీ దగ్గరకు చేర్చింది.

ఉదయం 6 గంటలకు క్యాంపులోని ప్రతిఒక్కరూ చేరి త్రివర్ణ పతాకం ఎగురవేయటంతో శిక్షణ మొదలయ్యేది. ఆరుంబావు నుంచి వ్యాయామం. ఏడున్నరకు అల్పాహారం. 8 కల్లా అందరూ పెరేడ్‌ ‌గ్రౌండులో ఉండాలి. రెండు గంటలపాటు ఒళ్ళు పులిసేలా స్క్వాడ్‌ ‌డ్రిల్లు, ఆయుధ శిక్షణ. 10 నుంచి రెండు గంటల పాటు విశ్రాంతి. బట్టలు ఉతుక్కోవటం లాంటి సొంతపనులు అప్పుడు చేసుకోవచ్చు. 12 గంటలకు మధ్యాహ్న భోజనం. 12-30 నుంచి రెండు గంటలపాటు క్లాస్‌ ‌రూమ్‌ ‌ట్రెయినింగు. మొదటి గంట హిందుస్తానీ పాఠాలు.

ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వ అధికార భాష హిందు స్తానీ. హిందీ, ఉర్దూలలో దేని లిపి వాడాలన్నది వివాదం కాకుండా నేతాజీ రోమన్‌ ‌లిపి ఎంపిక చేశాడు. దానివల్ల ఉత్తర, దక్షిణ తేడాలు లేకుండా దేశంలో అన్ని ప్రాంతాలవారికీ సౌకర్యంగా ఉంటుంది. అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లిషును నేర్వటమూ సులువు అవుతుంది. ఐఎన్‌ఎలో సైనిక కమాండ్లు అన్నీ హిందుస్తానీలో ఇవ్వటం వల్ల కూడా ఆ భాష నేర్వటం అందరికీ తప్పనిసరి. వాలంటీర్లలో ముప్పాతిక భాగం దక్షిణాది వారైనా మూడు నెలల్లోనే అందరూ హిందుస్తానీ అర్థం చేసుకోగల, మాట్లాడగల స్థాయికి వచ్చారు. ఇక రెండో గంటలో భూగోళ శాస్త్రం, భారతదేశ రాజకీయ చరిత్ర బోధించేవారు. బ్రిటిషు ప్రభుత్వం దేశాన్ని ఏదో ఉద్ధరించిందని పాఠ్య పుస్తకాల్లో చెప్పే గొప్పల బండారాన్ని, తెల్లవాళ్ళ పాలన చేసిన హానిని, నిలువు దోపిడీని అర్థమయ్యేట్టు చెప్పేవారు. మిలిటరీకి సంబంధించి మ్యాప్‌ ‌రీడింగు, రణ తంత్రాలు, సైనిక వ్యూహాలు వంటి అంశాలను ఎన్‌.‌సి.ఓ. క్యాడర్‌ ‌వారికి ప్రత్యేకంగా క్లాసులో నేర్పేవారు. మళ్ళీ మూడు గంటల ఆరుబయలు శిక్షణ తరవాత రోల్‌ ‌కాల్‌, ‌జాతీయ పతాకం అవనతం, జాతీయగీతంతో శిక్షణ కార్యక్రమం ముగిసేది. 7 గంటలకు రాత్రిభోజనం. మళ్ళీ ఓ గంట సేపు సమకాలిక విషయాలపై ఇష్టాగోష్టి. తరవాత పడక. క్రమశిక్షణ కోసం ఆఫీసర్లు, నాన్‌ ‌కమిషన్డ్ ఆఫీసర్లు (ఎన్‌.‌సి.ఓ.లు), సిపాయిలు అని తేడాలున్నా అందరూ కలిసి మెలిసి అన్యోన్యంగా మసిలేవారు. ఆర్థికంగా, సామాజికంగా, కులపరంగా, విద్యాపరంగా, వయసు రీత్యా వారి నడుమ ఎన్ని అంతరాలుంటేనేమి ఒక నాయకుడి కింద, ఒకే ఆశయం కోసం అందరమూ పనిచేస్తున్నామన్న ఆత్మీయత అందరినీ కలిపింది.

డ్రిల్లు, రూట్‌ ‌మార్చ్, ‌తేలికపాటి ఆయుధాల శిక్షణల తరవాత శత్రువుపై అటాక్‌ ఎలా, దాడినుంచి కాచుకోవటం ఎలా, గెరిల్లా పోరాటం కిటుకులు వంటివి ప్రాక్టికల్‌గా నేర్పేవారు. విషయం అర్థమయ్యాక మామూలు గ్రామీణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన సామాన్య మహిళలు సైతం ఎంతో లాఘవాన్ని, సమయస్ఫూర్తిని కనపరచి శిక్షకులను ఆశ్చర్యపరిచేవారు. శారీరక శిక్షణ పొందేకొద్దీ పడతుల సుకుమారపు ఒళ్ళు రాటు తేలి, ఎంతటి శ్రమకైనా, ఎన్ని దెబ్బలకైనా, ఎలాంటి అసౌకర్యాలకైనా తట్టుకోగల బిగువు కలిగింది. మొదట్లో ఒక కంపెనీ పరిమాణంలో మొదలైనా, వాలంటీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగి వెయ్యి దాటింది.

నాలుగునెలల పైగా మిలిటరీ శిక్షణ తరవాత పరీక్షలు పెట్టారు. రేంజి ప్రాక్టీసు ప్రాక్టికల్స్‌లో నిజమైన తూటాలను వాడారు. మహిళా సైనికులు లక్ష్యానికి కచ్చితంగా గురిపెట్టి ఫైరింగ్‌ ‌చేస్తూంటే తమాషా చూడవచ్చిన జపనీస్‌ ‌సైన్యాధికారులు ఆశ్చర్య పోయారు. పైస్థాయిల పరీక్షలలో నెగ్గిన వారిని ఆఫీసర్లుగా, ఎన్‌సిఓలుగా నియమించారు. అలా పాసై రెజిమెంటు కమాండెంటుగా నియమితమైన మొదటి ఆఫీసరు డాక్టర్‌ ‌లక్ష్మీ స్వామినాథన్‌.

‌పరీక్షలలో ఉత్తీర్ణులైన మొదటి బ్యాచ్‌ ‌మహిళా సైనికుల పాసింగ్‌ అవుట్‌ ‌పెరేడ్‌ 1944 ‌మార్చ్ 30‌న సింగపూర్‌లో జరిగింది. అది అన్నిటికంటే పెద్ద సర్‌‌ప్రైజ్‌. ఐఎన్‌ఎ ఉన్నతాధికారులు, జపాన్‌ ‌సైన్యాధికారులు, పురప్రముఖులు, ప్రజలు దానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వందల సంఖ్యలో మహిళలు యూనిఫాంలో చక్కగా బారులు తీరి, రైఫిళ్లు చేత పట్టి, జీవితమంతా సైన్యంలోనే గడిపారా అనిపించేటంత బాగా సైనిక కవాతు చేస్తుంటే చూసినవారు ముగ్ధులయ్యారు. పాసింగ్‌ అవుట్‌ ‌పెరేడ్‌ ‌తరవాత మహిళా సైనికులు ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో భాగమై, సుప్రీం హెడ్‌ ‌క్వార్టర్స్ ‌డైరెక్ట్ ‌కంట్రోల్‌ ‌కిందికి వచ్చారు.. కదనరంగానికి కదలటానికి నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురుచూడసాగారు.

యుద్ధరంగంలో పోరాడే దళాలతో బాటు మహిళలకు చక్కని నర్సింగ్‌ ‌కోర్స్ ‌కూడా పెట్టారు. యుద్ధం చేసేంత శారీరక పటుత్వం లేనివారిని, నర్సింగు పని ఇష్టపడిన వారిని దానికి కేటా యించారు. లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌కాస్లీవాల్‌, ‌లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ‌లోగనాదన్‌ ‌ప్రత్యేకంగా నాలుగునెలల కరిక్యులం రూపొందించారు. క్యాంపు నుంచి రోజూ బస్సులలో తీసుకువెళ్ళి సింగపూర్‌, ‌రంగూన్లలోని ఐఎన్‌ఎ ‌హాస్పిటల్స్‌లో నర్సులకు శిక్షణ ఇచ్చారు. తరవాత యుద్ధరంగానికి సమీపంలోని ఆస్పత్రులకు చాలామందిని పంపారు. అక్కడ ఎప్పుడు ఎటునుంచి ఎక్కడ బాంబులు పడతాయో, కాల్పులు జరుగుతాయో తెలియని భయానక పరిస్థితుల్లో ఆ నర్సులు నిబ్బరంగా నిలబడి గాయపడినవారికి, అంటు వ్యాధులబారిన పడిన రోగులకు అద్భుతమైన సేవ చేశారు.

[ఆధారం::Lakshmi Swaminathan in Netaji: His Life And Work, Ed. Shree Ram Sharma, pp.196-205
India’s Struggle For Freedom, Maj.Gen. A.C.Chaatterji, pp 125-129 ]

 (ఇంకా ఉంది)

About Author

By editor

Twitter
YOUTUBE