హుజురాబాద్‌ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిద్ర పట్టనీయడం లేదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కనీసం సెక్రటేరియట్‌కు కూడా వెళ్లకుండా.. ప్రగతి భవన్‌కే పరిమితమయ్యే కేసీఆర్‌.. ‌సుడిగాలి పర్యటనలు చేపట్టడం, అటకెక్కిన హామీలన్నింటినీ కిందికి దింపి బూజు దులపడం, సరికొత్త హామీలు ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం వంటి పరిణామాలు కొద్దికాలంగా నిత్యకృత్యంగా మారాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌రాజీనామా చేయడంతో.. హుజురాబాద్‌ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయిన తర్వాతే కేసీఆర్‌ ‌వరుస కార్యక్రమాలు, వరుస వ్యూహాలతో బిజీ అయిపోయారు. ఈటల రాజేందర్‌ను ఓడించి ఎలాగైనా సరే హుజురాబాద్‌ ‌స్థానాన్ని టీఆర్‌ఎస్‌ ‌ఖాతాలో కలుపుకోవాలన్న ఏకైక లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో చరిత్రలోనే కనీ వినీ ఎరుగని హామీలు ఇస్తున్నారు. పథకం ప్రారంభానికే రూ.500 కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. ‌పదిహేను రోజుల్లోనే మరో రెండువేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని ప్రకటించడం ఆయనలో ఆవరించిన ఓటమి భయానికి నిదర్శనమన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఈనెల 16వ తేదీన హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలోని శాలపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో దళితబంధు పైలట్‌ ‌ప్రాజెక్టును కేసీఆర్‌ ‌ప్రారంభించారు. ఆ సభలో ఎవరూ ఊహించని రీతిలో సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా ‘దళితబంధు’ వర్తిస్తుందని లక్షల మంది సాక్షిగా ప్రకటించారు. ఈ హామీని విన్న వాళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రధానంగా కేసీఆర్‌ ‌నైజం గురించి తెలిసిన వాళ్లు.. కేవలం హుజురాబాద్‌ ఎన్నికలే టార్గెట్‌గా ఇలాంటి హమీని ప్రకటించారని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, కేసీఆర్‌ ‌తీరుపై అన్ని వర్గాల్లోనూ ఓ రకమైన చర్చ మొదలయింది.

వాస్తవానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అంటేనే నిరుపేదలకు, ఆసరా లేని వాళ్లకు సంబంధించి ప్రవేశపెడతారు. సమాజంలోని మిగతా వాళ్లతో సమానంగా జీవన ప్రమాణాలు మెరుగుపరిచే క్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు రూపొందిస్తాయి. అత్యంత పకడ్బందీగా అమలు చేస్తాయి. ఈ పథకాలకు సంబంధించి అర్హులను ఎంపిక చేయడంలోనే ప్రహసనం ఉంటుంది. ఆ కుటుంబం వార్షిక ఆదాయం, కుటుంబపెద్ద చేసే ఉద్యోగం, ఉపాధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని.. అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఆ పథకం రూపకల్పన లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితంగా అవసరమైన వాళ్లకు, అర్హులకు మాత్రమే వాటిని అమలు చేస్తారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పథకాన్ని వర్తింపజేయరు. ఎందుకంటే, మిగతా వాళ్లకంటే ప్రభుత్వ ఉద్యోగుల  ఆదాయం ఎక్కువగా ఉండటం, ఉద్యోగంపై భరోసా ఉండటం వంటివి అందుకు కారణాలు. కానీ, ఇప్పుడు కేసీఆర్‌ ‌చేసిన ప్రకటన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా చర్చను లేవనెత్తింది.

శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్‌.. ‌దళితులే లక్ష్యంగా తన ప్రసంగాన్ని రూపొందించుకున్నారు. మిగతా అంశాలేవీ ప్రస్తావనకు రాకుండా.. కేవలం దళితులను ఆకర్షించే కోణంలోనే ప్రసంగ పాఠం తయారు చేయించుకున్నారు. అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా జై భీమ్‌ అం‌టూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పలుసార్లు ఎమోషనల్‌ అం‌శాలను ప్రస్తావించారు. సెంటిమెంట్‌ను రంగరించారు. అయితే, అవన్నీ అతిశయోక్తిగా ఉన్నాయని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

తెలంగాణ సాకారమైనట్లే ఎస్సీల అభివృద్ధి కూడా జరిగి తీరాలన్నారు కేసీఆర్‌. ‌దళితబంధు పథకంతో మరో నాలుగేళ్లలో అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఏడాది క్రితమే ఈ పథకాన్ని ప్రారంభించాలని అనుకున్నానని.. కానీ, కొవిడ్‌ ‌వ్యాప్తి కారణంగా ఆలస్యమైందని అన్నారు.

హుజురాబాద్‌ ఉపఎన్నిక అనే ఏకైక లక్ష్యంతోనే దళితబంధు పథకాన్ని ప్రారంభిస్తున్నారని, అది కూడా ఆ నియోజకవర్గంలోనే భారీ సభ పెట్టి మరీ ప్రకటిస్తున్నారనే విపక్షాలు, బీసీ, గిరిజన సంఘాల నుంచి వచ్చిన విమర్శలకు కేసీఆర్‌ ‌తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. 2018లో శాలపల్లిలో ప్రారంభించిన రైతుబంధు పథకం అద్భుతమైన ఫలితాలను సాధిస్తోందని సీఎం గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధును కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తు న్నామని అన్నారు.

హుజురాబాద్‌ ‌నియోజకవర్గంలో 21 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని కేసీఆర్‌ ‌స్పష్టంచేశారు. అలాగే, రాష్ట్రంలో 17 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేస్తే ఖర్చయ్యేది రూ.1.30 లక్షల కోట్లు మాత్రమేనని చెప్పారు. నిధులకు భయపడ కుండా దళితబంధు అమలు చేస్తామని తెలిపారు. వచ్చే నెల, రెండు నెలల్లో అందరికి దళితబంధు వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు చివరి వరుసలో ఇస్తామని, ఎస్సీలలో నిరుపేదలకు ముందుగా నిధులు విడుదల చేస్తామన్నారు. 15 రోజుల్లో ఈ పథకం కోసం మరో రూ.2 వేల కోట్లు మంజూరు చేస్తామని కేసీఆర్‌ ‌వెల్లడించారు.

ఈ పథకం కింద వచ్చిన నిధులతో ఎవరికి నచ్చిన పని వారు చేసుకోవచ్చని అన్నారు. నచ్చిన స్వయం ఉపాధి పనులు, వ్యాపారాలు చేసుకో వచ్చన్నారు. దళితబంధు డబ్బులు 100 శాతం సబ్సిడీతో ఇస్తామన్న కేసీఆర్‌.. ‌రూ.10 లక్షలతో వచ్చే ఏడాదికల్లా రూ.20 లక్షలు సంపాదించుకోవా లని సలహా ఇచ్చారు. పైసలు రాగానే ఆగమాగం కావద్దని సూచించారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలో, ఏది లాభసాటో తెలుసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఇందుకు సంబంధించి సమాచారం తెలియకుంటే.. అధికారుల సాయం తీసుకోవాలని కోరారు. అంతేకాదు, తాను తెచ్చిన పథకాలను తన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా రద్దు చేయలేరని అన్నారు. దళితబంధు లబ్ధిదారులకు రేషన్‌, ‌పెన్షన్లు వంటి ఇతర పథకాలు కూడా యథాతథంగా అమలు అవుతాయని చెప్పారు.

ఒక్క దళిత బంధుతోనే సరిపెట్టబోమని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలకు రిజర్వేషన్‌ ‌కల్పిస్తామన్నారు కేసీఆర్‌. ‌లైసెన్సింగ్‌ ‌దుకాణాల్లో రిజర్వేషన్లు ఇస్తామని, ఎరువుల దుకాణాలు, మందుల దుకాణాల్లో కూడా రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించారు. ధనిక పారిశ్రామికవేత్తల మాదిరిగానే ఎస్సీలు కూడా వ్యాపార రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రారంభించిన దళితబంధు పథకం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని, మిగిలిన రాష్ట్రాల్లోనూ దళితబంధుపై చర్చ జరిగే అవకాశం ఉందన్న కేసీఆర్‌.. ‌ప్రపంచం లోనే ఇదో మహోన్నత ఉద్యమం అవుతుందని చెప్పారు.

దళితబంధు ప్రారం భోత్సవ కార్యక్రమానికి హుజూరాబాద్‌ ‌నియోజక వర్గంతో పాటు పలు జిల్లాల నుంచి 825 ఆర్టీసీ బస్సుల్లో దళిత కుటుంబాలను సభా వేదిక వద్దకు తరలించారు. సభ సజావుగా సాగేందుకు 4,600 మంది పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించారు. ఇదిలా ఉంటే.. ఈ దళిత బంధు పథకాన్ని కేవలం హుజురా బాద్‌ ఉపఎన్నిక నేపథ్యంలోనే కేసీఆర్‌ ‌తెరపైకి తీసుకొచ్చా రని విపక్షాలు ఇప్పటికే అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కేవలం టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలకే ప్రాధాన్య మిస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రాష్ట్రమంతా ఎందుకు అమలు చేయరు?

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు బండి సంజయ్‌.. ఈనెల 24వ తేదీ నుంచి ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ చేపడుతున్నారు. ఈ పాదయాత్ర హుజురాబాద్‌ ‌వరకు సాగుతుంది. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బండి సంజయ్‌ ఈ ‌యాత్రను చేపడుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. హుజురాబాద్‌ ఉపఎన్నికలో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతోనే కేసీఆర్‌ ‌దళితబంధు పేరిట వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేదల సంక్షేమాన్ని కోరుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు నిధులు ఇవ్వడంలేదని ప్రశ్నిస్తున్నారు.

గజ్వేల్‌లో కాంగ్రెస్‌ ‌దండోరా సభ

కాంగ్రెస్‌ ‌పార్టీ కూడా తనదైన శైలిలో సర్కారుపై సమరానికి సై అంటోంది. సీఎం కేసీఆర్‌ ‌నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికోసం కాంగ్రెస్‌ ‌పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 24వ తేదీన గజ్వేల్‌లో హౌసింగ్‌ ‌బోర్డు వద్ద సభ నిర్వహించనున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE