-ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

ఆర్జీ హుకూమత్‌ ఎ ఆజాద్‌ ‌హింద్‌

Provisional Government of Free India

స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం

అది మహా ఘనత వహించిన బ్రిటిషు మహా సామ్రాజ్యానికి దిమ్మ తిరిగేట్టు చేసిన సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌మాస్టర్‌ ‌స్ట్రోకు!

స్వాతంత్య్ర సమరాన్ని సమర్థంగా నడపాలంటే ఏ పరాధీన జాతికైనా ఒక సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌తప్పనిసరి. ఇంచుమించుగా రెండు శతాబ్దాల తరబడి పారతంత్య్రంలో మగ్గుతున్నా భారతదేశంలో అలాంటి కేంద్రీయ పోరాట వ్యవస్థ రూపొందలేదు. బ్రిటిషు దురాక్రమణదారులే తమ అవసరాల కోసం పని గట్టుకుని పెట్టించిన జాతీయ కాంగ్రెసు పేరుకైతే ఉంది. అది కలగూరగంప. లెక్కలేని వైరుధ్యాలున్న నానాజాతి సమితి. స్వాతంత్య్రం కోసం తెగించి పోరాడుతున్న వారిలో కాంగ్రెసు లోపల ఉన్నవారి కంటే వెలుపల ఉన్నవారి సంఖ్యే బహుశా ఎక్కువ. నాయకులందరూ జైలు పాలై క్విట్‌ ఇం‌డియా ఉద్యమం క్రమేణా నీరుకారిన తరువాత కాంగ్రెసు ప్రభావం నామమాత్రమైంది.

అసలైన దేశం లోపలే జాతీయోద్యమం డీలాపడిన సమయాన బయటి నుంచి ఎవరో ఏదో చేసి బ్రహ్మాండం బద్దలు కొడతారన్న భయం నిన్న మొన్నటి దాకా బ్రిటిష్‌ ‌ప్రభువులకూ లేదు. వారి శత్రువులకూ లేదు. జపాన్‌ ‌వాళ్లు తమ చేతికి చిక్కిన భారత యుద్ధ ఖైదీలను దువ్వి ఐఎన్‌ఎను పెట్టించింది బ్రిటన్‌ ‌మీద ప్రాపగాండా యుద్ధానికి వాటంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోటే. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌స్వయంగా రంగంలోకి దిగిన తరవాతా ఇండియన్ల ప్రతాపం మీద జపాన్‌ ‌వారి చిన్నచూపు మారలేదు. ‘‘మీరేమీ ప్రత్యక్షంగా యుద్ధం చేయనక్కర లేదు. అదంతా మేమే చూసుకుంటాం. మీరు కాస్త మాకు సాయంగా ఉండి భారత ప్రజల్లో మా పట్ల కాస్త అనుకూలత కలిగిస్తే చాలు’’ అని జపాన్‌ ‌సైనిక కమాండర్‌ ‌తెరౌచీ సింగపూర్లో తనను కలిసిన సుభాస్‌ ‌బోస్‌కే నేరుగా చెప్పాడు.

‘‘అది ససేమిరా కుదరదు. మా రక్తం చిందించి మా స్వాతంత్య్రం మేమే సాధించుకుంటాం’’ అని బోస్‌ అతగాడి మొగానే తెగేసి చెప్పాడనుకోండి. కాని – భారత జాతీయ సైన్యాన్ని కేవలం తనకు పంచమాంగదళంగా వాడుకోవాలన్నదే జపాన్‌ ఎత్తుగడ అన్నది పాయింటు. అటువంటి జపాన్‌ ‌వాళ్లనే తన దారికి రప్పించుకుని, వారి గడ్డమీదే ప్రవాస ప్రభుత్వాన్ని స్వతంత్రంగా ఏర్పరచి తెల్లవాళ్ళ గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన మొనగాడు నేతాజీ సుభాస్‌ ‌చంద్రబోస్‌!

అప్పటిదాకా తూర్పు ఆసియాలో పనిచేస్తున్న ఐ.ఎన్‌.ఎ.‌కు గాని ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ (ఐ.ఐ.ఎల్‌.)‌కు గాని చట్ట ప్రతిపత్తి లేదు. భారత స్వాతంత్య్రం కోసం పోరాడేందుకు న్యాయపరమైన అధికారమూ వాటికి లేదు. పైగా ఐ.ఎన్‌.ఎ.‌లో చేరింది యుద్ధ ఖైదీలుగా జపాన్‌ ‌చేతికి చిక్కిన భారత సైనికులు. బ్రిటిష్‌ ‌వారి కొలువులో ఉన్న ఉద్యోగులు వారు. అలాంటివాళ్ళు తమ దేశ స్వాతంత్య్రం కోసమే అయినా – బ్రిటిష్‌ ‌సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడితే అది చట్టప్రకారం రాజద్రోహమవుతుంది. ఆ నేరానికి భవిష్యత్తులో వారిని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ఉరి తీసినా అది న్యాయబద్ధమే అవుతుంది.

సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించటంతో పరిస్థితి మౌలికంగా మారింది. యుద్ధ ఖైదీలకు, వారితో ఏర్పడిన సైనిక దళాలకు, వాటిని నడిపే వ్యక్తులకు అంతకుముందు వరకూ లేని అథారిటీ తాత్కాలిక ప్రభుత్వం గొడుగు కిందికి వచ్చాక సమకూడుతుంది. తాత్కాలిక ప్రభుత్వం ఆయుధాల సరఫరా, ఆర్ధిక సహాయం, సైనిక సామగ్రి, వేరొక భూభాగంలో స్థావరాల ఏర్పాటు వగైరాలకు సంబంధించి అవసరమైతే వేరొక రాజ్య ప్రభుత్వంతో ఒడంబడిక కుదుర్చుకొనగలదు. ఇతర దేశాల ప్రభుత్వాల చేత గుర్తింపు కూడా పొందగలిగితే ఆ ప్రభుత్వానికి అంతర్జాతీయ ప్రతిపత్తి కలుగుతుంది. అది నడిపే స్వాతంత్య్ర పోరాటం అంతర్గత దేశీయ వ్యవహారం నుంచి అంతర్జాతీయ రాజకీయ వివాదం స్థాయికి చేరుతుంది. తాత్కాలిక ప్రభుత్వం పద్ధతి ప్రకారం యుద్ధాన్ని ప్రకటించి, తన సార్వభౌమత్వానికి లోబడిన సేనలచేత యుద్ధం సాగిస్తే, అంతర్జాతీయ యుద్ధ నియమాలూ, న్యాయ సూత్రాలూ ఆ సేనలకు వర్తిస్తాయి. ఇది తెల్ల దొరతనం ఊహించని పరిణామం.

బ్రిటన్‌కే కాదు. జపాన్‌లోనూ ఇది మింగుడు పడని అహంకారులు చాలా మంది ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వాన్ని అనుమతిస్తే జపాన్‌ ‌దానిని ఆధికారికంగా గుర్తించవలసి వస్తుంది. ఒక స్వతంత్ర రాజ్యానికి కల్పించే సదుపాయాలు, దౌత్య మర్యాదలు, ప్రత్యేక హక్కులు ఆ ప్రభుత్వానికి కూడా వర్తింపజేయాలి. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వానికీ, ఐఎన్‌ఎకూ, తూర్పు ఆసియాలోని దాని జాతి జనులకూ అన్ని విషయాలలోనూ సమాన ఫాయా ఇవ్వవలసి ఉంటుంది. జపాన్‌ ఆధిపత్యంలోని వార్‌ ‌జోన్లలోని భారత జాతీయులు ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వ అధికార పరిధి కిందికి వస్తారు. జపనీస్‌ ‌పౌర, సైనిక చట్టాలు వారికి వర్తించక పోవచ్చు. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌వెళితే జపాన్‌ ‌చక్రవర్తి ఆయనను ఒక స్వతంత్ర రాజ్యాధినేత లాగే రిసీవ్‌ ‌చేసుకోవాలి. జపాన్‌కు చెందిన అత్యున్నత స్థాయి మిలిటరీ కమాండర్లూ, ఐఎన్‌ఎ ‌కమాండర్లూ సమానులు అవుతారు. ఐఎన్‌ఎనూ భారతీయ సంస్థలనూ తమ కాళ్ళ దగ్గర పడి ఉండి తమ దయాధర్మం మీద బతకాల్సిన తాబేదార్లుగా తలచే జపానీ సైన్యాధి కారులకు అది సుతరామూ ఇష్టం లేదు. ఐఎన్‌ఎతో లైజానింగు కోసం జపాన్‌ ‌ప్రభుత్వం ఏర్పరిచిన ‘హికారీ కికాన్‌’ ‌బాసులకు మరీనూ.

తాత్కాలిక ప్రభుత్వం ఏర్పరచనున్నట్టు జూలై 4న సింగపూర్‌ ‌సభలో బోస్‌ ‌మొదటిసారి ప్రకటించి నప్పుడు అక్కడే ఉన్న కికాన్‌ అధికారులు తుళ్లిపడ్డారు. మాకు చెప్పా పెట్టకుండా అలా ఎలా ప్రకటిస్తారని తెగ గింజుకున్నారు. టోక్యోకు పితూరీలు చేశారు. తమ ప్రధానమంత్రే గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చాడని తెలిశాక కూడా రాబోయే ప్రభుత్వంలో ఎవరుండాలి, విధాన ప్రకటన ఎలా చేయాలి అన్నవాటిలో వేలు పెట్ట చూశారు. వాటిపై బోస్‌ ఏమనుకుంటున్నదీ కూపీ లాగటానికి ఆపసోపాలు పడ్డారు.
సుభాస్‌ ‌బోస్‌ ‌వారిని తలదన్నిన వాడు. కనీసం మర్యాదపూర్వకంగానైనా కికాన్‌ అధికారులను సంప్రదించకుండా, అసలు దగ్గరికే రానివ్వకుండా సర్వ స్వతంత్రంగా వ్యవహరించాడు.

నేతాజీ అద్భుత కార్యశైలికి మచ్చుకు ఒక ముచ్చట. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వంలో ప్రచార శాఖ మంత్రిగా పనిచేసిన ఎస్‌.ఎ. అయ్యర్‌ ‌మాటల్లో..

‘‘ఇండియా నుంచీ విదేశాలనుంచీ అందిన సమాచారాన్ని చెప్పటం కోసం నేను ప్రతి రాత్రీ 11 గంటలకు నేతాజీని ఆయన నివాసంలో కలుస్తూండే వాడిని. ప్రభుత్వ ఆవిర్భావానికి మూడు రోజుల ముందు అక్టోబర్‌ 18 ‌రాత్రి మామూలుగా ఆయనను కలసినప్పుడు ‘ప్రభుత్వాన్ని ఆవిష్కరించే ప్రకటనను తయారు చేయాలి. ఇప్పటిదాకా నేను ఏమీ ఆలోచించలేదు. రేపు త్వరగా రా.’ అన్నారు. మర్నాడు సాయంత్రం 6 కల్లా టైప్‌ ‌రైటరూ, తెల్ల కాగితాలూ తీసుకుని ఆయన బంగాళాకు వెళ్ళాను. సముద్రాన్ని, లాన్‌నూ ఫేస్‌ ‌చేసే వెనుక వరండాలో నేతాజీ కాసేపు నాతో మాట్లాడి, భోజనం తరవాత పని మొదలుపెడదామన్నారు. ఆ పూట తనను కలిసేందుకు 11 మందికి విడివిడిగా ఆయన టైం ఇచ్చి ఉన్నారు. ఆ సంగతి నాకు తెలియదు. రాత్రి 9 గంటలకు నేతాజీ, నేను, ఇద్దరుముగ్గురు పర్సనల్‌ ‌స్టాఫ్‌ ‌కలిసి భోజనం చేశాం. ఆ సమయాన ఆయన ఏదో ఆలోచిస్తూ గంభీరంగా ఉన్నారు. తరవాత నేను ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ టైప్‌ ‌రైటర్‌తో ముందు గదిలో సిద్ధంగా ఉన్నాను. విజిటర్లు ఒకరి తరవాత ఒకరు వెళ్లి కలుస్తున్నారు. అర్ధరాత్రి కూడా దాటింది. నాకు నిద్ర ముంచుకొస్తున్నది. ఈ రాత్రి పని అయ్యేట్టు లేదు. ఇంటికెళ్ళి పడుకుంటే బాగుండు అనిపించింది. తరవాత చాలా సేపటికి నాకు పిలుపు వచ్చింది.

నేను డ్రాయింగ్‌ ‌రూమ్‌లోకి వెళ్లేసరికి కెప్టెన్‌ ‌లక్ష్మీ స్వామినాథన్‌ ‌నేతాజీని కలిసి బయటికి వస్తున్నది. ఆమెను సాగనంపటానికి నేతాజీ స్టడీ రూమ్‌ ‌బయటికి వచ్చారు. ‘జై హింద్‌’ అని నమస్కరించి కెప్టెన్‌ ‌లక్ష్మి వెళ్ళిపోయింది. స్టడీ రూము చిన్నది. పొడవు, వెడల్పు 10 అడుగులు మించవు. మధ్యలో టేబిల్‌. ‌వెనుక గోడకు అల్మైరా. ఒక మూల రేడియో సెట్టు. టేబిల్‌ ‌ముందు రెండు విజిటర్స్ ‌కుర్చీలు. రాసుకోవటానికి వీలుగా డెస్క్ ‌మీద టేబిల్‌ ‌లాంపు.
‘భలే పిల్ల. దేవుడు తనను చల్లగా చూడాలి’ అని లక్ష్మిని ఉద్దేశించి మెల్లిగా అన్నాక నేతాజీ నన్ను కూర్చోమన్నారు. ‘ఇక మొదలెడదాం. ఇప్పటిదాకా నేను ఏమీ ఆలోచించలేదు. ఎలాగైనా ఈ రాత్రే పూర్తిచెయ్యాలి. స్వాతంత్య్ర ఉద్ఘోషణ ప్రకటనతో పాటు ఒక స్టేట్‌మెంటు కూడా డ్రాఫ్ట్ ‌చెయ్యాలి’ అంటూ ఒక పెన్సిల్‌నూ కాసిని కాగితాలనూ చేతిలోకి తీసుకున్నారు. అప్పుడు కళ్ళారా చూశాను ఒక అద్భుతాన్ని!

‘1757లో బెంగాల్‌లో బ్రిటిష్‌ ‌వారి చేతుల్లో మొదటిసారి ఓడిపోయాక’ అంటూ మొదలెట్టి వంచిన తల ఎత్తకుండా, క్షణం కూడా ఆగకుండా, నేతాజీ చకచకా రాయటం మొదలెట్టారు. మొదటి కాగితం కాగానే నా చేతికి ఇచ్చి రెండోది మొదలెట్టారు. నేను పరుగెత్తుకు వెళ్లి టైప్‌ ‌రైటర్‌ ‌ముందు కూర్చున్నాను. టైప్‌ ‌చేసింది సరిచూసుకునేలోపే ఆబిద్‌, ‌స్వామి వంతులవారీగా వెళ్లి తరవాత కాగితం పట్టుకు వచ్చారు. అలా షీటు తరవాత షీటు నేతాజీ రాసిపంపుతూనే ఉన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే కిందటి కాగితంలో ఏమి రాశానో చూడాలని అని ఆయన ఒక్కసారికూడా అడగలేదు. ఏకధారగా రాస్తూనే ఉన్నారు. రాసినదానిలో ఒక్క హంసపాదు లేదు. ఒక్క కొట్టివేత లేదు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వ ఆవిర్భావాన్ని లోకానికి చాటే 1500 పదాల చరిత్రాత్మక పత్రాన్ని ఏదో చిన్న ఉత్తరాన్ని రాసినంత అలవోకగా నేతాజీ రాసేశారు. నేను టైపు చేసింది రెండు మూడు సార్లు సరిచూసుకున్నాక నేతాజీ చేతిలో పెడితే ఆయన ఒకసారి తిరగేసి పక్కన పెట్టారు. మళ్ళీ దానిలో ఒక్క అక్షరమూ మార్చలేదు. దాని తరవాత ప్రభుత్వం ఏర్పాటు ప్రకటన తయారు చేయటంలో పడ్డారు. రాత్రంతా బ్లాక్‌ ‌కాఫీ సిప్‌ ‌చేస్తూనే ఉన్నారు. అంతా అయ్యేసరికి ఉదయం 6 అయింది. అప్పుడు ‘ఇక పడుకుంటా. సాయంత్రం రా’ అన్నారు నేతాజీ.’’

[Unto Him a Witness, S.A. Ayer, pp. 159-165]

కోట్లాది దేశభక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం 1943 అక్టోబర్‌ 21‌న సింగపూర్‌లోని కేథె సినిమా బిల్డింగు ఆడిటోరియంలో ఆగ్నేయాసియాలోని అనేక దేశాల నుంచి హాజరైన వేలాది ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌ప్రతినిధుల సమక్షంలో ఆవిర్భవించింది.

(పెద్ద సినిమా హాల్‌ ఉం‌డే కేథె బిల్డింగ్‌ అప్పట్లో సింగపూర్లో అతిముఖ్యమైన లాండ్‌ ‌మార్కు. 1943 జూలై 4న రాస్‌ ‌బిహారీ బోస్‌ ఇం‌డియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌పగ్గాలను సుభాస్‌ ‌బోస్‌కు అప్పగించింది ఆ హాల్‌లోనే. ఆజాద్‌ ‌హింద్‌ ‌రేడియో ఆ భవనం నుంచే ప్రసారాలు చేసేది. దాని చారిత్రక ప్రాధాన్యతను పేర్కొంటూ సింగపూర్‌ ‌ప్రభుత్వం ఆ భవనం ముందువైపు అనంతరకాలంలో ఒక కాంస్య ఫలకం పెట్టించింది.)

మలయా, జావా, సుమత్రా, సయాం, ఇండోచైనా, హాంగ్‌కాంగ్‌ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన జనాలతో పెద్ద ఆడిటోరియం, దాని కారిడార్లు, బయట ఆవరణ కూడా అక్టోబర్‌ 21‌న కాలుపెట్ట సందు లేకుండా కిక్కిరిసిపోయాయి. మిన్నంటిన జయజయధ్వానాల నడుమ నేతాజీ లేచి ప్రతిపాదించగానే ప్రతినిధుల మహాసభ ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటును ఏకగ్రీవంగా ఆమోదించి సుభాస్‌ ‌చంద్రబోస్‌ను ప్రభుత్వ అధినేతగా ఎన్నుకున్నది.

అప్పుడు నేతాజీ ప్రభుత్వ లక్ష్యాలను, పూర్వాపరాలను ప్రకటిస్తూ ఇలా అన్నాడు:

‘‘ప్రపంచ చరిత్రనూ, ముఖ్యంగా పలు దేశాల విప్లవాలనూ అధ్యయనం చేసిన వ్యక్తిగా నాకు భారత స్వాతంత్య్ర పోరాటంలో రెండిటి కొరత కనిపించింది. మొదటిది జాతీయ సైన్యం… రెండోది ఆ సైన్యాన్ని యుద్ధానికి నడిపించేందుకు జాతీయ ప్రభుత్వం! ప్రస్తుత యుద్ధంలో జపాన్‌ అద్భుత విజయాల ఫలితంగా తూర్పు ఆసియాలోని భారతీయులు ఇండిపెండెన్స్ ‌లీగ్‌నూ, ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీనీ ఆర్గనైజ్‌ ‌చేయగలిగారు. నేషనల్‌ ఆర్మీ ఏర్పడ్డాక ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం ఆవసర మయింది. నేడు ఈ ప్రభుత్వ ఆవిష్కరణతో భారత స్వాతంత్య్రోద్యమ దిగ్విజయానికి కావలసిన హంగులన్నీ సమకూడాయి. స్వాతంత్య్రం కోసం అంతిమ పోరాటమే ఇక చేయవలసింది. ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ భారత సరిహద్దు లోపలికి చొచ్చుకు వెళ్లి దిల్లీకి మనం చరిత్రాత్మక జైత్రయాత్ర సాగించాలి. ఇండియా నుంచి ఆంగ్లో అమెరికన్లను తరిమేసి న్యూదిల్లీలోని వైస్రాయ్‌ ‌హౌస్‌ ‌మీద భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసేంతవరకూ మనం పోరాటాన్ని ఆపేది లేదు.’’

అనంతరం నేతాజీ ఆజాద్‌ ‌హింద్‌ ‌కేబినెట్‌ ‌మెంబర్ల పేర్లు, వారి శాఖలను ఇలా ప్రకటించాడు:

1. సుభాస్‌ ‌చంద్రబోస్‌ : ‌రాజ్యాధినేత, ప్రధాన మంత్రి, యుద్ధ మంత్రి, విదేశాంగ మంత్రి, ఐ.ఎన్‌.ఎ. ‌సుప్రీం కమాండరు.
2. కెప్టెన్‌ ‌లక్ష్మీ స్వామినాథన్‌ : ‌మహిళా సంఘటన
3. ఎస్‌.ఎ.అయ్యర్‌ : ‌పబ్లిసిటీ
4. లెఫ్టినెంట్‌ ‌కల్నల్‌ ఎ.‌సి.చటర్జీ : ఆర్ధిక శాఖ
5. రాస్‌బిహారీ బోస్‌ : ‌సుప్రీం అడ్వైజర్‌
‌వీరుకాక 8 మంది సాయుధదళాల ప్రతినిధులు, 7గురు అడ్వైజర్లు, ఒక కేబినెట్‌ ‌ర్యాంక్‌ ‌సెక్రెటరీ.

తరవాత సభికులందరూ ఉద్వేగభరితంగా ఆలకిస్తూండగా ఆజాద్‌ ‌హింద్‌ ‌తాత్కాలిక ప్రభుత్వం తరఫున నేతాజీ చరిత్రాత్మక స్వాతంత్య్ర ఉద్ఘోషణ పత్రాన్ని చదివి వినిపించాడు. 1857 నుంచి నాటివరకూ స్వాతంత్య్రోద్యమంలోని వివిధ దశలను సమీక్షించాక-

‘‘మాతృభూమి విమోచన కోసం మనం తలపెట్టిన కార్యానికి దేవుడి దీవెన ఉండాలని ప్రార్థిస్తున్నాం. భారతమాత స్వాతంత్య్రం కోసం, దేశ సంక్షేమం కోసం, అభ్యున్నతికోసం మా ప్రాణాలు అర్పిస్తామని ప్రతినబూనుతున్నాము. బ్రిటిషు వారిని, వారితో జతకలసిన వారిని భారత భూమినుంచి వెళ్ళ గొట్టేందుకు పోరాటం సాగించటం తాత్కాలిక ప్రభుత్వ కర్తవ్యం. అనంతరం భారత ప్రజల అభీష్ట ప్రకారం, వారికి విశ్వాసపాత్రమైన ఆజాద్‌ ‌హింద్‌ ‌జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచటం మన బాధ్యత. తెల్లవారిని కూలదోసినది మొదలు శాశ్వత ప్రభుత్వం ఏర్పడేవరకూ దేశ వ్యవహారాలను ప్రజల పనుపున తాత్కాలిక ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రతి భారతీయుడి విధేయతనూ తాత్కాలిక ప్రభుత్వం అపేక్షిస్తున్నది. తన పౌరులందరికీ మతస్వేచ్ఛనూ, సమాన హక్కులనూ, సమాన అవకాశాలనూ ఈ ప్రభుత్వం గ్యారంటీగా కల్పిస్తుంది. దేవుడి పేరిట, భారతజాతిని మలచిన వెనకటి తరాల పేరిట, శౌర్యాన్ని, అత్మత్యాగాన్ని మనకు అలవరచిన మృతవీరుల పేరిట భారత ప్రజలందరికీ ఇదే మా పిలుపు. తాత్కాలిక ప్రభుత్వ ఛత్రం కింద సంఘటి తమవండి. బ్రిటిషు వారిపై చివరిపోరాటం మొదలెట్టండి. శత్రువును పారదోలి మళ్ళీ మనది స్వతంత్ర జాతి అయ్యేంతవరకూ పరాక్రమంతో పట్టువదలక పోరాడండి.’’ అంటూ స్వాతంత్య్ర ఉద్ఘోషణను ఎడతెగని చప్పట్ల నడుమ ముగించాడు.

ఇక కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకారం. ఆ ముచ్చటను ఆ సమయాన అక్కడే ఉన్న కొత్త ప్రభుత్వ సలహాదారు జాన్‌ ‌థివీ మాటల్లో ఆలకించండి:
మొదటగా నేతాజీ లేచాడు. భారతదేశానికి విధేయత ప్రమాణం చేస్తూ ‘‘సుభాస్‌ ‌చంద్రబోస్‌ అనే నేను’’ అని ఆయన గంభీరంగా అనగానే సభాప్రాంగణం హర్షధ్వానాలతో చాలాసేపు మారుమోగింది. ‘‘…భారతదేశాన్నీ, నా 38 కోట్ల దేశ వాసులనూ విముక్తి చేయటానికి ఈ పవిత్ర స్వాతంత్య్ర సమరాన్ని నా ఆఖరి ఊపిరి వరకూ కొనసాగిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.’’ అన్న వాక్యం మధ్యలోనే నేతాజీ గొంతు గద్గదమైంది. తీవ్ర ఉద్వేగంతో మాట్లాడలేక కాసేపు మౌనంగా ఉండిపోయాడు. శతాబ్దాల పర్యంతం దాస్యపు సంకెళ్ళలో చిక్కుకుని అష్ట దరిద్రంలో అలమటిస్తున్న ప్రియతమ భారత జనయిత్రి ఆయన మనసును తొలిచిందో… మాతృభూమి శృంఖలాలు తెంచటానికి తరతరాలుగా స్వాతంత్య్రవీరులు ధారవోస్తున్న ప్రాణాహుతులు మదిలో మెదిలాయో తెలియదు. చిన్ననాటినుంచీ దేశభక్తి అణువణువూ నిండిన సుభాస్‌ ‌సున్నిత హృదయం తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్ళు జలజల రాలాయి. ఎక్కిళ్ళు వచ్చాయి. చుట్టూ ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు. చీమ చిటుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దం. ఆ సమయాన మహాజన సమూహంలో చెమర్చని కళ్ళు లేవు. తల్లడిల్లే నేతాజీని ఊరడించే సాహసం ఎవరూ చేయలేదు. ఏమి చేయాలో ఎవరికీ అర్థం కాలేదు. అంతలో ఒక ఉత్సాహవంతుడు ‘‘నేతాజీకీ జై’’ అని బిగ్గరగా అరిచాడు. మిగతావారూ గొంతు కలిపారు. నేతాజీకి జయధ్వానాలతో కేథె బిల్డింగ్స్ ‌పరిసరాలు దిక్కులదిరాయి. ఉద్రిక్తత సమసింది. నేతాజీ తెప్పరిల్లి ‘‘నేను ఎల్లకాలం భారతమాత సేవకుడుగానే ఉంటాను. 38 కోట్ల నా సోదరీ సోదరుల సంక్షేమం కోసం పాటుపడతాను. భారత స్వాతంత్య్రం కోసం నా చివరి రక్తపు బొట్టును చిందించటానికి సర్వదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రమాణం కొనసాగించాడు.

[John Thivy in Netaji :His Life And Work , Ed. Shree Ram Sharma, p.284]

కొత్త ప్రభుత్వ మంత్రిమండలి మొట్టమొదటి సమావేశం ఆ రాత్రే జరిగింది. తొమ్మిది స్వతంత్ర దేశాల (1.జర్మనీ 2.జపాన్‌ 3.ఇటలీ 4.చైనా (నాన్‌ ‌కింగ్‌) 5.‌మంచూకో 6.ఫిలిప్పీన్స్ 7.‌బర్మా 8.సయాం 9.క్రోయిషా) ప్రభుత్వాలు ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వాన్ని ఆధికారికంగా గుర్తించాయి. జర్మనీ విదేశాంగ మంత్రి హెర్‌ ‌వాన్‌ ‌రిబ్బెన్‌ ‌ట్రాప్‌ అం‌దరికంటే ముందు నేతాజీకి అభినందన సందేశం పంపాడు. ఇటలీ అధినేత ముస్సోలినీ పాతమిత్రుడు బోస్‌కు స్వయంగా అభినందనలు తెలిపాడు. ఇక జపాన్‌ ‌సరే సరి. ఐరిష్‌ ‌ఫ్రీ స్టేట్‌ అధ్యక్షుడు డి వలేరా కూడా నూతన ప్రభుత్వాధినేత అయిన సందర్భాన బోస్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

ప్రమాణ స్వీకారం అయిన రెండో రోజు అక్టోబర్‌ 23 అర్ధరాత్రి కేబినెట్‌ ‌సమావేశమై బ్రిటన్‌, అమెరికాల మీద యుద్ధం ప్రకటించింది. మన శత్రువు బ్రిటనే కానీ అమెరికా కాదు కదా? బ్రిటన్‌ ‌ప్రాధేయపడితే దానికి సాయంగా సేనలను పంపిందే తప్ప అమెరికాకు మనతో వైరం లేదుకదా? అలాంటప్పుడు అమెరికా మీద ఎందుకు యుద్ధం? దానిని వదిలేసి బ్రిటన్‌ ‌మీదనే యుద్ధానికి దిగితే అమెరికా సుహృద్భావం మనకు ఉంటుంది కదా- అని కేబినెట్‌ ‌చర్చలో ఒకరు అడిగారు. ‘‘భారతభూమి మీద అమెరికా సేనలు ఉన్నది యథార్థం. అవి ఉండటం వల్లే బ్రిటన్‌తో మన పోరాటం మరింత జటిలం కావటమూ వాస్తవం. సాధ్యమైనంత త్వరగా బ్రిటిష్‌ ‌వారిని ఇండియా నుంచి గెంటివేయటం మన లక్ష్యం. అమెరికన్‌ ‌దళాలు దానికి అడ్డుపడుతూ మన పురోగతిని నిరోధిస్తున్నప్పుడు అమెరికాతోనూ పోరాడవలసిందే. తన స్వాతంత్య్రం కోసం సంఘర్షిస్తున్న జాతిని ఎదుర్కొనే హక్కు ఈ భూమి మీద అమెరికా సహా ఏ జాతికీ లేదు. ఇది మరచి అమెరికా ప్రాపకం కోసం వెంపర్లాడటం అనైతికం. స్వతంత్ర భారత ప్రభుత్వ ఔన్నత్యానికి అవమానం’’ అని నేతాజీ ఇచ్చిన జవాబు అందరికీ నచ్చింది.

బ్రిటన్‌, అమెరికాలతో పాటు రష్యా, చైనాలు కూడా జపాన్‌కు శత్రుకూటమిలో ఉన్నాయి. సైనికంగా, ఆర్థికంగా జపాన్‌తో తనకు ఎన్ని అవసరాలు ఉన్నా, జపాన్‌ ‌తీవ్రంగా సంఘర్షిస్తున్న చైనా మీదా, రష్యా మీదా బోస్‌ ‌యుద్ధం ప్రకటించలేదు. ఎందుకంటే ఆ రెండు దేశాలతో భారతదేశానికి ఎలాంటి తగవులు లేవు. ప్రతి విషయంలోనూ నేతాజీ అనుసరించిన నియమబద్ధ స్వతంత్ర వైఖరికి ఇది చిన్న ఉదాహరణ. తరవాతి రోజుల్లో చర్ఖా లేని త్రివర్ణ పతాకం జాతీయజెండాగా; టాగూర్‌ ‘‘‌జనగణమన’’ ఆధారంగా రూపొందిన ‘‘శుభ సుఖ చయిన్‌ ‌కీ…’’ జాతీయ గీతంగా; ‘‘జై హింద్‌’’ ‌జాతీయ అభివాదంగా ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వం నిర్ణయించింది. బర్మా, థాయిలాండ్‌, ‌మలయా, ఇండో చైనా, జపాన్లలో ఆజాద్‌ ‌హింద్‌ ‌ప్రభుత్వం సొంతంగా రేడియో స్టేషన్లు నెలకొల్పింది. వాటి నుంచి సుభాస్‌ ‌బోస్‌ ‌సందేశాలు దేశవాసులకు నేరుగా ప్రసారం అయ్యేవి.

ఈ ప్రకారంగా బోస్‌ ‌సింగపూర్‌లో అడుగుపెట్టిన మూడునెలల్లో జాతి జనుల విధేయతకు పాత్రమైన ఒక స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రభుత్వాన్ని ఇతర రాజ్యాలు గుర్తించాయి. ప్రభుత్వానికి విధేయులైన వారితో రెగ్యులర్‌ ఆర్మీ ఏర్పాటైంది. పోరాటం చేయటానికి ఒక సమంజసమైన, న్యాయమైన స్వాతంత్య్ర లక్ష్యం ఆ ప్రభుత్వానికి ఉన్నది. ఆ లక్ష్యసాధన కోసం ప్రభుత్వం బహిరంగంగా యుద్ధాన్ని ప్రకటించింది. ప్రపంచ స్థాయిలో మరే స్టేట్స్‌మన్‌కూ ఎందులోనూ తీసిపోని సుభాస్‌ ‌చంద్రబోస్‌ ‌జాగ్రత్తగా ఆలోచించి, వ్యూహాత్మకంగా వేసిన ఈ అడుగుల వల్ల అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం యుద్ధానికి అవసరమైన విధివిధానాలన్నీ పూర్తి అయ్యాయి. విజయసారథి శత్రువుల గుండెలదిరేలా సమరశంఖం పూరించాడు. ఇక సేనలను కదనరంగంలోకి ఉరికించటమే తరువాయి.

మిగతా వచ్చేవారం

About Author

By editor

Twitter
YOUTUBE