దేశ ప్రయోజనాల కన్నా ఏదీ మిన్న కాదు. విశాలహితమైన దేశ ప్రయోజనాల ముందు వ్యక్తులు, సంస్థలు, వ్యవస్థల ప్రయోజనాలు చాలా చిన్నవి. దీన్నే ఆధునిక కాలంలో నేషన్‌ ‌ఫస్ట్, ‌పార్టీ సెకండ్‌, ‌పర్సన్‌ ‌లాస్ట్ అని వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీలకు ఈ విషయం తెలియనిది కాదు. సాధారణంగా అధికారంలో ఉండే పార్టీ తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలకు, తరవాత ఆ పార్టీకి ఒకింత మేలు జరగవచ్చు. ఇందులో పెద్దగా ఆక్షేపణీయం ఏమీ ఉండదు. కానీ పార్టీలు తీసుకునే నిర్ణయాలు దేశ ప్రయోజనాలకు భిన్నంగా ఉంటే కచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిందే. ఒకవేళ ప్రజల మనోగతాలను, అభిప్రాయాలను విస్మరించి తమదైన పంథాలో ముందుకు వెళితే ఆయా పార్టీలను ప్రజలు విశ్వసించరు, అభిమానించరు. భారత వామపక్ష పార్టీలకు ఈ విషయం చక్కగా వర్తిస్తుంది. తప్పులు చేయడం, వాటిని తరవాత తీరిగ్గా గుర్తించి లెంపలేసుకోవడం వాటికి తెలిసినంతగా మరో పార్టీకి తెలియదు.

తాజాగా చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) శత జయంతి ఉత్సవాల్లో భారత వామపక్షాల నేతలు పాల్గొనడం గురించి వివాదం రేగింది. జూలై నెలాఖరులో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో దేశంలోని వామపక్షాల నాయకులు వర్చువల్‌ ‌విధానంలో పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాలను అవి వేనోళ్ల కొనియాడాయి. చైనా అధినేత షి జిన్‌పింగ్‌ ‌సర్కారుకు అభినందనలు తెలిపాయి.  సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. మున్ముందు ఆయన ప్రభుత్వం మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాయి. వాషింగ్టన్‌ను అధిగమించి ప్రపంచశక్తిగా బీజింగ్‌ ఎదగాలని కోరాయి. న్యూఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో గల చైనా రాయబార కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్‌ ‌లోని చైనా రాయబారి సన్‌ ‌వీడాంగ్‌, ‌సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీ ఐ  జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, అఖిల భారత ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌సెంట్రల్‌ ‌కమిటీ కార్యదర్శి జి.దేవరాజన్‌, ‌తమిళనాడులోని ధర్మపురి నియోజకవర్గానికి చెందిన డీఎంకే లోక్‌సభ సభ్యుడు ఎస్‌.‌సెంథిల్‌కుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి మాదిరిగానే చైనా రాయబారి సన్‌ ‌వీడాంగ్‌ ‌ధర్మోపన్యాసం చేశారు. భారత్‌ అనాదిగా తమకు మిత్రదేశమని, రెండు దేశాల మధ్య గల సరిహద్దు విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. విభేదాలు వివాదాలుగా మారకుండా జాగ్రత్త పడతామని చెప్పారు. ఇరుగుపొరుగు దేశాలతో స్నేహసంబంధాలే తమ లక్ష్యమని గంభీరంగా తెలిపారు. ఆసియాలో శక్తిమంతమైన భారత్‌ అం‌టే తమకు సంపూర్ణ గౌరవం ఉందని ప్రకటించారు. రెండు దేశాల మధ్య గతంలో కొన్ని అవాంఛనీయ ఘటనలు జరిగినప్పటికీ వాటిని కూర్చొని పరిష్కరించుకునే వివేకం తమకుందని సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రపంచశాంతికి పాటుపడటం తప్ప దానిపై ఆధిపత్యం చెలాయించాలన్న ఆలోచన తమకు ఏ కోశాన లేదని స్పష్టం చేశారు. ఒక రాయబారిగా వీడాంగ్‌ ‌ప్రసంగంలో పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అంశాలు ఏమీ లేవు. ఆయన తనకున్న పరిమితులకు లోబడి మాట్లాడారు.

సాధారణ పరిస్థితుల్లో అయితే వారు ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఇంత ఆలోచన అవసరం లేదు. వారి మొగ్గు సంగతి అందరికీ తెలిసిందే. మావో హయాంలో చైనా చైర్మన్‌ ‌భారత్‌ ‌చైర్మన్‌ అనేవరకు వెళ్లిన తాను ముక్కలే అవన్నీ.  భారత్‌-‌చైనా మధ్య గత ఏడాది నుంచి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వామపక్ష నాయకులు తగుదునమ్మా అంటూ పాల్గొనడంపైనే విమర్శలు చెలరేగాయి. గత ఏడాది జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ ‌లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో చైనా దాష్టీకం కారణంగా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. భారత సైనికుల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ముందుకు దూసుకువచ్చని చైనా జవాన్లను నిలువరించే పక్రియలో భాగంగా ఇరుదేశాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ ఘర్షణల్లో తెలుగువాడైన కల్నల్‌ ‌సంతోష్‌ ‌కుమార్‌ ‌వీర మరణం పొందారు. చైనా వైపునా భారీ నష్టమే జరిగింది. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కనీసం 40 నుంచి 45 మంది వరకు జవాన్లు మరణించి ఉంటారన్నది అంతర్జాతీయ మీడియా అంచనా. ఘర్షణ అనంతరం కూడా చైనా వైఖరిలో మార్పు రాలేదు. రెచ్చగొట్టే ప్రకటనలు, కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణపై జరిగే చర్చల్లో వితండవాదానికి దిగుతోంది. చర్చలు కొలిక్కి రాకుండా వివిధ కారణాలను చూపుతూ సాగదీస్తోంది. ఇంత జరిగినా తప్పంతా భారతేదేనన్న ధోరణితో బీజింగ్‌ ‌మాట్లాడుతోంది.  ఈ వాస్తవాలను విస్మరించి చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో భారత వామపక్ష నేతలు పాల్గొనడం ఎంతవరకు సమంజసమన్న అభిప్రాయాలు వివిధ వర్గాల నుంచి వినపడుతున్నాయి. దీనికి వామపక్షాల నాయకుల నుంచి సరైన వివరణ, సమాధానం లభించడం లేదు. గల్వాన్‌ ‌ఘటనను అంత తేలిగ్గా విస్మరించే, తోసిపుచ్చే అంశం కాదు. ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదు. యావత్‌ ‌జాతికి సంబంధించినది. ప్రజల మనోభావాలపై తీవ్రంగా ప్రభావం చూపే అంశం. పార్టీలు, సిద్ధాంతాలను పక్కన పెడితే దేశానికి ప్రాతినిథ్యం వహించే జాతీయ పార్టీలుగా దేశ ప్రయోజనాలకు, ప్రజల మనో భావాలకు భిన్నంగా వామపక్షాలు ముందుకు సాగడం ఆత్మహత్యా సదృశం. ఇప్పటికే ఆ పార్టీలు ప్రజల నుంచి దూరమయ్యాయి. దేశవ్యాప్తంగా ఆ పార్టీలకు పట్టుమని పది పార్లమెంటు సీట్లు లేవు. సీపీఎం తప్ప సీపీఐ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్ ‌బ్లాక్‌ ‌వంటి పార్టీలు ఉనికినే కోల్పేయే పరిస్థితి ఏర్పడింది. సీపీఎం ఒక్కటే ఇంకా మనుగడ కొనసాగిస్తోంది. దాని పరిస్థితీ అంత గొప్పగా ఏమీలేదు. పార్టీకి పెట్టనికోట వంటి పశ్చిమ బెంగాల్‌ ‌పరాధీనమైంది. త్రిపురలో కథ ముగిసింది. దక్షిణాది రాష్ట్రమైన ఒక్క కేరళలోనే మినుకుమినుకుమంటోంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌వ్యక్తిగత ప్రతిష్ట ఇందుకు కారణం. సీపీఎం, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజా వంటివారు స్వయం బలంతో కనీసం సొంత రాష్ట్రాల నుంచి అయినా చట్టసభలకు ప్రత్యక్షంగా ఎన్నికయ్యే పరిస్థితి లేదు. ఏచూరి సొంత రాష్ట్రమైన ఏపీలో, రాజా స్వరాష్ట్రమైన తమిళనాడులో సీపీఎం, సీపీఐ లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

  గల్వాన్‌ ‌ఘటనను పక్కనపెడితే యావత్‌ ‌ప్రపంచాన్ని వణికించిన కరోనా వ్యాప్తికి చైనాయే కారణమన్న ఆరోపణలు అంతర్జాతీయంగా ఉన్నాయి. వూహన్‌ ‌నగరం నుంచే కరోనా ప్రపంచానికి పాకిందన్న అభిప్రాయం ఉంది. ఈ విషయంలోనూ భారత వామపక్ష నాయకులు బీజింగ్‌ను గట్టిగా నిలదీయలేకపోయారు. ఇప్పటికీ ఈ మహమ్మారి నుంచి అంతర్జాతీయ సమాజం పూర్తిగా బయట పడలేదు. అయినా ఈ విషయమై శతజయంతి ఉత్సవాల్లో వామపక్ష నాయకులు మౌనాన్నే ఆశ్రయించారు. దీనిపైనా వారు ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 1970ల్లో పాకిస్తాన్‌ ‌నుంచి బంగ్లాదేశ్‌ ‌స్వాతంత్య్రం పొందడంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సాహసో పేతంగా వ్యవహరించారు. స్వతంత్ర బంగ్లాదేశ్‌ ఆవిర్భావంలో భారత్‌ ‌పాత్ర చిరస్మరణీయం. ఈ సందర్భంగా ఇందిరాగాంధీని అభినందించడానికి నాటి జనసంఘ్‌ (‌ప్రస్తుత భారతీయ జనతా పార్టీ) నాయకులైన దివంగత అటల్‌ ‌బిహారీ వాజపేయి ఎంతమాత్రం వెనుకాడ లేదు. ఆమెను అపర కాళికగా, దుర్గామాతగా అభివర్ణించారు. అంతేతప్ప ఇందిరను అభినందించడం వల్ల ఆమెకు రాజకీయంగా మేలు జరుగుతుందని, తాము రాజకీయంగా వెనకబడి పోతామని వారు భావించ లేదు. రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఒకే గళం వినిపించాలన్నది వారి భావన. అందుకు అనుగుణంగానే వ్యవహరించారు తప్ప సంకుచితంగా ఆలోచించలేదు. నాటి జనసంఘ్‌, ‌నేటి భాజపా కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తాయన్న సంగతి తెలిసిందే.

1994లో నాటి కాంగ్రెస్‌ ‌ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు కూడా రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు. ఐరాస మానవ హక్కుల మండలిలో కశ్మీర్‌ ‌పై భారత వాణిని వినిపించేందుకు భాజపా అగ్రనేత అటల్‌ ‌బిహారీ వాజపేయి, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ ‌నాయకుడు సల్మాన్‌ ‌ఖుర్షీద్‌ను పంపారు. పీవీ పార్టీలకు అతీతంగా, దేశ ప్రయోజనాల ప్రాతిపదికన ఆలోచించారు. వాజపేయి, ఫరూక్‌ ‌కాంగ్రెస్‌ ‌వ్యతిరేక పార్టీలకు చెందిన వారైనప్పటికీ వారి ప్రతిభను, దౌత్యంలో వారి గొప్పదనాన్ని గుర్తించి జెనీవా పంపారు. భారత బందానికి సారథ్యం వహించిన వాజపేయి కశ్మీర్‌ ‌పై భారత వాణిని బలంగా వినిపించి అంతర్జాతీయ సమాజం మన్ననలు పొందారు. వాజపేయి బందానికి అప్పట్లో ప్రజలు నీరాజనాలు పలికారు. రాజనీతిజత అంటే ఇదీ. ఉప ఖండంలో భారత్‌, ‌పాకిస్తాన్‌ ‌క్రికెట్‌ ‌జట్లంటే ప్రజలు అమితంగా ఇష్టపడతారు. రెండు జట్ల మధ్య పోటీని ఉభయ దేశాల అభిమానులే కాకుండా యావత్‌ ‌ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఆస్వాదిస్తారు. కానీ సరిహద్దుల్లో అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరంగా ఉండిపోయారు.

ఆట కన్నా ప్రజల అభిప్రాయం, ప్రభుత్వ నిర్ణయమే తమకు శిరోధార్యమని అనేక సందర్భాల్లో వారు ప్రకటించారు. ఈపాటి వివేచన వామపక్ష నాయకులు చూపలేక పోయారు. తమకు దేశ విశాల ప్రయోజనాల లకన్నా పార్టీ ప్రయోజనాలే మిన్న అని పరోక్షంగా చెప్పినట్లయింది. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందున భారత వామపక్షాలకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ వారు మున్ముందు ప్రజలకు మరింత దూరమయ్యే అవకాశం మాత్రం కచ్చితంగా ఉంది. ఈ విషయంలో నేపాల్‌ ‌కమ్యూనిస్టేతర పక్షాలు వ్యవహరించిన గట్టి వైఖరిని కూడా భారతదేశంలో కాంగ్రెస్‌, ‌తదితర పార్టీలు ప్రదర్శించలేపోయాయి. అంటే దేశం అనే అంశంలో కాంగ్రెస్‌ ‌తదితర పక్షాలకు స్థిరమైన అభిప్రాయం లేదన్నమాటే.

చివరిగా ఒక ప్రశ్న. చైనా కమ్యూనిస్టు పార్టీ శతజయంతి గురించి అంత శ్రద్ధ ఉన్నవారు భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌గురించి ఏమంటారో!

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌,  ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE