ఆగస్ట్ 30 శ్రీకృష్ణాష్టమి
‘కృష్ణస్తు భగవాన్ స్వయమ్’ (శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు), ‘సర్వం కరోతీతి కృష్ణః’ (అన్నిటిని చేయువాడు కనుక కృష్ణుడు) అని మహర్షులు శ్రీకృష్ణావతారాన్ని కీర్తించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధ్యేయంగా ఏర్పడిన పది అవతారాలలో ఈ ఎనిమిదవది సంపూర్ణ అవతారమని (రామావతారం కూడా), మిగిలినవి అంశావతారాలని, ‘పరమాత్మ’ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లిందని చెబుతారు. పుట్టినప్పటి నుంచి అవతార పరిసమాప్తి వరకు ప్రతి సందర్భంలో తాను దేవుడిననే నిరూపిస్తూనే ఉన్నాడు. ఆయనను భక్తితో కొలుస్తూ అనుసరించిన వారు ఆపదల నుంచి గట్టెక్కారు. అదే సమయంలో ఆయన లీలలను భగవత్ సంబంధితాలుగా గుర్తించక, ఆయనను మానవమాత్రుడిగా పరిగణించి అవమానించిన వారు మూల్యం చెల్లించుకున్నారు. శ్రీకృష్ణుడు ఆరాధ్యులకు ఆనంద స్వరూపుడు. ఆపన్నులకు జగన్నాథుడు, నమ్మినవారికి కొంగుబంగారం, జ్ఞానులకు వేదవేద్యుడు. ఇష్టులకు జగన్నాటక సూత్రధారి, అనిష్టులకు కపట నాటక సూత్రధారి, పెద్దలు మెచ్చిన విధేయుడు, ఆదర్శ శిష్యుడు. అమాయక తల్లికి అల్లరి తనయుడు. అమిత స్నేహశీలి. చక్రం పడితే కోపధారి. నెగ్గాలన్న పట్టుతో పాటు తగ్గాలన్న విడుపు కలవాడు. భాగవత కృష్ణుడు సున్నితమనస్కుడు, అమాయకుడు, గోపీజనవల్లభుడు. మహాభారతంలో మేధావి, రాజనీతిజ్ఞుడు, వ్యూహకర్త.
ధర్మపక్షపాతి
కృష్ణ చరితం గంభీరమైంది. ఆయన ఆవిర్భావ కాలమే విషమ సమయం. పుట్టింది మొదలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఎన్నో ఆపదలను అధిగమించాడు. ఒక కవి అన్నట్లు ‘అడుగడుగున గండాలైనా ఎదిరీది నిలిచాడు’. పాండవపక్షపాతిగా ఆయన చర్యలను తప్పుపడుతూ విమర్శించినవారు, విమర్శిస్తున్న వారు లేకపోలేదు. అయితే వాచామగోచరమైన పరబ్రహ్మ తత్త్వాన్ని లోకానికి అందించిన ‘జగద్గురువు’కు లోకజ్ఞానం లేదా? లేక లోకవ్యవహారం తెలియదను కోవాలా? ఆర్తత్రాణ పరాయణత మహనీయుల, అందునా అవతార పురుషుల లక్షణం. అందుకే ఆశ్రితులను ఆదుకునేందుకు, లోకరక్షణకు శ్రీకృష్ణుడు మానవమానాలకు, సుఖదుఃఖాలకు అతీతంగా వ్యవహరించాడని విజ్ఞులు చెబుతారు. కురుక్షేత్రంలో భీష్మునిపై చకప్రయోగానికి సంసిద్ధులు కావడమే అందుకు ఉదాహరణ. ‘సమరంలో ఆయుధం పట్టను. తోచిన సలహా మాత్రమే చెబుతాను’ అని షరతు పెట్టిన భగవానుడు దానిని మరచినట్లు భీష్మ శరధాటికి తట్టుకోలేక చక్రాయుధ ప్రయోగానికి దిగాడంటే ఆయన మాట తప్పాడా? ధర్మం మరిచాడా? అనే సందేహాలు విమర్శకులకు, వ్యాఖ్యాతలకు కలగక మానవు. కానీ ఆయన దృక్పథం వేరు. తనను నమ్ముకున్న పాండుసుతులను కాపాడడం ఒక కారణం కాగా, ధర్మపరిరక్షణ యత్నం రెండవది. అధర్మం పెరిగి, ధర్మం నశించేటప్పుడు తనను తాను సృష్టించు కుంటానని (ధర్మ సంస్థాపనార్థాయ/సంభవామి యుగేయుగే’) చెప్పుకున్న దానికి కట్టుపడ్డాడు. ధర్మంగా గెలవాలంటే మొదట ధర్మబద్ధులను కాపాడుకోవాలి. ఆ కోణంలో భీష్ముడిపై చూపినది ధర్మాగ్రహమే కానీ ఆయనపై కోపం కాదు. సంగరంలో కురు పితామహుడిని నిలువరించకపోతే ప్రతికూల ఫలితం రావచ్చు. అప్పుడు దుర్యోధనుడే చక్రవర్తిగా కొనసాగవచ్చు. అలాంటప్పుడు ఇక ధర్మపరిరక్షణ మాటెక్కడ? అన్నది ఆయన ఆలోచన కావచ్చు. అందుకే తన ప్రతిష్టకు మచ్చని తెలిసినా ఎత్తులతో కథ నడిపాడు. ‘నువ్వే తలచుకుంటే యుద్ధం ఆగేది కాదా? నీ పన్నాగంతో ధార్తరాష్ట్ర వంశం అంతరిస్తు న్నట్లే, నీ యదువంశం కూడా పరస్పర కలహాలతో కూలిపోతుంది’ అని గాంధారి శాపాన్ని పొందాడు. పరమాత్ముడై ఉండి కూడా ప్రతిచర్యకు పూనుకోలేదు. ఆ పరిణామాలను అవతారంలో భాగంగానే పరిగణించాడు.
స్థితప్రజ్ఞత్వం
సమస్యలను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప భయపడి పారిపోకూడదని, ఆత్మ విశ్వాసంతో చివరి వరకు పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు శ్రీకృష్ణుడు. ఈ క్రమంలో అవసరమైతే పట్టువిడుపులు ఉండాలని, సమయానికి తగిన వ్యూహరచన చేయాలని అనుభవపూర్వకంగా నిరూపించాడు. ‘శిశుప్రాయంలో పూతన జీవితాపహరణం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు సంఘటనలను పరిశీలిస్తే అనేక కోణాలు అవిష్కృతమవుతాయి. కష్టసుఖాలు, సుఖదుఃఖాలు, ఎగుడుదిగుళ్లు జీవితంలో భాగ మంటూ, వాటిని ఎలా అధిగమించాలి? ఎలా ఆనందమయం చేసుకోవాలి? అని చాటిచెప్పిన చైతన్యమూర్తి. జరాసంధ, కాలయవనులతో యుద్ధ ఘట్టాలే అందుకు ఉదాహరణ. జరాసంధుడితో పదిహేడుసార్లు తలపడవలసి వచ్చినా పట్టువీడలేదు. శత్రువును తుదముట్టించేందుకు ఒక అడుగు వెనక్కి వేసినా అది బలహీనత కాదని, విజయానికి పునాదన్నది ‘శ్రీకృష్ణ యుద్ధనీతి’. కాలయవనుడి విషయంలో దీనిని అనుసరించాడు. సైన్యసమేతంగా పోరుకు వచ్చిన కాలయవనుడి ఎదుట నిరాయుధు డిగా నిలిచాడు. అతనికి భయపడినట్లు నటించి పరుగులు తీసి శిథిలగుహలోకి దారితీశాడు. ఆయనని అనుసరించిన కాలయవనుడు గుహలోకి ప్రవేశించి అక్కడ గాఢాంధకారంలో గాఢనిద్రలో ఉన్న వృద్ధుడిని (కాలయవనుడి మరణ కారకుడు) కృష్ణుడిగా భావించి కాలితో తట్టిలేపాడు. నిద్రాభంగాన్ని సహించలేని ఆ ముని (ముచకుందుడు) కళ్లు తెరిచేసరికి ఆయన నేత్రాగ్నికి కాలయవనుడు నిట్టనిలువున భస్మమయ్యాడు. అది యుద్ధతంత్రమే కాదు. ముచకుందుడికి మోక్షప్రదాన లక్ష్యం క•డా.
త్రేతాయుగంలో రామదండు లాంటిదే ద్వాపరంలో ‘కృష్ణ మిత్రమండలి’. ఇందులో చోటు దొరికితే అదృష్టమే. ఆనక క్రిష్ణయ్యే కాపాడుకుంటాడనే భావనలో ఉండేవారట. ఆయనను చూడకుండా మిత్రులు క్షణం కూడా ఉండలేకపోయేవారు. అడవిలో చద్దులు తింటున్నప్పుడూ వృత్తాకారంలో కూర్చునే వారు. ఆయన అందరికీ కనిపించాలని. జతగాళ్లంటే ఆయనకు అంతే ప్రేమ. స్నేహానికి చనువు, బంధుత్వా నికి గౌరవం ఇచ్చాడు. ‘వెన్నదొంగ, గొల్లగోపాలా’ అని చిన్నతనంలో ఆటపట్టించిన అర్జునుడు అనంతర కాలంలో చెప్పిన క్షమాపణను మృదువుగానే స్వీకరించాడు. ఒకవంక బావ (సోదరి సుభద్ర భర్త), మరోవంక తాను అతనికి సారథి. అర్జునుని ఆ రెండు స్థానాలూ గౌరవనీయమైనవే. అందుకే ఆ అంతరం పాటించాడు శ్రీకృష్ణుడు. పశ్చాత్తాపం ప్రకటించిన పార్థుడితో ‘నీ తేరు తోలేవాడిని.. అంత మాట లెందుకులే బావా!?’ అని పెద్ద మనసుతో మన్నించాడు. ముఖ్యంగా అమ్మంటే ఎంతో ఇష్టం. జగన్నాథుడైనా తల్లి అమాయక శిశువుగా వర్ధిల్లాడు. అవతారపురుషుడు, అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు బందీ అయ్యాడు.
‘చిక్కడు సిరి కౌగిటిలో/జిక్కడు సనకాది యోగిచిత్తాబ్జములన్/చిక్కడు శ్రుతి లతికావళి/జిక్కెనతడు లీల దల్లి చేతన్ రోలన్’… అని పోతన చిన్ని కన్నయ్య లీలను వివరించారు. ఆదిమధ్యాంత రహితుడు తల్లి అమాయకత్వానికి కరిగిపోయాడు. అందుకే లక్ష్మీదేవి కౌగిలికి, వేదవేత్తలకు, సనకాది మునుల చిత్తాలకు చిక్కనివాడు ప్రేమమయి అయినా తల్లి చేతికి లీలావిలాసంగా దొరికిపోయాడు.
రూపేచ కృష్ణ
ఉత్తమ ఇల్లాలికి ఉండవలసిన లక్షణాలను ‘కార్యేషు దాసీ కరణేషు మంత్రి’ శ్లోకం చెప్పినట్లే, ఉత్తమ పురుషుడి లక్షణాలను ‘కామందక’ శతక శ్లోకం చెబుతోంది. ఇల్లాలిని ‘రూపేచ లక్ష్మీ’ అని పోలిస్తే, ఈ శతకంలో భర్తను ‘రూపేచ కృష్ణః’ అని అభివర్ణించడాన్ని బట్టి శ్రీకృష్ణుడిది మోహనరూపం అని అవగతమవుతుంది.
‘కార్యేషు దక్షః కరణేషు యోగీన/రూపేచ కృష్ణః క్షమయాత రామే/భోజ్యేషు తృప్తః సుఖ దుఃఖ మిత్రమ్/షట్కర్మయుక్తాః కుల ప్రాణనాథః’…కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించేవాడని అర్థం. అందుకే ఆయన ముగ్ధమోహన రూపాన్ని…
‘మధురం మధురం అధరం మధురం/అధరము సోకిన వేణువు మధురం/నామం మధురం రూపం మధురం/పిలుపే మధురం తలపే మధరుం/నీవే మధురం..’ అని ఎంతగానో కీర్తిస్తారు. జన్మిస్తూనే తల్లిదండ్రులు దేవకీవసుదేవులకు నిజరూపం సందర్శనం భాగ్యాన్ని కలిగించిన మోహనాకారుడు. కృష్ణభక్తుల నుంచి ‘కృష్ణవైరుల’దాకా ఆయన రసరమ్య రూపాన్ని పొదవి పట్టాలని ప్రయత్నించినవారే. ఆయనను చేరాలని, ఆయన కావాలని కోరడం అంటే వారి జీవనంలోకి కృష్ణతత్వాన్ని ఆహ్వానించడంగానే భావించాలి.
‘అష్టమి’ విశిష్టత..
అష్టమినాడు జన్మించినందున ‘జన్మాష్టమి’ అని, నామకరణానంతరం ‘కృష్ణాష్టమి’, చిన్నతనంలో గోకులంలో పెరగడం వలన ‘గోకులాష్టమి’ అని, శ్రీకృష్ణుని జన్మదినం కనుక ‘శ్రీకృష్ణ జయంతి’ అని, లోకానికి శ్రీకరం కనుక ‘శ్రీజయంతి’ అని వ్యవహారంలోకి వచ్చింది. శ్రావణ బహుళ అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో రాత్రి అవతరించాడు కనుక ఆ తిథినాడు పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం పూజాదికాలు నిర్వహిస్తారు. శ్రీకృష్ణ జనన సూచకంగా ఉయ్యాలలు కట్టి బాలకృష్ణుడిని ఆడించడం, విగ్రహాన్ని మంచంపై పడుకోబెట్టి పూజించడం, వివిధ భక్ష్యాలను నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తోంది. బాల్యంలో వ్రేపల్లెలో బాల కృష్ణుని లీలలకు గుర్తుగా ఉట్లు కొట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ఆయనను దివ్య మంగళ విగ్రహదేవుడు, జగదానందకారకుడు, జగన్నాటక సూత్రధారి, రాధామానసచోరుడు, సత్యావిధేయుడు.. ఇలా ఎన్నిపేర్లతో పిలిచినా జనబాహుళ్యాన్ని అలరించేది బాలకృష్ణ రూపమే.
దేశవ్యాప్తంగా అన్ని వైష్ణవ ఆలయాలలో కృష్ణాష్టమి వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి. గురాత్‌లోని ద్వారకలోని ద్వారకాధీశుని ఆలయంలో, ఉత్తరప్రదేశ్ మధురలో, బృందా వనంలో, ఒడిశాలోని పూరీ జగన్నాథస్వామి, కేరళలోని గురువాయూర్‌లోని గురువాయూరప్పన్, చెన్నైలోని పార్థసారథి స్వామి, తిరువాయూరులోని రాజగోపాల ఆలయం, కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణాలయం తదితర ప్రముఖ ఆలయాలు ప్రత్యేక అలంకరణలతో కనువిందు చేస్తాయి. దేశ విదేశాల లోని ‘ఇస్కాన్’ మందిరాలు ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తాయి. తిరుమలలో శ్రీనివాసమూర్తి పక్కనే కొలువై ఉన్న కృష్ణస్వామికి అర్చన చేస్తారు. ఆ రోజు సాయంత్రం శ్రీవారు ప్రత్యేకంగా కొలువు తీరుతారు. దీనిని ‘గోకులాష్టమి ఆస్థానం’గా వ్యవహరిస్తారు. స్వామివారు సర్వాలంకారణ భూషితులై• సర్వభూపాల వాహనంపై ఆస్థానానికి వేంచేస్తారు. మరునాడు నాలుగు మాడ వీధులలో ఉట్ల పండుగా జరుగు తుంది. అయితే కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహించగా, ఈసారి కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు.
జగద్గురువు
చేదు మందును తీపి పూతతో తినిపించడం వైద్యులకు, కఠినమైన పాఠాలను శిష్యులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడం బోధనా నైపుణ్యం గల ఉత్తమ గురువుకే తెలుస్తుందన్నట్లు ఆ తరహాలో ‘గీత’ను బోధించినందుకే శ్రీకృష్ణుడు ‘జగద్గురువు’ అయ్యాడు. ఒక అధ్యయనం ప్రకారం, 5122 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు తన 87వ ఏట ‘గీతాబోధ’ చేశారు. కృష్ణపరమాత్మ భూతలంపై 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించారని పెద్దలు నిర్ధారించారు. అర్జునుడి మోహాంధకారాన్ని తొలగించే నెపంతో బోధించిన ఈ ‘గీత’ సమస్త మావవాళికి ఆదర్శ గ్రంథమైంది. వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలిచింది. ఇది ఏ ఒక్క మతానికో, జాతికో పరిమితం కాదు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు ధర్మబద్ధంగా, సజావుగా సాగేందుకు, ఆదర్శవంతమైన సమాజ స్థాపనకు సర్వకాలాలకు, సర్వ ప్రాంతాలకు ఆరాధ్యనీయమైంది. ‘మానవుడు ఆత్మశక్తి కోల్పోయినప్పుడు గీత నూతన తేజస్సును ప్రసాదించి పునరుజ్జీవింపచేస్తుంది’ అని స్వామివివేకానంద; ‘నాకు ఎప్పుడు ఏ సందేహం కలిగినా భగవద్గీతను చేతిలోకి తీసుకుంటాను. అన్ని సమస్యలకు పరిష్కారాలు అందులో కనిపిస్తాయి’ అని గాంధీజీ ప్రస్తుతించారు. ‘తెల్లవారిని పారదోలేంత వరకు నిద్రపోం’ అని లోకమాన్య బాలగంగాధరతిలక్ లాంటివారు ‘గీత’ సాక్షిగా ప్రమాణం చేశారట.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్