– ఎం.వి.ఆర్. శాస్త్రి
ఫాసిస్టు! నాజీల తొత్తు! జపాన్ ఎలా ఆడిస్తే అలా ఆడిన తోలుబొమ్మ! టోజో బూట్లు నాకే కుక్క!!
బ్రిటిషు ప్రభుత్వమూ, దాని బాకా భజంత్రీలూ, రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ తొత్తులుగా మారిన ఇండియన్ కమ్యూనిస్టులూ సుభాస్ చంద్రబోస్ మీద వేసిన అభాండాలివి.
భారతదేశ స్వాతంత్య్రం కోసం వేరే దారి లేక బోస్ జపాన్ సైనిక సహాయం తీసుకున్నా తన స్వాతంత్య్రాన్ని గాని, భారత ఆత్మగౌరవాన్ని గాని జపాన్ పాలకులకు ఎన్నడూ తాకట్టు పెట్టలేదు. ఒక ప్రభుత్వాదినేత వలె జపాన్ ప్రభుత్వంతో సమాన ఫాయాలో స్వతంత్రంగా వ్యవహరించాడే తప్ప తాబేదారులా ఎన్నడూ దోసిలి వొగ్గలేదు. తన స్థాయిని, స్వతంత్ర ప్రతిపత్తిని, నిర్ణయాధికారాన్ని పలచన చేసేందుకు ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లోనూ సందు ఇవ్వలేదు. కించిత్తు అమర్యాదను కూడా సహించలేదు.
మచ్చుకు కొన్ని ముచ్చట్లు..
ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వంతో దౌత్య సంబంధాలు నెరపటానికి జపాన్ సర్కారు హచియా అనే దౌత్యాధికారిని నియమించింది. అప్పటికి తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్ నుంచి రంగూన్‌కు తరలిపోయింది. కొత్త బాధ్యత స్వీకారానికి ఫలానా రోజు తాను రంగూన్ వస్తున్నట్టు అతడి నుంచి వర్తమానం అందింది.
మామూలుగా ఒక దేశం తరఫున దౌత్యాధి కారిగా ఒకరిని నియోగించాలనుకున్నప్పుడు సంబంధిత ప్రభుత్వం అధికారికంగా నియామక పత్రాన్ని జారీ చెయ్యాలి. టోక్యో ఆ పని చేయలేదు. ప్రవాసంలో పనిచేస్తున్న తాత్కాలిక ప్రభుత్వం విషయంలో మనం మామూలు ప్రోటోకాల్ పాటించాలా? ఎలాగూ అది మన మద్దతుతో ఏర్పడ్డ ప్రభుత్వమే కదా? నోటిమాట సరిపోదా? మన మీద ఆధారపడ్డ వారి దగ్గరకు మనం దౌత్యాధికారిని పంపటమే ఎక్కువ. దానికో నియామకపు ఫర్మానా కూడానా? అనుకున్నారు జపాన్ ప్రభువులు.
ఆ సంగతి బోస్‌కు తెలియదు. మినిస్టర్ హోదా అధికారి రానున్నట్టు కబురందటంతో అతగాడు అధికారిక నియామక పత్రాలను లాంఛనంగా సమర్పించేందుకూ, అనంతరం అతడి గౌరవార్థం రిసెప్షనుకూ జపాన్ అధికారులతో సంప్రదించి ఏర్పాట్లు జరిగాయి. తరవాత ఏమైందో అప్పటి ఆర్ధిక మంత్రి ఎ.సి. చటర్జీ మాటల్లో వినండి:
‘‘సెక్రటరీనీ, మందీ మార్బలాన్నీ వెంటేసుకుని హచియా రంగూన్ వచ్చాడు. మరుసటిరోజు నన్ను కలిశాడు. పత్ర సమర్పణ లాంఛనం సంగతి నేను ప్రస్తావించాను. అదేమీ తాను ఎరగనని అతడన్నాడు. ఆ విషయం నేను నేతాజీకి రిపోర్టు చేశాను. అసలు దౌత్యాధికారిగా అతడిని నియమించినట్టు టోక్యో ఇచ్చిన అథారిటీ లెటర్ ఏమన్నా అతడిదగ్గర ఉందా లేదా అని నేతాజీ అడిగాడు. నేను వెళ్లి కనుక్కున్నాను. అలాంటిదేమీ తన దగ్గర లేదని హచియా చెప్పాడు. అయితే అతడిని నేను చూడను. అతడిని జపాన్ దౌత్య ప్రతినిధిగా మనం గుర్తించము – అని కరాఖండిగా అన్నాడు నేతాజీ.
అది ఇబ్బందికరమైన దౌత్య సంకటం. ప్రొవిజ నల్ గవర్నమెంట్లకు అక్రెడిటెడ్ రిప్రజంటేటివులను అధికారికంగా నియమించే ఆనవాయితీ మా ప్రభుత్వానికి లేదండి – అని నాతో మొత్తుకున్నాడు ఆ అధికారి. ‘ఇంతకు ముందు లేకపోవచ్చు. ఇప్పుడు మా కోసం కొత్తగా మొదలెట్టవచ్చుకదా? కనీసం అథారిటీ లెటర్ అయినా లేకపోతే మా నాయకుడు ఒప్పుకోడు’ అని గట్టిగా చెప్పాను. ఇక చేసేది లేక అతగాడు టోక్యోతో మాట్లాడుకుని అధికార పత్రాలు తెప్పించుకున్నాడు. అవి అందే దాకా నేతాజీ అతడి మొగం చూడలేదు.’’
[India’s struggle For Freedom, Maj. Gen. A.C.Chatterji, p.251-252 ]
ఆజాద్ హింద్ ప్రభుత్వం ఏర్పడిన పక్షం రోజులకు టోక్యోలో రెండు రోజులపాటు విశాల తూర్పు ఆసియా సహ శ్రేయోభివృద్ధి గోళం (Greater East Asia Co-prosperity Sphere) సభ్య దేశాల సమావేశం జరిగింది. జపాన్, థాయిలాండ్, బర్మా, మంచుకో, ఫిలిప్పీన్స్, సయాం తదితర దేశాల ప్రభుత్వాల నాయకులు దానిలో పాల్గొన్నారు. భారతదేశం తరఫున ఆజాద్ హింద్ ప్రభుత్వ అధినేత సుభాస్ బోస్‌ను ఆహ్వానించారు.
దానికి బోస్ ఉబ్బితబ్బిబ్బు కాలేదు. తనకంటూ రాజ్యం లేకున్నా తనను కూడా ఒక రాజ్యాధినేతగా గుర్తించి, అధినేతల భేటీకి ఆహ్వానించటమే గొప్ప గౌరవమని పొంగిపోలేదు. మీ గోళం (sphere)లో ఇండియా చేరాలా వద్దా అనేది నిర్ణయించవలసింది నేను కాదు; స్వాతంత్య్రం వచ్చాక ఏర్పడే భారత ప్రభుత్వం మాత్రమే అది నిర్ణయించగలదు. ఈ విషయంలో నా దేశాన్ని కమిట్ చేయటానికి నేను సిద్ధంగా లేను. కేవలం పరిశీలకుడిగా మాత్రమే నేను హాజరవుతాను – అని నేతాజీ చెప్పాడు. ఇద్దరు మంత్రులు, సైన్యాధికారులతో కలిసి రాజలాంఛనా లతో టోక్యో వెళ్ళాడు. పరిశీలకుడి హోదాలో వెళ్లాడు కాబట్టి – కొమ్ములు తిరిగిన దేశాధినేతలు మాట్లాడు కుంటూంటే వింటూ ఒక మూల కూచున్నాడా? లేదు. రాజ్యాధినేతలు ఎందరు ఉన్నా రాజ్యంలేని సుభాస్ బోసే తన విశిష్ట వ్యక్తిత్వంతో, అద్భుత ప్రజ్ఞతో మొత్తం సమావేశానికి ఆకర్షణ కేంద్రం అయ్యాడు. ప్రతికూల పరిస్థితుల్లో, పరాజయ భయంతో దిక్కు తోచని దేశాధిపతులకు అద్భుత రాజనైతిక ప్రజ్ఞతో చక్కని మార్గదర్శనం చేశాడు.
ఆ సమావేశంలో ఒక విశేషం. అందరినీ ఆకట్టుకున్న దార్శనిక ప్రసంగానికి బోస్‌ను అభినందించటానికి జపాన్ ప్రధాని టోజో లేచి ‘‘స్వతంత్రం వచ్చాక ఇండియాలో ‘ఆల్ ఇన్ ఆల్’ (సర్వాధికారి) ఈయనే’’ అని ఇతర దేశాల అధినేతలతో గొప్పగా అన్నాడు. దానికి సుభాస్ బోస్ ముసిముసిగా నవ్వి సంతోష పడలేదు. వెంటనే లేచి ఆ మాటను ఖండించాడు. ‘‘స్వతంత్ర భారతంలో సర్వాధికారి ఎవరో నిర్ణయించేది జపాన్ ప్రధాని కాదు. వేరెవరూ కాదు. స్వతంత్రం వచ్చాక భారత ప్రజలే ఎవరు, ఏమిటన్నది నిర్ణయిస్తారు’’ అని టోజో మొగం మీదే చెప్పాడు.
నేతాజీ మూర్తిమత్వం ఎంత గొప్పదంటే – ఆయన అడగకుండానే టోక్యో అధినేతల సమావేశం భారత స్వాతంత్య్ర పోరాటానికి పూర్తి తోడ్పాటును ఏకగ్రీవంగా ప్రకటించింది. భారత ప్రజలకు సంఘీ భావ సూచకంగా అంతవరకూ జపాన్ ఆక్రమణలో ఉన్న అండమాన్, నికోబార్ దీవులను ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వానికి వెంటనే అప్పగించనున్నట్టు ఆ సమావేశంలోనే జపాన్ ప్రధాని హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు. దాంతో కొత్తగా ఏర్పడ్డ జాతీయ ప్రభుత్వానికి తనదంటూ సొంత భూఖండం అయాచితంగా సమకూడింది.
1943 డిసెంబర్ 29న నేతాజీ సమక్షంలో అండమాన్ నికోబార్ దీవులను ఆజాద్ హింద్ ప్రభుత్వానికి జపాన్ దఖలు పరచింది. భారత భూభాగంపై మొదటిసారి స్వతంత్ర భారత పతాకం సగర్వంగా రెపరెపలాడింది. ‘‘1786 ఫ్రెంచ్ విప్లవంలో విప్లవకారులు మొట్టమొదట పారిస్‌లోని బాస్టీల్ జైలు తలుపులు బద్దలు కొట్టినట్టు, స్వాతంత్య్ర మహాయోధులను బంధించి చిత్రహింసలు పెట్టటానికి బ్రిటిషు ప్రభుత్వానికి ప్రధానంగా ఉపయోగపడ్డ అండమాన్ నికోబార్ దీవులు భారత స్వాతంత్య్ర యుద్ధంలో మొట్టమొదట విముక్తమవటం సముచితం. కాలక్రమంలో మొత్తం భారతదేశం ఎటూ విముక్తి పొందుతుంది. కాని మొట్టమొదట విమోచన అయిన భూభాగానికి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం ఉంటుంది’’. అని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తూ సుభాస్ బోస్ సంతోషపడ్డాడు. వీర సావర్కార్ వంటి స్వాతంత్య్రవీరులను నరకయాతనలు పెట్టిన సెల్యులార్ జైలును నేతాజీ అధికారిక హోదాలో దర్శించి, జాతీయ యోధులు అనుభవించిన చిత్రహింసలను విషణ్ణ వదనంతో జ్ఞప్తి చేసుకున్నాడు. అమరవీరుల స్మారకంగా అండమాన్ కు ‘‘షహీద్ దీవి’’, నికోబార్‌కు ‘‘స్వరాజ్ దీవి’’ అని ఆయన నామకరణం చేశాడు.
పైన ప్రస్తావించిన దేశాధినేతల భేటీ అనంతరం టోక్యోలోని హిబియా పార్కు వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించాలని నేతాజీని జపాన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కోరింది. అది మరే దేశ నాయకుడికీ దక్కని గౌరవం. టోక్యోలో ఉండగానే ప్రధాని టోజోతో నేరుగా మాట్లాడి బోస్ కొన్ని ముఖ్య విషయాలను తేల్చుకున్నాడు. అప్పటిదాకా జపాన్ ఆక్రమణలో ఉన్న భారత ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని ఆజాద్ హింద్ ప్రభుత్వానికి అప్పగించటానికి టోజో అంగీకరిం చాడు. ఇంఫాల్ రంగంలో తలపెట్టిన సైనిక చర్యలలో ఆజాద్ హింద్ ఫౌజ్‌ను చిన్నచూపు చూడమనీ, జపాన్ కమాండ్ కింద పనిచేసే మిత్ర సైన్యంగానే దానిని పరిగణిస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చాడు. బ్రిటిష్ యుద్ధ ఖైదీల నుంచి జాతీయ సైన్యంలోకి తీసుకున్న వారి మీద అయ్యే ఖర్చులను జపాన్ ప్రభుత్వమే భరిస్తుందనీ. స్థానిక వాసులనుంచి రిక్రూట్ చేసుకున్న వారి మీద అయ్యే ఖర్చులను ఆజాద్ హింద్ ప్రభుత్వం పెట్టుకోవాలనీ స్పష్టత వచ్చింది. ముప్ఫై వేల సైనికులతో మూడు డివిజన్లను ఏర్పరచటానికి అంగీకారం కుదిరింది.
ఇలా ప్రతిదీ టోక్యోలో అత్యున్నత స్థాయిలోనే మాట్లాడుకుని లైన్ క్లియర్ చేసుకున్నా క్షేత్ర స్థాయిలో బోస్‌కు అనేక చికాకులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఐ.ఎన్.ఎ.తో లైజానింగు కోసం జపాన్ ప్రభుత్వం పెట్టిన హికారీ కికాన్ నుంచి. మొదట్లో దాని బాధ్యత యమామోతోకు అప్పగించారు. అతడు బోస్ బాగా ఎరిగిన వాడే. బెర్లిన్లోని జపాన్ ఎంబసీలో మిలిటరీ అధికారిగా ఉండగా బోస్‌తో స్నేహంగా ఉండి తూర్పుకు ఆయన ప్రయాణానికి చాలా సహకరించిన వాడే. ఆ సంగతి తెలిసే బోస్‌తో సంధానానికి పనికొస్తాడన్న ఉద్దేశంతో హికారీ కికాన్ బాధ్యత తొలుత అతడికి అప్పగించారు.
అతడూ మొదట బాగానే ఉన్నాడు. కానీ ఆజాద్ హింద్ ప్రభుత్వ స్థాపన తరవాత హికారీ కికాన్‌కు అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఇసోడాను నియమించి యమామోతోను అతడికింద పనిచేయమన్నారు. అందులో బోస్ ప్రమేయం లేదు. ఆ మార్పు సంగతి అతడికి ముందుగా తెలియదు. అయినా- తన ప్రాధాన్యం తగ్గించటానికే బోసే కావాలని ఏర్పాటు చేయించాడని యమామోతో ఊహించుకున్నాడు. అది మొదలు అడుగడుగునా బోస్‌కు అడ్డుతగల సాగాడు. అతడిని కంట్రోల్ చేసే సత్తా అతడి పైవాడికి లేదు. కొత్తగా వచ్చిన ఐసోడా కొంచెం మెతక. అతడి పైత్యాలు అతడికున్నాయి.
కికాన్ పెద్దలు తమ ఆధిపత్యం చాటుకుని అడుగడుగునా బోస్‌ను తిప్పలు పెట్టాలని చూశారు. కాని వారి కుప్పిగంతులను సుభాస్ చంద్రబోస్ బొత్తిగా లక్ష్య పెట్టలేదు. ఇవ్వాల్సిన మర్యాద అంతా ఇస్తూనే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. తన స్వతంత్ర ప్రతిపత్తి, నిర్ణయాధికారాల విషయంలో లేశమైనా రాజీ పడకుండా జపాన్ వాళ్ళను నేతాజీ ఎలా కంట్రోల్ చేశాడో ఎస్.ఎ. అయ్యర్ రికార్డు చేసిన ఈ ఉదంతం చెబుతుంది.
నేతాజీకీ కికాన్‌కీ నడుమ ఘర్షణలో అది పతాక సన్నివేశం. 1944లో ఒక రోజు. నేతాజీకీ జనరల్ ఐసోడాకీ మధ్య నేతాజీ నివాసంలో సమీక్షా సమావేశం. నేతాజీ వెంట నేను ఒక్కడినే. అది కూడా మాట్లాడకుండా నోట్స్ తీసుకోవటానికి మాత్రమే. జనరల్ ఐసోడా వెంట మేజర్ జనరల్ యమామోతో, మేజర్ జనరల్ సెండా, కల్నల్ కగావా వచ్చారు. మీటింగు మధ్యాహ్నం 4 గంటలకు మొదలై 10 దాకా సాగింది. మొత్తమంతా చిటపటలే.
గొడవ మొదలు పెట్టింది యమామోతో. అతడు ఎత్తుకోవటమే ఒక ఫిర్యాదుతో. ‘‘మీరు మాకు కాని, టోక్యోకు కాని చెప్పా పెట్టకుండా సప్లయిస్, మాన్ పవర్ మంత్రులను ఎలా వేశారు? అది మా యుద్ధ సన్నాహాలను దెబ్బతీయదా?’’ అంటూ.
లెఫ్టినెంట్ జనరల్ అక్కడే ఉండగా మేజర్ జనరల్ చర్చను మొదలు పెట్టటమే అనౌచిత్యం. పైగా యమామోతో మాట తీరు, దూకుడు నేతాజీకి చిర్రెత్తించాయి. ‘‘మేజర్ జనరల్ యమామోతో చెప్పినదాన్ని నేను ఖండిస్తున్నాను. ఆ ఇద్దరు మంత్రులను నియమించే ఉద్దేశం ఉందని మీకు ఇంతకుముందే చెప్పాను. జ్ఞాపకం లేదా?’’ అని అప్పుడే అక్కడే నిలదీశాడు. యమామోతో మొగం మాడిపోయింది. మిగతావాళ్ళూ ఇరుకున పడ్డారు.
‘‘అయినా ఆజాద్ హింద్ ప్రభుత్వం చేసే ప్రతిదీ నేను మీకు చెప్పాలా? మర్యాద పూర్వకంగా అవసరమనుకుంటే మీకు మేము తెలియజేయవచ్చు. అన్నీ మీకు చెప్పే చెయ్యాలని రూలేమీ లేదు.’’ అని నిష్కర్షగా చెప్పాడు నేతాజీ. అప్పటికీ యమామోతో నస ఆపలేదు. ‘‘మీ సప్లయిస్ మంత్రి మీ అవసరాల కోసం తూర్పు ఆసియా మార్కెట్ల మీద పడతాడు. దానివల్ల జపాన్ ప్రయోజనాలు దెబ్బతినవా? అలాగే భారతీయుల మాన్ పవర్ నంతా మీ మంత్రి మళ్ళించుకుపోతే ఫ్యాక్టరీలు, రైల్వేలు, డాక్ యార్డుల్లో మాకు మనుషులు దొరకటం కష్టమవదా?’’ అంటూ పెద్దగొంతుతో ఏదేదో మాట్లాడసాగాడు. అతడు ఆవేశంగా యాగీ చేస్తూ ఎంతో సేపు చెప్పిన దాన్నంతా నేతాజీ మూడు ముక్కల్లో కొట్టిపారేశాడు – మళ్ళీ ఎవరూ మారు మాట్లాడలేకుండా!
‘‘మీరు వెళ్ళలేని మార్కెట్లకు, మీకు అక్కర్లేని మార్కెట్లకు మేము వెళతాం. మీరు ఎంత ప్రయత్నించినా మీకు దొరకని మాన్ పవరును మేము సమకూర్చుకుంటాం. మీకేమిటయ్యా నష్టం? మా సప్లయిస్ మంత్రి తూర్పు ఆసియా మార్కెట్లన్నీ గాలించి శనగలు, పప్పులు, బియ్యం, వంట నూనెల వంటివి సంపాదిస్తాడు. అవి మీకు అవసరమే లేదు. మేము ప్రతిఫలం ఏమీ ఇవ్వకపోయినా స్వాతంత్య్ర ఉద్యమంలో పూర్తికాలం పనిచేయటానికి వేల కొద్దీ భారతీయులు ఈ ప్రాంతాల్లో రడీగా ఉన్నారు. ఆకర్ష ణీయమైన జీతం ఇస్తామన్నా వాళ్ళు మీలో చేరరు. అలాంటి వాళ్ళను మేము సమీకరించుకుంటే మీకేమిటి ఇబ్బంది? ఇంతోటి దానికి మీ యుద్ధ సన్నాహాలనేవో మేము దెబ్బ తీస్తున్నట్టు ఈ గోలంతా దేనికి?’’ అని బోస్ నిలదీస్తే జపాన్ వాడి దిమ్మ తిరిగింది. అయినా చాలా సేపటిదాకా యమామోతో సణుగుతూనే ఉన్నాడు. అప్పుడు నేతాజీ అసలు సమస్యను ప్రస్తావించాడు. ఐఎన్‌ఎ బలగాలను విస్తరిస్తున్నాము కదా; కొత్తగా తీసుకుంటున్నవారికి మీరు ఇవ్వవలసిన ఆయుధాలు గట్రా ఎప్పుడిస్తారు – అని.
ఆ ఊసు ఎత్తగానే జనరల్ ఐసోడా కస్సున లేచాడు. ఇది మాకు పెద్ద సర్ప్రైజ్! ఇలా సైన్యాన్ని విస్తరించబోతున్నాము అని మాకు ముందుగా హెచ్చరిక కూడా మీరు చెయ్యలేదు. ఇన్ని వేల మందికి ఆయుధాలు, తూటాలు వగైరా ఇప్పటికిప్పుడు సమకూర్చటం మా వల్ల కాదు అన్నది అతడి మాటల సారాంశం. జపాన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ అంతటివాడు అలా అడ్డం తిరగటం చూసి బోస్‌కు ఒళ్ళు మండింది. ‘‘మరీ అంత వద్దు. ఈ విషయం మీకు ఇంతకుముందే చెప్పాను. మా సైన్యం విస్తరణ సంగతి మీకు ముందే తెలుసు.’’ అని ఐసోడా మొహానే అనేశాడు. ఏ తేదీల్లో జరిగిన ఇలాంటి మీటింగుల్లో ఎంత వివరంగా విస్తరణ గురించి తాను సమాచారం తెలిపిందీ టకటక ఏకరువు పెట్టాడు కూడా. అయినా అవతలివాడి వైఖరి మారలేదు. ఐఎన్‌ఎ అదనపు బలగాలకు ఆయుధాలు, అమ్యూనిషన్ గట్రా సమకూర్చటానికి అతడు ససేమిరా సిద్ధంగా లేడు. అది ఎందువల్ల కుదరదు అనటానికి ఏవోవో కారణాలు చెప్పిందే చెప్పసాగాడు.
ఇక సుతిమెత్తగా చెప్పి ప్రయోజనం లేదని నేతాజీకి అర్థమైంది. కాసేపు మౌనంగా ఐసోడా కళ్ళలోకి తేరిపారచూసి, మెల్లిగా, స్ఫుటంగా ఇలా ఒత్తి పలికాడు:
‘‘మా సైన్యం విస్తరణ గురించి మీ వైఖరి అదే అయితే నేను ఒప్పుకునేది లేదు. నాకు కావలసినవి నాకు ఇచ్చి తీరాలి. లేదా – నేను తప్పుకుంటాను! ఆలోచించుకోండి.’’
అది జపాన్ వాళ్ళు ఊహించని బెదిరింపు. ఐసోడా త్రుళ్ళి పడ్డాడు. మొహం గంటు పెట్టుకుని ఏదో గొణిగి, తన వెంట ఉన్నవాళ్ళకు సైగ చేసి, కాగితాలు సర్దుకుని లేచాడు. నేతాజీ వారిని వారించే ప్రయత్నం చేయలేదు. కూల్‌గా లేచి పోర్టికో దాకా వెళ్లి జపాన్ బృందాన్ని మర్యాదగా చిరునవ్వుతో సాగనంపాడు. వెనక్కి తిరిగొచ్చి సహచరులతో హాయిగా నవ్వుతూ భోజనం చేశాడు. ఐసోడాలూ యమామోతోలూ వారి కోపాలూ పంతాలూ తనను ఏమీ చేయలేవు; అడిగింది చెయ్యటం మినహా వారికి వేరే దారిలేదు – అని ఆయనకు తెలుసు. అలాగే జరిగింది.
ఇలాంటిదే ఇంకో సందర్భం.
ఐ.ఎన్.ఎ., జపాన్ సేనలు కలిసి ఇండియాను ముట్టడించి, భారత భూమిపై అడుగు పెట్టాక పరిస్థితి ఏమిటి? ఎవరు ఎవరికింద పనిచేయాలి? జపాన్ వాళ్ళ నియంత్రణలో ఐఎన్‌ఎ పనిచేస్తే భారతదేశాన్ని జపాన్ ఆక్రమించడానికి ఐఎన్‌ఎ సహాయపడినట్టు అవుతుంది. జపాన్ వాళ్ళు కోరుకున్నది అదే. అందుకే ఇండియాలోకి ప్రవేశించాక ఇండో జపనీస్ వార్ కౌన్సిల్‌కు చైర్మన్‌గా జపాన్ జాతీయుడు ఉండాలని ముందే షరతు పెట్టారు. అది కుదరదు; ఆ కౌన్సిల్‌కు చైర్మన్‌గా భారతీయుడే ఉండి తీరాలని బోస్ పట్టుబట్టాడు. దానిపై నేతాజీకీ, హికారీ కికాన్ వారికీ మధ్య మూడు విడతలు చర్చలు జరిగాయి. బోస్‌ను బుట్టలో వేయటానికి జపానీలు మహా తెలివిగా ఎత్తులు వేశారు. మీరు కనక మాట వినకపోతే టోక్యో హై కమాండుకు కోపం వస్తుంది; మా పెద్దవాళ్ళు ఇప్పటికే చికాకు పడుతున్నారు. దీనిపై మరోమాట వినేదే లేదంటున్నారు – అని ఐసోడా, యమా మోతోలు బోస్‌ను భయపెట్టజూశారు.
కానీ నేతాజీ వారిని తలదన్నిన వాడు. ‘‘నేనే ఫీల్డ్ మార్షల్ సుగియామాతో మాట్లాడతా. అవసరమైతే ప్రధాన మంత్రి టోజోకే నేరుగా చెపుతా. ఇది మా దేశ ఔన్నత్యానికీ, సార్వభౌమత్వానికీ సంబంధించిన అంశం. దీనిపై మేము అంగుళం బెసిగే ప్రసక్తే లేదు.’’ అని భీష్మించాడు.
అలాగైతే మీకు మేము సపోర్ట్ ఇవ్వలా వద్దా అన్నదీ మేము ఆలోచించవలసి వస్తుంది – అని జపాన్ వాళ్ళు పరోక్షంగా బెదిరించారు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ సపోర్టు కోసం మా దేశ ప్రయోజనాలను మీకు తాకట్టు పెట్టటం కలనైనా జరగదు – అన్నాడు నేతాజీ.
‘‘అయితే, యువర్ ఎక్సలెన్సీ! వార్ కో ఆపరేషన్ కౌన్సిలే ఉండకూడదని మీ అభిప్రాయమా?’’ అని అడిగాడు జనరల్ ఐసోడా.
‘‘వార్ కౌన్సిల్ ఉండవలసిందే. దానికి అధిపతిగా జపాన్ జాతీయుడు ఉండకూడదనే మేము అనేదల్లా. చైర్మన్ అంటూ ఉంటే అది భారతీయుడే కావాలి. మా గడ్డ మీద మా మాటే చెల్లాలి.’’ అని తెగేసి చెప్పాడు బోస్. అతడు లొంగే ఘటం కాదని అర్థమయ్యాక, ఆ విషయం తరవాత అలోచిద్దాము లెమ్మని దాటవేసి చివరికి టోక్యోయే తోక ముడిచింది.
[Unto Him A Witness, S.A. Ayer, pp 190-196.]
జపానీ సైన్యాధికారులతోటే కాదు. టోక్యో పెద్ద తలకాయలతోనూ నేతాజీ ఎప్పుడూ ‘నో నాన్సెన్స్’ తరహాలోనే ఉండేవాడు. ‘‘మాతో సమన్వయం కోసం మీరు పెట్టిన హికారీ కికాన్ మీకూ మాకూ మధ్య అడ్డుగోడగా తయారైంది. ఇక వీళ్ళతో నేను వేగలేను. మధ్యలో ఈ లంపటాన్ని తీసేసి నేరుగా మీరే మాతో డీల్ చేయండి. లేదా మా ప్రభుత్వంతో సంధానానికి ఒక మినిస్టర్ హోదా అధికారిని ప్రత్యేకంగా పంపండి. ఈ రెండూ మీకు సమ్మతం కాకపోతే మీతో కలిసి పనిచెయ్యటం నా వల్ల కాదు. తాత్కాలిక ప్రభుత్వం నుంచీ, ఐఎన్‌ఎ బాధ్యత నుంచీ నేను తప్పుకుంటాను. ఏ ఐదొందల మంది తోనో ఆత్మాహుతి దళం వెంటతీసుకుని మీతో సంబంధం లేకుండా నేనే నా మానాన యుద్ధానికి వెళతాను. ఇక మీ ఇష్టం.’’ అని నేరుగా జపాన్ ఫారిన్ మినిస్టరు షిగెమిత్సుకు నేతాజీ ఘాటైన లేఖ రాశాడు. దాన్ని చూసి టోక్యోకు కంగారు పుట్టింది. హికారీ కికాన్ పెద్ద తలకాయలకు గట్టిగా కీ ఇచ్చింది. అటు తరవాత కికాన్ వైపు నుంచి నేతాజీకి చికాకులు పోయాయి.
బోస్ రంగప్రవేశం వరకూ ఐఎన్‌ఎ అంటే జపాన్ సైన్యాధికారులకు చాలా లోకువ. జీతాలు, ఆయుధాలు ఇస్తున్నది తామే కాబట్టి అది తమ ఆధిపత్యానికి లోబడి ఉండాలని జపాన్ వాళ్ల భావన. మేము దయ తలచి చేరదీశాము కనక యూనిఫాంలు వేసుకుని దర్జాగా తిరుగుతున్నారు. నిజానికి వీళ్ళు మా చెరలో ఉండవలసిన యుద్ధ ఖైదీలే కదా అని వారికి చిన్నచూపు. అందుకే ఐఎన్‌ఎలో పెద్ద అధికారి ఎదురుపడ్డా మామూలు జపాన్ సైనికుడు కనీసం సెల్యూట్ చేసేవాడు కాదు. ఆ సంగతి బోస్ గమనించాడు. ఐఎన్‌ఎను మిత్ర సైన్యంగా గుర్తించి సముచిత గౌరవం ఇవ్వాలి; జపానీ, భారతీయ సైనిక దళాలవారు పరస్పరం ఎదురుపడ్డప్పుడు మిలిటరీ ర్యాంకును బట్టి ఎక్కువ వాడికి తక్కువ వాడు సెల్యూట్ చెయ్యాలి అని ఆయన డిమాండ్ చేసి జపాన్ సేనాపతులను ఒప్పించాడు.. మరి ఇద్దరిదీ ఒకే ర్యాంకు అయితేనో? మాది సీనియర్ ఆర్మీ కాబట్టి మీరే మాకు సెల్యూట్ చేయటం సమంజసం అని జపాన్ వాళ్ళు సూచించారు. వీల్లేదు. మీకు మేము మిత్రసైన్యం కాబట్టి ఇరువురూ ఒకరికొకరు ఏకకాలంలో సెల్యూట్ చెయ్యాలని నేతాజీ పట్టుబట్టి సాధించాడు.
ఐ.ఎన్.ఎ. ఉన్నది భారత స్వాతంత్య్రం కోసం పోరాడటానికి. దానిని వేరే పనులకు ఉపయోగించటానికి వీల్లేదు – అన్నది నేతాజీ పాలిసీ. మీకు ఆయుధాలను మేమే ఇచ్చాము కాబట్టి ఆ ఆయుధాలతో మా యుద్ధాలు చేయండి అని ఆయన జపాన్ అడిగినా ఒప్పుకోలేదు. 1944 ఆగస్టులో జపాన్ సేనను ముట్టడించిన సయామీల మీద యుద్ధానికి ఐ.ఎన్.ఎ.ను వాడుకోవాలని జపాన్ చేసిన ప్రయత్నాలను ఆయన పడనివ్వలేదు. అలాగే 1945 మార్చిలో జపాన్ సైన్యంపై తిరగబడిన బర్మా నేషనల్ ఆర్మీని అణచివేయటానికి ఐ.ఎన్.ఎ. సహాయం కోరినప్పుడూ బోస్ మొగమాటం లేకుండా తిరస్కరించాడు.
తన దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాల విషయంలో సుభాస్ చంద్రబోస్ ఎన్నడూ ఎప్పుడూ ఎంతమాత్రం రాజీ పడలేదు. జపాన్ వాళ్ళతో సహా ఎవరికీ తలవంచ లేదు. ఇందుకు సాక్ష్యాలూ రుజువులూ లెక్కలేనన్ని! అయినా- ‘జపాన్‌తో చేతులు కలిపి సుభాస్ చంద్రబోస్ ఘోరమైన తప్పుచేశాడు. భారతదేశాన్ని ఆక్రమించాలన్న జపాన్ వ్యూహానికి పనిముట్టుగా ఉపయోగపడ్డాడు; అతడు వెంటబెట్టుకుని వచ్చిన జపాన్ సేనలు కర్మం చాలక గెలిచి ఉండి ఉంటే బ్రిటన్ స్థానంలోకి జపాన్ వచ్చి భారతదేశాన్ని కబళించి ఉండేది. ఆ రకంగా బోస్ చేసిన ద్రోహం వల్ల దేశం ఇంకో రకం బానిసత్వంలో మగ్గవలసివచ్చేది’ – అని నేటికీ నేతాజీ మీద నిందలువేసే మహా మేధావులను ఏమనాలి?
మిగతా వచ్చేవారం